Sunday, November 22, 2015

సంకల్పం- కవిత



ఉమ్మనీరు చిమ్మచీకటి  వదిలి
అమ్మ పక్కకి  చేరినప్పుడే
సంకల్పం చెప్పుకోవాలి
లోకం మెల్లగా
పరిచయమయే కొద్దీ
లోపలి ఇంద్రియాలకు
పరాకులు చెప్పుకోవాలి
ఈ పాలబుగ్గల నునులేత నిగారింపులు
కాలంజలపాతానికి ఆట్టే కాలం నిలిచేవి కావని
ఊహలు  బలిసేకొద్దీ ముగ్ధత్వం ఈడేరుతుందని,
ప్రౌఢుల లోకంలో
పాలే నీళ్ళు నీళ్లే పాలవుతాయని,
పూలూ ముళ్ళలా గుచ్చుకోవచ్చని,
పురుగుల కోసమే దీపం
వెలుగులు నటిస్తుందని,
ప్రతి ఆశా చివరకు
యూ టూ బ్రూటస్స’నే నిట్టూర్చాల్సొస్తుందని,
లాస్ట్ సప్పర్ ప్రేమసందేశం
సారంతో సహా
సర్వం
మర్మం విప్పిమనసుకు చెప్పి పెట్టుకోవాలి.
ఎన్ని మాయలు ఓడించినా
అమ్ములపొది అమాయకత్వాన్ని  వీడద్దని,
కాలంగాయాలతో హృదయమెంత ఎడారిబీడైనా
ఒయాసిస్సులను కడుపుతూనే ఉండాలని,
కచేరీలో పాట ఎన్ని సార్లు అభాసుపాలయినా
నాగస్వరానికి ఆశలలా ఉర్రూత లూగుతుండాల్సిందేనని
నీకు నీవే నచ్చచెప్పుకోవాలి
అదుపులేని పసితనాన్ని
ఆకాశమైనా శాసించలేదు.
జ్ఞానం, ధ్యానం, సత్యం, నిత్యం-
మేథస్సు ఫిదా అయే ముచట్లేమో గానీ
ముక్కుపచ్చలారనితనానికి
అచ్చమైన పచ్చితనమే ముద్దూమురిపం.
చీకటికి భయపడి కిటికీలు మూయడం
ఓటమికి జడిసి ఆడడమే మానేయడం
పెద్దల నిర్వాకం.
పసితనానికి వసంతమే గాని
శిశిరం ఉండదు
బతకడం దానికి
ఆటల్లో అరటిపండు
బతుకు బుధ్బుదప్రాయమనేది
పెద్దల వేదాంతం
బుడగనుంచి బుడగకి దూకడం
బుడతతనం
సిద్దాంతం
పుడకల దాకా  పురిటితనాన్నే
పట్టుకునుండాలని
ఉమ్మనీరు చిమ్మచీకటి  వదిలి
అమ్మ పక్కకి  చేరినప్పుడే
అందుకే నువు
సంకల్పం చెప్పుకోవాలి
-
కర్లపాలెం హనుమంత రావు
నవంబర్ 22, 2012




Wednesday, November 18, 2015

మోక్షమే లేదా!-కవిత

పరగడుపునే లేచి
మంచి పద్యంతో పుక్కిలించాలని,
పుల్లాపుడకా రాయీరప్పా
పంటికింద పడకుండా
తేలికపాటి వార్తలే
స్వల్పాహారంగా సేవించాలనీ,
మధ్యాహ్నబోజనంలో
న్యూసు పేపరు
మధ్యపేజీ కథనాలు
సుష్టుగా లాగించినా..
టీబ్రేక్ టైములో
న్యూస్ ఐటం
ఎంత వెరైటీగా ఉన్నా..
లైటుగా మాత్రమే తీసుకోవాలనీ,
రాత్రి పడుకునే
రెండుగంటలముందు
చిన్నప్పుడు
అమ్మమ్మా తాతయ్యా చెప్పిన
కమ్మకమ్మని కథల్లాంటి
చర్చల్ని తప్ప వేరే ఏవీ
అస్సలు చూడరాదని..
నా అధికరక్తపు పోటు జబ్బుకు
ప్రకృతివైద్యనారాయణుడిచ్చిన సూచన

