కొంత మంది 'అయ్యో' అన్నారు. కొంతమంది 'అమ్మయ్య!' అనుకున్నారు. ఈ 'అయ్యో'.. ' కు అమ్మయ్య' కు మధ్యనే మనిషి సాధించుకునే కీర్తి ప్రతిష్ఠలంతా.
పున్నారావు ఒక ముఖ్యమైన గవర్నమెంటు ఆఫీసులో అతి ముఖ్యమైన సీటులో చాలా ఏళ్ల బట్టి పనిచేస్తున్న ప్రజాసేవకుడు. గవర్నమెంటాఫీసంటున్నావు!.. పనిచేస్తున్నాడంటున్నావు.. ప్రజాసేవకుడంటున్నావు! .. ఇదెలా సాధ్యమయ్యా పెద్దమనిషీ! అని గద్దిస్తారని తెలుసు. ఎంత ప్రభుత్వ కార్యాలయమైనా ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. ముత్తెమంత దస్త్రమయినా ముందుకూ వెనక్కూ కదిలించకపోతే ప్రభుత్వపాలన ఎట్లా నడిచినట్లు లెక్కా? అట్లా 'పని' చేసే వర్గం ప్రజాసేవకుడు కాబట్టే పున్నారావు పోయిన వార్త విన్న వెంటనే 'అయ్యో' అని కొంత మంది 'ప్రజలు' కంగారుపడింది. ఆఫీసు పనికి అతగాడు కుదిర్చిన రేటు అఫర్డ్ చేసుకునే శక్తిలేని దద్దమ్మలేమైనా 'అమ్మయ్య' అనుకోనుండవచ్చు. ఈ కథకు వాళ్లతో కాకుండా 'అమ్మయ్య' వర్గంతోనే ప్రసక్తం.ఆ 'అమ్మయ్య' అనుకున్న వర్గంలో ఇంకో రకం కూడా ఉన్నారు. వాళ్లను గురించే ఈ కథంతా!
***
యమధర్మరాజుగారు
విగత జీవుల పాపపుణ్యాల లెక్కలను బేరీజు వేసుకుని ఆత్మలకు స్వర్గమో, నరకమో మంజూరు చేస్తారన్న
విశేషం అందరికీ తెలిసిందే! కాకపోతే ఈ మధ్యకాలంలో పాపుల సంఖ్య పగిలిన పుట్టలోని చీమలకు మల్లే పెరిగి పెరిగి నరకం నరకం కన్నా హీనంగా తయారైంది. పుణ్యాత్మల సంఖ్య మరీ పలచనయిపోయి వంద మంది పట్టే పుష్పక విమానం కూడా
తొంభై తొమ్మిది మంది నిండేందుకే వందలొందల ఏళ్లు తీసుకుంటుంది. విమానం పూర్తిగా నిండితే తప్ప
అది గాలిలోకి ఎగిరే ఏర్పాటు లేదు. ఎక్కువ మందిని ఒకే ట్రిప్పుల్లో తొక్కి
స్వర్గానికి తోసేయకుండా విశ్వకర్మ చేసిన కొత్త ఏర్పాటది. ఎంత మందెక్కినా ఇంకొకరికి అవకాశం ఉండే పాతకాలం ఏర్పాటు విమర్శల పాలవడం చేత విశ్వకర్మ కొత్త మోడల్ పుష్పకంలో త్రిమూర్తుల సలహా మీద ఈ తరహా ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడీ కొత్త పద్ధతే పుణ్యాత్మల ప్రాణానికి సంకటం మారిన పరిస్థితి! మన్వంతరాల తరబడి విమానం ఎప్పుడు నిండుతుందా? అని కళ్లు
చిల్లులు పడేటట్లు.. ఎక్కి కూర్చున్న పుణ్యాత్మలు ఎదురుచూడడమంటే.. మాటలా మరి!
కాళ్లు పీక్కు పోయేటట్లు విమానంలోనే పడుంటం కన్నా నరకం మరేముంటుంది! 'స్వర్గం
పీడాబాయిరి! తెలీక పుణ్యం చేసి చచ్చాం!' - అంటూ తలలు మోదుకునే ఆత్మలు రోజు రోజుకు
ఎక్కువైపోతున్నాయి చిక్కుపోయిన విమానంలో.
