నిజానికి వరల్డ్ వార్స్ నుంచి స్టార్ వార్స్ వరకు కాలంతో కలసి ఉత్సాహంగా కాలు కదిపితే చాలు.. ఆ కాలాతీత జివిని చిరంజీవి కింద జమకట్టేయవచ్చు! ఆయాచితంగా దక్కిన వరం మానవ జీవితం. అధిగమించలేని ప్రకృతి శక్తుల ప్రభావం గురించి ఎంత చింతించీ ప్రయోజనం శూన్యం. వీలైనంత కాలం ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్తమ సంస్కారంతో సాటి సమాజానికి ఆదర్శప్రాయంగా జీవిస్తే ఛాలు.. అదే వాస్తవానికి వెయ్యేళ్లు మించి ఘనంగా జీవించినట్లు!
కానీ గరిష్ట
జీవితకాలం ఇంత అని ఒక మొద్దు అంకె రూపంలో స్పష్టంగా కనిపించాలి.
పరిశోధనలకు, తుల్యమాన పద్ధతుల్లో జరిగే పరిశీలనలకు, అధ్యయనాలకు అది ఒక ప్రమాణం
(యూనిట్)గా స్థిరపడాలి. ‘శతమానం’ మనిషి నిండు
జీవితానికి ఒక ప్రామాణిక కొలమానంగా భావించడానికి
అదే కారణం. హైందవ సంప్రదాయంలో తరచూ వినిపించే ‘ ఓం శతమానం భవతి శతాయుః పురుష/ శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ!’
అనే ఆశీర్వాద మంత్రం వెనుక ఉన్న ఉద్దేశం నిర్దేశించిన ఈ జీవితకాల లక్ష్యాన్ని
నిరాటంకంగా చేర్రుకోవాలనే అభిలాష. కానీ మీకు ఎన్నాళ్ళు
జీవించాలని ఉంది? అని అడిగితే చాలామంది అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు అంటో అలవోకగా ఏదో బుద్ధికి తోచిన
సమాధానం ఇచ్చేస్తారు. ఏ ఒక్కరికి నిండు నూరేళ్లూ జీవితం పండువులా
గడపాలని ఉండదా?!
భూగోళం పైన రష్యా, దాని పరిసర దేశాల కొన్ని
మారుమూల ప్రాంతాలలో గుట్టుగా జీవించే మానవ సమూహాలకు - వందేళ్లు మించి
జీవించడం కూడా చాలా సాధారణమైన విషయం. 'మీకు ఎన్నాళ్ళు బతకాలనిs ఉంది?' లాంటి ప్రశ్నలు వాళ్లకు నవ్వు తెప్పిసుంద'ని
పరిశోధన నిమిత్తమై వెళ్లిన ఓ జర్మన్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం
‘లైవ్ సైన్స్’ -జూన్’2019 నాటి సంచికలో
ఓ వ్యాసం సందర్భంగా పేర్కొంది!
వంద మీద మరో 13 ఏళ్ళకు పైగా జీవించిన వంద మంది జాబితా - గిన్నీస్
వరల్డ్ రికార్డు వాళ్ళు తయారు చేస్తే అందులో సింహభాగం
సివంగులవంటి ఆడంగులది.. అందులో అగ్రతాంబూలం అమెరికన్
దొరసానులది! బడాయిలే తప్పింఛి భారతీయుల తాలూకు ఒక్క శాల్తీ పేరూ ఆ
జాబితాలో కనిపించదు! బాధాకరం. పక్క చైనా నుంచి నుంచైనా ఒక్కరూ లేని మాట నిజమే కావచ్చు కానీ అదీ కొంత
ఉపశమనం కలిగించే అంశంగా భావించడం తగదు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు వందేళ్లకు పైగా బతికున్నట్లు కనిపిస్తున్నా కొన్ని
ప్రాంతాల ప్రభుత్వ పత్రాల సాధికారత పట్ల గిన్నీస్ బుక్కు సంస్థకు అభ్యంతరాలు ఉన్నట్లు వినికిడి! నిజానిజాలు నిర్ధారణ తరువాత కానీ తేలవు.
