ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
నలుపై తెలుపు గెలుపు
రచన- కార్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సం. పు - 16-09-2016 -
ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
నలుపై తెలుపు గెలుపు
రచన- కార్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సం. పు - 16-09-2016 - ప్రచురితం )
'తాతమ్మ కల' సినిమా చూశావురా? నీళ్లు లేక ఊరు వట్టిపోతే, మళ్ళా పడేదాకా ఇద్దరు చిన్నోళ్లు తాతమ్మ వత్తాసుతో నానా తంటాలు పడతారు. ఊరంతా గతంలో మాదిరిగా చల్లగా ఉండాలన్నది తాతమ్మ కల. ముని భగీరథుడి మునిమనవళ్లకు నకలుగా పిల్లోళ్ళు బోరింగు, రిగ్గింగులతో బోలెడంత సంచలనం సృష్టిస్తారు....'
' ఇప్పుడా బోరు కతలు అంత అవసరమా బాబాయ్? ఇవతల చేదు కాకరకాయకు కూడా డబ్బులు చేతులో లేక జనాలు ఇబ్బందిపడుతున్నారు. గాలి లేకపోయినా బతకొచ్చుగాని, డబ్బు లేకుండా బతకడం ఎలా ఈ లోకంలో? '
'మా రోజుల్లో ఈ డబ్బులు దస్కాలూ ఎక్కడేడ్చాయిరా అబ్బీ! గాబులో బియ్యం.. పెరట్లో కాయ! ఏ కొబ్బరి ముక్కో, అల్లం చెక్కో కావాలంటే శెట్టి కొట్లో దోసెడు ధాన్యం పోసెయ్యడమే! ఎవరికీ ఎర్ర ఏగానీ ఇచ్చెరగం '
' ఇక్ష్వాకులనాటి కతలిప్పుడొద్దు బాబాయ్; ధన మూలం ఇదం జగత్.
' అడ్డమైన డబ్బూ దేశం మీద పడ్డది. అది చాలక నకిలీ డబ్బు '
ఏళ్లకేళ్లు దేశాన్నేలిన పాలెగాళ్లు మామూలోళ్లా బాబాయ్! అంతా కలుపుమయం చేసిపోతిరి'
' ఆ కలుపును పీకెయ్యాలనే మోదీ 'నలుపు' మీద ఇప్పుడు యుద్ధం మొదలెట్టారు. మొదట్లో నాకూ ఆ నిర్ణయం మనస్కరించలే. ఇప్పుడు మనస్ఫూ ర్తిగా నమస్కరించాలనిపిస్తోంది. సమస్యలున్నా యని తెలిసినా, ఎంత మంచి సంస్కరణకు శ్రీకారం చుట్టేశారూ'
'మునుపటి నేతలూ ఇలాంటి చిట్కాలే ఏమైనా చేసి ఉండొచ్చుగా బాబాయ్! చేయడం రాకా?'
' ఇష్టం లేక. ఆ నేతాశ్రీల చూపు ఎప్పుడూ నల్లసిరి గోతాల మీదేనాయే! ఆ డబ్బే ఆడకపోతే ప్రజాస్వా మ్యంలో ఓట్లేసే డబ్బాలు ఎవడికి కావాలిరా అబ్బిగా? అందుకే మోదీజీ ఈ పెద్దనోట్ల రద్దుకు దిగింది"
కానీ..... పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులకూ ఇబ్బందులు వచ్చాయి. పెద్దోళ్ళ గుండెలైతే ఏకంగా బద్దలయ్యే ఉంటాయ్'
'సామాన్యులకు కాస్తంత ఇబ్బందే అనుకో! కనేటప్పుడు తల్లి ఆపసోపాలు పడుతుంది కదా. అలాంటి కష్టమే వచ్చిందనుకోరాదూ' బిడ్డను కళ్లారా చూపించు... తల్లి కష్టం ఇట్టే తేలిపోతుంది. ఈ రద్దు సంగతీ అంతేరా
బాబూ! అన్నీ సద్దు మణిగి, మంచి ఫలితాలు చవిచూశాక పేదోడి గుండె ఉప్పొంగడం ఖాయం'
'మరి బ్యాంకుల ముందు బారుల మాటేమిటి? రెండు చట్టసభల్లో రోజూ ఆ రచ్చలేంటి బాబాయ్! '
'రాజకీయాలకు అతిశయోక్తులు ఓ అలంకారం! చట్ట సభల రచ్చలకేంగాని, రచ్చబండల మీది జనం మోదీని మెచ్చుకొంటున్నారు. సర్వేశ్వరుల మాటా, దేశాన్ని సర్వ నాశనం చేసినవారి మాటా- ఏదిరా మనం నమ్మాలి?'
