Thursday, February 18, 2021

మాటలతో ఆటలు- సరదా వ్యాసం - కర్లపాలెం హనుమంతరావు



ఎవరో ఒకరు పుట్టించకపోతే భాష ఎలా పుడుతుందిఅంటాడు మాయాబజారు సినిమాలో ఎస్వీఆర్ ఘటోత్కచుడి అవతారం ఎత్తేసిభాష అంతస్సారం రాక్షసజాతికే వంటబట్టగా లేనిదిజీవకోటిలో ఉత్కృష్టమైందని గొప్పలు పోయే మనిషి బుర్రకు తట్టకుండా ఉంటుందాఇహఆవుకు కూడా 'కొమ్ము' తగిలించే మన తెలుగుభాషలోని మాటల తమాషాసంగతిః.. కాస్సేపు.. బుర్రకు తట్టినవి.

అసల తట్ట అంటేనే వెదురును ముక్కలు ముక్కలుగా చేసి కళ ఉట్టిపడేటట్లు  అల్లే ఒక పదార్థంతాటాకు చెట్టు నుంచి వస్తుంది కాబట్టి తట్ట అయిందేమోవిజ్ఞులొక పరి  మా జ్ఞానం పట్ల కూడా గౌరవముంచి ఆలోచించాలిమింగే లక్షణం గలది కాబట్టే తిమింగలం అయిందన్నది మా మిత్రుడొకడి పరిశోధనలో తేలిన అంశంకేస్ట్ కౌచింగ్ మీద  ఆ మధ్య పెద్ద దుమారమే రేగింది తెలుగు సినీపరిశ్రమలో  .. గుర్తుందిగదాఈ గొడవలు ఇట్లా ముందు ముందు తగలడతాయాన్న కాలజ్ఞానం మస్తుగా ఉండుండబట్టే పద్మిని అనే బాలివుడ్ కథానాయికి తాను 'పడుకోనిపద్మిని అని పుట్టీపుట్టంగనే ప్రకటించేసుకుంది

చౌ ఎన్ లై కి చాయ్ తాగేటప్పుడైనా ఎనలైట్మమెంటు కింద 'లైస్' (అబద్ధాలు)పకుండా చెప్పే పని తెలీని  రాజకీయనేతగా ప్రసిద్ధిఎన్ టి రామారావును కాంగ్రెసోళ్లు పాలిటిక్సులోకి వచ్చిన  ఎమ్టీ (ఖాళీరావు’ అని ఎద్దేవా చేసేవాళ్లుచివరకు పాపం కాంగిరేసువాళ్లకే ఆ పార్టీ తరుఫున నిలబడితే ఎన్నికల 'రేసులో కనీసం ధరావత్తులు కూడా 'రావు'  అనే దుస్థితి  వచ్చిపడింది. సోనియమ్మ గారాబాల బిడ్డ రాహుల్ గాంధీతరచూ ఊహించని క్షణాలలో తిరగబడ్డం ఆ బాబీ హాబీఆందుకే ఆ గారా’ బాల   రాగా(రాహుల్ గాంధీ)బాల గా మాధ్యమాలకు ఎక్కిందిగీర్వాణం అంటే సంస్కృతభాష. ఆ వాణిలో నాలుగు ముక్కలు ముక్కున పట్టీ పట్టంగానేగీరపోయే పండితులే దండిగా ఉండటం సర్వసాధారణంసో అ 'గీర వాణంపేరు గీర్వాణానికి చక్కగా అతికిపోతుందిబా అన్నా వా అన్న ఒకే శబ్దం బెంగాలీబాషలో. ‘ 

పో’  అని ఆ శబ్దానికి అర్థం. ఇష్టం లేని అక్క మొగుడు ఎవడో ఒంటరిగా ఉండడం చూసి కమ్ముకొచ్చినప్పుడు 'పో.. పో' అంటూ  కసిరికొట్టి ఉంటుంది వయసులో ఉన్న ఏ మరదలు పిల్లో. ఆ మాటే చివరకు అక్క మొగ్గుళ్లందర్నీ 'బా.. వాలుగా సుప్రసిద్ధం చేసేసింది మన తెలుగుభాషలో. 

కాల్షియం సమృద్ధిగా ఉంటేనే మనిషిలో పెరుగుదల సక్రమంగా ఉండేదంటారు  ధన్వంతురులు. ఆ ధాతువు అధిక పాళ్లలో దొరికేది కాబట్టే పెరుగుపెరుగు అయింది. ధన్వంతురుల అన్న మాట ఎలాగూ వచ్చింది  కాబట్టి ఒక చిన్న ముచ్చట.  ధనం మాత్రమే తన వంతన్న దీక్షగా  చికిత్స చేసే వైద్యనారాయణులు కొంతమంది కద్దు. ఆ మహానుభావులకు  ఆ పేరు చక్కగా సూటవుతుంది. ఆయుర్వేదం చేసే వైద్యుల కన్నా అల్లోపతి చేసే ఫిజీషియన్లకు ఆ పదం అద్దినట్లు సరిపోతుంది. అన్నట్లు  ఫీజు తీసుకుని వైద్యం చేసే ఫిజీషియన్ ని  ‘ఫీజీషియన్ ‘ అనడమే సబబు. 

బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అస్తమానం కమ్మని కలలు కనేవాళ్లు తల్లిదండ్రులుకనకే అమ్మానాన్నా 'కన్నవాళ్లు' గా ప్రసిద్ధమయారు

కలసి ఆడే కర్రల ఆట కాబట్టి కోలాటం 'కో'లాటం అయిందిరైయ్యిమని దూసుకుపోతుంది కనక రైలుబండి అయినట్లు.  మనిఅన్నా 'షి' అన్నా పడిచస్తాడు కనక  మనిషి 'మని-షి'గా తయారయ్యాడు. తతిమ్మా జంతుకోటితో కలవకుండా తానొక్కడే  మడి కట్టుకున్నట్లు విడిగా ఉంటాడు కాబట్టి 'మడి'సి కూడా అయ్యాడనుకోండి

'కీఉండని చిన్న టిక్కీ కాబట్టి  కిటికీ.  

రాసి రాసి గుర్తింపు లేక  నీరసం వచ్చేసిం తరువాత  కవులు కట్టే గ్రూపు అ-రసంవిచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా  రాసే కవుల గుంపు వి-రసం’ ఒక ముఠా కవులు మరో గ్రూపు కవుల మీద ముటముటలాడుతూ  విసుర్లు వేసుకునేవారు ముఠాలు కట్టిన ప్రారంభంలో

ఆ రంభ వచ్చినా ఆరంభంలో మగవాడికి ఏం చెయ్యాలో తెలిసిరాలేదు.ఆడమన్నట్లా ఆడేది మొదట్లో ఆడదిఅందుకే ఆమె ఆరంభంలో ఆడది అయింది. మగువను చూస్తే 'గాడు' (తీపరం)  పుట్టే జీవి కావడం మూలానవయసు కొచ్చిన మగాడు మగాడు అవుతాడు. క్షీరధార రుచిని మరిపించే  కవిత్వం కురిపించే  కవులు ఉంటారు. ఆ కవులే  అసలు సాహిత్యంలోని  'కౌ'లు.  మెరికలు పోగయ్యే దేశం గనక అది అమెరికాగా ప్రసిద్ధిపొందింది. ఆయిల్ ఫ్రీ లీ అవైలబుల్ గనక ఆఫ్రికా అయిందేమో తెలీదు. అట్లాగని ఆస్ట్రేలియాలో అంతా స్ట్రే’  డాగ్సులా తిరుగుతారనుకోవద్దు. అట్లా చేస్తే స్టేలు కూడా దొరకని క్రిమినల్  కేసుల్లో బుక్కయిపోతారు. అట్లాగే అరబ్బు కంట్రీసు కూడా. పేరును చూసి 'ఐ రబ్ విత్ ఈచ్ అండ్ ఎవ్విరిబడీఅంటూ మన బ్లడీ ఇండియన్ ఫిలాసఫీలో బలాదూరుగా  తిరిగితే..సరాసరి పుచ్చెలే ఎగిరిపోవచ్చునేతిబీరకాయల్లోని నేతిని మన గొనసపూడి పూసల నేతితో  అన్నోయింగ్లీ కంపేరు చేసేసుకుని సెటైర్లకు దిగెయ్యడం మన దేశంలో కాలమిస్టులకు అదో అమాయక లక్షణంన ప్లస్ ఇతి ఈజ్  ఈక్వల్ టు   ‘ నేతి’ రా  నాయనల్లారా! ‘-ఇతి’  అంటే  'ఇది కాదు' తెలుగర్థం.  ఆ దాన్ని పట్టుకునొచ్చి నేతి బీరకాయలో అది లేదని ముక్కు చీదుకోడం చదువు మీరిన వాళ్ల చాదస్తం

ఎలుక కు చిలుకకు ఒక్క పేరులో తప్ప పొంతన బొత్తిగా   ఉండదు. టమోటోకి టయోటాకి మాటలో తప్ప రేటులో  పోలికే  తూగదు. పదాలున్నాయి కదా పదార్థాల కోసం దేవులాడితే వృథా ప్రయాసే! ‘ఎలాగూ’  లో ఏ లాగూ కోసం వెతికినా దొరకదు కాక దొరకదు. మైసూర్ బజ్జీలో మైసూరు కోసం వెదికి ఉసూరు మనకు!  అన్ని పదాలు కలుస్తాయని కాదు. కలవకూడదనీ కాదు.

