Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ఎదిగిన విధంబెట్టిదన... రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సం. పు - 21 - 07- 2016 - ప్రచురితం )

 




ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

ఎదిగిన విధంబెట్టిదన... 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 21 - 07- 2016 - ప్రచురితం ) 





'ఈ మధ్య పత్రికల్లో మరీ ఎక్కువైంది బాబాయ్ ఈ గోల! ఈ ' ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏమిటి? 


' పక్కనే చక్కని తెలుగు ముక్కల్లో రాసుందిగా, ' సరళ తర వ్యాపార నిర్వహణ'  అని మీ బాబాయి పని చెడ గొట్టందే  నీకేం తోచదా? ' 


'బాబాయికి పనా ఇదేంటి కొత్తగా? '


' అట్లకు పిండి రుబ్బి పెట్టాలి. బట్టలకు సబ్బు పెట్టి ఉతికి ఆరబెట్టాలి. అన్నింటికన్నా ముందు బియ్యంలో రాళ్లు ఏరిపెట్టాలన్నది మీ పిన్ని హుకుం రా! ఏ 'సరళతర విధానం' అవలంబించి ఈ పనులన్నీ చకచక చేసుకుపోదామా అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాననుకో . ఇంతలోనే నువ్వొచ్చి పడ్డావ్' 


ఈ బియ్యంలో రాళ్లు ఏరే కన్నా.. రాళ్లలో బియ్యం ఏరడం సులభం బాబాయ్! అదే ప్రస్తుతానికి మనం అవలంబించాల్సిన సరళతర నిర్వహణ' 


' మా బాగా చెప్పావురా! ఈ దుకాణాల వాళ్ళు బియ్యంతో వ్యాపారం చేస్తున్నారో, రాళ్లతో వ్యాపారం చేస్తున్నారో బోధపడకుండా ఉంది.' 


' అర్థమైందిలే బాబాయ్ ఇప్పుడీ సరళతర వ్యాపార నిర్వహణ మూల సూత్రం ' 


' ఛ.. ఛ !  ప్రపంచ బ్యాంకు ఇలాంటి చేటలో బియ్యం చెరిగే విధానాలను గురించి ఎందుకు సమయం వృథా చేసుకుంటుందిరా తిక్క సన్నాసీ! పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవడానికి ఉన్న వెసులుబాట్ల ప్రకారం వివిధ దేశాలకు అది ర్యాంకులు ఇస్తుంటుంది. ఆ ర్యాంకుల్ని ఆధారం చేసుకొనే పెద్ద వ్యాపారస్తులు ఏయే దేశాల్లో పెట్టుబడులు పెడితే గట్టి లాభాలు గుంజుకోవచ్చో ఓ అంచనాకు వస్తుంటారు' 


'అలాగైతే మన దేశానికి మొదటి ర్యాంకు వస్తుండాలే ఏటేటా' 


' వెనకనుంచి మొదటి ర్యాంకు రానందుకు సంతోషించు! నూట ఎనభై దేశాల పట్టికలో నిరుడు మనది నూట ముప్పై నాలుగో ర్యాంకు. ఈసారి నాలుగు స్థానాలు ముందుకు జరిగామంతే ! సింగపూర్ మొదటి నుంచీ అగ్రస్థానం. ' 


' అన్యాయం బాబాయ్! అంతా సింగపూర్ సింగపూర్ అంటూ కలవరించే వాళ్లేకాని మన దగ్గర ఉన్నన్ని సులువు సూత్రాలు ప్రపంచంలో ఇంకెక్కడ ఉన్నాయి? ఈస్టిండియా కంపెనీ ఈ వెసులుబాట్లను లెక్కేసుకొనే కదా మన దేశాన్ని వెదుక్కుంటూ వచ్చి మన నెత్తికెక్కింది?' 


' ఆ పాత కథలన్నీ ప్రపంచ బ్యాంకు ముందు పరమ దండగరా అబ్బీ!ప్రస్తుతం ' 


' పోనీ, ఇప్పటి లెక్కలు చూసుకున్నా న్యాయంగా మనకే మొదటి ర్యాంకు రావాలిగా బాబాయ్ ? సర్కారు భూముల్ని ఆక్రమించి భవంతులు లేపినా. అడిగే నాథుడు ఉండడు.  మన దగ్గర తిక్క పుట్టి ఎవరైనా కోర్టు గడప తొక్కినా ఆపరాధ రుసుము చెల్లించి ప్రమాణపత్రం గీకేస్తే సరి. . అంతా సర్దుకుంటుంది. ఆక్రమించిన భూములు అమ్ముకొనేటప్పుడు సెటిల్మెంటుకు ప్రజా సేవకుడో మోకాలడ్డినా ఓ శాతం మనది కాదనుకుంటే సరి- అంతా ఓం శాంతి.. శాంతి: - శాంతి: ' 


' ఆ మాటా నిజమేననుకో! వడ్డించే చేతులు మనవాళ్లవయ్యేలా కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు తట్టెడు సిమెంటన్నా తయారు కాకముందే పది రూపా యల షేరు పదింతలు పెంచి రాత్రికి రాత్రి సంపన్నులైపోవచ్చు. తుక్కు తవ్వుకుంటామని చెప్పి, ఉక్కు తయారయ్యే సరకు తరలించినా చాలు. ఏడుకొండలవాడి నెత్తికి కిరీటాలనేంటి, పడుకునే గదుల్లో పక్క ఎక్కేందుకు వాడే ఎత్తుపీటలకూ మేలిమి బంగారంతో మలాములు చేయించుకోవచ్చు. లెక్కలడిగే నోళ్ళు నొక్కి పారేసేందుకు విందులు, వినోదాలు ఉండనే ఉన్నాయి గదా' మరెందుకు ఇంత దిక్కుమాలిన దిగువ ర్యాంకులో మనల్ని తొక్కి పారే చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు? మంచి ర్యాంకు కొట్టేయాలంటే మరేదన్నా మతలబు ఉందంటావా బాబాయ్?'


'ఏమోరా. దమ్ముండాలేగాని దుమ్మూ ధూళితోనైనా సరే దుమ్ములేపు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసి పారేసే వెసులుబాట్లు మనదేశంలో వీశల

కొద్దీ వాడుకలో ఉన్న మాట వాస్తవమే!  అయినా ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ కొలమానాలకు పక్కదారి చిట్కాలు బొత్తిగా కుదరవేమోరా! గాలికి, వానకి ఎక్కడో శేషాచలం అడవుల్లో పడి ఎదిగేవి ఎర్రచందనం మొక్కలు! చలిపులులకు వెరవకుండా ప్రాణాలకు తెగించి మరీ రెండు దుంగల్ని నరికి ఏ చైనాకో, జపానుకో తరలించి నాలుగు డబ్బులు దండుకునే రూట్లు ఎన్ని కనిపెట్టారు మన దేశీయ కొలంబస్సులు! కొత్త మార్గాలు కని పెట్టారన్న కనీస కృతజ్ఞతైనా లేకుండా ఎన్ని ఎన్ కౌంటర్లు జరిపారో?' 


' నిజమే బాబాయ్. క్రికెటర్లను వేలం వస్తువుగా మార్చేసి, ఆటలో వాణిజ్య లాభాల సూత్రాన్ని కనిపెట్టిన లలిత్ మోదీనైనా బిజినెస్ మోడల్ గా  చూసుకో వద్దూ! ఆ అబ్బిని దేశం సరిహద్దులు దాటిందాకా తరిమి తరిమి కొట్టాం మనందరం: ఏటేటా అందమైన సుందరాంగుల శృంగార భంగిమ లతో గోడ క్యాలండర్లు పంచిపెట్టే అమూల్యమైన ఆలోచన చేసిన వ్యాపార మేధావి మాల్యా బ్యాంకులకు అతగాడు ముష్టి ఏడు వేలకోట్లు బకాయి పడ్డాడని దేశం దాటి పారి పోయిందాకా నిద్రయినా  పోకుండా పహరా కాస్తిమి: పీనా సులు పోపు డబ్బాల్లో, పక్కగుడ్డల కింద దాచుకున్న చిల్లర సొమ్మునంతా బయటకు లాగడం సామాన్యమైన చమత్కా రమా! స్తబ్ధుగా పడున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా తట్టి లేపాడన్న విశ్వాసమైనా లేదు అగ్రిగోల్డు పెద్దాయనమీద దేశంలోని పెద్దలెవరికీ' 


'నిజమేరా! నాలుగు డబ్బులు రాబట్టే ఉపాయాలు కనిపెట్టే వ్యాపారస్తుల మీదా న్యాయస్థానాలు సైతం అట్లా అగ్గినిప్పులు కురిపించేస్తుంటే. . ఎ గుండె నిబ్బరంతో విదేశాల నుంచి బిజినెస్ పెద్దలు సముద్రాలు దాటొచ్చి మరీ ఇక్కడ పెట్టుబళ్లు పెడతారు? మదుపుదారులకు డబ్బులు చెల్లించే విష యంలో విఫలమై, తిహార్ జైలు ఊచలు లెక్కించే సహారా గ్రూప్ సుబ్రతో రాయ్ గుర్తున్నాడా ? అతగాడు రాసిన పుస్తకం 'లైఫ్ మంత్రాస్' ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడైన వ్యక్తిత్వ వికాస గ్రంధంగా  రికార్డులకెక్కినా, ప్రపంచ బ్యాంకు అతగాడి వ్యాపార సులువు సూత్రాలని లెక్కలోకే తీసుకోవడంలేదు'


'ప్రపంచ బ్యాంకు కొలమానాలకు కొన్ని పరిమితులు ఉన్నాయనుకుంటా' 


' అలాగని అన్ని రకాల వ్యాపారాలకు తరగని గని లాంటి మనదేశానికి ఇంత దిక్కుమాలిన ర్యాంకు ఇచ్చి కిందకు తొక్కేస్తే అరటి తొక్కల వ్యాపారం కూడా ఇక్కడ ఎక్కివస్తుందా బాబాయ్! ఈ కాలం 'ఈ-కాలం' అయిపో యింది. ఈ ర్యాంకుల గొడవొకటి కొత్తగా నెత్తిమీదకొచ్చి పడింది. ఎలాంటి వ్యాపార వెసులుబాటులో విస్పష్టంగా చెప్పకుండా వట్టిగా ' సరళతర వ్యాపార నిర్వహణ' అని ఒక పేరు పెట్టి ర్యాంకుల పట్టికలు తయారుచేసుకుంటూ పోతుంటే ఎలా? ఎంత మేధి పొంగిపొర్లే గడ్డ అయినా గుడ్డిగవ్వ పెట్టుబడి పెట్టేందుకు విదేశీయులే కాదు స్వదేశీయులూ ముందుకు రానేరారు.' 


' అందుకే కదరా.  మీ పిన్ని రాళ్లు ఏరమని ఇచ్చిన బియ్యాన్ని సరళతరం వ్యాపార నిర్వహణ పద్ధతిలో రాళ్లకు బదులు బియ్యం గింజలేరి ఇచ్చేసింది! దాంతో చేసిన కిచిడీ ఇది. రుచి చూడు ! ఫలితం సానుకూలంగా ఉంటే సరళతర వ్యాపార నిర్వహణ నివేదిక ఒకటి తయారుచేసి ప్రపంచ బ్యాంకుకు మనమే సమర్పిద్దాం!' 


' బాబోయ్ . పన్ను విరిగింది. బాబాయ్ నీ బియ్యం కిచిడీ బంగారం కానూ' 


పిన్ని రంగ ప్రవేశం.


'విరగదట్రా వెర్రి సన్నాసీ/ బియ్యం కిచిడీలో ఉన్నవన్నీ పలుగు రాళ్లేనాయే! తమరి బాబాయిగారి సరళతర వ్యాపార నిర్వహణ విధానం అంత సలక్షణంగా ఏడ్చింది. మరి ఆడమనిషినని తీసిపారేయకుంటే నాకు తోచిన సలహా ఒక్క టి విని బాగుపడండి! ఈ దేశంలో అపరిమిత లాభాలు గడించి పెట్టే సరళ తర వ్యాపార నిర్వహణా  విధానాలు సక్రమంగా పనిచేసే రంగం ఒక్కటే ఒక్క టుంది. మీ ప్రపంచ బ్యాంకు కొలమానాలకు, అదిచ్చే పిచ్చి పిచ్చి ర్యాంకులకు అందనంత ఎత్తులో ఉందది. అదే రాజకీయ రంగం.  అందులో మీరెలాగూ రాణించే అవకాశం లేదుగాని,లోపలికి పదండి!  పిండి రుబ్బి పెడితే అట్లు పోసి పెడతా..  హాయిగా ఆరగించి గుర్రుకొట్టి నిద్దరోదురుగాని ఇద్దరూ! 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 21 - 07- 2016 - ప్రచురితం ) 


ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం అంతా మాయ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సం.పు- 09 -02-2009 న ప్రచురితం )

 



ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

అంతా మాయ 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సం.పు- 09 -02-2009 న ప్రచురితం )


'సత్యం రాజుగారు కంపెనీలో ఏడు వేలకోట్లు కని పించటం లేదంటున్నారేమిటి స్వామీ? '


యామా సా మాయా' నాయనా!'


