Thursday, September 3, 2020

జోస్యం హాస్యం కాదు- కర్లపాలెం హనుమంతరావు – ఈనాడు దినపత్రిక సరదా వ్యాసం

 



 

'ఇది జోస్యం. హాస్యం కాదు' అన్నాడు సీతారాం సీరియస్ గా. సీతారాం మా ఆఫీస్ కొలీగ్.

నవ్వుతున్న నా వంక చుసి 'నమ్మకం లేదు లాగుంది. మీ టైమూ, నా టైమూ కూడా వేస్ట్' అన్నారు శర్మగారు నిష్ఠురంగా.

నా చేతులు చూపిద్దామని సీతారాం శర్మగారిని వెంటబెట్టుకొచ్చాడు. మర్యాదగా ఉండదని చేతులు చాపి 'మరి చూడండీ' అన్న మాట నిజమే.

జాండీస్  రోగి చేతిని వైద్యుడు చూసినంత నిశితంగా పరిశీలించి 'మీ కిద్దరు కళత్రాలు' అనేసారు శర్మగారు ఠక్కున.

కాఫీ కప్పులు ఇవ్వడానికని వచ్చిన మా శ్రీమతి అక్కడే నిలబడి ఉంది. గతుక్కుమంది గుండె. 'కళత్రం' అన్న ముక్కకు అర్థం తెలీకపోబట్టి అప్పటికి సరిపోయింది కానీ, లేకపోతేనా? కొంపలు ములిగిపోయేవి కావూ!'

ఇద్దరు పెళ్లాలంటే ఏ మొగాడైనా మురిసిపోతాడు. కానీ, సమయం, సందర్భం ఉండక్కర్లే సత్య వాక్కుకైనా?

లౌక్యం లేని విద్య రాణించదని శర్మగారికి చెప్పాలనుకున్నా. ఆయన చెప్పే మూడ్ లో తప్ప వినే మూడ్ లో లేడు. 'ప్రస్తుతానికి మీ యోగం కొద్దిగా హీనదశలోనే ఉన్నదని చెప్పాలి. అబ్బాయి అమెరికా ప్రయాణాన్ని గూర్చి బెంగ. భార్య ఆరోగ్యం అంతంత మాత్రమే! ఆవిడకు బి.పీ, మీకు షుగరూ లాంటి మొండివ్యాధులుండవచ్చు..'

'నా చెయ్యి చూసి మా ఆవిడ జాతకం కూడా చెప్తారేమిటీ?!'

'మీ ఆవిడ చెయ్యి చూసి నీ జాతకం కూడా పట్టేస్తారు శర్మగారు. ఉద్దండ పిండం. ఉద్యోగం చేస్తూనే జ్యోతిషం కరస్పాండెన్సు కోర్సు చేస్తున్నారంటే మాటలా? ముందు మా వాడి బదిలీ సంగతి తేల్చవయ్యా?' అని శర్మగారిని పొడిచాడు సీతారాం.

 నెల్లూరు జిల్లాకు బదిలీ అయి నాలుగు నెల్లయింది. జాయినవలా. సెలవు పెట్టి కేన్సిల్ కోసం ట్రయ్ చేస్తున్నా. ఆ సంగతి సీతారాముకు తెలుసు.

'మీ బదిలీ ప్రయత్నాలు ఇప్పట్లో అంతగా ఫలించే సూచనలు లేవు' అని చప్పరించేశారు శర్మగారు. శని గురుడింటి నుండి తరలిపోయాడు. మళ్లీ మహర్దశ రావాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.' అన్నాడు లేచి తుండుగుడ్డ దులుపుకుంటూ.

మా ఆవిడ దిగాలు పడిపోయి నిలబడిపోయివుంది. వాళ్లక్క పరిస్థితి చూసి మా బావమరది కొద్దిగా చొరవచేశాడు. ప్రమోషన్ పని మీద ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు. ఇందాకటి నుంచి జరుగుతున్నదంతా చూస్తున్నాడు. అతనికీ వాళ్లక్కకు లాగానే జాతకాలలాంటి వాటి మీద మంచి గురి.

'శర్మగారూ! ధర్మసూక్ష్మం ఏమన్నా ఉంటే చూడండీ!' అన్నాడు లోపాయికారి గొంతుతో.

