Friday, February 5, 2021

నిజమే.. కానీ! : కథానిక కర్లపాలెం హనుమంతరావు

 

 విశ్వాసానికి తర్కానికి ఆమడ ఎడం

 *       *         *



ఆగకుండా కురుస్తోంది వర్షం. ఇవాళ్టికి మూడో రోజు.

పెనుగాలుల మూలకంగా  కరెంటు లేక.. మధ్యాహ్నం మూడింటికే సాయంత్రం ఆరుదాటినట్లుంది వాతావరణం.శలవులకని ఇంటికి వచ్చిన మూర్తికీ  హౌస్ అరెస్టు చికాకుగా ఉంది.

కాలుగాలిన పిల్లిలాగా లోపలికి, బైటికి తిరిగే కొడుకును చూసి చిన్నగా నవ్వుకుంది సుభద్రమ్మగారు. 'పట్నం కులాసాలకి అలవాటు పడ్డ ప్రాణం.  ముసలాళ్ళకి మల్లే ఇంటి పట్టునుండాలంటే చిరాకే మరి. పొద్దుపోయే సాధనాలేవీ కొంపలో లేకపాయ. బొమ్మలపెట్టే ఉన్నా ఏం లాభం..  కరెంటు లేకపోతే అది వట్టి బొమ్మపెట్టే. రేడియాలో బ్యాటరీలు లేవు. అవి కావాలన్నా ముందు పట్నందాకా పోయి రావాలి'.

" చదివిన పేపరే ఎన్ని సార్లు చదువుతారు గానీ అబ్బాయిని కూర్చోబెట్టుకుని కాస్తేదన్నా కాలక్షేపం  చెయ్యరాదూ! పొద్దు గడవక పాపం పిల్లాడెట్లా  గిలగిలలాడిపోతున్నాడో! మీకేదీ  పట్టదాయ!" అంటూ ముందు గదిలో పేపరు తిరగేస్తున్న సుందరయ్య దగ్గరికొచ్చి మొత్తుకుంది సుభద్రమ్మ

సుందరయ్య చదివే పేపరు పక్కన పారేసి "మూర్తీ!" అని లోపలికి కేకేసాడు.

మూడో పిలుపుకి గానీ మూర్తి ఊడిపడలేదు.

"చదరంగం ఆడదాముట్రా కాస్సేపు.. నీతో ఆడి చాలా కాలమైంది"  అనడిగాడు సుందరయ్య.

"ఒద్దులే నాన్నా! ఓడిపోతే చాలా ఫీలైపోతావు" అన్నాడు మూర్తి అదోలా నవ్వి.

"ఓడటమా? నీతోనా? అదీ చూద్దాం.. బోర్డు సర్దరా ముందూ" అన్నాడు సుందరయ్య తెల్లటి మీసాలు దువ్వుకుంటూ.

"వట్టి ఆటైతే బోరు. ఏదైనా పందెం కాయండి.  ఇంటరెస్టుగా ఉంటుంది" అన్నాడు మూర్తి కాయలు సర్దుతూ.

" పందేలు కాస్తావుట్రా.. ఇదెప్పట్నుంచీ? అంత పెద్దాడివై పోయావేం అప్పుడే!" అంటూ మందలింపులకి దిగబోయింది సుభద్రమ్మ. సుందరయ్యే అడ్డొచ్చాడు "అందులో తప్పేముందిలేవే. ఇంట్లో మనతోనేగా ఆడేదీ! కాకపోతే అబ్బాయిగారికీ సొంత సంపాదన ఎప్పణ్నుంచో.. ఆ సంగతి కనుక్కో ముందు. నా డబ్బులతో నా మీదే పందెం కాయడం.. ఆహా.. ఇదో కొత్త తరహా  పందెం కాబోలు ఈ కాలం పిల్లలకి!"

తండ్రి వెటకారం ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత పసిపిల్లాడేం కాదు మూర్తి. బెంగుళూర్లో థర్డియర్ ఎమ్.టెక్ చేస్తున్నాడు.

"డాడీ! మర్చిపోయారేమో కానీ.. మీరు నాకో బైకు బాకీ. పోయిన బర్త్ డేకే రావాల్సిన బండి.. పంటలు బాగా లేవని వాయిదా వేసాం. సుమారు ఆరవై వేలు. బెస్టాఫ్ త్రీలో నెగ్గండి.. ఆ డిమాండును స్వచ్చందంగా వదులుకుంటా.. ఓకేనా" అన్నాడు మూర్తి రోషంగా.

"సరేలేరా.. ముందు ఓడించు చూద్దాం" అని నవ్వుకుంటూ తన తెల్లబలగంలోని పావుని రెండు గడులు ముందుకు దూకించాడు సుందరయ్య.

వెంటనే మూర్తీ తన వంతు  ఎత్తువేసి తల్లి వేపు సాభిప్రాయంగా నవ్వుతూ చూసాడు.

మొదలు పెట్టడమే కష్టం. మొదలైంతరువాత ఆపడం అంతకన్నా  కష్టం.. చదరంగం తీరే అంత. స్వయంగా ఆడలేదు కానీ సుభద్రమ్మగారికి భర్త ఆటల పిచ్చితో పెళ్ళినాటినుంచీ పరిచయమే. ఆయన గవర్నమెంటు హైస్కూల్లో డ్రిల్లు టీచరు. ఈ మధ్యనే పదవీ విరమణ చేసాడు. తండ్రి తర్ఫీదులో మూర్తీ బాగానే పుంజుకున్నాడు. ప్రస్తుతం అతనే వాళ్ళ యూనివర్శిటీ చెస్ చాంపియన్.

ఐదు నిమిషాల్లోనే తండ్రీ కొడుకులిద్దరూ ఆటలో లీనమై పోయారు.

మరో మూడు గంటల దాకా ఇద్దరూ గుళ్లో విగ్రహాలే.

చీకటి చిక్కపడుతోంది.

'దీపాలు సిద్దం చెయ్యకపోతే  ఎంత రాద్దాంతమవుతుందో తెలుసు. పిల్లాడికీ, ఆయనకీ ఇలాంటి వేళ వేడి వేడి పకోడీలంటే ఎంతో ఇష్టం.'

ఆ తయారీకని వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మగారు. హాల్లోనుంచీ తండ్రీ కొడుకుల మాటలు  వాన హోరు మధ్య వింటూ పనిలో పడిపోయిందామె.

"తోసి రాజు".. మూర్తి గొంతు.  సుందరయ్య గొణుగుడు.  ఏదో  'కాద'ని గట్టిగా వాదులాడుతున్నాడు కొడుకుమీద.

మొత్తానికి అబ్బాయి చేతిలో ఆయనగారికేదో గట్టి దెబ్బే తగిలినట్లుందీ! ఆ గిజగిజలు వింటుంటే అర్థవవడంలా!

మూర్తి కొత్త బుల్లెట్ మీద తండ్రి నెక్కించుకుని ఊరి మధ్యనుంచి దర్జాగా పోతున్నట్లు ఓ ఊహ తటాలుమని బుర్రలో మెరిసింది. సుభద్రమ్మగారి పెదాల మీద చిరునవ్వు విరిసింది.

'పందెం సంగతెలా ఉన్నా ఈ ఏడాది మాత్రం మూర్తికి తప్పకుండా బండి కొనివ్వాలి. ఒక్కగా నొక్క నలుసు. ఇంటికి వెలుగు.  పంటల బాగోగులతో నిమిత్తం పెట్టుకోకూడదీసారి. అంతగా ఐతే చేతి గాజులు అమ్మైనా సరే..'

హాల్లోనుంచి కొత్త గొంతు వినిపించే సరికి సుభద్రమ్మ ఆలోచనల చైన్ తెగిపోయింది.

చేస్తున్న పని ఆపి బైటికి తొంగి చూసింది.

 

*     *     *

ఎవరో కొత్త మనిషి. ఎప్పుడూ చూడని మొహం. ఆకారం ఒకింత వింతగానే ఉంది.

భుజం చుట్టూ కాషాయం రంగు శాలువా.. కిందేమో అబ్బాయి వేసుకునే లాంటి ఇరుకు ప్యాంటు.  భుజానికి ఓ జోలెలాంటిది వేలాడుతున్నది. సగం సన్యాసి.. సగం సంసారి లాగుంది వేషం.

గలగలా మాట్లాడుతున్నాడు.  'ఏట్లో పోటు మహా ఉద్దృతంగా ఉంది స్వామీ. అక్కడికీ మొండికేసి సగం దూరందాకా వెళ్లా . నా వల్ల కాలా. ఊళ్లోకి వస్తుంటే  మొదటగా మీ ఇల్లే కనబడింది. వాన వెలిసిందాకా తల దాచుకోక తప్పదు కదా! ఈ వరండాలో కూర్చుంటా.. మీకెవ్వరికీ ఇబ్బంది కలిగించను' అని చెప్పుకొస్తున్నాడు.

'పాపం' అనిపించింది సుభద్రమ్మ గారికి.  తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుంటేనే చలిగాలికి వళ్ళు గజగజలాడి పోతున్నది. నడి వయసు మనిషికి.. ఎంత కష్టం.. రాత్రంతా బైట వరండాలో అంటే!'

వాకిలి తలుపులు బార్లా తీసుండటం వల్ల జల్లు లోపలికి కొట్టి గదంతా రొచ్చు రొచ్చవుతున్నది.

"మూర్తీ! ముందా తలుపులు వేసేయరా.. ఆయన్నొచ్చి లోపల  కూర్చోమను" అంది సుభద్రమ్మగారు వంటింటి గుమ్మాని కవతలే నిలబడి.

మూర్తి తలుపులు మూసి వచ్చి కూర్చున్నాడు.

వేసిన తలుపులకు పక్కనే గోడకు చేరగిలబడి కూర్చుండి పోయాడా కొత్త మనిషి. సుభద్రమ్మవంట పనిలో కెళ్ళిపోయింది.

ఆటాడుతూనే  ఆ మనిషితో మాటల్లో పడ్డాడు సుందరయ్య.

