Saturday, February 20, 2021

వచన కవిత- ఒక అలోచన - కర్లపాలెం హనుమంతరావు -సాహిత్య వ్యాసం

 


వచన కవిత్వం నేటి కవితాప్రక్రియ.  గణబద్ధమైన వృత్తాలు, మాత్రాబద్ధమైన గేయాల తదనంతర వికాసపరిణామం వచన కవిత.

ఈనాటి కవి తన భావాలను విస్తృతంగా జనసామన్యంలోకి తీసుకుని వెళ్ళే మార్గం వచన కవితా రూపమే. విషయం ప్రాచీన మైనదైనా సరే  సాంప్రదాయక ప్రక్రియల్లో(పద్యాలు వంటివి) చేబితే సామాన్యుడిదాకా చేరే అవకాశం తక్కువ ఈ కాలంలో.  ప్రాచుర్యమున్న పత్రికల్లో సైతం పౌరాణిక విశేషాలూ వచనకవితా రూపాల్లోనే కనిపించడానికి కారణం ఇదే.

 

వచన కవిత్వానికి ప్రాభవం ఎలా వచ్చింది? వట్టి చందోపరిణామ క్రమంగానే దీన్ని అర్థం చేసుకోవాలా? సాంఘిక, భౌతిక కారణాలూ తోడయ్యాయా? ప్రశ్నలను తరచి చూస్తే  వచనకవిత్వం మీద ఒక సదవగాహన ఏర్పడే అవకాశం ఉంది.

 

ఆంగ్లంలోని Free Verse.. ఫ్రెంచిలోని Verse Libre నుంచి ప్రభావితమైన ప్రక్రియగా తెలుగు వచనకవిత్వాన్ని భావించవచ్చు. చందోనియమ రహితంగా, సాంప్రదాయక శృంఖలాలను తెంచుకుని హృదయం ఎలా కంపిస్తే అలా వ్యక్తీకరించే సౌలభ్యాన్ని మనం వచనకవిత తత్వంగా చూడవచ్చు.ఈ ప్రక్రియలో  అక్షరగణబద్ధత, మాత్రాగణ బద్ధతలాంటి బంధాలు లేవు. భావాన్ననుసరించే పాదాలు, పదాలు. వృత్తాల కట్టడినుంచి స్వేచ్చకోరి గేయం పుట్టింది. గేయానికీ మాత్రా చందస్సు సంకెళ్ళు తప్పలేదు. వాటినుంచీ  విముక్తి కోరుకున్న కవికి వచనకవిత ఒక అందివచ్చిన అవకాశంగా కనిపిస్తుంది.  వాడుక భాష వ్యాకరణంలోనే ఒదుగుతూ ఒక రకమైన సహజ లయాసౌందర్యం(sequence musical phrase)తో సాగే రూపంగా వచన కవిత స్థిరపడింది. అత్యంత స్వేచ్చగా వ్యక్తీకరణ సాగాలనే తపన నుంచే వచన కవిత వికసించింది.  అనుభూతిని ఏ అలంకారాల తొడుగులు లేకుండా యధాతధంగా వ్యక్తీకరించాలని ఆధునిక కవుల దుగ్ధ. ప్రాచీన సంప్రదాయాలైన అలంకారాలూ, కవిసమయాలూ,కల్పనలూ కవి స్వేచ్చకు అడ్డొచ్చే ఏడువారాల నగలబరువని నవీనుల భావన. సహజసుందర శోభితంగా కవిత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలన్న ఆధునిక కవి ఆకాంక్ష "నా వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో పద్యాల నడుములు విరగదంతాను…చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను"అన్నపఠాభి  ప్రకటనలో ప్రతిద్వనిస్తుంటుంది.  నవీనకవి కవిత్వ పంథా అంతా ఈ పునాదుల మీదే ప్రస్తుతం మరింత బలంగా ముందుకు సాగుతోంది .

