Saturday, April 10, 2021

ఉల్లి పగ - ఈనాడు - వ్యంగ్యం -కర్లపాలెం హనుమంతరావు


యమధర్మరాజుగారి దగ్గరకో విచిత్రమైన కేసు విచారణకొచ్చిందా రోజు.

 

ప్రేమ విఫలమయితేనో, పరీక్షలు ఫెయిలయితేనో, అప్పుల వత్తిడి తట్టుకోలేకనో, పెళ్లాం   బాధలు ఓర్చుకోలేకనో, వ్యాపారం కుదేలయితేనో, పెళ్లీ పెటాకులు కుదరకుంటేనో.. సాధారణంగా ఈ బాపతు సవాలక్ష కారణాలు కద్దు సాధారణ మనుషులు ప్రాణాలు రద్దుచేసుకోడానికి. కిలో ఉల్లి వంద పెట్టి కొనే తాహతు లేక ఉసురు తీసుకున్న సగటు జీవిని విచారించే చేదనుభవం ఇదే మొదటిసారి ఇన్ని మన్వంతరాలుగా ధర్మవిచారణ బాధ్యత నిర్వహించే యమధర్మరాజులుంగారికి.

 

విచారణ మొదలయింది.

 

'నేరం నాది కాదు మహాప్రభో! ఉల్లిపాయది. ముందు తమరు విచారించి శిక్షించవలసింది ఉల్లిగడ్డను' అని గుడ్ల నీరు కుక్కుకుంది సగటు జీవి ఆత్మ.

 

ఉల్లితొక్కు సమవర్తి సమ్ముఖానికి కొనిరాబడింది.

 

'అంతలేసి ధరలకు నన్నమ్మిన వ్యాపారిని విచారించడం ధర్మం.. నన్నిలా బోనులో నిలబెట్టడమే న్యాయానికి మహా అన్యాయం!'  కన్నీళ్ల వంతు ఈసారి ఉల్లిదయింది.

 

'లాభానికి కా’పోతే నష్టానికి చేసుకుంటామా ఎవరవై’నా ఏ వ్యాపారమైనా! టోకుదారుడి దగ్గర నుంచి సరుకు కొన్నదే కిలో అరవైకి; రవాణా, కూలీ మోత వగైరా ఖర్చులన్నీ అచ్చుకుంటే చివరకు  మిగిలేదే రూపాయికి రెండు పైసలు యమధర్మరాజా! డాలరుకే విలువలేని మాయదారి కాలంలో రెండు పైసల్లాభవూఁ  దారణమంటం మహాదారుణం దయామయా!' అంటూ పద్దు బుక్కులు చూపించి మరీ బుకాయించేసింది చిల్లర వ్యాపారి టక్కరి ఆత్మ.

 

టోకు వ్యాపారి ఆత్మేమన్నా తక్కువ 'తిన్న'దా? 'ఉల్లి పండించే రైతేమీ ఫలసాయం ఉదారంగా మాకు ధారపోయటంలా సామీ! ధర గిట్టుబాటు కాకుంటే దారికడ్డంగా అయినా పారబోసుకుంటాడే తప్పించి తమాషాకైనా  తక్కువ రేటుకు మా తక్కెట్లో తూకానికేయడంలా! ఈ ఉల్లితొక్క వ్యాపారం తప్ప మరో చెత్త పని చేతరాని చెవటంలం, ఇంకో దారి లేకనే ఇంకా ధర పడిందాక నిలబడే ఓపిక లేక, చెప్పిం ధరకు చచ్చినట్లు కొనిచావడం! సీజన్లో కొన్న సరుకు కరువు రోజుల్దాకా కుళ్లు బైటక్కనబడకుండా దాచాలంటే.. ఇనుమా  బంగారమా ఇది! ఎన్ని ఇడుములు పడితే రెండు రాళ్లు ఈ గడ్డల వ్యాపారంలో కళ్లచూడ్డం..  దేవరవారు దయుంచాల. గోదాముల నుంచి గోతాల వరకు అన్నింటికీ ఎదురు దేకుళ్లే మహాదేవరా! మా లోకం పందికొక్కు పర్మినెంటు అడ్డాలు  గిడ్డంగులే మహాప్రభో.. ఎన్ని శతాబ్దాలకని లీజుకు తీసుకుచచ్చాయే దేవుడికే ఎరిక! ఎంత మంది లంచగొండులకు ఎన్నిందాలుగా అవీ.. ఇవీ సమర్పించుకుంటే మేమీ ముత్తెమంత లాభంతో అయినా గట్టున పడ్డం! ముందు న్యాయం జరగాల్సింది ఆగమాగమయ్యే మా టోకు వ్యాపారుల త్యాగానికి' ఆవటా  అంటూ హోలుసేలు వ్యాపారస్తుడాత్మ విన్నవింపులు.

