Friday, July 3, 2015

పెళ్లాం చెబితే వినాలి- ఓ సరదా గల్పిక


పెళ్లాం దగ్గర ఉగ్రవాదం పనికిరాదు. భక్తిమార్గమే శరణ్యం. అర్జునుడికి గోతోపదేశం చేసిన కృష్ణుడంతటివాడు సత్యభామకాళ్ళు పట్టుకోలేదా?
 'దేవుడా! నాకు కష్టాన్నివ్వు! బాధల్నివ్వు! టెన్షన్నివ్వు!' అని నాలాంటి ఓ విరాగి కోరుకుంటే- 'ఇదిగో నీ కోరికలన్నింటినీ తీర్చే సాధనం!' అంటూ నీ లాంటి భార్యామణి నిచ్చాడోయ్ ఆ భగవంతుడు!' అన్నాను మా శ్రీమతితో ఓసారి ఎద్దేవాగా.
తనేమన్నా తక్కువ తిన్నదా! ' ఆహాఁ!  మరా భార్యామణినే 'బెటర్ హాఫ్' అని ఎందుకన్నారో మీ మగాళ్లూ! ఆడది అందుబాటులో ఉండేవాటినే కోరుకొంటుంది. మహేష్ బాబు జుత్తు ఎంత ఒత్తుగా ఉంటే నా కేంటి! నా మొగుడు నెత్తిమీద జుత్తుమాత్రం నా గుప్పెటకి చిక్కేటంత ఎత్తులో ఉండాల’ని కోరుకొనే అమాయకురాలండీ ఆడది! ఆ ఇంగితం మీ మగమూర్ఖులకు అర్థం కాదులేండి ఎన్ని యుగాలకైనాగానీ!' అఏసింది!
'మేం మూర్ఖులమా?'
'మరి! మీకో తమాషా కథ చెప్పనా! ఓ అందమైన ఉద్యానవనమంట! దాన్నిండా పండ్లు, పూలు, కాయలు. అందమైన బుజ్జి బుజ్జి ఎన్నో రకాల జంతువులు.. ఆమెకు తోడుగా! ఐనా ఆమెకు ఏమీ తోచేది కాదంట! సరదాగా ఆడుకొనేందుకు సరిపడా జోడునివ్వవా? అని దేవుడుగారి దగ్గర మొరపెట్టుకొందట బుద్ధి గడ్డితిని.. 'ఇస్తాగానీ! రెండు షరతులు! ఆ వచ్చే జోడు మొరటుగా, నీకన్నా బలంగా ఉంటుంది. ఓకేనా! ఇహ రెండో షరతు. వాడు నీకన్నా తానే ముందు పుట్టానని.. నువ్వే వాడి పక్కటెముకలనుంచి పుట్టుకొచ్చావని కోస్తుంటాడు. నువ్వా అజ్ఞానిని  సహించి నమ్మినట్లు నటించాలి.. మరి' అన్నాడుట దేవుడు. జోడుకోసం ‘సరే’ననక తప్పింది కాదు పాపం ఆ పిల్లకి. అప్పుడలా ఒప్పుకున్న పాపానికే మీ మగాళ్ల మూర్ఖత్వాన్ని, చపలచిత్తాన్ని చచ్చినట్లు భరించి చేస్తున్నాం ఇన్ని యుగాలబట్టీ!' అనేసింది మళ్లీ మా ఇంటిదీపం.
ఎంతైనా మగాణ్ని! నాకు కోపం రాదా! 'మాది చపలచిత్తమా?' అని గయ్యిమన్నాను వళ్ళుమండి.
