నాకప్పుడు
ఏ అయిదో ఆరో ఏళ్ళుంటాయనుకుంటా. నాన్నగారి
ఉద్యోగ రీత్యా నెల్లూరి ఉదయగిరి దగ్గర్లోని సీతారాంపురంలో ఉన్నాం. నాన్నగారు అడపా
దడపా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చేది. ఆయన ఊళ్లో లేనప్పుడు లంకంత ఆ ఇంట్లో అమ్మా నేనూ
మాత్రమే ఉండాల్సొచ్చేది. పగలంతా ఎట్లాగో ఫరవాలేదు కాని, చీకటి పడితే చాలు ప్రాణాలు పింజం పింజం అంటుండేవి. ఊరు కొత్త కావడం వల్ల
పరిచయాలు తక్కువ. ఉన్నా రాత్రిళ్లు తోడు పనుకునేటంత పరిచయస్తులు లేరు. మా
ఇంటికొచ్చి వైద్యం చేసే ఆచారిగారు తోడుకీ, ఇంటి పనికీ ఒక
మనిషిని పంపించారు. ఆమె పేరే 'వెన్నెల'.
వెన్నెల
పేరు ఎంత అందంగా ఉంటుందో.. మనిషి అంత మొరటుగా ఉండేది. గడ్డం కింద సొట్ట, కనుబొమలు మగాళ్ల మీసాలంత ఉండేవి. మాట
పెళుసు. కుడికాలు ఎత్తెత్తి వేస్తుంది. నడుస్తుంటే గతుకుల రోడ్డు మీద ఎద్దులబండి
పడిలేస్తూ పోతున్నట్లుండేది.
పెళ్లి
కాలేదుట. 'నా' అన్నవాళ్లెవరూ లేరని చెప్పారు ఆచారిగారు. అయినా డబ్బుల దగ్గర కాపీనం
చూపించేది. ఇంట్లో ఏ పనికిరాని వస్తువు కనిపించినా మూట కట్టుకునిపోయేది.
వారానికొకసారి ఎక్కడికో వెళ్లి వస్తుండేది. ఎక్కడికని అమ్మ అదిగితే మాట మార్చేది.
నాకు వెన్నెలంటే మెల్లగా ఇష్టం ఏర్పడడం మొదలయింది. సందు దొరికినప్పుడల్లా
నన్ను ఒళ్లో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతుండేది. అన్నీ అడవి కబుర్లే. వినడానికి
గమ్మత్తుగా ఉండేవి. కుబుసం విడిచిన పాములు ఎంత చురుకుగా కదులుంటాయో, గిన్నీకోడి ఎలా తమాషాగా కూతపెడుతుందో, కుందేళ్ళు
మనుషులకు దొరక్కుండా ఎలా తెలివిగా తప్పించుకుంటాయో, అడవి
మధ్యలో ఉన్న పాతాళం బావిలో నీళ్లు అన్నికాలాల్లో ఎలా తియ్యగా చల్లగా ఉంటాయో, తేనెపట్టును ఈగలు కుట్టకుండా ఎలా తెలివిగా కొట్టుకురావచ్చునో, కప్పలు రాత్రుళ్ళు రాళ్ల సందుల్లో చేరి ఎలా బెకబెకమంటాయో అనుకరించి
నవ్వించేది. భయపెట్టేది. అయినా సరే, కమ్మంగా ఉండేవా అడవి
కబుర్లు నాకారోజుల్లో.
వెన్నెల ఇంట్లో ఉన్నంత సేపూ అమ్మను ఏ పనీ ముట్టుకోనిచ్చేది కాదు. 'దొరసానమ్మా! దొరసానమ్మా!' అంటూ బాగా మన్నన చేసేది.
నన్నయితే 'చిన్నదొరా!' అంటూ చంక
దించేదికాదు. నాన్నగారు ఇంట్లో ఉంటే మాత్రం చడీ చప్పుడు లేకుండా పనిచేసుకుపోయేది.
వెన్నెల కలివిడితనమంతా ఆడవాళ్లతోనూ, నా లాంటి
చిన్నపిల్లలతోనే!