వందేళ్ల బతుకు ఒక్కటే కాదు… 'చల్ మోహన రంగా' పంథాలో ఉత్సాహంగా బతకడం కూడా ప్రధానమే! 'పక్క
దిగేందుక్కూడా ఎవరెక్కరున్నారా సాయానికని దిక్కులు చూస్తూ
దినాలు గడిపే కన్నా.. కాలు కింది బక్కెటను ఠక్కున తన్నేయడం మెరుగు' అంటాడు ఛార్లీ చాప్లిన్ ‘ది గార్డియన్’ పత్రిక పక్షాన రిచర్డ్ మేరీమ్యాన్
కు ఇచ్చిన ఆఖరు ఇష్టాగోష్టిలో. మైఖేల్ జాక్సన్ లా ఆడుతూ, లతా..
ఉషా మంగేష్కర్ల మాదిరి హుషారుగా పాడుతూ ఖతమయితేనే ఏ బతుకు ఖేల్ అయినా
గెలుపుకు కావాల్సిన గోల్స్ కొట్టి పతకం సాధించినట్లు!
సర్కారు పింఛన్లు పుచ్చుకుంటున్నా కానీ .. ‘అణా.. కాణీ కైనా కొరగాకుండా పడున్నాడ'ని
అయినోళ్లందరి నోటా 'ఛీఁ .. పోఁ '
అనిపించుకుంటూ ఎంత ఎక్కువ కాలం తుక్కు
బండి లాగించినా వృథా. ‘మన్నిక
-కట్టే బట్టకే కాదు.. బతికే బతుక్కూ అవసరమే’ అంటారు స్వామి వివేకానంద! చిన్ననాటి
పెద్దల గారాబం, పెద్దతనంలో పిల్లల గౌరవంగా తర్జుమా
అయినప్పుడే తర్జన భర్జనలేవీ లేకుండా వందేళ్లకు మించైనా దర్జాగా బతకాలనిపించేది! మధ్య ప్రాచ్య దేశాలలో పది పదుల దాటినా నిశ్చింతగా బతికేయడం, ప్రాచ్యులంగా
గొప్పలు పోయే మనకు మాత్రం ఆరు పదులైనా నిండక మునుపే బతుకు
‘తెల్లారిపోవడం’! ఎందుకు ఈ తేడా?'
‘మనసుంటే మార్గం
ఉంటుంద'న్నది మనమే మానుషులంగా కనిపెట్టుకున్న జీవనసూత్రం.
వందేళ్ల బతుకు మీద మరి మన భారతీయ
సంతతికి అణు మాత్రమైనా మోజెందుకు లేనట్లో?! 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీర్వాదం గతం మాదిరి కాకుండా
ఇప్పుడు ప్రతీ ఇంటా వృద్ధుల పాలిట శాపంగా మారడమెందుకు?! నేటి
భారతీయ సమాజంలోని స్థితి గతులన్నీ నానాటికీ ఏళ్ళు పైబడే వృద్ధుల పాలిటి
వరద పోటుకు ఎదురీతలుగా ఎందుకు మారుతున్నట్లు?! ప్రభుత్వాల ధ్యాస పెద్దలపై ఒక్క ఓట్ల జాతర్లప్పుడు మాత్రమేనా?! నిన్నటి దాకా దేశాన్ని బాధ్యతగా నడిపించి భద్రంగా తాజా తరాలకు అప్పగించిన అనుభవజ్ఞులు పెద్దలు. కృతజ్ఞత కోసమైనా ఆ మాతాపితర సమానుల గౌరవప్రద జీవన పరిస్థితుల
పట్ల ప్రజాప్రభువులు సంతాన భావనతో ప్ర్రత్యేక శ్రద్ధ వహించవలసిన అగత్యం స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు.
గతంలో ఒక్క నయం కాని రోగాలూ
రొప్పులు, వేళకు అందని తగిన వైద్యసాయాలు
పెద్దల పాలిటి ముప్పులుగా ఉండే పరిస్థితి. మారుతున్న సమాజంలో ముసలితనానికి
మానసిక ఒంటరితనం కొత్త యమగండంగా మెడకు చుట్టుకుంటున్నట్లు
వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల
నివేదికల గణాంకాలు నిలదీస్తున్నాయిప్పుడు!