'మీదే కాదు. మిమ్మల్ని మాకు అంటగట్టిన ఆ దేవుళ్లది కూడా! ఒక భార్యను పక్కలో పెట్టుకొని మరో భామను నెత్తిమీద పెట్టుకొన్నాడు  బిచ్చమెత్తుకొని బతికే దేవుడు శివయ్య. ఒక భార్యచేత అస్తమానం కాళ్లు పట్టించుకోడం చాలక మరో భార్యకోసం పరుగెత్తి అవతారాలెత్తిన మహాపురుషుడు విష్ణుమూర్తి. ఆలికోసం అంతలావు యుద్ధంచేసి.. తీరా సాధించినాక శీలం నిరూపించుకోమని సాధింపులు సాగించిన వీరపురువుడు    శ్రీరాముడు. దేవుడూ మగాడే కదా! బెడ్-కాఫీ దగ్గర్నుంచీ.. బెడ్ ఎక్కేదాకా తన అవసరాలు తీర్చేందుకే ఆడది పుట్టిందని మీ మగాళ్లకో అహంభావం. తలొంచుకొని తాళి కట్టించుకొంటుందని ఎగతాళి కామోసు? పాచిపనిచేసే పనిమనిషికి, బట్టలుతికి ఇస్త్రీచేసే లాండ్రీమనిషికి డబ్బివ్వాలి. కప్పుడన్నం  ఎక్కువడిగినా ఎక్స్ ట్రా బిల్లేస్తాడు హోటలువాడు. సర్వారాయుడైతే నిర్దాక్షిణ్యంగా దక్షిణ బాదేస్తాడు. మీకూ, మీరు కనిపారేసిన పిల్లాపీచుకూ తన సొంతపన్లుసైతం మానుకొని కంచిగరుడసేవచేసే ఆడది మాత్రం గడప దాటి లోపలికొచ్చేముందు  లక్షలు కోట్లు  కట్నంకింద ఎదురు కుమ్మరించాలి. ఛ! ఆ జాన్ గోట్ మ్యాన్ చెప్పిన మాటన్నా చెవినబెట్టకపోతిని.. పిచ్చిచచ్చిందాన్ని!'
'మధ్యలో ఆ జాన్ గోట్ మ్యాన్ ఎవడే బాబూ నా ప్రాణానికి?!'
'మొగుళ్ళు మోటారుబళ్ళలాంటి వాళ్ళని. మొదటి ఏడాది మాత్రమే  బాగా నడిచేదని..  మొహమాటానికనిపోయి మీ స్వేచ్చ పోగొట్టుకోవద్ద’ని తస్మాత్ జాగ్రత్తలు చాలా  మొత్తుకున్నాడులేండి మొదట్లో ఒహాయన.. ఆయనా!'
ఓహో! మగాళ్లలాగా ప్యాంట్లూ, గళ్లగళ్ళషర్ట్లూ వేసుకోవడం, పొద్దుపోయేదాకా బైట బలాదూర్లు తిరగడం.. ఇదేనా మ్యాడమ్ మీ దృష్టిలో స్వేచ్చా వాయువులు సంపూర్ణంగా  పీల్చడమంటే! దాన్ని స్వాతంత్ర్యమనరు. మగాడి ఆధిక్యాన్ని ఒప్పుకోవడమంటారు' అన్నారు జగ్గీ వాసుదేవ్.'
'ఓహో! గురూగారికి ఇప్పుడు ఆ సద్గురుగారు గుర్తుకొచ్చారన్నమాట! ఆయనింకా చాలా మంచిముక్కలుకూడా చెప్పారు మహాశయా! విజయవంతమైన వివాహానికి నమ్ముకోవాల్సింది పామిస్ట్రీని కాదు.. ఆలూమగలమధ్య కెమిస్ట్రీని. పెళ్లయితే అబ్బాయి, అమ్మాయి ఒకటవుతారు. నిజమే కానీ.. ఎవరు ఎవరవుతారన్నదే అసలు సమస్య. మొగుడూ పెళ్ళాలు సినిమాహాల్లో  కుర్చీల్లాంటి వాళ్ళు. రెండు సీట్లకూ కలిపి ఒకే ఒక్క రెక్క ఉంటుంది. ఇద్దరూ సర్దుకుపోవాలిసినిమా ప్రశాంతంగా చూడాలంటే. స్త్రీపాత్ర లేకుండా నాటకాలు నడుస్తాయేమోగాని.. సంసారాలుమాత్రం సవ్యంగా సాగవు. ఆలూమగలు ఆలూమసాలా కూరిన  సమోసాలాగా ఉండాలి. ఓడి గెలవడమన్న సూత్రం ఒక్క భార్యాభర్తలబంధంలో మాత్రమే రాణిస్తుంది. మొగుడూ పెళ్లాలు కాటాకుస్తీ వస్తాదులు కాదుగదా! ఇద్దరూ కలసి ఏడడుగులు వేసిన్నాడే ఒకటైనట్లు లెక్క. అతను ఆకాశమైతే.. ఆమె భూదేవి. అతను వాక్కు అయితే.. ఆమె మనస్సు. కాపురమనే బైకుకు