ఆత్మల ఘోష విని తట్టుకోలేక అక్కడికీ పాపాల చిట్టాలో నుంచి చాలా అఘాయిత్యాలను కొట్టిపారేయించారు యమధర్మరాజుగారు. ఇదివరకు పద్ధతుల్లోనే చాదస్తంగా పాపులను నిర్ధారిస్తు కూర్చుంటే నరకం నడవడం ఎంత కష్టమో అనుభవం మీదట గానీ తెలిసిరాలేదు పాపం.. సమవర్తిగారికి. ఏదో విధంగా అయినా వందో పుణ్యాత్మ దొరక్కపోతుందా అని ఆయన ఆశ.
అందుకే ఇద్దరు పెళ్లాలుండటం ఇది వరకు లెక్క ప్రకారం మహానేరం. ఇప్పుడు.. ఆ
ఇద్దర్నీ చక్కగా చూసుకుంటే పుణ్యాత్ముడి కిందే లెక్క. అబద్ధాలాడడం గతంలో పెద్ద శిక్షకు
ప్రథమ దండన. ఇప్పుడు వంద కాదు.. అవసరమైతే అంశాల వారీగా అవసరాన్ని బట్టి వెయ్యి వరకు
హాయిగా ఎన్ని అసత్యాలైనా అలౌడ్. మరీ అవసరమయితే అసలు అసత్యమనేదే శిక్షార్హమైన నేరమేమీ కాదనే ఆలోచన
చేసే ప్రతిపాదనా ఆలోచనలో ఉంది. సరుకుల్ని కల్తీ చెయ్యడం, శాల్తీలను మాయం చేసేయడంలాంటి పాపాలు
చేసే కిరాతకులు గుడి కెళ్లి హూండీలో ఓ పదో పరకో పడేసొస్తే చాలు.. పాప విముక్తులయే కొత్త
శాసనం ఒకటి జారీ అయివుంది. దొంగనోట్లు ముద్రించేవాళ్లూ, చెలామణీలో
పెట్టేవాళ్లు ద్రవ్యోల్బణం ప్రమాదం నుంచి
దేశాన్ని కాపాడుతున్న పుణ్యాత్ముల కింద స్వర్గానికి వెళ్లే అర్హులలో ప్రత్యేక కోటాగా ట్రీట్ చెయ్యబడుతున్నారీ మధ్య కాలంలో! ప్రశ్నపత్రాలు లీక్ చేయించడం, దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలిప్పించడం, మారుపేర్లతో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి విదేశాలకు తరలించేసెయ్యడం లాంటి అమానుష కార్యాలన్ని
ఇప్పుడు విశ్వకళ్యాణార్థం నడుం బిగించి చేసే ప్రజాసేవ పద్దు లోకే మారిపోయాయి.
పున్నారావు
పైసల కోసం కక్కుర్తి పడితే పడ్డాడు కానీ, ఒప్పుకున్న పనిని సాధ్యమైనంత నిజాయితీతో పూర్తిచేయడంలో నిబద్ధత పాటించే
మనిషి. ఫేక్ స్కాలర్ షిప్పులు సృష్టించి ఎంతో మందిని ఆదుకున్నాడు. సర్కారు భూముల
కూపీలు లాగి వాటిని తగు మొత్తంలో ప్రయివేట్ పార్టీలకు అప్పచెప్పాడు. చేసే ఏ పనిలో అయినా పిసరంత ప్రజాకళ్యాణం తొంగిచూస్తుండటంతో ఫోర్సులో ఉన్న రూల్సు
ప్రకారం పున్నారావు కచ్చితంగా 'పుణ్యాత్మ' కేటగిరీలోకే రావడం న్యాయం. అందుకే పున్నారావు చచ్చిపోయాడన్న కబురు
చెవినబడగానే పుష్పక విమానంలోని పుణ్యాత్మలన్నీ ముక్తకంఠంతో 'అమ్మయ్య'
అనుకున్నాయి. మన్వంతరాల తరబడి విమానంలో దిగబడిపోయిన పుణ్యాత్మలంతా ఇహనైనా తమకు విమాన
విమోచనం ప్రాప్తించబోతున్నందుకు పరమానందంతో గంతులేశాయి.
