Tuesday, July 7, 2015

దోమాయణం- ఓ సరదా గల్పిక



‘స్వచ్చ భారత్ వంకతో మోదీజీ దేశవాసులదరిచేతా తెగ చీపుళ్ళు పట్టిస్తున్నారు. బాగుంది.  దక్షిణ తైవాన్లో  శుభ్రతకోసం ఇంతకన్నా దివ్యమైన  పథకం  మరోటి ప్రచారంలోకొచ్చిందీ మధ్య. ఎవరెక్కువ దోమల్ని  చంపి తెచ్చి చూపిస్తే  వాళ్ళకి వంద అమెరికన్ డాలర్లు మొదటి బహుమానం. మిగతా ఔత్సాహికులకేమో దోమతెరలు.. ఓడోమస్ గొట్టాలు! బహుమానాలనగానే యమగ్లామరుగదా!  ఇప్పుడు అక్కడ  ఎక్కడ చూసినా మశకమహాశయులకోసమే పరుగు పందేలు!  ఒక్కోదోమవెంట పదిమంది ఉరుకులు పరుగులు.. చప్పట్లు కొట్టుకుంటూ! మన త్యాగరాజయ్యరువారి వర్ధంతి  జయంతుల నాటి   నగరసంకీర్తన దృశ్యాలే ప్రతిక్షణం ప్రస్తుతం మనకు అక్కడ కనిపించేవి!
దోమల్ది మనుషుల్ది రక్తసంబధం .  మనం  మనస్ఫూర్తిగా ఎవరికీ చప్పట్లు కొట్టం ఒక్క దోమలకు మినహా.  దేవుడే కంటి ఎదురుకొచ్చి నిలబడ్డాసరే  రెండు చేతులూ ఎత్తి నమస్కరించని శుద్ధనాస్తికుడైనా.. పడక ఎక్కిన తరువాత దోమ కంటపడితే రెండుచేతులకూ పని చెప్పక తప్పదు.
మనిషిని సృష్టించిన దేవుడే దోమనూ సృష్టించాడని  మర్చిపోరాదు. ఒక్క మానవుణ్ణే సృష్టించి వదిలేస్తే.. వాడు పెట్టే 'గీ..బే' లకి తన నిద్ర భంగమవుతుందని తెలుసు. కాబట్టే ఆ నసగాడికీ నిద్రరాకుండా దోమను సృష్టించి వదిలిపెట్టాడు గడుసుగా.
నారుపోసే 'వాడు' అన్నిజీవులకు నీరు పోస్తూ.. ఒక్క దోమలకు మాత్రమే  ప్రత్యేకంగా రక్తం  ధారపోసాడు. అదీ మన మానవరక్తం! దోమల్ని తిట్టడం అన్యాయం.  ఫలితం శూన్యం. రెండుచెవులున్న మనుషులే తిట్లను పెద్దగా పట్టించుకోనప్పుడు.. చెవులే లేని దోమలు మన మొర ఆలకిస్తాయనుకోవడం దురాశ. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపగలవేమోగానీ.. దోమల ఆగడాన్ని ఆపడం కుదరదుగాక కుదరదు.
దేవుడు మనకు చేసిన మహోపకారమల్లా  దోమల్ని  సూక్ష్మరూపంలో సృష్టించడమే!  ఏనుగులకుమాదిరి భారీకాయాలతోగానీ  దోమలు ఎగరడం మొదలుబెడితే చెవుల చుట్టూనే  నిత్యం షంషాబాద్ విమానాశ్రయం సందడి వినబడుతుండేదిగదా! నలుసంత  ఉండబట్టి చప్పట్లుకొట్టి దోమని మట్టు బెడుతున్నాం. భారీశరీరాలతోగాని దోమలు దాడిచేయడం మొదలుపెడితే ఎదురుదాడికి  మన రెండుచేతులేం మూలకు? ఈటెలూ.. బరిసెలూ..బాంబులూ పట్టుకుని  అడవి మనుషులు.. ఉగ్రవాదులకు పోటీగా రంగంలోకి దిగాల్సొచ్చేది . కార్తవీర్యునికిమల్లే సహస్ర బాహువులతో జన్మించే అదృష్టం అందరికీ  ఉండద్దూ!
శేషశయనుడికే ఈ దోమల బెడద తప్పిందికాదు.  ఆదిశేషుడి పడగల కింద ఆ ముక్తిప్రదాత తలదాచుకుంది బహుశా ఈ దోమల దాడినుంచి విముక్తికే అయివుండచ్చు. కైలాసనాథుడి కష్టాలైతే మరీ కడుపు తరుక్కుపోయేవి. వంటిమీద నూలుపోగైనా లేకుండా మంచుకొండలమీద కాపురం ఉంటున్నా..  దోమాసురుల తాకిడికి తాండవాలు తప్పడంలేదు. ముక్కోటి గణాలు ఉండీ ఏం లాభం? ఏ ఒక్కశ్రేణీ సర్వరక్షకుణ్ణి దోమాధముల బారినుంచి కాపాడలేక పోతున్నప్పుడు?! ఏ గణాల అండాలేని సామాన్యులం మనం..  దోమలగండం లేకుండా ఉండాలంటే తీరే ఆశేనా? బ్రహ్మదేవుడికి మల్లే పుట్టుచెవుడున్నా కొంత  బాగుండేది. దోమకాటు నుంచి కాకపోయినా కనీసం వాటి సంగీతాన్నుంచైనా   ఉపశమనం దక్కుండేది.
దేవుడు రెండు చేతులు ప్రసాదించింది అరచేతులతో చప్పట్లు కొట్టి  దోమల్ని  తరిమి కొట్టేందుకే. చీమలకుమల్లే దోమ ఏ శివుడాజ్ఞ కోసమూ ఎదురు చూసే జీవి కాకపోవడంకూడా  దురదృష్టమే. నిద్రపోతునిచూస్తే  దోమలకు మహా అసూయ. 'నరులనుకుట్టే దోమలు ఆడజాతికి చెందినవి మాత్రమే' అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మాత్రం భాగ్యానికి అంత చేటు పరిశోధనలు అవసరమా? వాటి సంగీతంబట్టే ఇట్టే పసిగట్టేయచ్చు.
మనిషి ఇంజెక్షను కనిపెట్టిందికూడా దోమకాటును గమనించే అయిఉండాలి. కుట్టే సమయంలో బాధ తెలియకుండా  బెజ్జందగ్గర ఓ రకమైన ద్రవాన్ని దోమ విడుదల చేస్తుంది. మనం వైద్యంలో వాడే అనస్తీషియాకు బహుశా ఈ ప్రక్రియే  ప్రేరణ అయిఉండాలి. ప్రతీ
గొప్ప ఆవిష్కరణని  తనకే ఆపాదించుకునే దుర్గుణం మనిషిది. దోమకు రావాల్సిన క్రెడిట్ మనిషి కొట్టేసినట్లుంది. దోమకాటులోని తీవ్రతకు బహుశా   ఈ కచ్చకూడా ఓ కారణమైవుండచ్చు.
మనిషిరక్తం పీల్చే జాతుల్లో దోమది ప్రథమస్థానం. 'దాహార్తికి కారణం దాని జీవన్మరణ సమస్య' అంటున్నారు క్రిమికీటక శాస్త్రవేత్తలు. ప్రాణాలను ఫణంగాపెట్టి   కాటుకి సిద్దపడే దోమ దుస్సాహసం వెనక ఎంత దయనీయమైన కారణాలు ఉన్నాయో మానవీయకోణంలో  తర్కించాలి. దోమకు బుర్ర తక్కువని మనకు మహా చులకన.  మన రక్తంలో
మేలిమిరకం విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని ముందుగా కనిపెట్టిన బుద్ధిజీవి దోమే. పాతికతరాలకు ఒక్క పర్యాయమైనా  మానవరక్తం పథ్యంగా పుచ్చుకోక పోతే దోమ మనుగడే ప్రశ్నార్థకంలో పడిపోతుంది తీసుకోవడమే తప్ప ఇచ్చే అలవాటులేని మనిషి  స్వచ్చందంగా దోమలకోసం రక్తదాన శిబిరాలు నిర్వహించడు గదా! దోమలకు మనిషి నైజం మహబాగా తెలుసు. అందుకే  ఈ బలవంతపు రక్త సేకరణలుఎంతో అప్రమత్తంగా ఉండి..కుట్టిన వెంటనే వడుపుగా   పట్ట బోయినా దోమచేతికి అందివచ్చే    కీటకం  కాదు. కసి, క్రోధం మానవశరీరాల్లో సృష్టించే ప్రకంపనలను నరాల  కదలికలద్వారా ముందే పసిగట్టి  చటుక్కున తప్పుకునే వడుపు భగవంతుడు     దోమకు ప్రసాదించాడు. దేవుడే దోమ పక్షపాతిగా మారిన నేపథ్యంలో ఇహ మనిషి మొరాలకించే నాథుడెక్కడ దొరుకుతాడూ?

