'ఓ మై గాడ్!'- సరదా వ్యాఖ్య
హఠాత్తుగా ఎదురుగా ఓ ఆకారం ప్రత్యక్షమయింది.
నెత్తి
మీద కిరీటం. నుదుట నిండా పట్టెనామాలు.. పొట్టకి తిరుచూర్ణాలు. పేరు తెలీని అభరణాలు!
'ఎవరు
స్వామీ తవఁరూ? నా నడినిద్రలోకి
ఎందుకిలా నడిచి వచ్చారు?’
'మానవా! నన్నే
మరిచిపోతివా?’
'ఓఁ..
మై.. గాడ్! నువ్వా దేవా! పడీ పడీ నీ గుళ్లూ గోపురాల చుట్టూ ఎన్ని వేల సార్లు పొర్లుదండాలు పెట్టానయ్యా! అప్పుడేమీ కనికరించని
దయామయా.. ఇప్పుడిదేమి.. పిలవని పేరంటానికిలా
ఊడిపడితివి.. దేవదేవా?’
'పిలవని
పేరంటమా! శంఖు చక్రాదులనైనా చంకనేసుకోకుండా వట్టి గదాయుధంతోనే వచ్చినందుకా ఈ చులకన? అరక్షణం కిందటే గదటయ్యా 'ఓఁ.. మైఁ.. గాడ్!' అంటూ గావుకేక
వేసితివీ!’
'గాడ్! అదా తమరి గోల! రాత్రింబవళ్లు మా టీవీలల్ల మహాకూటములూ.. ప్రజాకూటములంటూ ఒహటే రాచకీయ నాటకాలు స్వామీ! ఏ మిత్రపక్షాల మధ్యున్నది ఏ
శత్రుత్వమో, ఏ శత్రుశిబిరాలది ఏ మిథ్యా మిత్రత్వమో! ఆ అయోమయం తలకెక్కక ఓ సారేమన్నా 'ఓఁ.. మై గాడ్' అంటూ అలా గావుకేక వేసానేమో! అంత మాత్రానికే తమరింత ఆత్రంగా గరుడవాహనం కూడా మరిచి వగర్చుకుంటూ వేంచేసెయ్యాలా స్వామీ.. వింతగా ఉందే! అవతల తిత్లీ తుఫాను దెబ్బకు దిబ్బా దిరిగుండం మొత్తం
కొట్టుకుపోయి తలలు బాదేసుకుంటున్నారయ్యా తమరి భక్తజనాలు! ఆ బక్కభక్తుల దగ్గరికైనా
వెళ్లి నీ వరాల జల్లులేవో కురిపించుకోవచ్చుగదా! కోదండ రామావతారులు.. తమరికీ ఏ కోడైనా కత్తితో అడ్డొచ్చిందా దేవా? ఆ నయా పవర్ స్టారెవరో వచ్చి కాచి కాపాడతాడేమోనని
నిద్దట్లో కూడా పాపం బక్కాభిమానులు
ఉలిక్కిపడి అరుస్తున్నారయ్యా! ఆ స్టారు
రాక ఎటూ రవ్వంత లేటవుతుందని సర్వాంతర్యాములు తమకూ తెలీకా! ఎందుకయ్యా ఎంతకూ
దర్శనమివ్వని తమరి నిర్వికారపు మెలిక?’
'కంటికి
కనిపించకుంటేనే ఎంతో అల్లరీ ఆగమూ అన్ని గుళ్లూ గోపురాలల్లో! ఇహ దయతలచి ఒక్క
క్షణమేగదా అని దభిక్కని దర్శనభాగ్యమిచ్చేస్తినా! వెయ్యి
యుగాలకు సరిపడా పిట్టకథలు అల్లి మరీ నాకున్న ఈ రవ్వంత పరువూ పవిత్రతలు
మంటగలిపేస్తారన్న భయం భక్తా!’
