ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం
వాక్ దూషణం
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సం. పు - 16-02-2012 - ప్రచురితం )
మానవజన్మ మహత్తరమైన వరం అను కుంటాం కానీ, పనిచేసే చెవులు రెండున్నవాడికి నిజంగా అది పెద్ద నరకమే!
' సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకాము' అంటూ రామదాసు కీర్తన అమృతంలా చెవుల్లో పడ్డ ప్పుడు- 'ఆహా, ఎంత వీనులవిందుగా ఉంది! ' అంటూ ఆనందిస్తాం. అదే- 'ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరి గేవు. రామచంద్రా!' అంటూ దీర్ఘం తీస్తూ గోపన్న దెబ్బలాటకు దిగినప్పుడు 'అబ్బా' అనిపించక మానదు.
తిట్లు, శాపనార్థాలు మనకు కొత్తకాదు. ధర్మరాజు నుంచి అగ్రతాంబూలం అందుకుంటున్నాడన్న ఉక్రోషం కొద్దీ శ్రీకృష్ణుణ్ని శిశుపాలుడు మహాభారతంలో పడతిట్టి పోశాడు.
పిలిచి భోజనం పెట్టలేదని పెళ్లివారింట విస్తళ్లలోని అన్నాన్ని సున్నంగా, అప్పాల్ని కప్పలుగా మార్చేశాడు భీమకవి.
ఇక యుద్ధానికి ముందు రామాంజనేయుల మధ్య పరస్పర దూషణలూ మజాగా సాగుతాయి.
కృష్ణపాండవీయంకన్నా కృష్ణార్జున యుద్ధమే రసవత్తర దృశ్యం
తెలుగు సాహిత్యంలోనూ తిట్టు కవిత్వం ఎక్కువే. కాల్లో ముల్లు గుచ్చుకుందని చెట్టునే తగలెట్టాలంటూ తిట్టి పోసిన మల్లుడొకడు. చేతిలోని ఉంగరం జారిపోయిం దని బంగారంలాంటి చెరువు నీళ్లనే ఎండబెట్టిన బడబాగ్ని ఇంకొకడు. రాజుగారు పిలిచి పీటేసి, దండిగా సంభావనలు ముట్టజెప్పలేదని కోటగోడల మీద ఆయన సర్వనాశనమైపోవాలని తిట్టు కవిత్వం రాసిపోయిన రామకవి మరొకడు. తరచి చూడాలేకానీ, పుట్టలకొద్దీ తిట్ల సాహిత్యం మన సొంతం .
అశ్లీలం అశ్లీలం అని ఆడిపోసుకుంటున్నాంగానీ, ఆ మాత్రం వేడి భాషలో లేక పోతే వినేవాడే ఉండడు. ' మీ పిండం కాకులకు పెట్టా! . . మీ ఇంట్లో కోడి కాల్చా' అంటూ పువ్వులు రువ్వినట్లు పదప్రయో గాలు చేస్తూ కూర్చుంటే- చెవిన పెట్టే రోజులా ఇవి!
పడతిట్టాలంటే అందుకు ఎంతో సృజనాత్మకశక్తి కావాలి. తిట్టిన తిట్టు తిట్టకుండా, తిట్టినవాడిని తిట్టకుండా తిట్టడమంటే- అదొక భాషాయజ్ఞం. అందుకోసం ఎప్పటి కప్పుడు ఎన్నెన్నో కొత్త పదాలు సృష్టించుకుంటూ వెళ్లాలి.
పొగడ్తలెప్పుడూ ఒకేరకంగా ఉంటాయి. ఎలా పొగిడినా. పొగిడించుకునేవాడికి పాయసంలో వేయించిన జీడిపప్పు తిన్నంత మజాగా ఉంటుంది. శాపనార్థాలకు అలాంటి అవకాశం లేదే!
ఒక తిట్టుపదం ఒకసారి ప్రయోగించాక దాని పదును తగ్గిపోతుంది. అంతకన్నా దరిద్రమైన కొత్త పదాన్ని ప్రయోగించలేకపోతే యుద్ధంలో ఓడిపోయినట్లు చెడ్డ పేరొస్తుంది . నాలుకకు నరం లేకుండా వాడుతున్నాడని ఆడిపోసు కుంటారే గానీ అతగాడి నిరంతర వాక్చాతుర్యం వెనకగల ఆపార ప్రావీణ్యాన్ని గుర్తించడం లేదే!
