Tuesday, April 13, 2021

శ్రమకు తగ్గ ఫలం - వ్యంగ్యం ఈనాడు -కర్లపాలెం హనుమంతరావు

 



ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. దేశంలోనీ నూట పాతిక పై చిలుకు కోట్ల జనాభాకు ముష్టి ఏడొందల తొంభై మూడు మంది మాత్రమేనా ప్రతినిధులం! మా కన్నా తక్కువ స్థాయి పనోళ్లకి మాకు మించిన జీతభత్తేలా? మా గౌరవనీయులైన ప్రజాప్రతినిధుల  మానమర్యాదలు నిలబందుకైనా  వాళ్ల కన్నా కనీసం ఓ రూపాయన్నా ఎక్కువ జీతంగా దక్కాల్సిందే! .. ఎవరు బాబూ నువ్వు? ఎందుకు నీకా నవ్వు?

గుర్తుపట్టవులే? నీ అంతరాత్మను కద! ఎన్నికల సంఘానికి నువ్వు సమర్పించిన దొంగలెక్కల ప్రకారం చూసుకున్నా.. నీ ఒక్క పూట ఆదాయం .. ఈ దేశంలోని తెల్లకార్డువాడి ఏడాదాయనికి వందరెట్లెక్కువ! అందుకే నవ్వాగలా! ఫ్రీ బంగళా, ఉచితంగా ఫోన్ కాల్సు, నియోజకవర్గంలో తిరిగినా తిరక్కున్నా మీరు ఆఫీసు సాదర ఖర్చులకన్చెప్పి  ఏవేవో బిల్లులు పుట్టించి ఇంకెంత బొక్కుతున్నారో..  కాగ్ వాడికే నోరాడని పరిస్థితి. ఇహ విమాన ప్రయాణాలని, రైల్లో బంధుబలగానిక్కూడా ఫస్ట్ క్లాస్ సదుపాయాలని.. అవీ ఇవీ మీరు నొక్కేవన్నీ చూపిస్తూ సర్కారు బొక్కసానికి ఏటా ఎంతో కొంత బొక్కేస్తూనే ఉంటివి! ఇంకా చాల్చావడం లేదంటూ తెల్లారంగానే ఈ కొత్త ఆగమేంటి సోదరా? ఈ కరవు, కరోనాల కష్టకాలంలో  అసలు నీకు దక్కుతున్నదే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయ్! మన్లో మన మాట.. అసలుకి మీకు జీతభత్యాలెందుకు  పెంచాలి? ఒక్క కారణం చెప్పు.. నవ్వకుండా నోరు మూసుకుంటా!

ఒక్కటి కాదు.. వంద చెబుతా.. వినే ఓపిక మరి తగ్గకుండా ఉండాలి నీకే! ఈ ప్రజాప్రతినిధి వృత్తిలోకి రాక మునుపు నా సంపాదన ఎంతో నీకూ తెలుసని నాకూ తెలుసు.  మామూళ్లు, సెటిల్మెంట్లు, రింగులు గట్రా నేరుగా చేసుకునే సౌకర్యం గతంలోలా ఇప్పుడుండదుగా మరి! పనోళ్లకు సిమెంటు ఫ్యాక్టరీలున్నా పట్టించుకోని పబ్లిక్.. అదేంటో మేం ఇసుమంత ఇసుక దందాకు ప్రలోభ పడ్డా.. అదేందో మహా విసుగుదల చూపిస్తూంది! కాబట్టే ప్రభుత్వ వైద్యులకు మల్లే మాకూ నాన్ ప్రాక్టీస్ ఎలవన్సులాంటిదేదైనా భారీగా ఉండాలని డిమాండ్. ఏం తప్పా?

పాయింటేనబ్బీ!

చేంతాడంత మా ఆదాయాల లిస్టు చదవడమే నీకింట్రెస్టు.  మా ఖర్చుల పట్టికేనేడన్నా  పట్టించుకున్నావా అన్నా?  సర్కారు మార్కు ముష్టి ముగ్గురు సెక్యూరిటీ మా అక్కరకేం సరిపోతుంది చెప్పు! కాలు బైటపెడితే ఎంత హంగూ ఆర్భాటం  కావాలి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులన్న తరువాత! పెట్రోలు రేట్లు రేకెట్ల వేగంతో పోటీ పడుతున్నట్లు పబ్లిక్కే పడతిడుక్కుంటుంటిరి. సెక్యూరిటీలో ఒక్కోరికేమన్నా రెడ్ ఫెరారే కారేమన్నా కోరుకున్నామా? అక్కడికీ,  ప్రయివేట్ సైన్యం పాట్లేవో సొంతంగానే పడుతుంటిమిప్పడి దాకా! బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు, బాంబులు, బుల్లెట్లకయ్యే ఖర్చులు ఎంతని అచ్చుకోము సామీ ఈ కరవుకాలంలో! అన్నీ బైటికి చెప్పుకునే ఖర్చులే ఉంటాయా చెప్పు ప్రజా ప్రాతినిథ్యమనే తద్దినానికి తయారైం తరువాత. ఎన్నికల ప్రహసానాల మర్మం నీకూ  తెలుసు. ఎన్నెన్ని రకాల వత్తిళ్లయితే 'బూత్ గండాల' నుండి బైట పడ్డం!

 

నిజవేఁ! ఇది వరకు మాదిరి ఏదో ఓ సందు చూసుకొని సర్కారు భూముల మీద జెండాలు పాతేసే సీన్లు .. పాపం  సన్నిగిల్లాలాయ మీ ప్రజాప్రతినిధుల కిప్పుడు! దేవుడి సొమ్ము దేవుడికే తెలీకుండా మాయమైపోతుండె! ఇహ మీ వాటా కొచ్చే దెంత..  చిటికెడు బూడిద.. సింగిల్ చెవిలో పూవు!

 

ప్రభుత్వాలేమన్నా స్థిరంగా ఉండుంటే, ఆ నిబ్బరం  వేరు .. మన వాటా మన పరమయిందాకా, ఏ కేంటీంలో చాయ్ తాగుతూనో, లాబీల్లో కులాసా చేస్తూనో గడిపేయచ్చు. ఎప్పుడు ఏ బిల్లు మోషన్ కొచ్చి కొంప ముంచుతుందో.. కాల్ సెంటర్ గార్ల్ కన్నా మెలుకువ తప్పనిసరయిందిప్పటి ప్రజాప్రతినిధికి. మరి  ఆ మేరకైనా జీతభత్యాలలో మాకు  మెరకా పల్లం సరిచేయాల్నా వద్దా? లాభదాయక పదవుల్లో ఉండద్దని రూలు పెట్టగానే సరా!  ఆ వారా మాకు జరిగే నష్టం పరిహరించే  లెక్కలు  మాత్రం  చూసుకోవాలా.. లేదా?   లెక్కన చూసుకుంటే మేమిప్పుడు అడిగే  ఐదురెట్ల హెచ్చింపు పులుసులో ముక్క. అదేందో! ప్రజాప్రతినిధి అంతరాత్మవయి వుండీ పద్దాకా జనం తర్ఫున  పీకులాడే రోగం నీకు!  బొత్తిగా అప్రజాస్వామికం నీ వ్యవహారం!

 

సారీ బ్రో! నువ్వింతగా ఒప్పించిం తరువాత కూడా   మైండ్ సెట్ మారకపోతే నేనీ పోస్టుకే వేస్ట్.  మీ జీతభత్యాల పెంపు ఐదేంటీ.. ఇంకో అయిదు రెట్లు ఎక్కువున్నా  తక్కువే సుమా!

 

థేంక్స్ అంతరాత్మా! ఇప్పడికైనా దార్లో  పడ్డావ్!

 

కానైతే నాదీ ఓ చిన్న విన్నపం బ్రదర్! జీతానికి తగ్గట్లు పనీ పాటా ఉండటం సహజన్యాయం. అరవై ఏళ్ల కిందట ఏటా అరవై ఎనిమిది బిల్లులు పాసయేవి చట్టసభల్లో. ఇప్పుడో?   సంవత్సరానికి యాబై ఆమోదమయేందుకే అస్సులు.. బుస్సులు! అవీ చర్చలేవీ లేకుండానే చట్టాలైపోయే పరిస్థితులు! చట్టసభల్లో మీ ప్రజాప్రతినిధుల హాజరు మరీ చిన్నబళ్లల్లో బుడతల హాజరు కన్నా హీనంగా ఉందని జనం బెంగ.

 

అయితే ఏంటంటావ్?

