Monday, March 1, 2021

రుణానుబంధాలు - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

కథానిక : 

రుణానుబంధాలు 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)


పెరట్లో గిలక బావి దగ్గర స్నానం  చేస్తున్నాను. . శారదమ్మ తత్తరపడుతూ పరుగెత్తుకొచ్చింది 'రాధాకృష్ణయ్యగారు పోయార్టండీ!' అంటూ.


గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చినట్లయింది. 'ఛ! ,, ఊరుకో!' అని కసిరాను. 


'నిజమేనండీ! రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నార్ట. శాస్తుర్లుగారు వాళ్ళింటి కెళ్ళి ముహూర్తాలు కూడా విచారించుకుని వెళ్లార్ట! ఇంతలోనే ఏం ముంచుకొచ్చిందో ఏమో.. ఇట్లాగయింది'


ఆ ఇంటి వైపు పరుగులు తీయబోతున్న శారదమ్మను ఆపి 'నీ కెవరు చెప్పారివన్నీ? ఏట్లా విన్నావో .. ఏమో?' 


'బజారంతా వాళ్లింట్లోనే ఉంది. ఎంత ఎతిమతం దాన్నైతే మాత్రం ఇట్లాంటి విషయాల్లో పొరపాటు పడతానా! నే పోతున్నా.. మీరు తాళం వేసుకు రండి!' అంటూ మళ్లీ మాట కందకుండా మాయమయిపోయింది మా శారదమ్మ.


స్నానం ఎట్లాగో అయిందనిపించి, బట్టలు మార్చుకుని మళ్లీ వాకిట్లోకొచ్చాను. 


చాలా మంది అటే పోతున్నారు. ఇంటికి తాళం వేస్తుంటే ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. ఇక కదల్లేక అక్కడే గుమ్మం ముందున్న అరుగు మీద కూలబడిపోయాను. వారం రోజుల కిందట జరిగిన విషయం వద్దనుకున్నా కళ్ల ముందు కదులుతోంది.


రాధాకృష్ణయ్యా నేనూ బాల్య స్నేహితులం. వాడు జడ్.పి లో టీచర్ గా చేసి రిటైరయ్యాడు. నేనో బ్యాంకులో పనిచేస్తూ రిటైరవడానికి సిద్ధంగా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య వయసులో నా కన్నా మూడేళ్లు పెద్ద. సర్వీసులో ఉండగానే ఎట్లాగో పెద్దపిల్లకు పెళ్లిచేశాడు. రెండో పిల్ల పెళ్లే వాడికి పెద్ద సమస్యయి కూర్చుంది. 


పిల్లా ఆట్టే చదువుకోలేదు. మరీ సంసారపక్షంగా పెంచింది వాళ్లమ్మ. అన్నిహంగులూ ఉన్నవాళ్ళకే పెళ్లిళ్ళు అవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రెండు మూడు లక్షలన్నా పెట్టలేని వీడికి మంచి సంబంధాలు రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. 


ఎట్లాగయితేనేం పెళ్లి సంబంధం ఒకటి ఖాయమయిందని వాడొచ్చి చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇట్లా అయిందేమిటి?


పెన్షన్ డబ్బులు పూర్తిగా అందలేదు. పెళ్లికని దాచిన డబ్బులో కొంత తీసి కొడుక్కి పంచాయితీ బోర్డులో ఉద్యోగం వేయించాడు. ఇప్పుడు అర్జంటుగా ఓ లక్ష సర్దమని వచ్చి కూర్చున్నాడో రోజు. 


సమయానికి నా దగ్గరా అంత డబ్బు లేకపోయింది. డాబా మీద పోర్షన్ వేయడం వల్ల చేతిలో డబ్బాడటం లేదు. 


' పోనీ.. తెల్సినవాళ్లెవరి దగ్గర నుంచైనా ఇప్పించరా! పెన్షన్ డబ్బు అందగానే సర్దేద్దాం' అని బతిమాలుతుంటే బాధేసింది. 


'ఛఁ! చిన్ననాటి స్నేహితుడి అవసరానికి ఓ లక్ష రూపాయలు సర్దలేకపోతున్నానే!' అని మనసు పీకింది.