చెల్లాయి అమ్మ కడుపులో ఉందా రోజుల్లో. మా తాతగారి ఊరు పాండిచ్చేరి
దగ్గరుండే కడలూరు. 'కాన్పుకు కాస్త ముందే పోరాదా?' అనేవారు నాన్నగారు. 'ఈ అడవిలో ఏం ఉంటారో.. ఏం
తింటారో! ప్రసవం టైముకు పోతాలే!' అనేది అమ్మ. నా ఊహ తెలిసి
అమ్మ నాన్నగారిని వదిలి ఉన్నది చాలా తక్కువే. 'ఎన్నో
కాపురాలను చూశాను గానీ, సీతారాముల్లా మీ అంత వద్దికగా
ఉండేవాళ్లని శానా తక్కువ మందిని చూశాను దొరసానీ!' అంటుండేది
వెన్నెల. పాపాయికి అమ్మ స్వెట్టర్ అల్లుతుంటే దగ్గర కూర్చుని వింతగా చూసేది
వెన్నెల.
మేం కడలూరు పోవాల్సిన రోజులు దగ్గరపడ్డాయి. మర్నాడు ప్రయాణమనగా ఆ రోజు
జరిగింది ఆ సంఘటన. ఇప్పటికీ నాకు నిన్నగాక మొన్న జరిగినట్లుంది. ఆ రోజు పగలంతా
అమ్మ నడుం నొప్పిగా ఉందని మంచం దిగలేదు. వెన్నెలే అన్ని పనులూ చేసుకుపోతోంది.
సాయంకాలం నాకు పెరట్లో స్నానం చేయించే సమయంలో నడవాలో నుంచి పెడబొబ్బలు. అమ్మ అదే
పనిగా ఆగకుండా అరుస్తూనే ఉంది. గభాలున లేవబోయి కాలు మడతబడి బోర్లా పడిపోయింది
వెన్నెల. తట్టుకుని లేచి ఇంట్లోకి పరుగెత్తింది. వెనకనే తడి ఒంటితో నేనూ.. !
అమ్మ
మంచం మీద ఒక కోతి. పళ్ళు బైటపెట్టి కిచకిచమంటూ అమ్మని బెదిరిస్తోంది. నాకు పై
ప్రాణాలు పైనే పోయాయి. పెద్దగా ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసి ఆ కోతి నా మీదకు
దూకపోయింది. వెన్నెల దాన్ని వెనక్కు నెట్టేసింది. తను మూలనున్న గడకర్ర అందుకునే
లోగానే ఇంకో అరడజను కోతులు లోపలికి జొరబడ్డాయి. ఇల్లు కిష్కింధకాండే! ఒక
గండుకోతయితే మరీ రెచ్చిపోయినట్లు పిచ్చి
పిచ్చిగా గెంతుతూ అమ్మ మీదకు దూకి తను
అల్లుతున్న స్వెట్టర్ లాక్కుని బైటకు పరుగెత్తింది. అంతే.. వెన్నెలకు శివమెత్తినట్లయిపోయి
ఒక కర్ర తీసుకుని దాన్ని తరుముకుంటూ పోయింది. ఆ కంగారులో ఇంటి ముందు కరెంటువాళ్లు
తీసిన గోతిలో పడిపోయింది. నలుగురూ చేరి ఆమెను బైటికి తీశారు. గోతిలోని రాళ్లు తలకు
ఒకటి రెండు చోట్ల తగిలి రక్తం ధారగా కారిపోతోంది. ఆచారిగారు వచ్చే వేళకు ఆమె శ్వాస
తీసుకోవడం ఆపేసింది. నాన్నగారొచ్చే సమయానికి ఇంటి ముందు శవం.. అదీ సీను!
వెన్నెల
శవాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆమె కోసం ఎవరూ రాలేదు. ఊళ్లోవాళ్ళు అసలు
పట్టించుకోలేదు. ఆమెను మా ఇంట్లో చేర్చిన ఆచారిగారిక్కూడా ఏంచెయ్యాలో పాలుపోలేదు.
నాన్నగారే ఫార్మాలిటీస్ ప్రకారం పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ల అనుమతి
తీసుకుని కూలీ మనుషుల చేత పాతిపెట్టించారు. ఈ హడావుడిలో మా కడలూరు ప్రయాణం
వాయిదాపడింది.