 

ఎకౌంటబలిటీనే బట్టే ఎక్కౌంట్స్   సరిచేయాలంటాను. గంటకు ఇంతని హాజరు భత్యం  ఉండాలి. హాజరుపట్టీ ప్రకారమే జీతాల పట్టి తయారవ్వాలి. వాకౌట్ చేసిన రోజున  జీతం మొత్తం కట్! సభాపతి లేకుండా మాట్లాడిన పక్షంలో పదానికింతని పెనాల్టీ విధించాలి. మార్షల్స్ బలవంతంగా మోసుకుపోయే సందర్భాలలో  కిలోకింతని బాడీ బరువును బట్టి రుసుం విధించడం అవసరం. ఫలహారశాలల్లో  అనుమతి మేరకు లాగించడం వరకు ఓకే.  అదనపు మేతకు మాత్రం అధికంగా వసూలుచేసి తీరాలి. రాజకీయాల్లోకి రాక ముందూ.. వచ్చిం తరువాత ఉండే ఆదాయాలలోని వ్యత్యాసాన్ని బట్టి శిస్తులు వసూలు చేసే కొత్త విధానం తీసుకొస్తే మీ ప్రజాప్రతినిథుల నెలసరి జీతభత్యాలు ఎనిమిది లక్షలేంటి.. పద్దెనిమిది లక్షల మీద ఒక్క రూపాయి పెంచుకున్నా ఆక్షేపించేందుకు లేదు.  దట్సిట్!

 

సడి! నీ లెక్కన ఇక మాకంటూ మిగిలేదేముంది.. ఆ ఒఖ్క రూపాయి తప్ప!

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుట వ్యంగ్యం - తారీఖు నమోదు కాలేదు)



 

 

 

 

 

 

 

 

 

 

!

 

 

 

 

 

 

Monday, April 12, 2021

శ్రీరాములవారికి సాయము కావలెనా?-ఈనాడు వ్యంగ్యం – -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట వ్యంగ్యం 28 -04 -2008)

 

 

'వనవాసానంతరం శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అట్టహాసంగా జరుగుతోంది. అటూ ఇటూ తమ్ముళ్లు, వెనక వాలి కొడుకు, పక్కన సీతమ్మ, పాదాల చెంత హనుమంతయ్య- రవివర్మ బొమ్మంత అందంగా ఉన్న ఆ వింతను చూసి అంతా ఆనందిస్తూంటే, అసుంటా దూరంగా నిలబడ్డ సౌమిత్రి మాత్రం ఈ వంకో సారి చూసి వింతగా నవ్వుకున్నాడో రెప్పపాటు..
'ఎందుకు తాతయ్యా?' అనడిగాడు చిన్నా.
'చెబ్తా! ముందీ 'డాండ డడాండ డాండ..' పద్యం అప్పచెప్పు!' అన్నాడు రాంకోటి బాబాయ్.
ఆయనో రిటిర్డ్ తెలుగు టీచర్. ఇంట్లో మనవడికి రామాయణం చెబుతున్నాడు గాని, బైటెంత భారతం జరుగుతోందో ఆ పెద్దాయనకు తెలీదు.
'నాసావాళ్లు ఆకాశం నుంచి తీసిన ఈ ఫొటోలు చుశావా బాబాయ్.. అసలు రామసేతువనేదే లేదంటున్నారే!'అని రెచ్చగొట్టా.
'నీరజాక్షి కొరకై నీరథి దాటిన నీ కీర్తిని విన్నానురా' అన్నాడు గదరా త్యాగయ్య. మరి వారధి లేకపోవడమేంటీ! వెధవ డౌట్లు!'
'విన్నాను అన్నాడు గానీ కన్నాను అన్లేదుగా! ఆ కట్ట.. మనుషులు మట్టి పోసి కట్టిందని పురావస్తు సర్వే జనాల పరిశోధనల్లో కూడా తేలింది బాబాయ్!'
'ఆ సర్వే జనాలెవరో కానీ సుఖినోభవన్తు. మనుషుల కట్టయివుంటే మన పంజగుట్ట ఫ్లై ఓవర్లా ఎప్పుడో కూలుండేవి గదరా! దైవ నిర్మితం. కాబట్టే పర్మినెంటుగా అట్లా పడుంది పిచ్చోడా! 'కదలేవాడు రాముడు గాడే' అన్నాడు త్యాగయ్య. రామయ్యే ఆ గాడ్.. ముందది తెలుసుకో!'
'రాముడేంఈ గాడ్ కాడు.. హి వాజ్ జస్ట్ అ రూలర్ అంటున్నారు బాబాయ్.. ఇంకా ఆ వార్తున్న పేపరు చదివే దాకా నువ్వొచ్చినట్లు లేదు'
''రామ.. రామ! పరంధాముడే పురుషోత్తముళ్లా అవతరించాడ్రా బడుద్ధాయ్! మీకర్థమై అఘోరించినట్లు లేదు'

చిన్నాగాడు ఊరుకుంటాడా!చిచ్చర పిడుగు! మధ్యలో దూరిపోయి 'తాతయ్యా! మరి రావుఁ డు దేవుఁ డైతే అన్ని సినిమా కష్టాలెందుకు పడ్డం! ఈ అంకుల్సంతా 'ఉన్నావా.. అసలున్నావా' అని అక్కినేని తాతయ్యలా నిలదీస్తుంటే నీ పూజ గది నుంచి బైటికొచ్చి వీళ్ల బ్యాండ్ బజాయించెయ్యచ్చు గదా బాగా?'
'భడవాఖానా! ఆ పుణ్యమూర్తేమన్నా ఫ్రీడం ఫైటర్రా? పింఛన్ కాసుల కోసం ఇంకా బతికే ఉన్నట్లు పత్రాలు పుట్టించుకు తిరగడానికి? ప్చ్! బొత్తిగా లౌక్యమెరగని దేవుడయిపోయాడు! వారధి శంకుస్థాపన్నాడన్నా ఓ రాయి శిలాఫలకంలా పాతించేసుంటే ఇప్పుడిన్ని శంకలకు ఆస్కారం ఉండేదే కాదు. కనీసం ఇందిరమ్మలా పథకాలన్నిటికీ తన నామధేయం పెట్టించుకునుంటే సరిపోయుడేది.. ఈ చిరునామాలవీ నిరూపించుకునే తల్నొప్పులు తప్పుండేవి! నాలుగైదు కాలనాళికలు ఏ రామేశ్వరం, భద్రాద్రిల్లోనో పాతేసుంటే 'ఉన్నాడో .. లేడో భద్రాద్రి యందు' అంటూ అస్తమానం ఆ రాందాసుకు తాతలాగా సందేహపడేవాళ్లందరికీ సమాధానం దొరికేది. రావణాసురుడే బెటర్రా బుజ్జిగా! మనోల మందమనస్తత్వం ముందే తెలిసి తన వారసుల్ను సందు సందునా వదిలిపోయాడు. ఇప్పుడీ పిచ్చ రచ్చంతా ఆ రావణాసురుడి వారసుల అల్లరే! ఏ గామా కంపెనీకో లాభాలార్జించే దొడ్డి దారి స్కామనుకో.. ఈ నసంతా!'
'నువ్వు మరీ బాబాయ్! దారి కడ్డంగా పడున్న ఆ రాళ్ల గుట్టల్ని కొట్టేసేస్తే రవాణా సమయం ఆదా అవుతుంది కదా! దూర భారాలు తగ్గి ధనం, ఇంధనం కూడా మిగులుతుందంటున్నారు ఆర్థికవేత్తలు. అయినా. లేని రాముడు కట్టని గుడిని కొట్టేస్తే నీకేం కష్టాలొచ్చిపడతాయో నా కర్థం కాడంలే బాబాయ్.. నువ్వూరికే రొష్టుపడ్డం తప్పించి'
'సునామీలొస్తే జనాలన్యాయంగా చస్తార్రా సన్నాసీ! జీవజాలం నశిస్తుంది. తీరప్రాంతం తలకిందులవుతుంది. ఉగ్రవాదులు ఈ వైపు నుంచి కూడా విరుచుకుపడతారు. పెట్టని కోటల్లాగున్న హిమాలయాలు అడ్డంగా ఉన్నాయని కూల్చేసి ప్లాట్లేసి అమ్ముకుంటామన్నట్లుందబ్బీ నీ పెడవాదన! దేవుళ్ల నివాసాలుండేవి అక్కడేరా!వాళ్లూరుకుంటార్రా! బోధివృక్షం వట్టి చెట్టేగా! మరి కొట్టేసి కట్టెల కింద అమ్ముకోమను చూద్దాం! దేహశుద్ధయిపోతుంది శుద్ధంగా. రావుఁడు లేడంటున్న రాక్షసులను ఇతర మతాల దేవుళ్ల జోలికి వెళ్లమను.. తాట తీస్తారు. తారక రామయ్యొక్కడేనట్రా ఈ తాటక వంశవారసులందరికీ తేరగా దొరికిందీ!' బాబాయ్ అంతెత్తున లేవడం అదే మొదటిసారి నాకు తెలిసి.
మూడ్ మార్చక తప్పేట్లు లేదు. 'చిన్నాగాడికి ఇందాకేదో పాఠం చెబుతుంటివిగా! సినిమా గుమ్మడి మాదిరి మూడీగా ఉండే లక్ష్మణస్వామికి అన్న పట్టాభిషేకం టైంలో అంత చేటున ఎందుకు నవ్వొచ్చినట్లో? చెప్పు బాబాయ్.. నాక్కూడా వినాలనుంది' అనడిగా,
'నేన్చెప్తానంకుల్!' అంటూ మధ్యలో దూరాడు చిన్నాగాడు. 'త్రేతాయుగం కాబట్టి ఈ రాముడికి రెండో సాటి దేవుదు లేడంటూ గడ కట్టి మరీ భేరికల్తో డాండ డడాండ డాండంటూ నినదాలు భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్లు చేసుకోడమే గానీ, రాబోయే కలికాలంలో మత్త వేదండాలెక్కి మరీ 'అసలుకి దాశరథీ లేడు.. గీశరథీ లేడు; అతగాడు కట్టించినట్లు పుట్టించిన వారథులసలే లేవం'టూ ఇంతకు మించి గగ్గోళ్ళు బైల్దారతాయని వీళ్ళకెవళ్లకీ తెలీడంలేదు.. పాపం' అని ఆ వెటకారపు నవ్వు.! కదా తాతయ్యా?'
'ఎవర్రా అట్లా గగ్గోళ్లు పెట్టేదీ?' అగ్గిరావుఁడైపోయాడింకోసారి పెద్దాయన.
'ఇంకెవరూ? దక్షిణాన కరుణానిధి తరహా బ్యాచీ.. ఉత్తరాన.. '
'భడవా! బాగా ముదిరిపోయాడ్రా వీడూ.. ' అంటూ అడ్డొచ్చాడు అప్పుడే ఊడిపడ్డ వాడి డాడీ!
బెదిరి పెద్దాయన పూజగదిలోకి తారుకున్నాడు కొడుకు రాకతో.
'అయినా నాన్నకూ.. చిన్నాకూ ఈ వయస్సుల్లోనుట్రా ఈ రామకీయాలూ గట్రా?! ఒక కుంకకింకా బొడ్డూడనేలేదు. ఇంకోరికిక కింద పడ్డ పైగుడ్డ అందుకునే ఓపిక్స్ రాబోదు! అవతల రోడ్డు వైడెన్ కోసమని రామాలయాన్ని లేపేయాలని కోర్టుల్లో కేసేసినోళ్లే.. తీర్పు తమ వైపు రావాలని అదే గుళ్లో అర్చన చేయించేస్తున్నారు! దేశమంతా ఎంతంత తింగరోళ్లతో నిండుందో నీకు తెల్దా? రామకీయాలంటే.. అధికారం కోసం పొలిటికల్ పార్టీలోళ్ళు చేసుకునే రాజకీయాలు. మన ప్రజారాముళ్ల నా విషయంలో అప్రమత్తం చేయాల్సిందిపోయి.. ఇంట్లో ఏందిరా నువ్వూ ఈ పిచ్చి పిచ్చి టీవీ టైపు చర్చలు!' అంటూ నాకే పెట్టాడు ఇంత గడ్డి చివరకు మా అన్న.
నిజవేఁ! శ్రీరాములవారి సాయము కావలెను అని ప్రతి పనికి ముందు రాసుకునే మానవులం .. శ్రీరాములవారికి సాయంపోడానికి ఎంత సాహసం! శ్రీరాములవారికి మన సాయము కావలెనా? అనిపించింది నాకూ చివరకు.
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట వ్యంగ్యం 28 -04 -2008)


