Thursday, December 23, 2021

పాతబంగారం – కథ అనువాదం నేను ఎవరినైతేనేం! 'వేంకటేశ్ ' ( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


పాతబంగారం 

అనువాదం 

నేను ఎవరినైతేనేం! 


'వేంకటేశ్ ' 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ



'నే నెందుకు నవ్వుతున్నానో మీ కందరకూ తెలుసుకోవాలని ఉందన్న మాట? చచ్చిపోయేముందు ఎవడన్నా ఎందుకు నవ్వుతా డనేకదూ మీరనుకొనేది. అవునా? నాగురించి మీరేమీ ఆదుర్దా పడబోకండి


డాక్టరుగారు! అనవసరంగా శ్రమపడక మీ పనేదో మీరు చేసుకోండి! మీరు ఏవిధంగానూ నన్ను  బతికించలేరు. అసలు ఎవ్వరూ కూడ నా చావు తప్పించలేరు. ఈ పరిస్థితిలో ఎవరూ బతికించలేరు. 


ఎందుకంటే, నాకు ఒకటి కాదు రెండు బలమైన కత్తిపోట్లు తగిలాయి. ఒకటి వీపుమీద రెండోది డొక్కలోను. కండలు, నరాలు బయటకు రావటం మీకు కనిపిస్తునాదనే అమకుంటున్నాను. 


'మీరంతా నే నెందుకు నవ్వు తున్నానో వినాలని కుతూహలపడుతున్నా రన్నమాట. చచ్చిపోయే వ్యక్తికి నవ్వు తెప్పించే విషయం ఏమిటా అని ఆశ్చర్య పడిపో తున్నారుకదూ. నేను చెబుతాను. మీరేమీ ఆదుర్దా పడనవసరం లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం జ్ఞాపక స్తోంది. అసలు నే నెవరినో...


 'మీ రేమిటో గుసగుసలాడుతున్నారే. ఏమిటది? ఎందుకో నవ్వుతున్నారే? నేను చెప్పే దంతా  పూర్తిగా విని అప్పుడు గ్రహించండి..  చచ్చిపోయేముందు కూడ నాకు నవ్వు తెప్పించిన కారణ మేమిటో...


'ఇప్పటికి రెండు నెలలనుండి ప్రయత్నిస్తున్నా నేనెవరినో తెలుసుకొంటానికి.  ముసల్మానునా, హిందువునా లేక సిక్కు నా, బ్రాహ్మడినా లేక అస్పృశ్యుడినా, భాగ్యవంతుడినా లేక పేదవాడినా, నాది తూర్పుపంజాబా లేక పశ్చిమపంజాబా, నా నివాసస్థలం లాహోరా లేక అమృతసరా, రావల్పిండా లేక జలంధరా? 


నే నెవరినో నిర్ధారణ చెయ్యటానికి నేనే కాకుండా యింకా అనేకమంది శాయశక్తులా ప్రయత్నించారు. . నా కుల వేమిటో, నా మత మేమిటో అసలు నా పేరేమిటో తెలుసుకొందామని.  కాని ఫలితం మాత్రం కనుపించలా. ఇప్పుడు కొద్దికొద్దిగా నా పూర్వవిషయాలు గుర్తుకొస్తున్నాయి... యిప్పుడు... చచ్చిపోయే ముందు!...


అనేక ప్రయత్నాలు చేశారు. ఒక్కరికీ సాధ్యం కాలా. అసలు నే నెవరో నిశ్చయించు కొందామని.  నేను కూడ చాల శ్రమపడ్డాను. 


డాక్టరుగారు! మీరు నా వంక చూడకండి. మీరు ఆ విధంగా చూస్తుంటే నాకు మరీ నవ్వు వస్తోంది. ఉహుఁ మీరేకాదు, ఈ పరిస్థితిలో నన్ను ఏ డాక్టరూ బతికించలేడు... మీరు ఎందుకు అంత దీక్షగా ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నారో నాకు తెలుసు. నా గాయాలను ఎట్లా మాన్పుదామని అలోచిస్తున్నారు కదూ! 


ఈ రెండు గాయాల్లో ఏ గాయానికి ముందు కట్టు కడతారు. ఒక గాయానికి కట్టు కట్టటానికి ప్రయత్నిస్తుంటే ఒంట్లో ఉన్న నెత్తురు, కండలు, - రెండో గాయం గుండా బయటకు పోతాయి. ముందు రెండో గాయాన్ని కట్టటానికి ప్రయఅనిస్తే మొదటి గాయం గుండా పోతాయి. కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమించి కథను, కాదు, నా పూర్వచరిత్రను కొంచెం నిదానంగా  వినండి....


శ్రద్ధగా రెండు మాసాలపాటు ఢిల్లీ ఆస్పత్రిలో ఉన్న తర్వాత నాకు తెలివొచ్చింది! 'నీ పేరు?” అన డాక్టరు.


