తెలుగు సాహిత్యంలో ముసల్మాన్ కవులు
- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దినపత్రిక ప్రచురితం)
' మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
మాతృ భాష యొండు మాన్యము గదా
మాతృ శబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల'
ఈ పద్యం ప్రత్యేకత రచన చేసిన కవి ఒక ముస్లిమ్ మతానుయాయుడు. ఇది 'తెనుగుబాల' శతకంలోని ఒక నీతి పద్యం. రాసింది ముహమ్మద్ హుస్సేన్ .
పేర్లు ప్రత్యేకంగా చెప్పకపోతే తెలుగు కవుల సృజనే అని మురిపించే సాహిత్యం తెలుగునాట ముస్లిం కవులు, రచయితలు సృష్టించిన మాట వాస్తవం. వినుకొండ వల్లభరాయుడి 'క్రీడాభిరామం' తలలేని రేణుకాదేవి విగ్రహం ముందు నాటి ఊరి వెలుపలి వాడ ఆడపడుచులు నిర్వస్త్రంగా వీరనృత్యాలు చేయడం వర్ణించింది అద్భుతంగా. అదే పంథాలో అజ్మతుల్లా సయ్యద్ అనే ఓ ముసల్మాన్ కని దేవరకొండలో జరిగే జాతర దృశ్యాలను నాటి సాంఘిక పరిస్థితులు కళ్లకు కట్టేవిధంగా వర్ణించాడు.(చాటు పద్య రత్నావళి. పు. 126)
సర్కారు ప్రకటించిన స్థలంలో జరిగే సంతలో డబ్బున్న ఆడంగులు రకరకాల వస్త్రవిశేషాలు సందడిగా కొనుగోలు చేసుకుంటుంటే దమ్మిడీ చేత లేని లంబాడీ ఆడంగులు తమ దరిద్రానికి ఏడుపులు మొదలుపెట్టారుట. లంబాడీ తండాల ఆక్రోశానికి ధనికవర్గాలు నవ్వుకుంటుంటే ఉడుక్కుంటూ 'మాకీ జూసి నగ్తర్/మీకీ తలిదండ్రి లేవె మీ నే తు/ప్పాకీ తీస్కొని కొడ్తే/మాకీ పాపంబిలేద్రె..'అంటూ ఆ బీద మహిళలు షష్టాష్టకాలకు దిగడం చదివితే నవ్వు వస్తుంది.. ఆనక మనసుకు కష్టమేస్తుంది. తమ మతస్తులను అన్యమతానుయాయులు అవహేళన చేసే అవలక్షణాన్ని అన్యాపదేశంగా నిరసించే కవి ప్రతిభకు జోహార్లు చెప్పాలనీ అనిపిస్తుంది.
'సాయిబులకు తెలుగు సరిగా రాదు' అంటూ ముస్లిం పాత్రలకు 'నీకీ.. నాకీ' అంటూ తెలుగు నాటకాలు, చిత్రాలు తరచూ హేళన చేస్తుంటాయి ఇప్పుడు కూడా. నిజానికి నిత్య వ్యవహారంలో తెలుగు నేలల మీద.. ముఖ్యంగా దక్షిణాదిన ఏ ముస్లిమ్ మతస్తుడూ ఆ తరహా వెకిలి యాసతో మాట్లాడడు. ఏదైనా కొంత మాటలో తేడా కనిపించినా అది భాషాభేదం వల్ల కాదు. సంస్కృతుల మధ్య ఉండే సన్నని తారతమ్యపు పొర కారణంగా సంభవించేది. చిత్రాలలో చూపించేటంత విడ్డూరమైన ఉచ్ఛారణ వినోదం కోసమైనా మంచి అభిరుచి అనిపించుకోదు కదా!
తెలుగువారి హిందీ, ఇంగ్లీషు, మరే తెలుగేతర భాషలలో కనిపించే ఉచ్ఛారణలోనూ ఓ విధమైన యాస సాధారణగా కనిపించే తీరే. వాస్తవానికి తెలుగుదేశాలలో శతాబ్దాల బట్టి తెలుగువారి సంస్కృతీ సంబంధాలలో పాలలో తేనెలాగా కలగలసిపోయిన ఘనత ఇస్లాం మతానుయాయులకు దక్కుతుంది.