Sunday, April 11, 2021

శతమానం భవతి… ( అభయ్) -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 



నిజానికి వరల్డ్ వార్స్ నుంచి స్టార్ వార్స్ వరకు  కాలంతో కలసి ఉత్సాహంగా కాలు కదిపితే  చాలు..  ఆ కాలాతీత జివిని  చిరంజీవి కింద జమకట్టేయవచ్చు! ఆయాచితంగా దక్కిన వరం మానవ జీవితం. అధిగమించలేని   ప్రకృతి  శక్తుల ప్రభావం గురించి ఎంత చింతించీ ప్రయోజనం శూన్యం. వీలైనంత కాలం ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్తమ సంస్కారంతో సాటి సమాజానికి ఆదర్శప్రాయంగా జీవిస్తే ఛాలు.. అదే   వాస్తవానికి వెయ్యేళ్లు మించి ఘనంగా జీవించినట్లు!  

 కానీ గరిష్ట  జీవితకాలం ఇంత అని ఒక మొద్దు అంకె రూపంలో స్పష్టంగా కనిపించాలి. పరిశోధనలకు, తుల్యమాన పద్ధతుల్లో జరిగే  పరిశీలనలకుఅధ్యయనాలకు అది ఒక ప్రమాణం (యూనిట్)గా స్థిరపడాలి.  ‘శతమానం’ మనిషి నిండు జీవితానికి ఒక ప్రామాణిక  కొలమానంగా భావించడానికి  అదే కారణం. హైందవ సంప్రదాయంలో తరచూ వినిపించే  ‘ ఓం శతమానం భవతి శతాయుః పురుష/ శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ!’ అనే ఆశీర్వాద మంత్రం వెనుక ఉన్న ఉద్దేశం నిర్దేశించిన ఈ జీవితకాల లక్ష్యాన్ని నిరాటంకంగా చేర్రుకోవాలనే అభిలాష.  కానీ మీకు ఎన్నాళ్ళు జీవించాలని ఉంది? అని అడిగితే చాలామంది అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు అంటో అలవోకగా ఏదో  బుద్ధికి తోచిన  సమాధానం ఇచ్చేస్తారు. ఏ ఒక్కరికి నిండు నూరేళ్లూ జీవితం పండువులా  గడపాలని ఉండదా?! 

భూగోళం పైన రష్యా, దాని పరిసర దేశాల కొన్ని మారుమూల ప్రాంతాలలో గుట్టుగా జీవించే మానవ సమూహాలకు - వందేళ్లు మించి  జీవించడం కూడా   చాలా సాధారణమైన విషయం. 'మీకు ఎన్నాళ్ళు బతకాలనిs ఉంది?' లాంటి ప్రశ్నలు వాళ్లకు నవ్వు తెప్పిసుంద'ని  పరిశోధన నిమిత్తమై వెళ్లిన ఓ జర్మన్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం ‘లైవ్ సైన్స్’ -జూన్’2019 నాటి  సంచికలో ఓ వ్యాసం సందర్భంగా పేర్కొంది!  

వంద మీద మరో 13  ఏళ్ళకు  పైగా జీవించిన వంద మంది   జాబితా - గిన్నీస్  వరల్డ్  రికార్డు  వాళ్ళు  తయారు చేస్తే అందులో సింహభాగం సివంగులవంటి  ఆడంగులది.. అందులో అగ్రతాంబూలం అమెరికన్  దొరసానులది! బడాయిలే తప్పింఛి భారతీయుల తాలూకు ఒక్క శాల్తీ పేరూ ఆ జాబితాలో కనిపించదు! బాధాకరం. పక్క చైనా నుంచి నుంచైనా  ఒక్కరూ లేని మాట  నిజమే కావచ్చు కానీ అదీ కొంత ఉపశమనం  కలిగించే అంశంగా భావించడం  తగదు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు   వందేళ్లకు పైగా బతికున్నట్లు  కనిపిస్తున్నా కొన్ని   ప్రాంతాల ప్రభుత్వ పత్రాల సాధికారత పట్ల  గిన్నీస్ బుక్కు సంస్థకు అభ్యంతరాలు ఉన్నట్లు వినికిడి!  నిజానిజాలు నిర్ధారణ తరువాత కానీ తేలవు. 

వందేళ్ల బతుకు ఒక్కటే కాదు… 'చల్ మోహన రంగా' పంథాలో ఉత్సాహంగా బతకడం కూడా ప్రధానమే! 'పక్క దిగేందుక్కూడా ఎవరెక్కరున్నారా సాయానికని  దిక్కులు చూస్తూ దినాలు గడిపే కన్నా.. కాలు కింది బక్కెటను ఠక్కున తన్నేయడం మెరుగు' అంటాడు ఛార్లీ చాప్లిన్ ‘ది గార్డియన్’ పత్రిక పక్షాన రిచర్డ్ మేరీమ్యాన్ కు ఇచ్చిన ఆఖరు ఇష్టాగోష్టిలో. మైఖేల్ జాక్సన్ లా ఆడుతూ, లతా.. ఉషా మంగేష్కర్ల మాదిరి హుషారుగా పాడుతూ ఖతమయితేనే ఏ బతుకు ఖేల్ అయినా  గెలుపుకు కావాల్సిన గోల్స్ కొట్టి  పతకం సాధించినట్లు! సర్కారు పింఛన్లు పుచ్చుకుంటున్నా  కానీ ..అణా.. కాణీ కైనా కొరగాకుండా పడున్నాడ'ని  అయినోళ్లందరి నోటా 'ఛీఁ .. పోఁఅనిపించుకుంటూ ఎంత ఎక్కువ కాలం  తుక్కు బండి లాగించినా  వృథా.మన్నిక -కట్టే బట్టకే కాదు.. బతికే బతుక్కూ అవసరమే’ అంటారు స్వామి వివేకానంద! చిన్ననాటి పెద్దల గారాబం, పెద్దతనంలో పిల్లల గౌరవంగా తర్జుమా అయినప్పుడే తర్జన భర్జనలేవీ లేకుండా వందేళ్లకు మించైనా  దర్జాగా బతకాలనిపించేది! మధ్య ప్రాచ్య దేశాలలో  పది పదుల దాటినా నిశ్చింతగా బతికేయడం, ప్రాచ్యులంగా  గొప్పలు పోయే మనకు మాత్రం ఆరు పదులైనా నిండక మునుపే బతుకు ‘తెల్లారిపోవడం’! ఎందుకు ఈ తేడా?'