వెన్నెల లేని ఇల్లు వెలవెలాబోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆమె మా ఇంట్లో
మనిషి అయిపోయింది. వెన్నెలను పదే పదే తలుచుకుంటూ అమ్మ డీలాపడిపోయింది. నా సంగతి
సరేసరి. మనిషి ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లే ఉంది. వెన్నెల కోతి వెంట పడి
గోతిలోపడిన దృశ్యం ఇప్పటికీ నిన్న గాక మొన్న జరిగినట్లే ఉంటుంది.
మర్నాడు
మా కడలూరు ప్రయాణమనగా ఆచారిగారు ఒక
మనిషిని మా ఇంటికి వెంటబెట్టుకుని వచ్చారు.. వెన్నెల జీతం ఇతనికి ఇచ్చేయండంటూ. ఆ
టైములో నేను అమ్మ ఒళ్లో పడుకుని నిద్రపోతున్నాను. ఆచారిగారి మాటలకు మెలుకువ
వచ్చింది. ఆ మనిషికి డబ్బిచ్చి పంపిన తరువాత ఆచారిగారిని నాన్నగారు అడిగారు. 'వెన్నెల అంత మంచి మనిషి కదా! ఎవరూ
లేకపోవడేమేంటి? ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవరు సాయానికి
రాకపోవడమేంటి? మీ క్కూడా అమెను గురించి నిజంగా ఏమీ తెలీదా?
ఇప్పుడు డబ్బులు తీసుకెళ్లిన మనిషెవరు?' అంటూ.
'ఈ మధ్యకాలంలో వెన్నెలను మీ అంత బాగా చూసుకున్నవాళ్లెవరూ లేరు. నాకు
తెలిసింది మీకూ చెబుతా. ఇప్పుడు చెబితే తప్పులేదు. నిజానికి చెప్పాలి కూడా.'
అంటూ చెప్పడం మొదలుపెట్టారు ఆచారిగారు. ఆయన అప్పుడు చెప్పిన మాటలు
ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి.
'సీతారాంపురం ఫారెస్టాఫిసులో ప్యూన్ గా చేసె యేసేబు కూతురు ఇది. దీని అసలు
పేరు వెన్నెల కాదు. మేరీ. ఇది ఆడికి పుట్టింది కాదు. ఎక్కదో దొరికితే ఎత్తుకొచ్చి
సాక్కున్నాడు. ఇది ఇప్పుడంటే ఇట్లా ఉంది గాని చిన్నతనంలో చాలా బాగుండేది. పాత
సినిమాలల్లో భానుమతిలాగా పాడేది. అల్లరి చేసెది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊళ్లో
అందర్నీ ఆటపట్టిస్తుండేది. దీని చేత తిట్టించుకోడం పిల్లలకూ, పెద్దలకూ సరదాగా ఉండేది. దీన్ని కవ్వించి తిట్టించుకుని ముచ్చటపడిపోయేవాడు
బాషా.
బాషా
అంటే ఈ పరగాణాల్లో పెద్ద రౌడీ కింద లెక్క. వాడంటే అందరికీ హడల్. పాత డొక్కు జీపులో
జనాల్ని కొండ మీదికీ కిందికీ దింపుతుండేవాడు. అట్లాంటివాడితో ఇది సరసాలాడుతుండేది.
వాడే పెట్టాడు దీనికి 'వెన్నెల' అనే పేరు. వెన్నెలని బాషా పెళ్లాడుతాడనుకునేవాళ్లు ఊళ్లో అందరూ. 'నా కూతురు రాణీవాసం పిల్ల. ఈ రౌడీ నా కొడుక్కిచ్చి
చేస్తానా! దాని చెయ్యి పట్టుకు పోడానికి ఏ మైసూరు మహారాజో వస్తాడు' అంటుండేవాడు యేసోబు మందు మత్తులో. ఆ మాట బాషా చెవిలో
పడిందో సారి. 'ఆ తాగుబోతు సచ్చినోడిచ్చేదేంటి? నేను తీసుకునేదేంటి? వెన్నెల ఎప్పటికీ నాదే. దాని మీద చెయ్యే కాదు.. కన్ను పడినా నా చేతిలో
చచ్చాడన్న మాటే!' అంటుండేవాడు బాషా.
ఆ
టైములోనే అడవి బంగళాలోకి ఓ ఆఫీసరు దిగాడు. కుర్రాడు పచ్చగా, పట్టుకుంటే మాసిపోయేటట్లుండేవాడు.