అతను చక్రమయితే.. ఆమె ఆ చక్రాన్ని అదుపులో పెట్టే బ్రేకు.. గేరు. పెళ్ళితంతులో వల్లించే ప్రతీమంత్రానికి ఒక ప్రత్యేకమైన అర్థముంటుంది. తెలుసా సారూ! ఆలుమగలనేది సీతారాములు వంటి ఒక అందమైన ద్వంద్వసమాసం గురూ! అనురాగం ఛందస్సు కుదిరి, సరైన యతిప్రాసలు పడితే పోతన పద్యమంత హృద్యంగా ఉంటుంది సంసారకావ్యం. వేలుపట్టుకొని  నడిచివచ్చిన భార్యవంక వేలెత్తి చూపించేముందు మొగుడు తనలోపలకికూడా తొంగిచూసుకోవాలి. నిజమే! భర్తపేరు చెప్పడానిక్కూడా సిగ్గుపడే ముగ్ధ భర్త సిగ్గుపడే పని ఎన్నటికీ చేయకూడదు.  పెళ్లంటే.. 'అరే! అప్పుడే నూరేళ్ళు గడిచిపపోయాయా?!' అన్నట్లు సాగిపోవాలి. ఆలుమగలమధ్య అలకలు అకుమీద నీటిబొట్లు. అవి జారిపోయేంతసేపు ఉంటేనే ఇంపూ.. సొంపూ! వాదులాట లేనంతవరకే ఆదిదంపరతులకైనా ఆరాధన. సీతారాములు విడిపోయిన తదనంతర రామాయణమంతా విషాదమే.. మీకొకరు వచ్చి  చెప్పాలా! మొగుడూ పెళ్లాల మధ్య పంచాయితీలో మూడోమనిషికి దూరే సందివ్వరాదన్నది రాయని సంసార రాజ్యాంగసూత్రం.  అనాదిగా అదే నడుస్తున్నది మన కుటుంబ వ్యవస్థలో!'
సుమతీ శతకమంత  చక్కగా చెప్పుకొచ్చింది కదండీ మా శ్రీమతి! ఒప్పుకొని తీరాల్సిదే! ఓప్పుకొన్నాను కూడా!
'నువ్వన్నమాట నిజమేనోయ్! అందుకే ఈ మధ్య ఓ విడాకులకేసులో సర్వోన్నత న్యాయస్థానంసైతం  కలగజేసుకొనేందుకు 'ససేమిరా' అంది. పైపెచ్చు 'పెళ్ళాం చెబితే వినాలి! మేమందరం అదే చేస్తున్నాం ఇళ్లల్లో!' అని నిజం ఒప్పుకేసుకొన్నారు కూడాను కేసు విచారించే శ్రీమాన్ న్యాయమూర్తులవారు.
'చూసారా! భూమ్యాకర్షణకన్నా భామాకర్షణ ఎంత మిన్నో! భూమికి లొంగి నడవగాలేంది.. తాళికట్టిన భామకు లొంగి నడిస్తే తప్పేముంది! చదువులమ్మను భార్యగా పొందీ బ్రహ్మదేవుడు తలరాతలు ఇంత అడ్డదిడ్డంగా  ఎందుకు రాస్తున్నాడో తెలుసాండీ! పెళ్ళాన్ని అడిగి రాయాటానికి 'అహం బ్రహ్మస్య' అన్న అహంకారం అడ్డంపడి! అందుకే అనారు…'
'..పెళ్లాం చెబితే వినాలి.. అని' అంటూ వంతపాడడం నావంతయింది చివరకు.
***
-కర్లపాలెం హనుమంతరావు

(26-06-2009 నాటి 'ఈనాడు' సంపాదక పుటలో ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...