మనసుంటే మార్గం ఉంటుంద'న్నది మనమే మానుషులంగా కనిపెట్టుకున్న జీవనసూత్రం.  వందేళ్ల బతుకు మీద మరి  మన భారతీయ సంతతికి  అణు మాత్రమైనా మోజెందుకు లేనట్లో?! 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీర్వాదం గతం మాదిరి కాకుండా ఇప్పుడు ప్రతీ ఇంటా వృద్ధుల పాలిట శాపంగా మారడమెందుకు?! నేటి భారతీయ సమాజంలోని స్థితి గతులన్నీ నానాటికీ ఏళ్ళు పైబడే వృద్ధుల పాలిటి   వరద పోటుకు ఎదురీతలుగా ఎందుకు మారుతున్నట్లు?! ప్రభుత్వాల ధ్యాస పెద్దలపై ఒక్క ఓట్ల జాతర్లప్పుడు మాత్రమేనా?! నిన్నటి  దాకా దేశాన్ని బాధ్యతగా  నడిపించి భద్రంగా తాజా తరాలకు అప్పగించిన అనుభవజ్ఞులు   పెద్దలు. కృతజ్ఞత కోసమైనా ఆ మాతాపితర సమానుల గౌరవప్రద జీవన పరిస్థితుల   పట్ల ప్రజాప్రభువులు సంతాన భావనతో  ప్ర్రత్యేక శ్రద్ధ వహించవలసిన అగత్యం స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. 

గతంలో ఒక్క నయం కాని రోగాలూ రొప్పులు, వేళకు అందని తగిన వైద్యసాయాలు  పెద్దల పాలిటి ముప్పులుగా ఉండే పరిస్థితి. మారుతున్న సమాజంలో ముసలితనానికి  మానసిక ఒంటరితనం కొత్త యమగండంగా మెడకు చుట్టుకుంటున్నట్లు  వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల  నివేదికల  గణాంకాలు నిలదీస్తున్నాయిప్పుడు! బతకడాన్ని మించి సుఖంగా బతకాలనే వాంచ మనిషిది. అందుకు సరిపడని సామాజిక పరిస్థితులు  కుటుంబ వ్యవస్థలలో కూడా క్రమంగా చొరబడడమూ  ముదుసలుల మరణాలను మరింత ముందుకు తోసే  ముదనష్టపు కారణమని ఓ అంచనా, సుఖమయజీవితం పైన క్రమంగా సడలుతున్న నమ్మకమే ముందుకు తోసుకొచ్చే ముదిమికీ ఓ ముఖ్య కారణమని భారత ఆహార సంస్థ 2017 నాటి తన వార్షిక నివేదికలో హెచ్చరించింది కూడా. 'మనవారు' అనుకునేవారు తరుగుతున్న కొద్ది యములాడితో  మనిషి చేసే సమరంలో దార్డ్యం, దైర్యం రెండూ సన్నగిల్లడం సహజ విపరిణామం. పొద్దు వాటారే మాట  తాత్కాలికంగా పక్కన ఉంచి, పడుచువారిని మించి  కొంత కాలం  మనస్ఫూర్తిగా జల్సాలలో ఉత్సాహంగా మునిగి తేలితేనో

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్ టన్  ఈ దిశగా గతంలో చేసిన ఓ పరిశోధన తాలూకు  ఫలితాలు పోయిన ఏడాది జులై నెల ‘అమెరికన్ సైన్స్’ జర్నల్ లో విడుదలయాయి. మనోవాంఛితం మనిషి శర్రీరం పైన ఎంతటి వింత ప్రభావం చూపిస్తుందో తెలిపే ఆ పరిశోధనల ఆధారంగా మన దేశంలో ముసలివారి శాతం ఎందుకింత శరవేగంగా దూసుకువస్తుందో అర్థమవుతుంది. అనుక్షణం అద్భుతంగా సాగిన ఆ  యౌవ్వనోత్సాహ జీవితోత్సవ అనుభూతుల కారణానే   గ్రీష్మాంతంలో వసంతం ప్రకృతి కై కల్పించే కైపు ముదుసలుల మనసులలోనూ  చొప్పించినట్లు ఆ పరిశోధన తేల్చింది.  మూడు పదుల నాటి మునుపటి శారీరక పటిమ ముసలివారిలో తిరిగి పుంజుకొన్నట్లు ప్రయోగ ఫలితాల సారాంశం! మనసు చేత శరీరాన్ని నొప్పించడం కాక శరీరం చేత మనసును శతాయుష్షువుగా జీవించడానికి  ఒప్పించాలన్నది ప్రయోగం నేర్పించే నీతి పాఠం.. 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీస్సులు నిజం కావాలంటే 'నిండు నూరేళ్లూ ఆరోగ్యం గుండులా ఉండాల’నే సంకల్పం ముందుగా ఎవరికి వారు తమ మనసులకు చెప్పుకోవాలి.     

జీవిత లక్ష్యం ఏ   ‘షష్టిపూర్తి’  పూర్తికో  పరిమితమైతే  పొద్దు ఆ వేళకే వాటారే అవకాశం ఎక్కువని  మనస్తత్త్వవేత్తలూ మత్తుకునే మాట.  అస్తమానం చేసే భూతకాల జపం   భవిష్యత్తు పాలిట శాపంగా మారుతుందని మానసిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనుగడ అనే భావన కూడా చేటే. గాలివాటానికి కాస్త చలాకీతనం మందగించినా మరేదో ముందు ముందు ముంచుకురానున్నదనే బెంగ  ఆయుర్దాయం మీద కనిపించని  దెబ్బ వేసే ప్రమాదం కద్దు.  'నూరేళ్లు నేను మాత్రం మా మనవళ్ళు, మనవరాళ్లలా ఎందుకు హుషారుగా ఉండకూడదూ?' అనుకుంటే చాలు. అందుకు తగ్గట్లు తీసుకునే జాగ్రత్తలతో   మునిమనుమలతో కూడా  కలసి హాయిగా ఆడిపాడుకోవచ్చు.

అందుకు అనుగుణమైన  సగుణాత్మక  సంస్కరణల దిశగా దేశంలోని అన్ని ప్రజాప్రభుత్వాలు సత్వరమే స్పందించడమే ముసలివారి పట్ల ప్రజాసేవకులు చూపించే మంచీ.. మర్యాదా!  

'మీకు ఎన్నాళ్లు బతకాలని ఉంది?' అనడిగితే  రష్యా  పరిసర  ప్రాంతాల మనుషులకు మల్లేనే అప్పుడు  మన దేశం నడిబొడ్డులోనూ ముసలితరం  పెదాలపై   ముసి ముసి నవ్వులు వెల్లివిరిసేది!  

*** 

తాతయ్యలు, నానమ్మలు/అమ్మమ్మలు  అయితేనేం?

డేమ్ జూలియా జూలీ ఎలిజెబెత్ ఏండ్రూస్ ఎనభైలు దాటినా గాయనిగా, నటిగా, నర్తకిగా, కవయిత్రిగా, దర్శకరాలుగా అటు హాలివుడ్, ఇటు రంగస్థలం రెండింటి పైనా తన ప్రభ  అప్రతిహతంగా సాగించారు. 