“నేను చాల ప్రయత్నం చేశాను. కాని గుర్తు లేదు అని చెప్పవలసి వచ్చింది. 


' హిందువుడివా లేక ముసల్మానువా?' వెంటనే డాక్టరు అడిగారు . 


యీ రెండో తికమక ప్రశ్న కు కూడా  'గుర్తులేదు' అని చెప్పవలసి  వచ్చింది.


' నా పూర్వచరిత్ర ఏమిటో గుర్తులేకుండా పోయింది. నా కులం, నా మతం, నా యిల్లు, సంసారం అన్నీ పూర్తిగా మర్చిపోయా. అసలు నాకు పెళ్లయిందో లేదో, బ్రహ్మచారినో మరి ఎవరినో నాకే అర్థం కాకుండా పోయింది. చివరికి పేరన్నా

' తెలుసుకొందామని శాయశక్తులా ప్రయత్నించా. 


పేరు లేకపోతే ప్రపంచంలో నేను ఫలానా వ్యక్తి నని నిరూపించేందుకు ఆధార మెక్క డుంటుందో మీరే చెప్పండి. 


విచారించగా విచారించగా కొంత కాలానికి తెలిసింది నే నెట్లా యీ ఆస్పత్రిలోకి వచ్చానో. పంజాబునుండి వస్తున్న కాందిశీకులతోబాటు నన్ను కూడ ఆ స్పత్రికి రు ట. అట్లా వచ్చినవారిలో చాలమంది ఆస్పత్రిలోనే మరణించారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమతస్థులని నేను అడగ్గా హిందువులు, ముస్లింలు, సిక్కులూ — అన్ని మతాలవాళ్ళూ ఉన్నారని ఆస్పత్రి వాళ్లు చెప్పారు. 


అసలు జరిగిం దేమిటంటే లాహోరు అమృతసర్ల మధ్య మోసుకు పోతున్న రెండు రైలుబళ్ళు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి. ఒక రైలుబండి పశ్చిమ పంజాబునుండి అమృతసరుకు హిందూ కాందిశీకులను మోసుకొస్తోంది. రెండో బండి తూర్పు పంజాబునుండి లాహోరుకు ముస్లిం కాందిశీకులను మోసుకుపోతోంది. 


దాదాపు రాత్రి 11 గం. సమయాన రైలు ఒకవంతెనమీద ఉండగా పట్టాలకింద ఒక బాంబు పేలింది. వెంటనే రైలుబండి అంతా పేలింది. 


చాలమంది అప్పుడే మరణించారు. చాలమందికి గాయాలు తగిలాయి. గాయాలు తగలకుండా తప్పించుకొన్న వారిని చుట్టుపక్క ల పొంచిఉన్న గూండాలు కాల్చి చంపారు. గాయాలు తగిలిన వాళ్ళు గుడ్డితనంగా తలొక దారి వెంటా పరిగెత్తుకు పోయారు. 


ఎదురుగుండా వస్తున్న బండికికూడ గంట తర్వాత యిటువంటి ప్రమాదమే సంభవించింది. ఆ రైలుబండిలో గాయాలు తగిలిన వాళ్ళుకూడ తలదాచుకొంటానికి దొరికిన దారి వెంబడి పారిపోయారు.


'మరురోజు ఉదయం భారతప్రభుత్వ సేనలు, పాకిస్థాన్ ప్రభుత్వ సేనలు సరిహద్దు  గస్తీ తిరగటానికివచ్చి అనేక శవాలను, గాయపడి కదలలేకుండా పడిఉన్న వాళ్ళనూ చూశారు. వాళ్లల్లో ఎవరు హిందువో, ఎవరు ముస్లిమో నిర్ణ యించటం బహుకష్టమైపోయింది. 


నేనుకూడా ఆ విధంగా గాయపడిన వాళ్ళల్లో ఒకణ్ణి. నన్ను స్ట్రెచర్ మీద అంబులెన్సువద్దకు మోసుకొని పోయినవాడు చెప్పాడు .. నే నెక్కడ ఎట్లా పడిఉన్నానో వివరాలన్నీ! 


 గుడ్డలన్నీ నెత్తురుతో తడిసిపోయాయి. నా చుట్టూ ఒక రక్తపు మడుగు తయారైంది. కొత్త సరిహద్దు ప్రకారం 'నా కాళ్ళు పాకి స్టాక్ భాగంలోను, తల  భారత దేశంలోను పడిఉన్నాయి. ఈ కొత్త సరిహద్దు వెంట అనేకమతాల, జాతులవారి రక్తం ప్రవ హించింది.