నల్లగొండ జిల్లా చిత్తతూరు గ్రామానికి చెందిన ఇమామల్లీ సాహెబ్ అని ఒక కవిగారికి కులమతాలనే వివక్ష లేదు. కవి అని తనకు తోచిన ప్రతీ సాహిత్యజీవికి అంతో ఇంతో సాయంచేయడం ఆయన అలవాటు. మరో సాటి కవి ఎవరో (చమత్కార.పు.15) సాహెబుగారి ఔదార్యాన్ని 'అల్లాతుంకు సదా యతుం సె ఖుదచ్ఛచ్ఛాహి ఫాజత్కరే/ఖుల్లాహాతుగరీబు పర్వరినిగా ఖూబస్తునాం మైసునే/అల్లాదేనె మవాఫికస్తుహర్ దూస్రే కోయి నైహై ఇమా/ మల్లీ సాహెబ్ చిత్తలూరి పుర వాహ్వా దోయిలందార్బలా ' అంటూ ఉర్దూ మిశ్రిత ఆంధ్ర ఛందోపద్యంలో శ్లాఘిస్తాడు.
ఆంధ్రప్రదేశ్ ముస్లిం జనాభాలో అధిక శాతానికి ఉర్దూ పలుకు నోటి వరకే పరిమితం. అందులోనూ తెలుగువారిలాగా మాట్లాడేవారే ఎక్కువమంది. రాయడం దగ్గరకొచ్చేసరికే ముస్లిముల పాత్ర అటూ ఇటూ. తెలుగు సంస్కృతితో గట్టి అనుబంధం ఉన్నప్పటికీ వాజ్ఞ్మయంలో ఆ మేరకు బంధం ఎందువల్ల బలపడింది కాదో?! పరిశోధకులే నిగ్గుతేల్చవలసిన చారిత్రకాంశం ఇది.
ఈ సాధారణ సూత్రానికి మినహాయింపుగా ముస్లిం కవులు తెలుగులో సాహిత్య సృజన చేసిన మాట కొట్టిపారవేయలేం. రాసిలో కాకపోయినా వాసిలో తెలుగు సాహిత్యంతో పోటికి దిగగల సత్తా ఈ సాహిత్యానికి కద్దు.
మరుగున పడ్డ ముస్లిం కవులను గురించి మరుపూరు కోదండరామరెడ్డిగారు మరువలేని అంశాలు కొన్ని ప్రస్తావించారు. దావూద్ అనే ఇస్లామిక్ కవి 'దాసీ పన్నా' అనే కవితా ఖండిక దొరకబుచ్చుకుని చదువుకునే దొరబాబులకు ముస్లిం కవులు సాహిత్య సృష్టిలో ఒక్క ఆలోచనాధారలో మినహాయించి తతిమ్మా అన్నిటా సమవుజ్జీలేనని అంటారు. ఒప్పుకోక తప్పదు .
రాజపుత్రుడి రక్షణ కోసం, పన్నా తన పుత్రుణ్ని బలికావించింది. లోకపాపాల కోసం తన బిడ్డను బలి ఇచ్చానని చెప్పుకుంటున్న యొహోవా దేవుడికే ఇది పెద్ద సవాల్! ఎందుకంటే ఆయన చచ్చిపోయిన వాళ్లను కూడా బ్రతికించే శక్తి గలవాడు . కాబట్టి మూడో రోజుకయినా తన బిడ్డను సమాధిలోంచి తిరిగిలేపి తీసుకురాగలిగాడు.కాని పాపం , పన్నాకి ఆ శక్తిలేదు! అయినా పుత్ర త్యాగానికి వెనుకంజవేయలేదు. అందుకే ఆమె త్యాగమే గొప్పదని శ్లాఘిస్తూ దావూద్ హుస్సేస్ రాసిన ఈ కవిత ఎంతో కరుణరసార్ద్ర౦గ ఉంటుంది.
