Sunday, December 12, 2021

మానవతావాది చార్లీ చాప్లిన్‌ -కర్లపాలెం హనుమంతరావు

                                           

వదులు పంట్లాం, ఇరుకు కోటు, పెద్ద సైజు బూట్లు, నెత్తిమీద చాలీ చాలని టోపి, ఫ్రెంచ్‌ కట్‌ మీసాలు,  వంకీ కర్ర, వంకరటింకర నడక, బిత్తరచూపులు- చూడంగానే  నవ్వొచ్చే ఆ ఆకారానికి వేరే పరిచయం అవసరమా?  అవును..ఈ విచిత్ర హావభావాల ఏకైక పేటెంట్ హక్కుదారుడు.. మీరూహించినట్లు  చార్లీ చాప్లినే. కనుమరుగై మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా మన మనసుల్లో అతగాడు చిరంజీవి. మురికివాడల్లో పుట్టుక. కఠోర  దారిద్య్రం మధ్య పెంపకం. అషకష్టాలు చాలా చిన్నవి అతను పడ్డ కష్టాల ముందు. కోట్లకు పడగలెత్తిన ఈ హాస్యనటుడికి తల్లి కుట్టు మిషను.  నాటకాలే బాల్యంలో ఆసరా.  తండ్రి ప్రేమ తెలియదు. ఒక నాటకంలో భాగంగా పాట పాడుతుండగా గొంతు జీరబోయిన తల్లిని అభాసు పాలవకూండా కాపాడిన పాటే చాప్లిన్ ఆరంగేట్రం మొదటి ఐటం సాంగ్. ఆనాడు  చిల్లరతో రాలిన నవ్వ్వులనే జీవితాంతం నమ్ముకున్న విశ్వ కళాకారుడు చార్లీ. విధంగా అనుకోని పరిస్థితులు ఐదేళ్ల చాప్లిన్‌ను స్టేజి ఎక్కించాయి. తల్లి ఆర్యోగం పూర్తిగా క్షీణించి మనోవ్యాధికి గురికావడంతో ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్పించారు. తల్లితోడు కూడా లేక పోయేసరికి అనాధ శరణాలయంలో పిల్లలను చేర్పించడంతో వారు అక్కడ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. రెండేళ్ళ తరువాత తల్లి మానసిక వ్యాధి నుండి కోలుకుని చాప్లిన్‌ను ఒక డ్యాన్స్‌ బృందంలో చేర్పించింది. స్వతహాగా కళాకారుల కుటుంబం నుండి వచ్చిన చాప్లిన్‌ నృత్యంతో పాటు అనేక కొత్త రూపాలను ప్రదర్శించేవాడు.

 

బాల్యంలోనే ఇన్ని కష్టాలను చవిచూసిన చాప్లిన్‌ ఎప్పటికయినా నటుడు కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. పొట్టకోసం అనేక రకాల పనులు చేస్తూ తన లక్ష్య సాధన కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. క్రమంలో ఒక నాటక సమాజంలో వచ్చిన అవకాశాన్ని తన సహజమైన నటనా కౌశలం ఉపయోగించి ఆకట్టుకున్నాడు.ప్రపంచంలో అనేక నగరాలలో ప్రదర్శనలిచ్చాడు. 'కీస్టోన్‌ కాప్స్‌' అనే అమెరికా కంపెనీ ఆయన ఆద్భుత నటనకు మెచ్చి హాస్య చిత్రాలలో అవకాశం ఇచ్చింది. అవి మూగ చిత్రాలు, కళ అంటూ ఏమీ ఉండదు. దాన్ని దీన్ని గుద్దుకోవడం తన్నుకోవడం, క్రిందపడటం జనాన్ని నవ్వించడం ఇవి సినిమాల్లో ఉండేవి. ఎవరెక్కువగా నవ్విస్తే వారే హీరోలు, మొదటగా చిత్రాలలో చాప్లిన్‌ నటించారు.ఆయన నటించిన చిత్రాల్లో దేశ దిమ్మరి(1915) ఆయనకు శాశ్వత కీర్తినార్జించిపెట్టింది. చిత్రంలో ఆనాధ బాలుని పెంచటానికి పడ్డ పాట్లు ఎంతగా నవ్విస్తాయో, అంతగా సామాన్యుని బాధామయ జీవితాన్ని చూపిస్తాయి. చిత్రం ఆయనకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరును తీసుకువచ్చింది.