ఆ సమయంలోనే తటస్థపడ్డాడు శివయ్య. 


శివయ్య రైల్వే గార్డుగా చేసి రిటైరయ్యడు. అతనికి పెన్షన్ మా బ్యాంక్ ద్వారానే వస్తుంది. మొదట్లో కమ్యూటేషన్, గ్రాట్యుటీ అంతా వచ్చింది కరెక్టేనా కాదా అని లెక్కలు కట్టి చూపించింది నేనే. 


మూడు లక్షలు దాకా వస్తే కొంత ఫిక్సడ్ డిపాజిట్ చేయించాను మా బ్యాంకులోనే. 


నెల నెలా బ్యాంకుకు వచ్చిపోయే మనిషవడం వల్ల పరిచయం కాస్త ఎక్కువే అన్నట్లుండేది పరిస్థితి. 


ఎందుకో, అతనికి నా మీద అదో రకమైన గురి కూడా. డిపాజిట్లు రిన్యూవల్ చేయించుకోడానికి వచ్చినప్పుడెల్లా ఎక్కడెక్కడ ఎంత వడ్డీలు ఇస్తున్నారో విచారించుకుని పోతుండేవాడు. 


ఎప్పటిలా ఆ రోజూ శివయ్య నా దగ్గరికొచ్చి కూర్చున్నాడు. 


'పంతులుగారూ! డిపాజిట్లలో వడ్డీ మరీ తక్కువ వస్తున్నది సార్! ఇంకా మంచిది ఏమైనా ఉంటే చెప్పండి సార్!' అని అడిగాడతను.


అప్పుడు మెదిలింది మనసులో ఆ ఆలోచన. శివయ్య ఏమనుకుంటాడో అన్న తటాయింపు ఉన్నా స్నేహితుడికి సాయం చెయ్యాలన్న తపన నన్నట్లా అడగనిచ్చింది. 


'శివయ్యా! నా కర్జంటుగా ఒక లక్ష కావాల్సొచ్చింది. బ్యాంకు వడ్డీ కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాలే! నెల నెలా ఇస్తాను. రెండు నెలల్లో తీర్చేస్తాను. వీలయితే ఈ లోపే ఇస్తాలే!' అన్నాను.


శివయ్య కాదనలేదు, 'బ్యాంకు వడ్డీ ఇవ్వండిలే సార్! చాలు!' అంటూ ఆ రోజే లక్ష రుపాయలూ డ్రా చేసి ఇచ్చాడు. 


'నోటు రాసిస్తాను' అన్నాను. 'మీ నోటి మాట కన్నా విలువైనదా నోటు? వద్దు' అంటూ కొట్టిపారేశాడు శివయ్య. 


ఒక కాగితం ముక్క మీద మాత్రం రాయించుకున్నాడు. 


'శివయ్య నా మీదుంచుకున్న నమ్మకాన్ని వమ్ము చెయకూడదు' అనుకున్నానా రోజు. అదే మాట రాధాకృష్ణయ్యతోనూ అన్నాను డబ్బిస్తూ. 


'పెన్షన్ రాగానే ముందు ఈ బాకీనే తీరుద్దాం. నీ పరువోటీ,, నా పరువోటీనా? అందాకా నోటు రాసిస్తాను తీసుకో!' అన్నాడు  రాధాకృష్ణయ్య. 


'మిత్రుల మధ్య పత్రాలేమిటి?' అంటూ నేనూ ఆ రోజు కొట్టిపారేశాను. 


ఇప్పుడు విధి రాధాకృష్ణయ్యను కొట్టిపారేసింది. 


ఎంత వద్దనుకున్నా లక్ష రూపాయల విషయం మర్చిపోలేకుండా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య ఇంట్లో ఈ బాకీ సంగతి చెప్పాడో లేదో? చెబితే మాత్రం నోటులేని బాకీని చెల్లుబెట్టాలని రూలేముంది? తన స్నేహం రాధాకృష్ణయ్యతోనే కానీ, వాడి కొడుకుతో కాదుగా!


