ఒక ప్రముఖ చినపిల్లల మాసపత్రికవాళ్ళు ఆ సంవత్సరం బాలల దిఓత్సవం సందర్భంగా గేయ కథల పోటీ నిర్వహిస్తున్నార్రు.సెలెక్షన్ కమిటీలో నేనూ ఒక మెంబర్ని.
దాదాపు మూడువందల ఎంట్రీలు వచ్చాయి. మొదటి వడపోతలో ఒక వందదాకా పోయినా.. ఇంకా రెండువందలవరకు మిగిలాయి.
పిల్లలకోసం ఇంతమంది రాసేవాళ్ళు ఉన్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపించినవాళ్ళలో లబ్దప్రతిష్ఠులూ ఉండటం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింతగొలిపే విషయమేమిటంటే కొత్తగా రాస్తున్నవాళ్లలో కొంతమంది ఎంతో చురుకుగా రాసారు! నిజానికి ప్రముఖుల రచనలకన్నా అవి ఎందులోనూ తీసిపోవు. కొన్నయితే మిగిలిన వాటికన్నా బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమయింది. మొత్తంమీద అందరం కలసి కూర్చుని అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఫైనల్గా ఒక పది రచనలను ఎంపిక చేసాం. వాటిలో ఒకటి, రెండు, మూడు బహుమతుల ఎన్నికను సంపాదకులకే వదిలేసాం. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోవచ్చని సలహా ఇచ్చాం. అట్లాంటీ సాధారణ ప్రచురణకు ఎన్నికైనదే 'ఛుక్ ఛుక్ రైలు'. గేయ రచయిత సి. ఆంహనేయులు, దేశాయిపేట.
దేశాయిపేట మా ఊరికి దగ్గర్లోనే ఉంటంది. మా ఊర్లో హైస్కూలున్నా దేశాయిపేటలో చదువు బాగుంటుందని మా నాన్న ఎస్సెల్సీలో నన్ను అక్కడ చేర్చాడు. నాకెప్పుడూ ఫస్టు ర్యాంకే వస్తుండేది. క్లాసులో కృష్ణగాడికి రెండో ర్యాంకు. వాడి అన్నయ్యే ఆంజనేయులు.
ఆంజనేయుల్ని చూస్తే మాకు ఎడ్మైరింగుగా ఉండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కొరుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. సోషల్ సబ్జెక్టులో సంవత్సరాలు, యుద్ధాలూ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అదే పనిగా బటీ పడుతుంటే.. అలా చేయడం తప్పనీ.. గుర్తు పెట్టుకోవడానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు 'రిటెన్షన్ ఆఫ్ మెమరీ పవర్' అనే
టెక్నిక్కు ఆన్ లైన్లో కోచింగ్ తీసుకొంటున్నారు. అందులో చెప్పిన సూత్రాల్లో కొన్ని నలభై ఏళ్లకిందట ఆంజనేయులు చెప్పినవే! అతఏమీ కోర్సులు చదువుకోలేదు. వాళ్ల నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్లకంత స్తోమతూ లేదు.
కృష్ణగాడితో కంబన్డు స్టడీసుకని నేను వాళ్ళింటికి వెళుతుండేవాణ్ని. ఆంజనేయులుకి ఇంకా చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారుచేసెవాడు. రంగుపెన్సిళ్లతో బ్రహ్మాండంగా బొమ్మలేసేవాడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తపని చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. చేయడానికేమీ లేదనుకొన్న రోజున పేపరూ, పెన్నూ పటుకుని కూర్చునేవాడు. కథలు రాసేవాడు.కవితలల్లి వినిపించేవాడు. మా స్కూలు యానివర్సిరీకీ మా కోసం ఒక హాస్యనాటిక రాసి తనే డైరెక్టు చేసి మెప్పించాడు.గ్రీన్ రూంలో మాకు మేకప్ చేసిందికూడా ఆంజనేయులే. ఆ మేకప్ సామాను స్వయంగా తయారు చేసుకొన్నాడు.