ఇట్లా పనికిమాలిన పదాలను పట్టుకుని ఎన్ని ఆటలైనా అలుపూ  సొలుపూ  లేకుండా ఆడేయడానికి అసలు కారణం..నాకు ఏ పనీ పాటా లేకుండా తిని కూర్చునే లక్షణం పుష్కలంగా ఉండడం. దయచేసి  ఇక్కడ ఏ ‘లంగా’  కోసం వెతక్కండి మహాప్రభో! ఖాయంగా దొరకదు గాక దొరకదు దొరలూ .. దొరసానులూ! 

-కర్లపాలెం హనుమంతరావు

26 -11 -2020

***

మహాత్ముడూ మామూలు మనిషే! కానీ మన కళ్లాకు కాదు! వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

 


 

గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా ఓవర్ భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.

కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది. 

అటెన్ బరో 'గాంధీచిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద,వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటేనిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట  గ్యారంటీ!

వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగా మొదలై .. బాపూజీగామహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని పెళ్లి చేసుకునిఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగాను  అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశానికి తిరుగుముఖం పట్టింది. 

దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా  వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటాను'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక పూట ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుందిఅంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు. 

మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల్ ఉద్దేశం. 

బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలుఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?! 

ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడుసీత,ఆంజనేయుడు వంటి ఎన్నో పౌరాణిక  పాత్రలకూ తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!

-కర్లపాలెం హనుమంతరావు

19 -02 -2020

(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)

***

Tuesday, February 16, 2021

కాసు- తిరకాసు - సరదా వ్యాసం కర్లపాలెం హనుమంతరావు

 


కాసు - తిరకాసు 

( ఈనాడు - ప్రచురితం ) 

*


గడించడం అదో రకం. ఖర్చు చేయడం అంతకు మించిన నరకం.  చిత్రగుప్తుడి చిట్టా నుంచి లెక్కలు తప్పించినా భూలోక చిత్రగుప్తులు ఐ.టి, ఈ.డి లు ఉంటారు కదా!  ఆ  యముడి బ్యాచీ లుక్కుల నుంచి దృష్టి మళ్లించడం మామూలు యవ్వారం కాదు. మామూళ్లకు ఎప్పుడు లొంగుతారో.. ఏ మూలకు తోలుకెళితే  చల్లబడతారో.. అంతా ఆ  'పైన' ఉన్నవాడి అంతరంగాన్ని బట్టి   నడిచే తతంగం.  అట్లాగని ఏ ఇనప  గని, బయ్యారం గని కంట బడితే దాని మీద పడి   దోచుకోడమెందుకు?..   నిద్రలు కాచుకుంటూ ఆ తరగని సంపదలు దాచుకోడం ఎందుకు?.. అంటారా? పైకం పైన వైరాగ్యం  ప్రకటించడం  ప్రజాస్వామ్యంలో కుదరే పనేనా?


సంసారం దాలి గుంట కాదు.  సంపద పెరుగుతున్నంత కాలమే దారాపుత్రులు నోరుచేసుకోరు.  స్విస్ బ్యాంకులు సైతం అసాంజేకు దీటుగా కాతా  రహస్యాలన్నీ బహిర్గతం చేసే ఈ కాలంలో కాసుల వర్షం ఎవరికి  హర్షం అంటారా?  


డబ్బుంటే ఒక కష్టం. లేకుంటే డబుల్ నష్టం. పార్టీ టిక్కెట్టే కాదు.. సినిమా టిక్కెట్టు క్కూడా ఇక్కట్లు పడక తప్పని ముదనష్టపు జాతకం.. కోరి కోరి ఎవరు నాయనా నడి నుదుటన తలకిందులుగా రాయించుకొనేందుకు తయారయేది?పూట గడిచే మాట ఆనక! పూటుగా మందు పడాలన్నా ముందుగా కావాల్సింది కరెన్సీనే కదా దాదా!


పొరుగింటి మీనాక్షమ్మలతో పోటీలకు దిగే  ఆండాళ్లమ్మలు ప్రతి ఇంటాయన మెడకూ గుదిబండల్లా  వేలాడుతూనే ఉంటారు.  ఓ ముత్యాల బేసరో  ముక్కుకి తగిలించని  పక్షంలో బేవార్సు  శ్రీవార్సు అంటూ ఫార్స్ చేస్తారు!  రేకెట్ పని నుంచి పాకెట్ మనీ దాకా అన్నింటికీ మనీపర్శుతోనే పని. ప్రజల సొమ్ము అని గమ్మున ఊరుకుంటే ఫెయిలయిన చంద్రయాన్- రెండును చూపించైనా మనం ఆ అమెరికా చైనాల సరసన చేరామని  రెండు వేళ్లు చూపించుకునేందుకు  వీలుండేదేనా?  


డబ్బు లేందే డుబ్బుక్కొరగాడన్న సామెత ఏమన్నా సర్దాగా పుట్టిందా? నాలుగేళ్ల పాటు సర్కారును బ్రహ్మాండంగా నడిపినట్లు భుజాలు ఎగరేసారు పాపం చంద్రబాబు  సారు!   పంచే సొమ్ము సమయానికి ఆడక   నలభైయ్యేళ్ల సీనియరిటీ ఉండీ ముఖం తేలవేసారు!


ఎన్నికల్లో టిక్కెట్ల ఇక్కట్ల సంగతట్లా ఉంచండి. చిన్నోడి ప్రీ-కాన్వెంటు సీటుకైనా పెద్ద నోట్లు దండిగా అవసరమే కదండీ! బ్లాక్ బస్టరని బోడి బిల్డప్పులిచ్చే ఓన్లీ వన్- డే ఆడే చెత్త మూవీకైనా బ్లాకులో తప్ప టిక్కెట్లు దొరకని రోజుల్లో రొక్కాన్ని మరీ అరటి తొక్కలా తోసి అవతల పారేస్తే ఇంట్లో పస్తులే సుమా ! 


పైసలుంటేనే పేరొచ్చేది .. మంచిదో.. చెడ్డదో! ఫోర్బ్స్ జాబితాలో కెక్కించేదీ.. ఫోర్ ట్వంటీ కేసుల్నుంచీ తప్పించేదీ మనీనే! మనీ మేక్స్ మెనీ ట్రిక్స్!


బ్యాంకప్పుల వంకతో పైసల వసూళ్లు. తిరిక్కట్టమంటే ఇంటి పై కప్పుల కేసి పిచ్చి లుకింగ్స్ ! వీల్చూసుకొని వీల్-చైర్ పేషెంట్ పేరుతో విదేశాలకు చెక్కింగ్స్! వి. పి పెట్టిన విఐపి గారికైనా వీపెనక  లోపలి పాకెట్లో  విమానం టిక్కెట్లకి సరిపడా  మనీ అయినా తప్పని సరే కదా! దటీజ్ డబ్బూస్ పవర్!


బిర్లా టాటాలకి ఏ పేరొచ్చినా, అదానీ అంబానీలకి సర్కార్ ఏ 'కీ' రోలిచ్చినా కీలకమంతా పర్శులోని కాపర్స్ ఆడించే సర్కస్ ఫీట్స్ దే! బిట్స్ పిలానీ  మొదలు బిట్ కాయిన్స్  వరకు అంతా కాసుల తిరకాసే!


కుదురుగా ఉండనీయదీ  మనీ ఎవర్నీ! పెద్దనోట్ల కట్ల నట్లా అర్థరాత్రి కట్లా ఎట్లా హఠాత్తుగా రద్దు చేసియించిందో  మోదీ సర్కార్ని..  చూసాం కదా? ఆ  పెద్దాయన మోదీ పేరు నట్లా ఊరూ వాడా దేశమంతటా మారుమోగించిందీ  రద్దయిపోతేనేమీ.. పిచ్చి నోట్లకట్టలే కదా!


బ్యాంకులంటూ కొన్ని డబ్బుండే  చోట్లు మన దేశంలో కూడా పనిచేస్తుంటాయని జనాలకు తెలిసిందీ, ఏటియంలంటే ఏంటోలే.. పెద్ద కొలువులు చేసుకొనే చదువుకున్నోళ్లు నడిరోడ్ల పక్కన కూడా నోట్ల కోసం నొక్కుకునే యంత్రాలని బీద  జనాలకు అవి ఖాళీ అయినప్పుడైనా తలకెక్కించిందీ డర్టీ మనీనే! అదీ డబ్బు దెబ్బ! ఉన్నా సంచలనమే.. లేకున్నా సంక్షోభమే!

 

డబ్బు లేందే అప్పులుండవు. అప్పులేందే ఎగేసేందుకు  డబ్బూ ఉండదు.  మాఫీలు చేయించి బక్కోళ్ల ఓట్లు దండుకునేందుకైనా మాయదారి నాయకులకు అండగా నోట్లుండాల్సిందే కదా!   అదేమైనా అంటే ఆర్బీఐ పదే పదే ఫీలయిపోతుంది కానీ.. బాకీల  మాఫీలు లేందే ఏ రాజకీయ పార్టీ అయినా సాఫీగా హామీలిచ్చేదెట్లా? అధికారంలోకి ఎగబాకేదింకెట్లా?