ప్రసంగ వశాత్తూ చాలా కొత్త విషయాలే తెలిసాయి. ఆ సన్యాసి పూర్వ నామం భైరవయ్యట. పొద్దుటూరు నివాసి. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికని పోయి భార్యా బిడ్డలిద్దర్నీ గంగలో పోగొట్టుకున్నాట్ట. ఆ వైరాగ్యంతో చేసే బంగారం వ్యాపారం చాలించుకుని ఇట్లా దేశాలు పట్టి తిరుగుతున్నానని చెప్పాడు. 'కైలాసగిరి నుంచి కన్యాకుమారి దాకా తిరగని పుణ్యక్షేత్రం లేదు స్వామీ! మనశ్సాంతి కోసం  ఆరాటం. నీడలా వెన్నంటుండే ఇల్లాలు, బిడ్డా.. ఇద్దరూ ఒకేసారి  కనుమరుగయిపోయాక గానీ .. జీవితంలోని డొల్లతనం బైట పడలేదు." అంటూ ఓ  మెగా సీరియల్ కి సరిపడా కథాగానం చేసాడా సెమీ సన్యాసి.

ఇంట్లో వాళ్ళతోపాటే వేడి వేడి పకోడీలు  ఒక ప్లేటులో పెట్టిస్తే ఇంత వేదాంతమూ వల్లించిన సన్యాసి 'ఉల్లివి కదా వద్ద'నలేదు సరికదా.. ఒక్క పలుక్కూడా మిగలకుండా ప్లేటు మొత్తం నిమిషంలో లాగించేసాడు.

ఆరగింపుల పర్వం అలా కొనసాగిస్తూనే ఓ కంట తండ్రీ కొడుకుల ఆటమీద కన్నేసీ వుంచాడు.

ఒక రౌండు అప్పటికే మూర్తి గెలిచి ఉన్నాడు. రెండో రౌండు చివర్లోకొచ్చి అడ్వాంటేజిలో ఉన్నాడు. సుందరయ్య తన  రాజుని అన్ని రకాలా  ఇరకబెట్టుకుని తప్పించుకునే దారి తోచక తన్నుకులాడుతున్న తరుణంలో..

అమాంతం బల్ల ముందుకు దూకేసి " ఈ కుడి వైపు ఏనుగుని బలిచ్చేయండి స్వామీ.. రాజు తప్పుకొనే తోవ అదే ఏర్పడుతుంది!" అని సలహా పారేసాడు సన్యాసి. సుందరయ్య శషభిషలు చూసి తనే చొరవగా ఏనుగుని ఎదుటి పక్షం ఏనుగు ముందు మోహరించేసాడు. 'హుమ్' అని మూలిగాడు సుందరయ్య మరో మార్గమేదీ తోచక.

'ఇదొక ఎత్తా' అనుకుంటూ అమాంతం  ఆ బలగాన్ని తన ఏనుగుతో  ఎత్తికుదేసే ఉత్సాహంలో  తన రాజు అరక్షణ గోతిలో పడిపోవడం గమనించనే లేదు  మూర్తి కూడా.

ఏనుగు ఖాళీ చేసిన ఆ స్థానంలోకి వెంటనే మంత్రిని తోసేసి 'షా' అని సుందరయ్య బిగ్గరగా అరవడం.. మూడే మూడు నిమిషాలపాటు సంపూర్ణ ధ్యానంలోకి వెళ్ళినా లాభంలేక.. మూర్తి  పూర్తిగా చేతులెత్తేయడం.. క్షణాల్లో జరిగి పోయాయి.

ఆట గెలిచిన సుందరయ్య ఆనందం అంతా ఇంతా కాదు.

 ఆశ్చర్యంగా సన్యాసి వైపు చూసి "బంటును ఏనుగని.. మంత్రిని రాజని అంటుంటే   బేసిక్సు కూడా తెలీవని పొరబడ్డా స్వామీ! మీరు ఇంతాట పెట్టుకుని.."

తలడ్డంగా ఊపాడా సన్యాసి నవ్వుతూ " నిజంగానే నాకీ ఆట 'అ ఆ' లు కూడా తెలీవు స్వామీ! మీరాడే తీరు చూసి తోచిన సూచన చేసానంతే.  ఇదంతా నా గొప్పతనమా?.. దీనిది కానీ" అంటూ మెడలో వేలాడే గొలుసు వంక చూపించాడు.

మెరుపు తగ్గిన బంగారపు గొలుసది.  లాకెట్ స్థానంలో ఏదో ఎర్రరంగు రాయి వేలాడుతున్నది.

సుందరయ్య మొహంలో అయోమయం. మూర్తి మొహంలో చిరునవ్వు. సన్యాసి మెళ్లో బంగారపు గొలుసంటే నవ్వు రాదా మరి హేతుబద్ద్ధంగా ఆలోచించే బుద్ధిమంతుల కెవరికైనా! ఎంగిలి ప్లేట్లు ఎత్తు కెళ్ళటానికని వచ్చిన సుభద్రమ్మగారు  సన్యాసి మాటలు శ్రద్దగా వింటో అక్కడే నిలబడి పోయింది.

"ఇది వంటిమీద గుండెల్ని తాకుతున్నంత సేపూ మనసులో వున్నదంతా వాస్తవమై తీరుతుంది. ఆటలో మీకు సాయం చేసేటప్పుడు నా మనసులో ఉన్నది ఒక్కటే కోరిక  'ఈ అబ్బాయి ఎట్లాగైనా ఆ ఏనుగుమీద ఆశతో రాజు కాపు గడిని ఖాళీ చేసెయ్యాల'ని. మీ కళ్లతోనే  చూసారుగా.. ఏం జరిగిందో! అదీ ఈ రాయి మహత్యం. మీ ఇంటి గుమ్మం ముందు తడిబట్టలతో నిలబడున్నప్పుడు నన్ను లోపలికి 'రానీయాలా.. వద్దా' అని మీమాంస పడ్డారు   మీ అబ్బాకొడుకులిద్దరూ. ఎక్కడో లోపల వంటింట్లో పని చేసుకునే ఈ తల్లి పనిమాలా వచ్చి మీ చేత  లోపలికి పిలిపించింది. అదీ ఈ రాయి మహిమే"

మూర్తి మొహం చూసి మళ్లీ అన్నాడా సన్యాసి "  మీరు నమ్మడం లేదని తెలుస్తూనే ఉంది. మీ వయసుకది సమంజసమే! దీని శక్తిని మరో సారి నిరూపిస్తా..  చూడండి. మూడు రోజుల బట్టీ ఈ ప్రాంతంలో కరెంటు నిలకడగా ఉండటం లేదు కదా! "

" కొంప తీసి ఇప్పుడు గానీ కరెంటు పుట్టిస్తానంటారేమిటి?" అన్నాడు మూర్తి. ఎంత వద్దనుకున్నా గొంతులో హేళన దాగడం లేదు. పట్టించుకోలేదా సన్యాసి.

" శ్రీ మల్లికార్జున స్వామివారి సుప్రభాతం  చదువుకుంటూ పోతుంటా స్వామీ ఒక వరసలో.  ఈ లోపలొక  ఐదారు నిమిషాలపాటైనా విద్యుద్దీపాలు వచ్చిపోతే ఈ  రంగురాయిలో శివసత్తువ ఉన్నట్లే లెక్క" అంటో  చప్పట్లు కొట్టుకుంటో శ్లోకాలు చదవడం  ఆరంభించాడు.

"ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం

సింధూరపూరపరిశోభితగండయుగ్మమ్

ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ

మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్।

కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే

శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున

ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్।.."

ఆశ్చర్యం!

"..నమస్తే నమస్తే మహాదేవ శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో!

నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ!.." అంటూండగానే తటాలుమని గదిలో దీపాలు వెలిగాయి.

ఎప్పుడు ఆన్ చేసుందో టీవీ స్పోర్ట్స్ చానెల్.. ఒన్-డే చివరి ఓవర్ లాస్త్ బట్ ఒన్ డెలివరీకని జడేజా స్టంప్స్ వైపు దూసుకొచ్చేస్తున్నాడు. చూస్తుండగానే అతగాడు విసిరిన బాలుని  గేల్ ఎదురెళ్లి బలంకొద్దీ బాదడం.. గాల్లోకి లేచిన బంతి సరిగ్గా బౌండరీ లైనుకి ఇంచికి ఇటుగా నిలబడ్డ ఫీల్డరు పట్టిన దోసిట్లో.. పడినట్లనిపించడం! స్లిప్పయినట్లూ ఉంది.. 'సిక్సర్'అని  కామెంటేటర్ల అరుపులు వినిపించడం. గ్యాలరీ జనాల గోల మధ్య .. విన్ అయిందో విండీసో.. చాంపియనయిందో ఇండియన్సో.. క్లియరయే లోపలే.. మళ్ళా ఠప్పుమని కరెంటు పోనే పోయింది.

పూర్తిగా మతి పోయినంత పనయింది సుందరయ్య దంపతులకు.

మూర్తీ ఆలోచనలో పడ్డాడు.  పూర్తిగా నమ్మడానికి హేతువాదం అడ్డొస్తున్నది.

"నాకంతా అర్థమవుతూనే ఉంది. నీకింకా పూర్తివిశ్వాసం కలగనే లేదు కదా స్వామీ.. పోనీ వదిలేయండి!"  అన్నాడా అర్థసన్యాసి అదో రకమైన నిర్వేదంతో.

సుభద్రమ్మగారు అప్పుడే  విస్తరినిండా భోజనం తెచ్చి సన్యాసి ముందుంచింది.  "తల్లీ! మీరింత అభిమానం చూపిస్తున్నారు. చీకటని కూడా చూడకుండా  ఓపిగ్గా ఇన్నేసి అనుపాకాలు కమ్మంగా చేసి తెచ్చారు.  తినే ప్రాప్తం  ఈ నోటి కుండద్దూ?" అన్నాడు అదే మూడ్లో.

"ముందు తినండి స్వాములూ! ఇంటికొచ్చిన అతిథిని ఖాళీ కడుపుతో ఉంచి మేం మాత్రమే భోంచేయడం.. అదేమంత మంచీ మర్యాదా !"అన్నాడు సుందరయ్య. అప్పటికే అతనికా సన్యాసిమీద అపరిమితమైన గురి ఏర్పడిపోయుంది.