'ధర్మసూక్ష్మం ఏముంది? యోగం అనుభవించడం ఒక్కటే ధర్మసూత్రం' అన్నారు శర్మగారు.

'పండితులు. మీకు సూక్ష్మాలు తెలియకుండా ఉంటాయా?' అంది మా ఆవిడ.

ఆయన సంచీలో నుంచి పొట్లం ఒకటి తీశాడు. అందులొ అరటి  మొక్క! 'ఇది పెరటిలో నాటించండమ్మా! పిలక పుట్టే లోపు మీ వారికి స్థానచలనం ఖాయం' అన్నారు శర్మగారు.

మహాప్రసాదంలా స్వీకరించింది మా ఆవిడ.

నా మొహం చూసి సీతారాం అన్నాడు 'నువ్వివన్నీ నమ్మవని తెలుసు. మా శర్మగారి సంగతి నీకు తెలీదు. బిన్ లాడెన్ కు ప్రాణగండముందని సంవత్సరం కిందటే చెప్పాడీయన.'

'చేతులు చూశా?!'

'చేతులే చూడనక్కర్లేదు సార్! జాతకం చూసైనా చెప్పేస్తాను. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరగబోతోందని సాక్షాత్ బుష్ గారికి ఉత్తరం రాశాను. ఆంత్రాక్స్ భయంతో ఆయనగారు కవర్ విప్పి చదివినట్లు లేదు. ' అన్నాడాయన రోషంగా.

'అప్పుడెవరి జాతకం చూశాడో? బుష్ గారిదా? డబ్ల్యు టివోదా?'

'సి.యంగారిక్కూడా పదవీ గండముందని చెప్పాడు' అన్నాడు సీతారాం మాటమారుస్తూ.

'సియంగారికి ఈయన తెలుసా?'

'లేదు. ఈయనగారికి సియంగారు తెలుసు. 'హస్తం' చూపించడం ఇష్టం లేక ఆయనగారే మొహం చాటేస్తున్నారుట, జాతకం ఇన్టర్నెట్లో చూసి చెప్పాడు'

'పాదం గుర్తులతో జోస్యం చెప్పడం ప్రాక్టీసుచేస్తున్నా. పర్ఫెక్ట్ అయిన తరువాత ఆయన కాళ్లు పట్టుకునైనా జాతకం చెప్పడం ఖాయం' అన్నారు శర్మగారు గుంభనగా.

'అలాంటివన్నీ చుసుకునేందుకు ఆయన దగ్గర ఇంకెవరో ఉన్నారుటగా! ప్రభుత్వానికి ఇంకో ఇరవై ఏళ్లు  ఢోకా లేదని ఆయన చెబుతుంటేనూ..! తరువాతి టర్మ్ లో పదవీ  స్వీకరణ మహోత్సవానికి  ముహూర్తం కూడా పెట్టి ఉంటేనూ..!

మా ఆవిడ మహాభక్తిగా పళ్లెంలో బియ్యం పోసి తెచ్చింది. చేటలో సోది అనుకున్నదేమో .. పాపం!

'బియ్యం వద్దులేమ్మా! ఒక ఆరు వందలు తక్కువ కాకుండా మీ సంతోషం చూపించండి చాలు' అన్నారు శర్మగారు మొహమాట పడుతూ.

అయిదు నిమిషాల జాతకానికి ఆరు వందలే ఎక్కువ!

'జాతకం చెప్పినందుకు వందే! మంత్రించిన అరటి మొక్కకు ఐదొందలు'

అరటి మొక్క తిరిగివ్వబోతుంటే మా బావమరది అడ్డొచ్చాడు. 'ఉండనీయండి బావా! డబ్బులు నేనిస్తాను' అంటూ పళ్లెంలో ఆరొందలూ సమర్పించుకున్నాడు. అందులో సీతారాం వాటా మూడొందలని తరువాత తెలిసింది.

'జాతకాలకు అంత ప్రభావం లేకపోతే యూనివర్శిటీల్లో కోర్సులెందుకు పెడతారూ? శర్మగారు గాని పోయినేడాది కలిసుంటే నేను కృషి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేవాడినే కాదు' అన్నాడు నమ్మకంగా.

మా ఆవిడ ఎంత మొత్తుకున్నా నేను పెరట్లో అరటి మొక్క నాటనీయలేదు.

'మీకీ జన్మకు ట్రాన్స్ఫర్ కేన్సిల్ కాద'ని శపించిందావిడ కసికొద్ది.