ఒక్క ‘పవర్’తోనే కాదు డబ్బుకు పరువూ ప్రతిష్ఠల్తో కూడా లింకే! డాలరు డాబు చూసుకొనే అమెరికావాడి కా రువాబు! ప్రపంచం అమెరికా చుట్టూతా బొంగరంలా తిరుగుతున్నా,  అమెరికనోడు డాలరు చుట్టుతా గింగిరాలు కొడుతున్నా అంతా బంగారంలాంటి  సొమ్ములో ఉన్న గమ్మత్తు వల్లనే  గదా గురువా!   ఆ డాలరు మీద దెబ్బేద్దామనే చైనావాడిప్పుడు  సిల్కు రోడ్డుతో తయారవుతున్నాడు. సిల్క్ స్మిత నుంచి.. సిల్క్ రోడ్డు దాకా అందరికీ డబ్బుతోనే బాబూ డాబూ.. దర్పం సర్వం.. గర్వం!

 

నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలేమన్నా పన్లేక సతాయిస్తారా? ఎప్పుడు ఏ రాయికి ఎంత విలువ పెరుగుతుందో దేవుడికే తెలియాలనుకుంటాం.  ఆ సూక్ష్మం వంటబట్టకే దేవుడూ  ఓ గర్భగుళ్లో రాయిగ మారి కూర్చున్నాడు. భక్తులు హుండీ రాళ్లతోనే సర్వాంతర్యామి అయినా లోకతంత్రం సర్వం నడిపించేది ! 


రూపాయి నోటు  మీద కనిపించక పోయుంటే పాపం గోచీపాతరాయుడు బాపుజీ నయినా ఆనవాలు పట్టుండునా ఈ డబ్బు పిచ్చి లోకం?


ఘనమైన  పదవుల కోసం కదా ఘోరంగా కొట్లాటలు  నిస్వార్థ ప్రజాసేవకుల మధ్య ! గౌరవ వేతనమంటూ  వచ్చిపడే లక్షలూ, గౌరవ పురస్కారాలతో జనమిచ్చే  కానుకలు, విరాళాలే గాని   లేకుంటే ! మన వేమన దెప్పినట్లు  శునకానికి అయినా   పాలించే ఆ కనకపు సింహాసనమైనా  దాలిగుంట ముందు బలాదూర్!


డబ్బు మీదనేనా  ప్రజానేతల   ప్రగాఢ మమకారం? 

 నిజానికి సజావుగా జవాబు  చెప్పడం కష్టం. ఎన్నికల తంతుకు  కావాల్సింది ఎవలేని డబ్బు మూటలు ! కాని ఎన్ని కోట్లు   విరాళాలొస్తున్నా  ఎన్నికల సంఘంతో పాట్లు ! కాబట్టే  ఏ నేతా వంటి మీద నలగని బట్ట ఉండనీయడు! పలుగు పట్టినా,   మట్టి తట్ట మోసిన,  రోడ్దువార బంకుల్లో టీ కాచి పెట్టి,  రిక్షా తొక్కి పిక్క పట్టినట్లు ఫోజు పెట్టి ..  నిమిషానికి ఓ ఐదో ఆరో లకారాలకు  తగ్గకుండా కూలి   డబ్బులు రాబట్టటం!  


 డబ్బుంటేనే కోర్టుల్లో  పిల్స్   అడ్మిట్ అయ్యేది. స్పోర్టు కోర్టుల్లో ఐపిఎల్ గెలిపించడం అయేది! డబ్బుంటేనే అబ్బా.. చర్లపల్లి జైలైనా చల్లపల్లి రాజావారి బంగళాలా  చల్లంగా ఉండేది.


డబ్బున్న వాడిని నేరాలు దబ్బునేమీ చేయలేవు. బేళ్ల కొద్దీ నోట్లుంటే  చాలు.. బెయిళ్లైనా రావనలేవు. రూకల్లేకుంటేనే లోకానికి లోకువ. 


కాసుల తిరకాసు  కాచి వడపోసిన వడ్డికాసులవాడు కాబట్టే అంతెత్తున కొలువై ఉండీ హుండీలకు  నిండుగా భక్తుల నుండి డబ్బులు దండుకొనేది. కళ్యాణకట్ట మీది  క్షౌరమైనా .. కాస్తంత  చెయ్యి తడపందే సాఫీగా సాగదు . పర్సు ఖాళీగాడంటే ఆఫీసు  బంట్రోతుకే కాదు  ఆ గాడ్స్  పూజారికే సరి పడదు.


డబ్బు డ్రగ్సు కన్న మత్తుది. డ్రగ్సు కేసులనైనా  గమ్మత్తుగా మాయచేసే మహత్తు దానిది  . నలుపో తెలుపో! డబ్బున్న వాడిదే చివరికి గెలుపు. 

***

 

మనిషి- విపుల కథ -కర్లపాలెం హనుమంతరావు


 


మధ్యాహ్నం మూడింటప్పుడు జానకి కాల్ చేసింది 'మామయ్యగారు కనిపించడంలేదండీ!అంటూ కంగారుపడుతూ

లంచ్ ముగించుకుని 'డే బుక్రాసే పనిలో పడబోతున్నానప్పుడే! జానకి మాటలు ముందు అస్సలు బుర్రకెక్కలేదు. 'బాబాయి కనిపించకపోవడమేంటీఆయనేమన్నా చిన్న పిల్లాడా.. తప్పిపోడానికిఅనిపించింది. 

'అసలేం జరిగింది జానకీ?' అనడిగాను ఆదుర్దాగా!

పొద్దున పదకొండు గంటల ప్రాంతంలో ఏవో మందులు తెచ్చుకుంటానని బయటకుపోయాట్ట! ఇంత వరకు ఇంటికి రాలేదుట! 

మందుల దుకాణం ఉండేది మా వీధి చివర్లోనేనత్తలాగా నడిచి వెళ్ళొచ్చినా పావుగంటకు మించి పట్టదుఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు దాటిందిఎట్లాంటి కండిషన్లో కూడా పన్నెండు గంటలకు విసరి ముందు కూర్చోడం బాబాయికి అలవాటుఅట్లాంటి మనిషి ఇంకా ఇంటికి రాకపోవడమేమిటి?!

 

నా మనసునేదో కీడు శంకిస్తోందిపని ముందుకు సాగలేదుమేనేజరుగారికి విషయం చెప్పి పర్మిషన్ తీసుకుని బ్యాంకు నుంచి బైటపడ్డాను.

ఇంట్లో జానకి తిండి తిప్పలు మానేసి దిగాలుగా కూలబడివుందో మూల. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడి గిన్నెలుఅక్కడనే ఉన్నాయి

'వీధి చివర్లోని మందుల షాపులో అడిగి చూశావా?' అని అడిగాను జానకిని

'ఎట్లా ఊరుకుంటానండీ! ముందు చేసిన పని అదే! ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారుపక్కనున్న హోటల్లో వాళ్లు ఏదో అన్నారు గానీ, నాకు సరిగ్గా అర్థం కాక మీకు ఫోన్ చేశా!అంది జానకి

మరోసారి మందుల షాపుదాకా వెళ్లి చూశానుషాపు తెరిచిలేదుహోటల్లోని మనిషి ఏదో దాస్తున్నట్లు అనుమానంగా అనిపించిందిబాబాయికి సెల్ ఫోన్ వాడే అలవాటు లేదు.. ఎక్కడున్నాడో తెలుసుకోడానికి 

బాబాయిది వేటపాలెంమా నాన్నకు అందరికన్నా చిన్న తమ్ముడు.పోయినేడాదే షష్టిపూర్తి అయింది. మా ఊరి హైస్కూల్లో సంస్కృతం ఉపాధ్యాయుడుగా చేసి రిటైరయ్యాడుపిన్ని పోయి చాలా కాలమయిందిఆదుకునే పిల్లలెవరూ ప్రస్తుతం లేరు

'ఒంటరిగా ఆ ఊళ్లో ఏం ఉంటావ్! మా ఊరొచ్చేయమని చాలా సార్లు పోరుపెట్టాను. 'ఇప్పట్నుంచే ఒకళ్ల మీద ఆధారపడ్డం దేనికిలేరా! ఒంట్లో ఓపికున్నంత కాలం లాగిస్తానుతప్పదనుకున్నప్పుడు నీ దగ్గరకు కాక ఇంకెవరి దగ్గరకు వెళతానులే! అని తప్పించుకుని తిరుగుతుండటంతో అడగడం మానేశానుఇప్పుడైనా ఆ కంటికి 'గ్లాకోమాజబ్బేదో వచ్చిందనిచూపించుకోడానికి నా బలవంతం మీద వచ్చాడు..  గానీ లేకపోతే ఒక పట్టాన ఆ రథాన్ని కదిలించడం ఎవరి తరమూ కాదు

'నిన్న ఆసుపత్రికి వెళ్లొచ్చారు కదా! ఇవాళ కూడా అక్కడికే వెళ్లారేమో!అని అనుమానం వెలిబుచ్చింది శ్రీమతి

ఆసుపత్రిలో విచారించినా ఫలితం లేకపోయిందిమందుల దుకాణం దార్లో ఉన్న తెలిసిన వాళ్ల ఇళ్లల్లోనూ విచారించానుఏదైనా యాక్సిడెంటు లాంటిది జరిగితే తెలుస్తుందని ఆశఎవరి దగ్గరా ఏ సమాచరమూ లేదు

'ఇంకో గంట ఆగి చూద్దాంచీకటి పడితే బాబాయి బైట ఉండలేడురేజీకటి సమస్యఎంత అర్జంటు పనున్నా దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరాల్సిందే! నీకూ తెల్సు కదా?' అన్నా జానకితో

దీపాలు పెట్టే వేళా దాటిపోయిందిబాబాయి జాడ లేదు! పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడం తప్ప మరో మార్గం లేదు

కంప్లైంట్ బుక్ చేసుకునే  స్టేషన్లోని వ్యక్తి ఒకటే గొణుకుడు 'పసిపిల్లలంటే తెలీక దారి తప్పుతారువయసులో ఉన్న ఆడపిల్లలంటే అదో లెక్కకాటిక్కాళ్లు చాచుకున్న తాతలు కూడా ఇట్లా మిస్సయిపోతుంటే ఇహ మా పని గోవిందే!ఇట్లా సాగాయి ఆయనగారి  సెటైర్లు

బాబాయి వివరాలుమా చిరునామా అయిష్టంగానే తీసుకున్నాడు, 'విషయమేదన్నా ఉంటే కబురుచేస్తాంమీ ప్రయత్నంలో మీరుండాలిఅని పంపించేశాడు చివరికి.