ఉదయగిరి కోట మీదా, సీతారాంపురం అడవి మీదా ఏవో
రిపోర్టులు రాసుకోవడానికి వచ్చాట్ట. ఆయన దర్జా, హంగూ ఆర్భాటం చూసి నేనే డంగైపోయేవాడిని. ఇక చదువు
సంధ్యా లేని ఊరి జనాల సంగతి చెప్పేదేముంది! వచ్చీ రాగానే బాషా జీపు రెండు నెలలకు
బాడుగ మాట్లాడేసుకున్నాడు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టే
ఆయన జోరు చూసి యేసోబులో ఆశ కలిగింది. వయసులో ఉన్న తన
కూతురిని పనిమాలా బంగళాలో ఆయన ముందు తిప్పుతుండేవాడు. బాషా
కిది మంటగా ఉండేది.
ఒకరోజు
రాత్రి.. చీకట్లో వెన్నెల మా
ఇంటికి వచ్చింది. రెండు రోజుల్నుంచి కడుపులో ఒకటే ఇదిగా ఉంది.
ఏమీ సయించటంలా! మందియ్యి ఆచారీ!' అంటూ.
దాని చెయ్యి పట్టుకుని చూస్తే నాడిలో తేడా ఉంది. నా అనుమానం నిజమైతే వెన్నెలకు నెల తప్పినట్లే. గుచ్చి
గుచ్చి అడిగినా ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ టైములో దాని
మొహంలో కలవరపాటు కనిపించింది.
ఆ
మర్నాడు రాత్రి.. వర్షం పడుతూ ఉంది. నవంబర్
నెల చివరివారం.. చలి బాగా ఉంది. పెందరాళే పడుకోవడం నాకలవాటు.
నెల్లూరు నుంచి రావాల్సిన చివరి బస్సు వచ్చినట్లుంది. ఆ సందడికి మెలుకువ వచ్చింది. మళ్ళీ నిద్ర పట్టలేదు.
వెన్నెల గురించే ఆలోచిస్తూ పడుకున్నాను.మళ్లీ
మాగన్నుగా నిద్ర పట్టే సమయానికి ఎవరో తలుపు టకటకమని కొడుతున్న చప్పుడు. ఊళ్లో ఎవరికైనా బాగోలేకపోతే ఎంత రాత్రి వేళలోనైనా ఇంటి కొచ్చి తడుపు
తడుతుంటారు. లేచి వెళ్ళి తలుపు తీస్తే మొగం నిండా దుప్పటి
కప్పుకున్న ఓ ఆకారం వాకిట్లో వణుకుతూ నిలబడి ఉంది. 'బంగళాలో
ఆఫీసర్ మాదాచ్ఛోత్ పడున్నాడు. వెళ్లి చూసుకో! 'ఇంకా ఊపిరి ఉంటే ఏ మందో మాకో ఇచ్చి తెల్లారేసరికల్లా ఊళ్లో నుంచి
పంపిచెయ్!' అంటూ మళ్లా
చీకట్లో కలసిపోయింది ఆ ఆకారం.
జీపు
వెళ్లిన శబ్దమయింది. అంటే ఆ శాల్తీ బాషా
అన్నమాట. బంగళాకు పరుగెత్తాను. మనిషి
ప్రాణాలు పోలేదు కానీ.. స్పృహలో లేడు ఆఫీసరు. ఏదో కలవరిస్తున్నాడు కానీ, అర్థంకావడం లేదు. తెల్లారేసరికి తలా ఓ చెయ్యేసి ఎలాగో ఆయన్ని ఆత్మకూరు పంపించేశాం.
తెల్లారిన
తరువాత యేసోబు ఘొల్లుమని ఏడుస్తూ వెన్నెలని భుజాన వేసుకుని పరుగెత్తుకొనొచ్చాడు. ఆ పిల్ల వర్షం నీళ్లల్లో తడిసిన
రక్తపు ముద్దయి పుంది. స్పృహలో కూడా లేదు. బంగళా వెనక బాలిరెడ్డి తవ్విస్తున్న కొత్త బావి గుంతలో పడుంది సామీ!
ఎప్పుడు పడిందో.. ఎందుకు పడిందో.. ఆ దేవుడికే
తెలియాలి. వానకు తడుస్తొ.. చలికి
వణుకుతో.. వంటి మీద యావ లేకుండా పడివుంది. 'నా కూతుర్ని బతికించు ఆచారీ! చచ్చి నీ కడుపున పుడతా!' అంటూ కాళ్లా వేళ్ల పడి ఏడుస్తున్నాడు యేసోబు.