అరటి మొక్కను మా బావమరది వాళ్ల ఊరు తీసికెళ్లి నాటుకున్నాడు. నెలరోజుల్లోనే అతనికి స్థానచలనం కలిగింది. ఆఫీస్ మీద అకస్మాత్తుగా ఎ.సి.బి రైడింగ్ జరిగిందట. ప్రమోషన్ మాట అలా ఉంచి ప్రస్తుతానికి పార్వతీపురం ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ మాత్రం అయింది.

ఏదయితేనేం?చలనం.. చలనమే! శర్మగారి ధర్మసూక్ష్మం సామాన్యమైనది కాదు!

జోస్యం హాస్యం కాదు. కేబినెట్లో జాతకాలకు  ఒక పోర్ట్ ఫోలియా ఏర్పాటుచేసి శర్మగారిబోటి వాళ్లను మంత్రులుగా తీసుకుంటే చాలా సమస్యలు సమయానికి చవకలో పరిష్కరామయిపోతాయి.

వర్షాలు ఎప్పుడొస్తాయో తెలిస్తే రైతులు విత్తులతో సిద్ధంగా ఉంటారు. ప్రమాదాలెప్పుడొస్తాయో పసిగడితే ప్రయాణాలు వాయిదా వేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలిస్తే ముందే ప్రపంచబ్యాంకు నుంచి చప్పున అప్పు తెచ్చేసుకోవచ్చు. ఎవరి వాటా వాళ్లు చకచకా వెనకేసుకోవచ్చు.

కాశ్మీరులో ఫరూక్ అబ్దుల్లా వూరికే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు గానీ, ముష్రాఫ్ దొడ్లో శర్మగారి మంత్రించిన అరటి మొక్క నాటించేస్తే పీడా వదిలిపోతుంది.

వాజపేయి గారి కీళ్లనొప్పులక్కుడా ఏదో మందు కనిపెట్టి ఇస్తారీ శర్మగారు మంత్రి పదవి ఇస్తే.

ముఖ్యమంత్రిగారి 'ముఖాముఖి'లో ఇంకా ఇలాంటి పాయింట్లేమన్నా  చర్చించడానికి ఉన్నాయేమో కనుక్కుందామని 'శర్మగారి' గురించి వాకబు చేసా. జాబు నుంచి సస్పెండయ్యారని తెలిసింది.

వెల్ఫేర్ డిపార్టులో ఉండీ చేతులు చూసి సంపాదిస్తున్నాడని గిట్టనివాళ్లెవరో కంప్లయింట్ చేశారుట!

'సంపాదిస్తున్నందుకు కాదు అతగాడు సస్పెండయింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి 'చేతులు' చుస్తున్నందుకు’ అన్నాడు సీతారాం ఆ మధ్య కనపడి.

- కర్లపాలెం హనుమంతరావు

03 -09 -2020

(ఈనాడు దినపత్రిక 06, జూలై 2002 నాటి  సంపాదకీయ పుటలో ప్రచురితం)