దోమల అసాధారణ  గ్రహణ శక్తినుంచే మానవనేతలు  పలాయన నైపుణ్యం సాధించినట్లుంది.  సర్కారునిధులు  పీల్చినంత పీల్చి.. ప్రమాదం పసిగట్టగానే చటుక్కున పక్క పార్టీలోకి దూకి నక్కేవడుపు
మనప్రజానేతలు కచ్చితంగా మశకగురువుల   శిష్యరికంలో సాధించిన పలాయనవిద్యే.
దోమలు అన్నిప్రాణులను ఒకేలా ప్రేమించవు. నిద్రకుపడ్డ సమయంలో ముక్కు రంధ్రాలగుండా విడుదలయ్యే బొగ్గుపులుసు వాయువు మోతాదు మీద దోమల ఆకర్ష వికర్ష పథకాలు  ఆధారపడి ఉంటాయంటున్నారు శాస్త్ర వేత్తలు. మన ఉఛ్చ్వాశ నిశ్వాసాలు మన అదుపులో ఉండవు కనక  దోమలవేటా మన అధీనంలో లేనట్లే లెక్క.  అధీనంలో లేనివాటిని గూర్చింత రాద్దత మవసరమా?  అని సందేహం.
సుపరిపాలన  ప్రజల అధీనంలో ఉంది కనకనా? అయినా దాన్నిగూర్చి చర్చించడం మానుకుంటున్నామా? ఇదీ అంతే! అని సమాధానం.
'ప్రతీజీవికీ ఓ ప్రయోజనం ఉండి తీరుతుంద'ని కదా గురజాడవారి గిరీశంగారి థియరీ! దోమలతోనూ కతిపయ లాభాలు లేకపోలేదు. అనుక్షణం కళ్ళల్లో వత్తులేసుకుని దోమలకోసం దేవులాట్టంవల్ల   అప్రమత్తత శాతం బాగా పెరిగే అవకాశం ఎక్కువ.  తెల్లార్లూ దోమలు
చెవిదగ్గర 'గీ' మంటూ నిద్దర్లు పాడుచేస్తుండబట్టేగదా ఈ మాత్రమన్నా శాంతిభద్రతలు అదుపులో ఉంటున్నవి! రక్షకభటులమీదే పూర్తిగా భరోసా ఉంచి ఆదమరచి నిద్రకుబడితే తెల్లారేలోపు కొంప అయ్యవారి నట్టిల్లయ్యే ప్రమాదమూ పొంచి ఉంది.
వాస్తవానికి దోమలవల్ల దొంగలకే ఎక్కువ చేటు. దొంగచాటు వ్యవహారాలు, చాటుమాటు సరసాలు సాగించే కంత్రిగాళ్ళకు అవి ఎక్కువ శత్రువుల. అయినా వాళ్ళు ఒక్కముక్క దోమలకు వ్యతిరేకంగా  బైటికి అనరు. చేసే  మేళ్ళన్నీ మరిచి  మనమే వాటిని అస్తమానం అవసరానికన్నా ఎక్కువగా ఆడిపోసుకుంటున్నది!
దోమలమీద మరీ అంతగా  పగ పెంచుకోవడం తగదంటున్నారు
శాస్త్రవేత్తలు కూడా. దోమలే ఆహారంగా బతుకు వెళ్లదీసే ఎన్నోరకాల జీవులకు స్థానంలేకుండాచేస్తే  సంభవించే ఉపద్రవం దోమకాటు నష్టానికన్నా  పదింతలు.  దోమల్ని భరించి, జీవవైవిధ్యానికి తనవంతు పాత్ర పోషించడం మినహా మనిషికి మరో దారిలేదు.
మరి మోదీజీ 'స్వచ్చ భారత్' అంటారా?!
దేని దారి దానిదే! మధ్య నిషేధం అసాధ్యమని తెలిసీ..  మనం నినదించడంలా!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- సంపాదకీయ పుట- 13-11-2014 లో ప్రచురితం)
                        


