Sunday, December 12, 2021

ఎవరు దేవుడు? -కర్లపాలెం హనుమంతరావు (సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం

 

ఎవరు దేవుడు?

-కర్లపాలెం హనుమంతరావు

(సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)

 

దేవ శబ్దం  పదకొండు ధాతువుల సమాగమం- అని మన ప్రాచీనుల విశ్వాసం. లోకాలను ఆడిచడం, ధర్మమార్గం నమ్మినవాళ్లకు సాదనాలు అందించి జయం చేకూర్చడం, మదోన్మత్తులను శిక్షించడం, స్వయం ప్రకాశం, స్వీయానందమనే సులక్షణాలుగా కలిగి ఉండి పరిసరాలను ప్రభావితం చేయడం,  ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని,  శాశ్వత విరామం కొరకు  ప్రళయాన్ని సృష్టించడం, ఉదాత్తజీవికి ఉండదగ్గ సులక్షణాలు సర్వం తాను కలిగివుండటం,  సంపూర్ణ జ్ఞానికి ఉండే  నిండు విగ్రహంతో సర్వత్రా  వెలుగొందేవాడు దేవుడవుతాడని 'దివు-క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' అన్న నిర్వచనం నుంచి రుషులు రాబట్టినట్టి దైవస్వరూప భావం. ఆయుర్వేదమంత్రం(14 -20) అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ లాంటి దేవుళ్లుగానే భావించింది. మాక్స్ ముల్లర్ మహాశయుడయితే మరీ సులువు సూత్రంలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని తేల్చేసాడు. మధ్యస్థంగా మసిలే   శ్రీసాయణాచార్యుడు స్వర్గం అనే లోకం ఒకటి ఊహించుకుని దేవుడి చేతికి దాని సింహద్వార బీగాలు తాళాలు అప్పగించాడు. దేవుడు అంటే యజమాని, అన్ని రకాల పొగడ్తలకు అర్హుడైన స్వామి అన్న భావం ఆరంభమయింది శ్రీ సాయణాచార్యుడి జమానాలోనే అని పరిశోధకుల అభిప్రాయం.  ఎవరే నిర్వచనం ఇచ్చినా, భాష్యం చెప్పినా- ప్రాణికి, ప్రకృతికి  మేలు చేకూర్చే  చర్యలు చేపట్టే శక్తిని దైవంగా భావించడానికి అభ్యంతరం ఉండనవసరంలేదు.

ప్రకృతి శక్తులు, వాటి అంతర్భాగాలైన  సూర్య చంద్రుల వంటి గ్రహనక్షత్రాలు చలవ వల్లనే భూమ్మీద  మనిషి మనుగడ. నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి-వంటి పంచభూతాలు ప్రాణుల ఉనికికి మూలాధారాలు. మానవ జీవితాన్ని అనుక్షణం ఏదో రూపంలో ప్రభావితం చేసే  చెట్టు చేమా, గుట్టా పుట్టా కూడా దైవసమానాలేనని డాక్టర్ దాశరథి రంగాచార్య వంటి విజ్ఞుల అభిప్రాయపడ్డారు.

 

వేదాలని లోతుగా పరిశీలిస్తే దైవరూపాలన్నీ జడరూపాలలో ఉన్నట్లు తెలిసి అబ్బురమనిపిస్తుంది. చైతన్యస్వరూపుడిగా మనిషి భావించుకునే దేవుడు మనిషికి వాస్తవ జగత్తులో ఎన్నడూ  కనిపించిందిలేదు.  ప్రకృతి శక్తులకు మాత్రమే దైవత్వ మాపాదించే ధోరణి తైత్తరీయోపనిషత్ అంగీకరించదు.  'రసో వై సః రసం హ్యేవాయం లబ్ధ్యా నందీ భవతి' (2.7) సిద్ధాంతం ప్రకారం భగవంతుడంటేనే స్వయంగా ఆనందస్వరూపుడు; జీవాత్మ ఆయన సన్నిధానంలో ఆనందమయం అయిపోతుంది. ఆనందం కలిగించకపోతే ఎవరికైనా జీవించి ఉండాలన్న ఇచ్ఛ ఎందుకు కలుగుతుంది?' అని వాదించే కోవకు చెందుతారు వీళ్లు.