Tuesday, September 1, 2020

కలిసి మునుగుదాం రండి!- కర్లపాలెం హనుమంతరావు ఈనాడు దినపత్రిక సరదా వ్యాసం




చికాగో నుంచి మా చిన్నాన్నగారబ్బాయి చిట్టి ఫోన్ చేసాడు 'మొత్తం పాతిక మందిమి వస్తున్నాం.. మునగడానికి.. అదేరా.. గోదావరి పుష్కరాలు కదా!.. ఆ ఏర్పాట్లూ అవీ అన్నీ చూసే పూచీ నీదే..'అంటూ.
ఇంత మందొచ్చి పడితే నదిలో నీళ్లు చాలొద్దూ! అని మధన పడుతుంటే మా మాధవగాడే దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు.. 'గోదావరా? .. డోంట్ వర్రీ!' అంటూ. ‘అమెరికాలో మునగడానికేం లేవు కాబోలు పాపం,, చికాగో నుంచి వస్తున్నారు. చికాకు పడితే ఎట్లారా? .. చూద్దాంలే! .. చుట్టం కదా!' అన్నాడు.
ఆ సాయంత్రమే టక్కూ టయ్యీ కట్టుకున్న శాల్తీ ఒకటి 'టక్,, టక్' మంటూ మా ఇంటి తలుపు తట్టింది. మొఖాన కాసంత గంధబ్బొట్టు మినహా మనిషి మనాడే అనేందుకు ఇంకే దాఖలాల్లేవు. అంత మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు! 'మై నేమీజ్ మిష్టర్ డూబే. మాధవ్ పంపించా'డంటూ ఏదో ఫారాలిచ్చి ఫార్మాలిటీస్ అవీ పూర్తిచెయ్యమన్నాడు. హ్యాండౌట్ ఇచ్చి డౌట్సేమన్నా ఉంటే అడగమన్నాడు.
కరపత్రం కడు రమణీయంగా ఉంది. 'పన్నెండేళ్లకోసారొచ్చే పవిత్ర గోదావరీ పుష్కర స్నానఘట్టాన్ని మీరు జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టంగా మార్చే పూచీ మాదీ! రాజమండ్రి నుంచి నర్సాపురం వరకు గోదావరి నది వడ్డున వడ్దూ పొడుగూ ఉన్న మా వస్తాదులు మిమ్మల్ని ముంచేందుకు సదా సిద్ధంగా ఉంటారు'
'వస్తాదులెందుకయ్యా?'
'ముంచేటప్పుడు మీరు కొట్టుకు పోకుండా సార్! ఒక్క ఫోన్ కాల్ ఛాలు. మీరు పరుగులెత్తకుండా గోదావరి నదే మీ పాదాల వద్దకు పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది'
'బానే ఉంది గానీ, మునిగేందుకే ఫీజు కాస్త ఎక్కువ. తలకు మరీ మూడు వేలా?!'
'టోకున మునిగితే డిస్కౌంటుంటుంది సార్! ముసిలివాళ్లకు, పసిపిల్లలకు చెంబుస్నానాలు మా స్పెషాలిటీ! స్త్రీలను ప్రత్యేకంగా ముంచేందుకు ఏర్పాట్లు చేసాం. సిక్కులకు మినరల్ వాటర్ మిక్స్డ్ బాత్! సిక్కంటే సర్దార్జీ అని కాదు. సిక్ పర్సన్ అని అర్థం. వి. . పి లకు విడిగా వేణ్ణీళ్ల స్నానాలు.
