ప్రకృతికి మనిషికి
తాత్విక సంబంధంగా
మొదలయినది మతం. మానవ పరిణామ దశల
క్రమంలో ప్రారంభంలో అదో నమ్మకం.. ఆనక అదే ఓ విశ్వాసంగా బలపడింది. సమాజం అభివృద్ది చెందే వివిధ దశల్లో ఆ ‘మత’మే ఉన్నత వర్గాల వారు కింది తరగతుల వారిని
తమ చెప్పుచేతుల్లో ఉంచుకొనే సాంస్కృతిక ఆయుధంగా మారిపోయింది. అదో చారిత్రక విషాదం.
మనిషి ఆదిమ దశలో ప్రకృతి నుంచి ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో
తెలియని నిస్సహాయతతో ముప్పిరిగొన్న భయం నుంచి బైటపడేందుకు అదృశ్య శక్తులేవో
ఉన్నాయని ఊహించుకొని. వాటిని కర్మకాండల ద్వారా సంతృప్తిపరిస్తే కష్టం నుంచి గట్టెక్కవచ్చని
భావించాడు.
అతగాడి అజ్ఞానం, అమాయకత్వం, అసహాయత,
అవగాహనాలేమి ఇత్యాదుల వల్ల మొదలైన ఆ కర్మకాండలకు ఒక
సైధ్దాంతిక రూపం కల్పించి పూజాదికాలు అతని జీవితంలో ఒక ప్రధాన విధానంగా మార్చింది పూజారి వర్గం. దైవసంబంధమైన ఆ కర్మకాండలు నిర్వహించే హక్కు కేవలం
తమ చెప్పుచేతల్లో ఉంచుకుంది. పూజారికి దేవుడి ప్రతిరూపం అనే ఇమేజి స్థిరపడింది. మతం
మీది అతని గుత్తాధిపత్యం ఎప్పుడూ ధిక్కరణకు గురి కాలేదు. అప్పుడప్పుడు ఏ చిన్న చైత్యన్యవంతమైన ఆందోళన
చెలరేగినా వాటిని మొగ్గదశలోనే తుంచివేయడం జరిగేది. పాలకుల అండదండలు పుష్కలంగా గల
బ్రాహ్మణ వర్గానికి అదంత కష్టసాధ్యం కూడా కాలేదు.
అత్యధిక సామాన్య వర్గ ప్రజల సాంస్కృతిక, జీవన
విధానాలు మతం పునాదుల మీదే నిర్మితం కావడం
మతానికి సమాజం మీద అమితమైన పట్టును తెచ్చిపెట్టింది. భూస్వామ్య వర్గమూ మంది సాంస్కృతిక
బలహీనతలను సొమ్ము చేసుకోవడంలో వెనుకబడింది లేదు. తన వంతు కుట్రగా కులాల
ప్రాతిపదికన సమాజాన్ని మరో మారు
చీల్చిందది..
ప్రాబల్యం అధికంగా గల కులాలకు ఉత్పత్తి వృత్తులతో నిమిత్తం లేదు. సమాజ సాంస్కృతిక,
ఆధ్యాత్మిక రంగాల మీద పెత్తనం మాత్రం ఆ పూజారి వర్గాలకే అప్పగించబడింది. భూస్వాములకు,
పూజారులకు మధ్య అంతర్గతంగా కుదిరిన ఈ అన్యాయపు ఒప్పందం మూలకంగా
ఉత్పత్తి వృత్తుల మీద ప్రత్యక్షంగా ఆధారపడిన బడుగు జీవులు మరోమారు ఘోరమైన దోపిడీకి
గురయ్యారు.
మధ్యయుగాలలో ఈ దేశం మీదకు దండెత్తుకొచ్చి పెత్తనం చేసిన మొగలాయీల మొదలు ఇటీవల వరకు అధికారం చెలాయించిన వలస పాలకుల వరకు.. అందరిదీ ఒకే దోపిడీ పంథా. ఏ అగ్రవర్ణానికీ, అగ్రవర్గానికీ బడుగుల జీవన
స్థితిగతుల మెరుగుదల పట్ల ఆసక్తి లేకపోయింది. పాలకులతో భూస్వామి వర్గాలు రాజీ ధోరణితో సర్దుకుపోతే.. అర్చక వర్గాలు మతం మీద తమకున్న పట్టు చూపించి ఆయా పాలకులను అధీనంలో ఉంచుకొన్నాయి.