శాస్త్ర్రులగారబ్బాయి వచ్చి అరుగు మీద కూర్చునున్న నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. 


'ఇంకా మీరిక్కడే కూర్చుని ఉన్నారేంటంకుల్? అవతల వాళ్లంతా మీ కోసం ఎదురుచూస్తుంటేనూ? పదండి పోదాం' అంటూ నన్ను లేవదీసి వాళ్ళింటి వేపుకు తీసుకెళ్లిపోయాడు.


వరండాలో చాపేసి దాని మీద పడుకోబెట్టున్నారు రాధాకృష్ణయ్యను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది వాడి ముఖం. 


'నా బాకీ సంగతేం చేశావురా?' అని ఆడగాలనిపించింది అంత దు:ఖంలోనూ. 


ఆడవాళ్ళు కొందరు ఏడుస్తున్నారు లో గొంతుకతో. 

అప్పటికే బంధువులంతా పోగయివున్నారు. 


రాధాకృష్ణయ్య కొడుకు దుఃఖాన్ని దిగమింగుకొని ఏర్పాట్లు చూస్తున్నాడు. 


నన్ను చూడగానే దగ్గరికొచ్చి కంట తడిపెట్టుకున్నాడు. ఓదార్పుగా వాడి భుజం మీద చెయ్యేసి తట్టేనే గాని నా కళ్లలో మాత్రం నీరు ఊరవా! వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను. 


'ఎట్లా జరిగిందిరా ఈ ఘారం?' 


'రాత్రి వరకు బాగానే ఉన్నారంకుల్! మధ్య రాత్రి  నిద్రలో లేచి అమ్మతో 'గుండెలు బరువుగా ఉన్నాయ'న్నారుట. 


చెల్లెలి పెళ్లి గురించే అలోచించడం వల్లనుకున్నాం. 'అంతా సజావుగా సాగుతుందిలే నాన్నా!' అన్నా ఏదో గుండె ధైర్యం చెప్పడానికి. 


'అంతేనంటావా!' అని మళ్లీ పడుకుండిపోయారు. మళ్లీ ఇక లేవలేదు. తెల్లవారుఝామున గుండెల్లో నొప్పితే మెలికలు  తిరిగిపోతుంటే అర్థమయింది రాత్రొచ్చింది గుండె పోటు ముందు సూచన అని. 


అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఉంటే..' మాట పూర్తవక ముందే గొంతు పూడుకుపోయింది ఆ పిల్లాడికి. 


'పోయే ముందు నీ కేమీ చెప్పలేదుట్రా?' అని అడిగాను ఆశగా. 

తల అడ్డంగా ఊపేడు. 'ఆ అవకాశమే లేకుండా పోయిందంకుల్. అదే బాధ..'


ప్రసాద్ నుంచి వచ్చిన ఆ జవాబుతో ఉన్న ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది.


ఇక్కడ చేరినవాళ్లలో కొంత మంది కూతురు పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోతుందన్న విచారం వ్యక్తపరిచారు. 


విచిత్రంగా నా బాధ మాత్రం వేరేగా ఉంది. నా సొమ్ము సంగతి ఏమిటి? అనేదే నా ఆలోచన. 


వాడూ నేనూ ఇంతప్పటి నుంచి ఒకటిగా తిరిగాం. కాలేజీలు వేరు వేరు అయినా సెలవులకు ఇళ్లకు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఒకళ్లను ఒకళ్లం వదలకుండా లవకుశలకు మల్లే కలిసే తిరిగాం.  ఉద్యోగాల మూలకంగా విడిపోయినా ఇద్దరి మధ్య ఎన్నడూ  ఎడం పెరగలేదు. 


రిటైరయిన వాడు సొంత ఊళ్లో ఉంటే, రిటైర్ మెంటుకు దగ్గరగా ఉన్నందున నేనూ సొంత ఊళ్లోనే పనిచేస్తున్నా. 


ఇప్పుడు విధి మాత్రం మమ్మల్నిద్దర్నీ ఈ విధంగా విడదీసింది. 


పాడె మీద పార్థివ  దేహాన్నుంచి అంత్యక్రియలు ఆరంభించారు. 


