'ఇది జోస్యం. హాస్యం కాదు'
అన్నాడు సీతారాం సీరియస్ గా. సీతారాం మా ఆఫీస్ కొలీగ్.
నవ్వుతున్న నా
వంక చుసి 'నమ్మకం లేదు లాగుంది.
మీ టైమూ, నా టైమూ కూడా వేస్ట్' అన్నారు శర్మగారు నిష్ఠురంగా.
నా చేతులు
చూపిద్దామని సీతారాం శర్మగారిని వెంటబెట్టుకొచ్చాడు. మర్యాదగా ఉండదని చేతులు చాపి 'మరి చూడండీ' అన్న మాట నిజమే.
జాండీస్ రోగి చేతిని వైద్యుడు చూసినంత నిశితంగా
పరిశీలించి 'మీ కిద్దరు కళత్రాలు'
అనేసారు శర్మగారు ఠక్కున.
కాఫీ కప్పులు
ఇవ్వడానికని వచ్చిన మా శ్రీమతి అక్కడే నిలబడి ఉంది. గతుక్కుమంది గుండె.
'కళత్రం' అన్న ముక్కకు అర్థం
తెలీకపోబట్టి అప్పటికి సరిపోయింది కానీ, లేకపోతేనా? కొంపలు ములిగిపోయేవి కావూ!'
ఇద్దరు
పెళ్లాలంటే ఏ మొగాడైనా మురిసిపోతాడు. కానీ, సమయం,
సందర్భం ఉండక్కర్లే సత్య వాక్కుకైనా?
లౌక్యం లేని
విద్య రాణించదని శర్మగారికి చెప్పాలనుకున్నా. ఆయన చెప్పే మూడ్
లో తప్ప వినే మూడ్ లో లేడు.
'ప్రస్తుతానికి మీ యోగం కొద్దిగా హీనదశలోనే ఉన్నదని చెప్పాలి. అబ్బాయి అమెరికా ప్రయాణాన్ని గూర్చి బెంగ. భార్య ఆరోగ్యం
అంతంత మాత్రమే!
ఆవిడకు బి.పీ, మీకు షుగరూ లాంటి మొండివ్యాధులుండవచ్చు..'
'నా చెయ్యి చూసి
మా ఆవిడ జాతకం కూడా చెప్తారేమిటీ?!'
'మీ ఆవిడ చెయ్యి
చూసి నీ జాతకం కూడా పట్టేస్తారు శర్మగారు. ఉద్దండ పిండం. ఉద్యోగం చేస్తూనే జ్యోతిషం కరస్పాండెన్సు కోర్సు చేస్తున్నారంటే మాటలా? ముందు మా వాడి బదిలీ సంగతి తేల్చవయ్యా?' అని శర్మగారిని
పొడిచాడు సీతారాం.
నెల్లూరు జిల్లాకు బదిలీ అయి నాలుగు నెల్లయింది. జాయినవలా.
సెలవు పెట్టి కేన్సిల్ కోసం ట్రయ్ చేస్తున్నా. ఆ సంగతి సీతారాముకు తెలుసు.
'మీ బదిలీ
ప్రయత్నాలు ఇప్పట్లో అంతగా ఫలించే సూచనలు లేవు' అని
చప్పరించేశారు శర్మగారు.
శని గురుడింటి నుండి తరలిపోయాడు. మళ్లీ మహర్దశ రావాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.' అన్నాడు లేచి తుండుగుడ్డ దులుపుకుంటూ.
మా ఆవిడ దిగాలు
పడిపోయి నిలబడిపోయివుంది.
వాళ్లక్క పరిస్థితి చూసి మా బావమరది కొద్దిగా చొరవచేశాడు. ప్రమోషన్ పని మీద ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు. ఇందాకటి నుంచి జరుగుతున్నదంతా చూస్తున్నాడు. అతనికీ వాళ్లక్కకు లాగానే జాతకాలలాంటి వాటి మీద మంచి గురి.
