పిలవా పెట్టకుండానే నైరుతీ ఋతుపవనాలు వేళకు వెళ్లి ఉదారంగా తెలుగు గడ్డల మీద తెగ కురుస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఇంద్రుడు వరుణదేవుణ్ని పిలిపించి క్లాసు పీకాడు
ఆహో.. ఓహో.. అంటారన్న మెప్పుకోసమా ఈ కరుణ? ఉదార హృదయం దేవుళ్ల ఉనికికే ప్రమాదం వరుణా!
నా ఆదేశం లేకుండా అసలు నువ్వు ఆ దేశాల వైపుకు ఎందుకు వెళ్లినట్లు? ఒక్క అన్నంపెట్టే వర్గమేనటయ్యా భూలోకంలో మన కున్నది? భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఎమిటి మన గతి? కరువు కాటకాలు అనాది నుండి జనాలకు అలవాటు అయిన విపత్తులు. వాటి మీదనే ఆధారపడ్డ జీవితాల మీద చీకూ చింతా లేదా నీకు?
ఇంతటి విచ్చలవిడి ఉదారత ఇప్పటి వరకూ ఎరగను నేను .రుతుపవనాల రాకపోకల మీదనే ప్రభుత్వాల ఉత్ఠానపతనాలు. ఒక పార్టీ పాలనలో కొన్నేళ్లపాటు నువ్వా దిక్కే చూడలేదు.. గుర్తుందా ? .
వానలు కరవయితేనే ప్రభుత్వాలకు మేఘమథనాల మథన. మబ్బు విత్తనాలు పెద్దమనుషుల ముఖ్యమైన ఆదాయ వనరులు . కరవుల క్కరువొస్తే ప్రకృతి విపత్తుల శాఖకు పని కరవు.
అదే పనిగా కురిస్తే జలాశయాల గతి ఏమై పోవాలని నీ ఆశయం? కంటి తుడుపు కోసం తవ్విన గంజిగుంటలనుకుంటున్నావా అవన్నీ! అలుగులు పారేటట్లు కురిస్తే ఆ రిజర్వాయర్లన్నీ ఆ ఖర్చు ఎవరయ్యా అచ్చుకునేది?
మరీ కడుపుబ్బరంగా ఉందని మబ్బులు కక్కటిల్లితే ఏ సముద్రం మీదకో పోయి కురవాలి! సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే అధికారం నీ ఒక్కడికే సోపలేదే నేను! దొడ్డిదారిన తిరిగే వాటర్ ట్యాంకుల వాళ్ళ వాటా మర్చిపోతే ఎట్లా నువ్వు ?
సముద్రుడు రుద్రుడవుతున్నాయ్యా నా మీద ఇక్కడ! గతంలో వాన ఒక్క చుక్క పడ్డా ఇంచక్కా తన కడుపులోకేనని నిశ్చింతగా ఉండేవాడా సాగరుడు. ఇప్పుడు అడుగడుగునా ప్రాజెక్టులు! తాము కట్టే రాతిగట్లను కూలిస్తే ప్రభుత్వాలకు ఆగ్రహం రాదా? కాంట్రాక్టర్లకు తంటాలు తెచ్చి పెట్టేలనేనా ఈ భారీ వర్షాలు ? ఆ పని నేను నిన్నెప్పటికీ చెయ్యనివ్వను. అంత ఉబ్బరంగా ఉందా? అడిగితే నేరుగా వెళ్లి ఆ సముద్రంలో కురవమని నేనే పురమాయిద్దునుగా ! పుసుక్కున వెళ్లి ఆ నేల మీదనే ఉన్న నీళ్లన్నీ ఒలకబోసేయట మేంటీ ?!
సముద్రాల ప్రసాదమే స్వామీ నీ నీటిమేఘాలన్నీ! కడలి గాని మొహం చాటేస్తే నీ కడుపు నిండా ఉండేదంతా కాలకూట విషమే! సాయమందుకుని, సాయం అందించాల్సి న సమయంలో సాకులు చూపిస్తే కింది జాతుల్లా అందరూ గమ్మునుండరు! సమయం చూసి దెబ్బ కొడితే ఇంద్రుణ్ని నా కథ మళ్లీ మొదటికొచ్చేస్తుంది. ఏనుగంటే చచ్చినా బతికినా పదివేలే గానీ, ఏనుగు మీదెక్కి ఊరేగే నా బోటివాడి విలువ అంబారీ మీదున్నంత వరకే నాయనా ! ఇందుడికి ఐరావతాన్ని దూరం చేసే ఈ కుట్రకు ఎవరు తెర లేపినా సహించే ప్రశ్నే లేదు.