ఏదో
ఎత్తు మీద నుంచి పడటం వల్ల ఆ పిల్ల కుడి కాలు ఎముకలు మూడు చోట్ల విరిగాయి. మొహం మీది బొమికలు పొడుచుకొచ్చి
చూడ్డానికే మహా భయంకరంగా ఉంది. నెల్లూరు ఆసుపత్రిలో మూడు
నెలలుంది. మనిషి బతికింది కనీ శాశ్వతంగా అవిటిదైపోయింది.
ఆ మొహం మీద సొట్టలూ, మచ్చలూ అన్నీ అప్పటివే.
ఇప్పటి ఈ మనిషిని చూస్తే అప్పటి ఆ
అందమైన ఆడపిల్ల అంటే ఎవరూ నమ్మరు. అప్పటి పాటుకు
గర్భసంచీ కూడా దెబ్బతింది. తీసేయాల్సొచ్చింది. ఆ ఆఫీసరు మళ్లా ఊళ్లోకి రాలేదు. పోలీసు కేసయింది.
బాషా కనిపించకుండాపోయాడు. వాడి మొదటి
పెళ్లానికి మతి చెలిస్తే పిచ్చాసుపత్రిలో పడేశారు. ముగ్గురు
పసిబిడ్డలు బాషాకు. ఇన్నాళ్లూ వాళ్లని నెల్లూరు హాస్టల్లోనే
ఉంచి వెన్నెలే సాకుతూ వస్తోంది. అందుకే అది అందరి దగ్గరా
డబ్బు దగ్గర మాత్రం అంత కాపీనంగా ఉండటం!
'వారానికి ఒకసారి వెళ్లేది వాళ్ల దగ్గరికేనా?' అంది
అమ్మ పశ్చాత్తాపంగా.
'అవునమ్మా! ఈ రోజుల్లో పిల్లల చదువులు.. పెళ్లిళ్లు
అంటే ఎంతెంత కావాలీ! అదీ దాని యావ. బాషా పిల్లల కోసం అది తన
పెళ్లి ఊసు ఎత్తనిచ్చేది కాదు. ఆ దిగులుతోనే యేసోబు తాగి
తాగి చచ్చాడు. పెళ్ళికి ముందే కడుపు చేయించుకుందని ఊళ్లో
అందరూ దాన్ని చులకనా చూస్తారు. అందుకే దాని చావు నాడు కూడా
ఎవరు ఇటు తొంగి చూడలేదు.
యేసేబు
పెంచుకున్నందుకు వెన్నెలను కిరస్తానీ అనాలా? బాషాను ప్రేమించినందుకు ముసల్మాను అనాలా? ఆ ఆఫీసరు
పాడు చేసినందుకు మన మతం మనిషి అనాలా? ఆ సందిగ్ధంలో ఉండే ఆ రోజు వెన్నెల పార్థివ
దేహాన్ని ఏం చేద్దామని మీరు అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పడానికీ పాలుపోలేదు.
ఇందాక వచ్చి మీ దగ్గర వెన్నెల జీతం పట్టుకుపోయిన వ్యక్తి బాషా
పిల్లలుండే హాస్టల్ ఉద్యోగి. ఇక ముందు ఆ పిల్లల గతేమిటో ఆ
శ్రీమన్నారాయణుడికే తెలియాలి' అంటూ లేచారు ఆచారిగారు.
(ఆ
పిల్లలకు ఆ ఏర్పాట్లేవో మా నాన్నగారు తరువాత చేయించారు ప్రభుత్వం వైపు నుంచి)
ఆచారిగారు ఇంత చెప్పినా .. ఆ నవంబరు చివరివారం రాత్రి చీకట్లో..
అడవి బంగళాలో ఏం జరిగిందో మిస్టరీగానే మిగిలిపోయింది. వెన్నెల గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ విషయమే నన్ను తొలుస్తుండేది.
---
సుమారు
పాతికేళ్ల తర్వాత ఆ చిక్కుముడీ తమాషాగా విడిపోయింది.