                                        ***

రసమయ తపస్సు- సాహిత్య వ్యాసం

వ్యాపారపత్రికలలో కవిత్వానికి దక్కుతున్న చోటు.. ఆ చోటులో కనిపిస్తున్న కవిత్వం గమనిస్తే.. నిజానికి ఎవరికీ కవిత్వం మీద అంత సదభిప్రాయం పెరిగే అవకాశం లేదు. కవిత్వానికే మీదుకట్టిన కొన్ని సాహిత్యపత్రికల్లో సైతం లబ్దప్రతిష్టులకు మాత్రమే అవకాశం దక్కే పరిస్థితి. ఇన్ని ప్రతికూల నేపథ్యంలో సైతం కవిత్వం కుండపోతగా వర్షిస్తూనే ఉండటం హర్షించదగ్గ పరిణామమే.

కవిత్వం మీద మోజు చూపిస్తున్న వర్గాల్లో ముఖ్యంగా యువతదే ప్రధాన

భూమిక. ఇది మరీ సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు వస్తున్న కవితాసంపుటాలే ఇందుకు ఉదాహరణ.

కవిత్వం అంటే ఒకప్పుడు ఛందోబంధంగా ఉండితీరాల్సిన   పరిస్థితి.
భాషమీద కొంత పట్టు, వ్యాకరణంమీద కనీస అవగాహన అవసరం. పూర్వ సాహిత్యంతో స్వల్పంగానైనా పరిచయం లేకుండా కవిత్వం రాయడానికి అవకాశం ఉండేది కాదు. గిడుగు వారి వ్యావహారికోద్యమ ఫలితంగానో, గురజాడ వంటి  అభ్యుదయవాదుల కృషి మూలకంగానో.. శ్రీశ్రీ వంటి అతివాదుల పుణ్యమా అనో ఛందోబంధనాలన్నీ ఫటాఫట్ తెగిపోయి తెలుగు కవితామతల్లికి సంపూర్ణ స్వేచ్చాస్వాతంత్ర్యాలు సిద్ధించాయి. కాలానుగుణమైన మార్పులు ఎన్నో చోటు చేసుకోవడం వల్ల.. కవిత్వం స్వరూప స్వభావాలే సంపూర్ణంగా మార్పు చెందాయి. ఇవాళ మనసుకి ఎలా అనిపిస్తే అలా రాయడమే అసలైన కవిత్వం’ అనే భావన   స్థిరపడిపోయింది. అదీ ఆనందించదగ్గ పరిణామమే. కాకపోతే ఈ స్వేచ్చను నేటి యువత నిజంగా ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నది?