ఈశ్వరా!
ఈ ట్వంటీఫొరవర్సు
రొటీను టీవీ న్యూసుచానెల్స్
ట్వంటీఫస్టు సెంచరీలో
నా బతుక్కింక
మోక్షమే లేదా!
- కర్లపాలెం హనుమంత రావు

18-02-2011

Tuesday, November 17, 2015

వచన పద్యం- ఒక పరామర్శ


మనవిః
నేను కవిసంగమం ఫేస్ బుక్ లో  ఒకప్పుడు నేను ఇచ్చిన టపాలకు స్పందించే ఓ సందర్భంలో ప్రముఖ కవి, విమర్శకులు అఫ్సర్  Prose Poetry ని గురించి ప్రస్తావన  చేసారు. అఫ్సర్ జీ అన్నట్లు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ వచనపద్యమే. అనుమానం ఏముంది?
అయితే ఈ వచనపద్యానికి మూలమేది? ఈ ఆసక్తిలోనుంచి పుట్టిన చిన్న వ్యాసం ఇది. వర్తమాన వచనపద్యాన్ని కూలంకషంగా విశ్లేషించుకునే పని అయితే కాదు. విజ్ఞులు గమనించగలరు!

వచన కవిత
వచనకవితకు మూలం ఫ్రెంచి Verse Libre, ఆంగ్ల Free Verse.
ఫ్రెంచి రచయిత జూలిస్ లాఫోర్గ్ (Jules La forgue) ఫ్రెంచి వచనకవితకి ఆద్యుడంటారు. మలార్మే వాదన ప్రకారం  వచనానికి విషయం ప్రధానమైతే, వచనకవితకు నిగూఢభావం ప్రధాన లక్షణం. ఫ్రెంచికవితనుంచీ ఆంగ్లకవులు ప్రభావితమైతే.. ఆ ఆంగ్లకవిత్వంనుంచీ తిరిగి ఫ్రెంచికవులు ప్రభావితం అయారంటారు. ఆర్నాల్డ్, వాల్ట్ విట్మన్ లాంటి వాళ్ళు ఆంగ్ల వచనకవితకు మెరుగులు దిద్దారని అనుకున్నా.. షేక్ స్పియర్, వెబ్ట్స్ ర్, మిల్టన్ రచనల్లో వచనపద్యాల చాయలు కనిపిస్తాయి. తెలుగువచన పద్యం మీద ఆంగ్లం, ఫ్రెంచి ప్రక్రియలు రెండూ ప్రభావం చూపించాయని చెప్పుకోవడమే ధర్మం.
తెలుగు వచనపద్యం అతినవ్యులు(అప్పటికి) పండించిన పంట. శ్రీశ్రీ కవితా.. ఓ కవితా’ మాత్రాచందస్సుల వాసన ఉన్న కవిత.