సభ్యత కాదని తెలిసినా చివరికి బాబాయి బ్యాగ్ ఓపెన్ చేసి చూశాంస్పేర్ కళ్లజోడు సెట్టునాలుగు జతల పంచెలుజుబ్బాలుమందుల పెట్టె,చలంగారి 'బిడ్డల శిక్షణపుస్తకం కనిపించాయిపిల్లల పెంపకం బాబాయి అభిమాన అంశంపథకం ప్రకారం ఇల్లొదిలి పోలేదన్న విషయం స్పష్టమయినందున కొంత రిలీఫ్ ఇచ్చినామందుల పెట్టె చూసే సరికి దిగులు రెట్టింపయింది

బాబాయికి అస్త్మాబిపిషుగర్! వేళకు మందులు పడాల్సిన జబ్బులే ఇవన్నీ!  ఉదయం నుండి ఈదురుగాలిగా ఉందిఆకాశం మబ్బుగా ఉంది.ఎప్పుడు పడుతుందో వర్షం అన్నట్లుగా ఉంది వాతావరణం.   

చలిలో, చీకట్లో రేజీకటి మనిషి కొత్త ఊర్లో కొత్తగా సంక్రమించిన గ్లాకోమా వ్యాధితో పాటు గట్టిగా నాలుగడుగులు వేసినా ఆయాసం ముంచుకొచ్చే'ఉబ్బసంరోగంతో  ఇంత సేపు బైట ఏం చేస్తున్నట్లు?ఎక్కడున్నట్లు?ఎక్కడున్నా కాస్త సమాచారం అందించవచ్చు కదా!

నా చిరాకుఅసహనం చూసి సముదాయించే పనిలో పడింది జానకి. 'పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాం గదా! తెల్లారేలోగా ఏదో ఓ సమాచారం తెలుస్తుంది లెండిఅంటూ

తెల్లార్లూ కళ్లు గుమ్మానికిచెవులు ఫోన్లకు అర్పించి నట్లింటో నిరాహారంగా జాగారం చేసినా ప్రయోజనం శూన్యంరాత్రి కురిసిన కుండపోతకు మా స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోయాయి

బ్యాడ్ న్యూస్ వినడానికే పూర్తిగా సిద్ధమయిపోయి  కూర్చున్నాం ఇద్దరంబ్యాంకు డ్యూటీకి వెళ్లబుద్ధి కాలేదుసెలవు పెట్టేసి వేటపాలెంలోని  నా బాల్యమిత్రుడు శాయికి ఫోన్ చేసి వివరాలు అవీ  చెప్పి 'ఒకసారి బాబాయి ఇంటికి వెళ్లి చూసి ఇన్ ఫామ్ చెయ్యరా!అనడిగాను

పది నిమిషాలల్లో వాడి దగ్గర నుంచి రిటన్ కాల్..  'ఇంటికి తాళమేసుంద'ని

ఏడుపు ఆపుకోవడం ఇక నా వల్ల కాలేదుచిన్నప్పట్నుంచి బాబాయంటే చాలా ఇష్టం

మా నాన్నగారు మహాస్ట్రిక్ట్లెకల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని రోజంతా అన్నం పెట్టద్దని అమ్మకు హుకుం జారీచేశారొకసారి. అమ్మ నన్ను  బాబాయి దగ్గరకు పంపించింది రహస్యంగాపిన్ని బైట ఉన్నా నాకు ఇష్టమని ఆలుగడ్డ కూర స్వయంగా చేసి, తినిపించి చీకటి పడే లోపు  మా ఇంట్లో దించిపోయాడు. 'మళ్లీ వచ్చే పరీక్షల్లో వంద శాతం మార్కులు తెచ్చుకుంటానని నా చేత ప్రమాణం చేయించి నాన్నగారి కోపాన్ని చల్లార్చింది బాబాయే! ఆ పరీక్షల్లో నేను మాట నిలబెట్టుకోవాలని రోజూ ఇంటికొచ్చి నా చేత గణితంలో అభ్యాసం చేయించాడాయన ఎన్ని పని వత్తిళ్లున్నా. . 

బాబాయివాళ్లకు బాబూరావని నా ఈడు కొడుకు ఒకడుండేవాడుచదువు సంధ్యలు అబ్బక జులాయిలా తిరుగుతున్నా వాడిని ఏమీ  అనేవాడు కాదు బాబాయ్బిడ్డల చేత ఇష్టం లేని పనిచేయించ కూడదన్న చలంగారి సిద్ధాంతం ఆయనదిపదో తరగతిలో వాడు ఇంట్లో దొరికింది లంకించుకుని చెన్నయ్ పారిపోయాడుఎంత వెదికించినా లాభం లేకపోయిందిమూడు రోజుల తరువాత వాడి బాడీ దొరికిందని చెన్నయ్ నుంచి కబురు!  దేశం కాని దేశంలొ భాషే రాని ప్రాంతంలో వాడి ఘోష పట్టించుకునే నాథుడు దొరక్క నడుస్తున్న  ఎలక్ట్రిక్ ట్రైన్  ముందు ఉరికేశాట్ట

ఉన్న ఒక్క కొడుకు అట్లా దక్కకుండా పోయినప్పట్నుంచి బాబాయి మరీ చాదస్తంగా తయారయ్యాడు. పిన్నయితే కొడుకు మీద దిగులుతోనే పోయిందంటారు

ప్రస్తుతం బాబాయి ఏకాకిసహజంగా  మొండి మనిషి కనక వేటపాలెం విచిడిపెట్టి వచ్చేందుకు  'ససేమిరాఅన్నాడు వచ్చింది గ్లాకోమా కనకపెద్ద డాక్టర్లకు చూపించడం తక్షణావసరం కనక హైదరాబాద్ తరలి వచ్చాడు ఎట్లాగో. 

నిన్ననే ఆసుపత్రిలో  చూపించానుపంజగుట్టలోని విజన్ ఫీల్డ్ సెంటర్లో టెస్టులూ అవీ చేయిచుకుని రిపోర్టులు పట్టుకు రమ్మనాడు డాక్టర్ఈ రోజు బ్యాంక్ నుంచి రాగానే అక్కడకు పోవాలని ప్లాన్ఇంతలో ఇలాగయింది!

'బాబాయిని ఇక్కడకు పిలిపించి పొరపాటు చేశానావేటపాలెంలోనే ఉండుంటే ఆయన తిప్పలేవో ఆయన పడుతుండేవాడు'. ఇదీ నా గిల్ట్ ఫీలింగ్ రాత్రి నుంచి.

'ఇలాగవుతుందని మనమేమైనా కలగన్నామాకడుపున పుట్టిన బిడ్డలే పట్టించుకోని ఈ రోజుల్లో బాబాయి అనే  అభిమానం కొద్దీ ఏదో సాయం చేద్దామని  పిలిపించుకున్నారుఅయినా బైటికెళ్లిన మనిషి అట్నుంచటే వెళ్లిపోవడమేనామరీ అంత ముంచుకుపోయే పని ఉంటే ఇంటికొచ్చి చెప్పిపోవాలిలేదా కబురన్నా చేయాలిఇదేం మనిషిఇవతల మనమెంత కంగారు పడతామో చుసుకోవద్దా?' అని నన్ను ఊరడించబోతూ బాబాయిని ఝాడించడం మొదలుపెట్టింది నా భార్య

తనకూ బాబాయంటే తగని అభిమానమేనిన్నటి నుంచి పడుతున్న యాతన అట్లా అనిపిస్తోందిఇప్పుడు ఎవర్ననుకుని ఏం లాభంబాబాయిని ఇట్లా మాయం చేసిన ఆ మహానుభావుడే ఈ మిస్టరీని విడదీయాలిపోలీసుల వల్ల ఏమీ కాలేదు లాగుంది.. కబురు లేదు!

మధ్యాహ్నం సమయంలో నా సెల్ ఫోన్ మోగింది. 'రామచంద్రంగారేనాండీ?' ఎవరిదో అపరిచితమైన గొంతు

'అవునుమీరెవరూ?'

'మాది నరసారావుపేట  దగ్గర మురికిపూడి అండీ! సుబ్రహ్మణ్యంగారు మీ బాబాయేనాండీ?'

'అవునవునునిన్నటి నుంచి ఆయన  ఆచూకీ  తెలియడంలేదు. మీకేమైనా తెలుసాండీ?' నా గుండెలు దడదడకొట్టుకుంటున్నాయి

'కంగారు పడకండి సార్! ఆయన ఇక్కడే ఉన్నారు!'

