కవిత్వం ఒక
తపస్సు అయితే
నేను
తాపసిని
కాలేకపోవచ్చు కానీ
ఫల పుష్ప
పత్రాలు కాసినైనా
తల్లిపూజకు
భక్తితో అందించుకోగలను
కవిత్వం ఒక
సంగీత సాగరమైతే
నేను
అల కాలేకపోవచ్చు
కానీ
ఉవ్వెత్తున ఎగసి
పడే తరంగానికి
పక్కమృదంగ
తోడిరాగమందిచుకోగలను
కవిత్వం ఒక యుధ్దమైతే
నేను
యోధుణ్ణి
కాలేకపోవచ్చు కానీ
దుష్టశక్తిని
తురిమే
యోధ
ముష్టిఘాతంలో
జీవశక్తిని
ఖచ్చితంగా జోడించుకోగలను
కానీ..
కవిత్వం ఒక
రాజీపత్రమైతే
ఆ లాలుచీ ప్రకటన
మీద
శిరస్సు వంచుకు
సాగిలపడే
సంతకం కింది
చుక్క మాత్రంగా
చచ్చినా బతకబోను!
-కర్లపాలెం హనుమంతరావు
19 -05 -2018

No comments:
Post a Comment