' చిత్తూరు రోజా  బెల్టు షాపుల్ని రద్దు చేయమంటే సీయం నా దగ్గరెలాంటి బెల్టులూ, మొలతాళ్లేవీ లేవంటున్నాడేమిటి గురూజీ! 


 'యామా సా మాయా' శిష్యా! 


'ఎన్నికలకు ముందే ఓటర్ల జాబితాలో పేర్లు కనబడకపోవటమేంటి దేవా?' '


యామా సా మాయా' వత్సా ! '


'బొత్సాగారు  వోక్స్ వేగన్లో పోసిన పదకొండు కోట్లూ పత్తా లేకుండా పోయాయి. బాలాజీ బంగారు డాలర్లకు రెక్కలొచ్చి ఎటో చక్కా ఎగిరిపోయాయి! ఆయేషాను చంపిన అసలు హంతకుడి అంతు దొరక్కుండా వుంది. మంత్రులు మారుతి కార్లయినా లేవని   గగ్గోలు పెడుతున్నారు . రాజకుమారి గారింట్లోని బంగారం మొత్తం పోగేసి తూచినా రెండు తులాలు మించి తూగడంలేదంట ! ఈ మాయంతా ఏమిటి మహాత్మా! '


' యామా సా మాయా అన్నానుగా నాయనా!' 


'అసలు - ఆ మాయదారి ' యామా సా మాయా ' అంటే  అర్థం ఏమిటి స్వామీ?' 


' ఏది కలదో అది లేదు' అని భావంరా బుద్ధూ! ఇది బుద్ధుడు బో ధనరా బండ శిష్యా! ' 


'బొత్తిగా నా బుర్రకెక్కనే లేదు. కాస్త వివరంగా చెప్పండి గురూజీ!' 


' నీకేదైతే బుర్ర ఉందని నువ్వనుకుంటున్నావో అది లేనేలే దని  అర్ధం నాయనా! మన అశోక చక్రం మీద మూడు సింహాలున్నట్లుంటాయా!... నిజానికవి నాలుగు నాయనా! కనిపించని ఆ నాలుగో సింహమే 'యమా సా మాయా' ! 


'అయోమయం ఇంకా అలాగే వుంది మహాశయా!' 

మరింత వివరంగా చెప్పి పుణ్యం కట్టుకోరాదా!' 


'మన ప్రధాని మన్మోహన్ సింగుగారి వెనక తలకాయ  ఎవరిది బిడ్డా?' 


'మన మేడమ్ సోనియా గాంధీగారిదీ'


' కనిపిస్తుందా?' '


' లేదు స్వామీ!'


' మొన్న జరిగిన ముంబై దాడుల వెనకున్న హస్తం ఎవరిది శిష్యా? ' 


'ఇంకెవరిదీ! కనిపించటం లేదుగానీ... కచ్చితంగా అది పాకిస్తానుదే. ' 


' అలాగే ఉండీ కనిపించకపోవటాన్నే 'యామా సా మాయా' అంటారు. దాన్నే 'జగమే మాయ' అని దేవ

దాసు పాడుకున్నాడు. 'కనబడినది కనబడదని... వినబడినది వినబడదని' మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో మొత్తు కున్నాడు. ఈ కనబడకపోవటాలూ, వినబడకపోవటాలూ ఇవాళ మనకు కొత్తగా పుట్టుకొచ్చిన వికారాలేమీ కాదురా  శిష్యా! మహాభారతకాలంలో దుర్యోధనుడికి మయసభామధ్యమంలో  మడుగు ఉండీ కనబడకపోవటం చేతే కదా తడబడి అడుగుపడి బుడుంగుమని నీట మునిగి గొడవ గొడవ అయినదీ! 


' ఆ ద్వాపర యుగంలో సరైన వైద్యసహాయం లేక దుర్యోధనుడు కనబడేది కనబడలేదని పొరబడి ఉండవచ్చునేమో గానీ , ఈ కలికాలంలో కళ్ళజోళ్లు, కాంటాక్టు లెన్సులూ, కంటాపరేషన్లు వంటి సదుపాయాలు  బోలెడన్ని ఉండగా ఈ కనబడకపోవటాలూ, వినబడకపోవటాల అంతర్యమేంటో అర్ధం కాకుండా ఉంది స్వామీ! ' 


' కమ్యూనిస్టులకు అస్తమానం కనిపించే అవినీతి కాంగ్రెస్ వాళ్లకి ఫ్లడ్ లైట్లేసి వెతికినా  కనబడకపోయె! వై.ఎ స్ కి ఎక్కడబడితే అక్కడ కాళ్ళకడ్డంపడుతూ కనిపించే అభి వృద్ధి చంద్రబాబుకీ, చిరంజీవికీ చుక్కంత కూడా చూపులకానటంలేదాయె!'

ప్రతిపక్షాలకి ప్రతిదీ రాద్ధాంతం చేయటమే

సిద్ధాంతంగానీ ... సవ్యంగా ఆలోచిస్తే ఈ 'యామా సా మాయా ' అనేదే లేకపోతే లోకం కనీసం రెండు గంటలైనా సవ్యంగా  నడుస్తుందా నాయనా! బెయిలు కోసం పెద్ద మనుషులుకి నిజం గుండె పోటొచ్చిందాకా ఆసుపత్రుల్లో అలా పడుండాలంటే బైట రాజకీయాలు సజావుగా సాగుతాయా! ఇన్నేసి వేలకోట్లకు బిల్లులు పాసవుతున్నాయే! ... మచ్చుక్కి ఒకటి రెండు ప్రాజెక్టులైనా పూర్తవలేదంటే అధిష్ఠానం  ముందు కిందవాళ్ల  పరువు దక్కుతుందా! రాబోయే ఎన్నికల్లో అధికారపక్షం ఘనవిజయం అరచేతి మీద పండిన గోరింటాకంత స్పష్టంగా కనీసం సర్వేరాయుళ్ళకన్నా కనిపించకపోతే కార్యకర్తలను పట్టి అట్టేపెట్టుకోటం అంత సులభమా బిడ్డా ! బస్సుల్లో స్త్రీల సీట్లలో స్త్రీలే కనిపిస్తున్నారా! స్టోరీ సినిమాల్లో స్టోరీ కనిపిస్తుందా!


'యామా సా మాయా' మన సినిమాల వంద రోజుల పండుగలాంటిది। అది సామాజిక న్యాయమంత గంభీరమైనది. ఓబలాపురమంత గుంభనమైనది. ఇందులో ఇడుపుల పాయకన్నా ఎక్కువ మడతలున్నాయి నాయనా! పేలేదాకా బస్టాండులో పడివున్న  సూట్ కేసులో కూడా ఏముందో కనిపించదు. హరీష్ రావుకి వచ్చిన ఉత్తరం సుదర్శనమే రాసిందని ఘంటాపథంగా చెప్పగలవా? 'యమా సా మాయా' లేని రాజకీయాలు గిల్పం గింబళీ లేని మాయాబజారు సిని మాలా మజాగా ఉండవు శిష్యా అర్ధమయిందా!' 


'రేడియో సంస్కృత వార్తల్లాగా అర్ధమయీ అర్ధమవన ట్లుంది స్వామీ! చివరగా ఓ సందేహం. ఈ కనబడనవి కన బడేట్లు చేయాలంటే ఏమిటి సాధనం మహాత్మా! అంజనం రాసుకోవటమే ఏకైక మార్గమా? '


'లాభం లేదురా అబ్బాయ్! ఆపై వాక్యంలో ఏముందో తెలుసా? నీలాంటి వాడికి ఎంత అంజనం పట్టించినా ఏవీ కనబడదుగానీ, నాలాంటి జ్ఞానికే ఏ అంజనమయినా! ఇలా పట్టించేస్తే అన్నీ చక్కగా కనిపిస్తాయ్ సుబ్బారావ్! ' 


' సుబ్బారావేంటి? ... నా పేరు వెంకట్రావ్ స్వామీ! అయ్యో ! మీరు  పట్టించింది అంజనం కాదు... అమృతాం జనం... మీకూ కనిపించటంలేదా ఏమిటి  మహాత్మా!'


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సం.పు- 09 -02-2009 న ప్రచురితం )


ఈనాడు - గల్ఫిక- హాస్యం - వ్యంగ్యం ' లా ' వొక్కింతయు లేదు .. - కర్లపాలెం హనుమంతరావు

 


ఈనాడు - గల్ఫిక- హాస్యం - వ్యంగ్యం 


' లా ' వొక్కింతయు లేదు .. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 22 -11-2003 - ప్రచురితం ) 


'వాట్ ఈజ్ ది ఓల్డెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ ది వర ల్డ్'-  అనడిగాడు అప్పారావు.


అప్పారావు చెనలాయ (చెట్టు కింద వకాల్తా చేసే లాయరు)గా తిరిగే రోజుల్లో కోర్ట్  బార్లో కన్నా కోర్టు బైటున్న బారులోనే  ఎక్కువగా ఉంటుండటం వల్ల బిల్లు తడిసి మోపెడై మోపెడ్ అమ్ముకున్నా తీర్చలేని స్థితిలో అప్పారావునే అల్లుడిగా బిల్లుకి చెల్లేసుకున్నాడా బార్ అండ్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్. 


 అప్పారావుకిప్పుడు పెర్రీ మేసన్ కు  ఉన్నంత  పేర్లేకపోయినా ఈ బారు మూలంగా చౌకబారు జనం బారులు తీరుంటారని పేరుంది.  కోర్టు బైటా లోపలా కూడా మామా అల్లుళ్ళలా ఎడాపెడా జేబులు కొడుతున్నారని గిట్టని వాళ్ళు కుళ్లుకుంటుంటారు. అది వేరే కథ


సత్తిరాజు కొడుకు పెళ్ళి సందర్భంగా ఓల్డు బాయిస్సందరికీ అప్పారావు బారులో ఆతిథ్యమంటే ఓ పది మంది పాత మిత్రులదాకా పోగయి కూర్చున్నాం. మనిషి కనబడితే చాలు... ప్రశ్నల్తో ప్రాణాల్తీయటం అప్పారావు వృత్తి, ప్రవృత్తి.  అందుకే ఇందాకా ప్రశ్న.


'ఆడమ్ ఆరో పక్కటెముకనరగతీసి మేడమ్ ను  చేశాడా దేవు డని కదా బైబిల్ కథ! సో... సర్జరీ ఈజ్ ది ఓల్డెస్టు సబ్జెక్ట్ ఆఫ్ ది సొసైటీ' అనేశాడు సత్తిరాజు.  వాడు డాక్టరు. 


' సత్తీ! ఆపు నీ సుత్తి' యాడమ్మైనా, మేడమ్మైనా ఉంటానికి  ... తింటానికి  ఓ ఇంటి పంచా, తినే పండూ ఉండాలి కదా! ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేముడిలోనింజనీరే... సో..! ' 


' యువర్ ఆవర్!  సర్జరీ ఈజ్ ఆఫ్టర్ అవర్ ఇంజనీరింగ్ ' అన్నాడు.

రంగారావు . మామ రియలెస్టేట్లో వాడు సివిలింజనీరు. 


' దేవుడైనా ప్రపంచాన్నెలా సృష్టించాడు? కన్ఫ్యూజన్ నుం చే కదా! .. అయ్ మీన్... అయోమయం...! దాన్ని సృష్టించిం దిదిగో మన అప్పారావులాంటి లాయర్లేరా రంగారావ్! సో. . త్రీ ఛీర్స్ టు హిమ్.. ' అంటూ విశ్వనాథం గ్లాసు గొంతులోకి వంపేసుకున్నాడు. 


వాడికి లాయర్లకీ పడదు.


