వేటూరి ఓ పాటలోని
చిత్రమైన చతురత
సినిమా పాటలంటే
సాహిత్యపరంగా పల్చగా ఉంటాయన్న చులకన భావం సాహిత్యంలో ఓ మాదిరి లోతు పాతులు తమకు తెలుసును అనుకునే వాళ్లకి
మనసులోనైనా కొద్దిగా కద్దు. (నాకూ ఒకానొకప్పుడు ఆ మాద్రిరి భావం ఉండేది, రవి
వీరెల్లి గారి అంతర్జాతీయ మాసపత్రికలో ఆ అంశం మీద ఒక సినీరచయిత సాగించిన చర్చలో
కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు గుర్తు. ఇప్పటికీ ఆ భావనలో మార్పు అంతగా లేదు.
కానీ గత కాలపు సినీకవులు కొసరాజు,
శ్రీశ్రీ, ఆరుద్ర.. ఆత్రేయ .. మరీ ముఖ్యంగా వేటూరి వంటి విద్వత్ కవుల కలంపోటుల్లో మాత్రం తరచి చూసే ఓపిక ఉన్నవాళ్ల కళ్లకి తరచూ మెరుపులు తటిల్లుమని మెరిసి మురిపిస్తాయి.
తార్కాణానికి ఒక మచ్చు తునకః శంకరాభరణం- ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము-
అనే పాట. ఆ పాటలోని - 'రసికుల కనురాగమై, రసగంగలో తానమై(స్నానం చేసి), పల్లవించు
సామవేద మంత్రము' అనే చరణంలో సంగీతానికి ముఖ్యప్రాణులైన రాగం, తానం,
పల్లవి- అనే మూడు పదాలను(అనురాగంలోని 'రాగం'; రసగంగలో చేసిన 'తానం'- సామవేద మంత్రం
పల్లవించడంలోని 'పల్లవి'- పట్టు పీతాంబరంతో చుట్టిన చందన గంధపు చితుకుల చందంగా దాచి మరీ వాడిన
చతురత సుందరమూర్తిది.! ఈ మూడు పదాలే ఆనక
మరో పాట పల్లవికి తొలి పాదంగా మారడం అదనంగా అలరించే ముక్తపదగ్రస్తమంతటి
చిత్రాలంకారం కూడా కదా!
-కర్లపాలెం హనుమంతరావు
***
No comments:
Post a Comment