వలస పాలకుల వల్ల జాతీయ సాంస్కృతిక జీవనంలో సగుణాత్మకమైన మార్పులు చోటు
చేసుకున్నాయని భావించే వాళ్లేమీ తక్కువ లేరు. వలస పాలకులు
తెచ్చిన ఏ సాంస్కృతిక సంస్కరణా బడుగుల మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా సాగింది
లేదు. ఏ కొద్ది మార్పో వాళ్ల
జీవితాల్లో సంభవమైనప్పటికీ జఅదీ పాలకులకు
మేలు కలిగించే వరకు సాగి అక్కడితో ఆగిపోయేది. పీడిత వర్గాలు
చైతన్యవంతమైతే తమ అధిపత్యానికి ఎదురయ్యే
సవాళ్ళు అగ్రవర్ణాలు, వర్గాలు ముందస్తుగానే ఊహించి తగు జాగ్రత్తలు తీసుకొనేవి.
చార్వాకుడి నుంచి గౌతమ బుధ్దుడి దాకా, భక్తి ఉద్యమం
మొదలు గాంధీయిజం వరకు ఈ దేశంలోని అన్ని ఉద్యమాలు మతవాదులతో సర్దుబాటు ధోరణిలోనే
వ్యవహరించాయి.
అలా వ్యవహరించాయి కాబట్టే వాటి మనుగడను కొంతవరకైనా సాగనిచ్చింది మతవర్గం. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీజీ భూస్వామ్య వ్యవస్థను ఎక్కడా ధిక్కరించిన
దాఖలాల్లేవు.
పైపెచ్చు జనసామాన్యం మనసులు సులువుగా గెలుచుకొనేందుకు మతచిహ్నాలను
సైతం విశృంఖలంగా వాడారాయన. గాంధీజీ తెచ్చేందుకు ప్రయత్నించిన సంస్కరణల్లో చాలా భాగం మతవాదాన్ని మరింతగా సమర్థించే
దిశగానే సాగాయంటే కొంతమందైనా నొచ్చుకుంటారని తెలుసు. నిష్ఠురమనిపించినా నిజం నిజమే
అవుతుంది కానీ..
ఎన్ని ముసుగులు వేసినా అబద్ధం కాబోదు కదా!
స్వాతంత్ర్యం వచ్చినా ఈ దేశ ఆర్థిక విధానాలలో ఇదే తరహా ద్వంద్వ వైఖరి కొనసాగింది. జాతి సాధించిన అభివృధ్దిలో అధిక శాతం పది శాతంగా ఉన్న అగ్రవర్ణాలు, వర్గాల వద్దే పేరుకు పోవడం మునుపటి కథ. ఇప్పుడు ఆ పది
శాతం రోజు రోజుకీ మరింతగా కుచించుకుపోతోందన్న
అంచనాలు వింటున్నాం.
లాభాల బాటలో ఉన్న సంపన్న వర్గాలు ఏ కారణాల కోసం తమ సౌకర్యాలను స్వఛ్చందంగా బడుగు వర్గాలకు
ధారాదత్తం చేస్తాయి?
తమ అభివృధ్ధికి ఆటంకం కలిగించే బీదల పాట్లను కనీసం అర్థం చేసుకొనేందుకైనా ఆసక్తి చూపించవు. సరికదా..
నూతన విజ్ఞానం రగిలిస్తున్న సామాజిక స్పృహ కారణంగా అభివృధ్దిలో తమకు న్యాయంగా దక్కవలసిన వాటా కోసం
బడుగులు ఇప్పుడు చేస్తున్న ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తాయి కూడా! అందులో భాగమే మతాల
క్రియాశీలక రాజకీయ పాత్ర.
