Tuesday, February 16, 2021

కాసు- తిరకాసు - సరదా వ్యాసం కర్లపాలెం హనుమంతరావు

 


కాసు - తిరకాసు 

( ఈనాడు - ప్రచురితం ) 

*


గడించడం అదో రకం. ఖర్చు చేయడం అంతకు మించిన నరకం.  చిత్రగుప్తుడి చిట్టా నుంచి లెక్కలు తప్పించినా భూలోక చిత్రగుప్తులు ఐ.టి, ఈ.డి లు ఉంటారు కదా!  ఆ  యముడి బ్యాచీ లుక్కుల నుంచి దృష్టి మళ్లించడం మామూలు యవ్వారం కాదు. మామూళ్లకు ఎప్పుడు లొంగుతారో.. ఏ మూలకు తోలుకెళితే  చల్లబడతారో.. అంతా ఆ  'పైన' ఉన్నవాడి అంతరంగాన్ని బట్టి   నడిచే తతంగం.  అట్లాగని ఏ ఇనప  గని, బయ్యారం గని కంట బడితే దాని మీద పడి   దోచుకోడమెందుకు?..   నిద్రలు కాచుకుంటూ ఆ తరగని సంపదలు దాచుకోడం ఎందుకు?.. అంటారా? పైకం పైన వైరాగ్యం  ప్రకటించడం  ప్రజాస్వామ్యంలో కుదరే పనేనా?


సంసారం దాలి గుంట కాదు.  సంపద పెరుగుతున్నంత కాలమే దారాపుత్రులు నోరుచేసుకోరు.  స్విస్ బ్యాంకులు సైతం అసాంజేకు దీటుగా కాతా  రహస్యాలన్నీ బహిర్గతం చేసే ఈ కాలంలో కాసుల వర్షం ఎవరికి  హర్షం అంటారా?  


డబ్బుంటే ఒక కష్టం. లేకుంటే డబుల్ నష్టం. పార్టీ టిక్కెట్టే కాదు.. సినిమా టిక్కెట్టు క్కూడా ఇక్కట్లు పడక తప్పని ముదనష్టపు జాతకం.. కోరి కోరి ఎవరు నాయనా నడి నుదుటన తలకిందులుగా రాయించుకొనేందుకు తయారయేది?పూట గడిచే మాట ఆనక! పూటుగా మందు పడాలన్నా ముందుగా కావాల్సింది కరెన్సీనే కదా దాదా!


పొరుగింటి మీనాక్షమ్మలతో పోటీలకు దిగే  ఆండాళ్లమ్మలు ప్రతి ఇంటాయన మెడకూ గుదిబండల్లా  వేలాడుతూనే ఉంటారు.  ఓ ముత్యాల బేసరో  ముక్కుకి తగిలించని  పక్షంలో బేవార్సు  శ్రీవార్సు అంటూ ఫార్స్ చేస్తారు!  రేకెట్ పని నుంచి పాకెట్ మనీ దాకా అన్నింటికీ మనీపర్శుతోనే పని. ప్రజల సొమ్ము అని గమ్మున ఊరుకుంటే ఫెయిలయిన చంద్రయాన్- రెండును చూపించైనా మనం ఆ అమెరికా చైనాల సరసన చేరామని  రెండు వేళ్లు చూపించుకునేందుకు  వీలుండేదేనా?  


డబ్బు లేందే డుబ్బుక్కొరగాడన్న సామెత ఏమన్నా సర్దాగా పుట్టిందా? నాలుగేళ్ల పాటు సర్కారును బ్రహ్మాండంగా నడిపినట్లు భుజాలు ఎగరేసారు పాపం చంద్రబాబు  సారు!   పంచే సొమ్ము సమయానికి ఆడక   నలభైయ్యేళ్ల సీనియరిటీ ఉండీ ముఖం తేలవేసారు!


ఎన్నికల్లో టిక్కెట్ల ఇక్కట్ల సంగతట్లా ఉంచండి. చిన్నోడి ప్రీ-కాన్వెంటు సీటుకైనా పెద్ద నోట్లు దండిగా అవసరమే కదండీ! బ్లాక్ బస్టరని బోడి బిల్డప్పులిచ్చే ఓన్లీ వన్- డే ఆడే చెత్త మూవీకైనా బ్లాకులో తప్ప టిక్కెట్లు దొరకని రోజుల్లో రొక్కాన్ని మరీ అరటి తొక్కలా తోసి అవతల పారేస్తే ఇంట్లో పస్తులే సుమా ! 