బతకడాన్ని మించి సుఖంగా బతకాలనే వాంచ మనిషిది. అందుకు సరిపడని సామాజిక పరిస్థితులు
కుటుంబ వ్యవస్థలలో కూడా క్రమంగా చొరబడడమూ ముదుసలుల మరణాలను మరింత ముందుకు తోసే ముదనష్టపు
కారణమని ఓ అంచనా, సుఖమయజీవితం పైన క్రమంగా సడలుతున్న నమ్మకమే
ముందుకు తోసుకొచ్చే ముదిమికీ ఓ ముఖ్య కారణమని భారత ఆహార సంస్థ 2017 నాటి తన వార్షిక నివేదికలో హెచ్చరించింది కూడా. 'మనవారు'
అనుకునేవారు తరుగుతున్న కొద్ది యములాడితో మనిషి చేసే సమరంలో దార్డ్యం, దైర్యం రెండూ
సన్నగిల్లడం సహజ విపరిణామం. పొద్దు వాటారే మాట తాత్కాలికంగా
పక్కన ఉంచి, పడుచువారిని మించి కొంత
కాలం మనస్ఫూర్తిగా జల్సాలలో ఉత్సాహంగా మునిగి తేలితేనో?
యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్ టన్ ఈ దిశగా గతంలో చేసిన ఓ
పరిశోధన తాలూకు ఫలితాలు పోయిన ఏడాది జులై నెల
‘అమెరికన్ సైన్స్’ జర్నల్ లో విడుదలయాయి. మనోవాంఛితం మనిషి శర్రీరం పైన ఎంతటి వింత
ప్రభావం చూపిస్తుందో తెలిపే ఆ పరిశోధనల ఆధారంగా మన దేశంలో ముసలివారి శాతం ఎందుకింత
శరవేగంగా దూసుకువస్తుందో అర్థమవుతుంది. అనుక్షణం అద్భుతంగా సాగిన ఆ యౌవ్వనోత్సాహ జీవితోత్సవ అనుభూతుల కారణానే గ్రీష్మాంతంలో
వసంతం ప్రకృతి కై కల్పించే కైపు ముదుసలుల మనసులలోనూ చొప్పించినట్లు
ఆ పరిశోధన తేల్చింది. మూడు పదుల నాటి మునుపటి శారీరక
పటిమ ముసలివారిలో తిరిగి పుంజుకొన్నట్లు ప్రయోగ ఫలితాల సారాంశం! మనసు చేత
శరీరాన్ని నొప్పించడం కాక శరీరం చేత మనసును శతాయుష్షువుగా జీవించడానికి
ఒప్పించాలన్నది ప్రయోగం నేర్పించే నీతి పాఠం.. 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీస్సులు నిజం
కావాలంటే 'నిండు నూరేళ్లూ ఆరోగ్యం గుండులా ఉండాల’నే సంకల్పం
ముందుగా ఎవరికి వారు తమ మనసులకు చెప్పుకోవాలి.
జీవిత లక్ష్యం ఏ ‘షష్టిపూర్తి’
పూర్తికో పరిమితమైతే పొద్దు ఆ వేళకే వాటారే అవకాశం ఎక్కువని మనస్తత్త్వవేత్తలూ
మత్తుకునే మాట. అస్తమానం చేసే భూతకాల జపం
భవిష్యత్తు పాలిట శాపంగా మారుతుందని మానసిక నిపుణులూ
హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనుగడ అనే భావన కూడా చేటే. గాలివాటానికి
కాస్త చలాకీతనం మందగించినా మరేదో ముందు ముందు ముంచుకురానున్నదనే బెంగ
ఆయుర్దాయం మీద కనిపించని దెబ్బ వేసే
ప్రమాదం కద్దు. 'నూరేళ్లు నేను మాత్రం మా మనవళ్ళు,
మనవరాళ్లలా ఎందుకు హుషారుగా ఉండకూడదూ?' అనుకుంటే
చాలు. అందుకు తగ్గట్లు తీసుకునే జాగ్రత్తలతో మునిమనుమలతో
కూడా కలసి హాయిగా ఆడిపాడుకోవచ్చు.