గెలాక్సీలు గుద్దుకున్నప్పుడు గెలీలియో తీసిన ఫొటోల్లో కూడా కొన్ని నల్లకోటు విగ్రహాలు ఆయా గ్రహాల  చుట్టూ తచ్చాడు తున్నట్లు నాసా కేంద్రం ఈమధ్యే కన్ఫర్మ్ చేసింది.. కదరా వాసూ' అంటూ వాసుగాడిని కూడా తన వైపు కలుపుకోబోయాడు విశ్వనాథం. 


వాడు శ్రీహరికోటలో చిన్న సైజు సైంటిస్టు.  సాహిత్యమంటే చచ్చేంత ఇంటరెస్టు. 


'మీ మాటలు నమ్మటానికి లేదు.  రామాయణం రోజుల్లో లాయర్లే  ఉండుంటే సీతమ్మోరికి ఆ శీల పరీక్ష జరిగుండేదా? సాక్ష్యాల్లేకే  ఆ సాథ్వీమణి పాపం నిప్పుల్లో దూకింది.  భారతం కాలంనాటిక్కూడా ప్లీడర్లున్నారో లేదో డౌటే! తన్నోడి నన్నో డెనా? ... నన్నోడి తన్నోడెనా?  అని నాడు నిండు సభలో ద్రౌపదలా తన్నుకులాడినా నోరు మెదిపిన నాథుడే లేడు.  ప్లీడర్లే గనకుంకుంటే ద్రౌపదికా దుశ్శాసనుడి పీడానే ఉండేది కాదుకదా!'


'కన్యాశుల్కం నాటకం నాటికి కోర్టులు గట్రాలు పుట్టుకొ చ్చాయి.  గనక పూటకూళ్ళమ్మ మెళ్లో పుస్తె కట్టకముందే కునిష్ఠి ముసలాడు గుటుక్కుమన్నాడని లంచమిచ్చి మరీ పరోహితుడి చేత సాక్ష్యం చెప్పించగలిగారు. పోతనగారు కూడా పాపం ఏదో కోర్టులో బాగా దెబ్బ తిన్న నేపథ్యంలోనే 'లావొక్కిం తయు లేదని '  పద్యంలో 'తెగబాధ పడ్డాడు' అన్నాడు విశ్వ నాథం మళ్లీ. 


వాడి బావమరిది భోపాలు గ్యాసు లీకుపాలై కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతున్నాడని వాడిక్కోపం.  బిన్ లాడెన్నూ, వీర ప్పన్నూ అప్పారావునీ ముందుబెట్టి రెండు గుండ్లున్న గన్నిచ్చి కాల్చుకోమంటే అప్పారావునే కాల్చేస్తాడు రెండుసార్లూ.  లోకం కాల్తా ఉంటే వకాల్తా కోసం వెంపర్లాడే రకాలు లాయర్లని .. వీడి నిరసన. ప్లీడర్ల కోట్లకి జేబులే ఉండవు. వాళ్ల చేతులెప్పుడూ క్లయింట్ల పాకెట్లలోనే ఉంటాయంటుంటాడు. 


వీడిబారినుంచీ అప్పారావును కాపాడుకోలేకపోతే బారు బిల్లు చెల్లించలేక మేము బేరుమనాల్సొస్తుందని..  ప్లీడర్లంటే ఇన్ బిల్డ్ లీడర్లని ఆ పదాన్ని బట్టే పసివాడైనా పసిగడ్తాడని వాదన కెళ్లాన్నేను . ' అవునవును. ఆ ప్లీడర్ అన్న పదంలోనే 'డర్' కూడా ఉందనే నా

' భయం' అన్నాడు వాడు. 


ఇండియన్ ఇండిపెండెంటు స్థగుల్ మూడొంతులు ప్లీడర్ల మీదే డిపెండయి నడిచిందని నీకు తెలుసా? స్వాతంత్య్రానంతరం సైతం రాజ్యాంగ రక్షణ కోసం న్యాయ వ్యవస్థంతెవస్థ పడుతోందో చెబుతూ కూర్చుంటే తెల్లార్లూ ఈ బారిలాగే తెరిచి కూర్చోవాలి. అలాంటి లా వ్యవస్థకి ఈ వకీళ్లే కీలకం! 


' అందుకనేనా..  'లా ' నలా కీలు బొమ్మలా ఆడిస్తూ ఏ కీలుకా కీలు వూడదీస్తున్నారీ వకీళ్ళు?  మొన్న వినుకొండలో తీర్చుకు పది వేలు బేరం పెట్టాడో బారిష్టరు! ' 


' ఇప్పటి దాకా చప్పుడు చేయని అప్పారావప్పుడు నోరు తెరచాడు 'న్యాయదేవత చేతి లోని త్రాసుని చూసి తీర్పుల్ని తూకానికే అమ్మాలని నమ్మేడేమో పాపమా అమాయకుడు! తీర్పు నీ పక్క కొరగాలంటే నువ్వు నా పక్కకు జరగాల్సిం దేనని ఓ లాయరు లేడీ క్లయింట్ కొంగులాగాట్టగా  రాజస్థాన్ లో? ' 


' ధర్మార్ధ కామ మోక్షాలన్నారు  కదా ! ధర్మాన్ని అనుసరిస్తేనే మోక్షమని దానర్ధం'


' బెయిల్ కోసం బెంచినే మార్చి తీర్పుని దర్జాగా మార్చేశారు  బీహారు లాయర్ల సజ్జు' 


'ముల్లును ముల్లుతోనే చులాగ్గాలాగొచ్చనే లాజిక్కుకది కొత్త వరవడి'


'అంతెందుకూ .. నిన్నటికి నిన్న బెజవాడలో ఏకంగా ఒక నకిలీనే నిందితుడిగా కోర్టులో చూపెట్టాడో వకీలు! '


విశ్వనాథం చెప్పేవన్నీ వాస్తవాలే. విషయమెంతా  వాస్తవమైనదైనా సాక్ష్యం లేకుంటే అది సత్యం కాలేదనేది న్యాయశాస్త్రంలోని ప్రథమ సూత్రమని తెలుగు చిత్రాలు చూసే ప్రతి పిల్లాడికి తెలుసు. లంక కోర్టులై నా ఆ పులి  ప్రభాకరానికి నాలుగొందలు జైలు శిక్షా? !  జీవితకాలం పొడిగింపు కోసం దేవుడి కప్పీలు  చేసుకుంటారా ఎల్టీటీయీ!  మెహతా పోయినా కేసే  నడుస్తూనే ఉందింకా! ' 


 ఒక నిర్దోషి శిక్షింపబడకుండా ఉండే ముందు వందమంది దోషులదాకా తప్పించుకొనేందుకు వీలుందని వాదించే వాళ్లను,  బంతుల్లా  చేసి కోర్టులో లాయర్లు ప్లేయర్లై  ఆడుతుంటేను చూడలేక లా దేవతలా కళ్లగంతలు కట్టేసుకుందేమో ? రెండు రెళ్ళు నాలుగని ఒప్పుకొనేందుకు ఇన్ని - దావాలూ, వాయిదాలూ, వాదాలూ, ప్రతివాదాలా?! '


' లాగటంలోనే అంతా ఉందిగదా సోదరా!  సొసైటీని మా లాయర్లు లేయర్లలాగా కాపాడకపోతే లౌక్యం లేని నీబో టివాళ్లు పది మధ్య సున్నా ఉందంటే వందని వెంటనే ఒప్పు కొనే ప్రమాదముందని తెలుసుకోముందు' 


' పది మధ్య సున్నా పెడితే మరి వంద కాదా?' 


'వందా కావచ్చు. పందీ  కావచ్చు. సందర్భాన్నిబట్టి సత్య మేవ జయతే సబ్జెక్టు టూ గట్టి లాయరు'


ఇంతలో బిల్లొచ్చింది. ఐదువేలు! 


అప్పారావన్నాడు విస్సుగా ' తొగాడియా టైపులో  నన్ను తెగాడిపోసుకొన్నావుగా ఇందాక!  నువ్వన్నావే నాసా అని!  అలాంటి కేంద్రమే ఏదో కొత్త ప్రయోగం చేయబోతూ రాకెట్లో వృత్తినిపుణుణ్ణి పైకి పంపాలనుకుని ఇంటర్వ్యూలు చేసింది. సత్తిరాజులాంటి డాక్టరొచ్చి కోటి రూపాయలు కాంపెన్షేషనిస్తే పోతానన్నాడు. ' 


రంగారావులాంటింజనీరు రెండు కోట్టిస్తే రెడీ అన్నాడు. మనలాంటి లాయరు మూడు కోట్లకు బేరం పెట్టి మరీ సెటిలేయించుకొచ్చాడు. ఎలాగో చెప్పగలరా ఎవరైనా?


ఒక ప్లీడరు  పీడా అయినా  భూమికి వదుల్తుందని ఒప్పుకొనుంటరులే ! - అన్నాడు విస్సుగాడు విసుగ్గా. 


 'మట్టి బుర్రలకంత తొందరగా తట్టేది కాదుగా ని.. బారు  మూయటానికింకో అరగంట మాత్రమే టైముంది. బేరర్.. చూసుకో ! కరెక్ట్ ఆవ్యరిస్తేనే బిల్లులో  కన్సెషన్ ' అంటూ అప్పారావింకో పార్టీ పిలుస్తుంటే బైటికి వెళ్లిపోయాడు.


గంటయినా ఎవరం లేవలేక పోవటం చూసి బేరరొచ్చి బిల్లు వసూలు చేసుకుపోతూ ' అడ్వకేటు సారెప్పుడూ అంతే సారూ ! ఫ్రీగా ఇప్పిస్తానని తెగ తాగిస్తాడు. మెలికబెట్టి ఇలాగే డబుల్ లాగేస్తాడు. మీరు మొదటివాళ్లూ కాదు.. ఆఖరి వాళ్లూ  కాబోరు' అన్నాడు చిన్నగా చివరిగా. 


' వాడి  ప్రశ్నకు జవాబు నీకు తెలుసా? ' అనడిగాను కారు బయలు దేరే  ముందా బేరర్నే. 


' తెలుస్టార్! ఒక కోటి తనకు. ఒక కోటి ఆ నాసావాడికి. ఇంకోటి డాక్టరుకి పైకి పోవటానికి ' 


' మరాలాయరు పైకి పోడా ?! ' 


' పోతే ఎలా ? బారు ప్రాక్టీసో ' 


' అమ్మ అప్పారావూ! కోర్టు బార్ ప్రాక్టీసు ఎలాగూ లేదని. . త బారు పాక్టీసులో ఆరితే రావా! అదిరా మన అడ్వకేటుగారి తెలివి అంటే ' అన్నాను, 


' ఆ తెలివి నీ అడ్వకేటుగారిది కాదు.  కేటుగాడిది '  అన్నాడు విశ్వనాథం కసికసిగా! 


కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 22 -11-2003 - ప్రచురితం ) 


ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం వాక్ దూషణం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సం. పు - 16-02-2012 - ప్రచురితం )

 



ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

వాక్ దూషణం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 16-02-2012 - ప్రచురితం ) 


మానవజన్మ మహత్తరమైన వరం అను కుంటాం కానీ, పనిచేసే చెవులు రెండున్నవాడికి నిజంగా అది పెద్ద నరకమే! 


' సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకాము' అంటూ రామదాసు కీర్తన అమృతంలా చెవుల్లో పడ్డ ప్పుడు- 'ఆహా, ఎంత వీనులవిందుగా ఉంది! ' అంటూ ఆనందిస్తాం. అదే- 'ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరి గేవు. రామచంద్రా!' అంటూ దీర్ఘం తీస్తూ గోపన్న దెబ్బలాటకు దిగినప్పుడు 'అబ్బా' అనిపించక మానదు.


తిట్లు, శాపనార్థాలు మనకు కొత్తకాదు. ధర్మరాజు నుంచి అగ్రతాంబూలం అందుకుంటున్నాడన్న ఉక్రోషం కొద్దీ శ్రీకృష్ణుణ్ని శిశుపాలుడు మహాభారతంలో పడతిట్టి పోశాడు. 


పిలిచి భోజనం పెట్టలేదని పెళ్లివారింట విస్తళ్లలోని అన్నాన్ని సున్నంగా, అప్పాల్ని కప్పలుగా మార్చేశాడు భీమకవి. 


ఇక యుద్ధానికి ముందు రామాంజనేయుల మధ్య పరస్పర దూషణలూ మజాగా సాగుతాయి. 