‘..నా విన్నవి కన్నవి విన్నవించగా
మాటలకై వెదుకాడగపోతే-
అవి,
పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకారణాల సంకెళ్ళు విడిచి
చందస్సుల పరిష్వంగం వదలి-
వడిగా,  వడివడిగా
వెలువడినై, పరుగిడినై, నా ఎదనడుగిడినైః
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్ ఝరవత్ పరివర్తనలో,
సంక్రమణం చేశానో,
నా సృష్టించిన గానంలో
ప్రక్షుళిత మామక పావపరంపర
లానంద వశంవధ హృదయుని చేస్తే-…'
ఇలా సాగుతుంది నడక.
ఈ మాత్రం మాత్రాచందస్సు  కూడావచనపద్యంలో కనిపించరాదని ఈనాటి కవుల అభిప్రాయం. వచనగేయానికి నిరాడంబరతే ముఖ్యం. నిరాడంబరతను నిరాలంకారంగా
అపోహ పడకూడదు. శ్రీశ్రీనే రాసిన మరో వచన పద్యంలో ఈ తేడాని మనం గమనించవచ్చు.
'గదిలో ఎవరూ లేరు
గదినిండా నిశ్శబ్దం
సాయంత్రం ఆరున్నర
గదిలోపల చినుకులవలె చీకట్లు’
నిత్యవ్యవహారానికి సన్నిహితంగా ఉండే పదాలు! చివరి పంక్తి గదిలోపల చినుకులవలె చీకట్లు’ ఉపమానం పద్యం మొత్తానికి  ప్రాణం. అయినా అలంకారాలేవీ లేవన్నంతగా నిరాడంబరత! గదిలో ఎవ+రూలేరు/గదినిండా+నిశ్శబ్దం; ఈ ధోరణిలో విరిచి చూస్తే ఇది త్ర్యస్రగతిలో సాగినట్లు అర్థమవుతుంది. కానీ చదువుతున్నప్పుడు మాత్రం ఈ లయస్పృహే తప్ప లయజ్ఞానం ఉండదు. ఇలా అంతర్లయ’తో సాగే నడక వచనగేయానికి ఆయువుపట్టు.
శబ్దలయను, సంగీతగుణాన్ని గేయప్రక్రియలో భావదారిద్ర్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ఒక ముసుగుగా దుర్వినియోగ పరిచే ప్రమాదం పొంచివుందని నేటి కవుల అభియోగం. భావానికి అనుగుణంగా శబ్దప్రయోగం చేసే చేవగల కవికి స్వీయానుభూతిని సమర్థవంతంగా పాఠకుడికి బట్వాడా చేయడం పెద్ద కష్టమైన పని కాదు.
స్వచ్చంగా, స్వేచ్చగా హృదయం ఎలా కంపిస్తే అలా ఆలపించాల్సిన అవసరమే గేయాన్ని కాదని వచనగేయాన్ని ఆశ్రయించడానికి అసలు కారణం కదా! అనవసరమైన  శబ్దాడంబరాలు, అవ్యవహారిక పదప్రయోగాలూ, తెచ్చిపెట్టుకున్న లయప్రయాసలు అనుభూతిపానకంలో పుడకల్లాగా అడ్డొస్తాయన్నవాదం సమంజసమే.

వచన పద్యంలోనూ ఒక లయ ఉంటుంది. కాని ఇది ప్రయత్న పూర్వక మైన గణకూర్పునేర్పుతో సాధించింది కాదు. ఒక విసురు, ఊపు సృష్టించిన విచిత్రమైన లయ అది.ఏ నియమాలు లేకుండా శుద్ధవచనం లయాత్మకంగా మోగుతుందో అదే వచనగేయం’ అని నిర్వచించారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా॥సి,నారాయణ రెడ్డి. (ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములుఃప్రయోగములు-పుట.615))