అందుకు అనుగుణమైన సగుణాత్మక సంస్కరణల దిశగా దేశంలోని అన్ని ప్రజాప్రభుత్వాలు సత్వరమే స్పందించడమే
ముసలివారి పట్ల ప్రజాసేవకులు చూపించే మంచీ.. మర్యాదా!
'మీకు ఎన్నాళ్లు
బతకాలని ఉంది?' అనడిగితే రష్యా
పరిసర ప్రాంతాల మనుషులకు మల్లేనే
అప్పుడు మన దేశం నడిబొడ్డులోనూ ముసలితరం పెదాలపై ముసి ముసి నవ్వులు వెల్లివిరిసేది!
***
తాతయ్యలు, నానమ్మలు/అమ్మమ్మలు
అయితేనేం?
డేమ్ జూలియా జూలీ ఎలిజెబెత్
ఏండ్రూస్ ఎనభైలు దాటినా గాయనిగా, నటిగా, నర్తకిగా, కవయిత్రిగా,
దర్శకరాలుగా అటు హాలివుడ్, ఇటు రంగస్థలం
రెండింటి పైనా తన ప్రభ అప్రతిహతంగా సాగించారు.
జేమ్స్ ఎర్ల్ జోన్స్ తన తొంభైలకు
రెండేళ్లు ముందు వరకు .. మన బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ తరహాలో రకరకాల పాత్రలతో ఆరు దశాబ్దాల
పాటు అలుపూ సొలుపూ లేకుండా అమెరికన్ ఖండాలని అలరించారు. 53 దేశాల
సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ కు తన తొంభై రెండో ఏట సారథ్యం వహించడమే కాదు, ఇంగ్లాండ్ చర్చ్ వ్యవస్థకు సుప్రీమ్ గా వ్యవహరించారు ఇంగ్లాండ్ రాణి
ఎలిజెబెత్-2. బెట్టీ వైట్ వందేళ్లకు
ఇంకా మూడేళ్లు ఉన్న వయసులో సైతం మనుమారాళ్ల వయసు నటీమణులను మించి చాలాకీగా
బుల్లితెరపై కనిపిస్తూ గోల్డెన్ గర్ల్ గా జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు.
తెలుగు చిత్రసీమలో అక్కినేనివారు తన తొంభైల వరకూ చేసిన వయసు ఇంద్రజాలం ప్రపంచ సినీ
రికార్డులకు సరితూగేది. హెన్రీ కిసెంజెర్ (96),
జిమ్మీ కార్టర్ (94). బోట్సీ రేవిస్(91),
బెండిక్ట్ XVI (92), సిడ్నీ పోయిట్లర్ (92)..
అంతా తొంభయ్యో పడి దాటినా ప్రభ ఏమీ మసకబారని టాప్ సిక్స్ ప్రముఖ
వ్యక్తులు. యమధర్మరాజు నియంతలా
వచ్చి ‘చప్పున రండు' అంటూ
పాశం బైటకు తీసినా.. ' శతాయుష్మాన్ భవ అని కదా
మీ దేవతల దీవెన మానవుల పైన! నిండు నూరేళ్లూ
పండనివ్వండి స్వామీ!' అనేపాటి గుండె దిటవు చూపగల గండర గండళ్ళ
జాబితాలో ముందు నుంచి లోకానికి సుపరిచితులైన
గోర్బొచేవ్ (92) నుంచి ఇప్పటి దలైలామా దాకా(84),
విల్లీ మేస్(88), క్లింట్ ఈస్ట్ వుడ్ (89),
యోకో వోనో (86), హ్యాంక్ అరోన్(85).. వంటి ఎందరో కాలాంతకులు కాలు మీద కాలు వేసి విలాసంగా జీవితం
గడిపినవారున్నారు. ఏ వత్తిళ్లూ లేని సాధారణ ప్రాణులం
మనం మాత్రమే మరి ఎందుకు ముందే ఏదో పుట్టి మునుగుతున్నట్లు పెట్టే బేడా సర్దుకుని
ప్రస్థానానికి సిద్ధమవడం?!