ఇంకో పది నిముషాలలో నా ప్రాణస్నేహితుడి రూపం కూడా కంటి కందనంత దూరంగా కనుమరుగయిపోతుంది. 


పచ్చనోట్ల వ్యవహారాన్ని ఎట్లాగైనా మర్చిపోవాలి. 


అందుకు ఒక్కటే మార్గం. వాడిని భుజం మీద మోసుకుంటూ అంతిమస్థలి దాకా అందరితో కలసి నడవడమే! 


వాడు చితిలో కరిగిపోయే దృశ్యం కళ్లారా  కనిపించినప్పుడు కానీ చేదు వాస్తవం మనసు పూర్తిగా జీర్ణించుకోలేదు. 


పై చొక్కా విప్పేసి, కండువా భుజం మీద వేసుకుని తయారవుతున్న నన్ను చూసి శారదమ్మ దగ్గరకొచ్చింది. 'మీ కసలే బాగుండటం లేదు. అంత దూరం మోయగలరా?'


'వాడు నా మీద మోపిన రుణభారం కన్నా ఇది గొప్పదా?' అని అందామనుకున్నా కానీ, అతికష్టం మీద తమాయించుకున్నా.


కట్టుకున్నదానికైనా చెప్పుకోలేని గడ్డు నిజం. శారదమ్మకు ఈ అప్పుగొడవలేమీ అప్పట్లో తెలియనివ్వలేదు. 


అంతిమ యాత్రలో అందరితో కలిసి నడుస్తున్నా ఆగడమే లేదీ పాడాలోచనలు. 


నేనే వృథాగా వర్రీ అవుతున్నానేమో! అంత పెద్ద మొత్తం! తన దగ్గర రుణంగా తీసుకున్న విషయ రాధాకృష్ణయ్య కొడుక్కు చెప్పకుండా ఉంటాడా? పెన్షన్ డబ్బు అందగానే ప్రసాద్ తన బాకీ తీరుస్తాడేమో! 


అట్లా తీర్చని పక్షంలో తానేం చెయ్యాలి? ఒకటా రెండా! వడ్డీతో కూడా కలుపుకుంటే పెద్ద మొత్తమే అవుతుంది. తీర్చాలని ఉన్నా అంతా తీర్చలేడేమో! వాడు అసలు నేనెందుకు తీర్చాలని  అడ్డానికి తిరిగితేనో? 


మిత్రుడి కొడుకు మీద కోర్టుకెళ్లే ఆలోచనే జుగుప్సా అనిపించింది నాకు. 


ఆస్తులు పంచుకున్నట్లే, అప్పులూ పంచుకోవడం కన్నబిడ్డల్లా కొడుకుల బాధ్యత.ప్రసాద్ కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకునే రకం కాదు.. ఇట్లా సాగుతున్నాయి దారిపొడుగూతా నా ఆలోచనలు . 


కర్మకాండల తతంగం ముగిసి బంధుమిత్రులు వెళ్లిపోయి ఇల్లంతా మెల్లిగా  ఆ విషాదానికి సర్దుకునే సమయంలొ .. అదను చూసి అడిగాను ప్రసాదును అక్కడికీ ఆశ చావక 'ప్రసాదు! నాన్న ఇంటి సంగరులెప్పుడూ నీతో చెప్పలేదా?' అని.


'మాట్లాడుతూనే ఉంటారంకుల్! ఇదిగో.. ఈ పెళ్లి తలపెట్టినప్పటి నుంచే మూడీగా మారిపోయారు. సొమ్ము సమకూరదనేమన్నా దిగులేమో! చేసిన అప్పులు తీర్చడ మెట్లాగన్న ఆలోచనా నాన్నగారిని బాగా కుంగదీసింది. సగం ఆ దిగులుతోనే కన్నుముశారేమోనని నా అనుమానం' అన్నాడు ప్రసాద్.


నాకు కొద్దిగా ఉత్సాహం వచ్చింది 'తాను చేసే అప్పుల గురించి ఎప్పుడైనా నీతో చర్చించేవాడా?' అనడిగాను ఆశగా. 