నిజానికి దేవుడు ఎప్పుడూ మారలేదు. అతని స్వభావంలో ఎప్పుడూ మార్పు వచ్చే అవకాశం కూదా లేదు. మారినట్లు కనిపించేదంతా ఆ దేవుడిని నమ్మిన మనిషి భావనలో వచ్చిన మార్పు మాత్రమే! వేదకాలంలో మనిషి ప్రకృతి శక్తులను అర్థం చేసుకొనే శక్తి చాలక భయంతో దేవుళ్లుగా భావిస్తే, పురాణకాలం వచ్చేసరికి ఆ ప్రకృతి శక్తుల స్థానే మానవమూర్తులను బోలే దేవీదేవతలు, వాళ్ల మధ్యనా మనుషులకుండే భావోద్వేగాలు, వాళ్ల సంసారలంపటాలు మొదలయ్యాయి. ఆధునిక యుగంలో కూడా షిర్డీ శాయిలాంటి మనుషుల్లో నుంచే పుట్టుకొచ్చిన దేవుళ్లకు ఆరాధనలు ఎక్కువయ్యాయి.  మనుషులుగా తమకు అసాధ్యమైన పనులు సాధించే శక్తి ఒకటి ప్రేరణ కింద సమాజం ముందు ఏదో ఒక రూపంలోనో, భావనలోనో ఉండటం తప్పని సరి. ఆ దివ్యరూపాలకు, అతీతభావనలకు ఆలంబనమే ఆధునిక మానవుడు ఆరాధించే రూపాలు. వారే అధునిక తరాలకు దేవుళ్లు.

 

జన్మనిచ్చిన తల్లిదండ్రులను. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులలో దైవరూపాలను చూసుకొనే సంస్కృతి భారతీయులలో తరతరాలబట్టి కొనసాగుతూ వస్తున్నది. ఆపదలప్పుడు ఆదుకున్నవాళ్లను కూడా దేవుళ్లుగా భావించదం మనకు స్వభావసిద్ధంగా వస్తోన్న పాత తరాల లక్షణం. దేశానికి స్వాత్రంత్ర్యం సాధించుకున్న సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్న మోహన్ చంద్ కరం చంద్ గాంధీని మహాత్మునిగా మాత్రమే కాకుండా దేవుడిగా భావించిన జనసామాన్యం తక్కువేమీ లేదు.

 

ఆదర్శప్రాయమైన జీవితాలను గడిపిపోయేవారిని దైవసమానులుగా భావించే  పూజించే అలవాటు మనకీ దేశంలో తరతరాలుగా  వస్తున్నదే! 'సంశయాత్మా వినశ్యతి' అన్న ఆర్యోక్తి వింటూనే ఉంటాం. పూజ్యభావనతో ప్రతిష్ఠించిన చారిత్రిక పురుషుల విగ్రహాలను గుళ్లో దేవుళ్ల కింద భావించి కొలవడాన్ని కొందరు బుద్ధిమంతులు హేతుబద్ధమైన ఆలోచనలను ముందుకు తెచ్చి ఖండిస్తుంటారు. ఆ తరహా తార్కికులకు తృప్తి కలిగించడం కష్టం; భక్తిభావనకు విశ్వాసం ప్రధానం కనక. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అని కదా పెద్దల మాట!

 

దేవుళ్ల రూపాలు మారవచ్చు. దైవారాధన రూపాలూ మారవచ్చు. ఈ మార్పులేవీ దేవుళ్లుగా మనం ముందు నుంచి భావిస్తున్న ఆ శక్తుల స్వభావాలలో మార్పు తేలేవు, అగ్నిదేవత ఏ రూపంలో ఉన్నా కాల్చే స్వభావం కలిగే ఉంటుంది. ఏ విధంగా పూజించినా  ముక్కులకు దిగేదాకా  మునిగితే గంగ ప్రాణాలు హరించేస్తుంది. రూపంలోని మార్పు, అర్చనలోని మార్పు మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతాలు. ఈ  ఇంగితం మనిషికి లేకనే .. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతికి జాతికి మధ్యన, దేశానికి దేశానికీ మధ్యన, సంస్కృతి సంస్కృతీ మధ్యన, తరానికి తరానికి మధ్యన ఇంతింత సంఘర్షణ.

 

కవులు సైతం తమ కావ్య రచనల ఆరంభంలో దేవతా ప్రార్థనలు చేసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థన చేయడం ఇక్కడ గమనార్హం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ ఎన్నో రకాలుగా దేవుళ్లను సైతం తరగతుల కింద విభజించుకొని ఇష్టులైన దేవుళ్లకు మళ్లా ప్రత్యేక ప్రార్థనలు చెయ్యడం .. మనిషి హ్రస్వదృష్టికి నిదర్శనం.