'చూడు! మౌలానా! దయ్యాన్ని  పట్టించే వాడిమాదిరిగా నా వంక అట్లా చూస్తావేం? నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. నేను యిప్పుడో యింకాసేపటికో చచ్చిపోతాను. చచ్చిపోయేముందు ప్రతిక్యక్తికీ అన్ని విషయాలు - తెలుస్తాయి. నేను ముసల్మాను నని చెప్పినట్లయితే యిస్లాం మతమును అనుసరించి నా అంత్య క్రియలు జరుపుదా మని ఆలోచిస్తున్నావుకదూ! 


ఏమండీ! మహషాయ్ ! నాకు తెలుసు. నేను హిందువునని చెప్పి నట్లయితే మీ ధర్మసేవక్  సంఘాన్నను సరించి నా అంత్యక్రియలు జరుపుదామని ఆలోచిస్తున్నారు కదూ! 


బొంబాయిలో పార్శీవాళ్లు - శవాల్ని బయట పారేస్తారని విన్నాను. వాటిని బ్రతికుండగానే  పీక్కు తింటానికి పక్షులు తయారవుతారన్న విషయం నా కింతవరకు తెలియదు... 


'ఇక నా చరిత్ర కొనసాగిస్తా. ఎందుకంటే, నేను మీతో మాట్లాడేకాలం చాలకొద్ది మాత్రమే ! 


నాకు తగిలిన గాయాలు ఏమంత పెద్దవి  కావు. బలమైన గాయాలు రెండువారాలు కట్టు కడితే నయ మౌతాయి. కాని నా బుర్రకు గట్టి దెబ్బ తగిలి, మనస్సు చెడిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాని మూలంగా జ్ఞాపకశక్తి పోయింది. దాంతో నేను ఒక అనామకుడిగా తయా రయాను . 


నా పేరు నేను మర్చిపోయా. నాలాంటి అభాగ్య కాందిశీకులు చాలమంది ఆస్పత్రి కొచ్చారు. ఆస్పత్రి వాళ్లు నన్ను బయటకు వెళ్లమన్నారు. తలదాచు కొనేందుకు చోటైనా దొరక్క పోతుందా అని అన్వేషణ ప్రారంభించా.


'జుమ్మా  మసీదుదగ్గర ఒక శరణాలయం ఉంటే అక్కడకు వెళ్లి కాస్త చోటు యివ్వవలసిందని శరణాలయాధికారిని ఆశ్రయించా. 


' నువ్వు హిందువుడివా, ముసల్మానువా? అని అడిగాడు ఆ అధికారి. '

' నాకు గుర్తులేదు' అని చెప్పా. నాకు గుర్తు లేని మాట వాస్తవమే . నేను అబద్ధం ఎందుకు చెప్పాలి?


'ఈ శరణాలయం ముసల్మానులకోసం' అని ఆ అధికారి నన్ను బయటకు గెంటాడు. అక్కడి ఆశ నిరాశ చేసుకొని ఎట్లాగొకట్లా ఢిల్లీకి చేరుకున్నా. 


ఇక్కడ యిదివరకటి శరణాలయం కంటే పెద్దదాన్ని చూశా. తలదాచు కొనేందుకు కాస్త చోటు యివ్వమని వాలం టీర్లను ప్రార్ధించా.


'హిందువుడివా, ముసల్మానువా' అంటూ అదే ప్రశ్న వేశారు. యిక్కడా  'నాకు గుర్తులేదు' అని నేను మళ్లీ ఆమాటే చెప్పా. '


' నీ పేరు?అని అడిగారు. 


‘అదికూడ నాకు గుర్తులేదు. అసలు నా కేదీ గుర్తులేదు.' 


'ఇం కెక్కడి కన్నా వెళ్లు. ఈ శరణాలయం హిందువుల కోసం . 


ఈ విధంగా ఒక చోటునుంచి యింకో చోటికి తిరిగా, హిందువులకోసం శరణాలయా లున్నాయి. మహమ్మదీయులకోసం శరణాలయాలున్నాయి. కాని  మానవులకోసం మాత్రం లేవు. 


'ఆ రాత్రి శరీరం బాగా  అలిసి ఉండటం చేత  నడవ టానికి ఓపిక లేక ఒక సిక్కు సర్దారు బంగళా ముందు స్పృహతప్పి పడిపోయా. అతడు సెక్ర టేరియట్ లో ఒక చిన్న ఆఫీసరు. అతడు నన్ను లోపలకు తీసుకుపోయి రొట్టె, పాలు యిచ్చాడు. నాకు కొంచెం స్పృహ వచ్చిన తర్వాతగూడ నేను హిందువునో, ముసల్మానునో సిక్కునా  నన్ను అడగలా. 


' కులాసాగా ఉందా బాబూ? ' అని మాత్రం అడిగాడు.


‘అతని బంగళాలో నేను చాల రోజులు గడిపా. 


