Friday, December 31, 2021

ఈనాడు- సంపాదకీయం ఆనందాక్షరి రచన-కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )

 

ఈనాడు- సంపాదకీయం 


ఆనందాక్షరి

రచన-కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )


'ఏ వాణి వేదశాస్త్రేతిహాస మహాబ్ది మందారవల్లియై కందళించే/ ..అయ్యమరవాణి హంసవాహనుని రాణి' ని  ఆవాహన చేసుకుంటూ గాని కరుణశ్రీ ఏ కావ్య రచనకూ శ్రీకారం చుట్టేవారు కాదు. వాణీ కటాక్షం లేకపోయుంటే వాల్మీకి మహర్షి వట్టి కిరాతకుడిగానే మిగిలే వాడు. 'మాణిక్య వీణాం ముపలాలయన్తి/ మదాలసాం మంజుల వాగ్విలాసాం' అంటూ మనసారా స్మరించిన మాతంగ కన్య అను గ్రహం వల్లనే మేకలు కాసుకునే కాళిదాసు మహాకవిగా చిరంజీవి అయ్యాడని ఓ కథ. ఆకాశాన్ని గుప్పిట పట్టేటంత విజ్ఞానఖని వ్యాస ముని. ఆ మహర్షి మేధస్సూ భారతమ్మ ఆశీస్సు ఫలమే! దైత్యనా థుడు హిరణ్యకశిపుడికి బిడ్డ ప్రహ్లాదుడి విష్ణుభక్తిపై దిగులు, 'లభ్యంబైన  సురాధిరాజ పదమున్ లక్షింపడ' ని  విచారం. 'విద్యాభ్యాసంబున గాని తీవ్ర మతిగాడని చండామార్కులవారికి చదువుసంధ్యలు అబ్బించే పని అప్పగిస్తాడు. ఆ సందర్భంలో చదువులు చేసే చలువ గురించి ఆ అసురప్రభువు చేసిన ప్రకటన ఇన్ని యుగాలు గడచినా వన్నెతగ్గని ఆభరణం. 'చదవని వాడజ్ఞుండగు/ జదివిన సద సద్వి వేక చతురత గలుగుం/ జదువగ వలయును జనులకు-  కృతయుగానికే కాదు అన్నింటా కృతకతపాలు పెచ్చు మీరుతున్న  ఈ కలియుగానికీ  అతికినట్లు సరిపోయే సూక్తి ఇది. జగత్తుకు గురువై ఉండీ మానవజన్మ ఎత్తినందుకుగాను శ్రీమన్నారాయణుడికే సాందీపని గురుకులాన జ్ఞానార్జన చేసేపని  తప్పిందికాదు. 'వానలు పస పైరులు కభి/ మానము పస వనితలకును మరి యోగులకున్/ ధ్యానము పస యా మీదట/ జ్ఞానము పస సుప్రసన్ను'లకు అన్న పరమానం దయతి 'సంపంగిమన్నా' శతకపద్యం నొక్కిచెప్పే సత్యమూ ఇదే. శేషము వేంకటపతి శశాంకవిజయంలో చెప్పినట్లు 'చెరకునకు పండు, పసిడికి పరిమళమును, చిత్రమునకు ప్రాణంబును, తా/ నరుదగ గల్గిన రీతిని' నరునికి విద్య అదనపు శోభాభరణం. ' లేశమేని సద్విద్య లేనివాడు/ శోభగాంచడు నిర్గంధ సుమము వోలె ' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తిలో కాదని కొట్టిపారేసే అతిశయోక్తి రవంతైనా లేదు. 