 

'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని సమాధానం చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుదు, ప్రజాపతి ఒక్కొక్కళ్లు- మొత్తం ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి - ఈ మొత్తం ఎనిమిది వసుదేవతలు, జగత్తును సింపచేయాలన్నా, నివసింపచేయాలన్నా వీటి చలవే కాబట్టి ఇవి వసుదేవతలు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చెరి ఐదేసి.. ఆ పైన జీవాత్మ - మొత్తం పదకొండు- రుద్రదేవతలు. శరీరాన్నుంచి ఆత్మ వెళ్లిపోయే సమయంలో ప్రాణులను ఏడిపిస్తాయి కాబట్టి వీటికీ రుద్రదేవతలనే పేరు వచ్చిందని ఓ భావన కద్దు. సంవత్సరంలోని పన్నెండు మాసాల ద్వాదశ ఆదిత్యదేవతలు. చైత్రానికి సూర్యుడు, వైశాఖానికి ఆర్యముడు, జ్యేష్టానికి వివస్వానుడు.. అదే వరుసలో ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలకు అంశుమంతు, పర్జన్యుడు, వరుణుడు, ఇంద్రుడు, దాతృది, మిత్రుడు, పూర్ణ, భృగుడు, తృష్ణ -లు ప్రాతినిథ్యం వహిస్తూ ఆయుష్షును హరించే దేవతలు. ఇంద్రుడంటే విద్యుత్తు, ప్రజాపతి యజ్ఞానికి ప్రతీకలైన దేవతలు. ఇంతమంది దేవతలున్నా మళ్ళీ ముగ్గురే ముఖ్యమైన దేవతలు. భూమ్మీద ఉండే అగ్ని, మేఘంలో ఉండే వాయువు.. మెరుపు, అంతరిక్షంలో ఉండే సూర్యుడు.

మూడు ముఖాలతో ప్రకాశించే అగ్నిదేవుని ప్రస్తుతులు 200 సూక్తాలలో కనిపిస్తాయి. ప్రపంచసాహిత్యంలోనే అత్యంత పురాతనమైన వేదాలలోని మొదటి వేదం రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్/హోతారం రత్నధాతమమ్' అగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రదేవుడికే ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వానలు కురిపించగల సత్తా  వజ్రాయుధ హస్తపాణి ఇంద్రుడొక్కడిదే. వృత్తుడనే మొండి జలరక్కసి పీచమణచే వృత్తాంతం మహా వీర రసస్ఫోరకంగా పురాణాలు వర్ణించడం వెనకున్న రహస్యం ఆర్యావర్తమంతటా ఇంద్రుడి పట్ల ఉండే విశేషమైన  భక్తిప్రవత్తులు!

 

వైదికపరంగా ఇంద్ర శబ్దం ఐశ్వర్యానికి ప్రతీక. ఆధునికి భారతీయ సాహిత్య విమర్శకులలో బాలగంగాధర్ తిలక్ ఇంద్రుణ్ణి అగ్నికి, వృత్తుణ్ణి మంచుకు ప్రతీకలుగా స్థిరపరిచాడు. పౌరాణికుల దృష్టిలో ఇంద్రుడు స్వర్గాధిపతి అయినప్పటికి వైదికవాజ్ఞ్మయపరంగా 'జీవుడు'కి ప్రతీక. దేవతలకు అధిపతిగా, రాక్షసులకు విరోధిగా, తాపసులకు అడ్డంకిగా  గౌరవం, హైన్య భావం ఒకేమారు ముప్పిరి గొల్పే వైవిధ్యమైన కథలు  ఇంద్రుని మీద వచ్చినంతగా వైదిక వాజ్ఞ్మయంలో మరో దేవతపైన రాకపోవడం గమనించాలి.

 

ద్యుస్థానీయ దేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖమైన దేవుడు. సౌర మండలంలోని సమస్త శక్తికీ మూలాధారంగా ఋషుల భావనలో గౌరవం సాధించిన ఈ సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. 'ఓం నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ'అనే రుగ్వేద పదవ మండలం 37 శ్లోకంలో 'మిత్రావరుణులకు కళ్లుగా, సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులకు దర్శనమిచ్చే దివ్యజన్మ కలవాడిగా,    సకల లోకాలను ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుష కార్యాలన్నీ యాజ్ఞిక రూపంలో గ్రహించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతులందుకునే ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుడు. సోముడు, వరుణుడు, నదులు, రుద్రుడు, బృహస్పతి, సవ్వితృడు, విష్ణువు, ఉషస్సుల వంటి దేవతలు  ఇంకెందరో వేదాలలో తమ తమ స్థానాలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.