నీ కుండపోతలకు కింద ఎవరూ సంతోషంగా లేరు. చుక్క పడితే నగరాలు మహాసాగరాలయ్యే దుస్థితి. కోవిద్- పంథొమ్మిది కారణంగా ఇళ్ళల్లో కట్టిపడేసినట్లున్న జనాల బతుకు నీ జడివానల దెబ్బకు మరింత జటిలమవుతుంది .. తెలుసా ? లాక్- డౌన్లు ఎత్తేస్తున్నా నీ ముమ్మర వర్షాల మూలకంగా కాలు కింద పెట్టే పరిస్థితి లేదని తిట్టి పోస్తే నీ పోస్టు ఊస్టింగే . బి కేర్ ఫుల్ వరణా! పిచ్చి పిచ్చి రాజకీయాలతో పిచ్చిపట్టినట్లయిపోయి పాపం జనాలు నాలుగ్గోడల మధ్యనే పగటి దెయ్యాల్లా తిరుగుతుంటే .. నువ్వేంటీ ఇట్లా జడివానలు కురిపించి జడిపించడం? ఆడాళ్ల టీవీ సోపు ఏడుపులతోనా నీకు పోటీ ? తుగ్లక్!
వానలు పడక ఇహ ప్రభుత్వాలతో కూడా ఏ ప్రయోజనం లేదని తేలితే జనం, కనీసం ఏ కప్పల పెళ్లిళ్లు, గాడిద కళ్యాణాలతోనో కాలక్షేపం చేసేవాళ్లు. నిక్షేపంలాంటి ఆ జంతువులనూ మన మగపిల్లల మాదిరి పెళ్లిపీటలకు దూరం చేస్తున్నావ్ కదా !
చెరువుల స్థితి చూస్తుంటే కడుపు చెరువవుతోందయ్యా! పూడిక తీయని చెరువులు నీ కుండపోత వర్షం దెబ్బకి గబ్బంతా ఊళ్ల మీదకు తోసేస్తున్నామ్ ! తూము కాలవల్లో మురికి పొంగిపొర్లుతూ రోడ్డు మీదనే మూసీలా ప్రవహిస్తోంది.
వానలు పడనప్పుడు దేవుళ్లకు రుద్రాభిషేకాలు చేయడం కింద మనుషులకు బాగా అలవాటు. ఆ భక్తి పరిశ్రమ మీదా గట్టి దెబ్బే కొట్టేస్తున్నావు గదా నువ్వు ఎడా పెడా కురిసి !
పాపం పండింది కాబట్టి శిక్షించడానికి ఈ అతివృష్టి అని మాత్రంనాకు చెప్పద్దు! ఆ శిక్షలు, కక్షలు గట్రా అక్కడి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల బాధ్యత. ఆ పోలీసు దాడులు, విచారణలకు ఆదేశాలు అవీ చూసినా ప్రభుత్వాలు తమ వంతు బాధ్యత చక్కగా నిర్వర్తిస్తున్నట్లే లెక్క! కరోనా రోగాల నుంచి మిడతల దాడి, చైనా బెడదల దాకా దేవుళ్ల వంతు దేవుళ్లు చేస్తుంటిరి గదా! పేరిగాడి పెత్తనంలా మధ్యలో నువ్వేంటి ఇలా ఎడా పెడా అడగాపెట్టకుండా అక్కడికెళ్ళి ఆగకుండా దడదడా ఆ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో ఆగడాలు! స్టాపిట్ అట్ ఒన్స్ !
సమయానికిలా అన్నీ సక్రమంగా నీలాగా చెల్లిస్తే వెల్లికిలా పడుకోడం, కమ్మంగా తిని గుర్రుకొట్టడం జనాలకు మా బాగా అలవాటయిపోతుందయ్యా! నాస్తికత్వం బలిస్తే ఇహ నీకూ నాకూ ఇద్దరికీ పస్తే! మన ఉనిక్కి స్వస్తే!
ముందర్జంటుగా అ వర్షించడాలు.. ఉరుములు మెరుపులతో గర్జించటాలా గట్రా ఆపెయ్ వరుణదేవా! మరీ అంత కడుపుబ్బరం తట్టుకోలేకుంటే .. ఎన్నో మహాసముద్రాలున్నాయయ్యా మనకు భూమ్మీద.. ఎక్కడికైనా పోయి నిశ్చింతగా కురుసుకో.. పో! ఐ డోంట్ హావ్ అబ్జెక్షన్
- కర్లపాలెం హనుమంతరావు
బోధెల్ ; యూఎస్ఎ
05 -02 -2021
No comments:
Post a Comment