మాఅన్నయ్య అమెరికాలో పుట్టివుంటే చాలా గొప్పవాడయివుండేవాడు' అంటుండేవాడు కృష్ణ ఎప్పుడూ.
అమెరికా సంగతేమోగాని.. ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తరువాత అతను చాలా మంచిపేరు తెచ్చుకొంటాడు అనుకొనేవాళ్లం. కానీ అతనికి చపలత్వం ఉండేది. ఏ పనీ స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో ఆడుకొనేవాడు. ఆటలాడుకోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండేవాడు. ఊళ్ళో వాళ్లెంత మెచ్చుకొంటున్నా ఇంట్లోవాళ్లచేత తిట్లు తింటుండేవాడందుకే. కృష్ణకున్న స్థిమితంలో పాతికోవంతు ఆంజనేయులుకున్నా నిజంగా చాలా మంచిపేరు తెచ్చుకొనుండేవాడే.
నేను డిగ్రీ చదువులకని మా తాతగారి ఊరికెళ్ళిపోయిన తరువాత ఆంజనేయులు సంగతేమయిందో పట్టించుకోలేదు.
నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజుల్లో ఓ రోజు ఆంజనేయులు నన్ను వెదుక్కొంటూ వచ్చాడు. వయసు అతనిలో ఆట్టె మార్పు తీసుకురాలేదు. కూర్చున్న పదినిమిషాల్లో వంద విషయాలను గురించి మాట్లాడాడు. మనది వాస్తవంగా లౌకిక ప్రజాస్వామ్యమేనా? అన్న అంశంనుంచి.. పారలల్ సినిమా వరకు.. అన్ని అంశాలమీద అడక్కుండానే సుబ్బారావు. చనువున్నవాళ్లు సుబ్బు అంటారు. ఆంజనేయులికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం.
అతను ఇచ్చిన కథ ఎడిటరుగారికి నచ్చింది.
ప్రచురించబడిన తరువాత నేనే అతనికి స్వయంగా కబురు చేసాను. ముందు ముందు ఇంకా మంచి కథలు రాస్తుండమని సలహాకూడా ఇచ్చాను.
రెండు నెలల తరువాత ఒక నవల పంపించాడు. బాగుంది. కొద్దిమార్పులతో ప్రచురించడానికి అంగీకారమయింది.
క్రమంగా ఆంజనేయులు రచయితగా మిగతా పత్రికల్లోకూడా కనిపించడం మొదలుపెట్టాడు.
రేడియోలో అతను రాసిన నాటకాలూ రావడం మొదలుపెట్టాయి.
కవి సమ్మేళనాల్లో అక్కడక్కడా కనపడుతుండేవాడు.
ఒక నాటకపరిషత్తులో పోటీ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 'రివ్యూ'కోసం పత్రిక తరుఫున నేనే హాజరవుతున్నాను. రెండో రోజున భుజాన వేళ్లాడే సంచీతో ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేట నుంచి నాటకం తయారు చేసుకొచ్చాట్ట! అక్కడికి దగ్గర్లోనే ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాటకం బాగా పండింది. ఆంజనేయులు మూగవాడిపాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం అతనిదే. రచన సంగతి సరేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులికి దక్కింది. 'అందుకేనన్న మాట ఈ మధ్య పత్రికల్లో ఎక్కువగా కనిపించడం లేదు' అన్నాను అతన్ని అభినందిస్తూ.
చిన్నగా నవ్వాడు ఆంజనేయులు 'సుబ్బూ! ఒకసారి నువ్వు మా ఊరు రావాలి!' అన్నాడు.
'ఏమిటీ విశేషం?'
'అఖిల భారత స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాం. నువ్వూ ఒక జడ్జిగా ఉంటే బాగుంటుంది'
'అమ్మో! పాటల గురించి నాకు ఏబిసిడిలు కూడా తెలీవన్నా!'
మేమందరం ఆంజనేయుల్ని 'అన్నా' అనే పిల్చేవాళ్లం కృష్ణతోపాటే.