' సతత వాత్సల్యంబు జాల్వార్చి పోషింప/
తలపు గొన్నట్టి నీ తల్లిలేదు/
అఖిలార్ద్రతను నీకు నర్పించి/
మమతలం దలడిల్లునట్టి నీతండ్రిలేడు/
ఆత్మరక్తమై తమ్ముడంచు మించిన ప్రేమ/
నరసి పాలింప నీ అన్నలేడు/
రాజపుత్రుడితండు రక్షణార్హుడటంచు/
పరికించు పాలిత ప్రజయు లేదు/ దిక్కుదెసగలవాడవై దిక్కుగనక/
శోకసంతప్త భావనిస్తులత తోడ/
శత్రువుల మధ్య జిక్కిన సాంగపుత్ర/
నిన్ను పన్నాయె రక్షించు నిక్కమింక!' అంటారు కవి. ఎవరి మాటలు ఏ విధంగా సాగినప్పటికీ .. బలి అయిన ఆ అభాగ్య బాలుడిని అడిగితే ఏమని ఉండేవాడు? అని ఆయనే మానవతా హృదయంతో కంపించి ప్రశ్నించుకుంటూ ఆ మృతబాలుడి మనోభావాలనూ కవిగా తానే వెల్లడిస్తాడు
'మీ మీ స్వార్థాల కోసరంగా నోరులేని నన్ను బలిచేశార'ని వాదించడా? అని నిలదీస్తాడేమోనని సందేహిస్తాడు. మానవత్వం సహజలక్షణంగా లేని వ్యక్తులకు ఈ తరహా భావనలు మదిలో మెదిలే అవకాశమే లేదు. దావూద్ సాహెబ్ కవి ముస్లిం మతానుయాయుడు అయినంత మాత్రాన మనిషిలో ఉండవలసిన అనుకంపన లేకుండా పోయిందా?
మానవతా విలువలకు మతాలను అడ్డుపెట్టుకుని వ్యాఖ్యానించడం ఎంత పెద్ద తప్పు! అదే ఇప్పుడు దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న అరాచకం ! ఆ దుర్మార్గాన్ని ప్రశ్నించిన ఆలోచనాపరుల పైన దేశద్రోహం అభియోగం రుద్దే జుగుప్సాకరమైన ప్రయత్నమూ యథేచ్ఛగ సాగుతున్నది! షేమ్ ఆన్ అవర్ పార్ట్! సిగ్గు పడవలసిన అమానుషత్వం!
ఇంత విపులంగా ఇక్కడ చెప్పుకురావడానికి కారణం ఈ పద్య గద్య సాహిత్యంలో ఎక్కడైనా మన తెలుగు సినిమాలు హేళనచేస్తున్న లోపం కనిపిస్తున్నదా? ఈ పుస్తకం రాసింది ఒక ముస్లిం మతానుయాయి అన్న వాస్తవం చెవినబడితే విస్తుపోమా ? పుట్టింది ముస్లిం సంప్రదాయం అనుసరించే కుటుంబంలలోనే అయినా.. దావూద్ సాహెబ్ తరహాలో ఇస్లాం సంప్రదాయంలో నాని, హిందూ వేదాంతంలో ఊరిన ఎందరో ముసల్మాన్ కవులు చరిత్ర విస్మృతి పొరల్లోకి వెళ్లిపోయినట్లు మరుపూరివారి ఆరోపణ. ఇరవైయ్యొకటో శతాబ్దిలోకి అడుగు పెట్టినప్పటికీ అదే వివక్ష కొనసాగడం హర్షణీయమా?
కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు. ఆదర్శము లాంటి నవలలు , అబ్దుల్ ఖాదర్ జిలాని దివ్య చరిత్రము, నాగూర్ ఖాదర్ వలీ చరిత్రము వంటి మహాపురుషుల జీవితచరిత్రలు, ఆజాద్ చరిత్రము లాంటి దేశ చరిత్రలు, ఆఖరుకి అభినవ తిక్కన కవితా సమీక్ష వంటి లోతైన సాహిత్య విమర్శనలు సైతం ముస్లిం కవి అయినప్పటికీ ఆయన చేతుల మీదుగానే ఏ తెలుగు పండితుడి రచనకూ తీసిపోని రీతిలో రూపుదిద్దుకున్నాయి!