'నోటితో చెప్పలేదు కానీ.. ఇదిగో ఈ డైరీలో రాసి పెట్టుకున్నారు. కొద్ది మందికి అప్పుపత్రాలు రాసినట్లున్నారు. అంతా కలసి ఒక అయిదారు లక్షలు అయినట్లుంది' 


'మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావ్?'


'ముందు చెల్లెలి పెళ్లి పూర్తి చెయ్యాలి. అప్పుడే నాన్నగారికి కన్యాదాన ఫలం దక్కేది. ఆ తరువాత కూడా పెన్షన్ డబ్బులేమన్నా మిగిలుంటే  వీలయినంత వరకు పత్రాలకు సర్దుదామనుకుంటున్నా. మీరేమంటారంకుల్?' 


'మంచి ఆలోచనరా! బాకీలు తీర్చి తండ్రిని రుణవిముక్టుణ్ణి చెయ్యడం కొడుకుగా నీ బాధ్యత కూడానూ! అందరూ  నోట్లే రాసివ్వలేదేమో! చే బదుళ్లూ..'


'మధ్యలోనే తుంచేశాడు ప్రసాద్ 'నోట్లు విడిపించుకోవడమే తలకు మించిన పని. నోటి మాట  బదుళ్లూఎలా తీర్చగలం? అందులోనూ అందమా  నిజమే చెబుతారని గ్యారంటీ ఏంటంకుల్?చనిపోయినవాళ్ల పేరు చెప్పుకుని డబ్బులు దండుకునేవాళ్ళు కోకొల్లలు ఈ కాలంలో! అవన్నీ తీర్చడమంటే నా వల్లయ్యే పనేనా?..


'ప్రసాద్ సమాధానంతో నా నవనాడులూ కుంగిపోయాయి. 


'పోనీ.. ఆ డైరీలోనే నా పేరేమైనా రాసేడేమో! డైరీ చూపించమని ఓ సారి అడిగితే!' నా ఆలోచన నాకే సిగ్గనిపించింది. కానీ, లోపలి మధనను ఆపుకోలేని బలహీనత. 


ప్రసాద్ స్నానాల గదికి వెళ్లిన సందు చూసి అక్కడే టేబుల్ మీదున్న డైరీ తీసి ఆత్రుతగా తిరగేశా. 


ఊహూఁ! ఏ పేజీలోనూ నా పేరే కనిపించ లేదు! 


నాకుగా  నేను  ఆ చేబదులు ఊసెత్తితే ప్రసాద్ నన్ను ఏ కేటగిరీలో చేరుస్తాడో తెలుసు! పరువే ప్రధానంగా గడిపే మధ్య తరగతి జీవిని నేను. 


'లక్ష రూపాయలకు నీళ్లొదులుకోక తప్పదు' అని ఆ క్షణంలోనే ఒక నిశ్చయానికి వచ్చేశాను. 


రాధాకృష్ణయ్య నన్ను తప్పింకుని పోగలిగాడు కానీ, శివయ్య నుంచి నేనెలా తప్పించుకోగలను!


అప్పటికీ సాధ్యమైనంత వరకు శివయ్య కంటబడకుండా ఉండేందుకు ప్రయత్నించాను. 


ప్రసాద్ తండ్రి పింఛన్ సొమ్ము అందుకున్నాడు.  కిందా మీదా పడి చెల్లెలి పెళ్లి అయిందనిపించాడు. పెళ్ళిలో నా భార్య బాగా పూసుకు తిరిగింది. నేనే, మనసు పెట్టి మిత్రుడి కూతురి కళ్యాణ శుభవేళంతా కలవరంతో గడిపేసింది! 


రాధాకృష్ణయ్య పేరు చెవిన పడగానే ముందు లక్ష రుపాయల రుణం కళ్ల ముందు కదలడం నా దురదృష్టం. 


ఆబ్దికాలకు హాజరయి వచ్చిన తరువాత .. వీలయినంత వరకు వాడిని ఊహల్లోకి రానీయకపోవడమే మిత్రుడిగా నేను వాడికి చేయదగ్గ న్యాయం అనిపించింది.