పెదవి విరిచాడా సన్యాసి " అభోజనం రాసిపెట్టుంది స్వాములూ ఈ పూట. ఒక్క నాకే కాదు.. ఇంటిల్లిపాదికీ. అమ్మా! ఒక్కసారి మీరా  లాంతరు వంటింటిదాకా పట్టుకెళ్లి  పొయ్యి మీది చూడండి. మీకే అర్థమవుతుంది జరిగిన అనర్థమేమిటో?"

వింత పడుతూ దీపం బుడ్డితో లోపలకి వెళ్ళింది సుభద్రమ్మగారు. అక్కడినుంచే ఒక్క గావుకేక వినబడింది. కంగారుగా లోనికి పరుగెత్తికెళ్ళిన మూర్తి.. సుందరయ్యలకు  గిన్నెలో అన్నం మెతుకులతో సహా ఉడికి ఉబ్బిన ఇంత లావు బల్లి కనబడింది. వళ్ళు జలదరించింది అందరికీ.

"ఇదీ తమరి రంగురాయి మహత్తేనంటారా మహానుభావా?"అనడిగాడు మూర్తి సాధ్యమైనంత వెటకారంగా. వెళ్ళిపోయే మూడ్ లో జోలె సర్దుకుంటున్న సన్యాసి నుంచి బదులే లేదు.

అప్పటికి వర్షం కాస్త తగ్గు ముఖం పట్టింది.

లేచి నిలబడి సుందరయ్యకు నమస్కారం చేసి అన్నాడు సన్యాసి" దారి ఖర్చులకు చేతిలో తైలం బొత్తిగా లేదు. ఈ గొలుసు తమరి దగ్గరుంచుకుని కాస్త నగదు ఇప్పిస్తారేమోనని ఆశతో వచ్చాను. అసలు మీ ఇంటి తలుపు తట్టిన కారణం కూడా  అదే స్వామీ!"

వెంటనే అందుకున్నాడు మూర్తి "అదేం.. మీ దగ్గరే మహత్తుగల  రాయుందిగా! కావాల్సినంత సొమ్ము తమరే సృష్టించుకోవచ్చు కదా?"

సన్యాసి మొహంలో చిరునవ్వు"ఈ రాయికి మహత్తుందన్నానే కానీ.. శూన్యంలోంచి శివలింగాలనీ.. గాల్లోంచీ కరెన్సీ నోట్లను రాలుస్తుందనన్నానా?   ఆ తరహా మహత్తే గనక ఈ రాయికుండుంటే ప్రాణానికన్నా మిన్నగా ప్రేమించిన వాళ్లను గంగ్గమ్మతల్లి ఒడికి వదిలి వస్తానా? వ్యాపారం వద్దని వదిలేసుకునే నాటికి నా స్థిర చరాస్తుల విలువ సుమారు పది కోట్లకు పైమాట. కొంత ఊరి అనాథ శరణాలయానికి, కొంత చెన్నకేశవస్వామివారి ఆలయానికి  రాసిచ్చేసాను. ముందే చెప్పాను.. నేనూ మీ అందరిలాంటి వాడినే అని.   రాయుండట మొక్కటే  నా ప్రత్యేకత. తాకట్టు వ్యాపారం చేసే రోజుల్లో నా చేతికొచ్చిందీ గొలుసు.  కుదవబెట్టిన మనిషే స్వయంగా చెప్పుకొచ్చాడు  దీని మహిమలు. నమ్మలా అప్పట్లో. విడిపించుకోడానికి అతగాడు మళ్ళీ ఎందుకు రాలేదో.. తరువాత తరువాత  గానీ తెలిసిరాలేదు. గంగపాలయినప్పుడిది నా భార్య మెడలోనే ఉంది. తన గుర్తుకోసమనే ఇంతకాలం నావెంట తిప్పుకుంది. మామూలు బంగారమని  చెప్పి  వదిలించుకోవడం తేలికే. నమ్మి కొన్నవాడిని మోసగించినట్లవుతుందది. ఉన్న విషయమేదో చెప్పి.. దృష్టాంతాలు చూపిస్తున్నదందుకే. మీ లాగానే చాలామంది  కాశీ మజిలీ కథలని కొట్టిపారేసారు.  ఈ పెద్దయ్యలాగా  కాస్త నమ్మకం కుదిరినవాళ్ళు గ్యారంటీ అడిగారు.   దారి ఖర్చులకోసం రొక్కం అత్యవసరం పడింది. కనకే ఇంతలా మీకు చెప్పుకోవాల్సొస్తోంది. ఆ పైన మీ ఇష్టం. నా ప్రాప్తం" అంటూ సుభద్రమ్మగారికి నమస్కారం చేసి వీధి వాకిలి వైపుకి అడుగులేశాడు సన్యాసి.

మూర్తి ఏదో అనబోయాడు కానీ.. 'వద్దన్న'ట్లు వారించింది సుభద్రమ్మ గారు. 

 

వీధిలో దాకా  సన్యాసి వెనకనే వెళ్లొచ్చిన  సుందరయ్యను చూసి "పాపం.. ఆయన చేతిలో కాస్తేదన్నా పెట్టకపోయారా?" అంది సుభద్రమ్మగారు సానుభూతితో.

"ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాలేవే. పోతూ.. పోతూ..  తొందరలోనే మనకు పెద్ద మొత్తంలో ధనప్రాప్తి  కలగబోతున్నట్లు చెప్పాడోయ్" అన్నాడు సుందరయ్య  గుప్పెట్లోని గొలుసును హుషారుగా ఊపుకుంటో.

"పెద్ద మొత్తమంటే?" సుభద్రమ్మగారి ఆరా.

"సుమారు ఐదారు లక్షలుట" సుందరయ్య గొంతులో ఉత్సాహం.

కనుబొమలు ముడిపడ్డాయి అప్రయత్నంగా మూర్తికి. "ఆ సన్నాసి మాటకూ నా బైకుకూ ముడిపెట్టొద్దు డాడీ" అన్నాడు  హెచ్చరికగా!

'చూద్దాం లేరా బాబూ! మూడో రౌండు వేద్దాం పట్టు.. అమ్మ మళ్లీ అన్నం వండటానికి ఎటూ టైం పడుతుంది!" అన్నాడు సుందరయ్య.

" మూడ్ పోయింది డాడీ.." అని లేచి గదిలోకి వెళ్ళిపోయాడు  మూర్తి.

"పిల్లాడినింక  వదిలేద్దురూ!  రేపు తెల్లారగట్లే వాడి ప్రయాణం. " అంది సుభద్రమ్మ గారు వంటింట్లోకి పోతూ.

"అయ్యో.. గ్యాసూ ఇప్పుడే ఐపోవాలా!" అని  లోపల్నుంచీ ఆమె అరుపు.

సన్యాసి చెప్పిన 'అభోజనం' గుర్తుకొచ్చింది సుందరయ్యకి.

 

***

తెల్లారు ఝామునే వెళ్ళి పోయాడు మూర్తి.

పట్నం దాకా తండ్రి తోడొస్తానంటే " రోడ్దంతా రొచ్చుగా ఉంది.. నా తంటాలేవో నేను పడతాగానీ పెద్ద మొత్తాలొస్తే మాత్రం  కాల్ చెయ్యండి. కొనాల్సిన లిస్టు చాలా పెద్దదే ఉంది నా దగ్గర " అని  హాస్యాలు పోయాడు మూర్తి  పోతూ పోతూ.

"ముందు రానివ్వరా బాబూ.. చూద్దాం" అని వద్దు వద్దంటున్నా కొడుకు మెళ్ళో రంగురాయి గొలుసు వేసేసాడు  సుందరయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ.

మూర్తి తీసేయబోతుండే అడ్డుతగిలింది తల్లి " బోసి మెడతో తిరగడం ఫ్యాషనా ఏందిరా? ఉండనీయ్ మా తృప్తి కోసమన్నా" అంటో.

తల్లికి కష్టం కలిగించడం ఇష్టం లేక గమ్మునూరుకుండిపోయాడు మూర్తి.

 

పట్నం బస్సు స్టాండు నుంచీ కాల్ చేసాడు మూర్తి " రైల్వే లైన్లు సరిగ్గా లేవంటున్నారు. అన్ని బళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి. అదృష్టం బాగుండి వోల్వా బస్సొకటి దొరికింది నాన్నా! దాంట్లో పోతున్నా!  సిగ్నల్సు సరిగ్గా లేవు.   మధ్య్లలో  రెస్పాన్సు లేకపోతే  కంగారు పడద్దు. చేరంగానే మళ్లీ కాల్ చేస్తా" అన్నాడు

అదే మూర్తి నుంచి తల్లిదండ్రులకు  వినిపించిన చివరి మాటలు.

 

మూర్తి ఎక్కిన వోల్వా బస్సు దారిలో ఏదో కల్వర్తు దాటుతూ కాలవ నీళ్లల్లో జారి  పడింది. అధునాతనమైన బస్సు. లోపల్నుంచీ అన్ని డోర్లు ఆటోమెటిగ్గా లాకయ్ ఉండటం.. యమర్జన్సీలో అన్ లాకవాల్సిన మెకానిజం అట్టర్ ఫ్లాపయిపోవడం వల్ల..   అంత అందమైన వాహనమూ ఎక్కిన ప్రయాణీకులందరి పాలిట సామూహిక జలసమాధిగా మారి కూర్చుంది.

రకరకాల కారణాలతో  చనిపోయిన నలభై మందిలో మూర్తీ ఒకడు. అతని మృత్యుకారణం మాత్రం చాలా ప్రత్యేకం.

మెడలోని గొలుసు సీటురాడుకు చిక్కుబడిపోయి  రంగురాయి అంగిటికి అడ్దుపడటం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది.

లకీగా బస్సు ఓ ప్రముఖ నేతాశ్రీ ట్రావెలింగు ఏజెన్సీది. 