సాహిత్యం పట్ల అభిరుచి అంటూ ఉండటం ఒక్కటే ముఖ్యం. ఆ ప్రధానమైన దినుసు మనదై ఉంటే దావూద్ సాహెబ్ లా రూపాయిన్నర పెట్టుబడితో పెట్టుకొన్న కిళ్లీ బడ్డీకొట్టు కూడా మనిషిలోని అక్షర తృష్ణను రెచ్చగొడుతుంది. ఏ మతం, ఏ కులం ఆ అభినివేశపు పురోగతికి అడ్డు కాలేవు.
అలనాటి సుప్రసిద్ధ నెల్లూరు కవులు మరుపూరు కోదండరామిరెడ్డి, పిలకా గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డివంటి వుద్దండులు నిత్యం సాయంత్రపు వేళలలో తన ‘సాహిత్య తాంబూల సేవన మంజూషా” (కిళ్లీ కొట్టుకి కవులు పెట్టుకున్న ముద్దు పేరు అది) లో చేరి, తమతమ పద్య రచనా పఠనంపై గోష్టులు గావించడం ముస్లిమైన దావూదు కవిలో తెలుగు సాంప్రదాయక పద్యరచన పట్ల ఆసక్తిని రేకెత్తించింది . ప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి ఆశ్రయంలో విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే సమయానికి దావూద్ సాహేబు ఇరవైరెండు ఏళ్ల ఆడపిల్ల తండ్రి!
' సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నందుకు రాళ్ల దెబ్బకు సిద్ధంగా ఉండమ'ని ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ వెనుకంజ వేయని దుర్భావారి నిర్భీతి ఇప్పుడైనా ఎంత మందికి ఉంటుంది?
సంస్కృతాంధ్రాలలో మదరాసు విశ్వవిద్యాలయం విద్వాన్ పట్టా పుచ్చుకుని నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరి మొదటి నెల జీతం గురుదక్షిణ కింద మనియార్డరుగా దావూద్ సాహెబ్ పంపిస్తే 'నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దుర్భావారు ప్రదర్శనకు పెట్టి మురిసిన మరపురానిరోజులు మళ్లీ వచ్చేనా! చిత్త పరివర్తనము, రసూల్ ప్రభువు శతకము, సంస్కార ప్రయాణము, సూఫీ సూక్తులు, సాయిబాబా మీద దండకంతో సహా ఓ కావ్యము, ఆజాద్ చరిత్రము, వచనంలో అభినవ తిక్కన కవితా సమీక్ష.. అట్లా దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల్లో తన దైన ముద్రతో తెలుగు సాహిత్యంలో గౌరవనీయమైన స్థానం సాధించిన ఘనత దావూద్ సాహెబ్ కవిది.
ఇస్లాము మతాన్ని విశ్వసించే సాహిత్య స్రష్టలు సృష్టించినవిగా చెప్పుకునే తెలుగు శతకాలే సుమారు మూడు పదులు . వికీపీడియాలో కనిపించే ఆ జాబితా ఆసాంతం పరిశీలిస్తే హిందూ కవుల ధోరణిలోనే ముసల్మాను కవులూ శతక సాహిత్యంలో తమకు సుపరిచితమైన భక్తి, తాత్విక విశేషాలనే ప్రబోధాత్మక పంథాలో ప్రకటించినట్లు స్పష్టమవుతుంది.
ముహమ్మద్ హుస్సేన్ అనే ముసల్మాన్ కవి 'భక్త కల్పద్రుమ శతకము'పేరుతో ఒక చక్కని శతకం రాసారు. ఈ పేరుతోనే పదహారణాల తెలుగు కవుల (బత్తలపల్లి నరసింగరావు, మేడవరము సుబ్రహ్మణ్యశర్మ, ఖాద్రి నరసింహ సోదరులు) చేతుల మీదుగా మరో మూడు శతకాలు రూపుదిద్దుకున్నప్పటికీ హుస్సేన్ కవి శతకం దానికదే ప్రత్యేకం. మొక్కపాటి శ్రీర్రామశాస్త్రిగారితో కలసి మొహమ్మద్ హుస్సేన్ రాసిన మరో శతకం 'సుమాంజలి'. హరిహరనాథ శతకము అనుగుబాల నీతి శతకము, తెనుగుబాల శతకము మరి కొన్ని!