 

ప్రజా కళాకారుడిగా చాప్లిన్‌ నాటి భౌతిక పరిస్థితులకు స్పందిస్తూ తీసిన చిత్రం ''మోడరన్‌ టైమ్స్‌''. చిత్రంలో ఆధునిక కార్మికుడు యంత్రాల కోరల్లో చిక్కుకొని ఎలా నలిగిపోతున్నాడో, కార్మికుల సృజనాత్మకతను దెబ్బతీసి యంత్రంగా ఎలా మారుస్తున్నారో, కార్మికుల రక్తాన్ని ఎలా జలగల్లా పీలుస్తున్నారో వివరిస్తూ చివరకు కార్మికుడికి మిగిలేది. ఆకలి, దారిద్య్రం, మానసిక ఆందోళనలేనని వ్యంగ్యంగా వివరిస్తాడు. దీనితోపాటుగా అన్నం తినే సమయాన్ని కూడా తగ్గించటానికి తిండి తినిపించే ఆధునిక యంత్రాన్ని ప్రవేశపెట్టిన యజమానుల దురాశనూ, కార్మికుల శ్రమ దోపిడీకి వారు చూపే ఆత్రుతను వ్యంగ్యంగా విమర్శించాడు.అమెరికా పెత్తందారీతనం కార్మికులను, కమ్యూనిస్టులనే కాకుండా చార్లెస్‌ను కూడా వదలలేదు. చార్లెస్‌ మోడరన్‌ టైమ్స్‌ ద్వారా ప్రారంభమైన దాడి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక సభలో రష్యన్‌లను సమర్ధిస్తూ, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. దీనితో చార్లెస్‌పై అమెరికా దాడి పెరిగింది. దాడి ఎంతగా సాగిందంటే చివరకు ఆయన ఆదేశాన్ని విడిచిపోవాలని నిర్ణయించుకున్నాడు. అమెరికా ప్రభుత్వం చార్లెస్‌కు కమ్యూనిస్టు ముద్రవేసి రీ-ఎంట్రీ అనుమతి కూడా ఇవ్వలేదు.

 

చార్లెస్‌ తీసిన ప్రతి సినిమాలోనూ మానవతాదృక్పథం, సమకాలీనత, సమస్యలపై స్పందన కనిపిస్తాయి. ఆయన తీసిన ప్రతి సినిమా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉంటుంది. ఒక సినిమాలో (దిగ్రేట్‌ డిక్టేటర్‌) ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మన విజ్ఞానం మనల్ని అనుమానాల పుట్టలుగా మార్చిందని, మన తెలివితేటలు కఠిన హృదయాలుగా మార్చాయని, మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నామో అంత తక్కువగా స్పందిస్తున్నాం అంటారు.

ప్రపంచాన్ని గడగడలాడించిన రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన నరరూప రాక్షసుడు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే ఉద్దేశంతో తీసిన సినిమా ''ది గ్రేట్‌ డిక్టేటర్‌''(1937). ఆవిధంగా సామ్రాజ్యవాద వ్యతిరేకిగా, ప్రపంచశాంతి కోసం తపించిన మానవతావాదిగా, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడిన పేదల పక్షపాతిగా, మహా కళాకారుడిగా చార్లెస్‌ నిలిచిపోతాడు.''భౌతిక పరిస్థితులు మారనంతకాలం జీవిత వాస్తవాలు మారవు'' అంటాడు. అందుకేనేమో అతని సినిమాలో ''కళా విలువలు-వాస్తవికత'' రెండూ కనిపిస్తాయి.

-కర్లపాలెం హనుమంతరావు

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...