'ఎన్నికలు ముంచుకొస్తున్నప్పుడే ఈ దారుణం జరగడం ఖర్మ. జరిగిన  నష్టమేదో అణాపైసల్తో సహా   ఎలక్షన్లయినాక వర్లుకోవచ్చు. ముందు.. పార్టీ టికెట్టు పోకుండా చూసుకోవడం ముఖ్యం.  మీడియా ఆర్బాటం.. మృతుల సంబంధీకుల  ఆగ్రహం చల్లబడాలంటే  ఎవరూ ఊహించని భారీ మొత్తం నష్టపరిహారం కింద అచ్చుకోవడమే ఉత్తమం' నేతాజీ వ్యూహం ఆ లైనులో సాగబట్టి సహబాధితులందరికి మల్లే కొడుకు దుర్మరణానికి నష్టపరిహారం కింద సుందరయ్య దంపతులకు అందిన మొత్తం అక్షరాలా ఐదు లక్షలు!

సన్యాసి మాటలు అక్షరాలా సత్యమయ్యాయి..నిజమే!

 

కానీ…!

 

***

హామీ పత్రంః 'నిజమే.. కానీ' అనే ఈ కథానిక నా స్వంత రచన. దేనికీ అనువాదం కానీ, అనుసరణ కానీ కాదు. అప్రచురితం. ఏ పత్రికలోనూ పరిశీలనలో లేదు-అని హామీ ఇస్తున్నాను.

ఇట్లు

గుడ్లదొన సరోజినీదేవి

12-12-2014

 

రచయిత్రి చిరునామాః

గుడ్లదొన సరోజినీదేవి

ఫ్లాట్ నెం# 404, శ్యామ్ కామదేను అపార్టుమెంట్ స్,

మోతీనగర, హైదరాబాద్- 500 018

ఈ-మైల్ : gsdevi55@yahoo.co.in

                Karlapalwm2010@gmail.com

              

               Phone: 8142282178

                             8142283676

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Thursday, February 4, 2021

గారెల భారతం -కర్లపాలెం హనుమంతరావు -సరదా వ్యాసం

 



వింటే భారతమే వినాలని ఆరాటపడే తెలుగువాడికి తింటే గారెలు మాత్రమే తినాలని వెంపర్లాట! భారతంలో ఎక్కడా గారెల ప్రస్తావన లేదు. అయినా రామాయణంలో పిడకల వేటలా    భారతంలో గారెల కోసం తెలుగోడి వెతుకులాట!  గారెలు స్వీయ సృష్టి అని తెలుగువాడికో గట్టి నమ్మకం. సున్నా కనిపెట్టింది ఉత్తరాదివాడైతే  అంత కన్న కన్నాలున్న సున్నాలాంటి గారెలు కనిపెట్టింది తనేనని బడాయి. తినిపెట్టేవాళ్లు తప్ప ఏదైనా కొత్తది కనిపెట్టేవాళ్లు కలికానిక్కూడా కనిపించని రోజుల్లో గారె’ను సృష్టించినందుకు తెలుగువాడు గర్వపడ్డంలో తప్పేముంది?   

చప్పటి పిజ్జాలు, బర్గర్లే తప్ప   ఇప్పటి పిల్లతరానికి గారెల గరిమ గురించి ఆట్టే తెలియదు.  ఆదిమహావిష్ణువు చేతి వేలి మీదుండే చక్రం చూపించినా  పిక్చర్ పూర్తిగా రాదు. బండి చక్రం మాదిరి దొడ్డి గుమ్మంలో పడి ఉండేదని కాకుండా ..నోట పెట్టకుండానే లొటలొటా లోటాడు లాలాజలం  ఊరించేదని చెబితే బెటరేమో .. ధ్యాస కొంతైనా ఇటు మళ్లుతుంది!

గోంగూర కన్న గారెలు వాస్తవానికి తెలుగువాడి జిహ్వపుష్టికి ఆగ్ మార్క్. విశ్వామిత్రుడి సంతు సుమా మనమంతా!  సృష్టికి ప్రతిసృష్టి చేసిన  తండ్రిగారి పంథాలోనే  బూరెలకు బదులుగా గారెలు సృష్టించుకున్న ఘనులం మనం.

తెలుగువాళ్ల కాఫీ ప్రియత్వం సర్వే సర్వత్రా ప్రసిద్ధం. క్షీరసాగరం నుంచి వెలికొచ్చిన అమృతాన్ని మించీ కాఫీ పైనే తెలుగువాళ్లకు  మక్కువ ఎక్కువని కదా  నమ్మకం? ఆ సర్వజనాకర్షణీయ పానీయం కాఫీలో కూడా ఈర్ష్యాసూయలు రేకెత్తించగల   అసాధారణమైన రుచి  గారెలది.

'వడపై నావడపై పకోడీపయి  హల్వాతుంటిపై బూంది యూం/ పొడిపై నుప్పిడి పై  రవిడ్డిలిపయిం బొండాపయిన్సేమీయీ/ సుడిపై బారు భవత్క్రుపారసము నిచ్చో గొంత రానిమ్మునే/ నుడుకుం గాఫిని, యొక్క గ్రుక్క గొనెవే యో   కుంభదంభోధరా!’ అని కాఫీ పానీయం కుయ్యో మొర్రో మన్నట్లు  ఓ ముచ్చట.  పెరుగు వడ, పకోడీ, హల్వా ముక్క, బూందీ పలుకు, ఉప్మా ప్లేటు,  రవ్వ ఇడ్లీ, బోండా, సేమియా పాయసం.. లాంటి పిండివంటకాల వరకంటే  ఓకే! చివరికి వేడి వేడి గారెల రుచి  మీదా ఉడుకుడుకు కాఫీ తన ఉడుకుమోతుతనం దాచుకోలేకపోయింది! గారె రుచికి దక్కే గొప్ప ధృవపత్రం ఇంతకు మించేముంది? ఆరు రుచులు కలగలసి తొడగొట్టినా విస్తరి గోదాలో తెలుగోడి  గారె ముందు బలాదూర్ అన్న జనవాదే నిజమయింది.

సృష్టి సర్వం నిర్దుష్టంగా సృష్టించిన నిరంజనుడు కూడా  నీరుల్లి  గారెల రుచి కోసమే ధర్మసంస్థాపన వంకతో అడపా దడపా భూమ్మీదకు దయచేసేది! అయోధ్యలో పుట్టినవాడు అక్కడే రామాయణంకథ పూరా నడిపించుకోవచ్చు కదా  శ్రీరామచంద్రుడు! అమ్మ వైపు వాళ్లెవరో చెప్పింది విని కమ్మని గారెల పైన మోజు పెంచుకున్నాడు. కాబట్టే లంకారాజ్యాధిపతి వధ వంకన ఆంధ్రా సైడ్ దండకారణ్యాల దారిట్టాడు. అడవి నడిమిన అప్పటికప్పుడు బాణలి పెట్టి వండి వడ్డించే వ్యవధానం లేక  గానీ.. రామసోదరుల రాక ముందే పసిగట్టుంటేనా మన  శబరమ్మ మహాతల్లి ఏరుకొచ్చిన ఎండు పండ్లకు బదులుగా  పచ్చి కొబ్బరి కలిపి నానబెట్టిన మినప గారెలే పెద్ద బుట్టెడు ఆరగింపుకు పెట్టేదికదూ!

అంతా రామమయం’ అంటూ  అంత కమ్మంగా గానం చేయడం వెనుక దాగి ఉన్న రస రహస్యం ..  త్యాగయ్య తెలుగువాడుగా  అవతరించడమే కాదు.. ప్రతీ పూటా భగవదారానెపాన తయారయే గారెలు  తనివితీరా లాగించి తరించడం కూడా కావచ్చును! ముఫ్ఫై రెండు వేల సంకీర్తనలలు  రాశి పోసిన  తెలుగు అన్నమయ్యా    ఏదో ఓ  శృంగార సంకీర్తనల మధ్యన గారె గరిమను గూర్చి ఘనంగానే కీర్తించుంటాడు. కరిగిపోయిన రాగి రేకులతో పాటు గారె మీది కీర్తనలు కూడా మలిగిపోయుంటాయి.. తెలుగోడి బ్యాడ్ లక్! కంటబడ్డ ఏ దురాచారాన్నైనా చెండుకు తినకుండా వదిలిపెట్టని ప్రజాయోగి మన వేమన. గాడిద పాలను గురించి కందంలొ రాపాడేడే  ప్పించి.. గారెల రుచిని గురించి ఏనాడైనా పన్నైత్తి ఒక్క  చెడ్డ పదం వాడాడా ఎక్కడైనా? బీహారు కన్నయ్య చేత తెలుగిళ్ల వెన్న ముద్ధలు తినమరిగించిన గడుసుదనం కవి పోతనది.  గోపాలబాలుల గుంపు మధ్యన చేరి ఆ  బాలగోపాలుడు నంజిన   మాగాయ పసందు వర్ణనల సందున చెప్పి   పెరుగు గారెల రుచులు తగ్గించడం ఎందుకులెమ్మని   వదిలేసాడు! 

కలియుగంలో జంతుహింస నిషిద్ధం. కాబట్టి మేషం(మేక) బదులు మాషం, చక్రాలుగా వండుకు తినవచ్చు అన్నప్పటి బట్టి తెలుగువాడి గారె ప్రభకు తిరుగే లేకుండా పోయింది. తమిళమా.. తెలుగా .. కన్నడమా.. ఏదప్పా అత్యంత ప్రాచీన  భాష అని అడగడం ఆలస్యం..  కొప్పూ కొప్పూ పట్టుకునే రాధ్ధాంతంగాళ్లు కొప్పులోని వెంట్రుకలంత మంది. ఆ కొప్పు బ్యాచ్  సైతం గారె  ప్రాచీనత దగ్గర గప్ చుప్! అదీ మన గారె ఘనత.