ఆ దారినే సయ్యద్ ముహమ్మద్ అజమ్ అనే మరో ముసల్మాన్ కవి 'సయ్యదయ్యమాట సత్యమయ్య' మకుటంతో, గంగన్నవల్లి హుస్సేన్‌దాసు 'ధర్మగుణవర్య శ్రీ హుసేన్ దాసవర్య' మకుటంతో 'హుస్సేన్‌దాసు ముస్లిమ్ శతక సాహిత్యం సృష్టించారు. ముహమ్మద్ యార్ 'సోదర సూక్తులు', తక్కల్లపల్లి పాపాసాహెబ్ కవి మతవిభేదాలను విమర్శిస్తూ ' వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమేదియనె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట' అంటారు.
షేక్ ఖాసిం 'సాధుశీల శతకము'లో 'కులము మతముగాదు గుణము ప్రధానంబు/ దైవచింత లేమి తపముగాదు/, బాలయోగి కులము పంచమ కులమయా,/ సాధులోకపాల సత్యశీల' అంటూ సుద్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. షేక్ అలీ గురుని మాట యశము గూర్చుబాట' అనే మకుటంతో 'గురుని మాట' శతకం రాస్తూ 'ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన /పాండితీ ప్రకర్ష పట్టుబడదు/ పరులభాష గాన భాధను గూర్చును/గురుని మాట యశము గూర్చు బాట' అన్నారంటే మతాలతో నిమిత్తం లేకుండానే సమాజ సంస్కరణల పట్ల సాహిత్య ప్రగతిశీలులందరిదీ ఒకే బాట- అన్న మాట ఖాయమైనట్లే కదా!
సమకాలీన సమాజం నుంచి వ్యక్తులను, వర్గాలను రకరకాల సమూహాల వంకతో వేరు చేసే ప్రయత్నంలోని రాజకీయ ఎత్తుగడలతో సాహిత్యానికి, సమాజానికి నిమిత్తం ఉండదు. ఎక్కడి సంస్కృతితోనే ప్రభావితమైన శక్తులు ఇక్కడి పరిసరాల కాలుష్యానికి కారణమని దుష్ప్రచారం నిరాటంకంగా కొనసాగినప్పటికీ లౌకిక సమాజం ఆమోదించదు.
ముసల్మానుల సాహిత్య ప్రయాస ఇచ్ఛాపూర్వకంగా నిర్లక్ష్యానికి గురవుతున్న మాట అవాస్తవేమీ కాదు కానీ.. ఉనికి పోరాటాలు ఊపందుకున్న 1990 లకు చాలా ముందు నుంచే అన్ని దశల్లోనూ యథాశక్తి తన వంతు ప్రతిభతో ప్రభావితం చేస్తూనే వస్తోందన్నది మొహమ్మదీయ మతం అన్నది ఒప్పుకోక తప్పని వాస్తవం.
కుడి నుంచి కుడి వైపుకు రాసుకు పోయే లిపి ఉర్దూ. ఎడమ నుండి కుడికి రాయడమంటే ముసల్మానుల దృష్టిలో పెడరాతల కిందే లెక్క. ఆ తరహా రాతలను నిరసించమని వారి మతం నివారిస్తున్నప్పటికీ పెడచెవినబెట్టి తెలుగు సాహిత్య వర్ణమాలకే గులాబిమాలలు సమకూర్చి పెట్టిన ఘనత ఇస్లాం కవిశ్రేష్టులది.
ఉర్దూ మాతృభాషగా ఉన్నప్పటికీ లెక్కకు మించిన సాహిత్యవేత్తలు తమ ప్రతిభతో తెలుగు సాహిత్యలక్ష్మికి తొడిగిన సందర్భాలు కోకొల్లలు. తెలుగు పత్రికా రంగంలో తొట్టతొలిగా పాదం పెడుతూ 1842, జూన్ 8 మొదటి 'వర్తమాన తరంగిణి' వారపత్రిక తొలి సంచికలో 'మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి' అని రాసుకున్నారు సయ్యద్‌రహమతుల్లా సాబ్!
