ఉమ్మనీరు చిమ్మచీకటి
వదిలి
అమ్మ పక్కకి
చేరినప్పుడే
సంకల్పం చెప్పుకోవాలి
లోకం మెల్లగా
పరిచయమయే కొద్దీ
లోపలి ఇంద్రియాలకు
పరాకులు చెప్పుకోవాలి
ఈ పాలబుగ్గల నునులేత నిగారింపులు
కాలంజలపాతానికి ఆట్టే కాలం నిలిచేవి కావని
ఊహలు బలిసేకొద్దీ
ముగ్ధత్వం ఈడేరుతుందని,
ప్రౌఢుల లోకంలో
పాలే నీళ్ళు నీళ్లే పాలవుతాయని,
పూలూ ముళ్ళలా గుచ్చుకోవచ్చని,
పురుగుల కోసమే దీపం
వెలుగులు నటిస్తుందని,
ప్రతి ఆశా చివరకు
‘యూ టూ బ్రూటస్స’నే నిట్టూర్చాల్సొస్తుందని,
లాస్ట్ సప్పర్ ప్రేమసందేశం
సారంతో సహా
సర్వం
మర్మం విప్పిమనసుకు చెప్పి పెట్టుకోవాలి.
ఎన్ని మాయలు ఓడించినా
అమ్ములపొది అమాయకత్వాన్ని
వీడద్దని,
కాలంగాయాలతో హృదయమెంత ఎడారిబీడైనా
ఒయాసిస్సులను కడుపుతూనే ఉండాలని,
కచేరీలో పాట ఎన్ని సార్లు అభాసుపాలయినా
నాగస్వరానికి ఆశలలా ఉర్రూత లూగుతుండాల్సిందేనని
నీకు నీవే నచ్చచెప్పుకోవాలి
అదుపులేని పసితనాన్ని
ఆకాశమైనా శాసించలేదు.
జ్ఞానం, ధ్యానం, సత్యం, నిత్యం-
మేథస్సు ఫిదా అయే ముచట్లేమో గానీ
ముక్కుపచ్చలారనితనానికి
అచ్చమైన పచ్చితనమే ముద్దూమురిపం.
చీకటికి భయపడి కిటికీలు మూయడం
ఓటమికి జడిసి ఆడడమే మానేయడం
పెద్దల నిర్వాకం.
పసితనానికి వసంతమే గాని
శిశిరం ఉండదు
బతకడం దానికి
ఆటల్లో అరటిపండు
బతుకు బుధ్బుదప్రాయమనేది
పెద్దల వేదాంతం
బుడగనుంచి బుడగకి దూకడం
బుడతతనం
సిద్దాంతం
పుడకల దాకా
పురిటితనాన్నే
పట్టుకునుండాలని
ఉమ్మనీరు చిమ్మచీకటి
వదిలి
అమ్మ పక్కకి
చేరినప్పుడే
అందుకే నువు
సంకల్పం చెప్పుకోవాలి
-
కర్లపాలెం హనుమంత రావు
నవంబర్ 22, 2012
No comments:
Post a Comment