***
చిరంజీవులు ఉండరు!
'భారతం
రామాయణాలలో కూడా సమానంగా కనిపించే ఆంజనేయుడికి చిరంజీవిగా వరమున్నట్లు మనం
పురానాలలో చదువుకునివున్నాం, వానరులకు వారసులమని చెప్పుకునే
మనం మరెందుకు కనీసం వందేళ్లైనా జీవించలేక ముందే చాప చుట్టేయడం?' అంటూ ఓ జిజ్ఞాసి శిష్యుడు సంధించిన ప్రశ్నకు వైజ్ఞానికానందులవారు
సెలవిచ్చిన వివరణ వింటే 'మహోన్నతమైన
మానవ జన్మ వరం శాపంగా
మారడంలో ఎవరి లోపం ఎక్కడ ఎంత పాలో ఇట్టే అవగాహన అయిపోతుంది.
‘చలనమున్న ప్రతిదీ
క్రమేణా నిశ్చలంగా మారడమన్నది ప్రకృతి నిక్కచ్చిగా
పాటించే జీవనసూత్రం. పుట్టుట గిట్టుటకే అనేది పుట్టలోని చెదల నుంచి చెట్టు మీది
పిట్ట వరకు అన్ని జీవులకూ సమానంగా వర్తించే కాలనియమం.
విశాల విశ్వంలో నిజానికి ఎక్కడా చిరంజీవుల ఉండేందుకు బొత్తిగా ఆస్కారం లేదు. ఒక వంక 'జాతస్య మరణం ధృవం' అంటూ మరో వంక ‘చిరంతన’ భావనపై
విశ్వాసం ఉంచడం తర్క బుద్ధిని వెక్కిరించడమే! మరణం
అంటే ఏమిటో అవగాహన లేకనే మనుషులలో ఈ తడబాటు.
జీవజాతుల మరణానికి విశ్వంలోని
అంతరంగిక నియమాలూ ప్రధాన ప్రేరణలే. సృష్టిలో మారనిదంటూ ఏదీ లేదంటున్నప్పుడు
జీవానికి మాత్రం ఆ సూత్రం నుంచి మినహాయింపు ఎట్లా సాధ్యం?
జీవులని, నిర్జీవులని పదార్దానికి రెండు
రూపాలు. నిర్జీవ పదార్థాలతో తయారయే జీవపదార్థం ప్రాణం.
ఊపిరితో ప్రాణం ప్రయాణం కొనసాగుతుంది. ఉసురు అండ ఉన్నంత వరకు నిర్జీవ పదార్థాలు తమ ధర్మాలకు భిన్నంగా ప్రకృతి నియమాలను అనుసరిస్తూనే
ప్రకృతి నియమాలను ధిక్కరించి నిలిచే సామర్థ్యం ప్రదర్శిస్తాయి. ఆ సామర్థ్యం
శాశ్వతంగా కోల్పోయే స్థితి పేరే ‘మృతి’. చావు అంటే జీవం చేసిన దోషంలాగా భావించడమే
దురవగాహన.
ప్రతీ ప్రాణికీ నిశ్చేష్టత ఎప్పటికైనా
తప్పని అంతిమ స్థితి. భూమికి ఆకర్షంచే శక్తి ఉంది. ఆ
బలంతో అందుబాటులో ఉండే ప్రతీ పదార్థాన్నీ తన కేంద్రకం దిక్కుగా లాక్కునే ప్రయత్నం
నిరంతరం చేస్తుంటుంది. ప్రకృతి నియమాలలో అదీ ఒకటి, ఆ
నియమాన్ని ధిక్కరించే శక్తి అదే ప్రకృతి జీవపదార్థానికి ఇవ్వడమే సృష్టి
కొనసాగింపులోని అసలు రహస్యం. జీవులు కిందికి లాగే
భూమి ఆకర్షణ దిశగా వ్యరిరేకంగా పైకి
పైకి ఎదగడం ప్రకృతి ఇచ్చిన అండ చూసుకునే!