గతంలో మాదిరి మతాన్ని కేవలం సామాజిక
ఆధిపత్యం కోసం మాత్రమే వాడుకొనే ఆయుధంగా భావించడం లేదు అగ్రవర్ణాలిప్పుడు. మతం నెత్తికీ ఒక రాజకీయ టోపీ తగిలించి.. చేతికో జెండా
అందిస్తే మిగతా అన్ని చిటుకుల కన్నా శక్తివంతంగా సామాన్యుల జీవితాల్లోకి చొరవగా
చొచ్చుకు పోవచ్చు.
మకిలి అంటకుండా స్వకార్యం సాధించుకొనేందుకు మతానికి మించిన గమ్మత్తు మత్తు పదార్థం ఈ దేశంలో
ఇప్పటికి వరకైతే మరోటి లేదు.
మసీదులు పడగొట్టి ఆలయాలు కడతామన్న అజెండా ప్రకటించుకున్న మర్నాటి నుంచే అప్పటి
వరకు ఏదో మూల నక్కి ఉన్న మతవాదం రాజకీయ రూపం
ధరించి అప్రతిహతంగా ముందుకు దూసుకొచ్చింది ఈ దేశంలో. 2014లో పాలకులు మార్పిడి జరిగినప్పటి నుంచి కాశ్మీరు టు కన్యాకుమారి.. సర్వత్రా
పెచ్చుమీరుతున్న ఉన్మాద ధోరణులకు.. గతంలోనే సామాజిక వ్యవస్థ మూలాలలో విత్తబడిన
మతబీజాలే మూలకారణం. ప్రజాఉద్యమాలకు సైతం దేవుళ్లకు ముడుపులు కట్టే వైరుధ్యం సామాన్య ప్రజలు ప్రశ్నలకు
గురికాక పోవడం అందుకే ఈ దేశంలో సంభవమయింది! ప్రజలు తమ రెక్కల కష్టంతో నింపిన
బొక్కసాలను యజ్ఞాలు,
యాగాలు, పుష్కరాలు, దీక్షల పేరుతో పాలకులు ఖాళీ చేసేందుకు
తెగబడుతున్నా ఇదేమని ప్రశ్నించాలన్న స్పృహే కరువైన ప్రస్తుత రాజ్యంలో మతాతీత కులాతీత లౌకిక ప్రజాస్వామ్య సంక్షేమ
వ్యవస్థను కాంక్షించడం ఎంత వరకు సబబు?! వలస పాలకుల నుంచి రాబట్టుకున్న రాజ్యమే
లౌకిక సమాజాన్ని నిర్మిస్తుందన్న ఆశ ఇంకా మిగిల్చుకున్నవాళ్లకూ ఓ నమస్కారం.
పీడనకు గురిచేస్తున్న
మతవిశ్వాసాల ముందే
భయభక్తులతో లొంగి బతుకీడ్చేందుకు సిధ్దపడే
పీడితుల మానసిక బలహీనతలను శాస్త్రీయకోణంలో
విశ్లేషించుకోవలసిన అవసరం మునపటి కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. పీడిత వర్గాలను
సంఘటిత పరిచి సరైన దిశకి మళ్లించే ప్రగతి కాముక సాహిత్యం అందుకే ఇప్పుడు మరింత ముమ్మరంగా విస్తరించాల్సుంది. మతంలోని గమ్మత్తు మత్తునుంచి
సామాన్యుణ్ని బైటకుతెచ్చే సామాజిక బాధ్యత మేధావుల మీదే ఎక్కువగా ఉంది. మతోన్మాదం
పెచ్చుమీరుతున్న ఈ దుర్మార్గ తరుణంలో మౌనం పాటించడమంటే మేధావులు తెలిసి జాతికి చేస్తున్న ద్రోహం కిందే లెక్క.
***
-కర్లపాలెం హనుమంతరావు
(మతోన్మాదం ..
చారిత్రక నేపథ్యఁం -హరిపురుషోత్తమరావు – విభిన్న. పుట.
33- ప్రేరణతో)
No comments:
Post a Comment