Thursday, February 4, 2021

ఎవరు గొప్ప నియంతో?-సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

                                                           


నరకలోకపు శిక్షలలో పూర్వపు కాఠిన్యం కరవవుతోంది. యమధర్మరాజుకు  ఓ మాసం పాటు ధర్మాధర్మవిచక్షణ అధికారాల్లో కర్కోటక శిక్షణ ఇచ్చే గట్టి నియంత

అవసరం అనిపించింది.  అందు నిమిత్తమై అన్వేషణ ఆరంభమయింది.

వడబోతలన్నీ అయి ఆఖరి అంచెగా బృందచర్చలు జరుగుతున్నాయి.  శివయ్య పర్యవేక్షకుడు.

 ‘నియంతల  జాబితాలో నేనే ఎప్పుడూ నెంబర్ వన్. దయ, జాలి వంటి మానవీయ

పదాలకు మన నిఘంటువులో చోటుండదు’ అన్నాడు గొప్పగా  జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్!

 ’లిబియాతో నాలుగు దశాబ్దాల  నియంతృత్వ అనుభవం నాది. అమానుషత్వానికి కోటు తొడిగి చేతికి లాఠీ ఇస్తే గడాఫీనే! ప్రపంచ ఉగ్ర్రవాదానికి  ఆర్థిక పోషకుణ్ని. నా గొప్పలు నా నోటితో వినడం ఎబ్బెట్టు అనుకుంటే.. లింగాయా

ప్రభుత్వాన్ని వాకబు చేసుకోండి.. మా ఘాతుకాలన్నీ బీరుపోకుండా

బైటికొచ్చేస్తాయ్’ అంటూ లేని మీసాలు దువ్వుకున్నాడు మువమ్మర్ గడాఫీ.

కొత్త శతాబ్దంలో సిరియా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటి బట్టి రెండు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచిన వాణ్ని. జనం ఎన్నుకున్న తరువాత ఇదేమని అడిగే దమ్ము ఎవరికి ఉండద్దన్నది నా ఉద్దేశం.  మహిళలపై హింస, అత్యాచారాల మొదలుకొని,  మనుషుల మారణహోమం వరకు మనమే కొత్త శతాబ్దానికి తగ్గట్లు గొప్ప భాష్యం చెప్పిన  మొదటి సూత్రకారులం’ అన్నాడు సిరియా దురహంత బషర్ అల్-అస్సాద్.

హలో!  ఉగాండా ఉగ్రవాద సింహం ఇడి- అమిన్ ఇక్కడే ఉంది! చెండుకుతినడం

ఒక్కటే కాదు రాజకీయంగా చేసే అధికార దుర్వినియోగం సైతం నియంతకు  శోభనిచ్చే అదనపు గుణం. నేను చచ్చి జనం బతికిపోయారు. ఇంకా బతికుండి ఉంటే ఇంతకు ముందే చచ్చి ఇక్కడికొచ్చిన ఐదు లక్షల ప్రాణాలకు  మరో ఐదు లక్షల ప్రాణాలు కలిసుండేవి! రికార్డు స్థాయిలో అత్యాచారాలు చేయాలన్న  ఉబలాటం ఒక్కటే తీరింది కాదు. ప్చ్!’

బర్మా తిరుగుబాటును నిరోధించడం  బ్రహ్మతరం కూడా కాదనుకున్నారు. ఆ ఫీట్

దిగ్విజంగా నిర్వహించి మానవ హక్కులు కాలరాయడంలో  ‘టెక్ట్స్ బుక్’ కేసు

సృష్టించిన నీచుణ్ని నేను. ‘పరేడ్‘ అనే పత్రిక ఎన్నో సార్లు నాకు జనహంత’గా బిరుదిచ్చి సత్కరించింది!’  ష్వే కంటే జనరల్ గోతాలు!

తాజా శతాబ్దపు ఆదర్శ నియంతంటే మన పేరే తలుచుకుని వణికిపోవాలి ప్రపంచం. ప్రియమైన నేతా’ అన్న పిలుపుతో మాత్రమే నన్ను పిలవాలి ముందు. మచ్చలేని దానవత్వం ప్రదర్శించడంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు. నా సొంత దళాలతో సహా రెండు కోట్ల మందికి ప్రాణనష్టం కలిగించిన మహాజ్యేష్ఠను నేను’ అని ఉరిమాడు ఉత్తర కొరియా నరహంత కిమ్ జోంగ్ ఇల్.