'శుద్ధి చేసిన వాటర్ కదా! కొద్దిగా ఫీజు ఎక్కువే ఉంటుందిలేరా మరి' అని అందుకున్నాడు అప్పుడే వచ్చిన మాధవగాడు. ‘సౌకర్యాలు చూసుకో.. ఫీజెంత చౌకో తెలుస్తుంది. సొంతంగా వెళ్లాలంటే ఎంతవుతుందీ? పైన యాతన. రద్దీలో ఏదీ దొరిగి చావదు. అదే డూబే వాళ్లయితే అంగవస్తం నుంచి గోచీపాత వరకు అన్నీ అద్దెకిస్తారు. నిదానంగా అన్ని దానాలు చేయిస్తారు. పురోహితుడ్నీ.. అవసరమయితే పితృదేవతల్ని కూడా వాళ్లే చూసిపెడతారు..'
'మరేఁ!' అన్నాడు మిష్టర్ డూబే సెల్ ఫోన్ మీదేవో నెంబర్లు టకటకలాడిస్తో.
'పితృదేవుళ్లని ఇప్పుడే బుక్ చేస్తున్నాడేమో! ఎంత ఫాస్టు! డూబే జోరు చూస్తుంటే నాకిప్పుడే గాదారిలో కెళ్లి బుడుంగుమని మునగెయ్యాలనిపిస్తుంది. బేడ్ లక్. పుష్కరం రెండు వారాలు నా కింకో దేశంలో క్యాంపు!'
'సరిగ్గా మీలాంటి వాళ్లకు సరిపడే స్కీముంది సార్ మా దగ్గర. ఆఫీసులో, బిజినెస్ లో బిజీగా ఉంటే మీ తరుఫున ఇంకోళ్లను ముంచుతాం. పుణ్యం పూర్తిగా మీ కాతాలోకే బదిలే అయ్యే ప్రత్యేక పూజ కూడా పాకేజ్ లో ఉంది.' అని ఇంకో ఫారం బైటికి తీసాడు. డూబే ఫైలు నిండా ఎన్నో ఫారాలు!
'నాకూ ఓ టోకెన్ తీసుకోండి! నలుగురులో స్నానం చెయ్యడమెలాగా అని ఇందాకణ్ణుంచి నలుగుడు పడుతున్నా. ప్రాబ్లం సాల్వడ్' అని తగులుకుంది మా శ్రీమతి. 'ముక్కు మూసుకొని మునగకుండా ముక్కోటి దేవతలనర్చించే పుణ్యఫలం ఈజీగా వస్తుంటే వదులుకోడమెలా?' అని ఆవిడగారి గోల. పాచినీళ్లలో  మునిగే బాధలేదు. కొట్టుకుపోయే రిస్క్ లేని స్కీమ్. పదివేలు మనవి కావనుకుంటే పుష్కలంగా పుష్కర పుణ్యం.
'ఊరికే నీతులు దంచే నేతలు ప్రజల్నిలా పునీతుల్ని చేసే పనులు ఎందుకు చేపట్టరో! ఎన్నికలున్నాయిగా! ఓట్ల కోసం వచ్చినప్పుడు అడగాల'ని అనుకున్నా.
తీరాబోతే అమెరికా నుంచి ఒకే ఒక శాల్తీ దిగింది, తెల్లతోలు! తెల్లబోయాం. తెలుగు బ్యాచంతా తీరికలేనంత బిజీగా ఉన్నార్ట, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడ్రౌనింగ్ డాట్.కామ్ వెబ్ సైట్లో. చిట్టిగాడు చిట్టీ రాసి పంపించాడు 'ఇంట్లో కూర్చుని ఇంటర్మెట్లో పుష్కర స్నానాలు.. పితృదేవతలకు పిండప్రదానాలు చేసే సాఫ్ట్ వేర్ డిజైనింగులో  బిజీగా ఉన్నాం. నట్టింట్లోకి గోదావరి నదిని తెప్పించాలని ప్రయత్నం. ప్రతిరోజూ పెరట్లోనే పుష్కరస్నానాలు చేయిస్తాం'అంటో ఏదేదో సోది రాసాడు. 'ఈ తెల్లోడికి మన తెలుగు నదుల్లో మునగాలని తెగ 'ఇది'గా ఉంది. అందుకనే మా అందరికీ బదులుగా పంపిస్తున్నాం. మా కొలీగే. జాగ్రత్త. జాతకం ప్రకారం వీడికి ఈ ఏడాది జలగండం ఉంది. మునిగే ముందు కొట్టకుండా చూడండి!' అని రాశాడు.