'ఇక్కడంటే? మురికిపూడిలోనా?!  అంత దూఆం ఎందుకెళ్లాడసలుఏం చేస్తున్నాడక్కడబాగానే ఉన్నాడా?' నాకంతా అయోమయంగా ఉంది

'బాగానే ఉన్నారుఆందోళన పడాల్సిందేంలేదుఇప్పుడే తెల్సింది ఆయన ఇట్లా మీ బాబాయిగారనిఅందుకే ఫోన్ చేస్తోంది'

'ముందొకసారి  ఆయనకు ఫోనివ్వండిమాట్లాడాలి’ కంగారుగా అడిగాను

'ఇస్తా గానీ.. ముందు నా మాట కాస్తాలకించండి సార్! తెల్లారుఝామున వచ్చారిక్కడికివచ్చీ రాగానే సొమ్మసిల్లిపోయారు.  మా ఊళ్లో మంచి డాక్టరు లేడండీ! పేట నుంచి డాక్టర్ని తెచ్చేసరికి ఈ ఝామయిందిఇప్పుడు నయంగానే ఉంది'

'ముందు మీరెక్కడున్నారో చెప్పండి! వెంటనే బైలుదేరి వచ్చేస్తా!అని ఫోనులోనే అరిచేశాను ఉద్వేగాన్నాపుకోలేక

ఒక్క నిముషం నిశ్శబ్దం తరువాత బాబాయి లైనులోకి వచ్చాడు 'నువ్వేం రానక్కర్లేదు గానీ.. ముందొక పని చెయ్యరా! మీ వీధి చివర మందుల షాపుంది కదా! దాని ఫోను నెంబరొకసారి కనుక్కొనివ్వు ఒక అయిదునిమిషాల్లో! నువ్వేం రావద్దుమేమే ఓ గంటలో బైలుదేరి వస్తున్నాంమీ ఇంటి వివరాలు అవీ ఈయనకు చెప్పు!అన్నాడు

మందుల షాపు నెంబరుమా ఇంటి అడ్రసు కనుక్కొని 'రాత్రి ఏ టైముకైనా సరే  మీ బాబాయిగారిని మీ ఇంట్లో దించుతాం.. 'అని ఫోన్ కట్ చేశాడు అవతలి మురికిపూడి పెద్దమనిషి 

బాబాయి యొగక్షేమాలు తెలిసినందుకు ఆనందంగా ఉందిక్షేమంగా ఉన్నందుకు రెట్టింపు రిలీఫుగానూ ఉందిఎక్కడి హైదరాబాదుఎక్కడి మురికిపూడిమందులకని బైటికెళ్లిన బాబాయి అన్నొందల కిలోమీటర్లవతల తేలడమేమిటిమధ్యలో ఈ మందుల షాపు నెంబరెందుకు

బాబాయిని దించడానికని వచ్చిన పెద్దమనిషి చెప్పిన వివరాలు తెలుగు చలనచిత్ర  కథలను మించి విచిత్రంగా ఉన్నాయిబాబాయీ ఆయనా కలిపి వినిపించిన కథ. సారాంశం  వింటే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే! 

మందులకని బాబాయి దుకాణానికి వెళ్లినప్పుడు ఎవరో పదేళ్ల పిల్లగాడు పొట్ట పిసుక్కుంటూ నిలబడున్నాడుట దుకాణం ముందు! పక్కనే కాకా హోటలుందిఆకలికి ఏమైన ఏమైనా పెట్టించమని అడుగుతున్నాడేమో అనుకుని బాబాయే ఏదో టిఫిన్ పెట్టించబోయాట్ట

'వాడి ప్రాబ్లమ్ లోడింగ్ కాదండీ! అన్ లోడింగ్! ఎక్కడ్నించొచ్చాడో.. ఎందుకొచ్చాడో!.. తెల్లారుఝామున పాక వెనకాల కూర్చోబొతుంటే పిండి రుబ్బుకునే  మా ఆడంగులు  పట్టుకున్నార్ట సార్! ఇట్లాంటి ఛండాలాలు ఇక్కడ చూస్తే ..సిటీ  కదా.. వ్యావారాలు నడుస్తాయామరీ మీ కంత దయగా ఉంటే ముందు మీ ఇంటికి తీసుకెళ్లి  వాడి కడుపుబ్బరం తీర్చండి!'అన్నాట్ట హోటలాయన  వెటకారంగా.

బాబాయి ముందు వాణ్ణి మా యింటికే తెద్దామనుకున్నాట్టవాడి బాధేందో తీర్చి .. ఎవరి పిల్లాడో కనుక్కుని.. ఎక్కడి నుంచొచ్చాడో విషయం రాబట్టి.. వాణ్ణి వాడింటికి చేర్చాలని బాబాయి తాపత్రయం! 

కొడుకు దిక్కులేని చావు చచ్చిపోయినప్పటి నుంచి దిక్కులేని ఏ పిల్లాడిని చూసినా తన కొడుకే గుర్తుకొస్తుండేవాడు బాబాయికిమొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నా కారాపినప్పుడు అడుక్కునే పిల్లలకు తలా ఇరవై  దానం చేశాడు అంత డబ్బు  పిల్లల చేతుల్లో పోయడం పరోక్షంగా సోమరితనాన్ని మరింత ఎంకరేజ్ చెయ్యడమే'నని నా అభిప్రాయం. 'మీరు తాగి పడేసే సిగిరెట్లకూ,మందు బుడ్లకూ అయ్యే దుబారానో? ఒకట్లో  అర్ధం  శాతం కూడా అవదురా ఈ ఖర్చుఅని పెద్ద ఉపన్యాసమే దంచాడారోజీ  బాబాయి.  లోకానికి చాదస్తంగా కనిపించేది కూడా  అదే!

ఆయన చాదస్తం,  స్పీచులు మాకు అలవాటే గానిబయట వాళ్లు ఎందుకు ఊరుకుంటారు?! మెడికల్ షాప్ ముందున్న కుర్రాడిని బలవంతంగా ఆపి బాబాయి వివరాలు రాబట్టే పనిలో  ఉంటే.. షాప్ ఓనర్  'పోనీయండి మాష్టారూ! మన కెందుకొచ్చిన పీడాకారం! ఎక్కడివాడోఎందుకిక్కడ తిరుగుతున్నాడోఏదైనా గొడవైతే చివరికి మనకు చుట్టుకుంటుందిమన పనులు మానుకుని పోలీసులుకోర్టుల చుట్టూతా  తిరగాల్సొస్తుందిఅన్నాట్టదాంతో బాబాయి ఉగ్రుడయిపోయాట్ట

'అట్లా ఎట్లా వదిలేస్తామండీ! ఈ పిల్లాడి ఇంట్లోవాళ్లు ఎంత కంగారు పడుతుంటారుఅదే మీ పిల్లాడయితే వదిలేస్తారా? మానవ  సమాజంలో బతుకుతున్నాం మనంప్రతి మనిషికీ కొన్ని బాధ్యతలున్నాయివట్టి హక్కుల కోసమే గోల పెడితే ఎట్లా?' అని ఉపన్యాసం దంచేసరికి షాపాయన హర్ట్ అయ్యాట్ట, 'నీతులు చెప్పేవాళ్లు తక్కువయి కాదు లోకం ఇట్లా ఏడ్చిందినాకు చెప్పడం కాదు.. మీరు చేసి చూపించండి ముందు!' అని ఛాలెంజికి దిగాట్టమాటా మాటా పెరిగింది ఇద్దరి మధ్యా

'మెడికల్ షాపాయన అన్నాడని కాదుగానీ.. ఎట్లాగైనా ఈ పిల్లాడి వాళ్లింట్లో చేర్చాలనిపించిందిరా. వీడి వివరాలు రాబట్టటమే బ్రహ్మప్రళయమైందిపెద్ద బస్టాండులో ముందు వీడి 'కడుపు'బ్బంది  తీర్చి ఇంత పెట్టించడం దగ్గర్నుంచి.. బస్సులో అంత దూరం కట్టేసినట్లు కూర్చోబెట్టడం దాకా నా తాతల్ని మళ్ళీ నాకు చూపించాడురా ఈ భడవా. ఎట్లాగూ మెడికల్ షాపులో నా కోసమని  కొనుక్కున్న నిద్రమాత్రలు ఉన్నాయిగా! ఓ గోళీ తగిలించా!అన్నాడు ముసిముసిగా నవ్వుతూ

'అది సరే బాబాయ్! ఇట్లా వెళుతున్నానని ఇంటికి ఒక ఫోన్ కాల్ చేసైనా చెప్పాలి కదా! ఇంట్లో నేనూజానకీ నిన్నట్నుంచి ఎంతలా కంగారు పడుతున్నామో తెలుసా?' అని బాబాయి మీద గయ్యిఁ మన్నాను కోపం పట్టలేక

'సాగర్ బస్టాండ్ లో నీ నంబరుకి కాల్ చేయించానురా! ఎంత సేపటికీ ఎత్తకపోతివి.. నేనేం చెయ్యాలీ!అని ఎదురు ప్రశ్నించాదు బాబాయి

'మీరు చేసిన నెంబరు రాంగ్ సార్! ఆ నెంబరుకు కాల్ చేస్తే నాకూ ఎవరూ ఎత్తలేదుమా బుడ్డోడి అయిడియాతో ఈ నెంబరు చివరి మూడుకు బదులు ఎనిమిది కలిపి చేస్తే రామచంద్రంగారి నెంబరు కలిసిందిఅన్నాడు మురికిపూడి పెద్దాయన. ఇక్కడి కొచ్చిన తరువాత  బాబాయి నా నెంబర్ తన  కొత్త   ఫోన్ బుక్కులో  చివరి నెంబరు తప్పు రాసుకున్నాడుచూపు సమస్య వల్ల

అదే చెబితే 'అవునా!అంటూ  ఆశ్చర్యపోయాడు బాబాయి తెప్పరిల్లి మురికిపూడి పెద్దాయనతో 'ఏ మాటకు ఆ మాటేనయ్యా! మీ బుడ్డోడిది మాత్రం ప్రహ్లాదుడి బుద్ధిఇట్లాంటి పిల్లల్ను చదువులోనే పెట్టాలిబడికి పోతానంటే గొడ్డులా బాదడమేంటి! నీ దెబ్బలకు తాళలేకే ఇంటి నుంచి వీడు  పారిపోయిందిపిల్లాడు   ఏదన్నా చేసుకోనుంటే.. జీవితాంతం అఘోరించేవాడివి..' బాబాయి కళ్లల్లో నీళ్లు! బాబూరావు గుర్తుకొచ్చి ఉంటాడు.. పాపం!