జేమ్స్ ఎర్ల్ జోన్స్ తన తొంభైలకు రెండేళ్లు ముందు వరకు .. మన బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ తరహాలో రకరకాల  పాత్రలతో ఆరు దశాబ్దాల పాటు అలుపూ సొలుపూ లేకుండా అమెరికన్ ఖండాలని అలరించారు. 53 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ కు తన తొంభై రెండో ఏట సారథ్యం వహించడమే కాదు, ఇంగ్లాండ్ చర్చ్ వ్యవస్థకు సుప్రీమ్ గా వ్యవహరించారు ఇంగ్లాండ్ రాణి ఎలిజెబెత్-2. బెట్టీ వైట్  వందేళ్లకు ఇంకా మూడేళ్లు ఉన్న వయసులో సైతం మనుమారాళ్ల వయసు నటీమణులను మించి చాలాకీగా బుల్లితెరపై కనిపిస్తూ గోల్డెన్ గర్ల్ గా జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. తెలుగు చిత్రసీమలో అక్కినేనివారు తన తొంభైల వరకూ చేసిన వయసు ఇంద్రజాలం ప్రపంచ సినీ రికార్డులకు సరితూగేది.  హెన్రీ కిసెంజెర్ (96), జిమ్మీ కార్టర్ (94). బోట్సీ రేవిస్(91), బెండిక్ట్ XVI (92), సిడ్నీ పోయిట్లర్ (92).. అంతా తొంభయ్యో పడి దాటినా ప్రభ ఏమీ మసకబారని టాప్ సిక్స్ ప్రముఖ వ్యక్తులు.  యమధర్మరాజు  నియంతలా వచ్చి  ‘చప్పున రండు' అంటూ  పాశం బైటకు తీసినా.. ' శతాయుష్మాన్ భవ అని కదా మీ  దేవతల దీవెన మానవుల పైన! నిండు నూరేళ్లూ పండనివ్వండి స్వామీ!' అనేపాటి గుండె దిటవు చూపగల గండర గండళ్ళ జాబితాలో  ముందు నుంచి లోకానికి సుపరిచితులైన  గోర్బొచేవ్ (92) నుంచి ఇప్పటి దలైలామా దాకా(84), విల్లీ మేస్(88), క్లింట్ ఈస్ట్ వుడ్ (89), యోకో వోనో (86), హ్యాంక్ అరోన్(85).. వంటి ఎందరో కాలాంతకులు కాలు మీద కాలు వేసి విలాసంగా జీవితం గడిపినవారున్నారు.  ఏ వత్తిళ్లూ లేని సాధారణ ప్రాణులం మనం మాత్రమే మరి ఎందుకు ముందే ఏదో పుట్టి మునుగుతున్నట్లు పెట్టే బేడా సర్దుకుని ప్రస్థానానికి సిద్ధమవడం?!

***

చిరంజీవులు ఉండరు!

  'భారతం రామాయణాలలో కూడా సమానంగా కనిపించే ఆంజనేయుడికి చిరంజీవిగా వరమున్నట్లు మనం పురానాలలో చదువుకునివున్నాం, వానరులకు వారసులమని చెప్పుకునే మనం మరెందుకు కనీసం వందేళ్లైనా జీవించలేక ముందే చాప చుట్టేయడం?' అంటూ ఓ జిజ్ఞాసి శిష్యుడు సంధించిన ప్రశ్నకు వైజ్ఞానికానందులవారు సెలవిచ్చిన  వివరణ వింటే 'మహోన్నతమైన మానవ జన్మ  వరం   శాపంగా మారడంలో  ఎవరి లోపం ఎక్కడ ఎంత పాలో  ఇట్టే అవగాహన అయిపోతుంది.  

చలనమున్న ప్రతిదీ క్రమేణా నిశ్చలంగా మారడమన్నది   ప్రకృతి నిక్కచ్చిగా పాటించే జీవనసూత్రం. పుట్టుట గిట్టుటకే అనేది పుట్టలోని చెదల నుంచి చెట్టు మీది పిట్ట వరకు అన్ని జీవులకూ  సమానంగా వర్తించే కాలనియమం.  విశాల విశ్వంలో నిజానికి ఎక్కడా చిరంజీవుల  ఉండేందుకు బొత్తిగా ఆస్కారం లేదు.  ఒక వంక 'జాతస్య మరణం ధృవం' అంటూ మరో వంక ‘చిరంతన’ భావనపై విశ్వాసం ఉంచడం  తర్క బుద్ధిని వెక్కిరించడమే! మరణం అంటే ఏమిటో అవగాహన లేకనే మనుషులలో ఈ తడబాటు.

 

 

జీవజాతుల మరణానికి విశ్వంలోని అంతరంగిక నియమాలూ ప్రధాన ప్రేరణలే. సృష్టిలో మారనిదంటూ ఏదీ లేదంటున్నప్పుడు జీవానికి మాత్రం ఆ సూత్రం నుంచి మినహాయింపు ఎట్లా  సాధ్యం?  

జీవులని, నిర్జీవులని పదార్దానికి రెండు రూపాలు.  నిర్జీవ పదార్థాలతో తయారయే జీవపదార్థం ప్రాణం. ఊపిరితో ప్రాణం ప్రయాణం కొనసాగుతుంది. ఉసురు అండ ఉన్నంత  వరకు నిర్జీవ పదార్థాలు తమ ధర్మాలకు భిన్నంగా ప్రకృతి నియమాలను అనుసరిస్తూనే ప్రకృతి నియమాలను ధిక్కరించి నిలిచే సామర్థ్యం ప్రదర్శిస్తాయి. ఆ సామర్థ్యం శాశ్వతంగా కోల్పోయే స్థితి పేరే ‘మృతి’. చావు అంటే జీవం చేసిన దోషంలాగా భావించడమే దురవగాహన. 

ప్రతీ ప్రాణికీ  నిశ్చేష్టత ఎప్పటికైనా తప్పని అంతిమ స్థితి.  భూమికి ఆకర్షంచే శక్తి ఉంది. ఆ బలంతో అందుబాటులో ఉండే ప్రతీ పదార్థాన్నీ తన కేంద్రకం దిక్కుగా లాక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటుంది. ప్రకృతి నియమాలలో అదీ ఒకటి, ఆ నియమాన్ని ధిక్కరించే శక్తి అదే ప్రకృతి జీవపదార్థానికి ఇవ్వడమే సృష్టి కొనసాగింపులోని అసలు రహస్యం.  జీవులు కిందికి లాగే  భూమి  ఆకర్షణ దిశగా వ్యరిరేకంగా పైకి పైకి   ఎదగడం ప్రకృతి ఇచ్చిన అండ చూసుకునే!  జీవం అట్లా పైకి ఎదగడానికి బలం కావాలి కదా! ఆ శక్తిని జీవం ప్రకృతి తన సూత్రాలకు లోబడే వాడుకోనిస్తుంది. శరీరంలోని అవయవాలు వేటికవే ప్రకృతి ఇచ్చే శక్తి(చెట్లు, ఇతర జీవులు నుంచి వచ్చే ఆహారం)ని అందుకునే ఒక రూపం దాలుస్తాయి. ఎదుగుతాయి. ఇది జీవం ప్రకృతి సూత్రాలకు లోబడి ప్రవర్తించడంగా భావించుకోవచ్చు.  కానీ విచిత్రంగా అట్లా రూపుదిద్దుకున్న అవయవాలు(కొమ్ములురెక్కలు, తోకలు వంటివి) అన్నీ ఒక చట్రం(శరీరం)లోకి కుదురుకున్న తరువాత ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. అదే శరీరం మొత్తంగా ఊర్థ్వ దిశగా ఎదగడం.  అట్లా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పైకి ఎదగడానికి శరీరాన్ని ఎక్కబెట్టేది శరీరంలోని జెన్యు సంకేత స్మృతి. జెనెటికి కోడ్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది.  ఈ జెన్యు సంకేతాలు శరీరంలోని డి.ఎన్.ఏ రచించి పెట్టుంచే పటం నుంచి వచ్చే ఆదేశాలే. ఈ డి.ఎన్.ఏ నిజానికి ప్రకృతికి వ్యతిరేకంగా ఏర్పడ్డ  ఒక  క్రమబద్ధమైన తిరుగుబాటు వ్యవస్థ. 

డి.ఎన్.ఏ వ్యవస్థ అటు ప్రకృతిపై తిరగబడుతూనే  ఇటు తను ఏర్పాటు చేసిన జీవ వ్యవస్థ తనపై తిరుగుబాటు చేయకుండా తన అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం తంటాలు పడుతుంటుంది.  (తమ వృత్తి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వంతో పోరాడే ఉపాధ్యాయుడు తన అధీనంలో ఉన్న తరగతి పిల్లలను క్రమశిక్షణ తప్పకుండా అదుపులో పెట్టుకోవడానికి సరితూగే చర్యగా భావించాలి డి ఎన్ ఏ తంటాలు సులభంగా అర్థమవాలంటే). పరస్పరం వ్యతిరేకంగా సాగే ఈ సంఘర్షణలు తనలో కొనసాగుతున్నంత కాలం బౌతికంగా కనిపించే శరీరంలో డి.ఎన్.ఏ తాలూకు జీవ వ్యవస్థ చురుకుగా ఉన్నట్లు లెక్క. గతితార్కిక భౌతికవాదన ప్రకారం ఇదే 'వ్యతిరేక శక్తుల మధ్య జర్రిగే సంఘర్షణ(కాంట్రాడిక్షన్ ఆఫ్ అపోజిట్స్). ప్రత్యేకంగా  కనిపించే జీవచైతన్యం(స్పెషాలిటీ), ప్రకృతి సాధారణత (జెనరాలిటీ) నడుమ జరిగే  తగాదాలో సాధారణతది ఎప్పుడు పైచెయ్యి అయితే ఆ క్షణం నుంచే శరీరంలోని జీవం స్థిభించిపోయినట్లు. ఆ బొంది తాలూకు వ్యక్తి కీర్తి శేషుడు అయినట్లు! 