1891 లో నరసాపురం నుంచి మీర్ షుజాయత్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో సాగిన 'విద్వన్మనోహారిణి' తదనంతరకాలంలో వీరేశలింగంగారి 'వివేకవర్ధని' లో కలసిపోయింది. రాజమండ్రి నుండి వెలువడ్డ 1892 నాటి బజులుల్లా సాహెబ్, 'సత్యాన్వేషిణి, 1909 నాటి షేక్ అహ్మద్ సాహెబ్ 'ఆరోగ్య ప్రబోధిని' ముసల్మానుల తెలుగు పాత్రికేయ రంగంలో చేసిన సేవలకు కొన్ని నిదర్శనాలు. 1944 లో హైదరాబాదు నుంచి వెలువడ్డ 'మీజాన్' దినపత్రికకు తెలుగు ప్రసిద్ధ రచయిత అడవి బాపిరాజు సంపాదకులుగా సహకారం అందించారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారి 'తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది. సయ్యద్ సలీం నవల ' కాలుతున్న పూలతోట' 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించింది. వేంపల్లె షరీఫ్ కథల పుస్తకం 'జుమ్మా' 2012లో కేంద్రసాహిత్య అకాడెమీ యువ అవార్డు గెల్చుకున్నది.
సయ్యద్ నశీర్ అహ్మద్ 'అక్షర శిల్పులు' పేరుతో 333 మంది తెలుగు ముస్లిం కవులు, రచయితల వివరాలతో 2010 లో సమాచార గ్రంథం వెలువరించడం .. తెలుగు సాహిత్య లోకంలో ఉర్దూకవుల పాత్రను తగ్గించి చూడలేమని చెప్పడంగా అర్థం చేసుకోవడం మేలు.
'సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా/హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁ హమారా, హమారా'('సమస్త ప్రపంచములలో ఉత్తమైనది మన హిందూస్థాన్.. ఇది మనదే.. మనదే!మనం దీని బుల్ బుల్ పిట్టలం సుమా!ఈ దేశం ఈ దేశమే మన ఉద్యానవనం మిత్రమా!) సెప్టెంబర్ 23, 1964 నాటి మహమ్మద్ ఇక్బాల్ పాట అయినప్పటికీ ముస్లిమ్ సోదరసోదరీమణుల మనోరథం ఇప్పటికీ ఇదే! దేశం లౌకిక తత్వానికి సంకేత సూచకంగా ఈ గీతాన్నీ మనం మన జాతీయగీతాలలో ఒకటిగా మలుచుకున్న లౌకిక భావం మర్చిపోతున్నామా? 'పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలూ చెలరేగే నేడు' అంటూ మహాకవి శ్రీశ్రీ వాపోయాడు వెలుగు నీడలు సినిమాలో. అరైవై ఏళ్లనాటికన్నా అధ్వాన్నంగ ఉంది ఈనాటి పరిస్థితి!
' లుచ్ఛా జమానా ఆయా/అచ్ఛోంకో హాథ్ దేనా హర్ ఏక్ సికా/ అచ్ఛా జమానా ఫిర్ కబ్ / వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబు!' (చెడ్డవాళ్ల కాలం వచ్చింది. చెయ్యివ్వడమే ప్రతివాడు నేర్చేసుకుంటున్నది. మంచిరోజులు ఎప్పుడు వస్తాయో చెప్పవయ్యా వల్లీసాహెబూ? అని ఓ శాస్త్రులుగారు పోయిన వాపోతకు ఆ వల్లీసాహెబుగారు 'బందేనవాజ్ బుజురుగ్ /జిందా హై ఆజ్ తో న జీతే హమ్ ఖుదా/ బందాహి జానె వహాసబ్/గందరగోళం జమాన ఖాజాసాబూ! (దేశసేవకులు, పుణ్యపురుషులు (చేసిన మంచి పనుల వల్ల) శాశ్వతంగా ఉన్నారు. మనం అట్లా జీవించలేం. దైవభక్తుడు, సేవకుడు ఆ విషయం తెలుసుకోడం మేలు. ఇప్పడు వచ్చిందంతా గందరగోళంగా ఉండే కాలం కదా ఖాజాసాబూ?) అంటూ ఆ వల్లిసాబుగారు జవాబు ఇచ్చారని ఓ సరదా కవిత్వం. అల్లికలో సరదా కనపడుతున్న మాట నిజమే కానీ, పద్యాలలో ప్రస్తావించిన దైన్య స్థితి మాత్రం ఈ హిందూ- ముస్లిమ్ మత భేదాల కారణంగా దేశంలోని సామరస్య వాతావరణం దెబ్బతింటుందోన్న వాస్తవం అందరం ఒప్పుకోవాలి.