నేను నా కథను ఉన్నది ఉన్నట్లు చెప్పినా నాకు తెలిసినంత వరకు . అప్పటికిగూడ అతని కుటుంబం  నన్ను చాల ఆప్యాయంగా చూసింది. కొన్ని రోజులతర్వాత వారి చుట్టాలు కొంతమంది రావల్పిండినుండిపారిపో యెచ్చారు. ముస్లిం గూండాలచేతిలో వాళ్ళు చాల కష్టా లనుభవించారు. వాళ్ల కళ్ల ఎదటే  వాళ్ళ బంధు వులను నానాహింసలు పెట్టి అవమానాలపాలు చేశారు. వాళ్ల హృదయాలు ముస్లిములంటే అసహ్యంతో నిండిపోయాయి. ఈ కథంతా - విన్న తర్వాత నాకు తెలియకుండా నేనుకూడ ముస్లిములను అసహ్యించుకోవటం మొదలం పెట్టా..


'సర్దార్ గారు నా కథంతా చెప్పి  , నా కే విధంగా మతి పోయిందీ, ఏ విధంగా నేను కష్టాలుపడ్డదీ వివరాలన్నీ వచ్చిన బంధువులకు చెప్పారు. పెద్దవాళ్ళు నన్ను అనునయించి నా పూర్వ స్మృతిని తెప్పించటానికి చాల ప్రయత్నం చేశారు. కాని పిల్లలుమాత్రం నన్ను అనుమానం గానే చూశారు. 


అందులో ఒకడు యింకొక డితో యీ విధంగా చెప్పటం విన్నా: 'వాడు చెప్పిందంతా అబద్ద మనుకో. మతి తప్పిపోయిం దని బొంకుతున్నాడనుకో, వాడు నిజంగా ముస్లిం అయివుంటాడు ' 


నాకు భయం పుట్టింది.


'ఆ ఆలోచనే నన్ను కూడ వేధించుకు తింది. నేను నిజంగా ముస్లిమునేమో. ఏమో ఎవరికి తెలుసు. నేనుకూడ యిప్పుడు ముస్లిములు చేస్తున్న మాదిరిగా ఘోరాలు చేసిన తర్వాత నాకు మతి తప్పిందేమో. నా ఘోర కార్యాలకి భగవంతుడు న న్నీ విధంగా శిక్షించా డేమో.' 

ఆ రోజు రాత్రే సర్దార్ యింటి నుండి పారి పోయా. తిరిగి వీధులవెంట తిరుగుతున్నా. మళ్లా ఉపవాసాలు, 


' ఈ శరణాలయం ముస్లిములకోసం నీ వెవరు ?' 

నీ పే రేమిటి ? నీ మత మేమిటి?నువ్వు ఎక్కడనుండి వస్తున్నావ్?.. ప్రశ్నలు ! ప్రశ్నలు ! ! ప్రశ్నలు!!! -అన్నీ ప్రశ్నలు, .


ఎక్కడచూచినా ప్రశ్నలు. నేను అందులో ఒక్క దానికీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే నే నెవరినో నాకే గుర్తు లేదు. ఇక నడవలేక ఆకలి మండుకుపోతుంటే తిరిగి జుమ్మా మసీదు  దగ్గరకు పోయి అక్కడే కూచున్నా. ఆకలితో చచ్చిపోవటం, నిశ్చయ మనుకొన్నా. స్పృహతప్పి పడిపోయా. 


అట్లా ఎంతసేపు పడిఉన్నానో! ఎప్పుడో ఒక్క సారి మాత్రం కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా ఎనిమిదేళ్ల పిల్లాడు నుంచొని ‘లే! లే!!” అని అంటున్నాడు. 


'ఇదిగో! యివ్వి తిను. మా అమ్మ నీకోసం పంపింది'. తిండి అన్న మాట వినంగానే లేవాలని బుద్ధి పుట్టిం దను కొంటా, కాని లేవటానికి శక్తి ఎక్కడనుండి వస్తుంది .  లేవలేకపొయాన.  ఆ పిల్లాడి సహాయంతోనే అతిప్రయాసతో లేచి కూచొని చపాతీలు తింటం ప్రారంభించా. 


ఎంత రుచిగా ఉన్నాయి ఆ చపాతీలు! భగవంతుడే నాకోసం అమృతాన్ని యీ రూపంలో పంపించినట్లుగా ఉంది. కల కాలం జీవించునాయనా! ' అని దీవించా. 


కాస్తముక్క కూడ విదలకుండా అన్నీ తినివేశా. కృతజ్ఞత తెలియజేద్దామని అతని చెయ్యి తాకగానే 'నీకు బాగా జ్వరంగా ఉందే ! మా యింటికి పోదాం. మా నాన్న యునాని వైద్యుడు. మందు వేస్తాడు. తగ్గిపోతుంది.' అని ఆ పిల్లాడు నన్ను వాళ్లయింటికి లాక్కుపోయాడు. 


