Saturday, February 20, 2021

తియ్యండిరా బళ్లు- సరదా వ్యాఖ్య -కర్లపాలెం హనుమంతరావు

 


'తియ్యండిరా బళ్లు' అని అరవందే  విలన్ పాత్రకు   న్యాయం జరిగినట్లు కాదు తెలుగు యాక్షన్ సినిమాలో!ఇవాళ ఆ బళ్లు బైటికి తియ్యడం నిన్నటి కన్నా ఖరీదైన వ్యవహారం. తొమ్మిది రోజుల కిందట కాని ఈ బళ్ల సన్నివేశం జరిగివుండుంటే పాపం, ప్రతినాయకుడి కాతాలో ఒక్కో బండికి లీటరు పెట్రోలు  ఐదు రూపాయలు,  డీజిల్ నాలుగు రూపాయల ఎనభైఏడు పైసలు ఆదా అయేది. విలన్ అంటే నలుగుర్ని తన్నో, బెదిరించో వసూలు చేసేది కాబట్టి అతగాడి సొమ్మేం పోయేది కాదు.  సగటు పౌరుడికయితే నడ్డి  విరగుడు ఖాయం. గతుకుల రోడ్ల మీద ప్రయాణాలతోనే కాదు సుమా, మన దేశంలో సామాన్యుడి నడ్డి విరగడంలో అసాధారణమైన పాత్ర చమురు ధరలకే ఎక్కువ.'పెరుగుట విరుగుట కొరకే' అనే మెట్ట సిద్ధాంతం మెరక మీద  మెత్తటి బెంజి బళ్లలో  నిత్యం ప్రయాణం చేసే సౌకర్యం ఉన్న దొడ్డప్రబువులకే! గంజి తాగే జీవైనా సరే ప్రయాణాలకు బస్సులు, షేర్ ఆటోలూ వాడక తప్పదు కనక ధరల పెనుభారంలో వాడి వాటా కూడా ఉన్నట్లే!కోవిద్ పంథొమ్మిది వ్యాప్తి కోసం కృషిచేసే కరోనా వైరస్ కథలానే మన దేశంలో చమురు ధరల పెరుగుదల మూల రూపమూ ఒక పట్టాన అంతుపట్టదు. ముడి సరుకు ధరలని ఒకసారి, శుద్ధి చేసే ఖర్చులకని మరోసారి, అమ్మకంలో కంపెనీల వాటాలు ఆటి రావడం లేదని ఇంకోసారి.. ఇట్లా ఏదో ఒక పాము వైకుంఠపాళి ఆటలో  సగటు మనిషి బతుకుతో పేకాడుతూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా తాళాలేసేసాం.. ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండండి అన్నాయా ప్రభుత్వాలన్నీ! పోనీలే పెట్రోలు ఖర్చన్నా కలిసొస్తుందన్న మురుసుకున్నంత సేపు పట్టలేదు! అట్లా గొళ్లాలు తీసీ తియ్యంగానే ఇట్లా పెట్రోలు, డీజిళ్ల బాదుళ్లు మొదలైపొయ్యాయ్! వేతనాలకు కోత పెట్టండని తాకీదులు పంపించిన పెద్దలది చమురు ధరల జిడ్డు దగ్గర.. అంతర్జాతీయం.. అనుసంధానం అంటూ ఎప్పుటి రోటిపాటే! ఉద్యోగాలు పీకేయడంలో కనిపించిన ఉత్సాహం, ఉద్దీపనలప్పుడు ఎట్లాగూ చప్పడిపోయింది. కష్టకాలం కదా..  పోనీ తమ ఎక్సైజ్, వ్యాట్ పన్నుల వాటాలైనా ఉదారంగా కాస్తింత వదులుకున్నాయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు? 

మందు తాగబోయండని ఆందోళన చేసినప్పుడు లేని డబ్బు వృథా మేటర్ ..  బళ్లకు చమురు పోసే వేళనే  గుర్తుకొస్తుందా? అని వేళాకోళానికి దిగితే మొహం వేళాడేయాల్సిందే పౌరసమాజం. యథా ప్రజా తథా రాజా! ముఖ్యంగా వృథా ఖర్చుల్లో!