 

యమధర్మరాజుగారికి ముందుకు పోయే  దారేదీ దరిదాపుల్లో కనిపించింది కాదు.

 

'మానవులు మహా మాయదారి జీవులు మహాప్రభో!  సత్యవంతుడి కథలోనే తమరా చేదనుభవం చవిచూసుంటిరి గదా! గిడ్డంగులు, గోతాలు గట్రా సరుకు సరఫరాలో తాత్సారానికి కారకులెవ్వరు? ఆ దిశగా విచారణ తిరిగి కొనసాగితే గాని శుద్ధసత్యమేదో బైటపడే యోగంలేదు'

 

చిత్రగుప్తుడి సూచనతో ఉత్సాహం తిరిగి పుంజుకుంది యమధర్మరాజుగారి బుర్రలో.

 

నిపుణుల కమిటీ ఏర్పాటవడం.. నిమిషాల మీదట నివేదిక  సమర్పణవడమూ అయింది. 

 

'గోదాములు లేకుంటేనేమి? అంత కన్నా ధారాళంగా ప్రభుత్వ పాఠశాలల భూమి అందుబాటులో ఉంది  బడావ్యాపారులకు. వాస్తవ  పందికొక్కులు తిండి  కోసమే  అంతలేసి ధరలు పెట్టి ఉల్లితుక్కును ఏ తుగ్లక్కూ కొనడు; వాస్తవానికి  బైటి కొక్కుల బొక్కుళ్లక్కూడా సరిపడా ఆదాయం ఉండక తప్పదు.. కాబట్టే   వృత్తిధర్మ రీత్యా  నిబద్ధతో దోపిడీ కొనసాగడం! తప్పట్టలేం!  కష్టించే   ప్రతీ శ్రమజీవికీ.. తన వంతు మూల్యం దక్కడమే న్యాయం. చెమటోడ్చనిదే  చెమట దోపిడీ అయినా సక్రమంగా సాగదు. అక్రమార్జన అయినప్పటికిన్నీ ఆ ఆదాయానికి గండికొట్టే చర్యలు తగవు. విత్తు మొలకెత్తు వరకు నకిలీదో కాదో కొనేవాడికి మల్లేనే అమ్మి సొమ్ముచేసుకొనే దొంగవ్యాపారికీ తెలిసే అవకాశం  లేదు. నకిలీ సరుకు అమ్ముకునే వాడి మీద కొరదా ఝళిపించడం సమధర్మానికి భంగకరం. పురుగుమందు నాణ్యతలో లోపమే  ఫలసాయం తరుగుదలకు ప్రధాన కారణమని  బాధిత రైతు అత్మ అభియోగం! అదే పురుగుమందు తాగిన కారణంగానే   ఇదే రైతు నిరాటంకంగా ఇప్పుడు మన ముందు నిలబడి ఉన్నాడు;  ఆ కారణంగా ఆ అభియోగం నిష్కారణంగా మోపబడిందని భావిస్తున్నాం.