ఆ యునానీ వైద్యు డొక ముసల్మాన్. రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తాడు. బీద, బిక్కికి ఉచితంగా మందులిస్తాడు. అతనికి హిందువులు, ముస్లింలు, సిక్కులు అన్న వివక్షత లేదు. జబ్బులు తో వస్తే వారందరికీ మందులిస్తాడు. 


హకీంసాహెబు మందుల వల్ల నా జ్వరము తగ్గింది . కాని అంత పెద్ద వైద్యుడివద్దకూడ పూర్వ స్మృతిని తెప్పించే మందు లేకపోయింది. 


నా కథంతా ఆయనతో చెప్పి 'ఒక వేళ నేను హిందువునేమో. నేను మీ యిల్లు వదలి ఇంకో చోటికి పోవాలి' అని అన్నా. కాని హకీం సాహెబు నన్ను అక్కడే ఉండమని బలవంతం చేశాడు. 'నీవు హిందువయితే మాత్రం  ఏ మొచ్చింది? హిందువులు మాత్రం మనుష్యులు కారూ?`


నే నక్కడే కొంత కాలమున్నా. ఒక రోజున హకీం సాహెబు కొడుకు నా మాదిరి దురదృష్ట వంతులకు రొట్టెలు యివ్వ టానికి వెళ్లి తిరిగి యింటికిరాలా. నేను, హకీం సాహెబు అతనికోసం ఆ రోజల్లా వెతికాం. కాని అతని జాడ తెలియలా! 


జుమ్మా  మసీదు దగ్గర హిందువులు చంపారని రాత్రి తెలిసింది. ఈ వార్త వినంగానే హకీం సాహెబు కుటుంబ మంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆ పిల్లాడి భూతం నన్ను రాత్రి, పగలూ వెంటా డుతూ తన మృదుమధుర వచనాలతో 'నువ్వు చచ్చిపోతున్నప్పుడు నీవు తిండి పెట్టా. కాని నువ్వు నన్ను చంపేశావు. గుర్తుంచుకో ! అంటోంది. నేను చంపలేదని నాకు తెలుసు. కాని నేను హిందువునేమో. మతి దప్పక పూర్వం నేను కూడ అనేకమంది ముస్లిం పిల్లలను చంపానేమో, ఈ ఆలోచన నన్ను అక్కడ నిలవనియ్యలా! 


ఆ రోజు తెల్లవారు ఝామున ఇంట్లో ఎవరు  లేవకముందే బయటకుపారిపోయా. 


అవి, ఢిల్లీలో మృత్యుదేవత తన సహస్ర బాహువుల్నీ జాపుతూ కరాళనృత్యం చేస్తున్న రోజులు. పట్టపగలే సామాన్య ప్రజానీకం మృత్యువువాత పడుతోంది. అగ్ని హోత్రుడిపాలవుతున్నది . 


ఏదో ఒక విధంగా గూండాలను తప్పించుకొని రైలుస్టేషనుకి చేరు కొన్నా. ఇక్కడికన్న బొంబాయిలో కొంచెం ప్రశాంతంగా ఉంటుందని బయలుదేరా . నా మాట విని అక్కడ పక్కన పంజాబునుండి వస్తున్న ఒక కాందిశీకుడు చిన్నబోయిన వదనంతో కూచున్నాడు. 


రైలు కదిలినప్పటికి  'ఎవరు నీవు?' అని అడిగాడు. 'నాకు తెలి యదు. హిందువునైనా కావచ్చు. ముస్లిమునైనా కావచ్చు.'


' ఈ మార్గంగుండా ముస్లింలు ప్రయాణం చేస్తే ఘోర ప్రమాదాలకు గురి అవుతారని విన్నా. నీకు గడ్డం ఉంది. అందుకని అడిగా!' 


నేను నా కథ అంతా అతనికి వినిపించా. అతడు నా గడ్డాన్ని దీక్షగా పరిశీలిస్తూ నావంక అనుమానంగా చూస్తున్నాడు.


'వారం రోజులనుండి గడ్డానికి  కత్తి తగలక పోవటంచేత గడ్డం కొంచెం పెరిగింది. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ భరత పురం వచ్చాం. అక్కడ రైలు ఆపివేయబడింది. 


ముసల్మానులు అని అనుమానం వేసినవారి నందర్నీ రైలులోనుండి బయటకు లాగి కాల్చి చంపే స్తున్నారు.