అక్కడే ఉన్న సద్దాం హుస్సేన్ పెదవి విప్పకపోవడం చూసి ‘ఇరాక్ మీద దాడి

చేసి రెండున్నర లక్షల మంది అమాయక పౌరులను అతిదారుణంగా పొట్టనబెట్టుకుంటివి కదా!  మానవ హక్కుల ఉల్లంఘన నేరం  నీ మీద కూడా  ఉన్నప్పుడు యమధర్మరాజుగారికిచ్చే నియంతృత్వపోకడల శిక్షకుల జాబితాలో  నీకూ చోటివ్వాలి కదా న్యాయంగా? నోరెత్తవేంటి సద్దాం హుస్సేన్ సాబ్?’ అంటూ రెచ్చగొట్టే ఓ చిన్న ప్రయత్నం వచ్చ్ఈ రాగానే మొదలు పెట్టాడు కలహభోజనుడు

ఎప్పట్లానే.

సద్దాం సాబ్ లో కొంతమంది హీరోనూ చూస్తున్నారు. మానవజాతి మొత్తం ఏకపక్షంగా చీదరించుకునే త్రాష్టుడికే యమధర్మరాజు శిక్షకునిగా అర్హత! చైనా మావో, రష్యా స్టాలిన్ లాంటి వాళ్లను ఈ ఇంటర్వ్యూకు  పిలవని కారణం కూడా అదే!’ అంటు గుడ్లురిమాడు కాలకంఠుడు.

నారాయణ! నారాయణ! ఆ లెక్కన అయితే కింద  మన భరతవర్షంలోనే బోలెడంత మంది కర్కోటకులున్నారు కదా మహాదేవా? వాళ్ల ఆగడాల ముందు  ఈ హిట్లర్లూ,

ఇడీఅమీన్లూ   చెడ్డీలేసుకకున్న బుడంకాయలు! ఈ సద్దాం హుస్సేన్, మావో,

స్టాలిన్ లాంటి వాళ్లలో నియంతృత్వానికి తోడు ఓ మూల  మానవత్వం, స్వాభిమానం, ప్రజాభిమానం లాంటి మంచి లక్షణాలు  తొణికిసలాడే మాటా నిజమే! ఆ తరహా మచ్చలేవీ లేని పచ్చి దురహంకారంతో ఆర్షమండలాన్ని పీల్చి పిప్పిచేసేందుకు  భరతఖండం మీదనే బోలెడంత మంది పీడకులు పోటీలు పడుతున్నారు.  తమరే స్వయంగా వెళ్లి ఒకరిని ఎన్నుకుని తెచ్చుకోరాదూ! మచ్చలేని కుత్సితుడు దొరుకుతాడూ’ అన్నాడు నారదుడు.

తాను  చెవిలో ఊదిన ఆయా ప్రదేశాల పర్యవేక్షణకని మహోత్సాహంగా బైలుదేరిన  బృందంతో ‘ఆ భూలోక నియంతలతో జర భద్రం మహాదేవా! ఎవడు మూడో కన్ను తెరిచినా ముందు మీరు మాడి మసైపోవడం ఖాయం.  కరోనా మహమ్మారొకటి మహా విలయతాండవం చేస్తుందక్కడ వాళ్లకు సాయంగా. అసలే బోళా శంకరులు తమరు. అమాయకంగా ఏ పాలకనేతనైనా నిలదీసే ప్రయత్నం చేసినా చేస్తారు. కటకటాలపాలవుతారు! ముక్కుకు గుడ్డేదీ ముక్కంటీ? మీ నంది వాహనుడికైనా అది తప్పనిసరి. ఇబ్బందంటే బొక్కలో ఇరుక్కుంటారు. ఈసారి ఏ

బ్రహ్మావిష్ణాదులొచ్చీ ప్రయోజనం ఉండదు. చెప్పానుగదా! ఆక్కడ ప్రస్తుతం

రాజ్యమేలేది.. ఈ హిట్లరూ కాదు.. ఇడీ అమీనూ కాదు! కిమ్ కు  పదింతలు మించిన మొగుళ్ళు! వాళ్ల పేర్లా? నారాయణ! నారాయణ!’ అంటూ గభాలున అంతర్థానమైపోయాడు కలహభోజనుడు.

నారదులవారికి అంత  భయం కాబోలు! ఏం రోజుల్రా బాబూ!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ.ఎస్.ఎ

04 -02 -2021

 

***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...