మెహబూబ్ నగర్ జిల్లా మొదటి పేరు పాలమూరు జిల్లా. కరువుకాటకాలకు ఆ జిల్లా మారుపేరు. పనిపాటలు చేసుకుని పొట్టపోసుకునే జనాభా అధికంగా ఉండేదీ అక్కడే! అనావృష్టి పరిస్థితులకు అక్కడి జనాభా తరచూవలసబాట పట్టే పరిస్థితులను కదలిపోయి 'తూఫాను వానలే తుదికి గతియాయె/ఋతుపవనాలెల్ల గతిని దప్పె/చెఱువులు కుంటలు దొరువులు జాలులు/ఇంకి నెఱ్ఱెలు వారె బంకమట్టి/వర్షాలు కురియక కర్షకులెల్లరు/ బ్రదుకుదెరువు బాసి బాధపడుచు/గొడ్డు గోదముల నెల్ల గడ్డి గాదెము లేక/దుడ్డుదమ్మిడికమ్మి దుఃఖపడుచు/లేబరై గుంపుగుంపుగ లేవసాగె/తాళములు వేసి ఇళ్లకు తల్లెచెంబు/కుదువబెట్టుచు కూటికై వదలి రిపుడు/పల్లెలెల్ల లబోమని తల్లడిల్లె' అంటూ ధుఃఖంతో జహంగీర్ మహమ్మద్ అనే ముసల్మాన్ కవి అచ్చమైన తెలుగు పలుకుబడిలో వెళ్లగక్కిన ఆవేదన ఏ ముస్లిమేతర కవి సాధించగలిగేది ?
కదిలితే తెలుగు కవిత, మెదిలితే తెలుగు మాటగా బతికిన ముసల్మాన్ కవుల జాబితా కదిలించాలే గాని హనుమంతుని తోకంత! విందుకు పిల్చి రోసెన్న అనే పెద్ద మనిషి పాచి అన్నం పెట్టినందుకు విస్తరి ముందు నుంచి లేచిపోతూ హుస్సేన్ మహమ్మద్ అనే రాయలసీమ కవి 'అయ్యవ! మియ్యవ!కొయ్యవ!/చయ్యన చల్దన్నమేసి సరిపుచ్చెదు రో/శయ్యా పిన్నలు పెద్దలు/కుయ్యోమనుచున్న యిట్టి గోడును గనవా!' తిట్టిపోసాడు. ఆ సందర్భంలో హుస్సేన్ సాబ్ నోటి నుంచి వెలువడిన ఆవేదన 'అక్కట దయలేదా మరి/బుక్కెడు కూటికిని కటకటంబుట్టించితిరో!/కుక్కవొ నక్కవొ తిక్కవొ!/చిక్కడు నీ వంటి లోభి సిద్ధము వినరా!' అనే ఆవేదన ఇప్పటి వాతావరణంలో ఆ మైనారిటీ జాతి ఎదురుకొనే అవమానాలకు దర్పణం పట్టినట్లనిపిస్తుంది కదూ! 'భక్త కల్పద్రుమ శతకము కర్త మహమ్మదు హుస్సేన్ ఈ హుస్సేస్ సాబ్ అవునో కాదో తెలియదు. సాహేబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే! అన్నట్లుంది దేశంలో ఉర్దూ పౌరుని దైన్య స్థితి.
-కర్లపాలెం హనుమంతరావు
23 - 99-2021
బోధెల్ ; యూ. ఎస్.ఎ
No comments:
Post a Comment