సరదాకే!
డబ్బులు గొప్పా- చర్చిలు గొప్పా-
- కర్లపాలెం హనుమంతరావు
చర్చిల్ పేరు తెలీనివారు ఉండరంటే అతిశయోక్తికాదు.
మాట తీరుతో ఆకట్టుకునే గుణం ఆయనకు ప్రత్యేకం.
ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఒకసారి బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది.
రేడియో స్టేషనుకని బయలుదేరాడు. పాపం దారిలో కారు పాడయిపోయింది. అటుగా వెళ్తున్న కార్లను ఆపాలని ప్రయత్నించాడు. కానీ చీకటి పడటంతో ఎవ్వరూ ఆయనను గుర్తుపట్టక వాహనాన్ని నిలపలేదు.
చివరికి ఓ టాక్సీ రావటం చూసి దారికి అడ్డంగా నిలబడ్డాడు చర్చిల్.
బండి ఆగింది. డ్రైవరు తొంగి చూసి
" అడ్డం లేవయ్యా!, అర్జంటుగా ఇంటికి వెళ్లాలి. రేడియోలో చర్చిల్ స్పీచ్ వచ్చే టైం అయింది! " అంటూ విసుక్కున్నాడు.
"పది పౌండ్లు ఇస్తాను, రేడియో స్టేషనులో డ్రాప్ చేస్తావా?" డ్రైవర్ని బతిమాలాడాడు చర్చిల్.
అయితే తమాషా చూద్దామనుకున్నాడో, లేకుంటే తన కోసం ఆదాయాలు కూడా వదులుకునేవారున్నారని చెప్పుకునేందుకోగానీ, తనే చర్చిలని మాత్రం వెల్లడించలేదు.
"కుదరదు" అంటూ డ్రైవరు తలుపేసుకోబోయాడు.
"అయితే ఇరవై పౌండ్లు ఇస్తాను" బేరానికి దిగాడు చర్చిల్.
దాంతో డ్రైవరు ఒక్క క్షణం తటపటాయించి "సరే! ఎక్కు!" అన్నాడు.
దారిలో డ్రైవర్ని చర్చిల్ అడిగాడూ "మరి నీ అభిమాన నాయకుడి ప్రసంగం మిస్సయిపోతున్నావేమో గదా పాపం!"
దానికి "అయితే ఏంటంట? ఆయన కబుర్లు వింటూ కూర్చుంటే నా కడుపు నిండుతుందా?? నాకు ఆయనకులాగా మాటలు చెప్తే డబ్బిచ్చే వాళ్లెవ్వరూ లేరు కదా! అనేశాడు డ్రైవరు.
అందుకే అంటారు డబ్బు ముందు ప్రేమలూ, అభిమానాలూ బలాదూర్ అని. ఈ సత్యమే డ్రైవరు ద్వారా ఆనాడు చర్చిలుకూ చక్కగా బోధపడిందిd.
No comments:
Post a Comment