***
పున్నారావు
యమధర్మరాజుగారి ముందుకు రాగానే చిత్రగుప్తుడు చిట్టా తీశాడు. పై నుంచి కిందికి పుట
నంతా భూతద్దాల కింద నుంచి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తృప్తిగా తల ఆడించి 'ప్రభూ! ఇతగాడిని నిస్సందేహంగా
పుష్పక విమానం ఎక్కించేయచ్చు. చిత్తగింజండి!' అంటూ పుట నొక్క
సారి ప్రభువులవారికి అందించారు.
యమధర్మరాజులూ
ఎంతో రిలీఫ్ ఫీలయ్యారు. చివరాఖరుకు 'వందో పుణ్యాత్మ' లభించినందుకు ఆయనకు అపరిమితమైన
ఆనందం కలిగింది. విమానంలోని పుణ్యాత్మలూ తృప్తిగా సర్దుకుని కూర్చుని ప్రయాణానికి
సంసిద్ధమైపోయాయి. పున్నారావు పెట్టే బేడా సర్దుకుని (కొత్త నిబందనల ప్రకారం భూలోకంలో
కూడబెట్టిన ఆస్తిపాస్తుల్లో ఒక శాతం వెంట తెచ్చుకునే కొత్త సౌకర్యం ఆత్మలకిప్పుడు
దఖలు పడింది) గర్వంగా విమానం వేపుకేసి బైలుదేరేందుకు సిద్ధమయాడు. పైలెట్ కింకరుడు
కాక్ పిట్ లో కూర్చుని చివరి నిమిషం ఏర్పాట్లవీ పూర్తిచేశాడు. ఇంజన్ స్టార్ట్ చేసి ఇహ యమధర్మరాజుగారి
ఆఖరి మౌఖిక ఆదేశమొక్కటే తరువాయ అన్నట్లు సన్నివేశం క్లైమాక్సు కొచ్చిన సందట్లో...
***
'మ్యావ్ఁ' మంటూ అరుస్తో ఎక్కడి నుంచొచ్చిందో.. ఓ గండు పిల్లి పున్నారావు ఆత్మ గుండు మీద కొచ్చిపడింది అకస్మాత్తుగా. పిల్లి మీద పడగానే పున్నారావు గుండె
గతుక్కుమంది. ఉద్రేకమాపుకోలేకపోయాడు. పక్కనే ఉన్న కింకరుడి చేతిలోని ఈటె లాక్కుని
పిల్లి వెంటపడ్డాడు. పిల్లి అంటే పున్నారావుకు అంతలావు అసహ్యం.. జుగుప్స!
'ఎక్కడికైనా బయలుదేరినప్పుడు పిల్లి గాని ఎదురయితే ఆ పని ఇంకావేళ దుంపనాశనమయినట్లే లెక్క' అంటూ చిన్నప్పటి బట్టి ఆయన
నాయనమ్మ నూరి పోసిన ఉద్బోధ ఫలితం! పెద్దయిన తరువాత కూడా ఆ ప్రభావం జిడ్డు అతగాడిని అంబాజీపేట ఆవదంలా వదిలిపెట్టింది కాదు. చచ్చి పైకొచ్చిన తరువాతా అతగాడి ఆత్మను 'పిల్లి
ఫోబియా' వదిలిపెట్టలేదనడానికి .. ఇదిగో ఇప్పుడు పున్నారావు
ప్రదర్శించే విచిత్రమైన మనస్తత్వమే ప్రత్యక్ష సాక్ష్యం.
శరీరాన్ని
వదిలి వేసిన ఆత్మకు ఏ వికారాలు ఉండవంటారు. మరి
పున్నారావు ప్రవర్తనకు అర్థమేంటి?
యమధర్మరాజుగారికి
మతిపోయినట్లయిందీ సంఘటన చూసి. 'మధ్యలో ఈ మార్జాల
పితలాటకం ఏమిటి మహాశయా?' అన్నట్లు చిత్రగుప్తుల వైపు గుడ్లురిమి చూశారు యమధర్మరాజుగారు.
చిత్రగుప్తుడూ యమ కంగారుతో గబగబా చిట్టా తిరగేశాడు. 'చిత్రం మహాప్రభో! ఈ
పిల్లి కూడా చచ్చి ఇక్కడి కొచ్చిన మరో ఆత్మే! పున్నారావు తరువాత విచారించవలసిందీ ఆత్మనే. పిలవక ముందే ఎందుకు హాజరయిందో మరి.. అర్థమవడం లేదు!'అన్నాడు మిణుకు మిణుకు చూస్తూ. పిల్లి వైపు గుడ్లెర్రచేసి చూశారు యమధర్మరాజు.