'అలాంటివాళ్ళే నిజమైన న్యాయనిర్ణేతలవుతారు. నీకెందుకు నువ్వు రా!' అంటూ అడ్రసూ డేటూ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న ఊరే అయినా ఆంజనేయులు టీచరుగా వెళ్ళిన తరువాత ఊరు పరిస్థితుల్లో చాలా మంచి మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడి జనం. ముఖ్యంగా కుర్రకారులో అతనికి మంచి ఫాలోయింగుంది. పెద్దవాళ్లలో గౌరవమూ ఉంది. పిల్లకాయల పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు పెద్దవాళ్ళు. ఊరిపెద్దల సహకారం లేనిదే అంత పెద్ద కార్యక్రమం చెయ్యడం బైటివాళ్లకు సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ ఊళ్లో ఆంజనేయులు మరో అవతారం చూడగలిగాను. అప్పటి దాకా చూడని అవతారం.. సోషల్ వర్కర్ అవతారం!
ఊళ్లో ఉచితవైద్యం చేస్తున్నాడు. అందుకోసం పుస్తకాలు తెప్పించుకొని చదువుతున్నాడు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేయడం నేరం కదా అనడిగితే కలకత్తా బ్రాండ్ 'ఆర్ ఎం పి' సర్టిఫికేట్ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం సేవే. లాభార్జన కాదు. చిన్న చిన్న రోగాలకే వైద్యం చేస్తున్నది.. ఉచితంగా. 'కొద్దిగా కాంప్లికేటేడ్ గా ఉన్నా పట్నం పొమ్మంటా' అన్నాడు ఆంజనేయులు.
ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయం కూడా పెట్టించాడు.
అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరిసమస్యలని పరిష్కరించే విధానం. బోరింగుల్లోకి నీరు రాకపోయినా, వీధిదీపాలు వెలక్కపోయినా, వినాయక చవితి, శ్రీరామనవమిలాంటి పండుగలకి ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నా, పంచాయితీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిగ్గా అందరిముందు చర్చించుకొనే అలవాటు చేయించాడు. ఆంజనేయులు ఒక్క టీచరే కాదు.. ఊరి పెద్దల్లో ఒకడూ ముఖ్యుడూ అయికూర్చున్నాడు.
'ఇన్నిపనులు చెయ్యటానికి నీకు టైమెక్కడిదన్నా?' అనడిగాను ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు.
'ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. నువ్వైనా చెప్పు బాబూ! ఆరోగ్యం సంగతి చూసుకోవద్దూ !' అంది ఆంజనేయులు భార్య,
ఆమె కంప్లయింటు సమంజసమైందే అనిపించింది. కానీ నేను ఆంజనేయులుకి చెప్పేటంతటివాడినా!
'ఇప్పుడంటే ఫరవాలేదు. ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చిన తరువాత కూడా తిరుగుతానంటే ఎట్లా?' అందామె.
'అప్పటి సంగతి చూద్దాంలేవోయ్ !' అని నవ్వి ఊరుకొన్నాడు ఆంజనేయులు.
అప్పటికి ఆంజనేయులు భార్య గర్భంతో ఉంది. అదీ ఆవిడ భయం.
ఆంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామె 'నువ్వూ మా కృష్ణలాంటివాడివే బాబూ! నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి నేను? వినేందుకు ఎవరున్నారు గనక! నన్ను చేసుకొన్నారని ఆయన్ని వాళ్ల వాళ్లు వెలేసినంత పని చేసారు. ఎవరూ ఇటువైపు రారు. మా వాళ్లు మరీ మొరటువాళ్లు' అని కన్నీళ్లు పెట్టుకొందావిడ.
ఆంజనేయులు ఇంతకుముందు పనిచేసిన ఊళ్ళోనే ఈ పెళ్ళి చేసుకొన్నాడు. కులాంతర వివాహం. ఎవరు వారించినా వినకుండా చేసుకొన్నాట్ట! ఆయన బ్రాహ్మడు. ఈవిడది షెడ్యూల్డ్ కులం. ఇరువైపుల పెద్దలకూ ఈ వివాహం ఇష్టంలేకపోయింది. ఆ ఊళ్లోవాళ్ల బాధపడలేకే ఇక్కడికి బదిలీ చేయించుకొన్నాడు ఆంజనేయులు.
