కథ
తలవంచని పూవులు
రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి
సేకరణ - కర్లపాలెం హనుమంతరావు
28 -12-2021
బోథెల్ ; యూఎస్ ఎ
( భారతి - అక్టోబర్, 1957 సంచిక )
విక్రమ ధనంజయా ! వీరనారాయణా! జయీభవ ! విజయీభవ! విద్యాభోజ ! విదర్భ రాజా ! విజయీభవ ! దిగ్విజయీభవ !
వండియాగధులు వెండిదుడ్లతో ప్రవేశించి పక్కకు తిప్పుకొన్నారు. మాలవ మహారాజులుంగారు రత్నఖచిత సువర్ణ సింహాసవంమీద ఆసీనులు ఆయి సామంత, దండనాథాదులూ, యావత్ప్రజానీకమూ ఆ వెనుక యథాస్థానాల్లో కూర్చున్నారు. ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారుజనం..
ఏటేటా జరిగే శారదా ఉత్సవాల్లో ఆరోజు చివరిది. దేశదేశాగత నట, విట, కవి, గాయక , వైతాళికులతో ఆనగరం తొమ్మిదిరోజులనుంచీ నిండిపోయింది. అన్ని రోజుల ఉత్సవ సారమూ ఆరోజున మూర్తికట్టి అక్కడికి చేరినట్టుంది.
సూర్యకాంతి ప్రాసాదంలో ఆనాడు వినోద ప్రదర్శనం. ముందు ఆస్థాన వైణికుడు వీణ మీద పట్టు బురఖాతీసి శ్రుతి సవరిస్తున్నాడు. జనం సుకుమార వీణాగానానికి ఎదురుచూస్తున్నటులేదు. విచ్చుకత్తుల రాజభటులు ఎర్రని చూపులతో ఎంత అదలిస్తున్నా కోలాహలం అణగటం లేదు.
దాక్షిణాత్య శిల్పి చంద్రమౌళి ఒక ప్రక్క నిల్చున్నాడు. అతడెప్పుడూ రాజసభలు చూడలేదు. నాగరికుల తళుకు బెళుకులకు ఆతని అమాయక హృదయం అలవాటుపడలేదు. హృదయాలను సైతం కరిగించి అమృత మూర్తులుగా మలచగల అతనికి పాటి మానవులను పలకరించి ప్రసన్నులను చేసుకోవడం ఎట్లాగో తెలియలేదు. ప్రాసాదం చివర ఒక స్తంభాన్ని ఆనుకొని తెల్లబోయి చూస్తున్నాడు.
నగర జనుల నిష్కారణ భంగిమలను, ఒయ్యారాలను చూచి సహజంగా ఉండవలసిన మానవులు ఎందుకిట్లా బిగువులు పోతారో అతనికి అర్థం కాలేదు.
వీణ ప్రారంభం అయింది. ఆ సిద్ధహస్తుడు అమృత వాహిని పలికిస్తున్నాడు. శ్రోతలు ఇంకెందుకో చూస్తున్నట్టుంది. మంత్రి హస్తసంజ్ఞతో వీణ ఆగి పోయింది.
ఇక ఇంద్రజాలం అన్నారు. ఒక పొట్టివాడు ముందుకువచ్చి మహారాజు ఎదుట భూమికి మూడు సారులు సమస్కరించి నిలుచున్నాడు. శుద్ధ శ్రోత్రియంగావున్న ముఖంలో చంద్రవంకలా గంధపుచారలుంచి దానిమీద ఎర్రని కుంకుమబొట్టు పెట్టాడు. చేతిలోని నెమలీకుంచె ఆకాశం మీద మూడుసార్లు తిప్పాడు. జలజల పువ్వులు రాలాయి. 'గగన కుసు మాలు ప్రభూ చిత్తగించండి' అన్నాడు. ప్రజలు విరగబడి నవ్వారు.