'క్షమించండి మహాప్రభో! మీ సమక్షంలోనే న్యాయానికి ఘోర పరాజయం జరుగుతుంటే
చూస్తూ గమ్మునండలేకపోయాను. తొందరపడక తప్పిందికాదు' మ్యావ్( అంది పిల్లి పిల్లిభాషలో.
యమధర్మరాజులవారికి అన్ని భాషలూ కరతలామలకం. కనక ఇబ్బంది లేకపోయింది.
'వివరంగా చెప్పు' అని ఉరిమిచూశారాయన.
పిల్లి
తన గోడు చెప్పుకోడం మొదలుపెట్టింది. 'రోజూ లాగే ఆ రోజూ నేను పెందలాడే
నిద్ర లేచి ఎలుకల వేటకని బైలుదేరాను మహాప్రభో! వాకిట్లోనే ఈ పున్నారావు మహాశయుడు ఎదురయ్యాడు. 'చచ్చాంరా! ఇవాళేదో మూడింది నాకు.' అని భయపడ్డాను. పొద్దున్నే లేచి ఈ పున్నారావులాంటి
త్రాష్టులను చూస్తే మన కారోజు అన్నీ కష్టాలే!' అని మా అమ్మ
చెప్పేది నాకు. ముందు నేను నమ్మలేదు, కానీ,
రెండు మూడు దృష్టాంతాల తరువాత నమ్మక తప్పింది కాదు. ఈ మహానుభావుడు ఎదురయిన రోజున నాకు సరయిన ఆహారమైనా దొరికేది కాదు. లేకపోతే కుక్కల బారినన్నా పడేదాన్ని ఖాయంగా. అందుకని
వీలయినంత వరకు ఈ పెద్దమనిషి ఎదురు అవకుండా తప్పించుకుని తిరిగడం అభ్యాసం చేసుకున్నాను. కానీ, ఆ రోజు నా ఖర్మ కాలింది. ఒక పొగరుబోతు ఎలుక వెంటబడిపోతూ పొరపాటున ఈ మనిషికి ఎదురొచ్చేశాను.
వెనక్కు
తిరిగి వెళ్లిపొదామనుకునే లోపలే నా వెన్ను మీద ఇంత పెద్ద ఇనుపరాడ్ తో బాదాడు ఈ కిరాతకుడు. అది తగలరాని చోట తగిలి చాలా రోజులు విలవిలాకొట్టుకుంటూ .. చివరకు..
ఇదిగో ఇప్పటికి ఇక్కడ ఇలా తేలాను.. తమ సమ్ముఖంలో విచారణ ఎదుర్కోవడానికి. చూశారుగా! తమరి సమక్షంలోనే ఈ రాక్షసుడు
ఎంత అమానుషంగా ప్రవర్తించాడో! అభం శుభం తెలియని నన్ను, నా
మానాన నా పనేదో నేను చేసుకుపోయే జంతువును.. నిష్కారణంగా
నిర్దయగా చంపిన పున్నారావును ఎక్కడ పుణ్యాత్మ కింద లెక్కేసి విమానం ఎక్కించేస్తారో అన్న కంగారులో ఆవేశపడి మీ ముందుకు దూకేశాను. క్షమించండి!' అని మ్యావ్ మంది పిల్లి.
యమధర్మరాజుగారు
ఆలోచనలో పడ్డారు.
పుష్పకవిమానం
ఇంజన్ రొద పెడుతోందవతల. ఆపమన్నాడాయన.
ఒకసారి స్వర్గం ల్యాండ్ టచ్
చేస్తే గానీ ఈ ఇంజన్ ఇక ఆగదు మహాప్రభో! ఇదీ ఈ విమానం లేటెస్ట్ మోడల్ ప్రత్యేకత'
అంటూ తన నిస్సహాయతను వెల్లడించాడా పుష్పకం
నడపాల్సిన పైలెట్ కింకరుడు. వందో సీటు నిండితే గాని
వాయువాహనానికి ఎగిరే యోగం లేదు. చూస్తూ చూస్తూ పున్నారావును
విమానం ఎక్కించ బుద్ధేయడంలేదు దర్మవర్తికి. పిల్లి కథ విన్న తరువాత ఆయన మనసు పూర్తిగా మళ్లిపోయింది.