శివయ్య పెట్టిన గడువు రానే వచ్చింది. ఆ రోజు అతను బ్యాంకుకు వచ్చాడు కూడా. కానీ, బాకీ సంగతి హెచ్చరించలేదు! నేనూ నాకై నేను ఆ ఊసు జోలికి పొదలుచుకోలేదు. కానీ, ఎంత కాలమని ఇట్లా?!


నా మీద నమ్మకంతో ఏ నోటూ లేకుండానే  అతి తక్కువ వడ్డీతో అంత పెద్ద మొత్తం అప్పుగా ఇచ్చిన పెద్దమనిషి నుంచి మొహం చాటేసే దౌర్భాగ్య పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నానే! 


'మిత్రుడయితే ఏంటి? అంత పెద్ద మొత్తం అప్పుగా ఇస్తున్నప్పుడు రాధాకృష్ణయ్య దగ్గర నోటు రాయించుకుని ఉండాల్సింది. నా పొరపాటే నా నేటి దౌర్భాగ్య పరిస్థితికి నూటికి నూరు పాళ్లు కారణం' అని అనుకోని క్షణం ఉండటంలేదు ఈ మధ్య కాలంలో!


బ్యాంకు కొచ్చిన మూడో సారి కూడా తన బాకీ  ఊసెత్తని నన్ను అదోలా చూశాడు శివయ్య. 'సారీ శివయ్యా! అనుకున్న టైముకు డబ్బందలేదు. వడ్డీ ఇస్తాను. అసలుకు నోటు రాసిస్తాను.. కాదనకుండా తీసుకో!' అన్నాను.


వడ్డీ పైకం తీసుకుని నోటు తయారుచేయించి తెచ్చాడు. సంతకం చేసి ఇచ్చేటప్పుడు 'వచ్చేనెలలో నా బిడ్డ పెళ్లి  పెట్టుకున్నాను సార్! ఎట్లాగైనా సొమ్ము సర్దాలి' అంటున్నప్పుదు శివయ్య ముఖం చూడలేక నేను  సిగ్గుతో చచ్చిపోయిన మాట నిజం.


శివయ్య ఇప్పుడు బ్యాంకుకొచ్చినా నన్ను కలవడం లేదు. నేను పలకరించినా ముభావమే సమాధానం.


ఓ శుక్రవారం  బ్యాంకు కొచ్చి ఉన్న డబ్బంతా విత్ డ్రా చేసుకున్నాడు శివయ్య. 


నా దగ్గరికొచ్చి 'సోమవారం నోటు తీసుకువస్తాను. ఎట్లాగైనా సొమ్ము చెల్లించాలి. వడ్డీ అక్కర్లేదు. అసలు ఇస్తే అదే పదిలక్షలు!' అని తాఖీదు  ఇచ్చిపోయాడు. 


శివయ్య దృష్టిలో నేను అంతలా పడిపోవడానికి కారణమెవరు? 


రాధాకృష్ణయ్యా? రాబోయే మరణాన్ని వాడేమైనా కలగనలడా? ఆ మృత్యుదేవత రాధాను కాకుండా తననైనా ఎంచుకుని ఉండొచ్చుగా! అప్పుడీ శివయ్య ఏం చేసివుండేవాడు? 


శివయ్యను మాత్రం తప్పెలా పట్టగలను?అంత పెద్ద మొత్తాన్ని స్వల్ప వడ్డీకి ఏ ఆధారం లేకుండా తనకు ధారపోసిన గొప్పవ్యక్తిని ఎట్లా తప్పుపట్టడం? 


ఏ వత్తిడుల కారణంగానో తానిప్పుడు వైఖరి మార్చుకున్నాడో? 


సమయానికి తాను చెసిన సాయాన్ని గురించి సమాచారం లేనందువల్లనే కదా మిత్రుడి కొడుకు ప్రసాదైనా తన చే బదులును లెక్కలోకి తీసుకోనిది? ఇన్ని పాత రుణాలను చెల్లిస్తోన్న అతని మంచి గుణం కేవలం నోటు లేదనే ఒకే ఒక సాకుతో ఎగవేసేందుకు  ఒప్పుకుంటుందా? 