‘అలాగని.. నా నడినిద్రట్లోకిలా ధడాల్మని
వచ్చేసెయ్యడవేఁ? వీరలౌకికవాదులం గదా మేం. ఎంత వేధించినా మీ మతంలోకి రాబోము. పొత్తులంటేనే సోషల్ మీడియాలల్లో
బొత్తులు బొత్తులుగా జోకులు పేలుతున్న ఈ సీజన్లో.. ఈశ్వరా నా నిద్రట్లోకిలా
చంద్రన్నలా దూరింది మళ్లీ ఏ కొత్త రాజకీయరంగ అరగంగేట్రానికి స్వామీ? ఇదేమీ తమరి
స్వర్గధామం కాదు! ఒక్క ఫొటోకి ఐదు నిమిషాలల్లో వెయ్యి మార్ఫింగులొచ్చేసే మా పాడురోజులు! ఇహ కలహభోజనులంటావా? మీడియా ముసుగులో గాలికి తిరిగే వారి జోరు విడిగా
చెప్పపనే లేదు. ఏ దారే పొయ్యే దానయ్య సెల్ఫోను కన్ను మన మీద పడ్డా అర్థరాత్రిలోపే
పెద్ద వైరలైపోతుందయ్యా స్వామీ వీడియో! ‘చీకటి ఒప్పందాలు’ అంటూ తెల్లారి
పత్రికలు పోసే పతాక శీర్షికల తలంట్లకు ముందు వైరల్ ఫీవర్లు ముంచుకొచ్చేది మాకు. నిరాకారులు
తమరు. తమాషాగా తగిన సందు చూసుకొని మా అమిత్ ‘షా’ మాదిరి చిటికెలో తప్పించుకోగలరు. వేళకు మొహం
చాటేసే కళ మా రాహులు బాబుకు మాదిరి మాకే దిగ్గీబాబా
ట్రైనింగయినా ఇవ్వలేదు మహాత్మా! తగులుకున్నోడికల్లా తగు బదుళ్లు చెప్పలేక మా
చిదంబరం సాబులా పాతచెప్పుల అనుభవం మేం
చవిచూడాలనా తమరి స్కీము?తక్షణమే తమరిక్కణ్నుంచి తప్పుకోడం ఉభయత్రా శ్రేయస్కరం’
'నీలో
నచ్చేది నాకదే చిచ్చర పిడుగా! ఉచ్ఛనీచాలేవీ
చూసుకోవు. ఎంత మోదీనైనా ‘గీదీ’ అనేసేయగలవు. నా పేరున వేదాలు వల్లించి
ఓటర్లను ముంచే భూతాల కన్నా మీ టైపు బోల్డ్ శాల్తీలే లోకానికి బెటర్. అందుకే అర్భకా! నువ్విట్లా నా పేరుతో
నిట్టూర్చీ నిట్టూర్చగానే ఇట్లా నిట్టనిలువుగా నీ ముందుకొచ్చి నిలబడింది నేను!
ఎట్లాగూ వచ్చాను కాబట్టి.. వట్టి చేతుల్తో
వెనక్కి మళ్లడం కుదరదు. మా లక్ష్మమ్మతో మొట్టికాయలు తప్పించేందుకైనా.. ప్లీజ్..
ప్లీజ్.. ఏదో.. నీకు తోచిందే.. ఓ కోరిక,, చిన్నదో.. పొన్నదో యాచించుకో నాయినా! ‘తధాస్తు’ అని దీవించి నా దారిన నేను వెళ్లిపోతాను’
దేవుడి దీనస్థితికి నిజంగానే జాలేస్తోంది. నా నిద్ర కోసమైనా ఏదో ఓటి కోరక తప్పేట్లులేదు
పరిస్థితి.
'ఆపద్భాంధవా!
ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద సర్వత్రా ఉత్కంఠగా ఉంది! కోట్లలో కొనుగోళ్లు నడుస్తున్నట్లు
వార్తలొస్తున్నాయి. కొద్ది మందైనా ఈ ఊబి నుంచి బైటపడతారు.. దయచేసి రాబోయే ఫలితాలు
ముందే తమరు సెలవివ్వండి సర్వేశ్వరా!’
'సారీ
భక్తా! అది మీ భూలోక సర్వే సిబ్బంది భుక్తికి ఇబ్బంది. ఇ.సి కోడులతో నాకు ఇబ్బంది.
మరింకేదైనా కోరుకో మానవా!'
‘అయితే.. ఆ
అయోధ్యలో నీ గుడి గురించి ఓ అనుమానం ఉంది ..'
'ఆ బంతి
సర్వోన్నత న్యాయస్థానం కోర్టులో ఉంది. మరింకేదైనా కోరుకో మానుషా!'
'ష్షూఁ..