 విశృంఖల స్వేచ్చా కాంక్ష బూర్జువా సంస్కృతి ఒక లక్షణం. ఉత్పత్తిశక్తుల ప్రాభవం పెరిగి స్వేచ్చా వ్యాపారం కోసం చేసే నిరంతర ప్రయత్నం- సమాజాన్నీ, కళలనీ, సంస్కృతీ సాహిత్యాలనీ సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావానికి లోనయ్యే వ్యక్తిగా బూర్జువాస్వేచ్చను కోరుకుంటాడు. కవిగా మునుపటి ఆంక్షలను సహించలేడు. ఈ పరిణామక్రమం నేపథ్యంలోనే కవిత్వం వచనరూపం సంతరించుకుంది. "The final movement towards 'free verse' reflects the final anarchic bourgeois attempt to abandon all social relations in a blind negation of them, because man has completely lost control of his social relationship" అనికదా అంటాడు కాడ్వెల్ Illusion and Reality లో.

  చందస్సులను, ఆలంకారిక మర్యాదలను మన్నించక పోయినావచనకవిత ఏక మొత్తంగా భాషా నియమాలనే కాలదన్నేటంత చొరవ చూపించటానికీ ఇష్టపడదు.  సహజసుందరమైన ఆలంకారికనియమాలమీది మోజును వదిలించుకోవడం మౌలికంగా సౌందర్యప్రియుడైన కవికి అంత సులభమైన పని కాదు. వచన కవిత్వం అంటేనే 'contradiction in terms' అని కదా అంటాడు శ్రీశ్రీ! వచనం మీరితే కవిత్వం పల్చబడుతుంది.స్థాయి దాటితే కవిత్వం  వచనం చేయి దాటిపోతుంది. free verse అన్న పదాన్నే ఏకమొత్తంగా ఇలియట్ తప్పుబట్టింది ఇందుకే.

నియమరహితంగా ఉండాలనే కోరిక తప్పించి రూపరహితంగా, శబ్దమాధుర్య రహితంగా ఉండాలని వచనకవీ కోరుకోవడం లేదు.బూర్జువా సమాజంలో ఉండే వైరుధ్యాలని  వచన కవితా ప్రతిబింబిస్తుంది.  సాంఘిక పరిణామ లక్షణాలకు  వైయక్తికంగా ఎదురీదడం ఎంత శక్తివంతుడికీ సాధ్యమయే పని కాదు.

సాంఘిక పురోగమనంలో భాగంగా విలసిల్లే సంస్కృతిలో ఆర్థిక సాంఘిక కారణాల మిశ్రమ ప్రభావంతో కొన్ని కొన్ని సాహిత్య, కళాప్రక్రియలు ఆధిపత్యం వహించడం చారిత్రక సత్యం. ప్రజాసామాన్యం అభిరుచులకన్నా అధికంగా కళాకారుల వ్యక్తిగత ప్రతిభావ్యుత్పత్తులు  కళారూపాల ఆధిపత్యాన్ని ప్రభావితం చేయలేవు. విశ్వనాథ వారు అన్నేళ్ళు శ్రమించి రామాయణ కల్పవృక్షం రాసినానాడు ప్రాచుర్యంలో ఉన్న నవలా ప్రక్రియ వల్లే జనసామాన్యంలో గుర్తింపు సాధించారని గమనించాలి.   శ్రీశ్రీని యుగకర్తగా చేసింది ఆ మహాకవి కాలానికనుగుణమైన కవిత్వపంథాను అభ్యుదయపంథాలో ముందుకు తీసుకువెళ్ళడం వల్లే.

సాంప్రదాయక కవితారీతులలో ఎన్ని గొప్ప విశేషాలున్నా

సమకాలీన సాంఘికావసరాలను సంపూర్ణంగా సంతృప్తి పరచలేవు.ఆ ప్రక్రియల్లో అత్యంత ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించినా ప్రజాబాహుళ్యానికి అవి చేరవు. తన సృజన వీలయినంతమందికి చేరాలనుకుంటాడు కళాకారుడు. ఈ కారణాలవల్లే ఈనాటి కవికి  తప్పక అనుసరించాల్సిన మార్గం వచన కవితాప్రక్రియ ఐకూర్చుంది.