అనుకోకుండా
ఒక పుస్తకాల దుకాణంలో ఆంధ్రప్రదేశ్ కోటలను గురించిన పరిశోధనా గ్రంధం ఒకటి నా
కంటబడింది. అందులో ఉదయగిరి కోటను
గురించి ఆంధ్రా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డా॥ చిలువూరు
సూర్యనారాయణశర్మగారు రాసిన వ్యాసం ఉంది.
ఆ వ్యాస విషయాన్ని బట్టి, సీతారాంపురం అడవులను
గురించి చేసిన ప్రస్తావనలను బట్టి.. ఆయనకూ .. ఆ ప్రాంతానికి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపించింది.
శర్మగారి
చిరునామా సంపాదించి ఆయన్ని కలిశాను. ముందు ఆయన నోరు విప్పడానికి అంతగా సుముఖత చూపించలేదు. కానీ, వెన్నెల చనిపోయిన తీరు ఊరిలో ఆమెకు జరిగిన
అవమానాలను గురించి వివరించినప్పుడు ఆయనలో కదలిక వచ్చింధి. ఆ కదలికే
ఆయన నోటి నుంచి ఆ నవంబరు చలి రాత్రి ఏమి
జరిగిందో బైటపెట్టింది.
'ఆచారిగారి ద్వారా నెల తప్పినట్లు
తెలియడంతో ఆ నిర్వాకం నాదేనని పసిగట్టింది
వెన్నెల. నా రూము కొచ్చి తాళి కట్టమని గోల పెట్టింది. అప్పటికే నాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు! విషయం విన్న వెంటనే షాక్ అయింది.
అయినా వెంటనే తేరుకొంది. 'నా తంటాలేవో నేను
పడి చస్తా ఆనక. బాషా బండ చచ్చినోడు. నన్నీ
టయింలో ఇక్కడ చూసాడంటే మీకిక్కడే నూకలు చెల్లినట్లే. వాడొచ్చి
పోయిందాకా నేను వెనక పక్క కింద గది కిటికీ సన్ షేడ్ మీద దాక్కునుంటా. మీరు పోయేటప్పుడు
మర్చిపోకుండా నన్ను పైకి లాగితే చాలు! అబ్బలు చేసిన ఛండాలప్పనికి బిడ్డలెందుకు
బలవాల.. నాకుమల్లే? అందరికీ మా
ఏసోబయ్యలాంటి దేవుళ్లే దొరుకుతారా? మన మూలకంగా ఎవుళ్ళూ
ఉత్తిపున్నేనికే బాధపడద్దంటాడు మా
తాగుబోతయ్య!'
అనుకుంటూ .. అంత వర్షంలోనూ .. చీకట్లో..
కిటికీ చువ్వల మధ్య
గుండా దూరుకుంటూ కింది భాగం గది
కిటికీ పైని పాత బడ్డ సన్ షేడ్ మీదకు జారెళ్లి కూర్చుంది వెన్నెల.. తల్లి!' అంటున్నప్పుడు శర్మగారి గొంతులో సన్నని వణుకు.
'బాషా తలుపు విరగ్గొట్టుకొనొచ్చి వెంట తెచ్చుకున్న జీప్ రెంచితో నా బుర్ర
మీద చాలా సార్లే మోదేడు. స్పృహ తప్పడం తెలుస్తూనే ఉంది.
ఆ తరువాత జరిగినవేవీ తెలియవు. విశాఖలో చాలాకాలం
ట్రీట్ మెంట్ తీసుకున్నాను' అని గతం గుర్తుచేసుకున్నారీ శర్మగారు.
తలుపు
చిన్నగా కొట్టి ఒక పాతికేళ్ల అందమయిన అమ్మాయి కాఫీ కప్పులతో సహా లోపలికి వచ్చింది.
'మా అమ్మాయి' కాజ్యువల్ గా పరిచయం చేశారు శర్మగారు,
'పేరేంటి తల్లీ?' అనడిగాను అణుకువతో 'నమస్తే చెప్పే ఆ పాపను.
'వెన్నెల' అంది చిరునవ్వుతో. నా చిన్నతనంలోని
వెన్నెల చిరునవ్వే మళ్లీ గుర్తుకొచ్చింది.
నాకు ఆడపిల్ల పుడితే పెట్టుకోవాలనుకున్నదీ అదే పేరు.
-కర్లపాలెం హనుమంతరావు
24 -02 -2021
***
(ఈనాడు- ఆదివారం అనుబంధం
No comments:
Post a Comment