నెమలిపింఛం గాలిలో సున్నా లుగా చుట్టాడు. అందులో కన్నులు మిరుమిట్లు గొలుపుతూ బలిష్టమైన రెండు వానరవిగ్రహాలు బయలు దేరి యుద్ధం చెయ్యడం ప్రారంభించాయి. “వాలి సుగ్రీ వులు" భూలోక దేవేంద్రా!' అన్నాడు. ప్రధాని చూపుతో ఆగి, పక్కకు తొలగిపోయాడు. వీణకన్న దీనితో కొంచం ప్రజలముఖాలు కలకలలాడాయి.
ఒక మహాకాయుడు నడిచే నల్ల రాతి విగ్రహంలా సభామధ్యానికి వచ్చాడు . ప్రజల్లో కలకలం బయలు దేరింది. ఉన్న చోటునుంచి ముందుకు త్రోసుకువస్తున్నారు. రాజోద్యోగులు సర్దలేక తొక్కిడిపడుతున్నారు. '
' అడుగో బ్రహ్మదేశపు బలశాలీ' అనేమాటలు సభలో గుప్పుమన్నాయి. అతనికి కావలసిన యేర్పా ట్లన్నీ చరచర చేయించారు. మహారాజు సింహాసనం మీద సుఖస్థితిలో సర్దుకుని కళ్ళల్లో కుతూహలం కనపరచారు. మహాకాయుడు మెడలు తిరగని బింకంతో మహారాజువై పు తలవూపి సమస్కారం అభినయించాడు. ఇద్దరు భృత్యులు రెండుబాహువుల పొడవూ, రెండంగుళాల మందమూగల ఒక ఇనుప చువ్వను తెచ్చి అతని ముందుంచారు. అతడు అవలీలగా ఏనుగు తామర తూడును అందుకున్నట్టు దాన్నందుకుని కుడిచేతి వేళ్ళ మధ్య రెండు నిమిషాలు గిరగిర తిప్పి భూమిపై నిల బెట్టాడు. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అతడు దానిని పొట్లకు ఆనించి కండరాలు పూరించి ఇటు ఊగి అటు ఊగి కొంతసేపటికి పూర్ణానుస్వారంగా వంచి ఆ వలయాన్ని నిర్లక్ష్యంగా ఎదుటికి పడవే శాడు. ప్రజలు చప్పటవర్షం కురిపించారు. ప్రభువు ముఖంలో చిరునవ్వు వెలిగింది. ప్రధాని ఆజ్ఞ రాజ భృత్యులు వేయిదీనా రాలు వెండిపళ్లెరంలో పోసి అతనికి బహూకరించారు. మహారాజులుం గారు లేచారు . అతన్ని చూడడానికి జనం విరగబడి వెంటబడ్డారు .
రాజమార్గంలో జనప్రవాహం పొంగిపోయింది. చంద్రమౌళి జనుల ఒత్తిడికి ఆగలేక తూలి ఘంటాపసంమీద పడ్డాడు. అతని పెదవిమీద, వాడి లేకులూడిన పువ్వులా చిరునవ్వుపుట్టి చెదరి అదృశ్యమయింది.
2
సాయంకాలం చంద్రకాంత సౌధంలో మహా సభ అన్నారు. మధ్యాహ్నం నుంచి సభాభవనం ఆలంకరిస్తున్నారు. సభాస్థలి భూలోక స్వర్గంలో ఉంది. మాలవసుహారాజు వైభవానికి అది ప్రదర్శనశాల గాబోలు • రంగురంగుల తలపాగాలతో సకల సామంత రాజులూ సభలోకి వేంచేస్తున్నారు.
చంద్రమౌళి ఒక పట్టుసంచీ చేతితో పట్టుకొని చంద్రకాంత సౌధం చలువరాతి మెట్లమీద నిలుచున్నాడు. నేటి సభలో ప్రవేశం ఎట్లాగా అని తెల్లని అమాయకపు కళ్ళతో ఆలోచిస్తున్నాడు.
ఎక్కడి దక్షిణదేశం? ఎక్కడి విదర్భనగరం? రెండు దూర దూర దేశాలను రెండు దూరదూర మానవ హృదయాలను దగ్గరగా చేర్చి స్నేహపూరితం చేసే శక్తి లోకోత్తరమైన తన శిల్పకళకు లేదా? అనుకున్నాడు.