కృష్ణపాండవీయంకన్నా కృష్ణార్జున యుద్ధమే రసవత్తర దృశ్యం


తెలుగు సాహిత్యంలోనూ తిట్టు కవిత్వం ఎక్కువే. కాల్లో ముల్లు గుచ్చుకుందని చెట్టునే తగలెట్టాలంటూ తిట్టి పోసిన మల్లుడొకడు. చేతిలోని ఉంగరం జారిపోయిం దని బంగారంలాంటి చెరువు నీళ్లనే ఎండబెట్టిన బడబాగ్ని ఇంకొకడు. రాజుగారు పిలిచి పీటేసి, దండిగా సంభావనలు ముట్టజెప్పలేదని కోటగోడల మీద ఆయన సర్వనాశనమైపోవాలని తిట్టు  కవిత్వం రాసిపోయిన రామకవి మరొకడు.  తరచి చూడాలేకానీ, పుట్టలకొద్దీ తిట్ల సాహిత్యం మన సొంతం . 


అశ్లీలం అశ్లీలం అని ఆడిపోసుకుంటున్నాంగానీ, ఆ మాత్రం వేడి భాషలో లేక పోతే వినేవాడే ఉండడు.  ' మీ పిండం  కాకులకు పెట్టా! . . మీ ఇంట్లో కోడి కాల్చా' అంటూ పువ్వులు రువ్వినట్లు పదప్రయో గాలు చేస్తూ కూర్చుంటే- చెవిన పెట్టే రోజులా ఇవి!


పడతిట్టాలంటే అందుకు ఎంతో సృజనాత్మకశక్తి కావాలి.  తిట్టిన తిట్టు తిట్టకుండా, తిట్టినవాడిని తిట్టకుండా తిట్టడమంటే- అదొక భాషాయజ్ఞం. అందుకోసం ఎప్పటి కప్పుడు ఎన్నెన్నో కొత్త పదాలు సృష్టించుకుంటూ వెళ్లాలి. 


పొగడ్తలెప్పుడూ ఒకేరకంగా ఉంటాయి. ఎలా పొగిడినా. పొగిడించుకునేవాడికి పాయసంలో వేయించిన జీడిపప్పు తిన్నంత మజాగా ఉంటుంది. శాపనార్థాలకు అలాంటి అవకాశం లేదే! 


ఒక తిట్టుపదం ఒకసారి ప్రయోగించాక దాని పదును తగ్గిపోతుంది. అంతకన్నా దరిద్రమైన కొత్త పదాన్ని ప్రయోగించలేకపోతే యుద్ధంలో ఓడిపోయినట్లు చెడ్డ పేరొస్తుంది . నాలుకకు  నరం లేకుండా వాడుతున్నాడని ఆడిపోసు కుంటారే గానీ అతగాడి నిరంతర  వాక్చాతుర్యం వెనకగల ఆపార ప్రావీణ్యాన్ని గుర్తించడం లేదే! 


 'గాడిద కొడకా!' అంటే గాడిదలు కూడా మెదలకుండా ఊరుకోవడం లేదు. అక్కు పక్షుల సంఘాలూ హక్కుల కోసం బజారున పడుతున్న రోజుల్లో ఒక పదాన్ని వాడాలంటే ఎంతో సాహసం చేయాలి. అయినా గుర్తింపు కొరవడుతోంది. 


వెటకారంగా మాటలు విసిరితే పనులయ్యే రోజులా ఇవి సంస్కారవంతులకూ సంస్కృతంలో అంటితే తప్ప పరిస్థితుల ఘాటు బోధప డటం లేదు. వాన చినుకులతో దున్నపోతులు అదరన ప్పుడు, వడగళ్లతో బెదరగొట్టడంలో తప్పేముంది! అదేప నిగా వాగుతున్నారని ఈసడించుకొంటున్నారుగానీ, ఈ

తిట్ల పురాణాల వెనక- ఎంత కథ, శ్రమ, పరిశ్రమ, పరిశోధన, తెగువ, తపన దాగు న్నాయో ఎవరైనా అర్ధం చేసుకొంటున్నారా!


ఆంగ్లంలో మాట్లాడితే మాతృభాషాభిమానం లేదని గోల పెడుతున్నారు. అచ్చమైన తెలుగు పదాలు విచ్చలవిడిగా వాడుతుంటే, 'భాషాభివృ ద్ధికి దోహదం చేస్తున్నాడని దోసిలి పట్టాల్సిందిపోయి, దోషాలు ఎంచడం ఎంత అన్యాయం! 


చట్టసభల సాక్షిగా గవర్నర్లమీదే కుర్చీలు, బల్లలూ పడ్డా ఎవరికి చీమ కుట్టినట్లనిపించలేదు. బోలెడంత ఖర్చుపెట్టి, ఎండ వానలకు పడి బజార్లలో తిరుగుతూ గొంతుచించు కుంటున్నా రాని ప్రచారం . . ఇంట్లోనో, కార్యాలయంలోనో ఓ గంట విలేకరుల సమావేశం పెట్టి రెండు బూతులు లంకించుకుంటే- పైసా ఖర్చనేది లేకుండా బోలెడంత పేరోస్తుంది . 


చిలకల్లా రోజూ ఒకే పలుకు పలుకుతుంటే సొంతపార్టీ కార్యకర్తలే సొమ్మసిల్లి పడిపోతున్నారు. నిమ్మరసం లేకుండా అందరిలో హుషారు కలిగించా లంటే- ఈ కాలంలో 'ఈసడింపు భాష' ను  మించిన బ్రహ్మాస్త్రం మరొకటి లేదు. రాజకీయాల్లో అంతిమ విజయం. అలాంటివారికే నేటి పాలిటిక్సులో ఫైనల్ విజయం . 


ఎవరి చివరి లక్ష్యమైనా సింహాసమేగా ? లక్ష్యం ప్రధానం లక్షణాలతో పనే లేదు. 'నోరు పారేసుకుంటున్నారని మనం నేతల మీద అలా ధ్వజమెత్తడం ఘోరం. ఆన్ పార్లమెంటరీ అంటూ వారి నోటి దురదను అలా గాలికి వదిలేయకుండా, శాశ్వత ప్రాతిపదికపై ఆ పదజాలాన్ని నమోదుచేసుకునే కార్యక్రమం మొదలు పె డితే- ప్రపంచ భాషలన్నింటికీ మన తెలుగే మార్గదర్శక మయ్యే అవకాశం అధికం. నీళ్ల పంపు దగ్గర నోరు పారే సుకునేవాళ్లకూ కాస్త 'మాటసాయం' అందించినట్లవు తుంది. 


పాఠాలు ఎప్పుడైనా నేర్చేసుకోవచ్చు. అవకాశం వచ్చినప్పుడల్లా మన భావిపౌరులకు టీవీల్లో నేతల బూతు ప్రసంగాలు వినే అవకాశం కల్పిస్తే- ముందు ముందు మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అన్న కీర్తితో పాటు అతి పెద్ద బూతుస్వామ్యం' అనే ఘనతా అదనంగా సాధించు కోవచ్చు . బూతు సాహిత్యం వినలేని చాదస్తులు చెవుల్లో సీసం పోసుకోవచ్చు ఎవరొద్దన్నారూ? 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 16-02-2012 - ప్రచురితం ) 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక నలుపై తెలుపు గెలుపు రచన- కార్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సం. పు - 16-09-2016 - ప్రచురితం )

 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక

నలుపై తెలుపు గెలుపు

రచనకార్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సంపు - 16-09-2016 - 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక

నలుపై తెలుపు గెలుపు 

రచన- కార్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 16-09-2016 - ప్రచురితం ) 


'తాతమ్మ కల' సినిమా చూశావురా? నీళ్లు లేక ఊరు వట్టిపోతే, మళ్ళా పడేదాకా ఇద్దరు చిన్నోళ్లు తాతమ్మ వత్తాసుతో నానా తంటాలు పడతారు.  ఊరంతా గతంలో మాదిరిగా చల్లగా ఉండాలన్నది తాతమ్మ కల. ముని భగీరథుడి మునిమనవళ్లకు నకలుగా పిల్లోళ్ళు బోరింగు, రిగ్గింగులతో బోలెడంత సంచలనం సృష్టిస్తారు....' 


' ఇప్పుడా బోరు కతలు అంత అవసరమా బాబాయ్? ఇవతల చేదు కాకరకాయకు కూడా డబ్బులు చేతులో లేక జనాలు ఇబ్బందిపడుతున్నారు. గాలి లేకపోయినా బతకొచ్చుగాని, డబ్బు లేకుండా బతకడం ఎలా ఈ లోకంలో? ' 


'మా రోజుల్లో ఈ డబ్బులు దస్కాలూ ఎక్కడేడ్చాయిరా అబ్బీ!  గాబులో బియ్యం.. పెరట్లో కాయ! ఏ కొబ్బరి ముక్కో, అల్లం చెక్కో కావాలంటే శెట్టి కొట్లో దోసెడు ధాన్యం పోసెయ్యడమే! ఎవరికీ ఎర్ర ఏగానీ ఇచ్చెరగం ' 


' ఇక్ష్వాకులనాటి కతలిప్పుడొద్దు  బాబాయ్; ధన మూలం ఇదం జగత్.  


' అడ్డమైన డబ్బూ దేశం మీద పడ్డది. అది చాలక నకిలీ డబ్బు ' 


 ఏళ్లకేళ్లు దేశాన్నేలిన పాలెగాళ్లు మామూలోళ్లా  బాబాయ్! అంతా కలుపుమయం చేసిపోతిరి' 


' ఆ కలుపును పీకెయ్యాలనే మోదీ 'నలుపు' మీద ఇప్పుడు యుద్ధం మొదలెట్టారు. మొదట్లో నాకూ ఆ నిర్ణయం మనస్కరించలే. ఇప్పుడు మనస్ఫూ ర్తిగా నమస్కరించాలనిపిస్తోంది. సమస్యలున్నా యని తెలిసినా, ఎంత మంచి సంస్కరణకు శ్రీకారం చుట్టేశారూ' 


'మునుపటి నేతలూ ఇలాంటి చిట్కాలే ఏమైనా చేసి ఉండొచ్చుగా బాబాయ్! చేయడం రాకా?'


' ఇష్టం లేక.  ఆ నేతాశ్రీల చూపు ఎప్పుడూ నల్లసిరి గోతాల మీదేనాయే! ఆ డబ్బే ఆడకపోతే ప్రజాస్వా మ్యంలో ఓట్లేసే డబ్బాలు ఎవడికి కావాలిరా అబ్బిగా? అందుకే మోదీజీ ఈ పెద్దనోట్ల రద్దుకు దిగింది"


కానీ..... పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులకూ ఇబ్బందులు వచ్చాయి. పెద్దోళ్ళ గుండెలైతే ఏకంగా బద్దలయ్యే ఉంటాయ్'


'సామాన్యులకు కాస్తంత ఇబ్బందే అనుకో! కనేటప్పుడు తల్లి ఆపసోపాలు పడుతుంది కదా. అలాంటి కష్టమే వచ్చిందనుకోరాదూ' బిడ్డను కళ్లారా చూపించు... తల్లి కష్టం ఇట్టే తేలిపోతుంది. ఈ రద్దు సంగతీ అంతేరా

బాబూ! అన్నీ సద్దు మణిగి, మంచి ఫలితాలు చవిచూశాక పేదోడి గుండె ఉప్పొంగడం ఖాయం'


'మరి బ్యాంకుల ముందు బారుల మాటేమిటి? రెండు చట్టసభల్లో రోజూ ఆ రచ్చలేంటి బాబాయ్! '


'రాజకీయాలకు అతిశయోక్తులు ఓ అలంకారం! చట్ట సభల రచ్చలకేంగాని, రచ్చబండల మీది జనం మోదీని మెచ్చుకొంటున్నారు. సర్వేశ్వరుల మాటా, దేశాన్ని సర్వ నాశనం చేసినవారి మాటా- ఏదిరా మనం నమ్మాలి?' 


' ఒకాయన భూకంపం పుట్టిస్తానంటాడు. ఒకామె మోదీ కుర్చీ ఊడలాగేసుకుంటానంటూ ఊగిపోతుంది. మరొకాయన 'తుగ్లక్ పాలన' అంటూ కన్నెర్ర చేస్తాడు. ఇంకొకాయన 'మరకా మంచిదేనంటూ'  సూక్తులు చెబుతాడు. మోదీజీ మొదటిసారి చేశారీ మ్యాజిక్! అంతా 'అర్థక్రాంతి' సందడి.  'గీకుడు పెట్టెల' కోసం చిల్లర దుకాణాలు ఎలా పరిగెడుతున్నాయో చూశావా? ' 


'ఇప్పుడా గీకే తంత్రమే మళ్లీ మన దేశ డబ్బు జబ్బుకు మంచి మందంటావ్... భలే!' 