' ఒకాయన భూకంపం పుట్టిస్తానంటాడు. ఒకామె మోదీ కుర్చీ ఊడలాగేసుకుంటానంటూ ఊగిపోతుంది. మరొకాయన 'తుగ్లక్ పాలన' అంటూ కన్నెర్ర చేస్తాడు. ఇంకొకాయన 'మరకా మంచిదేనంటూ' సూక్తులు చెబుతాడు. మోదీజీ మొదటిసారి చేశారీ మ్యాజిక్! అంతా 'అర్థక్రాంతి' సందడి. 'గీకుడు పెట్టెల' కోసం చిల్లర దుకాణాలు ఎలా పరిగెడుతున్నాయో చూశావా? '
'ఇప్పుడా గీకే తంత్రమే మళ్లీ మన దేశ డబ్బు జబ్బుకు మంచి మందంటావ్... భలే!'
' మరే! పెద్దనోట్ల రద్దు వల్ల దొంగ సంపన్నులకే పన్ను పోటు! లెక్కప్రకారం కట్టేవాడికి జ్వరం ఎందుకొస్తుంది? సర్కారు ఖజానా గలగల్లాడితేనే గదా... పేదోడి బతుకు కళకళ లాడేదీ?'
'మరి పెద్దనోట్లు ఎందుకు ముద్దరేస్తున్నట్లు? దానివల్లే కదా మోదీ
బాబాయికి ఇన్ని తిట్లు?'
'దాని వెనకా ఏదో పెద్ద వ్యూహమే ఉంటుందిరా! కంగారు పుట్టించి, దొంగ దొరలందరి చేతా బంగారు కడ్డీలు కొనిపించలా! వాటి నడ్డి విరగ్గొట్టే చట్టా లిప్పుడు బయటకొస్తున్నాయి. పన్ను ఎగవేసే నల్ల మహారాజులందరి పళ్లు రాలగొట్టే చట్టాలూ అలాగే సమయానికి మళ్ళీ ప్రాణం పోసుకుని లేచొస్తాయ్. నోటుకు ఓటు బేరగాళ్లందరి నోళ్ళూ పడిపోయేలా బోలెడన్ని ఉపాయాలు ఉన్నాయంటున్నారుగా మోదీజీ'
' సమయం రావాలేగాని... పెద్ద తలకాయలే రాలిపో యేట్లున్నాయి. అందుకే ప్రధాని సమయం కావాలంటున్నారు. సర్వేల్లోనూ జనం నాడి మోదీకి 'జై'కొడుతోంది'
'అంటే దేశానికి త్వరలోనే 'రామరాజ్యం' రాబోతోందంటావ్ '
' దారిలో పడ్డావ్ బిడ్డా! ఏళ్ల తరబడి పోగడ్డ మాయసొమ్ముతో కోట్లకు పడగలెత్తాలన్న మాఫియాగాళ్ల పన్నాగమే పెద్దనోట్ల రద్దుమీద ఇంత రాద్ధాంతం. చిన్న బుర్ర జీవులం... మనకు ఇది అంతుపట్టడం అంత తేలిక కాదు. ముందు 'గీకు వీరుల' ను పెంచాలన్నది మోదీ ఆలోచన. దాని వెన కున్నది పేదరికం నుంచి బడుగుజీవి విమోచన. సర్కారు ఖజానాలు వడ్డికాసులవాడి హుండీలతో పోటీపడాలే గాని, దిక్కులేనివాడి దశ మార్చడం చిత్తశుద్ధి ఉన్న దొరలకు ఎంత సేపు! ఏళ్లబట్టి పోలింగు బూత్ ల వరకే పేదోడి చేతి వేళ్లు పరిమితమవుతున్నాయి. అదే చేతి వేళ్లను ' గీకుడు యంత్రాల' వైపు మళ్లిస్తే, వాడిపోయిన వాడి బతుకు మళ్ళీ చిగురించడం ఎంతసేపు! కాకి లెక్కల వాళ్లెంతా 'కావు కావు'మన్నా గీకు యంత్రాల మోత వినిపిం చక మానదు'
'ఏమో బాబాయ్! ఈ వయసులో 'స్మార్ట్' అయిపో వడం అంత తేలికా? '
'యంత్రాలతో మంచిదే గదరా! చేతి వేళ్లతో పని. కాలు కదపకుండా సర్వం ఇంటికి తెప్పించుకోవచ్చు'
' అందుకేనా .. మా తాతమ్మ 'పొదుపు .. పొదుపు ' అని కలవరిం చేది? '
'తాతమ్మ కల నెరవేరబోతోంది. శుభం!'
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సం. పు - 16-09-2016 - ప్రచురితం )
No comments:
Post a Comment