భాషాపాటవం, సంవిధాన చాతుర్యం, శిల్ప విణ్ణానం పుష్టికరమైన కవిత్వానికి ముఖ్యావసరాలు. అవి స్వాధీనమవాలంటే ఒక రసమయమైన తపస్సు అవసరం. గతకాలపు కవితా ప్రక్రియలను  (ఇప్పుడు మనం వాటిని  ఉపయోగించకపోయినా సరే) ఒక పరిశీలనా దృష్టితో.. సావధాన చిత్తంతో.. అధ్యయనం చేయకుండా రాయబూనుకుంటే ఆ కవిత్వం తేలిపోతుంది. నన్నయ భారతం ఎందుకు రాయాల్సి వచ్చింది? పాల్కురికి సోమనాథుడు తమ కాలం నాటి ఇతర కవుల మాదిరిగా కాకుండా దేశికవితల్లోనే రచనలు ఎందుకు చేయాల్సి వచ్చింది? తిక్కన గారు భారతాన్ని ఎంత నాటకీయత దట్టించి రాసారు? శ్రీనాథుడుకి, పోతనకు.. వ్యక్త్తిత్వాల మధ్య వైరుధ్యం కన్నా.. వ్యక్తీకరణల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? రాయలు వారి భువనవిజయంలోని అష్టదిగ్గజాల మధ్య గల రాజకీయాలకన్నా వారి వారి రచనల మధ్యగల సామ్యాలు.. తారతమ్యాలు ఎలాంటివి? ప్రబంధసాహిత్యం ఎందుకు చివరి దశలో  తిరస్కరణకు గురయింది? పద్యధోరణుల మీద భావకవిత్వం చేసిన తిరుగుబాటు ఎటువంటిది? నవ్యకవిత్వం వచ్చి భావవిత్వాన్ని ఎలా వెనక్కు నెట్టింది? ఆధునిక కవిత్వం మొత్తం అభ్యుదయ కవిత్వమే అనుకోవడానికి ఎంతవరకు వీలుంది? అభ్యుదయ కవిత్వం మీదా దిగంబరకవులు ఎలా.. ఎందుకు తిరగబడినట్లు? ఆ వేడి ఇట్టే చప్పున చల్లారిపోవడానికి వెనకున్న తాత్విక కారణాలేమిటి? విప్లవ కవిత్వం ఎప్పుడు.. ఏసందర్భంలో.. ఎవరి ఏ అవసరాలకు అనుగుణంగా చొచ్చుకొని వచ్చింది? తరువాతి కాలంలో దాన్లోనూ చీలికలు ఏర్పడటానికి కారణాలేమిటి? ప్రపంచీకరణ పెచ్చుమీరుతున్నతరుణంలో కవిత్వంలో జరిగిన పరిణామాలు ఎటువంటివి? ఆధునికాంతరవాదంగా ముందుకు వచ్చిన.. వస్తున్న ఈనాటి అస్తిత్వపోరాటాల కథా కమామిషు లేమిటి? కుల మత వర్గ వర్ణ లింగ వ్య్తత్యాసాల ఆధారంగా కవిత్వంలో కొత్తగా ఏర్పడుతున్న తాత్విక ధోరణులు ఎలాంటివి? విశ్వసాహిత్యంతో మన సాహిత్యం ముందు నుంచీ ఎలా ప్రభావితమవుతూ వస్తోంది? ప్రస్తుతం యువత  రాస్తున్న కవిత్వం ప్రపంచ సాహిత్యంతో ఏ మేరకు తులనాత్మకంగా తూగగలుగుతోంది? కవిత్వచరిత్రను మొత్తంగా  ఒక స్థూలదృష్టితో   అర్థం చేసుకునే ప్రయత్నం ఏదీ చేయకుండా.. నిజానికి అర్థవంతమైన కవిత్వం రాయడం కుదరదు. ఆ పని చేస్తున్న యువకవులు ఎంతమంది అంటే.. వచ్చే సమాధానం అంత సంతృప్తికరంగా లేదు.

అధ్యయనం  ఒక వంకనుంచీ జరగాల్సిన ప్రయత్నమైతే.. మరో వంకనుంచీ  ఆచరణాత్మకమైన కృషీ సమాంతరంగా జరగాల్సి ఉంది. ఒక కవిత రాసిన తరువాత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామా?  "కవి తన ప్రతీ అభివ్యక్తినీ నిశితంగా తీర్చి దిద్దుకున్నప్పుడే.. ఆ భావశకలాలు చదువరి హృదయక్షేత్రంలో బలంగా నాటుకునే అవకాశం ఉంటుంది" అంటారు  సీనియర్ కవి ఆవంత్స సోమసుందర్ ఒక పరిశీలనా వ్యాసంలో. కవితకు ఈ నిశితత్వం ఎలా వస్తుంది? ఆవంత్సవారి మాటల్లోనే చెప్పాలంటే.. "రచన  పూర్తయిన తరువాత చప్పున తృప్తి పడకుండా.. చెప్పిన రీతికంటే మరింత రమణీయంగా తీర్చిదిద్దటానికి ఇంకేమన్నా అవకాశాలున్నాయా? అన్న అంశాన్ని   అధ్యయనబుద్ధితో సమీక్షించుకోవాలి. సంవిధానంలో, భావాల  అభివ్యక్తీకరణలో మరిన్ని మెరుగులు సంతరించుకోగల పరాత్మక పరీక్షకు కవి పూనుకున్నప్పుడే ఉత్తమత్వం కవిత్వంలోనుంచి ‘అగ్నిసరస్సునుంచి ప్రభవించిన వజ్రం’లా మెరుపులీనేది". ఈ ధ్యాన నిమగ్నతను ఆరంభంనుంచే అలవర్చుకున్నవాడే మంచికవిగా రూపు దిద్దుకునే అవకాశం పెరిగేది. ఓర్పులేని కవి ఎంత కవిత్వం రాసినా నేర్పులేమి కారణంగా  తేలిపోతుంది.

ప్రతిభను నిత్యహరితంగా రక్షించేది వ్యుత్పన్నతే.  లోకవృత్త పరిశీలన, విస్తృతమైన గ్రంధాద్యయనం, అనుభవ పరిపాకంతోచేసే మేధోమథనం-  కవిత్వకన్య చెక్కిలికి కమ్మని, చిక్కని చక్కదనం చేకూర్చే చెక్కుడు  సరంజామా. భావుకత్వం ఒక్కటే కవిని  మంచి కవిగా తీర్చిదిద్దలేదు. రచన పూర్తయిన వెంటనే నిద్దపుస్వరూపం సిద్దించినట్లు తృప్తిపడే కవి తనకు తానే కాదు..  కవిత్వానికీ హాని చేస్తున్నట్లే లెక్క.