ముడి చమురు ధర పడిపోయినా, పన్నులు ధాటిగా నిలబడే ఉండటం మన దేశం ప్రత్యేకత. జనవరిలో బారెల్ ధర దారుణంగా దిగివచ్చిందన్నారు. అయినా పన్నులు మొండిబుద్ధే చూపించాయ్! ఇప్పుడు పెట్రోలు మూల ధర మీద  పన్ను శాతం దాదాపు 254- అని కేర్ రేటింగ్స్ పరిశోధనలు  హెచ్చరిస్తున్నాయ్! అయినా 'డోంట్ కేర్' మూడ్ లోనే ఉన్నాయ్ ప్రజలెన్నుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు!  ధరల పెరుగుదలలో పన్నులదే సింహభాగం పాపం. 

పాపం ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయ్! ఇంధనం పన్నులు పెంచినందు వల్ల  ధరలు తగ్గినప్పుడు జనాలు చేసే వృథా ఖర్చులకు కళ్లెమేసే బాధ్యత దేవుడి కొదిలేయలేవు  కదా!లాక్ డౌన్ మూలకంగా లాభం కుదేలయిన వర్గాలలో ప్రభుత్వాలదే పెద్దపీట. ఎనభై రెండు రోజులు ఉగ్గబట్టుకునుండటమే పన్నుల శాఖలో పెద్ద రికార్డు.  ఇంధనం మీద పన్నుల రూపంలో వచ్చే ధనమే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం. ఘరానాగా చెప్పుకునే ఖజానా లెక్కల్లో చమురు పన్ను లెక్కలు కోసేస్తే ప్రభుత్వాలకు మిగిలేది జానా బెత్తెడు ఆదాయం.

బార్ లో  మందంటే వీజీగా బుర్రకెక్కుతుంది. కానీ ఈ బారెల్స్.. డాలర్స్, ప్రపంచ ధరల సూచిక, వినియోగదారుల ధరల సూచిక, ద్రవ్యోల్బణంలాంటి తకరాలు  జనాల తలలకేమెక్కేను? అదీ ధీమా!  మందు బాబులతో పోటికి దిగినట్లు బళ్లువాడేవాళ్లూ  చమురు ధర క్రతువులో మూడొంతులు పన్నుల రూపంలో సమిధలు సమర్పించుకుంటున్నారు.  డాలరు కన్నా రూపాయి కండపడితే తప్ప ఈ చిల్లర ధరలతో సామాన్యుడు కుస్తీపట్టలేడు. 

పెట్రోలు నీళ్లలా వాడే దేశాలలో మనం ముందున్నట్లు ఒబామా హయాం నుంచి ఓ అభియోగం ఎటూ  ఉంది. పోనీ ఆ పరిస్థితుల్లో అయినా మార్పు తెచ్చే ప్రయాస కనిపిస్తుందా? ప్రొటోకాల్ పేరుతో గల్లీ నేతగారి   ముందూ వెనకా సాగే కార్ల దండు రిపబ్లిక్ పెరేడ్ వందన సమర్పణ గుర్తుకుతెస్తుంది! పన్ను దెబ్బ సామాన్యుడి మీద ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగా అంతకు మించి ఎన్నో రెట్లు. రావాణా ఛార్జీల నిర్వహణ వంకతో శవాలు తరలించే మహాప్రస్థానం సైతం పన్నులు వసూలు చేసే రోజులు ఆట్టే దూరంలో లేవేమో కూడాను. 

ఆదాయం రాబట్టటమా,  ద్రవ్యోల్బణం పెరుగుతుంటే గుడ్లప్పగించి చూడడమా?  నింద పడితే పడ్డది లెమ్మని అందుకే ప్రభుత్వాలెప్పుడు పన్నులు బాదే బాధాకరమైన బాధ్యత దేవుడి కొదిలేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోనిది.  

***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...