  వచనకవితలో కుడా ఎన్నో గుణాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. కె.శ్రీనివాస్  అనుసరించే మార్గం కుందుర్తివారి శైలినుంచీ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినది. అఫ్సర్ తాజాగా వాడుతున్న వ్యక్తీకరణలు  తనే ఒకనాడు వాడినవాటినుంచీ అభివృద్ధి పరిచినవి. ఒకనాడు పద్యం రాసిన వాళ్ళందరూ ప్రతిభావంతులు కానట్లే.. ఇప్పుడు వచనకవిత రాస్తున్నవాళ్ళందరూ ఆకవిత్వరహస్యాన్ని వంటబట్టించుకున్నారని చెప్పలేం. ఏ నిబంధనలూ లేని వచనకవిత్వం రాయడం బహుసులువు అని చాలామంది భ్రమ. నిజానికి వచనకవితలో కవిత్వాన్ని పండించి మెప్పించడమే కత్తిమీద సాము. బ్రేకులు, ఏక్సిలేటరు ఉన్న బండిని నడపడం కన్నా అవేవీ లేని వాహనాన్ని అదుపుచేయడం కష్టం. చందస్సునీ, అలంకారాలనీ, శబ్దలయనీ, కల్పనా చాతుర్యాన్నీ ఆశ్రయించుకున్న సాంప్రదాయక ప్రక్రియల్లో  కవిత్వం తెరమరుగునే దోబూచులాడుతుంటుంది కనక పెద్ద ఇబ్బంది లేదు.  కేవలం కవిత్వమే కొట్టొచ్చినట్లు కనిపించి తీరాల్సిన వచనకవితల్లో కవిత్వం ప్రవహించక పొతే కవి ఎడారితనం బైటపడిపొతుంది.  వచనకవితారచన నూలుపోగుమీది నడక. ఏ మాత్రం తూలినా వట్టి వచనమయి పొతుంది.ఏ మాత్రం పొంగినా కృతకమైపోతుంది. వచనానికీ, కవిత్వానికీ మధ్య  ఉండే అతిపల్చని గీతమీదే కవితాత్మను చివరివరకూ నడిపిండానికి కవి చేయాల్సిన రసకసరత్తు సామాన్యమైనది కాదు.

వచనం కచ్చితమైన అర్థాలను ప్రతిపాదించేది.కవిత్వం అస్పష్టమైన భావోద్వేగాల  అనుభూతి వాహిక. పరస్పర విరుద్ధమైన రెండుదినుసులను సమపాళ్ళలో మేళవించి రుచికరమైన కవితాపానీయం తయారుచేసే రసవిద్య- కేవలం పాండిత్యప్రకాండత్వం  ఉన్నంతమాత్రాన పట్టుబడేది కాదు. వట్టి సంగీత జ్ఞానమే  గాయకుడి రాణింపు కానట్లే కేవల భాషాధిపత్యం వచనకవిగా మలచలేదు. వచన కవిత రాయడానికి కూర్చున్న కవికి ఎక్కడ ఎంత మోతాదులొ వచనానికి  కవిత్వం తొడగాలో అర్థమవాలి. సౌందర్యవంతమైన విగ్రహానికి చేసే ఆకర్షణీయమైన అలంకరణే వచనకవిత్వరచన చేసి మెప్పించడం.  ఒకరు నేర్పిస్తే వంటబట్టేది  కాకపోవచ్చు కాని..సాధన మీద సాధించదగిన రసవిద్యే ఇది. విస్తృతాధ్యయనం, పరిశీలన, అనుభవం అవగాహను సానబట్టే సాధనాలు. 

  వచనంలో ఉండే వాక్య విన్యాస సౌలభ్యాన్ని కవిత్వావిష్కరణకు మలుచుకునే విద్య  సాధనద్వారా సాధించవచ్చు. అవ్యవహారిక పదబంధాలు,కృతక ప్రయోగాలు, తెచ్చిపెట్టుకున్న లయ ప్రయాసలు కవితాత్మను దెబ్బతీస్తాయి.

వచనం ప్రాచీన సాహిత్యంలో కూడా లేకపోలేదు.  పోతనామాత్య్డుడు  భాగవతం గజేంద్రమోక్షం ఘట్టంలో వనసౌందర్యవర్ణనకు వాడింది వచనమే.కానీ కాడ్ వెల్ భాషలో చెప్పాలంటే అదంతా ఒక heightened form of language. ఇవాళ  కవిత్వంగా మనం నిర్వచించుకునే  వచనంఆత్మను ప్రబంధపద్యాల మధ్య అతుకుగావచ్చే వచనంఆత్మతో సరిపోల్చలేము.

-కర్లపాలెం హనుమంతరావు

24 -11 -2012

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...