ఇవాళ  అంతర్జాలంలో ఎవరికైనా ఎంతటి uncut and unsesored వెర్షన్నైన అత్యంత సులభంగా ప్రచురించుకునే సౌలభ్యం ఉంది. రాసీ రాయని మరుక్షణంలోనే వాసి సంగతి సమీక్షించుకోకుండా ఏదైనా  పత్రిక్కి  పంపించాలనో, అంతర్జాలంలో ప్రచురించేసుకోవాలనో గత్తర పడితే.. దక్కేది ఒక వ్యతిరేక ఫలితం. తుడుపు

కోవడానికి చాలా కష్టపడ వలసిన  'చెడ్డముద్ర"!


రచన పూర్తవగానే విమర్శకుడి అవతారం ఎత్తడం మంచి పద్ధతి. కవిత్వం అంటే ఒక రసమయ తపస్సు. దీక్షకొద్దీ దాని  ఫలితం.
***
కర్లపాలెం హనుమంతరావు
(మాలిక- అంతర్జాల మాసపత్రిక- జనవరి 2015లో ప్రచురితం)

కొన్ని చిట్టి కవితలు-1




1
కోకిల పాట
ఎంత కమ్మన
 కాకెంగిలి కదా!

2
ముసురు మేలిముసుగు నుంచీ
ఆకాశం మిసిమిసి నవ్వు
-మెరుపు

3
అడుక్కుంటూ గ్యాపులో
ఆడుకునే వీధిబాలలు
-ఆర్టాఫ్ లివింగ్


4
ఈ గొంగళి పురుగేనా
రేపటి రంగుల సీతాకోకచిలుక!
కాలం గొప్ప కాస్త్యూమ్ డిజైనర్

5
నరపురుగు లేదు
అడవికి
ఎంతానందమో!

6
మనసుతో నడవకే
బతుక్కు
అలసట

7
ఎంత ప్రశాంతంగా ఉందీ!
గుండె
శవాసనమేసినట్లుంది!

8
స్నేహం
మనిషి
-మనిషివ్యసనం

9
పొగడ్త అగడ్తలో
దూకడం తేలికే!
తేలడమే లేదిక!

10
ఎప్పుడు వెలిగించారో?
వెలుగులు విరజిమ్ముతోంది
- గీత

11
రెండో తరగతి రైలుబోగీ
చదివేవాడికి అదే
కదిలే తరగతి గది

-కర్లపాలెం హనుమంతరావు
20-10-2012

Monday, July 6, 2015

వెలుగు బొట్లు- కవిత

1
నీలాకాశాన్నలా దులుపుతావెందుకు?
నాలుగు వెలుగుబొట్లు నేల రాలితే తాగిపోవాలని!
ఆడి ఆడి అలసిపోయాను
గాయాలకు మందు కావాలి!

2
నదిని దాటాలంటే వంతెనే ఉండాలా?
మడుగు అడుగున కాల్దారీ ఉంటుంది!
వేగుచుక్కలు పైన వెలుగుతుంటాయి!
బాటసారివి
నీకు మోరెత్తి చూడాలనే మనసు కలగాలి!
నువు క్షణంపాటు పీల్చి వదిలే ప్రాణవాయువు
ఎన్ని పైరుపచ్చలనుంచీ మూటకట్టుకుని
పడుతూ లేస్తూ తెస్తుందో తెలుసా పిచ్చి గాలి!
నీ కంటికి నిద్రవూహ రాకముందే
రెప్పలు కలలపొత్తిళ్ళు సిద్దం చేస్తాయి!
గోపురాలు కందకాలు రహదారులు రహస్యస్థావరాలు
ఇలాతలాన్ని నువ్వివాళ ఇలా యుద్ధరంగ చేసావు గానీ
ఓంప్రథమంగా
పునాదిరాయి పడింది ఆటలమైదానానికే మిత్రమా!

ఏడుస్తూ వచ్చిన వాడివి…
ఎలాగూ ఏడుస్తూనే పోతావని తెలుసు
ఇక్కడున్నఈ నాలుగు పూటలన్నా 
నిన్ను నవ్వుల పూలతోటల వెంట తిప్పాలని కదూ
ఈ ఆటలూ పాటలూ,  ప్రేమ మాటలూ!

3
కలల మీదా పెత్తనం కావాలి నీకు
అందుకే ఈ కలవరం!
రేపటి సంగతి మరచి
నేటిగెలుపుకి పరుగు
అందుకే ఈ అలుపు!

4
ఆట ముగిసాక
గెలుపోటములు అరటిపండేగా మిత్రమా!
చీకటి ముసిరాక
ఎవరైనా ఇంటిదారేగదా పట్టాలి!
ఎక్కడనుంచొచ్చామో?
ఎక్కడెక్కడికి వెళతామో?
ఇక్కడున్నన్ని  క్షణాలూ
ఎంచక్కా ఆడుకోరాదూ!
చక్కని మైదానం
ఆటవస్తువులు
సాటిదోస్తులు
అలుపు మరుపుకేకదా ఈ ఆటా పాటా?
గెలుపు కోసం అలుపు
వృథా అవునా కాదా!