' మరే! పెద్దనోట్ల రద్దు వల్ల దొంగ సంపన్నులకే పన్ను పోటు! లెక్కప్రకారం కట్టేవాడికి జ్వరం ఎందుకొస్తుంది? సర్కారు ఖజానా గలగల్లాడితేనే గదా... పేదోడి బతుకు కళకళ లాడేదీ?'


'మరి పెద్దనోట్లు ఎందుకు ముద్దరేస్తున్నట్లు? దానివల్లే కదా మోదీ

బాబాయికి  ఇన్ని తిట్లు?' 


'దాని వెనకా ఏదో పెద్ద వ్యూహమే ఉంటుందిరా! కంగారు పుట్టించి, దొంగ దొరలందరి చేతా బంగారు కడ్డీలు కొనిపించలా! వాటి నడ్డి విరగ్గొట్టే చట్టా లిప్పుడు బయటకొస్తున్నాయి. పన్ను ఎగవేసే నల్ల మహారాజులందరి పళ్లు రాలగొట్టే చట్టాలూ అలాగే సమయానికి మళ్ళీ ప్రాణం పోసుకుని లేచొస్తాయ్. నోటుకు ఓటు బేరగాళ్లందరి నోళ్ళూ పడిపోయేలా బోలెడన్ని ఉపాయాలు ఉన్నాయంటున్నారుగా మోదీజీ'


' సమయం రావాలేగాని... పెద్ద తలకాయలే రాలిపో యేట్లున్నాయి. అందుకే ప్రధాని సమయం కావాలంటున్నారు. సర్వేల్లోనూ జనం నాడి మోదీకి 'జై'కొడుతోంది'


'అంటే దేశానికి త్వరలోనే 'రామరాజ్యం' రాబోతోందంటావ్ '


' దారిలో పడ్డావ్ బిడ్డా! ఏళ్ల తరబడి పోగడ్డ మాయసొమ్ముతో కోట్లకు పడగలెత్తాలన్న మాఫియాగాళ్ల పన్నాగమే పెద్దనోట్ల రద్దుమీద ఇంత రాద్ధాంతం. చిన్న బుర్ర జీవులం... మనకు ఇది అంతుపట్టడం అంత తేలిక కాదు. ముందు 'గీకు వీరుల' ను  పెంచాలన్నది మోదీ ఆలోచన. దాని వెన కున్నది పేదరికం నుంచి బడుగుజీవి విమోచన. సర్కారు ఖజానాలు వడ్డికాసులవాడి హుండీలతో పోటీపడాలే గాని, దిక్కులేనివాడి దశ మార్చడం చిత్తశుద్ధి ఉన్న దొరలకు ఎంత సేపు! ఏళ్లబట్టి పోలింగు బూత్ ల వరకే పేదోడి చేతి వేళ్లు పరిమితమవుతున్నాయి. అదే చేతి వేళ్లను ' గీకుడు యంత్రాల' వైపు మళ్లిస్తే, వాడిపోయిన వాడి బతుకు మళ్ళీ చిగురించడం ఎంతసేపు! కాకి లెక్కల వాళ్లెంతా  'కావు కావు'మన్నా గీకు యంత్రాల మోత వినిపిం చక మానదు' 


'ఏమో బాబాయ్! ఈ వయసులో 'స్మార్ట్' అయిపో వడం అంత తేలికా? ' 


'యంత్రాలతో మంచిదే గదరా! చేతి వేళ్లతో పని. కాలు కదపకుండా సర్వం ఇంటికి తెప్పించుకోవచ్చు' 


' అందుకేనా .. మా తాతమ్మ 'పొదుపు .. పొదుపు ' అని కలవరిం చేది? ' 


'తాతమ్మ కల నెరవేరబోతోంది. శుభం!'


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సం. పు - 16-09-2016 - ప్రచురితం ) 


ఈనాడు - మూర్హుల దినం - హాస్యం - గల్పిక రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 01 - 04-2010 న ప్రచురితం )

 



ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్పిక 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 01 - 04-2010 న ప్రచురితం ) 


జనాభాకన్నా ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్యం మనది. 


అరుపదులు నిండ కుండానే స్వతంత్ర సమరయోధుల పింఛ నందుకునే యోధులున్న పుణ్యభూమీ ఇదే. 


ఇక్కడ ఇడియట్ బాక్సుల అమ్మ కాలకు ఎంత లావు ఆర్థికమాంద్యాలూ అడ్డురాబోవు. 


చంద్రమండలంమీదైనా సరే చవగ్గా భూములమ్ముతున్నా రంటే కొనేదానికి కుమ్ముకునే ఆసాములు గజానికొకడున్న పూర్ణగర్భ కూడా ఇదే కదా! 


ఇంతకు మించి  మనతెలివికి గొప్ప నిదర్శనాలు ఇంకేం కావాలి?


యధా ప్రజా తధా రాజా  కదా! పాతపథకాలకే కొత్త పేర్లు పెట్టి రైలు బడ్జెట్లో మనూళ్ళ పేర్లన్నీ మమతమ్మ జెట్ స్పీ డుతో అప్పచెబుతుంటే, ఆనందం పట్టలేక చేతులు నొప్పిపుట్టేదాకా బల్లలు బాదిన ఎంపీలు- పార్లమెం టుకు మనం పంపిన ప్రతినిధులే కదా! 


కన్యాశుల్కం నాటకంలో ఒక్కడే వెంకటేశం. మనదేశ ప్రజా స్వామ్య నాటకంలో బోలెడంతమంది వెంకటేశాలు! 


వెంకటేశాలూ తిక్క శంకరయ్యలూ ఒకళ్ళనొకళ్ళు పిచ్చి పుల్లయ్యల్ని చేసుకుంటూ సంబరపడే పండుగే ఈ ఆల్ పూల్స్ డే ... అనగా చవటాయల దినం!


ఈ ఫూలును మొదట  కనిపెట్టిన మహానుభావుడు ఎవ రోకానీ మహాగడుసువాడై ఉండాలి. ఆల్‌ ఫూల్స్  డే, కొత్త ఆర్థిక సంవత్సరం- ఒకేరోజు వస్తాయి. 


ఏడాది పొడవునా మనం గడిపిన చచ్చు జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుని, రాబోయే చెత్త రోజులకు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవటానికి ఈ చవటాయల దినాన్ని మించిన మంచి సందర్భం మరొకటి లేదు. హ్యాపీ ఫూల్స్ డే !


ఫూలంటే  తెలివితక్కువ దద్దమ్మని కదా అర్ధం! ఈ లోకంలో నాకన్నీ తెలుసనుకున్నవాణ్ని మించిన మూర్ఖుడు మరొకడు ఉండడు. 


మనం దున్నుకునేది మనదనుకునే భూమి ఏ పెద్దమనిషి దగ్గర లీజుకు పోయిందో తెలీదు. 


మన పేరుతో ఉన్న తెల్లకార్డు ఖచ్చి తంగా బోగస్ ది కాదని చెప్పగలిగే స్థితిలో మనం లేం. 


అంతెందుకు, మన జేబులో ఉన్న పర్సులోని వందనోట్లు నిఖార్సయినవేనని  టపీమని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? 


అందుకే అనేది... ఈ తెలివి తక్కువ లోకంలో తెలివితక్కువగా బతకటంకన్నా తెలివైన పని మరొకటి లేదని. 


తెలివి ఎక్కువైపోతే అన్నీ ఇబ్బందులే! భర్తృహరి లంతటివాడే తన సుభాషితాల్లో ముందుగా మూర్ఖుణ్ని తలచుకున్నాడు. 


నిప్పుకి నీరు, ఎండకు గొడుగు, ఏనుగుకు అంకుశం, ఎద్దు గాడిదలకు ముల్లుగర్ర, రోగానికి మందు, విషానికి మంత్రం విరుగు డుగా చెప్పిన శాస్త్రాలు కూడా చవటాయిలకు మాత్రం ఏది నివారణో చెప్పలేక చేతులెత్తేశాడాయన! 


పువ్వుతో వజ్రాన్నైనా పరపరా కోసేయవచ్చేమోగానీ, మంచిమా టలు చెప్పి మూర్ఖుణ్ని రంజింపజేయటం ఉప్పునీటి సముద్రంలో తేనెబొట్టువేసి తీపిదనాన్ని రాబట్టడమంత తెలివితక్కువదనం ఆనటం- ఎంత తెలివైన మాట!


జేబులో చిల్లు కాణీ లేకపోయినా- ఎన్నికల్లో నిలబడి నెగ్గుకురాగలమని ఎవరైనా నమ్ముతున్నారా? 


తెలుగు చిత్రాలకు ఏనాటికైనా ఆస్కారు పురస్కారాలొచ్చి తీరుతా యని ఆశపడుతున్నారా? 


టీవీ సీరియల్స్ పదమూడు ఎపిసోడ్లతో ముగుస్తాయనీ, పెట్రోలు రేట్లు ఎప్పటికైనా తగ్గుముఖం పట్టక తప్పదనీ, ప్రైవేటు పాఠశాలలు ఫీజు లేకుండా పిల్లలకు తెలుగులో పాఠాలు చెప్పే రోజులు వస్తాయనీ - మీరూ నమ్ముతున్నారా? 


కచ్చితంగా నమ్మేవారంతా కలిసి చేసుకోవాల్సిన ఘనమైన సంబరం- ఈ చవటాయల దినోత్సవం. 


విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే పాలచెంబులు పట్టుకుని పరిగెత్తేవాళ్ళూ, పూర్వజన్మల పాపాల ప్రక్షాళన కోసం బాబాల కాళ్ళతో తన్నించుకునేందుకు బ్లాకులో టికెట్లు కొనడానికి ఎగబడేవాళ్లు , బయటకు కనిపించేదంతా ఆశాశ్వతమైన తోలుతిత్తి, ఆత్రమేగాని అసలైన అంతరాత్మకు ఎన్ని అంట్ల పనులు చేసినా మైలనేది అంటుకోదని శృంగార లీలల దృశ్యకావ్యంతో ప్రబోధించే స్వాముల పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేసే పరమాణు వులు..  అంతా కలిసి ఓ 'చవటాయల సంఘం' పెట్టుకో వాల్సిన సమయం సందర్భo కూడా ఇదే!


ఎలాగూ కొత్త జనాభా లెక్కల సేకరణ మొద లైంది. ఈసారైనా మూర్ఖుల వివరాలు సమగ్రంగా సేకరించే ఏర్పాట్లు సర్కారు చేసేదిశగా ఒత్తిడి చేయటానికి, 'ముక్కోటి మూర్ఖుల ' సంతకాలు సేక రించే ఉద్యమం ప్రారంభించటానికి, చవటాయిలు చైతన్యయాత్రలు చేయటానికి ఈ దినోత్సవమే సముచితమైన సందర్భం. 


ఫోర్బ్స్ కుబేరుల టాప్ టెన్ జాబితాలో మన వాళ్ళేదో ఇద్దరు ముగ్గురు ఉన్నందుకే మురిసి ముక్కలైపోతున్నామే.  నిఖార్సైన  'పూల్స్' జాబితాను నిజాయతీగా విడుదల చేయమనండి- టాప్ టెన్ థౌజండ్లో ఒక్క పేరు కూడా పక్క దేశాలకు పోయే అవకాశం లేదు. 


నోబెల్ పురస్కారాల్లాంటివి 'దద్దమ్మ'లకూ ఇచ్చే పద్ధతి మొదలు పెడితే- ఏడాదికొక తిక్క శంకరయ్య మనదేశం నుంచీ నామినేట్ కావటం ఖాయం.


మనలోని తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేకపోవట మంత తెలివితక్కువ తనం మరొకటి లేదు. ఆందోళ నలు చేస్తేగానీ ఏదీ ఈ ప్రభుత్వాల చెవుల కెక్కదు. అందులో భాగంగానే ఈ చవలాయీల దినోత్సవానికి రెండు రోజుల ముందుగానే ఆ మూఢుల సంఘం తరు పున ఎవరో మన సమాచార శాఖ ఆంగ్లప్రతిలో గవ ర్నరు ఫొటో బదులుగా వేరొకరిది పెట్టేశారు! 