చచ్చే చావొచ్చిందయ్యా స్వామీ తమరి సవాలక్ష షరతులతో! పోనీ బి.సి. కులాల ఆందోళనలన్నీ
స్వయానా చూస్తుంటివిగదా! పర్సనల్ గా నా కే ఫేవరూ వద్ధు కానీ వరదా.. పాపం.. వాళ్ళ
రక్షణకని తమరే ఏదైనా వరం ప్రసాదించచ్చు కదా!’
‘అడ్డె.. అడ్డె.. ఆపవయ్యా నీ కోరికల వరద! ఎవరి మనోభావాలకూ
దురద రారాదు! ఆ కండిషన్ మైండులో ఉంచుకొని మాత్రమే నీ డిమాండుండాలి.
మైండిట్ మై సన్! ప్రొసీడ్.. నిర్భయంగా!’
‘నిర్భయ
అంటే గుర్తుకొచ్చింది దర్భశయనా! పోనీ.. ఆ ‘నిర్భయ’ కేసులోని అర్భకుల మీదయినా దయచూపించరాదా..!’
‘మహిళామండళ్లు
మండిపడతాయయ్యా మందభక్తా! ముందు మా శ్రీ మహాలక్ష్మమ్మే నన్ను చెండుకు తింటుంది! నువ్వే కాదు.. నేనూ
భయపడరాదు.. అలా ఉండాలి నీ నిర్భయమైన
కోరికేదైనా! ఊఁ.. కానీయ్.. కోళ్లు కూసే వేళవుతోందతవతల!’
'సరేనయ్యా
స్వామీ! మహిళలంటే మగాళ్ల జీవిత భాగస్వాములు. ఆ అమ్మలకు సంబంధించిన రిజర్వేషన్
బిల్లే ఏళ్ల తరబడి పెండింగులో ఉండింది. పోనీ.. దాని ఎండింగు కొసమైనా షార్ట్ కట్టు దారేదైనా చూడరాదా మాధవా! ఓ పనైపోతుందీ!’
'పెద్దలసభ
కదరా ఆ రభసను ఓపెన్ చేసింది! క్లోజ్ చేసే డ్యూటీ సైతం పార్లమెంటుదే సుమీ! మరింజేదైనా వెంటనే కోరుకో
స్వామీ చంపక!’
'ఆ ట్రంపు
హెచ్చులు.. హెచ్ వస్ వీసాలూ..’
'అమెరికన్
దేవుళ్ల తగులాటాలయ్యా అవన్నీ! ఇక్కడి దేవుళ్ల పరిధిలోవే నువ్వు కోరుకొనే
వరాలుండాలి. కమాన్! కాల్ వస్తోందవతల్నుంచి. మా శ్రీలక్ష్మిదే! చప్పున కోరుకోరా పప్పుభక్తా..
పీడించక!’
వళ్లు మండింది నాకు చివరికి. ఈ దేవుళ్లతో యవ్వారాలు ఇట్లాగే ఉంటాయని తెలుసు.
ఏదీ సర్వోన్నత న్యాయస్థానాల మాదిరి ఓ పట్టాన
తెగేది కాదు.
అవతలేమో తెల్లంగా తెల్లారిపోతోంది. బైటెవరో
తలుపులు తెగ బాదిపారేస్తుంటిరి! ఏ తుంటరి కంట పడ్డా..‘గాడ్‘తో
గూడుపుఠాణీ .. అంటూ పేపర్ల ఫ్రంట్ పేజీల్లో బఠాణీలు అమ్మేసే రోజులివి.
ఈ 'గాడ్' ని వదిలించుకోవాలంటే ముందు ఇతగాడు ఈజీగా ఇవ్వగల వరాలేవిఁటో తేలాలి.
ఆఁ.. గుర్తుకొచ్చింది. కామాంధులెంతటివారైనా
వదిలేయకుండా కఠినశిక్షలు పడాలంటూ మహిళందరూ తెగ ఉరుముతున్నారివాళ ప్రపంచమంతటా. ఆ ‘మీ.. టూ’ ఉద్యమానికి మీ టూ ఓ ఓటేసేస్తే పోలా! ఎంతటి మొండి గాడ్ కైనా ‘నో’
అనేందుకుండదు గాక ఉండదు. వివరంగా విషయాలన్నీ చెప్పి 'ఉరిశిక్ష'ల్లాంటి
కఠిన శిక్షలేవఁన్నా కుదురుతుందా ముకుందా ఈ కీచకాధములకు? ఎట్లాగూ
దుష్ట శిక్షణ.. శిష్ణ రక్షణ దేవుడిగా తమరి డ్యూటీలోని భాగమేనాయ!’ అని
అడిగాను చివరాఖరికి.