' బ్యాంకు లోను పెడితే గాని బడ్డీ కొట్టయినా నడపలేని దరిద్రుడినివేలూ లక్షలూ పోసే చదువులు నా వల్లయే పనేనా సారూ?! స్థితి అర్థం చేసుకోడు.. రోజూ బడి కోసం మొండికేస్తుంటే ప్రాణం విసిగి రెండు తగిలించా!   నా లాంటి బక్కాడి  కొంపలో పడ్డం వాడిదే తప్పు!..'  అన్నాడు గాని.. మురికిపూడి పెద్దాయన గొంతులో పశ్చాత్తాపం  స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. 

పోతూ పోతూ బిడ్డను ఊరి దాకా తెచ్చి భద్రంగా  అప్పగించినందుకు బాబాయి చేతిలో ఇంతకు మించి ఇచ్చుకోలేనం’టూ  ఓ రెండువేలు పెట్టబోయాడు మురికిపేట పెద్దాయనబాబాయి తీసుకోలేదు. 'ముందు ఈ డబ్బు పెట్టి పిల్లాడిని ఏదన్నా మంచి బళ్ళో వెయ్యి! ముందు ముందు దారేదో దొరక్కపోదు!అన్నాడు

బాబాయి మాట ఆ గంటలోనే  నిజమయిందిమురికిపూడి నుంచి బాబాయి బిడ్డ తండ్రి చేత చేయించిన  ఫోన్ కాల్ కు మెడికల్ షాపాయనలోని మానవత్వం నిద్రలేచింది బుడ్డోడి తండ్రి ఇట్లా వచ్చాడని తెలిసి మా ఇల్లు వెదుక్కుంటు వచ్చాడాయన. 'పిల్లోడి కథంతా విని 'నాకు ఎట్లాగూ  పిల్లలు లేరుమీ వాడిని పదో తరగతి వరకు చదివించే పూచీ నాదీఅంటు అక్కడికక్కడే వాగ్దానం చేశాడు

ఇప్పుడు చెప్పండి! ఇదంతా నిజంగా ఒక సినిమా కథలాగా లేదూ! 'పిల్లాడి తండ్రిని  పిలిపిస్తే పోదా! ఈ వయసులో నువ్వు అంత దూరం వెళ్లి అప్పగింతలు పెట్టిరావాలా?' అని  నువ్వు ఫోనులో నిలదీశావు చూడురామచంద్రం! నేను  అంతలా శ్రమపడ్డందుకేరా  ఈ మెడికల్ షాపాయన మనసులోని మానవత్వం నిద్రలేచిందినీతులు చెప్పేవాళ్లు తప్ప చేతల్లో చూపించేవాళ్లు లోకంలో ఎవ్వరూ ఉండరని ఈ షాపాయన ఇప్పటి వరకు గట్టి విశ్వాసంతో ఉన్నాడుమానవత్వం మీద నమ్మకం పోగొట్టుకునే మనుషులకు మించి సమాజానికి మరో పెద్ద ప్రమాదం లేదుఈ రోజూ నేను కష్టపడితే పడ్డాను గానీ.. సమాజం ఒక మనిషిని పోగొట్టుకోకుండా కాపాడగలిగానుఅదే నాకు ఆనందం' అన్నాడు బాబాయి తృప్తిగా

 

బాబాయికి తెలియని సంగతి మరొకటి ఉందిసమాజం మరో మనిషిని కూడా పోగొట్టుకోకుండా  నిలబెట్టుకుందిమొదటినుంచి బాబాయి అత్యుత్సాహాన్ని చాదస్తంగా  కొట్టిపారేస్తూ వస్తోన్న నేనే ఆ మరో మనిషిని.

-కర్లపాలెం హనుమంతరావు

బోధెల్; యూఎస్ఎ

17 -02 -2021

(విపుల మాసపత్రిక - జనవరి 2015లో ప్రచురితం)







 

 

 

 

Monday, February 15, 2021

' ఛుక్‌ ఛుక్‌ రైలు ' - కథానిక - కర్లపాలెం హనుమంతరావు - కథానిక - రచన కథాపేఠం పురస్కారం


 

ఒక ప్రముఖ చినపిల్లల మాసపత్రికవాళ్ళు ఆ సంవత్సరం బాలల దిఓత్సవం సందర్భంగా గేయ కథల పోటీ నిర్వహిస్తున్నార్రు.సెలెక్షన్ కమిటీలో నేనూ ఒక మెంబర్ని.

దాదాపు మూడువందల ఎంట్రీలు వచ్చాయి. మొదటి వడపోతలో ఒక వందదాకా పోయినా.. ఇంకా రెండువందలవరకు మిగిలాయి.

పిల్లలకోసం ఇంతమంది రాసేవాళ్ళు ఉన్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపించినవాళ్ళలో లబ్దప్రతిష్ఠులూ ఉండటం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింతగొలిపే విషయమేమిటంటే కొత్తగా రాస్తున్నవాళ్లలో కొంతమంది ఎంతో చురుకుగా రాసారు! నిజానికి ప్రముఖుల రచనలకన్నా అవి ఎందులోనూ తీసిపోవు. కొన్నయితే మిగిలిన వాటికన్నా  బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమయింది. మొత్తంమీద అందరం కలసి కూర్చుని అన్ని కోణాల్లోనూ పరిశీలించి  ఫైనల్గా ఒక పది రచనలను ఎంపిక చేసాం. వాటిలో ఒకటి, రెండు, మూడు బహుమతుల ఎన్నికను సంపాదకులకే వదిలేసాం. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోవచ్చని సలహా ఇచ్చాం. అట్లాంటీ సాధారణ ప్రచురణకు ఎన్నికైనదే 'ఛుక్ ఛుక్ రైలు'. గేయ రచయిత సి. ఆంహనేయులు, దేశాయిపేట.

దేశాయిపేట మా ఊరికి దగ్గర్లోనే ఉంటంది. మా ఊర్లో హైస్కూలున్నా దేశాయిపేటలో చదువు బాగుంటుందని మా నాన్న ఎస్సెల్సీలో  నన్ను అక్కడ చేర్చాడు. నాకెప్పుడూ ఫస్టు ర్యాంకే వస్తుండేది. క్లాసులో కృష్ణగాడికి రెండో ర్యాంకు. వాడి అన్నయ్యే ఆంజనేయులు.

ఆంజనేయుల్ని చూస్తే మాకు ఎడ్మైరింగుగా ఉండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కొరుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. సోషల్ సబ్జెక్టులో సంవత్సరాలు, యుద్ధాలూ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అదే పనిగా బటీ పడుతుంటే.. అలా చేయడం తప్పనీ.. గుర్తు పెట్టుకోవడానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు 'రిటెన్షన్ ఆఫ్ మెమరీ పవర్' అనే 

టెక్నిక్కు ఆన్ లైన్లో కోచింగ్ తీసుకొంటున్నారు. అందులో చెప్పిన సూత్రాల్లో కొన్ని నలభై ఏళ్లకిందట ఆంజనేయులు చెప్పినవే! అతఏమీ కోర్సులు చదువుకోలేదు. వాళ్ల నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్లకంత స్తోమతూ లేదు.

కృష్ణగాడితో కంబన్డు స్టడీసుకని నేను వాళ్ళింటికి వెళుతుండేవాణ్ని. ఆంజనేయులుకి ఇంకా చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారుచేసెవాడు. రంగుపెన్సిళ్లతో బ్రహ్మాండంగా బొమ్మలేసేవాడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తపని చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. చేయడానికేమీ లేదనుకొన్న రోజున పేపరూ, పెన్నూ పటుకుని కూర్చునేవాడు. కథలు రాసేవాడు.కవితలల్లి వినిపించేవాడు. మా స్కూలు యానివర్సిరీకీ మా కోసం ఒక హాస్యనాటిక రాసి తనే డైరెక్టు చేసి మెప్పించాడు.గ్రీన్ రూంలో మాకు మేకప్ చేసిందికూడా ఆంజనేయులే. ఆ మేకప్ సామాను స్వయంగా తయారు చేసుకొన్నాడు. 

 మాఅన్నయ్య అమెరికాలో పుట్టివుంటే చాలా గొప్పవాడయివుండేవాడు' అంటుండేవాడు కృష్ణ ఎప్పుడూ.

అమెరికా సంగతేమోగాని.. ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తరువాత అతను చాలా మంచిపేరు తెచ్చుకొంటాడు అనుకొనేవాళ్లం. కానీ అతనికి చపలత్వం ఉండేది. ఏ పనీ స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో ఆడుకొనేవాడు. ఆటలాడుకోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండేవాడు. ఊళ్ళో వాళ్లెంత మెచ్చుకొంటున్నా ఇంట్లోవాళ్లచేత తిట్లు తింటుండేవాడందుకే. కృష్ణకున్న స్థిమితంలో పాతికోవంతు  ఆంజనేయులుకున్నా నిజంగా చాలా మంచిపేరు తెచ్చుకొనుండేవాడే.