జీవం అట్లా పైకి ఎదగడానికి బలం కావాలి కదా! ఆ శక్తిని జీవం ప్రకృతి
తన సూత్రాలకు లోబడే వాడుకోనిస్తుంది. శరీరంలోని అవయవాలు వేటికవే ప్రకృతి ఇచ్చే
శక్తి(చెట్లు, ఇతర జీవులు నుంచి వచ్చే ఆహారం)ని అందుకునే ఒక
రూపం దాలుస్తాయి. ఎదుగుతాయి. ఇది జీవం ప్రకృతి సూత్రాలకు లోబడి ప్రవర్తించడంగా భావించుకోవచ్చు.
కానీ విచిత్రంగా అట్లా రూపుదిద్దుకున్న అవయవాలు(కొమ్ములు,
రెక్కలు, తోకలు వంటివి) అన్నీ ఒక
చట్రం(శరీరం)లోకి కుదురుకున్న తరువాత ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు
పెడతాయి. అదే శరీరం మొత్తంగా ఊర్థ్వ దిశగా ఎదగడం. అట్లా
ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పైకి ఎదగడానికి శరీరాన్ని ఎక్కబెట్టేది శరీరంలోని
జెన్యు సంకేత స్మృతి. జెనెటికి కోడ్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ జెన్యు సంకేతాలు శరీరంలోని డి.ఎన్.ఏ రచించి పెట్టుంచే పటం నుంచి వచ్చే
ఆదేశాలే. ఈ డి.ఎన్.ఏ నిజానికి ప్రకృతికి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఒక క్రమబద్ధమైన తిరుగుబాటు వ్యవస్థ.
డి.ఎన్.ఏ వ్యవస్థ అటు ప్రకృతిపై
తిరగబడుతూనే ఇటు తను
ఏర్పాటు చేసిన జీవ వ్యవస్థ తనపై తిరుగుబాటు చేయకుండా తన అదుపులో ఉంచుకునేందుకు
నిరంతరం తంటాలు పడుతుంటుంది. (తమ వృత్తి పరిస్థితుల
మెరుగుదల కోసం ప్రభుత్వంతో పోరాడే ఉపాధ్యాయుడు తన అధీనంలో ఉన్న తరగతి పిల్లలను
క్రమశిక్షణ తప్పకుండా అదుపులో పెట్టుకోవడానికి సరితూగే చర్యగా భావించాలి డి ఎన్ ఏ
తంటాలు సులభంగా అర్థమవాలంటే). పరస్పరం వ్యతిరేకంగా సాగే ఈ సంఘర్షణలు తనలో
కొనసాగుతున్నంత కాలం బౌతికంగా కనిపించే శరీరంలో డి.ఎన్.ఏ తాలూకు జీవ వ్యవస్థ
చురుకుగా ఉన్నట్లు లెక్క. గతితార్కిక భౌతికవాదన ప్రకారం ఇదే 'వ్యతిరేక శక్తుల మధ్య జర్రిగే సంఘర్షణ(కాంట్రాడిక్షన్ ఆఫ్ అపోజిట్స్).
ప్రత్యేకంగా కనిపించే జీవచైతన్యం(స్పెషాలిటీ), ప్రకృతి సాధారణత (జెనరాలిటీ) నడుమ జరిగే
తగాదాలో సాధారణతది ఎప్పుడు పైచెయ్యి అయితే ఆ క్షణం నుంచే శరీరంలోని
జీవం స్థిభించిపోయినట్లు. ఆ బొంది తాలూకు వ్యక్తి కీర్తి శేషుడు అయినట్లు!
ఇంత కథా కమామిషు ఉన్న ‘మరణం’ వివిధ జీవ
జాతులలో వివిధ పరిమితులలో ఉంటే, మనిషి జీవితకాలం
విశేషాలేమిటి? అనే ఆసక్తికరమైన అంశం భారతదేశ వృద్ధుల
జీవనపరిస్థితుల నేపథ్యంగా పరిశీలించడమే ఈ చిన్న వ్యాసం ఉద్దేశం!***
(కర్లపాలెం
హనుమంతరావు)
(సూర్య దినపత్రిక 4, నవంబర్, 2019 ప్రచురితం)
No comments:
Post a Comment