ఊళ్లో ఉన్నంత సేపూ వాడికి కాపలా కాయలేక చచ్చాం. తీరా బైలుదేరే సమయానికి బాత్ రూమ్ లో కాలుజారి పడ్డాట్ట. గోదావరిలో మునగాల్సిన వాడు అపోలోలో తేలాడు. ఏమైనా సరే నదిలో మునగాల్సిందేనని పట్టుబడితే అట్లాగే కట్లతో డిశ్చార్జ్ చేయించి.. బాసర వైపుకు మోసుకు పోయారుట డూబే బేచి.
తిరిగొచ్చిన తరువాత వీడి ఆనందం చూడాలి. ఆంధ్రా నదుల సౌందర్యాన్ని తిక్కన కన్నా ఎక్కువగా పొగిడేశాడు. వీడియో తీసాట్ట గాని.. విడిగా ఫీజేదో అదనంగా ఎందుక్కట్టాలని ఆర్గ్యూ చేసాడని ఎవడో కెమెరా నీళ్లపాలుచేసేశార్ట! అక్కడికీ పవిత్రస్థలంలో ఫొటోలు తీయడం పాపహేతువని బుకాయిస్తే పాపపరిహారర్థం పన్నెండు వందలు సమర్పించుకుని చెంపలేసుకొన్నాడుట కూడా! తిప్పలెన్ని పడ్డా 'దిస్ మేజిక్ ల్యాండ్ ఈజ్ ఫుల్లాఫ్ మెరికల్స్' అని అమెరికాపోయిందాకా తెల్లదొర ఒహటే మురిసిపోవడమే విశేషం.
మూడో రోజే చిట్టబ్బాయ్ నుంచి ఫోన్. చిటపటలాడిపోతున్నాడు. 'ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిరా! గోదారికి దారి తెలీకపోతే కనుక్కోవచ్చుగా! మూసీ నదిలో మునకలేయిస్తార్రా మా తెల్లబాసుని! అదే గోదారనుకుని  పాపం మా అందరి కోసం పాతికసార్లు మురికినీళ్లలో మునకలేసాట్ట గదా! ఇప్పుడు పడిశం పట్టుకుంది. మూసిన కన్ను తెరవడంలేదు. 'మిరకల్.. మిరకల్' అంటూ కలవరిస్తున్నాడు పాపం, మానవుడు!' అంటూ తిట్టిపోసాడు మాధవగాడు.
డూబే మోసం అర్థమయింది. బ్యాంకుల్లో ముంచడం తెలుసుగానీ, ఇట్లా రివర్ బ్యాంకుల్లో ముంచినట్లు వినడం ఇదే మొదటిసారి.
గోరు తడవకుండా  గోదావరి స్నానమంటూ  ఇదేంటో మరి?!
కడిగేద్దామని డూబేగాడికి ఫోన్ చేస్తుంటే నెంబర్ ఎంతకీ కలవదే!
'మళ్లీ పుష్కరాల వరకు మనకు దొరకడులే!' అన్నాడు మాధవగాడు ఆ మధ్య కనబడ్డప్పుడు. జరిగినదంతా చెప్పి చొక్కా పట్టుకు జగడానికి దిగబోతే 'వాడికి జాతకంలొ జలగండం ఉందన్నారుగా! నేనూ.. ఆ డూబేగాడు కేవలం నిమిత్తమాత్రులం.. అంతే' అంటూ కాలరు విడిపించుకుని దర్జాగా వెళ్లిపోయాడు మిత్ర్రుడు.
కర్లపాలెం హనుమంతరావు
01 -09 -2020
***
(ఈనాడు దినపత్రిక 08 -07 -2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)




