ఇప్పుడే చదివాను . ముగిసిన తరువాత మనసంతా అదోలా చేదయిపోయింది .
మనిషి జీవితంలోని కష్టసుఖాలకు తిండి, బట్ట, తలదాచుకునే ఇంత నీడ .. ఇవి కరవు అవడమే కారణమనుకుంటాం సాధారణంగా. నిజమే ఇవి ప్రాథమిక అవసరాలే .. తీరనప్పుడు జీవితం దు:ఖ భాజనం తప్పక అవుతుంది. ఇవన్నీ ఆర్థికంతో ముడిపెట్టుకుని ఉన్న అంశాలు . చాలినంత డబ్బు సమకూరితే ఇక మనిషికి ఏ తరహా కష్టాలు ఉండవు. కష్టాలు ఉండనంత మాత్రాన బతుకంతా సుఖమయమయిపోతుందనా అర్ధం? జీవితం ఒక ముడి పదార్థం మాత్రమే అయితే, లాజిక్ ప్రకారం నిజవే అనిపిస్తుంది. అదే నిజమైతే మరి బాగా డబ్బుండి ప్రాథమిక అవసరాలు అన్నీ తీరిపోయే వారికి ఇక ఏ కష్టాలు ఉండకూడదు. . కదా మరి ? కానీ వాస్తవ జీవితాలు ఆ విధంగా లేవే! అన్నీ సదుపాయాలు సమకూరి బైటికి సలక్షణంగా జీవితం గడుపుతున్నట్లు కనిపించేవాళ్లూ లోలోన ఏవో కుంగుబాటుల్లో .. తాము పరిష్కరించుకోలేని తాము ఏర్పరుచుకోని కట్టుబాటుల మధ్య ఇరుక్కుపోయి బైటికి రాలేక... వచ్చే మార్గం తెలేక .. తెలిసిన వాళ్లు అందుబాటులో లేక అనుక్షణం బైటికి చెప్పుకోలేని సంక్షోభం మధ్య నలిగిపోతుండటం కనిపిస్తుంది. అట్లాంటి నిష్ప్రయోజనమైన, నిరాధారమైన ( మూఢ ) విశ్వాసాల మధ్య ఇరుక్కుని నలిగిపోయే బడుగు తరగతి సంసారుల సంఘర్షణ ఇతివృత్తంగా అల్లిన వేంపల్లి షరీఫ్ 'పర్దా' కథ కరుణరసార్ద్రంగా ఉంది.
కథలో రచయిత ప్రధమపురుషలో వినిపిస్తున్నట్లు అనిపించే దిగువ మధ్య తరగతి పట్టణ ముస్లిం కుటుంబ నేపథ్యంలోని ఒక ముసలి అవ్వ కథ ఇది . కాని, నిజానికి ప్రతి ముస్లిం పేద కుటుంబంలోనూ పొద్దు వాటారే దశలో ఉండే స్త్రీలు ఎదుర్కొనే విచిత్రమైన సమస్యను ఈ కథకు వస్తువుగా ఎంచుకున్నందుకు రచయిత అభినందనీయుడు .
ఇస్లాం కుటుంబాలలో ఇప్పటికీ ' పర్దా' పద్ధతి స్త్రీ లోకం పాలిట ఒక పెను శాపంగానే లోలోపల రగులుతూనే ఉంది. ప్రభుత్వం తాను తెచ్చినట్లు చెప్పుకునే చట్టాలు నిత్య జీవితాలలో ఆమోదయోగ్యమై ఆచరణ స్థాయి దాకా ఎదిగిరావాలంటే ముందు అందుకు సంబంధించిన సమాజాలలో మానసికపరమైన పరిణతి స్థాయి పెరగడం అవసరం . ఆచరణ స్థాయి దాకా తీసుకురాలేని సంస్కరణలు ఎన్ని సంక్షేమ పథకాలు, చట్టాల రూపంలో ప్రదర్శనకు పెట్టినా అవి కేవలం ఏ బుక్కుల్లోనో నమోదయి .. ఉండేందుకు, మరీ అత్యయిక పరిస్థితుల్లో ' షో ' చేసేందుకు మాత్రామే పనికివస్తాయి.
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉండి వెంటనే పెళ్లి చేసి పంపేయగల తాహతు లేని ముస్లిం కుటుంబాలలో ' పరువు ' భయం కోసం పరదాల మరుగున ఆడపిల్ల సరదా సంతోషాలకు ఓ రెండు గదుల హద్దులు గీసేయటం ఒక అమానుష దృశ్యమయితే .. ఏ పరదాల మరుగునా తిరిగే అవసరం లేని గ్రామీణ వాతావరణంలో బిడ్డల ఎదుగుదల కోసం మత విన్వాసాలను కూడా కాదనుకుని సంసారం నెట్టుకొచ్చిన ఒకానొక తరం నాటి ముసలవ్వ ఇప్పుడు ఆ పర్దా .. గోషాల మధ్య కొత్తగా ఇరుక్కుని మసలవలసిన పరిస్థితులు తోసుకురావడం మరింత అమానుషంగా ఉంటుంది. తెంచుకోలేని మతమూఢ విశ్వాసాల మూలకంగా మానవ సంబంధాలు, కుటుంబసంబంధాలు, చివరికి పేగు బంధాలు కూడా ఎంతటి కఠిన పరీక్షకు నిలబడవలసి వస్తుందో అతి సహజంగా చిత్రించాడు రచయిత. కధ ఆసాంతం ఎక్కడా ఏ అతిశయోక్తులు.. అలంకారాల జోలికి పోకుండా నిరలంకారప్రాయంగా రచయిత చెప్పుకొచ్చిన శైలీ శిల్పాల కారణంగా కథ చదివినంతా సేపే కాదు , చదిలిన తరువాతా చెదిరిన మనసును కుదుటపడనీయదు .
కాలం మినహా మరెవ్వరూ పరిష్కారం చూపించలేని ఈ తరహా సమస్యలను ఎప్పటికప్పుడు సాహిత్యంలో చర్చించకపోతే.. సమాజం సంస్కారయుతంగా మారాలన్న ఆలోచనే ఆరంభమయే అవకాశాలు సన్నగిల్లిపోతాయి.
తనకు తెలిసిన తన ప్రపంచపు తమ ఒకానొక తీవ్రమైన సమస్యను పది మంది ముందు ఏ మెహర్చానీ పెట్టుకోకుండా చక్కని కథ రూపంలో చర్చకు పెట్టి ప్రగతిపథకాముకుల మనసుల్లో అలోచనలను ప్రేరేపించినందుకు మిత్రుడు వేంపల్లి షరీష్ బహుధా అభినందనీయుడు! సాహిత్య లోకం నుంచి కృతజ్ఞతలకు అర్హుడు. 👏👏❤️✌️😎
- కర్లపాలెం హనుమంతరావు.
5, డిసెంబర్ 2020
బోథెల్; వాషింగ్టన్ రాష్ట్రం
యు.ఎస్.ఎ
వాట్సప్: +918142283676
No comments:
Post a Comment