కానీ గారె   తెలుగోడి ఆస్తి. అందుకే దాని  పుట్టుపూర్వోత్తరాల మీద  అన్యులకంత అనాసక్తి.   నో ప్రాబ్లం. బాపూజీకి భరతరత్నకు మించిన స్థాయి ఉన్నట్లే మన గారె ముక్కకు మనకు మించిన ఖ్యాతి కద్దు. తిండి ప్రపంచంలో గారెలకు ప్రత్యామ్నాయం నిల్. మీ నూడిల్సు, మెక్డొనాల్డ్సు రుచిలో వాటి ధాటికి ఆటిరాలేవు. ప్లేటులో  వేడి వేడిగా  రెండు గారెలు వడ్డిస్తే మూతి కాలినా  అమెరికా ప్రెసిడెంటు అరక్షణంలో ఇరాను మీద కయ్యం   ప్లేట్ ఫిరాయించేస్తాడు!

వడలు పేరు వింటేనే చాలు ఒడలు పులకరిస్తుందని బడాయిలు పోయే తిండిపోతులంతా ముందు బుద్ధికి బాగా ఎక్కించుకోవలసిన ముఖ్యమైన అంశం.. వడకైనా, ఆవడకైనా మూల సూత్రం మన తెలుగువాడి గారే!  తెలుంగువాడుగా పుట్టనందుకు అప్పయ్య దీక్షితులు అంతలా దిగాలుపడింది ఈ అప్పచ్చులు వండుకు తినే సౌభాగ్యం దక్కనందుకే! వచ్చే జన్మకయినా సరే.. తెలుగు నేల పై బడి శుభ్రంగా శుద్ధమైన గొనసపూడినేతి గారెల  మోజు తీర్చుకోవాలని సుభ్రహ్మణ్య భారతీ కలవరించాడు మరి.  

గారెల గొప్పతనం తగ్గించేందుకే విందు వినోదాల మెనూలలో   కనిపించద్దని  నిబంధనని ఓ అనుమానం! అయినా, పెళ్ళీ పేరంటాల మధ్యన ఏ వడ ముసుగులోనో విస్తట్లో దూరి భోక్తల దవడల్లో నీరూరించనిదే వూరుకోదు.. మన ఘరానా తెలుగు గారె!

పేరుకే తద్దినం భోజనం. విస్తట్లో  ఆవపెట్టిన చట్మీ వధువు పక్కన నోరూరిస్తూ గారె వరుడు కనిపిస్తే విందు భోజనం మించి పసందుగా ఉండదూ! తికినంత కాలం రెండు ముద్దలు కడుపారా కతికెరుగని పెద్దలు ఎందరో ఈ పిదప కాలంలో! పితృదేవతల హోదా దక్కిన పిదపైనా   ఏ వాయస రూపంలోనో వచ్చేసి  భుక్తాయాసం తీర్చేసుకునే అవకాశం కల్పిస్తుంది  గారె. మరి తెలుగు గారె అంటే ఎవరికుండదు గౌరవం? పసికూనల నుంచి పండుటాకుల వరకు గారెలంటే ఎవరికీ చేదు కాదు. బాలభారతం సినిమాలో గారెల మీదో గొప్ప పాటుంది. వింటుంటే అదీ వీనులకు విందే! గారెల గరిమ తెలుగు కవుల పద్యాలలో మరీ మారుమోగుతుంది. 

పుట్టిన ముహూర్తం శుభంగా లేనప్పుడు  మేనమామ వచ్చి శిశువు మెడలో గారెల దండేస్తేనే  సర్వ గ్రహాలూ  శాంతించేది. శివయ్యను అదరగొట్టిన శనిగ్రహమే తలవంచిన   గారెల రుచి ముందు మానవమాత్రులం మనం మాత్రం ఎలా నిగ్రహం చూపించడం?

కలిగినవాడయితే మనసు మళ్లినప్పుడల్లా చప్పున చేసుకుని తినేయచ్చుఖరీదైన అప్పచ్చులు! లేనివాడో? కనీసం పండుగ పబ్బాలప్పుడు లేమి దాచుకునేందుకైనా  చేసుకు తీరక తప్పదు కదా!  అప్పు చేసి అయినా సరే పప్పుకూటికి ‘సై’ మనే   తెలుగువాడు. గారెను మాత్రం ఎందుకు దూరం పెడతాడు?

పడక దిగింది మొదలు, పడక ఎక్కే దాకా బతుకు నిండ ఎన్నో అరాచకాలు! సంబంధంలేని సవాలక్ష సమస్యలతో ప్రజలను పీడించే ప్రభుత్వాలు! మామూలు జనం ఇష్టానుసారం  చేసుకునే అవకాశం ఒక్క తిండితిప్పల వరకే పరిమితం. ఆ తిండి తిప్పల్లో కూడా   ఉప్పు చప్పుల రాజీ ఎందుకు? బడాబాబులకయితే  బడా బడా బ్యాంకులు కూడా  గారెల వంటలకైనా సరే లక్షల కోట్లు కుమ్మరిస్తాయ్. చిల్లర మనుషులకు చిల్లుచెంబో,  సొత్త తప్పేళో   తాకట్టు కొట్టుకు నడిస్తే తప్ప గారె బాణలి పొయ్యిపై కెక్కదు. అయినా సరే! భరత ఖండం దక్షిణాదిమళ్లా ఎప్పుడు తెలుగు బిడ్డగా పుట్టొచ్చామో! వంటికి నిండుగా గుడ్డా గుడుసూ  గొడవలు ఎప్పుడూ ఉండేవే! పండగా పబ్బం వచ్చిందంటే తెలుగోడి వంటింటి పొయ్యి మీది   సలసల  కాగే బాండీ  నూనెలో  గారెల పిండి చుయ్యిఁ ..చుయ్యిఁ’ మంటూ పడి తీరాల్సిందే!

గారె ఒలంపిక్స్ షీల్డును తలపిస్తుంది. ఆటల్లో గోల్డులు గట్రా కొట్టుకొచ్చే  తంటా తెలుగువాడికి లేదు.  ఏ పండుగ పబ్బమొచ్చినా రుబ్బురోలు ముందో రెండు గంటలు కూలబడ్డా చాలు! సుబ్బరంగా వంద ‘ఒలంపిక్’ పతకాలను మించి  గోల్డ్ గారెలు తయార్! 

వివాహ భోజనంబు వింతైన వంటకంబు

వియ్యాలవారి విందు ఓ హోహ్హొ నాకె ముందు

ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల

ఓహ్హోరె అరెసెలుల్ల హహహ్హహహ్హహా

ఇయెల్ల నాకె చెల్ల ..’

చెల్ల సరే! అసలీ మినప గారెల తయారీ ఎల్లా అని గదా?

మినప పప్పో  పావు కిలో, అల్లం    రెండంగుళాల పొడవు,          పచ్చి మిర్చి  ఓ ఆరు కాయలు చిన్నివి,  ఉల్లిపాయలు బుల్లివి ఓ వంద గ్రాములు,  కరేపాకు కత ఇహ నీకు మాత్రం తెల్వనిదేమున్నది..  దొరికితే ఓ రెండు రెబ్బలు, కమ్మటి గుంటూరు నెయ్యి ఓ చెంచాడు,  ఘుమ ఘుమ లాడే ఇంగువ అర చెంచాడు, ఉప్పు తగినంత.. ఐదొందల గ్రాముల  నువ్వుల నూనె! నూనె బాణలిలోకి ఒంపి పెట్టుకోవాలి! గారంటే  గట్టిగ ఉండాలి గదా!  పప్పు ని ఒక గంట పాటు  నానపెట్టి, మెత్తంగా రుబ్బి పెట్టుకోవాలి. అల్లం, మిర్చి, ఉల్లి, రేపాకు, మన్నూ మశాన్నంన్నీ సన్నగా తరిగిపెట్టుకోవాలి. రుబ్బిన పిండి లో ఉప్పు, నెయ్యి, ఇంగువ, మిరప, అల్లం, రేపాకు, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి. డీప్ ఫ్రై పాన్ లో నూనె  పోసి వేడెక్కాక పిండిని అర చేయి  సైజు మందాన  వత్తుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే! గారె గోల్డెన్ బ్రౌన్ రంగుకు వచ్చే వరకు వేయించుకుంటే సూపర్ గారెలు రడీ! అన్నట్లు మధ్యలో కన్నం పెట్టినప్పుడే అది ఆంధ్రా గారె!

బహిరంగంగా మార్కెట్లలో వేరుశనగ నూనె ధరలు వేసే వీరంగం చూస్తుంటే  ఎంత ‘లావు’ ట్రంపుగారికైనా ఇంత పిక్కె గారైనా వండి రుచి చూపించే మాట కల్ల! పండుగ మర్యాద కోసమైనా పిసరంత పక్క పాకిస్తోనోడికి  వండి తినిపిద్దామంటే మినుముల రేట్లు రేకట్లతో పోటీకి దిగి మన శ్రీహరి కోట  నుంచే ఆకాశంలోకి దూసుకెళ్లిపోతున్నాయ్!

ప్రసిద్ధ తెలుగు జంటకవులలో తిరుపతి వేంకట శాస్త్రిగారని ఘరానా పండితులు. వెంకట రామకృష్ణకవులతో వారికి ఏ కారణం చేతనో హమేశా సంకటాలు! ఇద్దరు పండిత ప్రకాండుల మధ్యనా బురద జల్లుడు పద్యాలు వరదలా పోటెత్తినప్పుడు   శాస్త్రిగారి గురువుగారే  శిష్యుణ్ని దెప్పుతూ గారెల ప్రస్తావతో ఓ గొప్ప హితవు చెప్పారు. 'గారెల పిండివంటకయి కాంతుడు కాంతను పృచ్ఛ సేయ నా/ సారసనేత్ర వ్రేలొకటి చయ్యన జూపి ‘యిదొక్కడున్న దా ధారం’ అన్నదటఒక ఇంట్లో! గారెలు వండిపెట్టమని ఓ తిండియావ సంసారి భార్యను పీడించుకు తింటుంటే  'గారెకు మధ్యలో చిల్లు పెట్టే నా చూపుడు వేలు తప్పించి కొంపలో ఇంకే  సరంజామా లేదు.. పోయి తెమ్మన్నదని ఆ వెటకారం! ఆ దయనీయ స్థితిలోనే ప్రస్తుతం మనం ఉన్నది కూడాను!