Monday, August 31, 2020

ఖర్చు తక్కువ వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు - ప్రకృతి -కర్లపాలెం హనుమంతరావు






ప్రకృతితో ఒక్కోరికి ఒక్కోరకమైన అక్కర. కవి, గాయకుడు ప్రకృతిని చూసి స్పందించే మంచి కవిత్వం, గానం ప్రసాదించేది.  ఆ మధ్య చైనీస్ యువకులు కొంత మంది ప్రకృతిలో దొరికే గుమ్మడి, బీర, దోస వంటి కూరగాయలను సంగీత పరికరాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఒక యూ ట్యూబ్ వీడియోలో చూపించి అందరిని అవాక్కయేటట్లు చేసారు. నిజానికి ప్రకృతిలో దొరికే కాయగూరలు, దుంపలు, పండ్లు ఫలాలు సౌందర్య పోషణకు ఉపయోగించుకునే తెలివితేటలు పెంచుకుంటున్న మహిళామణులు వాటి అవసరం ముందు తిండి తిప్పలకు, మందుమాకులకు ఎంత వరకు ముఖ్యమో తెలుసుకుంటున్నారా?
మందుల దుకాణాలలో  ఔషధాలకు కొదవ ఉండదు, నిజమే కాని, అన్ని రకాల మందులు అందరు వాడటం అంత క్షేమం కాదు. కొన్ని సార్లు వికటించే ప్రమాదం కద్దు. ఏవి హాని చెయ్యనివో తెలుసుకోవడానికి మళ్ళీ  ఏ అలోపతి వైద్యుడి దగ్గరకో పరుగులెత్తాలి. వేళకు అన్ని చోట్లా డాక్టర్లు అందుబాటులో ఉండే దేశమా మనది? భారతదేశం వరకు అందరికీ అందుబాటులో ఉండే వైద్యుడు ప్రకృతి నారాయణుడు. ఆ వైద్యనారాయణుడి థెరపీని నమ్ముకుంటేనే  మన ప్రాణాలకు తెరిపి.
ఉదాహరణకు, గోళ్ల కింద గాయమయిందనుకోండి. ఒక్కో సందర్భంలో కొనుక్కొచ్చుకున్న మందు గోరు చివుళ్ల సందున సరిగ్గా అమరదు. వాడినట్లే ఉంటుంది కాని, ఫలితం కనిపించదు. కనిపించినా దాని ప్రభావం నెమ్మది మీద గాని తెలిసే అవకాశం లేదు. అదే వంటింట్లోనే కూరగాయల బుట్టలో ఏ వేళకైనా దొరికే బంగాళా దుంపను ముక్కలుగా కోసి ఒక ముక్కతో ఆ గాయమయిన భాగం కవర్ అయే విధంగా కట్టుకట్టుకుంటే సరి. మూడు రోజులు వరసగా ఉదయాన్నే పాత ముక్క స్థానంలో కొత్త ముక్కను పెట్టి కట్టుకుంటే నాలుగో రోజున అక్కడ గాయమైన ఛాయలు కూడా కనిపించవు.  చర్మం పైన పొక్కులు, బొబ్బలు కనిపిస్తే బంగాళా దుంపల ముక్కలతో గట్టిగా రుద్దితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది.  అలాగే బంగాళా దుంపను ఉడకబెట్టిన నీరు షాంపూ కండిషనర్ కన్నా మంచి ప్రభావం చూపిస్తుంది. రెగ్యులర్ షాంపూతో తల శుభ్రం చేసుకున్న తరువాత ఆరబోసిన వెంట్రుకలను ఉడికిన బంగాళా దుంపల నీళ్లతో కడిగి ఆరబెట్టుకుంటే ఆ శిరోజాల మెరుపు సహజంగా ఉందటమే కాదు, జుత్తుకు భవిష్యత్తులో హాని కూడా కలగదు. బూడిద రంగుకు తిరుగుతున్న జుత్తును దారిలోకి తేవాలన్నా ఈ బంగాళాదుంపల ద్రవంతో కడిగే అలవాటు క్రమం తప్పకుండా చేస్తే సరిపోతుంది. కాణీ ఖర్చు లేని వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు ప్రకృతి.
బంగాళా దుంపలు కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి. తడిగా ఉన్న భాగం వేపుని కొద్దిసేపు కళ్ల కింద పెట్టుకుని, ఆ తరువాత రుద్దుకుంటే  ముడతలు బిగిసుకుంటాయి. క్రమం తప్పకుండా చేసేవారికి కళ్ల కింద ఉబ్బు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. మో చేతుల కింద అదే పనిగా వత్తిడి  ఉన్నవాళ్లకు ఆ ప్రదేశంలో నల్లటి మరకలు నిలబడిపోతాయి, వాటి మీద  క్రమ తప్పకుండా బంగాళాదుంప ముక్కలను రుద్దుతుంటే మరకలు తొలగిపోతాయి.
బంగాళాదుంపలకు చర్మానికి భలే లింకు. దుంపలు కడిగిన నీళ్లలో నిమ్మ రసం పిండుకుని దానితో మొహం శుభ్రం చేసుకోవడం అలవాటుగా ఉన్నవాళ్ల మొహంలో ఆ కళే వేరు. వదనం  సమ్మోహనంగా మారుతుందిఎండపొడికి చర్మం కమిలిన  చోట బంగాళా దుంపల తడి చెక్కలు ఉంచితే చర్మం అతి తొందరలో తిరిగి సహజ స్థితికి  వచ్చేస్తుంది. ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో వేళ్లతో ఎత్తిపెట్టిన పెరుగు రవ్వంత కలిపి ఆ పేస్టును మొహానికి పట్టించుకోవడం అలవాటు చేసుకుంటే మొగం ఎప్పుడూ మంచి  నిగారింపుతో కళకళలాడుతుంది. బంగాళా దుంపల పేస్టుకు దోసకాయ పేస్టు, సోడావుప్పు కలిపి ఆ పేస్టుతో  మొహం శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవారికి వయసు పైబడిన తరువాత  చర్మం మీద ఏర్పడే ముడతలు వెనకడుగు పడతాయి.