పరిమితికి మించిన నమ్మకాలు, సమాచార లోపాలు.. విధి ఆడించిన నాటకాల కారణంగానే  వ్యక్తిత్వాలు ఇక్కడ ప్రశ్నార్థకాలు అయ్యాయే తప్పించి.. ఆర్థిక బంధాలు మానవీయ సంబంధాలకు మించిన బలమైనవిగా భావించడం సరయిన దిశలో సాగే అవగాహన కాదేమో!  


ఏదేమైనా శివయ్య బాకీ తీరిస్తే గాని, నా మనశ్శాంతి నాకు తిరిగి రాదు. 


ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీతభత్యాల ఎరియర్స్  తాలూకు మధ్యంతర చెల్లింపులకు ఆదేశాలు ఆ శనివారమే వెలువడ్డంతో ఆదివారం అంతా బ్యాంకులో కూర్చుని సిబ్బంది మొత్తం ఉత్సాహంగా ఆ పని చూసుకున్నాం. 


సొమవారం ఉదయానికల్లా అందరి ఖాతాలలో సొమ్ము జమ. 


ఈ సారి ఎరియర్స్ సొమ్ముతో వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకోవాలని శారదమ్మ ఎంతో కాలంగా ఆశతో ఎదురుచూస్తోంది. 


సోమవారం శివయ్య బ్యాంకు వైపుకు వస్తాడనుకున్నాను. రాలేదు! 


మరో రెండు రోజులు చూసి నేనే సొమ్ముతో సహా శివయ్య చిరునామా వెతుక్కుంటూ వెళ్లాను. 


ఇల్లు కనుక్కోవడం చాలా కష్టమయింది. అది  ఒక మురికిపేటలో ఉంది. శివయ్య ఇల్లు చాలా అధ్వాన్నంగా ఉంది. 


తలుపు కొట్టాను. ఒక నడివయసు ఆడమనిషి గడియ తీసింది. 

నన్ను ఎగాదిగా చుసి 'ఎవురు కావాల?' అంది. 


చెప్పాను. 


నిర్లక్ష్యంగా పక్కగది చూపించి వెళ్లిపోయింది.


శివయ్య మంచం మీదున్నాడు. మంచం చాలా మురికిగా ఉంది. 


శివయ్య మొహంలో కళ లేదు. నెలరోజులు లంఖణాలు చేసిన రోగిష్టిమారిలా కనిపించాడు. 


నా పలకరింపులు అయినంత సేపూ డోర్ కర్టెన్ వెనక ఏవో కదలికలు. 


డబ్బు ఇవ్వడానికి బేగులో చెయ్యి పెట్టాను. 


అతను బలహీనమైన చేతితో ఆ పని ఆపుచేయించాడు 'మీ ఫ్రెండు గారి అబ్బాయే వచ్చి ఇచ్చి వెళ్లాడు. నోటు మీకు ఇద్దామనుకునే లోపలే అడ్దంపడ్డాను.' అంటూ పరుపు కింది  దాచుకున్న పత్రాలలో నుంచి ఒక పత్రం ఏరి తీసిచ్చి 'ఇక మీరు వెళ్లవచ్చు' దండం పెట్టేశాడు. 


 ఏదో అడగబోయేటంతలో ఇందాకటి ఆడమనిషి లోపలి కొచ్చింది అనుమానంగా చూస్తూ. 


శివయ్య అటు తిరిగి పడుకుండిపోయాడు. 


అంటే ఇక నేను 'బైటికి దయచేయచ్చు'  అని అర్హ్తమనుకుంటా. 


సవాలక్ష అనుమానాలతో నేను తిరిగివచ్చేశాను. 


ప్రసాదుకు ఈ బాకీ సంగతి తెలుసన్నమాట! 


రాధాకృష్ణయ్య చూచాయగా కూడా చెప్పినటట్లు  లేదే! 


ప్రసాదుతో మాట్లాడితే గాని విషయాలు తేలవు. 


చికాకు కారణంగా నేను ఆ దిక్కుకు పోవడమే మానేశాను. 