'శర్మగారూ! ధర్మసూక్ష్మం ఏమన్నా ఉంటే చూడండీ!' అన్నాడు
లోపాయికారి గొంతుతో.
'ధర్మసూక్ష్మం
ఏముంది?
యోగం అనుభవించడం ఒక్కటే ధర్మసూత్రం' అన్నారు శర్మగారు.
'పండితులు. మీకు సూక్ష్మాలు తెలియకుండా ఉంటాయా?' అంది మా ఆవిడ.
ఆయన సంచీలో
నుంచి పొట్లం ఒకటి తీశాడు.
అందులొ అరటి మొక్క! 'ఇది పెరటిలో నాటించండమ్మా! పిలక పుట్టే లోపు మీ
వారికి స్థానచలనం ఖాయం'
అన్నారు శర్మగారు.
మహాప్రసాదంలా
స్వీకరించింది మా ఆవిడ.
నా మొహం చూసి
సీతారాం అన్నాడు 'నువ్వివన్నీ నమ్మవని తెలుసు. మా శర్మగారి సంగతి నీకు
తెలీదు.
బిన్ లాడెన్ కు ప్రాణగండముందని సంవత్సరం కిందటే చెప్పాడీయన.'
'చేతులు చూశా?!'
'చేతులే
చూడనక్కర్లేదు సార్!
జాతకం చూసైనా చెప్పేస్తాను. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరగబోతోందని సాక్షాత్ బుష్ గారికి ఉత్తరం
రాశాను.
ఆంత్రాక్స్ భయంతో ఆయనగారు కవర్ విప్పి చదివినట్లు లేదు. ' అన్నాడాయన రోషంగా.
'అప్పుడెవరి
జాతకం చూశాడో?
బుష్ గారిదా? డబ్ల్యు టివోదా?'
'సి.యంగారిక్కూడా పదవీ గండముందని చెప్పాడు' అన్నాడు సీతారాం
మాటమారుస్తూ.
'సియంగారికి ఈయన
తెలుసా?'
'లేదు. ఈయనగారికి సియంగారు తెలుసు. 'హస్తం' చూపించడం ఇష్టం లేక ఆయనగారే మొహం చాటేస్తున్నారుట, జాతకం ఇన్టర్నెట్లో చూసి చెప్పాడు'
'పాదం గుర్తులతో
జోస్యం చెప్పడం ప్రాక్టీసుచేస్తున్నా. పర్ఫెక్ట్ అయిన
తరువాత ఆయన కాళ్లు పట్టుకునైనా జాతకం చెప్పడం ఖాయం' అన్నారు శర్మగారు గుంభనగా.
'అలాంటివన్నీ
చుసుకునేందుకు ఆయన దగ్గర ఇంకెవరో ఉన్నారుటగా! ప్రభుత్వానికి
ఇంకో ఇరవై ఏళ్లు ఢోకా లేదని ఆయన
చెబుతుంటేనూ..!
తరువాతి టర్మ్ లో పదవీ
స్వీకరణ మహోత్సవానికి ముహూర్తం
కూడా పెట్టి ఉంటేనూ..!
మా ఆవిడ
మహాభక్తిగా పళ్లెంలో బియ్యం పోసి తెచ్చింది. చేటలో సోది
అనుకున్నదేమో ..
పాపం!
'బియ్యం
వద్దులేమ్మా!
ఒక ఆరు వందలు తక్కువ కాకుండా మీ సంతోషం చూపించండి చాలు' అన్నారు శర్మగారు మొహమాట పడుతూ.
అయిదు నిమిషాల
జాతకానికి ఆరు వందలే ఎక్కువ!
'జాతకం
చెప్పినందుకు వందే!
మంత్రించిన అరటి మొక్కకు ఐదొందలు'
అరటి మొక్క
తిరిగివ్వబోతుంటే మా బావమరది అడ్డొచ్చాడు. 'ఉండనీయండి బావా! డబ్బులు నేనిస్తాను'
అంటూ పళ్లెంలో ఆరొందలూ సమర్పించుకున్నాడు. అందులో సీతారాం వాటా మూడొందలని తరువాత తెలిసింది.
