"సార్!"
అతను గదిలోకి వచ్చినట్లు గమనించక
పొలేదు. కావాలనే చూడనట్లు నటించాను.
కారణం ఉంది.
ఇంట్లో ఇందిర రాత్రి చెప్పిన సంగతి
గుర్తుకొచ్చింది.
"మీ ఆఫీసులో
సుబ్బారావనే పేరున్న వాళ్లెవరన్నా ఉన్నారా?"
"ఉంటే?!"
"అతగాడి
తల్లికి రేపు హార్ట్ ఎటాక్ రాబోతుంది. 'స్టార్ట్
ఇమ్మీడియట్లీ' టైపు ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే మూడు రోజులు క్యాజువల్ లీవు కావాలని మీకు లీవు లెటర్ ఇవ్వబడుతుంది. మీ చేత 'సాంక్షన్డ్' మార్క్
చెయించుకుని సదరు సుబ్బారావు వేంచేసేదెక్కడికో తెలుసా సార్?"
"ఎక్కడికీ?!"
"వేసంగి కదా!
చల్లగా ఉంటుందని.. ఊటీకి. ఈ పాటికే అతగాడి ఇంట్లో ప్రయాణానికని
అన్ని ఏర్పాట్లూ ఐపోయాయి కూడా. తెల్లారంగానే తమరు సెలవు మంజూరు చెయ్యడమే కొరవడింది”.
"ఇవన్నీ నీకెలా
తెలుసోయ్!" ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నాకు.
"లేడీసుమండీ
బాబూ మేం. మీ పురుష పుంగవులకు మల్లే 'కంటబడిందంతా కటిక
సత్యం.. చెవిన బడిందంతా గడ్డు వాస్తవం'
అని నమ్మే చాదస్తులం కాం. సదరు సుబ్బారావు గారి సహధర్మచారిణి
నోటినుంచే రాలిపడిందీ స్కెచ్. నేను తన హబ్బీ బాసు తాలూకు
మనిషినని తెలీక నా ముందే పాపం నోరు జారింది. మీ కొలీగు
రంగనాథంగారి చెల్లెలు సీమంతంలో బైటపడింది
సుమా ఈ కుట్రంతా" అంది ఇందిర.
బాసుని నేను. నా కన్నుకప్పి, అబద్ధాలు చెప్పి తప్పించుకుని తిరగాలనే! ఆ క్షణంలోనే
ఈ ధూర్తుడితో ఎంత మొండిగా వ్యవహరించాలో డిసైడ్ చేసుకుని ఉన్నా.
---
"సార్!ఒక చిన్న రిక్వస్టు"
"తెలుసు.
మీ అమ్మగారికి హార్ట్ ఎటాక్. 'స్టార్త్
ఇమ్మీడియట్లీ' అని ఇంటినుంచీ కాల్. నీకర్జంటుగా మూడు రోజులు
క్యాజువల్ లీవు శాక్షన్ చేయాలి. యామై రైట్?"
ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేశాడు
ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు "సార్! మీకెలా తెలిసింది?
ప్లీజ్ .. సాంక్షన్ మీ లీవ్ సార్!"
సుబ్బారావు కళ్ళల్లో నీళ్ళు.
ముందుగా అనుకున్న ప్లాన్
ఇంప్లిమెంటు చేసే టైమొచ్చింది. దొంగేడుపులకే
మాత్రం ఛస్తే లొంగరాదు.
సాధ్యమైనంత విచారాన్ని గొంతులో
రంగరించుకుని "సారీ సుబ్బారావ్! రేపు ఆడిటర్సు వస్తున్నారు ఇన్
స్పెక్షనుకి. మొదట్నుంచీ నువ్వే చూస్తున్నావుగా ముఖ్యమైన ప్రాజెక్టు
రిపోర్టులన్నీ! నువ్వు లేకుంటే ఎలాగా? కావాలంటే వాళ్ళు
వెళ్ళిపోయిన తరువాత నువ్వూ వెళ్ళి రావచ్చు.. ఒక్క పూట. ఓకే..నౌ.. యూ కెన్ గో అండ్ గెట్ రడీ ఫర్ ఆడిటింగ్"అని అప్పుడే గుర్తుకొచ్చినట్లు ఫోనందుకున్నా.
"సార్! మా అమ్మ ఇప్పుడు గుండె నొప్పితో అల్లాడిపోతుంటే ఎప్పుడో ఆడిటింగయిన తరువాత
వెళ్లాలా? అప్పటిదాకా ఆమెకేమీ కాదని మీరెవరన్నా భరోసా
ఇవ్వగలరా?"
బాగానే రక్తి కట్టిస్తున్నాడూ
నాటకాన్నీ! ఈ సుబ్బారావులో ఇంత పెద్ద కళాకారుడున్నాడని
ఇప్పటిదాకా తెలీదే! ఒక్క అతగాడికేనా నటనా కౌశలం తెలిసింది! నేను మాత్రం తక్కువ తిన్నానా!"
పాత సినిమాల్లో రంగారావు మార్క్ గాంభీర్యం ప్రదర్శిస్తూ "ఐ
సెడ్ సుబ్బారావ్ ! నౌ యూ కెన్ గో! లెట్ మీ డూ మై డ్యూటీ.. ప్లీజ్!" అనేసి
సెల్ రిసీవర్లో తల దూర్చేశాను.
మరో మూడు నిమిషాల పాటు అలాగే కన్నీళ్ళతో మౌనంగా నిలబడి చివరికి వెళ్ళిపోయాడు సుబ్బారావు.
---
"నన్నెప్పుడూ
ఓ మెతక వెధవ కింద జమ కడతావుగా నువ్వు.
ఇకనైనా నీ అభిప్రాయం
మార్చుకుంటే బెటర్.. బెటర్ హాఫ్ గారూ" అంటో
ఆఫీసులో జరిగిందంతా ఇంట్లో ఇందిరకు
చెప్పేసాను గొప్పగా.
సాంతం విని తాపీగా అంది ఆ మహాతల్లి
"నిన్న నేను పొరపడ్డాను సుమండీ! ఊటీ
చెక్కేద్దామనుకున్నా సుబ్బారావుది మీ సెక్షను కాదట. మీ పక్క సెక్షన్ కొలీగ్ రంగనాంగారి
స్టెనోగ్రాఫర్ ఆ సుబ్బారావు. శుభ్రంగా సెలవులు పుచ్చేసుకొని
ఊటీ చెక్కేసాడు కూడా ఈ పూట. మాటల సందర్భంలో
రంగనాథంగారి మిసెస్ అంది ఇందాక. అతగాడి పెళ్ళాం తెచ్చే మేలు రకం ముత్యాల కోసం
ఎదురు చూస్తుంటేనూ ఇక్కడ ఈవిడగారూ..!"
ఇందిర ఇంకేదేదో చెబుతున్నది కానీ..
ఆ క్షణంలో మాత్రం నాకు .. న్నీళ్ళు నిండిన
కళ్లతో ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు మొహమే
కనబడింది. చలా గిల్టీగా అనిపించింది.
-కర్లపాలెం హనుమంతరావు
23 -02 -2021
బోథెల్, యూఎస్ఎ
No comments:
Post a Comment