పిల్లలు తిరుగుతున్న ఇంటిలో గోడలకో, గడపలకో పెయింటింగు వేయించాల్సిన అవసరం వస్తుంటుంది ఒక్కోసారి. పెయింట్లలో వాడే పదార్థాలకు తోడు, వార్నిష్ నుంచి వచ్చె గాలి ఇంటి వాతావరణంలోఒక రకమైన ఘాటుతనం పెంచి, ఒక్కోసారి వాంతులు అయేంత వరకు పరిస్థితి వికటిస్తుంది. పసిపిల్లలను, ముసలివాళ్లను ఎక్కువగా బాధించే ఈ కాలుష్య సమస్యకు ఉపాయం, పెయింట్ చేసే స్థలంలో సగం తరిగిన ఉల్లి ముక్కలు ఉంచితే ఆ ఘాటుకు ఈ ఘాటు సరితూగి కాలుష్య ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఉల్లిపాయలో గంధకం ఉంటుంది. ఆ ధాతువు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. చెవికి సంబంధించిన వ్యాధులకు ఉల్లిపాయ బ్రహ్మౌషధం. చెవిపోటు వచ్చిన సందర్భాలలో చెవి దగ్గర ఉల్లిపాయ ముక్క ఉంచి కట్టు కట్టి రోజంతా వదిలేస్తే కర్ణభేరిలోని కాలుష్యకారకాలు నశించి బాధ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది.  
పాదాలపైన గాయాలు, వ్రణాలు అయినప్పుడు తేనెను మందులా ఉపయోగించాలి. గాయమైన చోట తేనె రాస్తూ ఉంటే కొత్త కణాలు తొందరగా పుట్టుకొచ్చి గాయం పూడే సమయం తగ్గిపోతుంది.  తేనెకు సూక్ష్మక్రిములను నాశనం చేసే గుణం ఉంది.
వంటి దురదలకు యవలు మంచి మందు. యవల జావను ఒక గుడ్డలో కట్టి  నీటిలో ముంచి ఆ తడి మూటను దురద పుట్టిన చోట రుద్దుతూ పోతే బాధ  క్రమంగా తగ్గిపోతుంది. మశూశికం పోసినప్పుడు చర్మం మీద పొక్కులు లేచి దురద పుట్టిస్తాయి. వాటిని గోకినందువల్ల చుట్టు పక్కలకు ఆ దురద క్రిములు మరంతగా విస్తరించే అవకాశమే ఎక్కువ. ఈ తరహా సందర్భాలలో యవల జావ వైద్యం అపకారం చేయనై ఉత్తమ ఉపశమనం.
తాజా నిమ్మరసం వాసనచూడడం వల్ల, మద్యం అతిగా తాగిన హాంగోవర్ బాధ నుంచి ఉపశమనం సాధ్యమే. నిమ్మ, ద్రాక్ష, నారింజ, తొక్కలను మూడు నాలుగు రోజుల పాటు ఎండకు పెట్టి ఆనక నిల్వచేసుకుంటే సబ్బులాగా వాటిని వాడుకోవచ్చు. బొప్పాయి తొక్కల గుజ్జును అరికాళ్ల కింద రాసుకుంటే అందులో ఉండే రసాయనాల ప్రభావం వల్ల అక్కడ ఉండే మృత చర్మకణాలన్నీ తొలగిపోయి పాదాలు పరిశుభంగా కనిపిస్తాయి. అరటి తొక్కల గుజ్జు భాగం వైపు పంధదార జల్లి స్నానం చేసే ముందు వంటికి పట్టిస్తే చర్మం మీద చేరిన మకిలంతా తొలగి స్నానానంతరం శరీరం నిగనిగలాడుతుంది
ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయనుకుంటా మన బేరీ పండ్లను పోలి ఉష్ణమండలాలలో పెరిగే ఒక రకమైన కాయ అవకాడో! దానితో ఎండలో తిరిగి వచ్చిన తరువాత ముఖం రుద్దుకుంటే మొహం చల్లగా హాయిగా ఉండి శరీర ఉష్టోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. పనసపండులోని రసాయనాలు మనిషి శరీరం మీది మృతకణాలను తొలగించడానికి బాగా ఉపయోగిస్తాయి
స్ట్రా బెర్రీ పళ్లు దంతాలను ధవళ కాంతితో  ధగధలాడించే ఇంద్ర్రజాలం ప్రదర్శిస్తాయి. వడదెబ్బకు పుచ్చకాయలు మంచి ఔషధం. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ పుచ్చకాయల పాత్ర అమోఘమైనది.
ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువుల నుంచి లాభం పొందే కళ అభివృద్ధి చేసుకోబట్టే మనిషి మిగతా జీవజాతులతో పరిణామదశ పోటీలో ముందున్నది.  ప్రాణమిచ్చి, ఆ ప్రాణం నిలబెట్టే ప్రకృతిని ప్రాణప్రదంగా చూసుకోవాలే తప్పించి, ప్రకృతి వైద్యుడి ఉనికికే చేటు తెచ్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కష్టనష్టాలు చివరికి మనుషులుగా మనకు మనమే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది!
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...