'గాడిద కొడకా!' అంటే గాడిదలు కూడా మెదలకుండా ఊరుకోవడం లేదు. అక్కు పక్షుల సంఘాలూ హక్కుల కోసం బజారున పడుతున్న రోజుల్లో ఒక పదాన్ని వాడాలంటే ఎంతో సాహసం చేయాలి. అయినా గుర్తింపు కొరవడుతోంది.
వెటకారంగా మాటలు విసిరితే పనులయ్యే రోజులా ఇవి సంస్కారవంతులకూ సంస్కృతంలో అంటితే తప్ప పరిస్థితుల ఘాటు బోధప డటం లేదు. వాన చినుకులతో దున్నపోతులు అదరన ప్పుడు, వడగళ్లతో బెదరగొట్టడంలో తప్పేముంది! అదేప నిగా వాగుతున్నారని ఈసడించుకొంటున్నారుగానీ, ఈ
తిట్ల పురాణాల వెనక- ఎంత కథ, శ్రమ, పరిశ్రమ, పరిశోధన, తెగువ, తపన దాగు న్నాయో ఎవరైనా అర్ధం చేసుకొంటున్నారా!
ఆంగ్లంలో మాట్లాడితే మాతృభాషాభిమానం లేదని గోల పెడుతున్నారు. అచ్చమైన తెలుగు పదాలు విచ్చలవిడిగా వాడుతుంటే, 'భాషాభివృ ద్ధికి దోహదం చేస్తున్నాడని దోసిలి పట్టాల్సిందిపోయి, దోషాలు ఎంచడం ఎంత అన్యాయం!
చట్టసభల సాక్షిగా గవర్నర్లమీదే కుర్చీలు, బల్లలూ పడ్డా ఎవరికి చీమ కుట్టినట్లనిపించలేదు. బోలెడంత ఖర్చుపెట్టి, ఎండ వానలకు పడి బజార్లలో తిరుగుతూ గొంతుచించు కుంటున్నా రాని ప్రచారం . . ఇంట్లోనో, కార్యాలయంలోనో ఓ గంట విలేకరుల సమావేశం పెట్టి రెండు బూతులు లంకించుకుంటే- పైసా ఖర్చనేది లేకుండా బోలెడంత పేరోస్తుంది .
చిలకల్లా రోజూ ఒకే పలుకు పలుకుతుంటే సొంతపార్టీ కార్యకర్తలే సొమ్మసిల్లి పడిపోతున్నారు. నిమ్మరసం లేకుండా అందరిలో హుషారు కలిగించా లంటే- ఈ కాలంలో 'ఈసడింపు భాష' ను మించిన బ్రహ్మాస్త్రం మరొకటి లేదు. రాజకీయాల్లో అంతిమ విజయం. అలాంటివారికే నేటి పాలిటిక్సులో ఫైనల్ విజయం .
ఎవరి చివరి లక్ష్యమైనా సింహాసమేగా ? లక్ష్యం ప్రధానం లక్షణాలతో పనే లేదు. 'నోరు పారేసుకుంటున్నారని మనం నేతల మీద అలా ధ్వజమెత్తడం ఘోరం. ఆన్ పార్లమెంటరీ అంటూ వారి నోటి దురదను అలా గాలికి వదిలేయకుండా, శాశ్వత ప్రాతిపదికపై ఆ పదజాలాన్ని నమోదుచేసుకునే కార్యక్రమం మొదలు పె డితే- ప్రపంచ భాషలన్నింటికీ మన తెలుగే మార్గదర్శక మయ్యే అవకాశం అధికం. నీళ్ల పంపు దగ్గర నోరు పారే సుకునేవాళ్లకూ కాస్త 'మాటసాయం' అందించినట్లవు తుంది.
పాఠాలు ఎప్పుడైనా నేర్చేసుకోవచ్చు. అవకాశం వచ్చినప్పుడల్లా మన భావిపౌరులకు టీవీల్లో నేతల బూతు ప్రసంగాలు వినే అవకాశం కల్పిస్తే- ముందు ముందు మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అన్న కీర్తితో పాటు అతి పెద్ద బూతుస్వామ్యం' అనే ఘనతా అదనంగా సాధించు కోవచ్చు . బూతు సాహిత్యం వినలేని చాదస్తులు చెవుల్లో సీసం పోసుకోవచ్చు ఎవరొద్దన్నారూ?
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సం. పు - 16-02-2012 - ప్రచురితం )
No comments:
Post a Comment