‘తెలుసు! పెద్ద పండుగకు కూడా గారెలు  వండుకు తినే యోగం బడుగోడుకి ఎట్లాగూ లేదనేగదా.. గారెల గురించి ఇన్నిన్ని నోరూరించే ముచ్చట్లు చెప్పుకొచ్చిందీ!

ఔరౌర గారెలల్ల.. అయ్యారె బూరెలిల్ల

ఓహ్హోరె అరెసెలుల్ల.. హహహ్హహహ్హహ

ఇయెల్ల నాకు కల్ల ..’

హహహ్హహహ్హహా! హహహ్హహహ్హహా! హహహ్హహహ్హహా!’

-కర్లపాలెం హనుమంతరావు

05  -03 -2021

బోథెల్, యూఎస్ఎ

***

 


 

 

వేళకు కురవ్వద్దు.. భారీ వర్షాలు అసలొద్దు.. సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు


పిలవా పెట్టకుండానే నైరుతీ  ఋతుపవనాలు వేళకు వెళ్లి ఉదారంగా   తెలుగు గడ్డల మీద  తెగ కురుస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఇంద్రుడు వరుణదేవుణ్ని పిలిపించి క్లాసు పీకాడు 

ఆహో.. ఓహో.. అంటారన్న మెప్పుకోసమా ఈ కరుణ? ఉదార హృదయం దేవుళ్ల ఉనికికే ప్రమాదం వరుణా!

నా ఆదేశం లేకుండా అసలు నువ్వు ఆ దేశాల వైపుకు ఎందుకు వెళ్లినట్లు? ఒక్క అన్నంపెట్టే వర్గమేనటయ్యా భూలోకంలో  మన కున్నది?  భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఎమిటి మన గతి? కరువు కాటకాలు అనాది నుండి జనాలకు అలవాటు అయిన విపత్తులు. వాటి మీదనే ఆధారపడ్డ జీవితాల మీద చీకూ చింతా లేదా నీకు?

ఇంతటి విచ్చలవిడి ఉదారత ఇప్పటి వరకూ ఎరగను నేను .రుతుపవనాల రాకపోకల మీదనే  ప్రభుత్వాల ఉత్ఠానపతనాలు. ఒక పార్టీ పాలనలో కొన్నేళ్లపాటు  నువ్వా దిక్కే చూడలేదు.. గుర్తుందా ? . 

వానలు కరవయితేనే ప్రభుత్వాలకు మేఘమథనాల మథన. మబ్బు విత్తనాలు పెద్దమనుషుల ముఖ్యమైన ఆదాయ వనరులు . కరవుల క్కరువొస్తే ప్రకృతి విపత్తుల శాఖకు పని కరవు. 

అదే పనిగా  కురిస్తే  జలాశయాల  గతి ఏమై పోవాలని నీ ఆశయం?  కంటి తుడుపు కోసం తవ్విన గంజిగుంటలనుకుంటున్నావా  అవన్నీ! అలుగులు పారేటట్లు కురిస్తే ఆ రిజర్వాయర్లన్నీ ఆ ఖర్చు ఎవరయ్యా అచ్చుకునేది? 

మరీ కడుపుబ్బరంగా ఉందని మబ్బులు  కక్కటిల్లితే ఏ సముద్రం మీదకో పోయి కురవాలి! సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే అధికారం నీ ఒక్కడికే సోపలేదే నేను! దొడ్డిదారిన తిరిగే  వాటర్ ట్యాంకుల వాళ్ళ  వాటా మర్చిపోతే ఎట్లా  నువ్వు ?

సముద్రుడు రుద్రుడవుతున్నాయ్యా నా మీద ఇక్కడ! గతంలో వాన ఒక్క చుక్క పడ్డా ఇంచక్కా తన కడుపులోకేనని  నిశ్చింతగా ఉండేవాడా సాగరుడు. ఇప్పుడు అడుగడుగునా ప్రాజెక్టులు! తాము కట్టే రాతిగట్లను కూలిస్తే ప్రభుత్వాలకు ఆగ్రహం రాదా? కాంట్రాక్టర్లకు తంటాలు తెచ్చి పెట్టేలనేనా ఈ భారీ వర్షాలు ? ఆ పని నేను నిన్నెప్పటికీ చెయ్యనివ్వను.  అంత ఉబ్బరంగా ఉందా? అడిగితే నేరుగా వెళ్లి ఆ సముద్రంలో కురవమని నేనే  పురమాయిద్దునుగా ! పుసుక్కున వెళ్లి ఆ నేల మీదనే ఉన్న నీళ్లన్నీ ఒలకబోసేయట మేంటీ ?!  

సముద్రాల ప్రసాదమే  స్వామీ నీ నీటిమేఘాలన్నీ!  కడలి గాని మొహం చాటేస్తే నీ కడుపు నిండా ఉండేదంతా కాలకూట విషమే! సాయమందుకుని,  సాయం అందించాల్సి న  సమయంలో సాకులు చూపిస్తే కింది జాతుల్లా అందరూ గమ్మునుండరు! సమయం చూసి దెబ్బ కొడితే ఇంద్రుణ్ని నా కథ మళ్లీ మొదటికొచ్చేస్తుంది. ఏనుగంటే చచ్చినా బతికినా పదివేలే గానీ, ఏనుగు మీదెక్కి ఊరేగే నా బోటివాడి విలువ అంబారీ మీదున్నంత వరకే నాయనా ! ఇందుడికి ఐరావతాన్ని దూరం చేసే ఈ కుట్రకు ఎవరు తెర లేపినా సహించే ప్రశ్నే లేదు. 

నీ కుండపోతలకు కింద ఎవరూ సంతోషంగా లేరు. చుక్క పడితే నగరాలు మహాసాగరాలయ్యే దుస్థితి. కోవిద్- పంథొమ్మిది కారణంగా ఇళ్ళల్లో కట్టిపడేసినట్లున్న జనాల బతుకు నీ జడివానల దెబ్బకు మరింత జటిలమవుతుంది .. తెలుసా ? లాక్- డౌన్లు ఎత్తేస్తున్నా నీ ముమ్మర వర్షాల మూలకంగా కాలు కింద పెట్టే పరిస్థితి లేదని తిట్టి పోస్తే నీ పోస్టు ఊస్టింగే . బి కేర్ ఫుల్ వరణా! పిచ్చి పిచ్చి రాజకీయాలతో పిచ్చిపట్టినట్లయిపోయి పాపం  జనాలు  నాలుగ్గోడల మధ్యనే పగటి దెయ్యాల్లా తిరుగుతుంటే .. నువ్వేంటీ ఇట్లా జడివానలు కురిపించి జడిపించడం?  ఆడాళ్ల  టీవీ సోపు ఏడుపులతోనా నీకు   పోటీ ? తుగ్లక్! 

వానలు పడక ఇహ ప్రభుత్వాలతో కూడా ఏ ప్రయోజనం లేదని తేలితే జనం, కనీసం ఏ కప్పల పెళ్లిళ్లు, గాడిద కళ్యాణాలతోనో కాలక్షేపం చేసేవాళ్లు. నిక్షేపంలాంటి ఆ జంతువులనూ మన మగపిల్లల మాదిరి  పెళ్లిపీటలకు దూరం చేస్తున్నావ్  కదా ! 

చెరువుల స్థితి చూస్తుంటే కడుపు చెరువవుతోందయ్యా! పూడిక తీయని చెరువులు నీ కుండపోత వర్షం దెబ్బకి  గబ్బంతా ఊళ్ల మీదకు తోసేస్తున్నామ్ ! తూము కాలవల్లో  మురికి పొంగిపొర్లుతూ  రోడ్డు మీదనే  మూసీలా ప్రవహిస్తోంది. 

వానలు పడనప్పుడు దేవుళ్లకు రుద్రాభిషేకాలు చేయడం కింద మనుషులకు  బాగా అలవాటు. ఆ భక్తి పరిశ్రమ మీదా గట్టి దెబ్బే కొట్టేస్తున్నావు  గదా నువ్వు ఎడా పెడా కురిసి   ! 

పాపం పండింది కాబట్టి శిక్షించడానికి ఈ అతివృష్టి అని మాత్రంనాకు  చెప్పద్దు! ఆ శిక్షలు, కక్షలు గట్రా అక్కడి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల బాధ్యత. ఆ పోలీసు దాడులు, విచారణలకు ఆదేశాలు అవీ చూసినా ప్రభుత్వాలు తమ వంతు బాధ్యత చక్కగా నిర్వర్తిస్తున్నట్లే లెక్క! కరోనా రోగాల నుంచి మిడతల దాడి, చైనా బెడదల దాకా దేవుళ్ల వంతు  దేవుళ్లు చేస్తుంటిరి గదా! పేరిగాడి పెత్తనంలా మధ్యలో నువ్వేంటి ఇలా ఎడా పెడా  అడగాపెట్టకుండా  అక్కడికెళ్ళి ఆగకుండా  దడదడా   ఆ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో ఆగడాలు! స్టాపిట్ అట్ ఒన్స్ ! 

సమయానికిలా  అన్నీ సక్రమంగా నీలాగా  చెల్లిస్తే వెల్లికిలా పడుకోడం, కమ్మంగా తిని గుర్రుకొట్టడం జనాలకు మా బాగా అలవాటయిపోతుందయ్యా! నాస్తికత్వం బలిస్తే ఇహ  నీకూ నాకూ  ఇద్దరికీ పస్తే! మన ఉనిక్కి స్వస్తే! 

ముందర్జంటుగా  అ వర్షించడాలు.. ఉరుములు మెరుపులతో గర్జించటాలా  గట్రా ఆపెయ్ వరుణదేవా! మరీ అంత కడుపుబ్బరం తట్టుకోలేకుంటే .. ఎన్నో మహాసముద్రాలున్నాయయ్యా మనకు  భూమ్మీద.. ఎక్కడికైనా పోయి నిశ్చింతగా  కురుసుకో.. పో! ఐ డోంట్ హావ్ అబ్జెక్షన్

- కర్లపాలెం హనుమంతరావు 

బోధెల్ ; యూఎస్ఎ

05 -02 -2021 

ఎవరు గొప్ప నియంతో?-సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

                                                           


నరకలోకపు శిక్షలలో పూర్వపు కాఠిన్యం కరవవుతోంది. యమధర్మరాజుకు  ఓ మాసం పాటు ధర్మాధర్మవిచక్షణ అధికారాల్లో కర్కోటక శిక్షణ ఇచ్చే గట్టి నియంత

అవసరం అనిపించింది.  అందు నిమిత్తమై అన్వేషణ ఆరంభమయింది.