'ఇప్పుడేంటి దారి మరి?' అన్నట్లు చిత్రగుప్తుడి దిక్కు మిణుకు
మిణుకు చూశారాయన.
'నిందితుడి తరుఫు వాదనా విందాం మహాప్రభో! అదే న్యాయం కదా మన రాజ్యాంగం ప్రకరాం!' అని విన్నవించుకున్నాడు చిత్రగుప్తుడు.
పున్నారావు
పిల్లి చెప్పిన ఉదంతం మననం చేసుకునే ప్రయత్నం చేశాడు.
ఆ
రోజూ ఎప్పటిలానే తాను ఆఫీసుకు బైలుదేరుతున్నాడు. ఈ దిక్కుమాలిన పిల్లే కాబోలు నా పనంతా సర్వనాశనం చేసేందుకు ఆ రోజు నాకు ఎదురుగా తయారైంది. బామ్మ చెప్పినట్లే ఇంటి
నుంచి బైలుదేరినప్పుడు పిల్లి గాని ఎదురయిన రోజున పనులన్నీ సర్వనాశనమవడం ఖాయం. మూఢ నమ్మకం కింద కొట్టిపారేసేందుకు లేదు. ఒక సారైతే సరే.. ప్రతీ సారీ పిల్లి శకునం నిజం కావడంతో పిల్లి భయం
నుంచి బైటపడలేకపోయాడు తను.
ఆ
రోజు ఆఫీసులో తనకు ఒక పెద్ద పార్టీతో ఫైనల్ డీలింగ్ ఉంది. దాదాపు లక్ష రూపాయల వ్యవహారం.
సవ్యంగా సాగితే ముడుపు చెల్లిస్తానని దేవుడిక్కూడా మొక్కుకుని మంచి
ముహూర్తం చూసుకుని ఇల్లు దాటి కాలు బైటపెట్టాడు తను.ఎన్ని
జాగ్రత్తలు తీసుకున్నప్పటికి గడప దాటి కాలు బైటపెట్టేవేళకు ఎక్కడ నుంచి తగలడిందో.. ఈ శనిగ్రహం పిల్లి సరిగ్గా గుమ్మం ముందు నిలబడి మిర్రి మిర్రి చూస్తోంది
తన వంకే. కోపం పట్టపగ్గాలు తెంచుకోదా మరి ఎంతటి శాంతపరుడికైనా అట్లాంటి క్షణాలలో! అందుకే అందుబాటులో ఉన్న ఇనప
రాడ్ తో వెనక్కి తిరిగి అది వెళ్లిపోతున్నా కసి ఆపుకోలేక దాని నడ్డి మీద శక్తినంతా కూడదీసుకుని ఒకట్రెండు గట్టిగా వడ్డించుకున్నది. ఆ దెబ్బలకే ఇది చచ్చి ఇక్కడకు వచ్చి విచారణ కోసమై ఎదురుచూస్తున్నదన్న విషయం తనకెలా తెలుస్తుంది? ఎప్పుడో మర్చిపోయిన సిల్లీ పిల్లీ ఇన్సిడెంట్ ఇది. సరిగ్గా విచారణ పూర్తయి
స్వర్గానికి వెళ్లే పుష్పకం ఎక్కేందుకు పర్మిషన్ వచ్చే చివరి క్షణంలో ఇట్లా
వెనక నుంచి వచ్చి హఠాత్తుగా మీద తన మీద పడేసరికి యమధర్మారాజుగారి ముందే మళ్లీ తన పాత
ప్రవర్తన బైటపెట్టుకున్నాడు! పిల్లి రంగ ప్రవేశంతో ఇక్కడా మళ్లీ ఎప్పటిలానే పని
సర్వనాశనం!. ఇహ తనకు స్వర్గలోక ప్రాప్తి హుళక్కి- అన్న విషయం అర్థమయిపోయింది పున్నారావుకు. మాటా మమ్తీ లేకుండా నిలబడిపోయాడు దర్మరాజుగారి సమక్షంలో.