శభాష్! కార్యాచరణ అప్పుడే మొదలైందన్నమాట!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 01 - 04-2010 న ప్రచురితం ) 

ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్పిక భూతల స్వర్గం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - తేదీ నమోదు కాలేదు - న ప్రచురితం )

 



ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్పిక 

భూతల స్వర్గం 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - తేదీ నమోదు కాలేదు -  న ప్రచురితం )  


'ధరలు భయంకరంగా పెరిగిపోయాయని, జీతాలు చాలటం లేదని, రేషన్ పూర్తిగా ఇవ్వటం లేదని, గ్యాసు వేళకు రావడం లేదని, పిల్లల చదువులు భారమయ్యాయని, కరెంటు కోతలని, నీళ్లకు కటకటగా ఉందని .. ఇలా పొద్దస్తమానం ఆపసోపాలు పడిపోతుంటావుగా ! నీ బాధ చూడలేక ఆ దేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో  అని  అడిగితే- నువ్వేం కోరుకుంటావురా అప్పా రావ్?' 


' సర్వ రోగాలకూ నివారిణి విటమిన్ 'ఎమ్' కదన్నా! అందుకే బాధలూ, బాదరబందీలూ బందై పోవాలంటే ఏ టాటా లాగానో పుట్టించెయ్యమంటా'


'ఆ టాటా మాత్రం ఏమన్నా సుఖంగా ఉన్నాడ్రా?  పెట్టిన రూపాయి పెట్టుబడికి కనీసం పది పైసలన్నా గిట్టుబాటు అవుతుందో లేదో నని ఎన్ని నిద్రల్లేని  రాత్రులు గడుపుతు న్నాడో  నీకు తెలుసా? ఈ గొడవలనుంచి ఉపశమనంగా ఉంటుందని ఏ రాడియా లాంటి లేడీకో ఫోన్చేసి కాస్త సరదాగా అలా వంటి మీది వేసుకునే కోటు గురించో, పార్టీలో ధరించే గౌను గురించో ముచ్చట్లాడుకుంటే వాటినీ ఎవడో గిట్టనివాడు టేపుల్లో భద్రం చేసి బెదిరింపులకు దిగుతుంటాడాయే! ఆ టేపులు ఆపుకోవటానికి అంత పెద్ద టాటాకే న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సిన పరిస్థితి .. వచ్చిందా . . రాలేదా?' 


'అయితే నేను ఆ న్యాయాధికారిగానే మారిపోతే సరిపోతుందిగదన్నా, దేవుణ్ని అదే కోరుకుంటా!' 


 ' న్యాయాధికారులకూ మాత్రం కష్టాలు తక్కువట్రా! ఏదో కడుపు కట్టు కుని ఇంత దాచుకున్నా, ఏ పొడగిట్టని మీడియావాడో దాన్ని అవినీతి సొమ్మని రచ్చకీడుస్తాడు. ఆ లెక్కలు చూపలేకా, చూపించకుండా ఉండలేకా వారు పడే యాతన నీకు తెలుసా? కడివెడంత గుమ్మడైనా కత్తి పీటకు లోకువని సామెత. మీడియానా... మజాకా' 


' అయితే, ఆ మీడియావాడిగా అవతారమెత్తితే పోలేదా అన్నా! హాయిగా ఉంటుంది' 


' మీడియాకి హాయి ఆమడదూరంరా భడవా! వాళ్లుపడే బాధ ఆ పగవాళ్లక్కూడా వద్దు ! ఎంతో రిస్కు తీసుకుని ఏ కుంభకోణాన్నో  వెలికితీసినా- ఆ సంతోషం మూణ్నాళ్ల ముచ్చటే!  అన్ని వైపుల నుంచి వచ్చే ఒత్తిళ్లూ తట్టుకోవాలి. వార్తలకోసం కత్తిమీద సాము చేసేకన్నా. చక్కగా ఏ చిన్న సినిమా తీసుకుంటే... పేరుకు పేరూ, డబ్బుకు డబ్బూ' 


'మరింకేమన్నా, ఆ నిర్మాతగా మారిపోతే పోలా, ఏ

తలనొప్పులూ ఉండవ్'


' కానీ, సినిమా అంటేనే ఓ పెద్ద తలనొప్పి కదరా! జాగ్రత్తగా తీయకపోతే జనాలను పీడించిన పాపం అదనంగా చుట్టుకుంటుంది. పెద్ద నిర్మాతైనా ఫీల్డులోని  బాయికీ దడుచుకోవాలి. హీరోవరకూ ఫర్వాలేదుగాని, పది రూపాయల వడ్డీకి డబ్బిచ్చిన ఆ మాఫియావాడు ఆడటమన్నట్లాడాలి.  చివరికి ట్యాంకుబండ్ మీదనుంచీ దూకాలి. మరి దానికి సిద్ధమేనా? '


' మరైతే నేను ఆ మాఫియావాడిగా పుడతానన్నా మరో మాట లేదు. ' 


' మాఫియావాడిగా పుట్టించమని దేవుణ్ని వరమడుగుతావా! నీకసలు బుద్దుందా? వాడి బతుకేమన్నా రోజా  పూల బాట అనుకున్నావుట్రా! ఎన్ని అడ్డదార్లు తొక్కితే ఆ గడ్డి జమవుతుంది. ఎన్ని సెటిల్మెంట్లు చేసినా- సొంత లైఫ్ కే  సెటిల్మెంట్ ఉండదు. నువ్వెంత పెద్ద డాన్నైనా నేరుగా ఏ పనీ చేయడానిక్కుదర్దు . కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నా- పదివేలు జీతం రాని పోలీసువాడి ముందు చేతులు నులుపుకుంటూ నిలబడాలి.. తెలుసా!!


'అలాగైతే, నీతికీ న్యాయానికి మారుపేరైన ఆ కనపడని నాలుగో సింహం పోలీసువాడినవుతా, సమాజంలో గౌరవంగానూ ఉంటుంది'


'ఎంత చేసినా ఎవరూ మెచ్చుకోని అరవ చాకిరీ గిరీరా

బాబూ అది. అల్లర్లు, ఆందోళనల మధ్యే జీవితం తెల్లారిపోతుంది . ఏ మంత్రిగారికో తిక్కరేగిం దంటే- గుక్కతిప్పుకోలేక చావాలి.  నువ్వు ఏరికోరి ఈ కొరివితోనా  బుర్రగోక్కో వాలనుకునేది?


'నిజమేనన్నా! అసలు రాజకీయ నాయకు డిలా పుట్టాలని నాకిప్పటిదాకా ఎందుకు తట్టలేదో! ఎన్ని కలప్పుడు తప్ప ఎవరికీ ముఖం చూపించనక్కర్లేని రాజా బతుకుగదా అది! ప్రజాస్వామ్యంలో నాయకుడికి మించిన మజా ఇంకేం ఉంటుంది చెప్పు ?' 


`అంటే- ఓ నేతగా అవతారమెత్తేసి వెంటనే జనోద్ధరణ చేసిపారేస్తానంటావా! నీకు బుద్ధే కాదు, ఇంగితం కూడా లేదని తేలిపోయిందిప్పుడు' 


' ఏంటన్నా మరీ ఆ దెప్పుడు?"


' లేకపోతే ఏంటిరా!  ఈ భూమండలంలో నిత్యశంకితుడు, నిత్యదుఃఖితుడు, నిత్య రోగి, పరమ నిర్భాగ్యుడు.. రాజకీయ నాయకుడేరా! పేరుకు పెద్ద నాయకుడే అయినా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరూ వాడితో చెడుగుడు ఆడుకునేవాళ్లేగా? రచ్చబండల్లో రాళ్లు వేయించుకోవడానికి, దిష్టిబొమ్మలు కాల్పించుకోవడానికేనా ఆ హోదా మీద మోజుపడుతున్నావు? '


'పెద్దమనిషివి. ఇక నువ్వే మంచి సలహా ఇవ్వొచ్చుగదన్నా!  ఆ దేవుడొచ్చి అడిగితే నన్నేవరం కోరుకోమంటావు?' 


' రిస్కు  లేకుండా వ్యాపారాలు చేసుకునే చోటు ఒకటుంది. అక్కడ రీ ఛార్జి కూపన్లు అమ్ముకున్నా చాలు- అంబానీల కన్నా ఎక్కువ లాభాలు సంపాదించొచ్చు. రింగులు కట్టే గుత్తేదారులు అక్కడ ఉండరు. అది మీడియా సైతం చొరబడ ని వండర్ల్యాండ్ . ఫిర్యాదులు వచ్చినా మర్యాద కాపాడటానికి దేవుళ్ళలాంటి వార్డెన్ల  సేవలు అక్కడ ప్రత్యేకం.  కరవు కాలంలోనూ చిటికేస్తే మందూ, చికెన్ పలావులు ప్రత్యక్షమవుతాయి. సీఎం క్యాంపు ఆఫీ సులకైనా తప్పని కరెంట్ కోతలు, నీటి కటకటలూ అక్కడ మచ్చుకైనా కనిపించవు. ఒక్క ఐఎస్ఐ.. అంటే బాంబులేసే ఆ పాకిస్తోనోడి రౌడీలన్న మాట.. వాడిలా  ముద్ర వేయించుకుని జైలుకెళితే  చాలురా- జీవితాంతమూ  రాజీవ్ గాంధీ కొడుకుకున్నా విలాసంగా బతికేయొచ్చు' 


'అర్థమైందన్నా. ఆ చర్లపల్లి చెరసాల గురించేగా నువ్వింతగా ఊరిస్తున్నది. సరే, ఆ దేవుడొచ్చి అడిగితే రిమాండు ఖైదీగా ఆ భూలోక స్వర్గాన్ని ప్రసాదించమనే కోరుకుంటా!!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - తేదీ నమోదు కాలేదు -  న ప్రచురితం ) 

విభీషణుడి మొదటి పట్టాభిషేకం ( వాల్మీకం ప్రమాణంగా ) రచన: కర్లపాలెం హనుమంతరావు 21 - 09- 2021 బోథెల్ ; యూ. ఎస్.ఎ

 



ఈ మాట అనడానికి కారణం ఉంది. వాల్మీకమే ఇందుకు ప్రమాణం. గందరగోళం లేకుండా సూక్ష్మంగా , సరళంగా,  సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 


విభీషణుడు ఓ నలుగురు రాక్షసులను ( అనల, శరభ, సంపాతి, ప్రఘసన) వెంటేసుకు వచ్చి  శ్రీరాముడి శరణు కోసం ఆకాశంలో ఉత్తర దిక్కున  ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అది సుగ్రీవుడి కంటబడింది.  యుద్ధ కాలం. వచ్చినవాళ్లు శత్రువులు అనుకొన్నాడు.  సమీపంలో  ఉన్న హమమంతుడితో విషయం చెప్పాడు. ( హనుమత్ సముఖా: - అనే పదం వాడాడు  వాల్మీకి ఇక్కడ.  బుద్ధిమంతుల ముందు వ్యవహారాలు  విచారించుకునే సందర్భంలో ఈ పదం వాడటం సంస్కృత భాషాసంప్రదాయం ). సుగ్రీవుడి మాట మిగతా కోతుల చెవిలో పడింది.  ఆవేశం ఆగదు . సాలవృక్షాల మీద  చేతులేసి ' ఆజ్ఞాపిస్తే క్షణంలో వాడిని, వాడితో వచ్చిన వాళ్లనూ చంపేసివస్తాం ' అని గెంతులేస్తారు . 


ఆ మాట విభీషణుడు  విన్నాడు.  ' తన సోదరుడు చెడ్డవాడని, జటాయువు చావుకు , సీతాపహరణకు వాడే కారణమని, ఆమె లంకలో దీనంగా రాక్షసస్త్రీల మధ్య భర్తకోసం ఎదురు చూస్తూ దుష్టుడయిన తన అన్నయ్యను నిరోధించడానికి చాలా ఇబ్బంది పడుతుందని, విడిచిపెట్టమని మళ్లీ మళ్లీ చెబుతున్నా వినకపోగా తనను అవమానించాడ' ని చెప్పుకొచ్చాడు. 'ఇప్పటిదాకా గౌరవం( సోహం) గా బతికిన వాడిని  దాసోహం  అనలేక శరణు కోసం రాముడి దగ్గరకు వచ్చా' అని వివరంగా చెపుతాడు.  ' రాఘవం శరణం గత: ' అంటూ వచ్చిన విభీషణుడి  మాటలకు కంగారుపడి ( లఘువిక్రమత్వం ) వాయువేగంతో లక్ష్మణుడితో మాట్లాడుతూ  కూర్చోనున్న  రాముడికి వివరాలన్నీ క్లుప్తంగా  చెప్పాడు సుగ్రీవుడు . 