పైసలుంటేనే పేరొచ్చేది .. మంచిదో.. చెడ్డదో! ఫోర్బ్స్ జాబితాలో కెక్కించేదీ.. ఫోర్ ట్వంటీ కేసుల్నుంచీ తప్పించేదీ మనీనే! మనీ మేక్స్ మెనీ ట్రిక్స్!


బ్యాంకప్పుల వంకతో పైసల వసూళ్లు. తిరిక్కట్టమంటే ఇంటి పై కప్పుల కేసి పిచ్చి లుకింగ్స్ ! వీల్చూసుకొని వీల్-చైర్ పేషెంట్ పేరుతో విదేశాలకు చెక్కింగ్స్! వి. పి పెట్టిన విఐపి గారికైనా వీపెనక  లోపలి పాకెట్లో  విమానం టిక్కెట్లకి సరిపడా  మనీ అయినా తప్పని సరే కదా! దటీజ్ డబ్బూస్ పవర్!


బిర్లా టాటాలకి ఏ పేరొచ్చినా, అదానీ అంబానీలకి సర్కార్ ఏ 'కీ' రోలిచ్చినా కీలకమంతా పర్శులోని కాపర్స్ ఆడించే సర్కస్ ఫీట్స్ దే! బిట్స్ పిలానీ  మొదలు బిట్ కాయిన్స్  వరకు అంతా కాసుల తిరకాసే!


కుదురుగా ఉండనీయదీ  మనీ ఎవర్నీ! పెద్దనోట్ల కట్ల నట్లా అర్థరాత్రి కట్లా ఎట్లా హఠాత్తుగా రద్దు చేసియించిందో  మోదీ సర్కార్ని..  చూసాం కదా? ఆ  పెద్దాయన మోదీ పేరు నట్లా ఊరూ వాడా దేశమంతటా మారుమోగించిందీ  రద్దయిపోతేనేమీ.. పిచ్చి నోట్లకట్టలే కదా!


బ్యాంకులంటూ కొన్ని డబ్బుండే  చోట్లు మన దేశంలో కూడా పనిచేస్తుంటాయని జనాలకు తెలిసిందీ, ఏటియంలంటే ఏంటోలే.. పెద్ద కొలువులు చేసుకొనే చదువుకున్నోళ్లు నడిరోడ్ల పక్కన కూడా నోట్ల కోసం నొక్కుకునే యంత్రాలని బీద  జనాలకు అవి ఖాళీ అయినప్పుడైనా తలకెక్కించిందీ డర్టీ మనీనే! అదీ డబ్బు దెబ్బ! ఉన్నా సంచలనమే.. లేకున్నా సంక్షోభమే!

 

డబ్బు లేందే అప్పులుండవు. అప్పులేందే ఎగేసేందుకు  డబ్బూ ఉండదు.  మాఫీలు చేయించి బక్కోళ్ల ఓట్లు దండుకునేందుకైనా మాయదారి నాయకులకు అండగా నోట్లుండాల్సిందే కదా!   అదేమైనా అంటే ఆర్బీఐ పదే పదే ఫీలయిపోతుంది కానీ.. బాకీల  మాఫీలు లేందే ఏ రాజకీయ పార్టీ అయినా సాఫీగా హామీలిచ్చేదెట్లా? అధికారంలోకి ఎగబాకేదింకెట్లా?


ఒక్క ‘పవర్’తోనే కాదు డబ్బుకు పరువూ ప్రతిష్ఠల్తో కూడా లింకే! డాలరు డాబు చూసుకొనే అమెరికావాడి కా రువాబు! ప్రపంచం అమెరికా చుట్టూతా బొంగరంలా తిరుగుతున్నా,  అమెరికనోడు డాలరు చుట్టుతా గింగిరాలు కొడుతున్నా అంతా బంగారంలాంటి  సొమ్ములో ఉన్న గమ్మత్తు వల్లనే  గదా గురువా!   ఆ డాలరు మీద దెబ్బేద్దామనే చైనావాడిప్పుడు  సిల్కు రోడ్డుతో తయారవుతున్నాడు. సిల్క్ స్మిత నుంచి.. సిల్క్ రోడ్డు దాకా అందరికీ డబ్బుతోనే బాబూ డాబూ.. దర్పం సర్వం.. గర్వం!