వచనానికిలాగా వచనపద్యానికి విషయవైశద్యంతో పని లేదు. పాఠకునిలో భావోద్రేకాన్ని రగిలించాల్సిన లక్ష్యాన్ని ‘English Literature In The Twentieth Century’ కూడా నొక్కి చెబుతుంది-'In Free Verse we look for the insurgent naked throb of instant moment' అనే ప్రకటనలో.
పూసల్లో దారంలాగా దాగుండాలి లయ వచనపద్యంలో. ఆ లయకూడా గేయప్రక్రియలో లాగా ఒకే రీతిలో ఏక్ తారా’ మాదిరి మోగరాదు. వచనపద్యం లయ ఒకసారి గజగమనం. ఒకసారి తురగవేగం. ఒకసారి ఎగసిపడుతోవచ్చే అలల అలజడి. ఒకసారి ఒక్కసారిగా విరిగిపడే అలఆక్రందన. భావాలన్నీ ఒకే తూగులో సాగవు వచనపద్యం ప్రక్రియలో. భావాన్ని బట్టి ఊపు.  లయ ఎలా సాగినా వచనగేయం మొత్తానికి  అంతర్లయ ఒక ఉపసంస్మరణలా ఉపయోగపడాలి.
సూటిగా.. తేటగా చెప్పే అవకాశంవల్ల వచన కవిత్వానికి జీవితంతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. సమకాలీనమైన అంశాన్ని కవితావస్తువుగా స్వీకరించడానికి వచనకవిత ఒక చక్కని వాహిక అయింది. పరభాషాపదాలను అవసరమైన చోట ఏ ఎబ్బెట్టుతనం లేకుండా ఉపయోగించుకునే వెసులుబాటు వచనకవితలో మెండు. అధునాతన భావచిత్రాలను విరివిగా వ్యక్తీకరించే వీలు అధికంగాగల  తాజా  కవితాప్రక్రియ వచనకవిత. ముఖ్యంగా వచనపద్యం.
ఇంగ్లీషు ఇమేజినిస్టుల వచనపద్యాన్నిమన అతినవ్యులు ప్రధానవాహికగా చేసుకోడానికి ఇదే కారణం. శిష్టవ్యాకరణం, వృత్త, చందస్సులు,గణాల రణగొణలవంటి బంధనాలేవీ లేని కవిత్వం కాబట్టే కవిసామాన్యానికి హృదయగతభావాలను, జీవితానుభవాలను కవితామయంగా ఆవిష్కరించుకునే చక్కని అవకాశం దక్కినట్లయింది.
త్వమేవాహం, సినీవాలి వంటి కవితల్లో చిత్రవిచిత్రమైన చందోప్రయోగాలు చేసిన ఆరుద్ర -సీతాకోకచిలుక, మాత్రాగణబద్ధమైన కావ్యసృష్టిలో అఖండత నిరూపించుకున్న దాశరథి-  మస్తిష్కంలో లేబరేటరీ’ వంటి గొప్ప వచనపద్యాలూ సృజించారు. సంప్రదాయ ప్రయోగాలమీద అమితమైన పట్టువున్న నారాయణబాబు వచనకవితాప్రక్రియవైపు మొగ్గిన తరువాత రాసిన  రుధిరజ్యోతి’, శిష్ట్లా నవమిచిలుక’ గ్ొప్ప వచనకావ్యాలు. తొలిసారి వచనకవితా ప్రక్రియలో కుందుర్తి చేసిన రచన తెలంగాణా’ వచనకావ్యాలలో ఒక సమగ్రకావ్యం.
అక్కిరాజు ఉమాకాంతపండితులు భావకవిత్వానికి ఆపాదించిన పులుముడు దోషం, దండగగణాలను  నిర్ద్వందంగా తిరస్కరించిన వచనపద్యం కాలానుగుణంగా
చాలామార్పులకు లోనవుతూ బహుముఖప్రజ్ఞావంతుల కలాల చలవవల్ల నేటికి కవిత్వమంటే వచనకవిత్వమే అన్నంతగా తెలుగుసాహిత్యంలో స్థిరపడిపోయింది.
విస్తరణ భీతివల్ల  ముఖ్యమైన మధ్యకాలపు వివిధ ఉద్యమకవితారీతులను ప్రస్తుతం ప్రస్తావించడం లేదు. ప్రక్రియ ఏదైనా కవిత్వం పరమార్థం- కవి తన భావనాలోకంలో పాఠకుడినీ రసవిహారం చేయించడం.
వాయువేగంతో మారుతున్న కాలగమనంతోపాటు వచనకవితా ప్రక్రియల్లోనూ పెనుమార్పులు చోటుఛేసుకుంటున్నాయి. ఈనాటి వచనపద్యం ఏ ధోరణిలో ముందుకు సాగుతుందో.. ఓ నాలుగు   వచనపద్యాలు పక్కపక్కన పెట్టుకుని అధ్యయనంచేస్తే ఔత్సాహికులకు ఓ దారి కంటపడవచ్చు. ఒక సారి చూద్దాం!
-కర్లపాలెం హనుమంతరావు

