కాదేదీ నా కబుర్లకనర్హం
మా చిన్నతనంలో బాలల బొమ్మల భాగవతం.. భారతం..
రామాయణం.. లాంటి పుస్తకాలు చదవడం ఎంతగా
ఇష్టపడేవాడినో .. అరవై ఏళ్ళు దాటిన ఈ వయస్సులో కూడా అలాంటి సాహిత్యం కంటబడితే
అంతగానే ఇష్టపడతాను. నాలాగే చాలామంది అలాగే ఇష్టపడుతారనే అనుకుంటాను!
పిల్లలకోసం
రాసిన పుస్తకాలను పెద్దలం మనమూ అంతే ఇష్టంగా చదవడం కాస్త విడ్డూరంగానే ఉంటుంది.
కానీ.. మనస్తత్వవేత్తలు మాత్రం 'ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కదా.. అది
మంచి ఆరోగ్యానికి సంకేతం కూడా' అంటున్నారు.
పిల్లల
పుస్తకాలలో సాధారణంగా కనిపించే పాత్రలు.. కథానాయకులైనా.. కథానాయికలైనా..
రాక్షసులైనా.. భూతాలైనా.. ఎలాంటి పై ముసుగులు లేకుండా అటు మంచివైపో.. ఇటు చెడువైపో
ఉండటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కథ నడుపున్నంత సేపూ ఎలాంటి మాయా మర్మాలు చూపకుండా కథానాయకుడు సాహస వీరుడుగానో.. తెలివితేటలు
కలవాడి ఉవకుడిగానో.. అమాయకుడిగానో.. పరోపకారిగానో.. సమాజంలో పదిమంది మెచ్చే ఇంకా ఏ
ఇతర సుగుణాలు కలవాడిగానో మాత్రమే కనిపిస్తుంటాడు. కథానాయికలైతే అతి సుకుమారులు.
అత్యంత సౌందర్యరాశులు. అమాయకత్వం మూర్తీభవించిన ముగ్ధబాలలు. రాక్షసులు.. భూత ప్రేత
పిశాచాలు.. సవతి తల్లులు..
మంత్రగత్తెలు.. భయంకరమైన జంతువులు.. వంటి
దుష్టశక్తుల చేతుల్లో పడి రక్షించేవారికోసం అలమటించే నిస్సహాయులుగా కనిపిస్తూ మన
సానుభూతిని చూరగొంటారు. ప్రతికూలశక్తులేవైనా గానీయండి.. నిష్కారణంగా .. నీచంగా.. అసహాయులను అవస్థల
పాల్చేస్తూ.. ఆనందించే కౌటిల్యం ప్రదర్శిస్తుంటాయి. వాటి చెడుకు.. కథానాయకుల
రూపంలో కనిపించే మంచికి మధ్య నిరంతరం కథ జరుగుతున్నంత సేపూ సంఘర్షణ జరుగుతుంటుంది.
ఆ ఘర్షణలో అంతిమంగా ,, కచ్చితంగా మంచికి విజయం కలగడం.. అమాయకమైన అందమైన కథానాయికలు
విముక్తి చెందడం.. చదివే చిన్నారులకు ఎంతో సంతోషం కలిగించే అంశాలు.
వయసు
పైనబడి శరీరం వడలిపోయినా .. అంతర్గతంగా .. పసిపిల్లలకు మల్లే ఎప్పుడూ మంచికే జయం
కలగాలని; దుర్మార్గం.. దౌర్జన్యం.. రాక్షసత్వం.. శాశ్వతంగా ఓడితీరాలన్న
తీవ్రకాంక్ష ఇంకా మనసులో ఇంకిపోకుండా మిగిలున్నపెద్దలకి ..
పిల్లల మాదిరిగానే.. అలాంటి బాలసాహిత్యం ఎంతో ఆనందం.. ఉత్తేజం.. కలిగిస్తుంది.