వడబోతలన్నీ అయి ఆఖరి అంచెగా బృందచర్చలు జరుగుతున్నాయి.  శివయ్య పర్యవేక్షకుడు.

 ‘నియంతల  జాబితాలో నేనే ఎప్పుడూ నెంబర్ వన్. దయ, జాలి వంటి మానవీయ

పదాలకు మన నిఘంటువులో చోటుండదు’ అన్నాడు గొప్పగా  జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్!

 ’లిబియాతో నాలుగు దశాబ్దాల  నియంతృత్వ అనుభవం నాది. అమానుషత్వానికి కోటు తొడిగి చేతికి లాఠీ ఇస్తే గడాఫీనే! ప్రపంచ ఉగ్ర్రవాదానికి  ఆర్థిక పోషకుణ్ని. నా గొప్పలు నా నోటితో వినడం ఎబ్బెట్టు అనుకుంటే.. లింగాయా

ప్రభుత్వాన్ని వాకబు చేసుకోండి.. మా ఘాతుకాలన్నీ బీరుపోకుండా

బైటికొచ్చేస్తాయ్’ అంటూ లేని మీసాలు దువ్వుకున్నాడు మువమ్మర్ గడాఫీ.

కొత్త శతాబ్దంలో సిరియా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటి బట్టి రెండు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచిన వాణ్ని. జనం ఎన్నుకున్న తరువాత ఇదేమని అడిగే దమ్ము ఎవరికి ఉండద్దన్నది నా ఉద్దేశం.  మహిళలపై హింస, అత్యాచారాల మొదలుకొని,  మనుషుల మారణహోమం వరకు మనమే కొత్త శతాబ్దానికి తగ్గట్లు గొప్ప భాష్యం చెప్పిన  మొదటి సూత్రకారులం’ అన్నాడు సిరియా దురహంత బషర్ అల్-అస్సాద్.

హలో!  ఉగాండా ఉగ్రవాద సింహం ఇడి- అమిన్ ఇక్కడే ఉంది! చెండుకుతినడం

ఒక్కటే కాదు రాజకీయంగా చేసే అధికార దుర్వినియోగం సైతం నియంతకు  శోభనిచ్చే అదనపు గుణం. నేను చచ్చి జనం బతికిపోయారు. ఇంకా బతికుండి ఉంటే ఇంతకు ముందే చచ్చి ఇక్కడికొచ్చిన ఐదు లక్షల ప్రాణాలకు  మరో ఐదు లక్షల ప్రాణాలు కలిసుండేవి! రికార్డు స్థాయిలో అత్యాచారాలు చేయాలన్న  ఉబలాటం ఒక్కటే తీరింది కాదు. ప్చ్!’

బర్మా తిరుగుబాటును నిరోధించడం  బ్రహ్మతరం కూడా కాదనుకున్నారు. ఆ ఫీట్

దిగ్విజంగా నిర్వహించి మానవ హక్కులు కాలరాయడంలో  ‘టెక్ట్స్ బుక్’ కేసు

సృష్టించిన నీచుణ్ని నేను. ‘పరేడ్‘ అనే పత్రిక ఎన్నో సార్లు నాకు జనహంత’గా బిరుదిచ్చి సత్కరించింది!’  ష్వే కంటే జనరల్ గోతాలు!

తాజా శతాబ్దపు ఆదర్శ నియంతంటే మన పేరే తలుచుకుని వణికిపోవాలి ప్రపంచం. ప్రియమైన నేతా’ అన్న పిలుపుతో మాత్రమే నన్ను పిలవాలి ముందు. మచ్చలేని దానవత్వం ప్రదర్శించడంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు. నా సొంత దళాలతో సహా రెండు కోట్ల మందికి ప్రాణనష్టం కలిగించిన మహాజ్యేష్ఠను నేను’ అని ఉరిమాడు ఉత్తర కొరియా నరహంత కిమ్ జోంగ్ ఇల్.

అక్కడే ఉన్న సద్దాం హుస్సేన్ పెదవి విప్పకపోవడం చూసి ‘ఇరాక్ మీద దాడి

చేసి రెండున్నర లక్షల మంది అమాయక పౌరులను అతిదారుణంగా పొట్టనబెట్టుకుంటివి కదా!  మానవ హక్కుల ఉల్లంఘన నేరం  నీ మీద కూడా  ఉన్నప్పుడు యమధర్మరాజుగారికిచ్చే నియంతృత్వపోకడల శిక్షకుల జాబితాలో  నీకూ చోటివ్వాలి కదా న్యాయంగా? నోరెత్తవేంటి సద్దాం హుస్సేన్ సాబ్?’ అంటూ రెచ్చగొట్టే ఓ చిన్న ప్రయత్నం వచ్చ్ఈ రాగానే మొదలు పెట్టాడు కలహభోజనుడు

ఎప్పట్లానే.

సద్దాం సాబ్ లో కొంతమంది హీరోనూ చూస్తున్నారు. మానవజాతి మొత్తం ఏకపక్షంగా చీదరించుకునే త్రాష్టుడికే యమధర్మరాజు శిక్షకునిగా అర్హత! చైనా మావో, రష్యా స్టాలిన్ లాంటి వాళ్లను ఈ ఇంటర్వ్యూకు  పిలవని కారణం కూడా అదే!’ అంటు గుడ్లురిమాడు కాలకంఠుడు.

నారాయణ! నారాయణ! ఆ లెక్కన అయితే కింద  మన భరతవర్షంలోనే బోలెడంత మంది కర్కోటకులున్నారు కదా మహాదేవా? వాళ్ల ఆగడాల ముందు  ఈ హిట్లర్లూ,

ఇడీఅమీన్లూ   చెడ్డీలేసుకకున్న బుడంకాయలు! ఈ సద్దాం హుస్సేన్, మావో,

స్టాలిన్ లాంటి వాళ్లలో నియంతృత్వానికి తోడు ఓ మూల  మానవత్వం, స్వాభిమానం, ప్రజాభిమానం లాంటి మంచి లక్షణాలు  తొణికిసలాడే మాటా నిజమే! ఆ తరహా మచ్చలేవీ లేని పచ్చి దురహంకారంతో ఆర్షమండలాన్ని పీల్చి పిప్పిచేసేందుకు  భరతఖండం మీదనే బోలెడంత మంది పీడకులు పోటీలు పడుతున్నారు.  తమరే స్వయంగా వెళ్లి ఒకరిని ఎన్నుకుని తెచ్చుకోరాదూ! మచ్చలేని కుత్సితుడు దొరుకుతాడూ’ అన్నాడు నారదుడు.

తాను  చెవిలో ఊదిన ఆయా ప్రదేశాల పర్యవేక్షణకని మహోత్సాహంగా బైలుదేరిన  బృందంతో ‘ఆ భూలోక నియంతలతో జర భద్రం మహాదేవా! ఎవడు మూడో కన్ను తెరిచినా ముందు మీరు మాడి మసైపోవడం ఖాయం.  కరోనా మహమ్మారొకటి మహా విలయతాండవం చేస్తుందక్కడ వాళ్లకు సాయంగా. అసలే బోళా శంకరులు తమరు. అమాయకంగా ఏ పాలకనేతనైనా నిలదీసే ప్రయత్నం చేసినా చేస్తారు. కటకటాలపాలవుతారు! ముక్కుకు గుడ్డేదీ ముక్కంటీ? మీ నంది వాహనుడికైనా అది తప్పనిసరి. ఇబ్బందంటే బొక్కలో ఇరుక్కుంటారు. ఈసారి ఏ

బ్రహ్మావిష్ణాదులొచ్చీ ప్రయోజనం ఉండదు. చెప్పానుగదా! ఆక్కడ ప్రస్తుతం

రాజ్యమేలేది.. ఈ హిట్లరూ కాదు.. ఇడీ అమీనూ కాదు! కిమ్ కు  పదింతలు మించిన మొగుళ్ళు! వాళ్ల పేర్లా? నారాయణ! నారాయణ!’ అంటూ గభాలున అంతర్థానమైపోయాడు కలహభోజనుడు.

నారదులవారికి అంత  భయం కాబోలు! ఏం రోజుల్రా బాబూ!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ.ఎస్.ఎ

04 -02 -2021

 

***

లేచింది మహిళాలోకం -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడులోని ఓనాటి నా సంపాదకీయం)

 


                               


