ఆత్రేయ గోత్ర నామం: మన'సు కవి'
అసలు పేరు: కిళాంబి వేంకట నరసింహాచార్యులు
పేరు తెచ్చిన పేరు: ఆచార్య ఆత్రేయ
ఆచార్య అంటే ప్రొఫెసర్ కాదు. అసలు పేరులోని తోక. రాయటం రాని రచయిత. ఎంతసేపటికీ ఎదుట కూర్చున్న రాతగాడికి డిక్టేట్ చేయటమే. రాత్రి సుష్టుగా భోచేసి, వెంటనే పడుకుని, రెండు గంటల వేళ లేచి తెల్లారే వరకూ రచనలు చేసే ఆత్రేయ - 'రాత్రేయ' బూతు పాటలు రాస్తారు గనుక 'బూత్రేయ'. ఎవరేమని పిలిచినా పట్టింపులేని మనస్తత్వం అంటారు ఆయనది. హాస్య స్ఫూర్తి ఉన్నా హాస్యం రాయటం రాదు. రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్నీ ఏడిపించే మనసుకవి. మన 'సుకవి'. సరస్వతీ పుత్రుడేగానీ, లక్ష్మీపుత్రుడుగాదు. పొద్దున పదివేలు చేతి కొస్తే సాయంకాలానికి ఖాళీ! శుక్రవారంనాడు నిర్మాతల్నుంచి చచ్చినా ఒక్క పైసా రాలదు. కానీ ఆయన సాధించేవాడు! 'ఏ రోజు ఎంత కావాలో తెచ్చుకో! రేపటికి దాచుకోవద్దు!' అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా 'చిన్నారి మనసులు' చిత్ర నిర్మాణానికి పూనుకున్న మహానుభావుడు. డబ్బు పెడతానన్న ఓ పెద్దమనిషి మాటల్ని నమ్మి సినిమా యజ్ఞానికి పూనుకుని సమిధగా మారిన ఎందరో మహానుభావుల్లో ఆత్రేయ మొదటివాడు కాదు, చివరి వాడూ కాదు. చివరికి చేసేది లేక 'చిత్రం'గా అనుకున్నదాన్ని 'పిల్లలతో చెలగాటం - పెద్దలకే ఇరకాటం' పేరుతో దూరదర్శన్ కు పదమూడు భాగాలుగా తీయాల్సి వచ్చింది. కాల్చుకోవాల్సి వచ్చింది. . చేతులు
చివరి దశలో పెద్ద ఇల్లుపోయి చిన్న గదుల ఓ మేడమీద ఓ చిన్ని వాటాలో చిన్ని మంచం మీద గడిపినవాడు.
"మనిషి పుట్టినప్పుడు ఎలా ఉంటాడో. (గిట్టనప్పుడు) గిట్టనప్పుడూ అలాగే ఉండి 'పోతాడు'. చివరి దశా తొలిదశ ఒకేలాగా మారటం అంటే ఆ మనిషి జీవితం అనే గీతంలో పదాలు, చరణాలు.. సరిగ్గా పడలేదనే అర్ధం" అంటాడు ఆత్రేయ వేదాంత ధోరణిలో! ఎంతయినా మనసు కవి కదా!
' సీను రాస్తే రాత్రేయే రాయాలి' అనిపించుకున్నాడుగానీ, 'బ్రతికితే ఆత్రేయలాగే. బ్రతకాలి' అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. అతని ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యమే అందుకు కారణం. '
- కర్లపాలెం హనుమంతరావు
( రియల్ ఎస్టేట్స్ - మాసపత్రిక - ధనమూలం ఇదం జగత్ కాలమ్ - ప్రచురితం )
No comments:
Post a Comment