 

పౌరాణిక దేవతలుః వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేద కాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాథనలు అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించి ఆరాధించడం సామాన్యుడికి సులువైన మార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవీదేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తి మార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో భాగమయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజా పునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దేవతారూపాలు ఉనికిలోకి రావడం కొత్త పరిణామం.

 

జైనుడైన అమరసింహుడు తన అమరకోశంలోని స్వర్గ వర్గంలో దేవుళ్లకు ఉండే'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః'  లాంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరా మరణాలు లేని వాళ్లని, ఎప్పుడూ ముఫ్ఫై ఏళ్లలో ఉన్నట్లే కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని ఇట్లా ప్రతీ పదానికీ ఉండే వ్యుత్పత్తి అర్థాన్ని అవగాహన చేసుకుంతూ పోతే ఎప్పుడూ కనిపించని దేవుళ్ల శక్తి యుక్తుల మాట ఎట్లాగైనా పోనీ, కంటి ముందు తిరిగే   మనిషి సునిశిత బుద్ధి వైశాల్యాన్ని మెచ్చుకోబుద్ధివేస్తుంది. హద్దులెరుగని కల్పన చేయగల మేధోసామర్థ్యం సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సొంతమన్న సూత్రం ఎంత తిరుగులేనిదో దేవతల పుట్టుకే ఒక  ఉదాహరణగా నిలుస్తుంది. వేదకాలంనాట జడప్రాయులుగా ఉన్న దేవుళ్లు పురాణకాలం వచ్చేసరికి మహిమోపేతులైన విగ్రహాల రూపంలో జనసామాన్యం మధ్య సుప్రతిష్ఠులవడంలో మనిషి సృజనాత్మకత దాగివుంది.

 

వాల్మీకి రామాయణం 14వ సర్గలో దేవతల పుట్టుకను గురించి ప్రస్తావన ఉంది. జటాయువు తన పుట్టుకను గురించి శ్రీరాముడికి వివరించే సందర్భంలో సృష్టిక్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావన వస్తుంది. ప్రజాపతులలో ఆఖరివాడు కశ్యప ప్రజాపతికి, అదితికి కలిగిన సంతానం ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం. కవుల కావ్యాలలో కూడా పౌరాణిక దేవతల ప్రార్థనలకే అధిక ప్రాధాన్యం. తెలుగుకవులైతే నన్నయ కాలం నాటి నుంచి అవతారికలలో  ఈ పౌరాణిక దేవతలకే వినతులు సమర్పించింది.

 

జానపద దేవతలు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి సమాజంలోని ఒక ప్రధాన వర్గం చేసే పూజావిధానాలలో చాలా మౌలికమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖి సాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖిత సాహిత్యం ద్వారా నీరాజనాలు పట్టడం సర్వసాధారణమయిపోయిందనుకోండి. అమ్మవారు, పోతురాజుల వంటి ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లనే దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం.

 

గ్రామదేవతలలో స్త్రీ దేతలే అధికం. పురుషదేవతల ఉన్నా వాళ్లు అమ్మవార్లకు ఏ సోదరులో, భర్తలో, బంధువులో మాత్రమే. యుద్ధదేవతలు సాధారణంగా పురుషదేవతలు అయివుంటారని, వ్యవసాయ సంబంధమైన దేవతలలో స్త్రీ దేవతలే అధిక సంఖ్యలో ఉంటారని ఒక పరిశీలన. వ్యవసాయాధారిత దేశం అవడం చేత భారతావని పల్లెపట్టుల నిండా స్త్రీలే అధికంగా ఉండడం, వారికి అనుకూలమైన స్త్రీదేవతలే గ్రామాలలో ఎక్కువ ఆరాధనలు అందుకోవడం అనూచానంగా వస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. జానపద దేవతలలో  ప్రధానంగా రెండు తరగతులు కనబడతాయి. పార్వతీదేవి వంటి శక్తి మూర్తులకు ప్రతినిధులుగా భావించబడే గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి వారు ఒక తరగతికి చెందితే, ప్రజల సంక్షేమం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఊరి ఆడపడుచులు కాలక్రమేణా గ్రామదేవతలుగా మారి కొలుపులు అందుకునేవారు మరో తరగతి దేవతలు. 

 

వీరులను దేవుళ్లుగా భావించి ఆరాధించే సంప్రదాయం ప్రపంఛమంతటా ఉన్నట్లే భారతదేశంలోనూ కద్దు. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శీవాజీ వంటి వాళ్ళు దైవసమానుల స్థాయికి ఎదిగి పూజలందుకోవడం గమనార్హం.