మహాకవిగారు సపరివారంగా వస్తున్నారు. ఆయన తెల్లని బట్టతల, చుట్టూ రెల్లుపూలు పూచిన గోదావరిలంకలా ఉంది. చెవులకు బంగారు కుండలాలు, చేతులకు సింహతలాటం మురుగులు. పెద్దరకం కుంకుమ రంగు కాశ్మీరు కాలువ భుజాలను కప్పింది. వెంటవచ్చే ఆశ్రితకవుల కైవారాలతో ఆయన హృదయం మత్తెక్కి ఉంది. ఆయన చూపునకు మరింత ఒదిగి, తన అల్పత్వం ఒప్పుకొన్న బట్టుమూర్తికి ఆకోటలో కనకాభిషేకం - కాదని తలయెత్తినవాడికి దేవిడీనున్నా. ఆ కోట బురుజులు ఆయనకోసం కట్టినవి. వాటి మధ్యకు తనకు తెలిసి సంతవరకూ ఏ ప్రతిభాశాలినీ రానివ్వలేదు. వచ్చినా ఆ - పరిధి దాటి ఎక్కడికీపోడు. తన పద్యాల అర్థం తానే - చెప్పాలి. మహారాజే ఆనందించాలి. తక్కిన కవీశ్వరు లకు మహారాజుకూ ఆయన ఆనకట్టు.
చంద్రమౌళికి సరిగా నమస్కరించడం చాతకాలేదు. అయినా చేతులు జోడించి మెట్టుమీద నిలుచున్నాడు. మహాకవిగారు నిర్లక్ష్యంగా నిలువునా చూసి 'ఎవరయ్యా నువ్వు' అన్నట్టు కళ్లను ఎగర వేశారు.
"చాలా దూర దేశంనుంచి వచ్చానండి”
" మం... చి పనిచే... శావు"
"మాలవ ప్రభువు మిక్కిలి రసజ్ఞులనీ, కళా సౌందర్య వేత్తలనీ మా వైపు గొప్పవాడుక”
"ఎవరు కాదన్నారు?”
" ఆ రసిక ప్రభువు దర్శనం చేస్తేనే నా కళ చరితార్థం; ఆ నే నమ్మకంతో ఎన్ని కష్టాలైనా లెక్క చెయ్యకుండా వచ్చాను..."
"అబ్బా!”
" కళాజీవి బాధా, రసజ్ఞ సందర్శనం కోసం పడే తహతహా మహాకవీంద్రులు తమకు తెలియనిది కాదు. "
ఈ చివరిమాటతో కవిగారి వికారం కొంత ఉపశమించినా ఆయన అహంకారానికి తగిన ఆహారం పడలేదు. “
" నా కళను ప్రభువులవద్ద ప్రదర్శించే అవకాశం.. "
"ఇంతకీ... ఏమంటావు?"
" .. కలిగించ వలసిందని కోరుతున్నాను.."
“మధ్యను నేనెవరు? నువ్వేమో మహాకళావేత్తవు , ఆయనేమో మహా రసజ్ఞులాయె! ఆలస్యం ఎందుకు ప్రభువులు సభకు వేంచేసే వేళ అయింది. వెళ్ళి దర్శనం చెయ్యి.”
"ఒక దేశాంతం ఆగంతకుడికి ఈ మాత్రం సహాయము చెయ్యలేరా? మీ ప్రభువు కళాప్రియత్వానికి ఈమాత్రం వన్నె పెట్టలేరా ?”
" ఈ మధ్య కొత్తమాటలు నేర్చారు. చిన్నప్పటి నుంచీ వేల పద్యాలు రాసి పోశాను. మహాకవి అనిపించుకున్నాను. అంతేగాని ఈ కళ యేమిటి? కళాయి యేమిటి?...కవిత్వం ఏమైనా చేసి తెచ్చావా?"
" లేదండి."
"అయితే...ఈ ఉపన్యాసమంతా ఏమిటి? మాకు చాలా తొందరపని ఉంది. ఇప్పుడు కవుల సభ. నువ్వేమో కనివి కావు. ఇంక నీ కళా ఏమిటి?