‘ఆ విషయాన్ని తలుచుకొంటుంటే నాకిప్పు టికీ నవ్వు వస్తోంది. ఎందుకు నవ్వు వస్తోందో మీకు తెలుసుకోవాలని ఉందా ? ఆ విధంగా ముసల్మానులను బయటకు లాగి కాల్చి చంపే వాళ్ళంతా 'మహాత్మా గాంధికి జైయ్' అని అర స్తున్నారు. అది చాలు చచ్చిపోయేముందు ఎవడైనా నవ్వటానికి.


వాళ్లు  మా బోగీదగ్గరకు రాగానే నాకూ  చావు తప్ప దనుకొన్నా. నేను ముస్లిము అవునో కాదో నాకు మాత్రం తెలియదు. కానీ నాకు గడ్డం ఉంది. అది చాలు నన్ను చంపటానికి. 


యిందాకటినుండి కూచున్న పంజాబీ నామీద దుప్పటి వేసి నన్ను పూర్తిగా కప్పేశాడు. వాళ్లు అడగంగానే 'ఆయన మా అన్నండి. లాహో రులో బాగా గాయాలు తగిలాయి. ఇప్పుడు మాటాడే పరిస్థితిలో లేడు' అని స్నేహితుడు చెప్పాడు. నా పంజాబీ 'ఏదో ఒకవిధంగా చివరకు బొంబాయి చేరు కొన్నా. ఇక్కడకూడ అదే ప్రశ్న ఎదుర్కొంది.


నువ్వు హిందువుడివా, ముస్లిమువా ?


'ఎవరు హిందువు ? ఎవరు ముస్లిము? అన్న ఆలోచన నాకు యిప్పుడు తట్టింది. నేను ముస్లిముగా కనుపించినప్పటికీ పంజాబీ నన్ను కాపాడా డు. హకీం సా అతను హిందువా? సాహెబు కొడుకును చంపిన కిరాతకులు హిందువులా? ఎవరు ము స్లిములు? 


హకీం సాహెబు కుటుంబం ముస్లిము కుటుంబమా, లేక రావల్పిండిలో సిక్కులను నానా బాధలు పెట్టిన రాక్షసులు ముస్లిములా ? ఎవరు సిక్కులు? సర్దార్ సాహెబు కుటుంబమా  లేక ఢిల్లీలో వీరవిహారం చేస్తున్న నీచులా ? ఎవరు  ముస్లిం? ఎవరు హిందువు? ఎవరు సిక్కు ? ఈ పవిత్రస్థలములో కూడ నువ్వు హిందువువా, ముస్లిమా, 'సిక్కా అన్న ప్రశ్నే !


' నే నెవర్ని? హిందువునా? ముస్లిమునా? రాత్రింబగళ్లు ప్రశ్న నన్ను బాధిం చింది. నిద్రపోతున్నప్పుడుకూడ యీ ప్రశ్నలు భూతాల రూపందాల్చి బల్లాలు పుచ్చుకొని జవాబు పొందటానికి ప్రయత్నించాయి. నేను కలవరింతగా యీ మాట అన్నానేమో. 'నన్ను వదలి వెయ్యండి. నేను ముసల్మానును కాదు. హిందువునూ కాదు. సిక్కు నూకాదు. ఒక మాన వుణ్ణి మాత్రమే!' 


బొంబాయిలో కాందిశీకులకు శిబిరాలున్నాయి . సి క్కులకు ఖాత్యా కళాశాల దగ్గర ఒక శిబిరం ఉంది. హిందువులు రామకృష్ణ ఆశ్రమంలో తలదాచుకోవచ్చును. ముస్లింలు అంజుమన్ ఇస్లాం హైస్కూలుకు పోవచ్చును. కాని నేను ఎక్కడకు వెళ్లను? నాకు తలదాచుకొనేందుకు ఎక్కడా చోటులేదు. 


ముష్టి  నా కెవళ్లూ వేసేవాళ్లు కాదు. ముష్టి వేసేందుకు గూడ ఏ మతంవాడినో అడిగేవాళ్లు. నేనేం చెప్పేది? నేను ఏ మతానికీ సంబంధించిన వాడిని కాదు. అయితే నేను చచ్చిపోవాలన్న మాట. 


ఉహుఁ. ఆవిధంగా చావ లేను. నేనెవరినో తెలుసుకోవాలి. లేకపోతే నేను బతకటానికి అవకాశం లేదు.


డాక్టరు 'సమాని' నా స్మృతిని తెప్పిస్తాడని విని అక్కడకు వెళ్లా. అతడు మందులు, మాకులు వేసి రోగం తగ్గించడు. ఊరికే మాట్లాడి కుదు రుస్తాడు. నీ మనస్సును కష్ట బెట్టుకోకు. నీబుర్ర లో ఏమనిపిస్తే అది అంతా చెప్పు. సంబంధమున్నా సరే లేకపోయినా సరే అని చెప్పి తను ఒక కలంపుచ్చుకొని నా ముందు కూచున్నాడు. 