 

కులాచారం ప్రకారం తమ తమ దేవతలను ఆరాదించే సంప్రదాయం కూడా భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తుంది. బలులివ్వడం, మాంసాహారం నైవేద్యంగా సమర్పించడం, మద్యాన్ని ఆయా దేవతలకు ఆరబొయ్యడం, ముడుపులు కట్టడం, తమకు ఇష్టమైన కాయనో, పండునో దేవుని ప్రీత్యర్థం తినకుండా వదిలివేయడం.. జానపదులు ఆరాధించే విధానాలలో కొన్ని!

 

తెలుగు కావ్యాలలో జానపద దేవతలకు ఇష్టదేవతాప్రార్థనలలో బొత్తిగా స్థానం లేదు! అందుకు చారిత్రిక కారణాలేమైనా ఉన్నాయేమో పరిశోధకులు తర్కించవలసిన ముఖ్యమైన చారిత్రిక అంశం.

 

ధునిక దేవతలుః

ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, సంతోషిమాత, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి నిజజీవులు దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు. మహాత్మాగాంధీ, డాక్టర్ అంబేద్కర్, మహాత్మా ఫూలే వంటి నవయుగ నిర్మాతలూ దేవతల స్థాయికి ఎదిగి నిత్యం పూజలు అందుకుంటున్న క్రమం మనపిప్పుడు చూస్తున్నాం.

 

భారతీయులు తల్లిదండులను, గురువులను దేవతలతో సమానంగా భావించి గౌరవించే సంప్రదాయం అనాది  నుంచి వస్తున్న సత్సంప్రదాయం. 'గుకారశ్ఛాంధ కారోహి రుకారస్తేజ రుచ్యతే/అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురుదేవ  న సంశయః': -గు అంటే చీకటి రు అంటే దానిని అడ్డగించేవాడు గురువు అని అర్థాలు చెప్పుకొచ్చింది సంప్రదాయం.

 

సృష్టికి మూలం పరమాత్మ అనే భావన మీద ఆమోదమున్నప్పుడు సహజంగానే సృష్టిలోని సకల జీవజాతుల్లోనూ ఆ పరమాత్ముని బింబమే ప్రతిఫలిస్తుందనీ ఒప్పుకోవాలి. ఆ రకంగా చూస్తే దేవుడు ఇన్ని రూపాలలో ఉన్నాడన్న భావన కన్నా ఉన్న అన్నీ రూపాలకు అంతర్గత సూత్రం ఒకే పరమాత్మ స్వరూపం అని అర్థం చేసుకోవడం మేలేమో! మతాల గురించి ఈ కలికాలంలో మనం దేదో ఒకళ్ల నొక్కళ్లం దూషించుకుంటూ సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథా ప్రయాసలేవీ లేని ఒక స్పష్టత ఉంది. 'ఇన్ద్రం మిత్రం వరుణమగ్నిమహురథో దివ్యః స సుపర్నో గురుత్వాన్/ ఏకం సద్విప్రా బహుధా వదన్త్యగ్నిం యమం మాతరిశ్వాన మహుః'-  బుద్ధిబలం ఎక్కువైనందువల్ల ఆకారమే లేని పరమేశ్వరుడికి ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని, యముడని, అగ్ని అని ఏవేవో పేర్లు పెట్టి పిలుచుకుంటూ భిన్నరూపాలలో భావిస్తున్నాం. వాస్తవానికి ఉన్నది ఒక్కటే. ఏకం సత్. అదే సత్స్వరూపం అని అన్న ఈ రుగ్వేద మంత్రం అంతరార్థం ఇప్పటికైనా మనం అవగాహన చేసుకోవడం ఒక్కటే నానాటికీ    మతపరమైన విద్వేషభావనలు సామాజిక వ్యవస్థను చెదరగొట్టకుండా శాశ్వతంగా మాసిపోయి  శాంతిభద్రతల పునరుద్ధరణకు సులువైన దారి ఏర్పడేందుకు అవకాశం దొరుకుతుంది.

 

కంటికి కనిపించని దేవుళ్ల కౌటింగ్ కన్నా.. కంటి ముందు కదిలే  మనిషులే మనుషులకు దేవుడనే భావన బలపడితే మరీ మంచిది.. అసలే గొడవలూ ఉండవు.

-కర్లపాలెం హనుమంతరావు

29 -04 -2021

(సూర్య దినపత్రిక సంపాదకీయ పుటలో ప్రచురితమైన వ్యాసం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...