 

నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలేమన్నా పన్లేక సతాయిస్తారా? ఎప్పుడు ఏ రాయికి ఎంత విలువ పెరుగుతుందో దేవుడికే తెలియాలనుకుంటాం.  ఆ సూక్ష్మం వంటబట్టకే దేవుడూ  ఓ గర్భగుళ్లో రాయిగ మారి కూర్చున్నాడు. భక్తులు హుండీ రాళ్లతోనే సర్వాంతర్యామి అయినా లోకతంత్రం సర్వం నడిపించేది ! 


రూపాయి నోటు  మీద కనిపించక పోయుంటే పాపం గోచీపాతరాయుడు బాపుజీ నయినా ఆనవాలు పట్టుండునా ఈ డబ్బు పిచ్చి లోకం?


ఘనమైన  పదవుల కోసం కదా ఘోరంగా కొట్లాటలు  నిస్వార్థ ప్రజాసేవకుల మధ్య ! గౌరవ వేతనమంటూ  వచ్చిపడే లక్షలూ, గౌరవ పురస్కారాలతో జనమిచ్చే  కానుకలు, విరాళాలే గాని   లేకుంటే ! మన వేమన దెప్పినట్లు  శునకానికి అయినా   పాలించే ఆ కనకపు సింహాసనమైనా  దాలిగుంట ముందు బలాదూర్!


డబ్బు మీదనేనా  ప్రజానేతల   ప్రగాఢ మమకారం? 

 నిజానికి సజావుగా జవాబు  చెప్పడం కష్టం. ఎన్నికల తంతుకు  కావాల్సింది ఎవలేని డబ్బు మూటలు ! కాని ఎన్ని కోట్లు   విరాళాలొస్తున్నా  ఎన్నికల సంఘంతో పాట్లు ! కాబట్టే  ఏ నేతా వంటి మీద నలగని బట్ట ఉండనీయడు! పలుగు పట్టినా,   మట్టి తట్ట మోసిన,  రోడ్దువార బంకుల్లో టీ కాచి పెట్టి,  రిక్షా తొక్కి పిక్క పట్టినట్లు ఫోజు పెట్టి ..  నిమిషానికి ఓ ఐదో ఆరో లకారాలకు  తగ్గకుండా కూలి   డబ్బులు రాబట్టటం!  


 డబ్బుంటేనే కోర్టుల్లో  పిల్స్   అడ్మిట్ అయ్యేది. స్పోర్టు కోర్టుల్లో ఐపిఎల్ గెలిపించడం అయేది! డబ్బుంటేనే అబ్బా.. చర్లపల్లి జైలైనా చల్లపల్లి రాజావారి బంగళాలా  చల్లంగా ఉండేది.


డబ్బున్న వాడిని నేరాలు దబ్బునేమీ చేయలేవు. బేళ్ల కొద్దీ నోట్లుంటే  చాలు.. బెయిళ్లైనా రావనలేవు. రూకల్లేకుంటేనే లోకానికి లోకువ. 


కాసుల తిరకాసు  కాచి వడపోసిన వడ్డికాసులవాడు కాబట్టే అంతెత్తున కొలువై ఉండీ హుండీలకు  నిండుగా భక్తుల నుండి డబ్బులు దండుకొనేది. కళ్యాణకట్ట మీది  క్షౌరమైనా .. కాస్తంత  చెయ్యి తడపందే సాఫీగా సాగదు . పర్సు ఖాళీగాడంటే ఆఫీసు  బంట్రోతుకే కాదు  ఆ గాడ్స్  పూజారికే సరి పడదు.


డబ్బు డ్రగ్సు కన్న మత్తుది. డ్రగ్సు కేసులనైనా  గమ్మత్తుగా మాయచేసే మహత్తు దానిది  . నలుపో తెలుపో! డబ్బున్న వాడిదే చివరికి గెలుపు. 

***

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...