5
నీలాకాశాన్నలా దులపడమెందుకు?
ధారగా రాలుతునే ఉన్నాయి వెలుగు బొట్లు!
హాయిగా తాగేయి పూరా!
 రేపటికి మాగబెట్టక!
మనిషి బుద్ధి చూపెట్టక!
-కర్లపాలెం హనుమంత రావు

23-10-2012

Sunday, July 5, 2015

దివాలా- ఓ సర్రియలిస్టు కవిత

దివాలా- ఓ సర్రియలిస్టు కవిత
కలలో
నాకెవరో
ఒక 'పావలా' ఇచ్చి
"కావాల్సినవేవైనా కొనుక్కోరా!" అన్నారు.
మెలుకువలో మహా హుషారుగా
బజారుకు పోయి
మబ్బులు,
వాటిని కడిగే సబ్బులు,
చెట్లు,
వాటినెక్కేందుకు మెట్లు,
పడుకునేందుకు పొడువాటి రోడ్లు,
నడిచేందుకు సన్నని, నున్నని కాలువలు..
ఇంకా ఎన్నో.. ఎన్నో..
అన్నీ కొన్నాను.
అన్నింటినీ వీపుమీదంటించుకుని
నా వాకిలి తలుపులు తడుదును కదా..
అక్కడొక పొడుగాటి మనిషి
చక్కగా గోడమీద పడుకున్న వాడు
నవ్వుతూ
నిటారుగాలేచి నిలబడుతూ
"వచ్చావా? నీ కోసమే
కాసుక్కూర్చున్నా!
నా పావలా నాకిచ్చేస్తావా!" అన్నాడు.
"ఏం పావలా?" అనడిగితే
పాతాళం జేబులోనుండి
కాతా పుస్తకం తీసి
కాకుల్ని బాతులుగా చూపించాడు.
చేసేదిలేక చేబదులు తీర్చేద్దామని
జేబులో చేయి పెడితే
పావలా ఏదీ!
"నీ పావలా నా దగ్గర లేదు
మళ్ళీ రా!
నీ ప(ము)ళ్ళన్నీ నీ కిచ్చేస్తా!"అంటే
వాడు వికృతంగా నవ్వి
"మళ్ళీ మళ్ళీ ఎక్కడొస్తానూ,
నాకవతల బోలెడన్ని పనులున్నాయి
(ఎన్నో కాకుల్ని బాతుల్ని చేయద్దూ!)
పోనీ
నీ దగ్గరున్న మబ్బులు, చెట్లు, రోడ్లు, కాలువలు,
కాసిని కోసుకెళతా.. వప్పుకుంటావా?"అంటూ వీపు తడిమి
చక్కాపోయాడు.
నేను నవ్వుకుంటూ
నట్టింట్లోకి నడిచి
నా లాభాల మూటను మూలకు సర్ది
అందంగా నవ్వుకుందామని అద్దం ముందు నిలబడితే
అరె!.....నేనేదీ??!!
ఇంకేం నువ్వు?
వాడిచ్చిన పావలా కెప్పుడో 'దివాలా' తీసావు
అంటో అద్దం నవ్వు!
(అద్దం అబద్ధం చెప్తుందా!)
-కర్లపాలెం హనుమంతరావు

(ఈ కవిత ప్రచురణ కాలం 23-08-1975.  'చక్రవర్తి' కలంపేరుతో ఆంధ్రజ్యోతి వారపత్రికలో (పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు సంపాదకులు) అచ్చయింది. అప్పట్లో "కొత్త కలాలు" పేరుతో వారం వారం ఒకటొ, రెండో కవితలు ప్రచురించే వారు. అంధ్రజ్యోతిలో కవిత రావడం అప్పట్లో నాబోటి చాలామంది చిన్నకవులకు మధురస్వప్నం. ఆ శీర్షికలో ఇప్పటి ప్రముఖులు చాలామంది కనపడుతుండే వారు.(పాపినేని శివశంకర్ పేరు గుర్తు నాకు). ఈ కవిత రాసేకాలం నాటికి నా వయసు 23సంవత్సరాలు. తిలక్, ఆరుద్ర, శ్రీశ్రీ, గజ్జెల మల్లారెడ్డి వంటి వాళ్ళ కవిత్వం ఇష్టంగా చదువుకుంటుండేవాణ్ణి. ఎలా పడిందో నా దృష్టిలో సర్రియలిజం మీది శ్రీశ్రీనో, ఆరుద్రో రాసిన కవిత్వం! దాని ప్రభావంతో రాసిన కవిత ఇది. కవిత్వం అంటే ముందు నుంచీ అమిత ఇష్టం. ఆ అతిప్రేమవల్ల అత్యంత బిడియం. ప్రముఖ  కవులు రాసినవి చదివి విశ్లేషించుకోవడమేకానీ ధైర్యం చేసి రాసింది తక్కువే.(అప్పౌడు.. ఇప్పుడు కూడా)

పాత కాగితాలు తిరగేస్తుంటే.. ఈ కవిత కనపడింది ఇవాళ. ఇప్పటి 'సెజ్జు'ల కాలంలో బక్క మనిషి చిట్టిఆశకు ఈ కవిత ప్రతిబింబం అనిపించింది. అందుకే మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఇలా…)