“మనవి చేస్తున్నాను. కవిత్వం అంటే నాకు తెలియదు. నేనేమీ మాటాడలేను. కాని నేను తెచ్చిన ఆపూర్వ వస్తువు పలుకుతుంది. మాటాడుతుంది. రసజ్ఞుల మనస్సును లాలించగలరు. ఒక్క త్రుటి ... ప్రభువు ఎదుట నిలుప గలిగి తే... "
“అబ్బో!... ఏదీ ఆ వస్తువు?"
"క్షమించండి. ప్రభు సమక్షంలో తప్ప పైకి తియ్యను. అది నా కళామర్యాద. ఆయన కానుకను ఆయనే తొలిసారి చూడాలని నా కాంక్ష . ఈ ప్రభు గౌరవాన్ని మీరు కూడా ఆమోదిస్తారనే నమ్ముతున్నాను.”
మహాకవి గారి కుండలాలు ఊగాయి. అవమానం జరిగింది. కళ్ళల్లో మంటలు రేగాయి. తన ప్రాముఖ్యం కోసం ఇంతవరకూ చేతులు జోడించుకు తిరిగేవాడేగాని ఎదిరించి మాటాడిన వాడు లేకపోయాడు. శిల్పివైపు చురచుర చూసి జారే కాశ్మీరు శాలువాను మరింత పైకి లాగి చరచర పరివారంతో నడిచి వెళ్ళిపోయారు.
చంద్రమౌళి తన తప్పేమో తెలియక తెల్లబోయాడు. కర్తవ్యం ఏమిటి?
లోపల సభ ప్రారంభమయింది. మహాకవి గారి శుష్క సమాసాలు సాగిసాగి వినిపిస్తున్నాయి. ఇటు నుంచి చదివితే రాజు పేరు, అటునుంచి విదివితే తన పేరూ ఇందులో ఉందని ఒత్తి ఒత్తి చెబుతున్నారు .
చంద్రమౌళి ఇంత దూరం వచ్చి రాజ దర్శనం చెయ్యకుండా వెళ్ళకూడదనుకున్నాడు. చర్రున సభలోకి దూసుకువెళ్లాడు. సభాస్థలి చేరకుండా రాజభటు లడ్డగించారు.
"ప్రభుదర్శనం చెయ్యాలి! "
" అనుజ్ఞ నుండి తీరాలి"
"ఇది మీ ప్రభువారికి కానుక. పాదపీఠం దగ్గర ఉంచివస్తాను. వెళ్ళి నివ్వండి.”
"అడుగు కదిలితే .. మెడ మీద తల ఉండదు"
"మీ ప్రభువు సరసతా, మీ యోగ్యతాఇంతటి వేనా ? "
ఒక రాజభటుడు చటుక్కున వచ్చి ఆ మహాశిల్పి మెడమీద చెయ్యి వేసి ఒక్క ఊపున గెంటివేశాడు.
అతడు చలువరాతి మెట్లమీదనుంచి దొర్లి నేలమీద పడ్డాడు. చేతిలోని పట్టు సంచీ దూరంగా పడ్డది.
చంద్రమౌళి నెమ్మదిగా లేచి సంచీ తీసుకుని నీరునిండిన కళ్ళతో ఒక్కసారి రాజభవనంకేసి చూసి చరచర కోట వెలుపలికి నడిచాడు.
రాజవీధి నిర్మానుష్యంగా ఉంది. తన లోకోత్తర శిల్పాన్ని పైకి తీసి తినివితీరా చూసుకున్నాడు. దాని వెనక ఉన్న కథ అతని తడికళ్ళల్లో తిరిగింది.
3
ఒక నాడు తన పల్లె కుటీరంలో చంద్రమౌళి ఉలిని ఒక మంచిగందపుముక్క మీద నడుపుతున్నాడు.
అతని తీయని ఊహలు సున్నితమైన ఉలి నుంచి జారి చందన ఖండంలో సుందర రేఖలుగా విడుతున్నాయి. శిల్ప సౌందర్యమో, చందన హృదయమో ఆ రేఖల్లో పరిమళాలు నింపుతున్నాయి.