ఇంత కథా కమామిషు  ఉన్న ‘మరణం’ వివిధ జీవ జాతులలో వివిధ పరిమితులలో ఉంటే, మనిషి జీవితకాలం విశేషాలేమిటి? అనే ఆసక్తికరమైన అంశం భారతదేశ వృద్ధుల జీవనపరిస్థితుల నేపథ్యంగా పరిశీలించడమే ఈ చిన్న వ్యాసం ఉద్దేశం!***

(కర్లపాలెం హనుమంతరావు)

(సూర్య దినపత్రిక  4, నవంబర్, 2019 ప్రచురితం)


Saturday, April 10, 2021

ఉల్లి పగ - ఈనాడు - వ్యంగ్యం -కర్లపాలెం హనుమంతరావు


యమధర్మరాజుగారి దగ్గరకో విచిత్రమైన కేసు విచారణకొచ్చిందా రోజు.

 

ప్రేమ విఫలమయితేనో, పరీక్షలు ఫెయిలయితేనో, అప్పుల వత్తిడి తట్టుకోలేకనో, పెళ్లాం   బాధలు ఓర్చుకోలేకనో, వ్యాపారం కుదేలయితేనో, పెళ్లీ పెటాకులు కుదరకుంటేనో.. సాధారణంగా ఈ బాపతు సవాలక్ష కారణాలు కద్దు సాధారణ మనుషులు ప్రాణాలు రద్దుచేసుకోడానికి. కిలో ఉల్లి వంద పెట్టి కొనే తాహతు లేక ఉసురు తీసుకున్న సగటు జీవిని విచారించే చేదనుభవం ఇదే మొదటిసారి ఇన్ని మన్వంతరాలుగా ధర్మవిచారణ బాధ్యత నిర్వహించే యమధర్మరాజులుంగారికి.

 

విచారణ మొదలయింది.

 

'నేరం నాది కాదు మహాప్రభో! ఉల్లిపాయది. ముందు తమరు విచారించి శిక్షించవలసింది ఉల్లిగడ్డను' అని గుడ్ల నీరు కుక్కుకుంది సగటు జీవి ఆత్మ.

 

ఉల్లితొక్కు సమవర్తి సమ్ముఖానికి కొనిరాబడింది.

 

'అంతలేసి ధరలకు నన్నమ్మిన వ్యాపారిని విచారించడం ధర్మం.. నన్నిలా బోనులో నిలబెట్టడమే న్యాయానికి మహా అన్యాయం!'  కన్నీళ్ల వంతు ఈసారి ఉల్లిదయింది.

 

'లాభానికి కా’పోతే నష్టానికి చేసుకుంటామా ఎవరవై’నా ఏ వ్యాపారమైనా! టోకుదారుడి దగ్గర నుంచి సరుకు కొన్నదే కిలో అరవైకి; రవాణా, కూలీ మోత వగైరా ఖర్చులన్నీ అచ్చుకుంటే చివరకు  మిగిలేదే రూపాయికి రెండు పైసలు యమధర్మరాజా! డాలరుకే విలువలేని మాయదారి కాలంలో రెండు పైసల్లాభవూఁ  దారణమంటం మహాదారుణం దయామయా!' అంటూ పద్దు బుక్కులు చూపించి మరీ బుకాయించేసింది చిల్లర వ్యాపారి టక్కరి ఆత్మ.

 

టోకు వ్యాపారి ఆత్మేమన్నా తక్కువ 'తిన్న'దా? 'ఉల్లి పండించే రైతేమీ ఫలసాయం ఉదారంగా మాకు ధారపోయటంలా సామీ! ధర గిట్టుబాటు కాకుంటే దారికడ్డంగా అయినా పారబోసుకుంటాడే తప్పించి తమాషాకైనా  తక్కువ రేటుకు మా తక్కెట్లో తూకానికేయడంలా! ఈ ఉల్లితొక్క వ్యాపారం తప్ప మరో చెత్త పని చేతరాని చెవటంలం, ఇంకో దారి లేకనే ఇంకా ధర పడిందాక నిలబడే ఓపిక లేక, చెప్పిం ధరకు చచ్చినట్లు కొనిచావడం! సీజన్లో కొన్న సరుకు కరువు రోజుల్దాకా కుళ్లు బైటక్కనబడకుండా దాచాలంటే.. ఇనుమా  బంగారమా ఇది! ఎన్ని ఇడుములు పడితే రెండు రాళ్లు ఈ గడ్డల వ్యాపారంలో కళ్లచూడ్డం..  దేవరవారు దయుంచాల. గోదాముల నుంచి గోతాల వరకు అన్నింటికీ ఎదురు దేకుళ్లే మహాదేవరా! మా లోకం పందికొక్కు పర్మినెంటు అడ్డాలు  గిడ్డంగులే మహాప్రభో.. ఎన్ని శతాబ్దాలకని లీజుకు తీసుకుచచ్చాయే దేవుడికే ఎరిక! ఎంత మంది లంచగొండులకు ఎన్నిందాలుగా అవీ.. ఇవీ సమర్పించుకుంటే మేమీ ముత్తెమంత లాభంతో అయినా గట్టున పడ్డం! ముందు న్యాయం జరగాల్సింది ఆగమాగమయ్యే మా టోకు వ్యాపారుల త్యాగానికి' ఆవటా  అంటూ హోలుసేలు వ్యాపారస్తుడాత్మ విన్నవింపులు.

 

యమధర్మరాజుగారికి ముందుకు పోయే  దారేదీ దరిదాపుల్లో కనిపించింది కాదు.

 

'మానవులు మహా మాయదారి జీవులు మహాప్రభో!  సత్యవంతుడి కథలోనే తమరా చేదనుభవం చవిచూసుంటిరి గదా! గిడ్డంగులు, గోతాలు గట్రా సరుకు సరఫరాలో తాత్సారానికి కారకులెవ్వరు? ఆ దిశగా విచారణ తిరిగి కొనసాగితే గాని శుద్ధసత్యమేదో బైటపడే యోగంలేదు'

 

చిత్రగుప్తుడి సూచనతో ఉత్సాహం తిరిగి పుంజుకుంది యమధర్మరాజుగారి బుర్రలో.

 

నిపుణుల కమిటీ ఏర్పాటవడం.. నిమిషాల మీదట నివేదిక  సమర్పణవడమూ అయింది. 

 

'గోదాములు లేకుంటేనేమి? అంత కన్నా ధారాళంగా ప్రభుత్వ పాఠశాలల భూమి అందుబాటులో ఉంది  బడావ్యాపారులకు. వాస్తవ  పందికొక్కులు తిండి  కోసమే  అంతలేసి ధరలు పెట్టి ఉల్లితుక్కును ఏ తుగ్లక్కూ కొనడు; వాస్తవానికి  బైటి కొక్కుల బొక్కుళ్లక్కూడా సరిపడా ఆదాయం ఉండక తప్పదు.. కాబట్టే   వృత్తిధర్మ రీత్యా  నిబద్ధతో దోపిడీ కొనసాగడం! తప్పట్టలేం!  కష్టించే   ప్రతీ శ్రమజీవికీ.. తన వంతు మూల్యం దక్కడమే న్యాయం. చెమటోడ్చనిదే  చెమట దోపిడీ అయినా సక్రమంగా సాగదు. అక్రమార్జన అయినప్పటికిన్నీ ఆ ఆదాయానికి గండికొట్టే చర్యలు తగవు. విత్తు మొలకెత్తు వరకు నకిలీదో కాదో కొనేవాడికి మల్లేనే అమ్మి సొమ్ముచేసుకొనే దొంగవ్యాపారికీ తెలిసే అవకాశం  లేదు. నకిలీ సరుకు అమ్ముకునే వాడి మీద కొరదా ఝళిపించడం సమధర్మానికి భంగకరం. పురుగుమందు నాణ్యతలో లోపమే  ఫలసాయం తరుగుదలకు ప్రధాన కారణమని  బాధిత రైతు అత్మ అభియోగం! అదే పురుగుమందు తాగిన కారణంగానే   ఇదే రైతు నిరాటంకంగా ఇప్పుడు మన ముందు నిలబడి ఉన్నాడు;  ఆ కారణంగా ఆ అభియోగం నిష్కారణంగా మోపబడిందని భావిస్తున్నాం.