ఆంజనేయులు కులాంతర వివాహాలను గురించి కొన్ని కథలు రాసాడు. తను రాసిందే ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేట్! ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకొన్నాను ఆ క్షణంలో.
తరువాత నేను ఉద్యోగం మారి ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే దాదాపు మూడు దశాబ్దాలు ఉండిపోయాను. పెల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్లయిపోయారు. మధ్య మధ్యలో ఆంధ్రా వస్తున్నప్పుడు ఆంజనేయుల్ని గురించి వాకబు చేస్తుండేవాణ్ణి. ఉద్యోగాల రీత్యా అతనెక్కడెక్కడో ఉంటుండేవాడు. ప్రతిసారి ఏదో కొత్త ఆడ్రసు చెప్పేవాళ్ళు.
ఒకసారతన్ని మాచర్లలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లలు. పెద్దది పాప. సెకండ్ క్లాసు. రెండో వాడు యూ.కె.జి. చాలా చురుకుగా ఉన్నారిద్ద్దరూ. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీషులో రైమ్సు.. తెలుగులో పద్యాలు గడ గడ చదివేస్తున్నారు. పిల్లలిద్దర్నీ డ్యాన్సు స్కూల్లో చేర్పించారు.
'మైత్రికి పెయింటింగ్ కాంపిటీషన్లో టౌన్ మొత్తానికీ ఫస్టొచ్చింది. ఇదిగో ప్రైజ్. చిన్నాడుకూడా చిచ్చర పిడుగే. వీడికీ సీతారామరాజు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్లో ప్రయిజొచ్చింది. సంగీత్సం కూడా నేర్పించాలని ఉంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే!' అన్నాడాంజనేయులు. అక్కడున్నంత సేపూ మొగుడూ పెళ్ళాలు తమ పిల్లల్ని గురించే మాట్లాడారు.
'నువ్వేమన్నా వేరే ఏక్టివిటీస్ చేస్తున్నావా అన్నా?' అనడిగాను.
లోపలికి వెళ్లి ఓక ఫోటో ఆల్బమ్, రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు. అల్బంనిండా వాళ్ళ పిల్లల ఫోటోలే, రకరకాల భంగిమల్లో.. రకరకాల చోట్ల తీసినవి.
'వీళ్ళకోసం ఫొటోగ్రఫీ నేర్చుకొంటున్నాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే!.. బాగున్నాయా?' అనడిగాడు.
నిజంగా ఫోటోలు బాగా వచ్చాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తీసిన స్థాయుకి ఏమాతం తగ్గవు అవి. ఆంజనెయులు చెయ్యి ఎందులో పడినా అంతే! బంగారం! అందులోనుంచి మచివి రెండు ఏరి ఇచ్చాడు. 'నీకు తెలిసిన పత్రికలు వీలుంటే వేయించు' అన్నాదు.
'పాటలు రాశాను కొన్ని. బాలల గేయాలు.. గేయ కథలు ఉన్నాయనుకో! మా పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి నోరు తిరిగే రీతిలో బాణీలు కట్టి రాసినవి. మైత్రీ! ఒక పాట పాడమ్మా! 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాట అందుకొని దాదాపు ఐదారునిమిషాలు ఆపకుడా పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లవాడు అక్కకు తోడుగా గొంతు కలపడం..!
'వీళ్ళు పాడే పాటలన్నీ నేను రాసినవే. వీళ్లకోసమే రాసాను. వీటిని కేసెట్టుల్లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తయేమో చూడు!' అంటూ కేసెట్టూ.. పుస్తకమూ అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న రెండుగంటలూ ఆంజనేయులు తన పిల్లల్నిగురించి తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్ లోకి వెళితే ఆయన భార్య సవరించేది. వాళ్ల ప్రపంచమంతా ప్రస్తుతం ఆ ఇద్దరి పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే ఉంది.
'తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు' అనిపించిందా క్షణంలో.
నాకు పరిచయమున్న పత్రికకు అతనిచ్చిన ఫొటోలు, గేయాలు పంపించాను. రెండు ప్రచురించారు. మంచి స్పందనా వచ్చిందని చెప్పారు.
'పిల్లల శీర్షికలకన్నా రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేయమ'ని ఎంకరేజింగ్ గా సలహా ఇస్తూ ఆంజనేయులకి ఉత్తరం రాసాను.
కొన్నేళ్ళు ఆంజనేయులు రెగ్యులర్ గా రచనలు పంపించాడుట. 'మంచి క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ అండ్ ఒరిజినల్' అని మెచ్చుకొన్నారు ఎడిటరుగారు నేనొకసారి ఆయన్ని కలిసినప్పుడు. '.. కానీ ఈ మధ్య ఏవో కామిక్సు పంపిస్తున్నాడు. అవి అంత ఒరిజినల్ కాదు. అయినా ఫరవాలేదనుకొని కొన్ని ప్రచురిస్తున్నాం' అన్నాడాయన. అంటే ఆంజనేయల పిల్లలు హైస్కూలు చదువులకు వచ్చారన్నమాట..' అనుకొన్నాను, 'ఇంకొద్దికాలంపోతె ఇవీ రాయడు చూడండి! సస్పెన్సు.. క్రయిం థిల్లర్ టైపు నవలలొస్తాయి' అన్నాను ఆ ఎడిటరు మిత్రునితో.
మరో ఐదేళ్ళ తరువాగ్త ఆ మిత్రుడు ఓ పెళ్ళిఫంక్షనులో కలిసాడు. ఆ
మాటా ఈ మాటా అయిన తరువాత టాపిక్ నవలలమీదకు మళ్ళింది.
'అన్నట్లు.. మర్చిపోయా!.. మన ఆంజనేయులు ఈ మధ్య ఒక క్రైం థిల్లర్ పట్టుకొచ్చాడు. అగాథ క్రిస్టీకి నకలుగా ఉందది. అతని దగ్గర్నుంచి రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రిక్కూ, అతనిక్కూడా ప్రేరు పోతుంది. చూస్తాలే.. అని పక్కన పెట్టేసాను' అన్నాడు.
ఈ మలుపు నేనూహించిందే అయినా.. ప్రాణం ఉసూరుమంది. ఆంజనేయుల్లో ఎంత టేలెంటుంది! ఎంత వెర్సటాలిటీ ఉంది! ఏమయిందా ప్రతిభంతా?!
తరువాత కొంతకాలానికి ఆంధ్రా వైపొచ్చానుగాని.. పని వత్తిడివల్ల అతన్ని కలుసుకోవడానికి కుదరలేదు.
తరువాత ఎప్పుడో అనుకోకుండా ఓ పెళ్ళిలో కృష్ణ కలిసాడు. చాలా ఏళ్ల తరువాత కలుసుకొన్నాం. గంటలకొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగడం లేదు.
'ఇట్లా కాదు.. ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా!' అని బలవంతాన ఇంటికి తీసుకువచ్చాను మర్నాడు. రాత్రి భోజనాలయిన తరువాత ఇద్దరం డాబామీద కూర్చొని కబుర్లలో పడ్డాం. టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయులుదగ్గరికొచ్చి ఆగింది.
నేనే అన్నాను 'మీ అన్నయ్య నిజంగా ఎంత టేలెంటు ఉన్నవాడూ! సిన్సియర్! కులాంతర వివాహం చేసుకొన్నాడని మీరంతా ఆయన్ని దూరం పెట్టడం ఏం బాలేదురా! ఇంట్లో వాళ్లంతా వెలి వేస్తే ఆ లోటు పూడ్చుకోడానికి ఆ రోజుల్లో అతను చేసిన సోషల్ సర్వీసు అపూర్వం. అట్లాంటివాడు పిల్లలు పుట్టేసరికి అప్పటివరకూ తాను సేవించిన సొసైటీనికూడా పూర్తిగా మర్చిపోయి .. ఆ పిల్లలలోకంలోకి వెళ్ళిపోయాడు!.. ఎంత విచిత్రమైన మనిషో!