సుందరేశ్వరుని ముందు కృశాంగి హైమవతి, ఆయన కళ్ళల్లో ప్రేమ భిక్ష . ఆ కులపాలిక అరమోడ్పు కన్నుల్లో చిక్కని సిగ్గులు. ఉలి కన్నా వేగంగా మనసు పరిగెత్తుతున్నది . ఆ శిల్పంలో కలిసిపోయి తానున్నట్టే మరచిపోయాడు ఆకళా తపస్వి.
తన కుటీరం వాకిట్లో ఏదో అలజడి. అయినా అతను తలయెత్తలేదు. ఇంకా కర్రగుండెలో నుంచి కళను పిండుతూ నే ఉన్నాడు.
భార్య 'ఆశ' ఆలజడిగావచ్చి ఎదుట నుంచుంది. ఐదేళ్ళబిడ్డ కళ వెక్కి వెక్కి యేడుస్తూ ఉండగా చంద్రమౌళి ఆలయెత్తి చూచాడు.
తపబిడ్డకంటినుంచి జారే నీలాలు చూచిన అతని చేతిలోని ఉలి జారిపోయింది. తపోభంగంలా శిల్పం ఆగిపోయింది. 'ఏమిటి సంగతి' అన్నాడు విధిలేక.
ఆశ ఎర్రబముఖంలో చెప్పడం పెట్టింది.—“పాపం, 'కళ? యేమీ చెయ్యలేదు సుమండీ —మన పొగడ చెట్ల క్రింద పువ్వులేరుకుంటూ ఆడుకుంటున్నది. ఆ ధనవంతుల బిడ్డలేదూ శేషగుణి, ఆ పిల్ల, కళను పిలిచి తీసుకువెళ్ళింది. ఇద్దరూ చాలా సేపు ఆడుకున్నారు. ఆ పిల్ల మెడలోని రత్నాలహారం దీని మెడలో వేసి 'నీకిచ్చేశాను తీసుకో' అందిట. కళ నిజమనుకుని ఇంటికి పరుగెత్తుకువస్తూఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ కళ హారం ఎత్తుకు పోతున్న తాన తల్లితో చెప్పింది. వెంటనే ఆవిడ పరుగెత్తుకువచ్చి 'దొంగబుద్ధులు, దొంగపిల్లలు . లేనివాళ్లతో స్నేహాలు వద్దంటే మా పిల్ల వినదు ' అని ఈ పిల్లను గుంజి హారం తీసుకుని వెళ్ళిపోయింది.
" ఇదేనా మర్యాద ? చూడండి. కూటికి పేదలమైతే గుణానికీనా?" అని ఆమె బరువుగా నిట్టూర్చింది, చురచురము నే కళ్ల తో.
చంద్రమౌళి అన్నాడు నెమ్మదిగా — "పిచ్చిదానా నీకూ ధనవంతులం టే వ్యామోహం. వారి తళతళలాడే నగలూ, మిలమిల లాడే చీరలూ దూచి ఎంత ఆకర్షణ నీకు! వారిలాగే మెరిసి పోవాలని ఎంత ఆరాటపడతావు ! ఆ కోరిక ఎప్పుడో మనల్ని శాపమై మొత్తుకుంది. ఈ సడిస్తుంది. అని నీకు తెలియ లేదు. ఇంక ఊరుకో " అని మళ్లా శిల్పాన్ని అందుకున్నాడు.
ఆశ ఊరుకోలేదు.
" ఆపండి ఆ పని. ఆలుబిడ్డలు సుఖించని ఈ చెక్క డాలు శిల్పాలూ ఎందుకూ? చేతులో ఇంత నేర్పుండి ఏం లాభం? తలుచుకుంటే అట్లాంటి రత్నహారాలు పది సంపాదించగలరు. నన్నూ బిడ్డనూ అలరించి అలంక రించగలరు. కళను చూచి మెచ్చి ఇచ్చే ప్రభువులు దేశంలో లేకపోలేదు. వచ్చేవి కారణోత్సవాలు. మీ చెయ్యిసోకి తే
రాళ్ళుమాటాడతాయి. ఒక్క శిల్పంతో ఆ మాలవరాజును సంతోష పెట్టలేరా? కాంక్షతో తీవ్రంగా వెలిగే ఆశ కళ్ళకు అతడు లొంగిపోయాడు.