 

నీటి వనరుల కొరత ఒక కారణమైతే; వానలు సకాలంలో పడక కొంత, పడ్డా అది అకాలమవడమో, అవసరానికి మించి పడడమో మరికొంత.. పంట దిగుబడి దెబ్బతినేందుకు ఈ తరహా ఇతరేతర  ముఖ్య కారణాలింకెన్నెన్నో. రుతుపవనాల క్రమశిక్షణారాహిత్యంపైన కఠిన చర్యలు  ఆహ్వానీయమే.. కాని వరుణదేవుని పై విచారణ  యమధర్మరాజు పరిధిలో లేదు. చివరగా, చేతికందిన పంటను బతుకుతెరువు కోసమై అధిక ధరలకు అమ్ముకునే అన్నదాతను తప్పట్టడమే అన్నిందాలా ఉచితం.  సాగుభూమిని లాభాపేక్షతో భవననిర్మాణ  రంగాలకు ధారపోసే రైతూ  సహనిందితుడే! కానీ, రైతన్నే రాజు కనుక, రాజుని శిక్షించే అధికారం యమధర్మరాజుకైనా రాజ్యాంగం ధారపోయలేదు కాబట్టి...'

 

విచారణ సంఘం చేంతాడు నివేదిక  అనంతరమూ ఎవరి పై ఏ చర్య తీసుకొనడం ఉచితమో సాక్షాత్ యమధర్మరాజులవారికే అంతుబట్టింది కాదు. అయోమయం మరింత పెరిగడం ఆఖరి ఫలశ్రుతి. 

 

కేసు విచారణ మన్వంతరాల తరబడి నాన్చడమూ న్యాయసమ్మతం కాదనే నియమం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మయధర్మరాజుగారి మేధ  నుంచి వచ్చిన  తీర్పు నరకలోక   నేర విచారణ చరిత్రలోనే కొత్త సంప్రదాయానికి నాంది పలికింది.

 

కోరుకున్న జన్మను సగటు జీవికి ఆత్మకు ప్రసాదించి తిరిగి భూమ్మీదకి పమ్మించేయడమే ఆ విచిత్రమైన తీర్పు!

 

'మహాప్రభో! అన్నదాత బతుకు పగవాడికైనా వద్దు. పేరుకే దేశానికి అతగాడు వెన్నెముక కాని, కన్నా   గాడిదకు మించిన దైన్యం అతగాది  హీనం. చిల్లర మల్లర వ్యాపారి బతుకైతే అసలుకే  వద్దు. అల్లరి చిల్లర అయిపోవడం మించి  ఒరిగేదేమీ లేదు చిరువ్యాపారికి.  టోకు వ్యాపారి బతుక్కథా డిటోనే స్వామీ!  పైన పటారం.. లోన లొటారం! ఆ పద్దు బుక్కుల  వ్యాపారమూ నా కొద్దనే వద్దు. పంది కొక్కు బతుకు కొద్దిగా సుఖమే కాని, చూస్తూ చూస్తూ మరీ బొక్కుడు బతుకా? నో.. వే! పురుగు మందుగా పుట్టడం బెటరే! కానీ.. నకిలీల పుణ్యమా అని చంపాలన్నంత పగ కచ్చితంగా తీరుతుందో లేదో..   చివరిదాకా తేలదు.'

 

అందుకే  ముందే ఆలోచించి పెట్టుకున్నట్లుగా.. అందరి మీదా ఒకే సారి ఎప్పుడైనా టోకున బదలా తీర్చుకునే జన్మను చివరకు ఎంచుకున్నది సగటు జీవి అత్మ. 

అదే ఉల్లి జీవితం.

 

ఎవరు అడ్డంగా, నిలువునా కోసినా కన్నీళ్లు కార్పించడమే కాదు, ఎన్నికల వేళల్లో హఠాత్తుగా అటకెక్కి  కిందకు దిగకుండా.. ఓటరును రెచ్చగొట్టి ఠపీమని పాలకులను పడగొట్టేయడం ఉల్లి స్పెషాలిటీ!'

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- వ్యంగ్యం - 25నవంబర్, 2013 ప్రచురితం)



Friday, April 9, 2021

'కోతో'పనిషత్ - ఈనాడు గల్పిక -కర్లపాలెం హనుమంతరావు -(ఈనాడు- దినపత్రిక - సంపాదకీయ పుట -23 -10 =2002 ప్రచురితం)

 




 

ఏంవోయ్.. మైడియర్ వెంకటేశం.. మొహం వేలవేసినావ్?

పరీక్ష పోయింది. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కోతలు కోయడవేఁ కానీ ఒక్క నాడన్నా పాఠం చెప్పిన పాపానపోయారూ!

డ్యామిట్.. ఇది బేసిక్ ఇన్ గ్రాటిట్యూడ్! నీ తెలివితక్కువతనం చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. నాతో మాట్లాడ్డవేఁ ఓ ఎడ్యుకేషన్! మీ నులక అగ్నిహోత్రావధాన్లు నాతో రాతకోతలు చేయించుకోవాలన్న  దుర్బుద్ధితోనే కదా .. మీ ఇంట్లో ఉండనిస్తున్నదీ! రాతల సంగతెట్లా ఉన్నా మన కోతలకు ఢోకా లేదన్న సంగతి పసిగట్టబట్టే మనకీ సదుపాయం దక్కింది. దేర్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ వుచ్ డజ్ నాట్ సర్వ్ యూజ్ ఫుల్ పర్పస్. కోతల యొక్క మజా నీకింకా బోధపడకపోవడం నాకు ఆశ్చర్యం వేస్తున్నది. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు 'ది మిలియన్ ఫేజెస్ అఫ్ బ్రాగింగ్' ను గూర్చి  ఒక్క బిగిన మూడు ఘ్ఘంటలు లెక్చరిచ్చేసరికి  అక్కడి ప్రొఫెసర్లే డంగైపోయుంటిరి. గాడ్స్ క్రియేషన్లో ఆవులూ చేగోడీలు విధవలూ కన్నా కోతలూ అనే పదార్థం ఉందే అది ప్రధమ స్థానంలో ఉంది. 

 ప్రపంచమందుండే అన్ని వస్తువులలోకీ ముఖ్యమైనవి విధవలు అని  మీరే కదా ఇంతకు ముందు అన్నారు?

ఒపీనియన్సు అప్పుడప్పుడూ ఛేంజ్ చేస్తుంటే గానీ పొలిటీషియన్ కానేరడు. గాడ్స్ వర్క్స్ లో ఈ 'కోత' అనే పదార్థం ఉంది చూసావూ.. అది ఒక ఉత్తమోత్తమమైన సృష్టి. చిత్రం! నీ పేరులోనే ఓ కోత ఉంది గమనించావా!

అదెలాగండీ?

వెంకటేశం అనగా వెంకట్ ప్లస్ ఈశం. 'కట్' అంటే 'కోత' అనే కదా అర్థం! ఇంకా విను! కోతలు కోయడం చేతకాకపోయుంటే భారతంలోని ఉత్తర కుమారుడు ఉత్తకుమారుడుగానే మిగిలిపోయుండేవాడు. అవునా కాదా?చెప్పు! టెల్ మాన్!

మీకేమీ ఎన్నైనా చెబుతారు. పరీక్ష పాసుకాలేదని మా తండ్రిగారికి తెలిస్తే 'ఊచకోత' కోస్తాడు.

దట్సిట్! అనగా మీ నాయన కూడా కోతలు కోస్తాడన్న మాట! కోతల పురాణం విప్పామంటే ఎంత ఎంత మైరావణుడయ్యేదీ గోతిలో పడాల్సిందేనని బృహన్నారదీయంలోని నాలుగో ఆశ్వాసం చెబుతోంది! సావకాశంగా కూచుంటే కోతలు కూడా మంచివేనని నీతోనే ఒప్పిస్తాను.

చెప్పండి!

కోత అనుకుంటే ఏమనుకుంటున్నావో ముందు అది చెప్పు నువ్వు.

కోత అనుకుంటే ఎవరైనా అనుకునేది ఏముంటుంది గురువుగారూ? కరెంట్ కోతా.. రేషన్ కోతా.. కరువు భత్యం కోతా.. ఇలాంటివే ఇంకా ఏవేవో కోతలు

ఆట్టే.. ఆట్టే.. ఆగక్కడ! కరెంటు కోతల్ని గురించి ఒక్కముక్క చెప్పనీయ్ నన్ను! ఇప్పుడంటే ఇట్లా ఇరగదీయడాలు కానీ, మొన్నటి ఎన్నికల ముందు దాకా.. ప్రచారంలో ప్రతీ పార్టీవోడికి ఇరవై నాలుగ్గంటల కరెంటే.. ప్రధానమైన 'కోత'! ఆ ఇచ్చేదేదో ఉచితంగానే ఇచ్చేస్తామని ఎదుటోడి పార్టీ  పై కోత! మా మొదటి సంతకం 'హోదా' మీద అని ఓ పార్టీ కోత కోస్తే.. సంతకం కాదు అంగూఠా అనాలి. ఎదుటోళ్ల  అడ్డుకోత. ఈ తరహా కోతలు ఎన్నికలు ముందు కొన్ని వందలు!