నేను కళ్ళు మూసుకొని నానోటి కొచ్చిందల్లా మాట్లాడా. 'నీలపు ఆకాశం, పచ్చని చేలు'


‘బాగుంది, ఆపబోకు' '


' నీలపు ఆకాశం, పచ్చని చేలు, ఒక నదీ ప్రవాహం. నదిలో పడవలున్నాయి. ఒక కాలవ, కాలవలో పిల్లలు యీదుతున్నారు. ఒకళ్ల మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారు.' 


' ఎవరీ పిల్లలు ? హిందువులా, ముస్లిములా, - సిక్కులా'


'ఏమో, ఎవరో, కానివాళ్ళుమాత్రం పిల్లలు' '


' సరే, కానీ .. పంటపొలం, పండగ. ! డోలక్ వాయిద్యం విను.. ఆహాఁ. ఎంత బావుందో ! ఆహాఁ! ఏంపాట !!! ఎవరు పాడుతున్నారా పాట??


' స్త్రీలు ' 


'సరే. ఎవరా స్త్రీలు. హిందువులా, ముస్లిములా, సిక్కులా.' '


' పంజాబు స్త్రీలు. హిందువులు, ముస్లిములు - సిక్కులు' 


' ఇక ఏమీ చెప్పలేను. ఏమీ కనిపించడం లేదు. ' 


'ఊ' అని నిట్టూరాడు డాక్టరు . . యికలాభం లేదన్నట్లు.


' ఏం? ఎందుకని? ఏ మొచ్చింది ?'


“ నాతల తిరిగిపోతోంది. చీకటిగా ఉంది. ప్రపంచమంతా భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయి. ' 

 

'గట్టిగా ప్రయత్నించు  . ఇప్పుడేం కనిపిస్తున్నాయి? ' 


' ఆకాశాన్నం టే మంటలు. ఇళ్లన్నీ తగలబడి పోతున్నాయి. ఏడుపు స్వరాలు వినిపిస్తున్నాయి.' 


 'సరే, గూండాలు వచ్చారన్న మాట. వీళ్ళే బంధువుల్ని చంపేశారు. వీళ్ళే నీ ఆస్తి అంతా దోచేశారు. వీళ్ళే నీ పెళ్లాం పిల్లల్ని చంపేశారు. నీ మతి పోగొట్టారు...వా ళ్ళేం చెబుతున్నారు? 


; నా కేమీ వినిపించటంలా, అంతా గోలగా ఉంది. ఒక్క మాటమాత్రం చెవులో గుద్దినట్లు వినిపిస్తోంది. ' చంపుచంపు చంపు. ' 


'వీళ్ళే నిన్ను సర్వనాశనం  చేశారు. వీళ్ల మీద నువ్వు పగతీర్చుకోవాలి. ' 


' నేను హిందువునో, ముసల్మానునో డాక్టరు తెలుసుకో బోతున్నాడు! నేను ముస్లిముని! సర్దార్ సాహెబు బంధువుల్ని చంపా. అనేకమంది హిందువుల సిక్కుల ప్రాణాలు తీసి వేశా. నేను హిందువుని!  హకీం సాహెబు కొడ కుని చంపా. ఇంకా అనేకమంది ముస్లిములను చంపా. ' 


' వద్దు. అక్కర్లేదు. నేనెవరినో నేను తెలు సుకోనక్కర్లా. నేను హిందువుగాని, ముస్లిం గాని, సిక్కు గాని అవదల్చుకోలా• మానవుడిగా మాత్రమే ఉంటా. అంతే! అంతే!!' అని అరుస్తూ డాక్టరు దగ్గరనుండి పారిపోయా! 


నేను హిందువుని. నేను ముస్లిముని

నేను ముస్లిముని'  హిందువుని' ‘


' నే నెవర్నయితే మాత్రం నాకేం పనీ? ' 


' నే నెవర్ని కాదు. నాకేం పని లేదు' “

' నేను హిందువుని . నేను ముస్లిముని'


ప్లేగు నుండి  పారిపోయినట్టు డాక్టరు దగ్గర నుండి పారిపోయా. 


కాని యీ మాటలు మాత్రం నన్ను వదలి పెట్టలా ! 

నేను ఏ వీధికుండా పరు గెత్తుతున్నా నో నాకు తెలియదు. భయంకరమైన  వ్యక్తి ఒకడు నన్ను పట్టుకు ఆపాడు. ' ఆరే సాలా ! ఎవర్రా నువ్వు? ఎక్కడికి పోతున్నావ్ ?' 


అతడొక ముస్లిం అవాలి . అతని చేతిలో కత్తి ఉంది. 

 ' నేను హిందువుని. నేను ముస్లి ..' '


' ముస్లిము' అన్నమాట పూర్తి చేయక ముందే నా వీపులో బాకు దిగిపోయింది. అదే ఈ వీపులో ఉన్న బాకు పోటు!