-అఫ్సర్- కొన్ని కాఫీ సమయాలు
ఖాళీతనం డొల్లతనమో/బోలు తనమో కాదు, చాలా సార్లు అది నిలదీస్తుంది. తలపోతకి తలుపు తీస్తుంది. నీతో నువ్వు కలబడడానికి స్థలాన్ని, కాలాన్ని సృష్టిస్తుంది. ఈ సృష్టిలోంచి నువ్వు నువ్వవవుతావ్, వొక చిరునవ్వవుతావ్! ఈ గుట్టు విప్పడం తెలియకపోతే వికల కలకల మవుతావ్!
1
ఈ కఫే నన్నెంత కలవరపెడ్తుందో! దీని కప్పూ సాసర్ల కలుపుగోలు గలగలల్లో నా వొంటరితనమో/ రికామీ తనమో/ ఏమీ కానీ/ ఏమీ లేనితనమో ఎంత దయలేకుండా మోగుతుందో?
వొక ఏకాకి కాఫీ కప్పు ముందు నేను.
నా ఆలోచనల్నీ, ఆవేశాల్నీ, వుద్వేగాల్నీ(శాంతమో/అశాంతమో!) అన్నిట్నీ ఆ కప్పులోకి దాని పరిమళపు నురగలోకి వొంపుకొని
అందులోకే నా చూపుల్ని తదేకంగా ముంచుకుంటూ
ఎంత సేపని
ఎంత
సేపని
ఇలా—-
కూర్చుంటాను నన్ను నేను కూర్చుకుంటూ రెప్పలార్పక ఏమార్చి చూసుకుంటూ.
2
కఫే
నన్నెంత నిలదీస్తుందో?
నిటారుగా నిలబడ్డ ఈ జావా కాఫీ కప్పు వొక్కో సారి వొక్కోలా
కనిపిస్తుందీ అనిపిస్తుందీ
వొక ఎడతెగని – తెంపడానికి మనసొప్పనే వొప్పని, తెంపే సమయానికి నవనాడులూ తెగిపోయే – సంభాషణ తరవాత నువ్వొదిలి వెళ్ళిన చిలిపి నవ్వులా-
3
నా వీపెనక వొక అదృశ్య గుయెర్నికాలోని వెయ్యేసి ముఖాలన్నీ
నన్ను గుచ్చి గుచ్చి చూస్తూండగా
పగలబడి నవ్వుతూండగా
ఇక్కడలేని నీతో నీలో నేను మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ
ప్రతిసారీ అనుకుంటా ఇప్పుడే ఇక్కడికి నువ్వొచ్చి వెళ్ళావని
నీవున్న క్షణాల భారాన్ని ఈ కుర్చీ ఇంకా మోస్తోందనీ..!
4
వొకరినొకరం దాటుకుంటూ వెళ్లిపోయాక గుండెలదిరేలా పాడుతుంది పిచ్చి Adele అదే పాట
సెల్ఫోన్ అలల మీంచి!
ఎవరు చెప్పారామెకి నాలోపలివన్నీ?
కప్పులో కాఫీ చల్లారి గొంతులోకి వెళ్లిపోతుంది ఎలాగో!
ఎప్పటికప్పుడు కప్పు ఖాళీ కావాల్సిందే
నీ లోపల ఎంత ఖాళీ వుందో నీకు తెలియడానికి,
నువ్వందులో ఏం నింపుకోవాలో తెలుసుకోడానికి.
5
అయినా తెలుస్తుందా చెప్పు,
ఈ ఖాళీ ఎంత ఖాళీనో?
05-09-2012
————————————–

హెచ్చర్కే- భగవంతుడు
 పాపా‍యి బొమ్మేసే సరికి ఆకాశం తెల్లబోయింది
నక్షత్రాలు ఎర్రబడ్డాయి
కొన్ని పోల్కా డాట్స్ బాగా కలిసిపోయి చందమామ‍ నవ్వేసింది
నీలికాంతుల నీరు, పసుపు పొలుసుల చేపలు, సీతాకోక చిలుకలు,
ఏవేవో లోకాలు, ఇంకా… ఏం కావాలనుకుంటే అవి అయిపోయాయి
పాపాయి ఏం చేసినా నక్షత్రాలకు, చందమామకు
ఎందుకంత ఇష్టం, ఆకాశానికి ఎందుకంత ఆశ్చర్యం,
వేణువు విన్న గోవుల్లా దిగి వస్తాయెందుకు లోకాలు
కన్నీటి వంటి నీటి రంగులతో తడిసిన కాగితాలను తొక్కుకుంటూ
పాపాయి వేలు పట్టుకుని బయటికి వెళిపోయి, ఆకాశాన్నిఅడిగాను
ఎవరో అలవోకగా విసిరేస్తే రక రకాల రూపాలు ధరించిన మేఘాలు
గాలికి కొంచెం నవ్వి చెప్పాయి
ఇంకా పైన ఉన్నాడో లేడో మాక్కూడా తెలియదు గాని, ఉంటే గింటే,
భగవంతుడు పాపాయిగానే ఉంటాడు’: ఆ తరువాత
నాకెవరితో ఎలాంటి పేచీ లేదు, భగవంతుడితో కూడా
పేచీ గీచీ వుంటే పాపాయిగా ఉండని అధికారి తోనే
పాప పుణ్యాల నిర్వచనాలతోనే, పుక్కిటి పురాణాలతోనే
25-8-2012
———————–