సుగ్రీవుడిది రాజనీతి. అపరిచితులను ముందుగా  అనుమానించి .. విచారించిన మీదట గుణదోషాలు  నిర్ధారించుకునే నైజం .  కాబట్టే 'గుడ్లగూబ కాకులని చంపినట్లు  చంపేందుకే మన బలం తెలిసీ వచ్చి వుంటాడు.  రాక్షసులు నికృతిజ్ఞులు  ( కపటులు). వీడు గూఢచారిగానో, మనలో కలతలు సృష్టించడానికో వచ్చాడేమో?  వాలిని చంపినట్లు ముందు  వీడినీ చంపేసేయ్ రామా ! మారీచుణ్ణి  మాదిరి సగం చంపి వదిలావా .. అనర్ధం ' అని ఓ రాజులాగా, సేనాపతిలాగా రాముడికి అడక్కుండానే సలహా ఇవ్వబోయాడు.  హనుత్సముఖుడైన ( బుద్ధికి సంబంధించిన ) రాముడు అక్కడ ఉన్న మిగతా వానరుల వంక  చూసి 'స్నేహితుడు  ఒక సలహా ఇస్తున్నప్పుడు తతిమ్మా  వాళ్లు భయం చేతనో , స్నేహం చెడుతుందన్న భీతి చేతనో నిశ్శబ్దంగా ఉండటమూ ప్రమాదమే! ఇబ్బందుల్లో ఉన్నప్పుడు  సమర్థులు  సలహా ఇవ్వటమే  ఉత్తమం .   

' యదుక్తం కపిరాజేన రావణానరజం ప్రతి 

వాక్యం హేతుమదర్ధ్యం చా భవద్వి రపి తచ్ఛ్రుతం' అన్న రాముని భరోసాతో 


  అంగదుడు ' నీకు తెలీనిదేముంది రామప్రభూ! మా బతుకంతా రాజనీతి వంకన అందర్నీ అనుమానించడమేనాయ! ఈ రాజనీతికి మించింది  ఇంకేదో ఉంది. అదేదో నీకే తెలియాలి' అన్నాడు తెలివిగా. గతంలో కపిరాజు సుగ్రీవుడు మీద కోపం  ఉంది అతగాడికి. 


సుగ్రీవుడు అది గ్రహించాడు.   ' అదిగో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి. అంగదుడికి రాజ్యం ఆశ చూపించి వానర  సైన్యంలో చీలిక తెస్తే ?  మనల్ని  బలహీనుల్ని చేసే  రావణాసురుడి ఎత్తుగడేమో  ఈ రాక్షసుడి రాక. ఎటూ చివరకు  తేల్చాల్సి౦ది నువ్వే కాబట్టి అందరి అభిప్రాయాలు విడివిడిగా పిలిచి కనుక్కో రాదూ    ' అన్నాడు. 


అంగదుడు  అప్పుడు తన మనసులోని మాట బైటపెట్టాడు . 'శత్రువు అంటేనే  అనుమానించదగ్గవాడు.  గుడ్డిగా నమ్మితే సమయం చూసి దెబ్బకొట్టే నయవంచకుడు కూడా . మిత్రత్వాని కి అనుకూలమా .. కాదా అన్నది  గుణ దోషాలు విచారించుకున్న తరువాతే  ' . 


ఆ తరవాత శరభుడు. అతడు  మాట్లాడ్డం అయిన తరువాత జాంబవంతుడు వంతు వచ్చింది.  శాస్త్ర దృష్టితో పరిశీలించినట్లు   ' రాకూడని కాలంలో శత్రువర్గం  నుంచి చేతులు కలపడానికి వస్తే ..  వాడిని తప్పకుండా   అనుమానించాల్సిందే ' అని తేల్చాడు. 


కేవలం శాస్త్ర దృష్టి చాలదు. తత్వమరసి ( మనసు తెలుసుకొని )  నిర్ణయం తీసుకోవాలి ' అని  మైందుడు అడ్డుపడటంతో  హనుమంతుడి  ఆలోచనకు ప్రాధాన్యత పెరిగింది 


'ఎదుటివాళ్లను  గురించి వేసుకునే అంచనాలో  జాతి, కులం, హోదాల్లాంటివి  కాదు..  మన సంస్కారం  ప్రధానం. రాజనీతో, ముందే ఏర్పరుచుకున్న  చెడ్డ అభిప్రాయం వల్లనో  న్యాయ నిర్ణయానికి పూనుకోతగదు.  ముందసలు మన విచారణలో కూడా మాటమృదువుగా, సృష్టంగా, క్లుప్తంగా ఉండాలని ' న వాదా నాపి సంఘర్షా న్నాధిక్యా న్నచ కామత: 

వక్ష్యామి వచనమ్ రాజన్ యధార్ధం రామ గౌరవాత్ ' అని కదా పెద్దల వాక్కు !  అయితే నేనిక్కడ  వాదన  కోసమో, ఘర్షణ కోసమో, బడాయిగానో, లాభం కోసమో, అవకాశం వచ్చందనో  వాగడం  లేదు. కేవలం రాముడి మీద ఉండే గౌరవమే తప్పించి రాజువైన నిన్ను ధిక్కరించాలనే   ఆలోచన బొత్తిగా లేదు సుగ్రీవా! ' అంటూ సుగ్రీవుడి అహాన్ని కొంత చల్లార్చాడు హనుమంతుడు . ఆనక 

 ' అర్థం.. అనర్థం అనే కోణంలో మంత్రులు  మాట్లాడింది తప్పుపట్టడానికి  లేదు. కానీ పనిలో పెట్టకుండా ఎవరి సామర్ధ్య౦ ఎంతో ఎట్లా తెలిసేది ? అట్లాగని తొందరపడి ముఖ్యమైన రాచకార్యం కొత్తవారికి అప్పగించడం కూడా క్షేమం కాదనుకొండి ' అన్నాడు హనుమ. అంగదుడు, జాంబవంతుల మాటలను కూడా ఖండిస్తున్నట్లు రామునితో ' ఈ విభీషణుడు రావణాసురుడి దుర్మార్గాన్ని చూశాడు. వాలి వధ చేసిన నీ పరాక్రమం గురించీ విన్నాడు. తన లంకా పట్టాభిషేకం నీ వల్లనే సాధ్యమని లెక్కలేసుకునే  నీ  దగ్గరకు వచ్చి ఉండవచ్చు . గుణదోషాల విచక్షణ ప్రస్తుతం పక్కన పెట్టి మిత్ర గ్రహణం చేయడమే ఉచితం అనిపిస్తుంది. ఇదీ నా మనసులో ఉన్నది  . ఆపైన నీ ఇష్టం రామా!  ' అని ముగించాడు హనుమ. 


హనుమంతుడికి ' వాక్ చతురుడు' అని పేరుంది. లంకలో విభీషణుడే హనుమంతుడికి ఆపదవచ్చినప్పుడు  రక్షించింది. ఆ కృతజ్ఞత వల్ల  ఈ విభీషణుడిని అంగీకరించమంటున్నాడేమో   - అని సాటి వానరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య మొదటి నుంచి స్వభావరీత్యా వైరుధ్యం ఉన్నట్లు లంకలో ఉన్నప్పుడు హనుమ గ్రహించి వున్నాడు. ఈ విషయం మీద అవగాహన లేనందున  అంగదుడు, జాంబవంతుడు లాంటి వాళ్లు తన సలహా అంతరార్ధం  సవ్యంగా అర్ధం చేసుకోకపోవచ్చు. ఈ రెండు కారణాల చేతా హనుమంతుడు తన సంభాషణలో వాటి  ప్రస్తావన తీసుకురాలేదు . అదీ ఆంజనేయుడి వాక్ చాతుర్యం  అంటే . 


అంగద , సుగ్రీనాదుల సలహాలు కలవరం కలిగించినా ఆంజనేయుడి మాటలతో రాముడికి సంతోషం కలిగింది. తనగురువు వశిష్టుడు బోధించిన నీతి శాస్త్రం మననం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు  పరిజనాన్ని చూసి ' ఈ విభీషణుడి విషయంలో మనం కాస్త హేతు సాధ్యమైన కోణంలో ఆలోచిస్తే బాగుంటుందేమో! నా మంచి కోరే మీరంతా ఆలకించండి . ' స్నేహం అర్థిస్తూ వచ్చినవాడివి నేను నిరాశపరచే ప్రశ్నే లేదు . వచ్చిన  వాళ్లలో  తప్పులున్నా సరే, సత్పురుషులు వాటిని పట్టించుకోరు . తనను చంపేందుకు వచ్చిన వాడి అరాచకాన్ని  పక్కనపెట్టి వేటగాడికి ఆతిథ్యం ఇచ్చింది ఒక పావురం. దాని ఔాదార్యం సర్వదా  శిరోధార్యం.  అందుచేత నేను విభీషణుడికి  అభయం  ఇవ్వకుండా వదిలి పెట్టను ' 


' సరేనయ్యా స్వామీ ! వచ్చిన రాక్షసుడి గుణంతో పనిలేదన్నావు  . కానీ అతగాడి  అవకాశవాదమన్నా పట్టించుకోవాలిగా ?  లంకాదహనం, పుత్రమరణం లాంటి ఉపద్రవాలు జరిగి మహా దుఃఖంలో  ఉన్న సొంత అన్ననే విడిచిపెట్టి వచ్చాడే!  అవకాశం వస్తే మన దుఃఖం మాత్రం పట్టించుకుంటాడా ?' అని సుగ్రీవుడు మళ్లా రాజనీతి వలకపోయడం మొదలుపెట్టాడు . అది విని  లక్ష్మణుడికి నవ్వొచ్చింది. చిరునవ్వు తో  ' సుగ్రీవుడికి శాస్త్ర బద్ధంగా చెబితేనే బుర్రకెక్కేది'  అన్నట్లు రాముని వంక చూసి  ' సుగ్రీవుడు ఎప్పుడూ చదువుకున్న శాస్త్రమే మళ్లీ వల్లివేశాడు. ఆయన రాజనీతే ' ఉన్నత వంశంలో పుట్టిన వాడు ఎంతో కష్టం కలిగితే తప్ప తన స్థాయివారి దగ్గరయినా  చెయిచాచడని  . సుగ్రీవుడు రాజు కాబట్టి కాలాన్ని బట్టి ఆ అనుమానం. పద్దాకా శాస్త్రమో అంటూ శంకలు  పెట్టుకొనేవాళ్లకి ఆ శాస్త్రం చెప్పే మరో మాట కూడా గుర్తు చేస్తా . మన ద్వారా  తన కన్నా బలవంతుడైన అన్నను చంపిస్తే, ఆ చంపినవాడి ముందు తన బలం చాలదన్న ఇంగితం  విభీషణుడికి ఉంటుందా.. లేదా?వాడి రాక్షస కులానికి చెందని మనకు వాడి రాజ్యం మీద ఆశ  ఉండదన్న భరోసాతోనే వాడు   సహాయం కోసం రామశరణు జొచ్చాడు. కాబట్టి విభీషణుడు అన్నిందాలా స్నేహాపాత్రుడే! 

' అవ్యగ్రాశ్చ ప్రహష్టాశ్చ న భవిష్యంతి సంగతాః

ప్రవాదశ్చ మహానేష తతో 2 స్య భయ మాగతం 

ఇతి భేదం గమిష్యంతి తస్యాత్గ్రాహ్యో  విభీషణ: ' అన్న మాట మార్చిపోతే ఎట్లా? 

నిశ్చింతగా, సంతోషంగా ఉండాలనుకునే పండితుల కూడా సఖ్యతగా ఉండలేరు. పెత్తనాల కోసం ఒకళ్లనొకళ్లు అణగదొక్కుకునే పరిస్థితి. రావణ విభీషణులు సమాన రాజనీతిజ్ఞులు కదా! విభాషణుడి వాలకంలో సోదర భీతి స్పష్టంగా కనిపిస్తోంది.  ఆ భయంతోనే వాడు  వచ్చాడు కాబట్టి  అభయం ఇవ్వడంలో వచ్చి పడే ఉపద్రవమేంలేదు. అందరూ భరతుడి లాంటి  సోదరులే ఉంటారా? తండ్రి మరణానికి కారణమైన నాలాంటి  కొడుకులు లేరా? అందరికీ నీవంటి స్నేహితుడే దొరకాలనే నియమం లేదుకదా సుగ్రీవా! రావణ విభీషణులు-  వాలి సుగ్రీవులు, రామలక్ష్మణులో ఎప్పటికే కాలేరు. ఈ రాక్షసుల మధ్య వైరం నిజమే . విభీషణుడు నిశ్చయంగా గ్రహణీయుడే ' అన్నాడు రాముడితో లక్ష్మణుడు . 


సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి నిలబడి  రాముడి ముందు  చేతులు జోడించి ' ఇట్లా అన్నందుకు క్షమించవయ్యా రామయ్యా!  . వచ్చింది శత్రువు  సోదరుడు. వాడి తీపి  మాటల వెనుక చేదు ఫలితం  ఉండవచ్చు. వెంటనే వాడినీ, ఆ నలుగురు రాక్షసులను నువ్వన్నా చంపు! లేకపోతే ఈ లక్ష్మన్న చేతనైనా చంపించు! '  అన్నాడు. 


వాద ప్రతివాదనల మధ్య   సానుకూలమైన ఆలోచన తోచదు . అందుకే గోలగా ఉన్న ఆ తరుణంలో మౌనంగా ఉండి చివరికి ప్రసన్నంగా లోకాలు అన్నిటికీ పనికివచ్చే మంచి మాట ఒకటి అన్నాడు రాముడు. 

' నన్నూ నావాళ్లను ఎవరినీ ఏమీ చేయలేని బలహీనుడయ్యా  ఈ వచ్చినవాడు. శరణు అంటే ఎట్లాంటి వాడినైనా రక్షించి తీరుతా. అది నా పంతం  . దానవులు , పిశాచాలు, యక్షులు, భూలోక సంబంధితులు   ఎట్లాంటివాళ్లనయినా సరే  నా కొనగోటితో చంపేయగలను .. నీకు తెలుసో .. లేదో! ఒక పావురమే శరణాగత ధర్మాన్ని చక్కగా  పాటించగా లేనిది ..  నా బోటివాడి మాట ఏమిటి? ' అంటూ కండు మహర్షి ద్వారా  తన గురువు  గ్రహించి తనకు బోధించిన ఒక  గీతికను గుర్తు  చేసుకుంటూ ' అంజలి ఘటించి ఆశ్రయం అర్థించిన విపన్నుడిని తిరస్కరించకూడదు . అంజలి పరమా ముద్రా క్షిప్రం దేవ ప్రసాదినీ .. అని గదా శాస్త్రం! దేవతలే తొందరగా ప్రసన్నమయే అంజలి ముద్రను మనం  వేళాకోళంగా తీసుకుంటే మనకే ఆపద. అంజలి ఘటించక పోయినా సరే.. దీనంగా వేడుకున్నా అభయం ఇవ్వాల్సిందే ! ఆ రెండూ లేకపోయినా ఇంకోటి కూడా ఉంది. రక్షక స్థలానికి వచ్చి యాచిస్తే సాక్షాత్ శత్రువే అయినా చంపకూడదు. ఈ విభీషణుడు శత్రువా?  కాదుగదా! కేవలం శత్రువు బంధువు మాత్రమే. అనుకున్నది ఆలస్యమయే కొద్దీ  అతనికి ఆదుర్దా  ఎక్కువవడం చూడండి ! ఆలస్య మయినా సరే .. ఎలాగోలా కోరుకున్న ఫలితం వస్తే బాగుణ్ణు' అనుకుంటున్నాడు చూడండి! ఇవన్నీ నిజమైన ఆశ్రితుడి లక్షణాలు. అటువంటివాడిని ప్రాణాలు ఫణంగా పెట్టయినా రక్షించాలి అంటుంది ధర్మశాస్త్రం. ప్రత్యవాయు హేతువు అనే ఒక న్యాయం ఉంది. . మీకు తెలుసో.. లేదో! భయంతోనో, మోహంతోనో, శాస్త్రాన్ని పట్టుకుని గట్టిగా చేసుకోలేని నిర్ణయంతోనో , కాముకత్వంతోనో, బాధ్యతారాహిత్యంతోనో , ప్రతిఫలం మీద ఆశతోనో  ఉండి సంపాదించిన ఆఖరు నాణెం ఖర్చయే దాకా సిద్ధపడకపోవడం, ప్రాణత్యాగానికైనా వెనక్కు తగ్గకుండా ఉండవలసిన తరుణంలో తప్పుకుపోవడమో   ప్రత్యవాయు హేతువు కిందకు వస్తుంది. పైపెచ్చు  అడిగినప్పుడు ఆశ్రయం నిరాకరించేవాడికి ఆ దోషం అంటుకుని  పైలోకంలో నరకబాధలు మొదలవుతాయి. ఈ లోకంలో కూడా నిందలే . దాహానికి మంచినీళ్లు దొరకవు . వాడి మొహం చూస్తే చాలు జనం అసహ్యించుకుంటారు.  ఇంతకంటే ప్రమాదం ఇంకోటుంది. నిరాశతో వెళ్లే ఆశ్రితాభిలాషి   వట్టిగా పోడు. అభయం తిరస్కరించిన పాపానికి  అప్పటి దాకా చేసుకున్న పుణ్యాలన్నీ పట్టుకుపోతాడు. మనస్ఫూర్తిగా ఇష్టంతో ఆశ్రయం ఇవ్వక పోవడం కూడా   నష్టదాయకమే. ఆశ్రయం ఆశించి వచ్చినవాడి మనసులో అభయదాత పట్ల ఉన్నట్లు ఊహించుకున్న   సామర్ధ్యాలన్నీ సర్వనాశనం .  కాబట్టి, ధర్మబద్ధం, కీర్తిదాయకం, స్వర్గ ప్రాప్తి  . . ఇత్యాదులకు కారణమయే కండు మహర్షి ఉపదేశిత ఉత్తమ మార్గమే నాకు అనుసరణీయం. ఆ వచ్చినవాడు విభీషణుడే కానక్కర్లేదు , రావణాసురుడయినా సరే నిస్సంకోచంగా అభయమిస్తాను ' అన్నాడు  రాముడు . రాముడు అందుకే లోకానికి ఆదర్శప్రాయుడయింది. 


' నా మనసు కూడా ఈ విభీషణుడు పరిశుద్ధుడనే ఘోషిస్తోంది రామా! కాకపోతే రాజధర్మంగానే నా పరీక్ష . ఇప్పటి నుంచి అతను మాతో సమానుడు . మీ ఇద్దరి మధ్యా మైత్రి మాకూ సంతోషదాయకమే ' అంటూ విభీషణుడిని తీసుకురావడానికి  బయలుదేరి వెళ్లాడు సుగ్రీవుడు. . గరుత్మంతుడు దేవేంద్రుడిని తీసుకురావడానికి వెళ్లినట్లు. 


సుగ్రీవుడి నోట శుభవార్త విని అనుచరులతో సహా గభిక్కున నేలమీద పడ్డాడు విభీషణుడు. ( వాల్మీకి దీన్ని 'ఖాత్ పాతావనీం' అన్నాడు. )    నెమ్మదిగా దిగితే తాత్సారమవుతుందనో, రామ నిర్ణయం మారిపోతుందనో భయం. రాముడి  పాదాల మీద పడిపోయి సంపూర్ణ సాష్టాంగ నమస్కార రూప శరణు పొందేడు విభీషణుడు. 


' ఆ అవమానింపబడ్డ రావణ సోదరుణ్ణి నేనే ప్రభూ! లంకను, స్నేహితులతో సహా దారాపుత్రులు,ధనాది ఐశ్వర్యాలు, రాజ్యం మొత్తం నీకు  ఈ క్షణం నుంచే స్వాధీనపరుస్తున్నాను. ఇకపై నీవే నా పోషకుడివి.  నా సుఖాలు, ఆముష్మిక సుఖాలలో భాగం నీకే అర్పితం. ' అంటున్న విభీషణుణ్ణి సముదాయించినట్లు సముదాయిస్తూనే కళ్లతో పరీక్షగా చూశాడు రాముడు. 


ఇంకా శరణు ఇచ్చాను అనలేదురాముడు . మనసులో మాత్రం అభయం ఇచ్చాడు.  నీ గురించి చెప్పమన్నాడు. విభీషణుడి గురించి ఇప్పటికే హనుమంతుడి ద్వారా కొంత సమాచారం తెలుసు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చెబుతాడా.. లేదా.. అన్నదే పరీక్ష . వానర ప్రముఖుల నమ్మకం కోసం కూడా. 


విభీషణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ' రావణుడికి బ్రహ్మవరం ఉంది. దశగ్రీవుడు . సర్వభూతాలపై అధికారం సాధించాడు.  తరువాతి సోదరుడు కుంభకర్ణుడు.  ఇంద్రుడిలా యుద్ధం చేయగలడు. సేనాపతి ప్రహస్తుడు . కైలాసంలో జరిగిన యుద్ధంలో కుబేరుడి సేనాపతి  మాణిభద్రుడి అంతుచూశాడు.  గోధా, అంగుళిత్రాణ  అనే కవచాలు ధరిస్తేమాత్ర౦ ఇంద్రజిత్తును చిత్తు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ధనుస్సు  ధరించి అదృశ్యంగా యుద్ధం చేసే నేర్పరి అతగాడు  . సమరసమయంలో అగ్నిని ఉపాసించడం వల్ల ఆ అంతర్ధాన యుద్ధ నైపుణ్యం పట్టుబడింది .  ఇక మహాపార్శ్వ , మహోదర, అకంపనలు - అనే సేనాపతులయితే ఆయుధాలు పట్టుకుని స్వయంగా యుద్ధంలోకి దిగినప్పుడు సాక్షాత్ లోకపాలకులే .  లంకలో ఉండే కోట్లాది రాక్షసులు తీవ్రస్వభావులు. శరీరాన్ని కుదించుకుని రక్త మాంసాలు తాగి తిని హాయిగా హరాయించుకోగలరు. ' 

' రావణుని కర్మ వృత్తులతో సహా వివరంగా చక్కగా  చెప్పావు విభీషణా! ప్రహస్తుడు, కుంభకర్ణులతో  సహా రావణుని వధించి మరీ  నిన్ను లంకాధిపతిని చేస్తాను. ఇది సత్యం. నా ప్రతిజ్ఞ  కూడా  .  రసాతలంలో దాక్కున్నా, పాతాళానికి పరుగెత్తినా, వరాలిచ్చే బ్రహ్మ దగ్గరకు వెళ్లినా నాచేతిలో రావణుడు చావు  నిశ్చయం .  నా ముగ్గురు తమ్ముళ్ల  మీద ఆన. కొడుకులు, బంధువులు, సైన్యంతో  సహా రావణుణ్ణి చంపకుండా అయోధ్యా నగర ప్రవేశం చెయ్యను గాక చెయ్యను  .  


రాముడి లయకార  తీవ్ర పౌరుష వచనాలు విని విభీషణుడు వినయంతో శిరసు వంచి నమస్కరిస్తూ ' రామా! రాక్షస సంహారం, లంకానగర దిగ్బంధనం, రాక్షససేనా ప్రవేశం విషయాలలో ప్రాణాలున్నంత వరకు  నీకు సాయం చేస్తాను. ' అని తన వంతుగా మాట ఇచ్చాడు విభీషణుడు  . 


విభీషణుడు ఇచ్చిన మాటకు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. రాముడు.  లక్ష్మణుణ్ణి పిలిచి ' సముద్రం నుంచి నీళ్లు తెమ్మన్నాడు' . దీన్నే వాల్మీకి ' సముద్రాజ్జలమానయ' అన్నాడు. 


'ఈ మహానుభావుణ్ణి  ఇక్కడే అభిషేకిద్దాం ' అని రాముడు అనగానే సుగ్రీవుడు, అంగదుడు, హనుమదాదులు సంతోషించారు. 


ఆ విధంగా లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షంలో రామశాసనం ప్రకారం విభీషణుణ్ణి లంకాధిపతిగా అభిషేకించాడు. వానరులంతా సాధువాక్యాలు పలకడంతో విభీషణుడి ' మొదటి పట్టాభిషేకం'  తంతు దిగ్విజయంగా ముగిసినట్లయింది. 

( వాల్మీకం ప్రమాణంగా ) 


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...