Friday, July 3, 2015

పెళ్లాం చెబితే వినాలి- ఓ సరదా గల్పిక


పెళ్లాం దగ్గర ఉగ్రవాదం పనికిరాదు. భక్తిమార్గమే శరణ్యం. అర్జునుడికి గోతోపదేశం చేసిన కృష్ణుడంతటివాడు సత్యభామకాళ్ళు పట్టుకోలేదా?
 'దేవుడా! నాకు కష్టాన్నివ్వు! బాధల్నివ్వు! టెన్షన్నివ్వు!' అని నాలాంటి ఓ విరాగి కోరుకుంటే- 'ఇదిగో నీ కోరికలన్నింటినీ తీర్చే సాధనం!' అంటూ నీ లాంటి భార్యామణి నిచ్చాడోయ్ ఆ భగవంతుడు!' అన్నాను మా శ్రీమతితో ఓసారి ఎద్దేవాగా.
తనేమన్నా తక్కువ తిన్నదా! ' ఆహాఁ!  మరా భార్యామణినే 'బెటర్ హాఫ్' అని ఎందుకన్నారో మీ మగాళ్లూ! ఆడది అందుబాటులో ఉండేవాటినే కోరుకొంటుంది. మహేష్ బాబు జుత్తు ఎంత ఒత్తుగా ఉంటే నా కేంటి! నా మొగుడు నెత్తిమీద జుత్తుమాత్రం నా గుప్పెటకి చిక్కేటంత ఎత్తులో ఉండాల’ని కోరుకొనే అమాయకురాలండీ ఆడది! ఆ ఇంగితం మీ మగమూర్ఖులకు అర్థం కాదులేండి ఎన్ని యుగాలకైనాగానీ!' అఏసింది!
'మేం మూర్ఖులమా?'
'మరి! మీకో తమాషా కథ చెప్పనా! ఓ అందమైన ఉద్యానవనమంట! దాన్నిండా పండ్లు, పూలు, కాయలు. అందమైన బుజ్జి బుజ్జి ఎన్నో రకాల జంతువులు.. ఆమెకు తోడుగా! ఐనా ఆమెకు ఏమీ తోచేది కాదంట! సరదాగా ఆడుకొనేందుకు సరిపడా జోడునివ్వవా? అని దేవుడుగారి దగ్గర మొరపెట్టుకొందట బుద్ధి గడ్డితిని.. 'ఇస్తాగానీ! రెండు షరతులు! ఆ వచ్చే జోడు మొరటుగా, నీకన్నా బలంగా ఉంటుంది. ఓకేనా! ఇహ రెండో షరతు. వాడు నీకన్నా తానే ముందు పుట్టానని.. నువ్వే వాడి పక్కటెముకలనుంచి పుట్టుకొచ్చావని కోస్తుంటాడు. నువ్వా అజ్ఞానిని  సహించి నమ్మినట్లు నటించాలి.. మరి' అన్నాడుట దేవుడు. జోడుకోసం ‘సరే’ననక తప్పింది కాదు పాపం ఆ పిల్లకి. అప్పుడలా ఒప్పుకున్న పాపానికే మీ మగాళ్ల మూర్ఖత్వాన్ని, చపలచిత్తాన్ని చచ్చినట్లు భరించి చేస్తున్నాం ఇన్ని యుగాలబట్టీ!' అనేసింది మళ్లీ మా ఇంటిదీపం.
ఎంతైనా మగాణ్ని! నాకు కోపం రాదా! 'మాది చపలచిత్తమా?' అని గయ్యిమన్నాను వళ్ళుమండి.
'మీదే కాదు. మిమ్మల్ని మాకు అంటగట్టిన ఆ దేవుళ్లది కూడా! ఒక భార్యను పక్కలో పెట్టుకొని మరో భామను నెత్తిమీద పెట్టుకొన్నాడు  బిచ్చమెత్తుకొని బతికే దేవుడు శివయ్య. ఒక భార్యచేత అస్తమానం కాళ్లు పట్టించుకోడం చాలక మరో భార్యకోసం పరుగెత్తి అవతారాలెత్తిన మహాపురుషుడు విష్ణుమూర్తి. ఆలికోసం అంతలావు యుద్ధంచేసి.. తీరా సాధించినాక శీలం నిరూపించుకోమని సాధింపులు సాగించిన వీరపురువుడు    శ్రీరాముడు. దేవుడూ మగాడే కదా! బెడ్-కాఫీ దగ్గర్నుంచీ.. బెడ్ ఎక్కేదాకా తన అవసరాలు తీర్చేందుకే ఆడది పుట్టిందని మీ మగాళ్లకో అహంభావం. తలొంచుకొని తాళి కట్టించుకొంటుందని ఎగతాళి కామోసు? పాచిపనిచేసే పనిమనిషికి, బట్టలుతికి ఇస్త్రీచేసే లాండ్రీమనిషికి డబ్బివ్వాలి. కప్పుడన్నం  ఎక్కువడిగినా ఎక్స్ ట్రా బిల్లేస్తాడు హోటలువాడు. సర్వారాయుడైతే నిర్దాక్షిణ్యంగా దక్షిణ బాదేస్తాడు. మీకూ, మీరు కనిపారేసిన పిల్లాపీచుకూ తన సొంతపన్లుసైతం మానుకొని కంచిగరుడసేవచేసే ఆడది మాత్రం గడప దాటి లోపలికొచ్చేముందు  లక్షలు కోట్లు  కట్నంకింద ఎదురు కుమ్మరించాలి. ఛ! ఆ జాన్ గోట్ మ్యాన్ చెప్పిన మాటన్నా చెవినబెట్టకపోతిని.. పిచ్చిచచ్చిందాన్ని!'
'మధ్యలో ఆ జాన్ గోట్ మ్యాన్ ఎవడే బాబూ నా ప్రాణానికి?!'
'మొగుళ్ళు మోటారుబళ్ళలాంటి వాళ్ళని. మొదటి ఏడాది మాత్రమే  బాగా నడిచేదని..  మొహమాటానికనిపోయి మీ స్వేచ్చ పోగొట్టుకోవద్ద’ని తస్మాత్ జాగ్రత్తలు చాలా  మొత్తుకున్నాడులేండి మొదట్లో ఒహాయన.. ఆయనా!'