పాడు డబ్బు పితలాటకం మూలకంగా ప్రాణస్నేహితుడి కుటుంబానిక్కూడా దూరమయిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. 


వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో  నేను ఆ కుటుంబానికి రాధాకృష్ణయ్యలాంటి వాడిని. ప్రసాద్ ఎన్నో సార్లు సలహా కోసరంగాను తన దగ్గరి కొస్తుండేవాడు. 


తన ముభావం  కారణంగా రాకలు తగ్గించేశాడు. 


నేను ప్రసాద్ ను కలవడానికి బైలుదేరుతుంటే శారదమ్మ అన్నది నిష్ఠురంగా 'ఆ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ లేడుగా! కొత్త బావగారు తనకు దుబాయ్ లో కొలువిప్పించాడు. ఆ సంగతి చెప్పడానికని ఎన్ని సార్లు వచ్చినా మీరు  మొహం చాటేశారు.. మహగొప్పగా!'  


నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. 


అయిందేదో అయింది. ముందీ డబ్బు మిస్టరీ తేలాలి. 


శారదమ్మ ద్వారా ప్రసాద్ దుబాయ్ చిరునామా సేకరించి ఇంత పెద్ద ఈ మెయిల్ పంపించాను. 


ఫోనులో నేరుగా మాట్లాడవచ్చు. కానీ, అత్మాభిమానం.. అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడనీయదు: 


చే బదులు విషయంలో ముందు  నుంచి జరిగిందీ.. తరువాత నా ప్రవర్తనా..  అందుకు కారణాలు గట్రా అంతా ఓ సోదిలా వివరించి.. చివరగా శివయ్య బాకీ తీర్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియచేశా. 


తెల్లారే సరికల్లా ప్రసాద్ నుంచి తిరిగు మెయిల్! 


'ఆ శివయ్య ఎవరో నాకు తెలీదు  అంకుల్! నేను అతనికి డబ్బిచ్చిందేమీ లేదు! నాన్నగారు అలా మీ ద్వారా అతని దగ్గర్నుంచి అప్పు తీసుకున్నట్లు నాకు ఎప్పుడూ చెప్పను కూడా చెప్పలేదు. ఆ సంగతి ఇదిగో ఇప్పుడు మీ ఉత్తరం అందిన తర్వాతనే తలిసింది. అందరి అప్పులూ తీర్చేశాను. ఈ ఒక్కటి మాత్రం ఎందుకు? ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. తండ్రిని రుణశేషుణ్ణిగా మిగల్చడం కన్నబిడ్డకు భావ్యం కాదని మీరే అంటారుగా! అమౌంట్ పంపుతున్నా! దయచేసి అతని బాకీ అణా పైసల్తో సహా తీర్చేయండి!'


ప్రసాద్ పంపిన డబ్బు అందిన తరువాత బలవంతంగానైనా శివయ్యకు ఆ డబ్బిచ్చెయ్యాల్సిందేనని వెళితే .. అంతకు మూడు రోజుల కిందటే పోయినట్లు తెలిసింది. 


కొడుకు జులాయిట. ఎక్కడి డబ్బు పేకాటకు పోస్తుంటే .. అడ్డొస్తున్నందుకు దుడ్డు కర్రతో బుర్ర రాంకీర్తన పాడించాడుట! 


అప్పటికి తిరిగొచ్చినా శివయ్య సొమ్ము నా దగ్గరుంచుకో బుద్ధేయలేదు. 

అతని కష్టార్జితాన్ని సద్వినియోగం చేయడమెట్లాగా అని మధన పడుతుంటే.. మాటల సందర్భంలో బాకీ అడిగిన రోజు శివయ్య చేసిన పెద్దల వెల్ ఫేర్ సెంటర్ల ప్రస్తావన గుర్తుకొచ్చింది.


నాకు తెలిసిన ఓల్డేజ్ హోమ్   కు శివయ్య పేరున ఆ పెద్ద మొత్తం శాశ్వత విరాళం కింద ఇచ్చిన తరువాత గాని మనసుకు శాంతి లభించింది కాదు. 

***

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)







'








 

 

 

'

 

 

'

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...