కోటి విద్యలు కూటి కొరకేనని సామెత.  మేదిన గల విద్యలన్నీ మెతుకుల కొరకేననడం సగం సత్యమే! అందరూ 'కూరగాయల' కోసమే చదువులు సాగిస్తే మనకు సౌందర్యలహరులు, కుమారసంభవాలు సంభవించేవా! 'తత్తరపడి యా ఉత్త చదువులు చదివితే తత్వ విచారంబయ్యేనా? / యుత్తమమైన నూరేండ్లు దాటినా ఉత్తమ పురుషుండ య్యేనా? ' అని ఏనాడో వీరబ్రహ్మేంద్రస్వామి డంబాల చదువును నిలదీశాడు. 'అసమాన దానవిద్యా రసికత లేనట్టి నరుని బ్రతుకేటికి సీ కసవేరు కతికి బ్రదుకదె/ పసరము తన కడుపునిండ' అని పర్వత కొండా శతకంలోని ఎత్తిపొడుపు. నార్లవారు అన్నట్లు- విజ్ఞతలేని విద్య ఎంత ఆర్జించినా ఏం లాభం? పేరు చూసి పిండినంత మాత్రాన నేతి బీరలోనుంచి నేయి కారుతుందా! 'పండితుండు' అని ప్రగల్భాలు పలి కినంత మాత్రాన నోటినుంచి రాలేవన్నీ ఆణిముత్యాలేననుకోవడం భ్రమ. మనిషిని మనిషి తినే కరవుకాలం విరుచుకుపడి ఒక పేద ద్విజుడు బతుకుతెరువు కోసం ఊరు విడిచిపోయే పనిలో పడ్డాడు. శివుడు కరుణించి అరవబాసలో స్వయంగా ఒక పద్యం చేసి పురాన్నేలే  రాజుకు సమర్పించి వెచ్చం తెచ్చుకొమ్మని ఆ పురోహితుడిని పురమాయించిన కథ ధూర్జటి విరచిత శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో ఉంది. 'సింధురరాజ గమనా ధమ్మిల్ల బంధంబు సహజగంధం' అనే ప్రయోగ ఔచిత్యాన్ని రాజాస్థానకవి నత్కీరుడు ఆక్షేపిస్తే యాయవారం అయ్య వారి దగ్గర తిరుగు సమాధానమేది? చివరికి దక్కింది నిండుసభలో ఘోరపరాభవమే. శరీరపాటవం, మంచివాక్కు, పరిశుభ్రమైన దుస్తులు సంపదలు కలిగి ఉంటేనే లోకం గౌరవించేది. బంగారానికి సువాసన లాగా సింగారానికి నిజంగా మన్నన దక్కేది స్వయంగా సాధించుకున్న విద్యాసుగంధంవల్లనే. 'విజ్ఞానం మహాభాగ్యం' అన్న అబ్దుల్ కలాం సూక్తి ఎన్ని యుగాలకైనా వర్తించే సుభాషితం.


హెలెన్ కెల్లర్ ఈ వాస్తవానికి వర్తమాన ఉత్తమ ఉదాహరణ. మాట వినలేని, లోకాన్ని చూడలేని అనేకమంది అభాగ్యుల్లో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది అంతులేని విద్యార్జన  అనే తపనే! 'వేడినీరు' స్వభావ స్వరూపాలను స్వయంగా అనుభవంలోకి తెచ్చుకునేందుకు మసిలే నీటిని ఒంటిమీద వంపించుకుంటూ ఒక్కో అక్షర ఉచ్ఛారణ సాధన చేసిన తెగువ ఆ మగువది. నిరామయ నిశ్శబ్ద నీరవ నిశ్చల నిబిడాంధకార మస్తిష్కంనుంచి నిబద్ధతతో మేధను సానబట్టింది కాబట్టే 'ది స్టోరీ ఆఫ్ లైఫ్' అనే ఉత్కృష్ట గ్రంథకర్తగా ఆమె చరిత్రలో మిగిలిపోయింది. ఏళ్లతరబడి ఏకాంతవాసంలో గడపాల్సిన దురదృష్ట దుర్దినాలలో  సైతం నెల్సన్ మండేలా నమ్ముకున్నది బుద్ధిమాంద్యపు ఉపద్రవానికి నిరంతర పఠనం అనే మంచిమందు. గోడలను కాగితాలుగా కొనగోళ్లను కలం పుల్లలుగా మలచి కారాగారంలోనే గణితాభ్యాసం చేసిన జ్ఞాని కథ ' కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో' ది . అధ్యయనం చేయాలన్న ఆసక్తి ఉండాలేగాని ఆర్కిమెడిస్ సూత్రంనుంచి ఆవకాయ పాళ్ల దాకా అన్నీ ఆనందం కలిగించే అంశాలే! 'పెక్కులు చదివిన బెనగు దోడనే/తెక్కుల పలు సందేహముల'  అన్న అన్నమయ్యవారి సందేహానికి చిన్నయసూరి ' పంచతంత్రం' లోని  ' విద్య పలు సందియములు దొలచును/వెలయించు నగోచరార్థ విజ్ఞానము' అన్న సూక్తే చక్కని సమాధానం. విజ్ఞానంతోపాటు విద్య ఆనందాన్ని అందిస్తుందని బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం తాజా సర్వేలో తేలిందంటున్నారు నిర్వాహ కులు, అధిక విద్యార్హతలు కలిగిన వారిలో 81శాతం, అల్పవిద్యావంతులలో  74శాతం, నిరక్షర కుక్షులలో  64శాతం ఆనందకరమైన  జీవితాలు గడుపుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ' అవ్యక్త నిధిని తూచేందుకు మనిషి దగ్గరున్న పడికట్టు రాయి అక్షరం ఒక్కటే'  అంటారు ఖలీల్ జిబ్రాన్. ఆ అక్షరానికి ఆనందం అనే విలువ జోడించాలి. అప్పుడది మనిషి విలువను మరింతగా పెంచుతుంది!


రచన-కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...