ఆనాడే దీక్ష వహించాడు. ప్రశస్తమైన ఏనుగు దంతం సంపాదించారు. చంద్రవంకలా ఉన్న ఆ దంత ఖండాన్ని నిలువునా పూలదండగా మార్పివెయ్యా లను కున్నాడు . ఉలి ఆమోఘంగా పని చెయ్యడం ప్రారంభించింది.
ప్రతీ రాత్రి ఎదురుగా కూర్చునేది. ఆమె కళ్ళ అందం ఆతని శిల్పానికి దీపం అయింది. ఆమె ఎర్రని పెదవుల చిరునవ్వు అతని కల్పనకు జీవంపోసింది. ఆమె ఒక్కొక సుందర భంగిమ అతని చేతిని పరుగులెత్తించింది. ముప్పది రోజులు అహోరాత్రాలు పని చేశాడు.
ముక్కలు చెయ్యలేదు. అతుకు లేదు. ఏనుగు దంతం హఠాత్తుగా మల్లెపూలదండగా మారిపోయింది. రేకురేకునా సహజమైన మధురిమలు. ముడత ముడతలో అచ్చమైన నొక్కుల సొగసులు. కొన్ని పూర్తిగా విడిన మల్లెలు, కొన్ని అరవిచ్చినవి . చివర ఒక బొడ్డు మల్లె కొలికి పూస.
ఒక్కొక్క పువ్వుకూ ఒక్కొక్క నెత్తురుబొట్టు ఖర్చు పెట్టాడు.
చిక్కిపోయిన చెక్కిళ్ళతో తృప్తిగా నవ్వి అతిని గుండె పూచిన పూలమాలను ఆశ ఎదుట సగర్వంగా ఎత్తి పట్టుకున్నాడు. ఆశ కళ్ళల్లో ఆనందజలం చిమ్మింది.
ఒక ముహూర్తాన ప్రభు సందర్శనంకోసం మూటకట్టుకు బయలుదేరాడు.
4
చంద్రమౌళి రాజవీధిలో వేడిగా నిట్టూర్చి తన శిల్పం వైపు ఇంకొక సారి చూశాడు. ఆ తెల్లని పువ్వులు తనని చూసి పకపక నవ్వినట్లనిపించింది. ప్రతి పువ్వూ తీసకోసం దీనంగా ఎదురు చూసే ఆశ ముఖం జ్ఞాపకం చేసింది. అమాయకపు కళ్ళల్లో నీరు కార్చి తన బిడ్డ కళ పరుగెత్తుకొనివచ్చి కాళ్లు చుట్టు వేసుకున్న ట్టనిపించింది.
పొంగివచ్చే కన్నీళ్లను ఆపుకుని నగరం వెలుపలి శూన్యంలోకి వచ్చి ఒక రావి చెట్టుకింద నిలుచున్నాడు. అమోఘమైన తవ శిల్పాన్ని ఊచిపుచ్చుకుని చెట్టు మొదటికి విసిరి వేశాడు. అది పోయి ఒక రాతికి తగిలిన చప్పుడయింది.
నివ్వెరపోయి చెట్టు మొదట పరిశీలించాడు. ఆశ్వయుజమాసపు వెన్నెల వెలుగుల్లో స్పష్టంగా కనబడుతున్నది.
ఆ పుష్పమాల ధ్యానముద్రలో ఉన్న బుద్ధదేవుని పాదాల ముందు పడింది.
అతనికి నవ్వు వచ్చింది.
“సింహాసనంమీది విగ్రహానికి సమర్పించదలచిన ఆపూర్వ పుష్పమాల ఈ జీమా దయామూర్తి పాదాలను పూజించిందా? ఎంత ధన్యుణ్ణి!
చంద్రమౌళి నిమీలిత నేత్రాలతో బుద్ధదేవుని పాదాలముందు నిలువునా మోకరిల్లాడు.
బుద్ధ జీవుని ఒక శీతల హస్తం అతని వెన్నుపై నిమిరినట్లయింది !
రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి
( భారతి - అక్టోబర్, 1957 సంచిక )
సేకరణ - కర్లపాలెం హనుమంతరావు
28 -12-2021
బోథెల్ ; యూఎస్ ఎ
No comments:
Post a Comment