పెద్దలకోసం
రాసిన పుస్తకాలలో మంచి మంచిలాగా స్పష్టంగా కనిపించక పోవచ్చు. చెడు మంచి ముసుగు
వేసుకొని వంచనకు తెగబడుతుండవచ్చు. అందం అన్నివేళలా ఆనందం కలిగించే విశేషం
కాకపోవచ్చు. అమాయకత్వమూ సానుభూతి చూరగొనే
తీరులో ఉండక పోగా.. ఒక్కోసారి తీవ్రమైన కోపం తెప్పించే పద్ధతిలో విసుగు
పుట్టించవచ్చు. మంచికి .. చెడుకు మధ్య జరిగే సంఘర్షణ బాల సాహిత్యంలో మాదిరి
స్పష్టంగా ఉండక.. మేదో సంబంధమైన
నారికేళపాకంలో కూడా సాగే రచనలుగా ఉండవచ్చు. తలుచుకొనేందుకే ఇష్టంగా ఉండని మానవ
సంబంధాలు.. అవినీతి.. అకృత్యాలు.. క్రౌర్యాలు.. కామకలాపాలు.. నమ్మక
ద్రోహాలు..నరికి చంపుకోడాలు.. ఇలా ఏవైనా..
ఏ రూపంలో అయినా .. కనిపించి చదివేవారి మనసుమీద ప్రతికూలమైన వత్తిడి పెంచి
ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే రీతిలో
సాగవచ్చు. అలాంటి రచనలు వాస్తవానికి.. వాస్తవ ప్రపంచానికి ప్రతిబింబాలుగా ఉన్నంత
మాత్రాన.. పెద్దలందరికీ ఒకే విధంగా ఆదరణీయం కాకపోవచ్చు. సంస్కృతీ సంబంధమైన
వైవిధ్యాలు.. భాషాసంబంధమైనా వైరురుధ్యాలు.. అన్ని రచనలను అందరు పెద్దలు ఒకే తీరులో
అభిమానించేందుకు అవరోధంగా మార్చుతుంటాయి.
పెద్దల సాహిత్యంలో అంతిమ విజయం కచ్చితంగా
మంచికే దక్కాలన్న నియయ.. నిబంధనలు కూడా ఉండవు. ప్రౌఢసాహిత్యం విషయంలో అందుకే అందరు పెద్దలకు
ఒకే విధమైన అభిమానం ఉండాలని ఆశించడం అహేతుకం.
బాలల
సాహిత్యంలో ఈ బెడదలేవీ ఉండవు. ఏ రూపంలో
ఉన్నా కథ.. కథనాలు.. సరళంగా.. సదా సమాజహితంగా సాగుతూ.. మంచి చెడుల మధ్య విభజన రేఖ
నల్లబల్లమీద తెల్లసుద్దతో వేసిన బొమ్మంత స్పష్టంగా… అందంగా ఉంటుంది. అందుకే అది
భాషా.. సంస్కృతి.. కాలం.. దేశం.. వంటి పరిమితులకు అతీతంగా ప్రపంచంలోని పసిపిల్లలందరి
మానసికానందానికి.. మనో వికాసానికి ఒకే తీరులో ప్రేరణ అవుతుంటుంది. పిల్లల
మనస్తత్వంగల పెద్దలనూ అదే తీరులో అలరిస్తుంటుంది.
తెలుగులో
కొన్ని దశాబ్దాల పాటు అవిఛ్చినంగా సాగి ఆబాల గోపాలాన్ని ఒకే తీరుగా అలరించిన..
అలరిస్తున్న.. విజయావారి 'చందమామ' మాస
పత్రిక విజయంలోనే ఈ రహస్యం దాగి ఉంది.
బాలసాహిత్యాన్ని
నిజంగా ఇష్టపడుతున్నట్లయితే- అలా ఇష్టపడుతున్నట్లు బాహాటంగా చెప్పుకోడాన్ని పెద్దలెవరూ చిన్నతనంగా భావించవలసిన అవసరం లేదు.
బాలల సాహిత్యాన్ని అభిమానిస్తున్నారంటే ఆ
పెద్దల మనసులూ బాలల మనసులంత స్వచ్చంగా.. సహజంగా.. ఆరోగ్యంగా.. ఆనందంగా..
ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లే లెక్క
-కర్లపాలెం హనుమంతరావు
***
No comments:
Post a Comment