'కాఫిర్ కా బచ్చా' అని అంటున్నాడు. నేను పూర్తిగా పడిపోకుండా పారిపోతున్న ప్పుడు. నా వెనుక రక్తం కారుతోంది. మీరు నమ్మరు. అయితే నమ్మబోకండి. 


చచ్చిపోయే ముందు నేను నిజం మాట్లాడుతున్నా నని నాకు మీరేమీ సర్టిఫికేట్ యివ్వనక్కర్ల.......


 “నేను ముస్లిముని. నేను హిందువుని' అని అనుకుంటూ నేను పోతున్నా. 


ఈసారి 'హిందువు' అంటానికి పూర్వం నా డొక్కలో ఒక బాకు

దిగింది.


'ఇప్పుడు మీరు గ్రహించా రనుకొంటా, నాకీ రెండు గాయాలు ఎట్లా తగిలాయో! 


నన్ను హిందువులు, ముస్లిములు యిద్దరూ బాకుతో  పొడిచారు. అందుకనే మీరు నన్ను బతికించ లేదని చెప్పింది డాక్టరుగారు! 


ఇక్కడ యింత ఆదుర్దాగా చూస్తున్న మీలో ఒక్కడు కూడ  నన్ను బతికించలేడు . పగతీర్చుకొంటానికి మాత్రం నా చావును ఆధారంగా తీసుకొంటారు. ఇప్పుడు గనక నేను హిందువునని చెప్పినట్లయితే వెంటనే హిందువులు నాలుగు అమాయకముస్లిం పిల్లల ప్రాణాల్ని ఆహుతి గొంటారు. ముస్లిము నని చెబితే ముస్లిములంతా హిందూ మతాన్ని రూపుమాపేస్తారు. 


' నేను నవ్వుతున్న దెందుకంటే, యిప్పుడే తెలిసింది నే నెవరినో ? ఇంత కాలాని యిప్పుడు తెలిసింది పూర్వచరిత్రంతా! 


నా బిడ్డల  చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి . ఇద్దరు కూడ నా కళ్ల ఎదటే చంపబడ్డారు. ఆ విధంగా నా మతి చెప్పింది. ఆఁ! అవును! అంతా నా కిప్పుడు గుర్తు కొస్తోంది. మా పొలాలు, మా గ్రామం, నా స్నేహితులు, నా యిరుగు పొరుగువాళ్ళు - అంతా యిప్పుడు జ్ఞాపక మొస్తున్నారు. చచ్చి పోయేముందు..  నిజం .. అన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి .


'మీరు నేనేమి చెబుతానో అనియింకా నిరీ క్షిస్తున్నారు. కాని లాభం లేదు. నేను చెప్పను.  నేను హిందువునో, ముసల్మానునో చెప్పను.  చెప్ప దలచుకోలేదు. 


నాకు యీ రెండు -గాయాలు తగిలించిన హిందువుగాని, ముస్లింగాని నేను తన జాతివాడినని తెలుసుకోకూడదు. ఆరే పొరబాటున పొడిచానే అని పశ్చాత్తాపం పొందకూడదు. ఇదే నా పగ. వీ ళ్లిద్దరిమీదే కాదు. నాలాంటి అమాయక ప్రాణాలను బలి గొంటున్న వేలకొలది హిందువులమీద, ముస్లి ములమీద, సిక్కులమీద . 


మతోన్మాదులు పుట్టటం మూలంగా, బతకటం మూలంగా ఆత్మీయమైన నా పంజాబుకు తీరని కళంకం వచ్చింది.


' నేను హిందువునా, ముస్లిమునా ?' 


' నేను ముస్లిమునా హిందువునా?' 


ఈ ప్రశ్నే వాళ్లకు కావాల్సింది. ఈ ప్రశ్న వాళ్లను రాత్రింబగళ్లు వేధించుకు తినేది. పట్టణంలోను, పల్లెలోను, రైళ్లలోను , బస్సులోను, ట్రాములోను -ఫ్యాక్టరీలోను, ఎక్కడబడితే అక్కడ యిదే ప్రశ్న. 'వాడు హిందువా, ముస్లినూ?' 


వాళ్లకుగాని వాళ్ల పిల్లలు ఉంటే ఆ  పిల్లలకుగాని, వాళ్ల పిల్లల పిల్లలకు గాని శాంతి ఏమిటో తెలియదు. 


అంత భయంకరం, ఘోర భయంకరం నా పగ. 


ఇంకా మీకు తెలుసుకోవా లని ఉందా, నే నెందుకు నవ్వుతున్నానో?'

- రచన - వెంకటేశ్ 


(మూలం - అబ్బాస్ కథ) 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


- సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...