ఎన్నికలైనాక ఇందాక నేనన్నానే అసలైన కోతలు.. అవే కదా గురూగారూ?

చూశావా! నీ బుద్ధి ఎలా వికసిస్తుందో ఒకే ఒక్క కోత ఉదాహరణతో! ఇలా తర్ఫీదుగానీ అయిపోతివా వెంకటేశం.. నువ్వూ తొందర్లోనే  ఏ ఇండియాకు రాజువో.. ఇంగ్లాండు రాణీకి మొగుడువో అయిపోవడం ఖాయం.

అనగా పొలిటీయన్లందరు విధిగా కోతలు కోయవలయును అని కదా నీతి గురువుగారూ!

అందుకు సందేహవేముందీ! కోయడం రానివాడు ఒక్క పాలిటిక్సుకనేమిటీ.. పేకాటకైనా పనికిరాడు. కోతకు పైకోత కోయగలవాడే అంతిమ విజేత. పొలిటికల్ పార్టీల మేనిఫెస్టోలన్నీ 'నథింగ్ బట్ మేనిఫెస్టేషాన్ ఆఫ్ బ్రాగింగ్' అని  బెర్ట్రాండ్ రస్సెల్ అనే దొరవారు ఏనాడో  సెలవిచ్చేరు! ఏటా కోటి ఉద్యోగాలంటే భీమునిపట్నానికి పాలసముద్రం తేవడం లాంటి కోత. ఫెలిసిటేషన్స్.. అనగా సన్మానాలు    కోతల కేటగిరీలోకే వస్తాయి.. కానీ వీటిక్కొద్దిగా పురాణాల లిటరేచర్ టచప్ అవసరం. ఒక్క ముక్క నిజం పొక్కినా  సన్మానితుడి క్యారెక్టర్ వెలితిపడి సన్మానపత్రం కళ తప్పిపోతుంది.. బోయ్!

భలే!

అప్పుడే ఏం చూశావు! వివిధ రంగాలలోని కోతల్ని పరిశీలించి వాటి తాలూకు ఎస్సెన్సును నిగ్గు తీసి ఆ సారాంశంతో ఓ థీరీ తయారు చేశానోయ్ ! నోటు బుక్ తీసి రాసుకో బోయ్! కోత అనేది సాంఘిక సాంస్కృతిక సంక్షేమ సౌభాగ్యాలకు సంబంధించిన వ్యవహారమని  నా థీరీ! దిసీజ్ మై ఫస్ట్ పాయింట్!

అలాగెలాగ గురూజీ?

పేషన్స్! కొసాకి విను! కోతల్లేకపోతే కుటుంబనియంత్రణకి ఆస్కారం ఏదీ? సంక్షేమానికి అవకాశం ఎక్కడ? పంటలు కోస్తుంటేనే కదా ధాన్యం దిగుబడి! అన్నదాత ఎంత కోత కోస్తే దేశానికి అంత సమృద్ధి  చేకూర్తుందని లెక్క. ఇహ సెన్సారువాళ్ల కోతలు సరిగ్గా లేకనే సమాచార కాలుష్యం పెరిగి సమాజంలో  శుద్ధి తరుగుతున్నదని నాలాంటి బుద్ధిజీవులం మొదట్నుంచీ మొత్తుకుంటూన్నది.

కోతలకింత కథుంది కాబట్టే..  కోడి కూదా ఘడియ ఘడియకూ 'కొక్కొరోకో! కొక్కొరోకో!' అని కూస్తుంటుంది గొంతెంత నొప్పెడుతున్నా! కొక్కొరోకో' అంటే ఏంటంట? 'కొద్దిక్కొద్దిగా రోజంతా కోతలుకోస్తూనే ఉండడహో!' అని దాని దండోరా అన్న మాట! ఇది ఒహ డిస్కవరీ!

సూపర్ డిస్కవరీ గురూజీ!

మరేవఁనుకుంటున్నావ్ శిష్యా! నా మాట వింటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతటి వాణ్ని చేసెయ్యనూ! పూజా పునస్కారాల్లేక బూజెక్కి వున్నాను కానీ, గ్లాడ్ స్టన్ లా దివాన్గిరీ చెలాయించవలసిన జాతకం కదటోయ్ మనది! ఇహ జాతీయ అంతర్జాతీయ విషయాలకు వచ్చేద్దాం. కులాతీత మతాతీత ప్రజాస్వామ్యమంటారు పద్దాకా మనది. అదే ఒహ పెద్ద జాతీయ కోతని నా ఉద్దేశం. ఏడాది పాలన అయిపోయిందని మొన్నామధ్యన మోదీగారు మీటింగెట్టి మరీ థణుకెగిరి పోయేటట్లు ఎన్ని కోతలు కోశారూ! శాంతి కోసం యుద్ధమని అమెరికనోడూ అస్తమానం అడిగినోడి దగ్గరా, ఆడగనోడి దగ్గరా సొరకాయలు తెగ్గోస్తుంటాడూ ! కోయగా కోయగా కోతలే నీతులవుతాయని గోబెల్సు మహానుభావుడు కాబోలు తీరిక చేసుకొనోసారి సెలవిచ్చాడు. వీటన్నిటికన్నా మన ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ బాబుగారి త్రీథౌజండ్ ట్వంటీ విజన్ ఉంది చూశావూ.. అది మహా పెద్ద ప్రాంతీయ కోత.  ఇహ సామాజిక రంగం విషయానికి వస్తే .. నూరు కోతలైనా కోసి ఓ పెళ్లి జరిపించెయ్యమని కదా అమరనిఘంటువా అదేదోమన బూదరాజుగారి బృహధ్గ్రంథం అఘోరిస్తున్నదీ! కళారంగంలో కోతలకున్న స్థానం అమోఘం. ఎంత మెగా పవరున్నా తెర మీద పిట్టలదొర టైపు కోతలు కోయనిదే ఏ హీరోగారికీ  చప్పట్లు రాలవు. అంతెందుకు శిష్యా.. బొడ్డు కోతతో మొదలయ్యే మానవ జీవితం మృత్యువాతకు ముందు ఆసుపత్రి వైద్యుడి కత్తి కోతతో గానీ అంతవమవదుకదా! ఈ రెండు కోతలకు మధ్య జీవికి అదనంగా కడుపు కోత.. రంపపు కోత.. జుత్తుకోత.. జేబుకోత.. ఇట్లా సవాలక్ష కోతలు! మనిషి జీవితంలో కోతలకింత ప్రాధాన్యత ఉంది కాబట్టే గీతకారుడు కూడా భగవద్కోతలో 'కోసేదీ నేనే.. కోయబడేదీ నేనే! నీవు కేవలం నిమిత్తమాత్రుడవు' అంటూ అర్జునుడి ముందు కోసిందే కోసి మతి పోగొట్టేడు. కోయడమనేది ఓ గొప్ప కళ. ఎడ్యుకేషన్ లేక, చాలక, తగినంత రీజన్ లేక, మీ మాష్టారు వంటి అభాజనులు నేను కోతల్రాయుడని కొక్కిరిస్తారు. కానీ, నన్ను మించిన కోతలరాయుళ్లు ఇవాళ అన్ని రంగాలలో అశేషమైన ప్రభతో వెలిగిపోతున్నారు నాయనా! నిన్నూ అంతటి స్థాయికి  తీసుకువెళ్లాలని తాపత్రయపడుతుంటే,

థేంక్ చెయ్యక నన్ను తప్పుపడుతున్నావూ!

తప్పయిపోయింది! క్షమించండి గురూగారూ!

డోంట్ సే దట్! ఒక ఉపనిషత్తులో శిష్యుడు ప్రశ్న అడుగుతుంటే గురువు సమాధానం చెబుతుంటాడు. ఆ గురువులాంటి గురువును నేను. ఆ శిష్యుడి వంటి శిష్యుడివి నీవూ! మన ప్రశ్నోత్తరాలు ఎవరైనా అచ్చొత్తిపారేశారంటే రెండొందల ఏళ్ల తర్వాత నచి'కోతో'పనిషత్తు అయితీరుతుంది.

గురూగారూ! ఇహ మంచం కింద నుంచి తమరు బైటికి వచ్చేయచ్చు! పూటకూళ్లమ్మ ఈ పూటకు గ్యారంటీగా రానట్లే!

థేంక్!

హ్హాహ్హాహ్హా

 ఈ చీవురేమిటీ ఇక్కడా? హమ్మా! ఈ ముండిప్పటిదాకా ఇక్కడే నక్కిందీ! వెంకటేశం! నన్నే బురిడీ కొట్టిస్తావుటోయ్! కలికాలం! తరం ముదిరింది! డ్యామిట్.. కథడ్డం తిరిగింది!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- దినపత్రిక - సంపాదకీయ పుట -23 -10 =2002 ప్రచురితం)

 

 


 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...