నేను డిగ్రీ చదువులకని మా తాతగారి ఊరికెళ్ళిపోయిన తరువాత ఆంజనేయులు సంగతేమయిందో పట్టించుకోలేదు.

 

నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజుల్లో ఓ రోజు ఆంజనేయులు నన్ను వెదుక్కొంటూ వచ్చాడు. వయసు అతనిలో ఆట్టె మార్పు తీసుకురాలేదు. కూర్చున్న పదినిమిషాల్లో వంద విషయాలను గురించి మాట్లాడాడు. మనది వాస్తవంగా లౌకిక ప్రజాస్వామ్యమేనా? అన్న అంశంనుంచి.. పారలల్ సినిమా వరకు.. అన్ని అంశాలమీద అడక్కుండానే  సుబ్బారావు. చనువున్నవాళ్లు సుబ్బు అంటారు. ఆంజనేయులికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం.

అతను ఇచ్చిన కథ ఎడిటరుగారికి నచ్చింది. 

ప్రచురించబడిన తరువాత నేనే అతనికి స్వయంగా కబురు చేసాను. ముందు ముందు ఇంకా మంచి కథలు రాస్తుండమని సలహాకూడా ఇచ్చాను.

రెండు నెలల తరువాత ఒక నవల పంపించాడు. బాగుంది. కొద్దిమార్పులతో ప్రచురించడానికి అంగీకారమయింది. 

క్రమంగా ఆంజనేయులు రచయితగా మిగతా పత్రికల్లోకూడా కనిపించడం మొదలుపెట్టాడు.

రేడియోలో అతను రాసిన  నాటకాలూ రావడం మొదలుపెట్టాయి.

కవి సమ్మేళనాల్లో అక్కడక్కడా కనపడుతుండేవాడు. 

ఒక నాటకపరిషత్తులో పోటీ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 'రివ్యూ'కోసం పత్రిక తరుఫున నేనే హాజరవుతున్నాను. రెండో రోజున భుజాన వేళ్లాడే సంచీతో  ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేట నుంచి  నాటకం తయారు చేసుకొచ్చాట్ట! అక్కడికి దగ్గర్లోనే ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాటకం బాగా పండింది. ఆంజనేయులు మూగవాడిపాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం అతనిదే. రచన సంగతి  సరేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులికి దక్కింది. 'అందుకేనన్న మాట ఈ మధ్య పత్రికల్లో ఎక్కువగా కనిపించడం లేదు' అన్నాను అతన్ని అభినందిస్తూ. 

చిన్నగా నవ్వాడు ఆంజనేయులు 'సుబ్బూ! ఒకసారి నువ్వు మా ఊరు రావాలి!' అన్నాడు.

'ఏమిటీ విశేషం?'

'అఖిల భారత స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాం. నువ్వూ ఒక జడ్జిగా ఉంటే బాగుంటుంది'

'అమ్మో! పాటల గురించి  నాకు ఏబిసిడిలు కూడా తెలీవన్నా!'

మేమందరం ఆంజనేయుల్ని 'అన్నా' అనే పిల్చేవాళ్లం కృష్ణతోపాటే.

'అలాంటివాళ్ళే నిజమైన న్యాయనిర్ణేతలవుతారు. నీకెందుకు నువ్వు రా!' అంటూ అడ్రసూ డేటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. 

ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న ఊరే అయినా ఆంజనేయులు  టీచరుగా వెళ్ళిన తరువాత  ఊరు పరిస్థితుల్లో చాలా మంచి మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడి జనం. ముఖ్యంగా కుర్రకారులో అతనికి మంచి ఫాలోయింగుంది. పెద్దవాళ్లలో గౌరవమూ ఉంది. పిల్లకాయల పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు పెద్దవాళ్ళు. ఊరిపెద్దల సహకారం లేనిదే అంత పెద్ద కార్యక్రమం చెయ్యడం బైటివాళ్లకు సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ ఊళ్లో ఆంజనేయులు మరో అవతారం చూడగలిగాను. అప్పటి దాకా  చూడని అవతారం.. సోషల్ వర్కర్ అవతారం!

ఊళ్లో ఉచితవైద్యం చేస్తున్నాడు. అందుకోసం పుస్తకాలు తెప్పించుకొని చదువుతున్నాడు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేయడం నేరం కదా  అనడిగితే కలకత్తా బ్రాండ్ 'ఆర్ ఎం పి' సర్టిఫికేట్ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం సేవే. లాభార్జన కాదు. చిన్న చిన్న రోగాలకే వైద్యం చేస్తున్నది.. ఉచితంగా. 'కొద్దిగా కాంప్లికేటేడ్ గా ఉన్నా పట్నం పొమ్మంటా' అన్నాడు ఆంజనేయులు. 

ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయం కూడా  పెట్టించాడు. 

అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరిసమస్యలని పరిష్కరించే విధానం. బోరింగుల్లోకి నీరు రాకపోయినా, వీధిదీపాలు వెలక్కపోయినా, వినాయక చవితి, శ్రీరామనవమిలాంటి పండుగలకి ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నా, పంచాయితీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిగ్గా  అందరిముందు చర్చించుకొనే అలవాటు చేయించాడు. ఆంజనేయులు ఒక్క టీచరే కాదు.. ఊరి పెద్దల్లో ఒకడూ ముఖ్యుడూ అయికూర్చున్నాడు.

'ఇన్నిపనులు చెయ్యటానికి నీకు టైమెక్కడిదన్నా?' అనడిగాను ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు. 

'ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. నువ్వైనా చెప్పు బాబూ! ఆరోగ్యం సంగతి చూసుకోవద్దూ !' అంది ఆంజనేయులు భార్య,

ఆమె కంప్లయింటు సమంజసమైందే అనిపించింది. కానీ నేను ఆంజనేయులుకి చెప్పేటంతటివాడినా!

'ఇప్పుడంటే ఫరవాలేదు. ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చిన తరువాత  కూడా తిరుగుతానంటే ఎట్లా?' అందామె.

'అప్పటి సంగతి చూద్దాంలేవోయ్  !' అని నవ్వి ఊరుకొన్నాడు ఆంజనేయులు.

అప్పటికి ఆంజనేయులు భార్య గర్భంతో ఉంది. అదీ ఆవిడ భయం.

ఆంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామె 'నువ్వూ మా కృష్ణలాంటివాడివే బాబూ! నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి నేను? వినేందుకు ఎవరున్నారు గనక! నన్ను చేసుకొన్నారని ఆయన్ని వాళ్ల వాళ్లు వెలేసినంత పని చేసారు. ఎవరూ ఇటువైపు రారు. మా వాళ్లు మరీ మొరటువాళ్లు' అని కన్నీళ్లు పెట్టుకొందావిడ.

ఆంజనేయులు ఇంతకుముందు పనిచేసిన ఊళ్ళోనే ఈ పెళ్ళి చేసుకొన్నాడు. కులాంతర  వివాహం. ఎవరు వారించినా వినకుండా చేసుకొన్నాట్ట! ఆయన బ్రాహ్మడు. ఈవిడది షెడ్యూల్డ్ కులం. ఇరువైపుల పెద్దలకూ ఈ వివాహం ఇష్టంలేకపోయింది. ఆ ఊళ్లోవాళ్ల బాధపడలేకే ఇక్కడికి బదిలీ చేయించుకొన్నాడు ఆంజనేయులు.

ఆంజనేయులు కులాంతర వివాహాలను గురించి కొన్ని కథలు రాసాడు. తను రాసిందే   ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేట్! ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకొన్నాను ఆ క్షణంలో.

 తరువాత నేను ఉద్యోగం మారి ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే దాదాపు మూడు దశాబ్దాలు ఉండిపోయాను. పెల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్లయిపోయారు. మధ్య మధ్యలో ఆంధ్రా వస్తున్నప్పుడు ఆంజనేయుల్ని గురించి వాకబు చేస్తుండేవాణ్ణి. ఉద్యోగాల రీత్యా అతనెక్కడెక్కడో ఉంటుండేవాడు. ప్రతిసారి ఏదో కొత్త ఆడ్రసు చెప్పేవాళ్ళు.

ఒకసారతన్ని మాచర్లలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లలు. పెద్దది పాప. సెకండ్ క్లాసు. రెండో వాడు యూ.కె.జి. చాలా చురుకుగా ఉన్నారిద్ద్దరూ. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీషులో  రైమ్సు.. తెలుగులో పద్యాలు గడ గడ చదివేస్తున్నారు. పిల్లలిద్దర్నీ డ్యాన్సు స్కూల్లో చేర్పించారు. 

'మైత్రికి పెయింటింగ్ కాంపిటీషన్లో టౌన్ మొత్తానికీ ఫస్టొచ్చింది.  ఇదిగో ప్రైజ్. చిన్నాడుకూడా చిచ్చర పిడుగే. వీడికీ సీతారామరాజు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్లో ప్రయిజొచ్చింది. సంగీత్సం కూడా  నేర్పించాలని ఉంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే!' అన్నాడాంజనేయులు.  అక్కడున్నంత సేపూ మొగుడూ పెళ్ళాలు తమ పిల్లల్ని గురించే మాట్లాడారు. 

'నువ్వేమన్నా వేరే ఏక్టివిటీస్ చేస్తున్నావా అన్నా?' అనడిగాను.