బివివి ప్రసాద్ -దినచర్య
ఉదయం తూర్పుగుమ్మం తలుపులు తెరవగానే
అప్పటివరకూ గుమ్మంతెరపై ఆడుకొంటున్న కాంతిదేవతలగుంపు
గదిలోకి ప్రవేశిస్తుంది
ఈ వెలుతురు ఉత్తవెలుతురు కాదనుకొంటాను
ఇది గదిలోని చీకటితోపాటు, నా లోపలి దిగులునీ మాయం చేస్తుంది
పసినవ్వులాంటి స్వచ్ఛమైన వెలుతురు
నక్షత్రాల కాంతివంటి లోతైన వెలుతురు
చొరవగల స్నేహితుడిలా
నాలోంచి నన్ను బయటికిలాగి ప్రపంచంలోకి తోసేస్తుంది
అప్పుడు ప్రపంచంనిండా పరుచుకొన్న జీవితోత్సవానికి
నా కళ్ళు విశాలంగా తెరుచుకొంటాయి
నవ్వుతానో, గాయపడతానో, నవ్విస్తానో, గాయపరుస్తానో
నా పాత్ర నేను పోషిస్తాను
నా నమ్మకాలూ, ఉద్వేగాలూ
పగలంతా నన్నొక తొలుబొమ్మను చేసి ఆడిస్తాయి
దినాంతాన
ముఖంమీద పరుచుకొన్న ప్రియురాలి వస్త్రంలాంటి వెలుతురు
ఏ గాలీ వీయకుండానే ఎటో ఎగిరిపోతుంది
దిగులులాంటి చీకటి
తన విశాలబాహువులు చాపి నన్ను తన హృదయానికి హత్తుకొంటుంది
అనాదికాలంలో పాతుకుపోయిన జీవితేచ్ఛ ఏదో
నన్ను ఊహల కొమ్మలతో నిండిన వృక్షంలా నిలబెడుతుంది
ఇవాళ సంపాదించుకొన్న సుఖదు:ఖాలు
వలస పక్షులలా నాలోపల చేరి కాసేపు రణగొణధ్వని చేస్తాయి
నాలోపలి పక్షుల సందడి ప్రాచీన నిశ్శబ్దంలో కరిగిపోయాక
రేపు మళ్ళీ కొత్తగా వచ్చేందుకు, ఈ రాత్రిలోకి మాయమౌతాను.
*03-08-2012
————————-

వంశీధర్ రెడ్డి- మదర్ లాండ్
మన డబ్బుతో
మన్తో పన్జేయిస్తూ
మనకే జీతాలిచ్చే ప్రజాస్వామ్యంలో,
సుబ్రహ్మణ్యస్వాములూ
తెహల్కా డాట్ కాములూ గడ్డి తినుంటే,
రాజా”వారీపాటికి సాంబారిడ్లీ తిని, మెరీనాలో
భావకవితల్రాద్దురు కనిమొళిని కని,
దేశభద్రత మట్టికొట్టుకుపోయేది..
జర్నలిజం మొఫసిల్ వార్తలూ
బొడ్డుసుందర్ల ఉవాఛలేరాస్తే,
న్యాయం గనుల”గాల్లో” కలిసి
సచివులు కాక్ టెయిల్
ఉతార్ పెగ్గులేద్దురు బెల్ట్ షాపుల్లో..
హయ్యర్ హైరార్కీ కి మేళ్ళు,
జనాలకి రాళ్ళు మిగిలి,
పళ్ళెప్పుడో ఊడి,నిజాల్నమిలీ నమిలీ,
తలొకటే ఖాలీ, పగిలేందుకు..
యువరాజేడి కనపడ్డూ
కోచింగా సార్వత్రికెన్నకల్లో ప్రధానిగా,
ఉద్యమాలేవి వినపడవూ
మళ్ళీ వ్యూహాత్మక మౌనమా,
B.P.L కింద
కాందిశీకుల ద్విధావిఛ్చిత్తి,
I.P.L మీద పెద్దతలల
కరెన్సీ చెయిన్ రియాక్షన్..
, దరిద్రగొట్టు దేశం,
-“పట్టుకోండ్రా వాణ్ణి,
ఇన్సల్టింగ్ ది నేషన్ ఇన్ పబ్లిక్,
కాగ్నైజబుల్ అఫెన్స్,
వారంట్ భీ అవసరం లేదు,
నూకండి బొక్కలో”
నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ,
నా ఇల్లు అందులో ఒక కమ్మని ప్రదేశమూ….
date 27.08.12

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...