ఓహో! మగాళ్లలాగా ప్యాంట్లూ, గళ్లగళ్ళషర్ట్లూ వేసుకోవడం, పొద్దుపోయేదాకా బైట బలాదూర్లు తిరగడం.. ఇదేనా మ్యాడమ్ మీ దృష్టిలో స్వేచ్చా వాయువులు సంపూర్ణంగా  పీల్చడమంటే! దాన్ని స్వాతంత్ర్యమనరు. మగాడి ఆధిక్యాన్ని ఒప్పుకోవడమంటారు' అన్నారు జగ్గీ వాసుదేవ్.'
'ఓహో! గురూగారికి ఇప్పుడు ఆ సద్గురుగారు గుర్తుకొచ్చారన్నమాట! ఆయనింకా చాలా మంచిముక్కలుకూడా చెప్పారు మహాశయా! విజయవంతమైన వివాహానికి నమ్ముకోవాల్సింది పామిస్ట్రీని కాదు.. ఆలూమగలమధ్య కెమిస్ట్రీని. పెళ్లయితే అబ్బాయి, అమ్మాయి ఒకటవుతారు. నిజమే కానీ.. ఎవరు ఎవరవుతారన్నదే అసలు సమస్య. మొగుడూ పెళ్ళాలు సినిమాహాల్లో  కుర్చీల్లాంటి వాళ్ళు. రెండు సీట్లకూ కలిపి ఒకే ఒక్క రెక్క ఉంటుంది. ఇద్దరూ సర్దుకుపోవాలిసినిమా ప్రశాంతంగా చూడాలంటే. స్త్రీపాత్ర లేకుండా నాటకాలు నడుస్తాయేమోగాని.. సంసారాలుమాత్రం సవ్యంగా సాగవు. ఆలూమగలు ఆలూమసాలా కూరిన  సమోసాలాగా ఉండాలి. ఓడి గెలవడమన్న సూత్రం ఒక్క భార్యాభర్తలబంధంలో మాత్రమే రాణిస్తుంది. మొగుడూ పెళ్లాలు కాటాకుస్తీ వస్తాదులు కాదుగదా! ఇద్దరూ కలసి ఏడడుగులు వేసిన్నాడే ఒకటైనట్లు లెక్క. అతను ఆకాశమైతే.. ఆమె భూదేవి. అతను వాక్కు అయితే.. ఆమె మనస్సు. కాపురమనే బైకుకు
అతను చక్రమయితే.. ఆమె ఆ చక్రాన్ని అదుపులో పెట్టే బ్రేకు.. గేరు. పెళ్ళితంతులో వల్లించే ప్రతీమంత్రానికి ఒక ప్రత్యేకమైన అర్థముంటుంది. తెలుసా సారూ! ఆలుమగలనేది సీతారాములు వంటి ఒక అందమైన ద్వంద్వసమాసం గురూ! అనురాగం ఛందస్సు కుదిరి, సరైన యతిప్రాసలు పడితే పోతన పద్యమంత హృద్యంగా ఉంటుంది సంసారకావ్యం. వేలుపట్టుకొని  నడిచివచ్చిన భార్యవంక వేలెత్తి చూపించేముందు మొగుడు తనలోపలకికూడా తొంగిచూసుకోవాలి. నిజమే! భర్తపేరు చెప్పడానిక్కూడా సిగ్గుపడే ముగ్ధ భర్త సిగ్గుపడే పని ఎన్నటికీ చేయకూడదు.  పెళ్లంటే.. 'అరే! అప్పుడే నూరేళ్ళు గడిచిపపోయాయా?!' అన్నట్లు సాగిపోవాలి. ఆలుమగలమధ్య అలకలు అకుమీద నీటిబొట్లు. అవి జారిపోయేంతసేపు ఉంటేనే ఇంపూ.. సొంపూ! వాదులాట లేనంతవరకే ఆదిదంపరతులకైనా ఆరాధన. సీతారాములు విడిపోయిన తదనంతర రామాయణమంతా విషాదమే.. మీకొకరు వచ్చి  చెప్పాలా! మొగుడూ పెళ్లాల మధ్య పంచాయితీలో మూడోమనిషికి దూరే సందివ్వరాదన్నది రాయని సంసార రాజ్యాంగసూత్రం.  అనాదిగా అదే నడుస్తున్నది మన కుటుంబ వ్యవస్థలో!'
సుమతీ శతకమంత  చక్కగా చెప్పుకొచ్చింది కదండీ మా శ్రీమతి! ఒప్పుకొని తీరాల్సిదే! ఓప్పుకొన్నాను కూడా!
'నువ్వన్నమాట నిజమేనోయ్! అందుకే ఈ మధ్య ఓ విడాకులకేసులో సర్వోన్నత న్యాయస్థానంసైతం  కలగజేసుకొనేందుకు 'ససేమిరా' అంది. పైపెచ్చు 'పెళ్ళాం చెబితే వినాలి! మేమందరం అదే చేస్తున్నాం ఇళ్లల్లో!' అని నిజం ఒప్పుకేసుకొన్నారు కూడాను కేసు విచారించే శ్రీమాన్ న్యాయమూర్తులవారు.
'చూసారా! భూమ్యాకర్షణకన్నా భామాకర్షణ ఎంత మిన్నో! భూమికి లొంగి నడవగాలేంది.. తాళికట్టిన భామకు లొంగి నడిస్తే తప్పేముంది! చదువులమ్మను భార్యగా పొందీ బ్రహ్మదేవుడు తలరాతలు ఇంత అడ్డదిడ్డంగా  ఎందుకు రాస్తున్నాడో తెలుసాండీ! పెళ్ళాన్ని అడిగి రాయాటానికి 'అహం బ్రహ్మస్య' అన్న అహంకారం అడ్డంపడి! అందుకే అనారు…'
'..పెళ్లాం చెబితే వినాలి.. అని' అంటూ వంతపాడడం నావంతయింది చివరకు.
***
-కర్లపాలెం హనుమంతరావు

(26-06-2009 నాటి 'ఈనాడు' సంపాదక పుటలో ప్రచురితం)

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...