లోపలికి వెళ్లి ఓక ఫోటో ఆల్బమ్, రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు. అల్బంనిండా వాళ్ళ పిల్లల ఫోటోలే, రకరకాల భంగిమల్లో.. రకరకాల చోట్ల తీసినవి.

'వీళ్ళకోసం ఫొటోగ్రఫీ నేర్చుకొంటున్నాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే!.. బాగున్నాయా?' అనడిగాడు.

నిజంగా ఫోటోలు బాగా వచ్చాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తీసిన స్థాయుకి ఏమాతం తగ్గవు అవి. ఆంజనెయులు చెయ్యి ఎందులో పడినా అంతే! బంగారం! అందులోనుంచి మచివి రెండు ఏరి ఇచ్చాడు. 'నీకు తెలిసిన పత్రికలు వీలుంటే వేయించు' అన్నాదు.

'పాటలు  రాశాను కొన్ని.  బాలల గేయాలు.. గేయ కథలు ఉన్నాయనుకో! మా పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి నోరు తిరిగే    రీతిలో బాణీలు కట్టి రాసినవి. మైత్రీ! ఒక పాట పాడమ్మా! 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాట అందుకొని దాదాపు ఐదారునిమిషాలు ఆపకుడా పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లవాడు అక్కకు తోడుగా గొంతు కలపడం..!

'వీళ్ళు పాడే పాటలన్నీ నేను రాసినవే. వీళ్లకోసమే రాసాను. వీటిని కేసెట్టుల్లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తయేమో చూడు!'  అంటూ కేసెట్టూ.. పుస్తకమూ అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న రెండుగంటలూ ఆంజనేయులు తన పిల్లల్నిగురించి తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్ లోకి వెళితే ఆయన భార్య   సవరించేది. వాళ్ల ప్రపంచమంతా ప్రస్తుతం ఆ ఇద్దరి పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే ఉంది. 

'తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు' అనిపించిందా  క్షణంలో. 

నాకు పరిచయమున్న పత్రికకు అతనిచ్చిన ఫొటోలు, గేయాలు పంపించాను. రెండు ప్రచురించారు. మంచి స్పందనా వచ్చిందని చెప్పారు. 

'పిల్లల శీర్షికలకన్నా రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేయమ'ని ఎంకరేజింగ్ గా సలహా ఇస్తూ ఆంజనేయులకి ఉత్తరం రాసాను.

కొన్నేళ్ళు ఆంజనేయులు రెగ్యులర్ గా రచనలు పంపించాడుట. 'మంచి క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ అండ్ ఒరిజినల్' అని మెచ్చుకొన్నారు ఎడిటరుగారు నేనొకసారి ఆయన్ని కలిసినప్పుడు. '.. కానీ ఈ మధ్య ఏవో కామిక్సు పంపిస్తున్నాడు. అవి అంత ఒరిజినల్ కాదు. అయినా ఫరవాలేదనుకొని కొన్ని ప్రచురిస్తున్నాం' అన్నాడాయన. అంటే ఆంజనేయల  పిల్లలు హైస్కూలు చదువులకు వచ్చారన్నమాట..' అనుకొన్నాను, 'ఇంకొద్దికాలంపోతె ఇవీ రాయడు చూడండి! సస్పెన్సు.. క్రయిం  థిల్లర్ టైపు నవలలొస్తాయి' అన్నాను ఆ ఎడిటరు మిత్రునితో.

మరో ఐదేళ్ళ తరువాగ్త ఆ మిత్రుడు ఓ పెళ్ళిఫంక్షనులో కలిసాడు. ఆ

 మాటా ఈ మాటా అయిన తరువాత టాపిక్ నవలలమీదకు మళ్ళింది. 

'అన్నట్లు.. మర్చిపోయా!.. మన ఆంజనేయులు ఈ మధ్య ఒక క్రైం థిల్లర్ పట్టుకొచ్చాడు. అగాథ క్రిస్టీకి నకలుగా ఉందది. అతని దగ్గర్నుంచి రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రిక్కూ, అతనిక్కూడా  ప్రేరు పోతుంది. చూస్తాలే.. అని పక్కన పెట్టేసాను' అన్నాడు. 

ఈ మలుపు నేనూహించిందే అయినా.. ప్రాణం ఉసూరుమంది. ఆంజనేయుల్లో ఎంత టేలెంటుంది! ఎంత వెర్సటాలిటీ ఉంది!  ఏమయిందా ప్రతిభంతా?!

తరువాత కొంతకాలానికి ఆంధ్రా వైపొచ్చానుగాని.. పని వత్తిడివల్ల అతన్ని కలుసుకోవడానికి కుదరలేదు.  

తరువాత ఎప్పుడో అనుకోకుండా ఓ పెళ్ళిలో కృష్ణ కలిసాడు. చాలా ఏళ్ల తరువాత కలుసుకొన్నాం. గంటలకొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగడం లేదు.

'ఇట్లా కాదు.. ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా!' అని బలవంతాన ఇంటికి తీసుకువచ్చాను మర్నాడు. రాత్రి భోజనాలయిన తరువాత ఇద్దరం డాబామీద  కూర్చొని కబుర్లలో పడ్డాం. టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయులుదగ్గరికొచ్చి ఆగింది. 

నేనే అన్నాను 'మీ అన్నయ్య నిజంగా ఎంత టేలెంటు ఉన్నవాడూ! సిన్సియర్! కులాంతర వివాహం చేసుకొన్నాడని మీరంతా ఆయన్ని దూరం పెట్టడం ఏం బాలేదురా! ఇంట్లో వాళ్లంతా వెలి వేస్తే   ఆ లోటు పూడ్చుకోడానికి ఆ రోజుల్లో అతను చేసిన సోషల్ సర్వీసు అపూర్వం.  అట్లాంటివాడు పిల్లలు పుట్టేసరికి అప్పటివరకూ తాను సేవించిన సొసైటీనికూడా పూర్తిగా మర్చిపోయి .. ఆ పిల్లలలోకంలోకి వెళ్ళిపోయాడు!..  ఎంత విచిత్రమైన మనిషో!

కృష్ణ అందుకొని మిగతా భాగం పూర్తిచేసాడు '.. అన్నయంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే ఉండేది. వేరే కులం పిల్లని చేసుకొన్నాడని ఇంత్లో వెలేయకపోతే చెల్లెళ్లకు పెళ్ళిళ్ళవడం కష్టమయేదిరా! ..పోనీ అక్కడన్నా స్థిరంగా ఉన్నాడా అంటే..  అదీ లేదు. నువ్వు చెప్పిందీ నిజమే ! పిల్లలే లోకంగా మసిలేవాడు. వాళ్లమీదే ఆశలన్నీ పెట్టుకొన్నాడు. వాళ్ళకోసమే తను ఇంతకాలంగా ప్రేమించి పెంచుకొన్న కెరియర్ని కాదని కాలదన్నుకొన్నాడు. కానీ.. చివరికేమైందీ!..'

'ఏమైందీ?!' నా మనసేదో కీడు శంకింస్తోంది.

'కూతురు  అమెరికా పోయి తనలాగే వేరే దేశంవాడిని పెళ్ళి చేసుకొంది. సంబంధాల్లేవు  . కొడుకిక్కడే ఉన్నాడుగానీ.. తండ్రిపొడ గిట్టదు. తాను కోరుకొన్న కోర్సులో  చేర్పించలేదని అలిగి ఇంట్లోనుంచి వెళ్ళిపోతే వెదికి తెచ్చుకొన్నాడా ఉద్ధారకుణ్ణి. ఉన్నదంతా వాడి చదువులకు సమర్పించుకొన్నాడు. చివర్రోజుల్లో బికారిగా మారాడు. వదిన చచ్చిపోయింది. కొడుకూ కోడలే ఆధారం ఇప్పుడు. వాళ్ళు చీదరించుకొంటున్నా పడుండక తప్పని దౌర్భాగ్యం'

'మరి ఈ మధ్య ఏదో గేయం చూసానే! ఏదో పోటీకి పంపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా. 

'పంపే ఉంటాడులే! కొడుకూ, కోడలూ ఉద్యోగాలకు వెళుతున్నారుగదా! పసిపిల్లల్ని వీడి మీద  పడేసి  పోతున్నారు. ఆ పసివాళ్లకోసం  పాటలూ.. గట్రా ఏవన్నా  కడుతున్నాడేమో మళ్ళీ! అదేగా వాడి బలం.. బలహీనతా!' అన్నాడు కృష్ణ   


'శాపవశాన తన శక్తి తనకు తెలీని హనుమంతునివంటి వాడు ఆంజనేయులు. జాంబవంతుడికా  శాపం తెలుసు. కనకనే రామాయణ ధర్మకార్యానికి అతన్ని యుక్తియుక్తంగా ఉపయోగించుకొన్నాడు. అసమాన ప్రతిభా సామర్థ్యాలున్న ఆంజనేయుల్లాంటి వాళ్లను సద్వినియోగించుకొనే జాంబవంతులు సమాజంలో, వ్యవస్థలో క్రమంగా  తరిగి పోతుండమే ప్రస్తుతం పెను విషాదం' అనిపించింది నాకు..


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్ఎ 


***

( ' అడుగో ఆంజనేయులు ! జాంబవంతుడెక్కడ ? ' పేరుతో రచన మాస పత్రిక  2003- ఫిబ్రవరి- 'కథాపీఠం' పురస్కారం; 

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము- తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వారు శీ తారణ ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన  'తెలుగు వెలుగు' 

లో ప్రచురితం)

 

 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...