పరమేశ్వరుడు సమస్త వేదాంతరహస్యాలను పార్వతమ్మకు వివరించినట్లు  శివపురాణ కథనం. నారాయణమూర్తి భూదేవితో వైష్ణవాగమన విశేషాలు పంచుకొన్నట్లు విష్ణుపురాణం విశ్వాసం. స్త్రీ విద్యాధికారాన్ని దైవలోకమే మన్నించింది. కిందిలోకంలోనే ఎందుకో మగువకు దిగువస్థానం! ఆదిమయుగం సంగతేమోగానీ.. అంతా వేదమయంగా సాగిన రుగ్వేదకాలంలోనూ అమ్మదీ, అయ్యతో పాటు సంసార అరద చోదనంలో సమాన పాత్రే! బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు భార్య మైత్రేయికి సాంఖ్యశాస్త్రం, భాగవతంలో కపిలాచార్యుడు తల్లి దేవహూతికి బ్రహ్మతత్వం బోధపరిచారు. మతంగ మహర్షి శబరిని జ్ఞానమాతగా ఉద్ధరించిన రామాయణగాథనే నేటికీ మనం నిత్యం పారాయణం చేస్తున్నాం! వాసంతి నుంచి ఆత్రేయి వరకు ముదితలెందరో మున్యాశ్రమాలలో వేదవేదాంగాది విద్యలలో కాణాచీలుగా వెలిగొందిన కథలు చదువుతూ కూడా స్త్రీ బుద్ధిని చంచలం, ప్రళయాత్మకంగా కించపరచడం మగవాడి దాంబిక ప్రవృత్తికి నిలువెత్తు దర్పణం. ‘నృణాతి నయతి స్వవశం పురుషమితి నారీ- పురుషుణ్ని స్వాధీనపరుచుకొనే శక్తే నారి’ అని దుష్టాన్వయం చేయడం నెలత ఆభిజాత్యాన్ని అవమానించడమే! ‘నారి’ అంటే వాస్తవానికి న అరి- శత్రువులు లేనిది. ఏ భూమి మీద సావిత్రి పతిభక్తి భర్త ప్రాణాలను రక్షించిందో, ఏ భువి లోపల సీతమ్మవారి పాతివ్రత్యం అగ్నిపరీక్షలో సైతం నెగ్గుకొచ్చిందో, ఏ పృథ్వి అత్రిసతి అనసూయ సౌశీల్యం త్రిమూర్తుల లౌల్యాన్ని బాల్యచేష్టగా మార్చి లాలించిందో, ఏ వసుంధర అరుంధతి.. లోపాముద్రాది నాతి జాతి సృష్టికర్త ఉనికిని సైతం ప్రశ్నార్థకం చేసి చూపిందో.. ఆ భూఖండంలోనే ఆడదానికి అడుగడుగునా అఖండంగా అగ్నిగుండాలు! నవనాగరీకులమని నయగారాలు పోయే మగవారి లోకంలో మహిళ బతుకు ఇంకా ముల్లు పక్కన అల్లాడే అరిటాకంత సున్నితమే! దేవనాగరీకంలో 'శర్వరి' ద్విశతాధిక పర్యాయపదభూయిష్ట! ‘మానవతీ!.. మానినీ!’గా సంబోధించినంత మాత్రాన మహిళ సమానవతి.. సన్మానినిగా మన్నింపబడుతున్నట్లెనా!

ఒక బిడ్డకు తల్లయీ పుట్టినింటికి పోయిరావాలంటే పట్టెమంచం మామగారినుంచి.. వంటగది తోడుకోడలు వరకు ఇంటిసభ్యులందరి అనుమతులు తప్పనిసరి. అందుకోసమై అత్తింట కొత్తగా కాలు పెట్టిన ఇంతి కన్నీటితో దేబిరించే జానపదుల పాట సరిపోదా.. కలికి కామాక్షి ఎంత కలవారి కోడలైనా ఒలికి వళ్లోకి వచ్చి వాలేది వట్టిసున్నా మాత్రమేనని! ‘బాలప్రాయమునాడు నాతి పడుచూను/ వేల్పులెత్తగలేని విల్లు తానెత్తే/’ జనకముని పుత్రిక సీత. అది చూసి ‘ఈ సీత నెవ్వరికిత్తునని దలచీ/ ఘనులు ఎవ్వరూ రానీ కరమునా బట్టీ/ పూని వంచితే ఇత్తు పొలతి వారికినీ’ అని ఆ మారాజు నిశ్చయించుకొన్న ‘సీతమ్మ స్వయంవరం’ గీతికలో మాత్రం ఏమంత నీతిసూత్రం దాగుందని? సీత రాత బాగుండి ‘రఘువంశ తిలకుడు రామచంద్రుడు మునుకొని హరివిల్లు ముమ్మారు వంచి’ విరిచేయబట్టి సరిపోయింది! రుగ్వేదయుగంలో మాదిరి సౌందర్యం, సౌశీల్యం, బుద్ధి, బలం, యవ్వనం, సమయానుకూల వర్తన.. గమనించుకొని గదా వరుడి మెడను వధువు స్వయంనిర్ణయానుసారం వరమాలాకృతం చెయవలసిందీ? ‘పెళ్లయిన ఇంట ఆరునెల్ల కరువంట’ అని సామెత!ఆడపిల్లంటే గుండెలమీది బరువు. అటూ ఇటైతే.. కన్నకడుపు చెరువు’ వంటి భావనలు నవసమాజం నుంచి ఇంకా తొలగకపోవడం భామినుల ఆభిజాత్యానికి ఏమంత శోభస్కరం? శాస్త్రాలు సైతం సుతోదయ భాగ్యంకోసం మాత్రమే క్షీర, సోమాది రసాభిషేకాల ప్రస్తావనలు చేయడం గమనార్హం. గర్హనీయం. ‘ఆడదై పుట్టేకన్నా అడవిలో మానై పుట్టడం మేలు’ అన్న ఆత్మన్యూనతా భావంలోనే అధికశాతం మగువలు ఈ నాటికీ మగ్గడం విచారకరం! మగవాడు తిరిగితే చెడనిది.. ఆడది తిరిగితే ఎలా చెడుగవుతుందో? ‘చక్రవర్తులైనట్టి చానలుండ/ దరుణు లుద్యోగములు చేయ దగరటంచు/’ బల్కనేమిటి?’ అని వెనకటికి ఓ కవిపురుషోత్తముడు కడిగిపారేశాడు. ‘విమల సచ్చరిత్ర విమలామహాదేవి- కాంతుని నేపాటి కలత పఱచె?/అపర సరస్వతి యననొప్ప దమయంతి- నాథు నేపాటి నమిలి మ్రింగె?/.. తక్కుగల రామలందరు మిక్కుటముగ- జదువ నేర్చియు బతుల కసౌఖ్యములను/ కలుగ జేసిరె?’ అన్న ఆ కవిప్రశ్నకు ఈనాటికీ సబబైన సమాధానం కరువు. ఇంట గెలిచిన ఇంతికి రచ్చ గెలవడం ఎంతని.. అవకాశమంటూ ఒకటి దక్కడమే ముఖ్యం గాని!

పురుషునిలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని వెన్నుతట్టి లేపేది అమ్మగా, ఆలిగా, చెల్లిగా.. స్త్రీమూర్తే! బుద్ధిలో నాలుగింతలు, శక్తిలో అంతకు రెట్టింపు ఆధిక్యంలో ఉండీ.. వెనకుండి గెలిపించేందుకే ఆసక్తి చూపించే మగువను మగవాడు ఏనాడు అర్థంచేసుకొన్నాడు కనుక! అంగనంటే వాడికి అంగడిబొమ్మ. ముంగిల్లో తిరిగే మరబొమ్మ. తిమ్మిరి దింపుకొనే పడక గుమ్మ. ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అని మనువేనాడో అప్పటి అవసరాల నిమిత్తం ఎందుకు చేసాడోగాని.. ఆ పాడుబడ్డ సిద్ధాంతం చూరుకే మగవాడు ఈనాడూ గబ్బిలాయిలా వేలాడ్డం నవ్వు పుట్టిస్తుంది. ఆగ్రహమూ తెప్పిస్తుంది. ‘ఆకొన్న అతిథిని ఆ పూట నిల్పం- నతివను ముందుగా నడుగవలయు/ అతిరిక్తుడౌ రోగి ఔషధం బిప్పింప- బడతి ఆజ్ఞ బొందవలయు ముందు/ బైరాగికిని నొక్క పాత వస్త్ర మొసంగ- బొలతి శాసనంబు బొందవలయు/.. ఇంక స్వాతంత్ర్య మనునది యెందు గలదొ- యెరుగగా రాదు మీకును బురుషులార!’ అని బుడమగుంట శివరామయ్యకవిగారు వందేళ్ల కిందటి ఆంధపత్రిక (అబలావిలాపం) లో హేళనకు దిగిన నాటి పరిస్థితుల్లో ఈవేళ్టికీ వీసమెత్తు మార్పు లేదు. సరికదా మహిళామణి ఆలోచనల్లో.. ఆచరణలో.. అభివ్యక్తీకరణల్లో.. ఆభిజాత్యం పాళ్ళు పొంగుకొస్తున్నాయి కూడా. సంతోషమే కదా! వలతి మగవాడికన్నా ఎందులో వెలితి? ‘అగ్బరంతటి వైరి నాజి జయింపదే– రాణి వీరాబాయి రౌద్ర మెసగ?/ నిరుపమ శౌర్యవార్నిధి గుతుబుద్ధీను- దురమున దోలదే కరుణదేవి?/ తన బాణ నైపుణ్యమున కెర సేయదే- సంయుక్త రిపులను సమరమందు?’ ‘అట్టి యసమాన శూరత్వ మతివలకును/ గలుగ జేయరె తొల్లింటి కాలమునను?’ అని తొయ్యలులంతా ఏకమై కొంగులు బిగిస్తే అయ్యలెంత మొనగాళ్లైనా మునుపటంత మొండిగా ముందడుగు వెయ్యలేరీనాడు. జన్మతః జన్మదాతల వర్గానికి దఖలుపడ్డ హక్కులకు ఇంకే మాత్రం మోకాలడ్డడం సాధ్యం కాదన్న ఇంగితమే సౌదీ పాలకులకు కలిగుండాలి. పోయిన వారం ఆ సంప్రదాయిక దేశంలో జరిగిన పురపాలకసంఘం ఎన్నికల్లో సౌదీసోదరి తొలిసారి ఓటుహక్కు వినియోగించుకుంది. శుభం. వాహన చోదన నుంచి.. సరుకుల బేరం వరకు ఎన్నో ఆంక్షలు మహిళకు ఆ గడ్డమీద! ఎన్నికల్లో నిలబడే హక్కూ ఆమెకిప్పుడు దఖలు పడడం సామాన్యమైన గంతు కాదు. ముందు ముందు మరిన్ని మహిళాసంస్కరణలకు ఇది నాందీ ప్రస్తావన కావాలన్నదే అభిలాష. సౌదీ సోదరీమణులందరికీ శుభాభినందనలు!

***

-కర్లపాలెం హనుమంతరావు

04 -0౨2021

బోథెల్; యూఎస్ఎ

( సౌదీ మహిళకు పురపాలక సంఘ ఎన్నికలలో మొదటిసారి ఓటు వేసే హక్కు దఖలు పడిన సంబరంలో రాసినది)

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...