‘ఉష్షో! ఊపిర్లు
లాగేసే డ్యూటీ కాలయముడిది కదరా ఢింబకా! అతగాడి
పనిలో నేను వేలెడితే.. మీ రాజ్యాంగ వ్యవస్థల్లో కేంద్రం జోక్యం మాదిరి గందరగోళమయిపోతుందయ్యా
మా స్వర్గలోకం పరిస్థితి! అవతల మా ఇందిరమ్మ అప్పుడే ఇంటలిజెన్సు వర్గాలను పురిగొల్పింది.
కమాన్.. ఆ కామాంధుల మేటరొదిలి మరింకేదైనా
కోరుకో... క్విక్!’
'తప్పుడు
వెధవలని తెలిసి కూడా శిక్షించడం కుదరనప్పుడు ఎందుకయ్యా దేవుడా నీకిన్నేసి
బిల్డప్పులు! వచ్చినప్పట్నుంచీ చూస్తున్నా.. అంత లావు గదాయుధం భుజం మీద మోయలేక తెగ వగరుస్తున్నావు! పోనీ ఈ బుల్లి దోమనైనా వధించేయగలవా నీ అతిభీకర
గదాయుధంతో?’ వళ్లు
మండి అరిచేసాను మహావెటకారంగా!
'థేంక్ గాడ్
రా బాబూ! ఆఖరికి నా దుష్టశిక్షణ ధర్మకార్యానికి సరిపడ్డ కోరికనే కోరావు బిడ్డా! ఇదే చూడుము! మదీయ
గదాఘాతంబుతో ఈ దుష్టదోమను ఒక్క వేటున దునుమాడువాడను’ అంటూ పాండవవనవాసం ఎన్టీఆర్
మార్కు అబినయంతో మశక సంహారం సీనును
కళ్లక్కట్టించేసాడా విశ్వరూపుడు. కళ్లు నులుముకొని చూసే లోపే అంతర్ధానమూ అయిపోయాడీ అనంతశక్తిసంపన్నుడు!
మిజం చెప్పద్దూ! దేముడి పీడ వదిలినందుకన్నా దోమ
పీడా వదిలినందుకు బ్రహ్మానందభరితమయింది నా మానసమంతా ఒక్క క్షణం.
ఒక్క క్షణమే బాబూ ఆ ఆనందమంతా! దైవగదా
ప్రహారానికి చచ్చినట్లు మాత్రమే నటించినట్లుంది ఊ దోమాజీ! ఏ నక్సల్స్ గ్రూపులో
చేరి శిక్షణ పొందిందో గాని మరి.. శత్రువలా కనుమరుగవగానే యధాప్రకారం తన
రక్తపీడనోద్యమాన్ని పునరుజ్జీవనం చేసేసింది.. నా మీద! అదీ కథ!
ఇదేం సొదరా బాబూ? ఇందులో ఏం నీతి ఉందని ఇంత
వూదర అని కదా తమరి చీదర! ఉంది సోదరా!
సాక్షాత్ సర్వశక్తిసంపన్నుడైన సర్వేశ్వరుడంతటి మహాదేవుడే
ఆఫ్ట్రాల్ ఓ బుల్లి దోమస్యనే దిగ్విజయంగా
జయించని ఈ కాలంలో.. ఇహ దేవుడిలాంటి మన
ప్రధాని మోదీజీ మాత్రం ఏ మహిమలు.. మాయమంత్రాఅలు చూపించి దేశాన్ని ఉద్దరించగలడు? వూరికే
బండరాళ్లేసెయ్యడమే గానీ ఎవరో ప్రసాదించిన ప్రత్యేక హోదా, నిధులు, విధులు, నీళ్లు,
నియామక వరాలను సంపూర్ణంగా తీర్చి ఎలా నిభాయించుకోగలడు? పనిలేని నేతలంతా నిష్కారణంగా కల్సి ‘సేవ్ ది నేషన్’ వంకతో ధానంతటి
పెద్దను వృథాగా వేధించడం తగదు కాక తగదనేదే ఈ కథ చెప్పే అంతిమ నీతి!
***