'జాతకాలకు అంత
ప్రభావం లేకపోతే యూనివర్శిటీల్లో కోర్సులెందుకు పెడతారూ? శర్మగారు గాని పోయినేడాది కలిసుంటే నేను కృషి బ్యాంకులో డబ్బు డిపాజిట్
చేసేవాడినే కాదు'
అన్నాడు నమ్మకంగా.
మా ఆవిడ ఎంత
మొత్తుకున్నా నేను పెరట్లో అరటి మొక్క నాటనీయలేదు.
'మీకీ జన్మకు
ట్రాన్స్ఫర్ కేన్సిల్ కాద'ని శపించిందావిడ కసికొద్ది.
అరటి మొక్కను మా
బావమరది వాళ్ల ఊరు తీసికెళ్లి నాటుకున్నాడు. నెలరోజుల్లోనే
అతనికి స్థానచలనం కలిగింది.
ఆఫీస్ మీద అకస్మాత్తుగా ఎ.సి.బి రైడింగ్ జరిగిందట. ప్రమోషన్ మాట అలా ఉంచి ప్రస్తుతానికి పార్వతీపురం ఏజెన్సీకి ట్రాన్స్ఫర్
మాత్రం అయింది.
ఏదయితేనేం?చలనం..
చలనమే! శర్మగారి ధర్మసూక్ష్మం
సామాన్యమైనది కాదు!
జోస్యం హాస్యం
కాదు. కేబినెట్లో జాతకాలకు ఒక పోర్ట్ ఫోలియా
ఏర్పాటుచేసి శర్మగారిబోటి వాళ్లను మంత్రులుగా తీసుకుంటే చాలా సమస్యలు సమయానికి
చవకలో పరిష్కరామయిపోతాయి.
వర్షాలు
ఎప్పుడొస్తాయో తెలిస్తే రైతులు విత్తులతో సిద్ధంగా ఉంటారు. ప్రమాదాలెప్పుడొస్తాయో పసిగడితే ప్రయాణాలు వాయిదా వేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలిస్తే ముందే ప్రపంచబ్యాంకు నుంచి
చప్పున అప్పు తెచ్చేసుకోవచ్చు. ఎవరి వాటా వాళ్లు చకచకా
వెనకేసుకోవచ్చు.
కాశ్మీరులో
ఫరూక్ అబ్దుల్లా వూరికే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు గానీ, ముష్రాఫ్ దొడ్లో శర్మగారి మంత్రించిన అరటి మొక్క నాటించేస్తే పీడా
వదిలిపోతుంది.
వాజపేయి గారి
కీళ్లనొప్పులక్కుడా ఏదో మందు కనిపెట్టి ఇస్తారీ శర్మగారు మంత్రి పదవి ఇస్తే.
ముఖ్యమంత్రిగారి
'ముఖాముఖి'లో ఇంకా ఇలాంటి పాయింట్లేమన్నా
చర్చించడానికి ఉన్నాయేమో కనుక్కుందామని 'శర్మగారి' గురించి వాకబు చేసా.
జాబు నుంచి సస్పెండయ్యారని తెలిసింది.
వెల్ఫేర్ డిపార్టులో
ఉండీ చేతులు చూసి సంపాదిస్తున్నాడని గిట్టనివాళ్లెవరో కంప్లయింట్ చేశారుట!
'సంపాదిస్తున్నందుకు
కాదు అతగాడు సస్పెండయింది.
చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి 'చేతులు'
చుస్తున్నందుకు’ అన్నాడు సీతారాం ఆ మధ్య కనపడి.
- కర్లపాలెం
హనుమంతరావు
03 -09 -2020
(ఈనాడు దినపత్రిక
06, జూలై 2002 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)
No comments:
Post a Comment