కృష్ణ అందుకొని మిగతా భాగం పూర్తిచేసాడు '.. అన్నయంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే ఉండేది. వేరే కులం పిల్లని చేసుకొన్నాడని ఇంత్లో వెలేయకపోతే చెల్లెళ్లకు పెళ్ళిళ్ళవడం కష్టమయేదిరా! ..పోనీ అక్కడన్నా స్థిరంగా ఉన్నాడా అంటే.. అదీ లేదు. నువ్వు చెప్పిందీ నిజమే ! పిల్లలే లోకంగా మసిలేవాడు. వాళ్లమీదే ఆశలన్నీ పెట్టుకొన్నాడు. వాళ్ళకోసమే తను ఇంతకాలంగా ప్రేమించి పెంచుకొన్న కెరియర్ని కాదని కాలదన్నుకొన్నాడు. కానీ.. చివరికేమైందీ!..'
'ఏమైందీ?!' నా మనసేదో కీడు శంకింస్తోంది.
'కూతురు అమెరికా పోయి తనలాగే వేరే దేశంవాడిని పెళ్ళి చేసుకొంది. సంబంధాల్లేవు . కొడుకిక్కడే ఉన్నాడుగానీ.. తండ్రిపొడ గిట్టదు. తాను కోరుకొన్న కోర్సులో చేర్పించలేదని అలిగి ఇంట్లోనుంచి వెళ్ళిపోతే వెదికి తెచ్చుకొన్నాడా ఉద్ధారకుణ్ణి. ఉన్నదంతా వాడి చదువులకు సమర్పించుకొన్నాడు. చివర్రోజుల్లో బికారిగా మారాడు. వదిన చచ్చిపోయింది. కొడుకూ కోడలే ఆధారం ఇప్పుడు. వాళ్ళు చీదరించుకొంటున్నా పడుండక తప్పని దౌర్భాగ్యం'
'మరి ఈ మధ్య ఏదో గేయం చూసానే! ఏదో పోటీకి పంపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా.
'పంపే ఉంటాడులే! కొడుకూ, కోడలూ ఉద్యోగాలకు వెళుతున్నారుగదా! పసిపిల్లల్ని వీడి మీద పడేసి పోతున్నారు. ఆ పసివాళ్లకోసం పాటలూ.. గట్రా ఏవన్నా కడుతున్నాడేమో మళ్ళీ! అదేగా వాడి బలం.. బలహీనతా!' అన్నాడు కృష్ణ
'శాపవశాన తన శక్తి తనకు తెలీని హనుమంతునివంటి వాడు ఆంజనేయులు. జాంబవంతుడికా శాపం తెలుసు. కనకనే రామాయణ ధర్మకార్యానికి అతన్ని యుక్తియుక్తంగా ఉపయోగించుకొన్నాడు. అసమాన ప్రతిభా సామర్థ్యాలున్న ఆంజనేయుల్లాంటి వాళ్లను సద్వినియోగించుకొనే జాంబవంతులు సమాజంలో, వ్యవస్థలో క్రమంగా తరిగి పోతుండమే ప్రస్తుతం పెను విషాదం' అనిపించింది నాకు..
-కర్లపాలెం హనుమంతరావు
బోథెల్ ; యూఎస్ఎ
***
( ' అడుగో ఆంజనేయులు ! జాంబవంతుడెక్కడ ? ' పేరుతో రచన మాస పత్రిక 2003- ఫిబ్రవరి- 'కథాపీఠం' పురస్కారం;
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము- తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వారు శీ తారణ ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన 'తెలుగు వెలుగు'
లో ప్రచురితం)
No comments:
Post a Comment