రెండు
నిమిషాలు గడచినా పున్నారావు నుంచి తగిన సంజాయిషీ రాకపోయేసరికి మౌనం అర్థాంగీకారంగా
తీసేసుకున్నారు యమధర్మరాజుగారు.
'చుస్తూ చూస్తూ ఒక కిరాతకుడిని స్వర్గానికి పంపించడం ఎట్లా? పైలట్ అవతల ఒహటే గత్తర పెట్టేస్తున్నాడు. ఇంజను ఆపటం
దానిని పుట్టించిన విశ్వకర్మ తరమే కానప్పుడు ఇహ కేవలం ధర్మాధర్మ విచక్షణాధికారాలు
మాత్రమే కలిగిన తన వల్ల ఎలా అవుతుంది? వందో పుణ్యాత్మను
గాలించి పట్టుకునే దాకా ఈ రొద ఇలాగే సాగితే త్రిమూర్తులకు తను ఏమని సమాధానం
చెప్పుకోవాలి? విమానంలోని ఆత్మలు పెట్టే ఘోషకు పిచ్చెత్తిపోయేటట్లుంది
అంత లావు ధర్మమూర్తికి కూడా!
ఇన్ని యుగాల విధినిర్వహణలో ఇంత ధర్మసంకటం ఎన్నడూ ఎదురయింది కాదు! దిగాలుగా ఆయన
సింహాసనానికి అతుక్కుపోయి కూర్చోనుండగా.. వందో పుణ్యాత్మ కోసమై చిత్రగుప్తులవారు చిట్టా మొత్తం తెగ గాలించేస్తున్నారు మహా అయాసపడిపోతూ.
అయిదు నిమిషాల పాటు ఆ మహాగ్రంథాన్ని అటూ ఇటూ తిరగేసి ఆఖరులో 'హుర్రేఁ!'అంటూ ఓ వెర్రి కేక వేసేశారు చిత్రగుప్తులు.
నివ్వెరపోయి చూస్తున్న
ప్రభువులవారి ముందు అమాంతం ఆ గ్రంథరాజాన్ని అలాగే ఎత్తి ముందు పెట్టి ఓ పుట వేలుతో
చూపించారు.
అదీ
పున్నారావు పాపపుణ్యాల పేజీనే!
ఒక్క
క్షణం పాటు దాని వంక ఆసాంతం పరికించి చిరునవ్వుతో మార్జాలం వంక తిరిగి 'మార్జాలమా! ఎగిరివెళ్ళి వెంటనే ఆ విమానంలో
కూర్చోమని మా ఆజ్ఞ!' అని ఆదేశించారు యమధర్మరాజు.
మ్యావ్ మంటూ పిల్లి విమానంలోకి గెంతటం, మరుక్షణంలోనే పుష్పకమూ గాలిలోకి లేవడమూ జరిగిపోయాయి! పుణ్యాత్మలంతా సంతోషంతో కేరింతలు కొడుతుండగా పుష్పక విమానం స్వర్గధామం వైపు దూసుకుపోయింది.
కనుమరుగయిపోయిన విమానం వంక చూస్తూ పున్నారావు ఖిన్నుడయాడు. తనకు దక్కవలసిన స్వర్గవాసం చివరి నిముషంలో పిల్లి కొట్టేసింది. అయినా.. తన పాపపుణ్యాల పేజీ చూసి పిల్లి పుణ్యాన్ని నిర్దారించడం ఏమిటి? .. వింతగా ఉంది!
'యుగాలబట్టీ సమవర్తిగా కీర్తి గడించిన యమధర్మరాజులవారు నా విషయంలో సవ్యమైన తీర్పు చెప్పలేదనిపిస్తోంది!'
అంటూ ప్రొటెస్టుకు దిగాడు పున్నారావు.
'మానవా! ఇది మీ భూలోకం కాదు. ఇక్కడ నీవు పనిచేసిన
ప్రభుత్వాఫీసులలో మాదిరి అపసవ్యంగా పనులు సాగవు. ఇది
యమధర్మరాజులవారి న్యాయస్థానం. న్యాయం ఏ మూలన పిసరంతున్నా పసిగట్టి
దానికి ధర్మం చేయడమే యుగాలుగా మేం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ధర్మకార్యం'
అన్నాడు చిత్రగుప్తులవారు సమవర్తి తరుఫున వకాల్తా పుచ్చుకుని.