 

నీటి వనరుల కొరత ఒక కారణమైతే; వానలు సకాలంలో పడక కొంత, పడ్డా అది అకాలమవడమో, అవసరానికి మించి పడడమో మరికొంత.. పంట దిగుబడి దెబ్బతినేందుకు ఈ తరహా ఇతరేతర  ముఖ్య కారణాలింకెన్నెన్నో. రుతుపవనాల క్రమశిక్షణారాహిత్యంపైన కఠిన చర్యలు  ఆహ్వానీయమే.. కాని వరుణదేవుని పై విచారణ  యమధర్మరాజు పరిధిలో లేదు. చివరగా, చేతికందిన పంటను బతుకుతెరువు కోసమై అధిక ధరలకు అమ్ముకునే అన్నదాతను తప్పట్టడమే అన్నిందాలా ఉచితం.  సాగుభూమిని లాభాపేక్షతో భవననిర్మాణ  రంగాలకు ధారపోసే రైతూ  సహనిందితుడే! కానీ, రైతన్నే రాజు కనుక, రాజుని శిక్షించే అధికారం యమధర్మరాజుకైనా రాజ్యాంగం ధారపోయలేదు కాబట్టి...'

 

విచారణ సంఘం చేంతాడు నివేదిక  అనంతరమూ ఎవరి పై ఏ చర్య తీసుకొనడం ఉచితమో సాక్షాత్ యమధర్మరాజులవారికే అంతుబట్టింది కాదు. అయోమయం మరింత పెరిగడం ఆఖరి ఫలశ్రుతి. 

 

కేసు విచారణ మన్వంతరాల తరబడి నాన్చడమూ న్యాయసమ్మతం కాదనే నియమం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మయధర్మరాజుగారి మేధ  నుంచి వచ్చిన  తీర్పు నరకలోక   నేర విచారణ చరిత్రలోనే కొత్త సంప్రదాయానికి నాంది పలికింది.

 

కోరుకున్న జన్మను సగటు జీవికి ఆత్మకు ప్రసాదించి తిరిగి భూమ్మీదకి పమ్మించేయడమే ఆ విచిత్రమైన తీర్పు!

 

'మహాప్రభో! అన్నదాత బతుకు పగవాడికైనా వద్దు. పేరుకే దేశానికి అతగాడు వెన్నెముక కాని, కన్నా   గాడిదకు మించిన దైన్యం అతగాది  హీనం. చిల్లర మల్లర వ్యాపారి బతుకైతే అసలుకే  వద్దు. అల్లరి చిల్లర అయిపోవడం మించి  ఒరిగేదేమీ లేదు చిరువ్యాపారికి.  టోకు వ్యాపారి బతుక్కథా డిటోనే స్వామీ!  పైన పటారం.. లోన లొటారం! ఆ పద్దు బుక్కుల  వ్యాపారమూ నా కొద్దనే వద్దు. పంది కొక్కు బతుకు కొద్దిగా సుఖమే కాని, చూస్తూ చూస్తూ మరీ బొక్కుడు బతుకా? నో.. వే! పురుగు మందుగా పుట్టడం బెటరే! కానీ.. నకిలీల పుణ్యమా అని చంపాలన్నంత పగ కచ్చితంగా తీరుతుందో లేదో..   చివరిదాకా తేలదు.'

 

అందుకే  ముందే ఆలోచించి పెట్టుకున్నట్లుగా.. అందరి మీదా ఒకే సారి ఎప్పుడైనా టోకున బదలా తీర్చుకునే జన్మను చివరకు ఎంచుకున్నది సగటు జీవి అత్మ. 

అదే ఉల్లి జీవితం.

 

ఎవరు అడ్డంగా, నిలువునా కోసినా కన్నీళ్లు కార్పించడమే కాదు, ఎన్నికల వేళల్లో హఠాత్తుగా అటకెక్కి  కిందకు దిగకుండా.. ఓటరును రెచ్చగొట్టి ఠపీమని పాలకులను పడగొట్టేయడం ఉల్లి స్పెషాలిటీ!'

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- వ్యంగ్యం - 25నవంబర్, 2013 ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...