'నాకు దక్కవలసిన స్వర్గం సీటును బోడి పిల్లికి ఎందుకు ధారాదత్తం చేసినట్లు వివరం సెలవిప్పించగలరా?'
తెగించి అడిగాడు పున్నారావు.
'నువ్వు నిందవేసినట్లు ఇది 'బోడి'పిల్లి కాదు పున్నారావ్! నీ మర్యాద మంట కలవకుండా ఎంతో కాలంగా నిన్ను కాపాడిన నీ ఇంటి దేవత' అన్నాడు చిత్రగుప్తుడు.
'అదెలాగా?!' ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టడం
పున్నారావు వంతయిందిప్పుడు.
'ఆ రోజు నువ్వు ఆఫీసుకు బైలుదేరిపోతున్నప్పుడు ఎదురైందన్న కోపంతో పిల్లిని చావగొట్టటం
ఒక్కటే కాదు.. మరో ఘనకార్యం కూడా చేశావు. నీకు గుర్తుందా?'
'లేకేం! ఇహ ఆ రోజు పని తలపెడితే దుంపనాశనం అవుతుందన్న భయంతో ఆఫీసుకు డుమ్మా
కొట్టి ఇంటి పట్టున ముసుగేసుకు పడుకుండిపోయాను. అయితే..'
'అ రోజే సిబిఐ వాళ్లు నీవు పని
చేసే ఆఫీసు మీద దాడి చేశారు పున్నారావ్! నువ్వు గాని సీటులో ఉండుంటే ఏమయివుండేదో తెలుసుగా? నీ పార్టీతో నువ్వు
కుదుర్చుకున్న బేరసారాల భారీ మనీతో సహా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా
పట్టుపడుండేవాడివి. మీ నాయన చేసిన ఇట్లాంటి పరువుతక్కువ
పనికే మీ అమ్మ నీ చిన్నతనంలో చెరువులో పడి ప్రాణాలు తీసుకుంది. నీ భార్యకూ అలాగే ఏ గ్యాస్ సిలెండర్ గతో పట్టించకుండా 'పిల్లి మీద నీకు ఉండే
పనికిమాలిన మూఢనమ్మకం' నిన్ను కాపాడిందయ్యా పున్నారావ్!
నీ పసిబిడ్డలు తల్లిలేని బిడ్దలుగా జీవితాంతం
బాధలు పడకుండా కాపాడిన పిల్లి పుణ్యాత్మురాలా? ఉత్తి పుణ్యానికి ఒక జంతువును పొట్టన పెట్టుకుని ఎన్నో పిల్లిపిల్లలను
తల్లిలేని పిల్లలుగా మార్చిన నువ్వు పుణ్యాత్ముడివా? ..
ఇప్పుడు చెప్పు! ఎవరికి పుష్పకంలో
ఎక్కే అధికారం ఎక్కువగా ఉంది?' అని ముగించాడు
చిత్రగుప్తులవారు.
"శకునం
వంకతో నిష్కారణంగా ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నందుకుగాను నీకు నరకమే గతి!.. నెక్స్ట్' అని హూంకరించారు యమధర్మరాజుగారు
పున్నారావుకు మరో మొండి వాదన లేవదీసేందుకు అవకాశం ఇవ్వకుండా!
పున్నారావును
కాలుతున్న ఇనుప స్తంభానికి కట్టేస్తూ 'వచ్చే జన్మలో అయినా ఈ పిచ్చి పిచ్చి
శకునాలు.. అవీ మానేస్తావనుకుంటా జీవా!' అన్నాడు
యమకింకరుడు వెటకారంగా నవ్వుతూ.
'ఎట్లా మానడం కింకరా? విమానం ఎక్కి స్వర్గానికి
పోవాల్సిన రాత దిక్కుమాలిన పిల్లి తగలడ్డం
మూలానే కదా ఇట్లా కాలే కాలే ఇనప స్తంభాలని కావలించుకోనే గతికి తెచ్చిందీ!' అన్నాడు పున్నారావు కసి కసిగా!
***
-కర్లపాలెం
హనుమంతరావు
(ఈనాడు
ఆదివారం అనుబంధం, 1, డిసెంబర్ 2002 ప్రచురితం)