Thursday, December 9, 2021

వ్యాసం- బాల భాష- భలే భాష రచన- కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక)

వ్యాసం- 





బాల భాష- భలే భాష 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక) 



ఊహలను, కష్టసుఖాలను తోటివారితో పంచుకునే సాధనం- భాష. గుంపులుగా సంచరించే జీవులకు భాష అవసరం మరీ జాస్తి. వంటరిగా మసిలే కాకికి పది పన్నెండు అరుపులు వస్తే గుంపులుగా తిరిగే కోతికి వందదాకా శబ్దాలు చేయడం వచ్చు. మనిషి సంఘజీవి కనక భాషా తదనుగుణంగానే ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందింది. ఆ క్రమమే శిశువుల్లోనూ ప్రతిఫలిస్తుంటుందని జీవపరిణామవాదం. బాలభాషను స్థాలీపులాక న్యాయంగా పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.


ప్రాపంచిక వ్యవహారాల్లో భాష అవసరాన్ని కనిపెట్టి మనిషి ఎలా దాన్ని వశంలోకి తెచ్చుకున్నాడో.. శిశువూ అదే క్రమంలో వస్తువులు, వాటి సౌకర్యాలు, వాటిని సమకూర్చుకునే పద్ధతులను గురించి నేర్చుకుంటుంది. ఒక మూల కొన్ని వస్తువుల కుప్ప ఉందనుకోండి. అందులో తనకు కావాల్సిన వస్తువు ఉంది. మూగ సైగలద్వారా స్పష్టంగా చెప్పడం కుదరదు కదా! పెద్దవాళ్ళెవరైనా ఒక్కొక్క వస్తువును చూపిస్తుంటే .. అది అవునో కాదో చెప్పాలి. అనుకున్నది దొరికేదాకా ఓపిక కావాలి. శిశువుకు అంత సహనం ఉండదు. కోరినది వెంటనే అందాలంటే స్పష్టమైన పదంతో సూచించడం అవసరం. మాటలు నేర్చుకోవడం అందుకే శిశువుకైనా ఒక తప్పనిసరి అవసరంగా మారింది. మాటలు రాని ఇద్దరు శిశువులను ఒకే చోట కూర్చో పెట్టిచూడండి. వాళ్ళిద్దరూ ఏవో విచిత్రమైన శబ్దాలతో పరస్పరం సంభాషించుకునే ప్రయత్నం చేస్తారు. అదే మాటలు నేరిస్తే కావాల్సిన వస్తువు పేరు వత్తి చెప్పో, ముఖకవళికలద్వారా సూచించో, అవయవాలను యథాశక్తి కదిలించో సాధించుకోవచ్చు. కానీ ఈ అభ్యాసమంతా ఎన్నో తప్పుల తడకలో తమాషాగా సాగుతుంది. ఆ కోణంనుంచే ఈ రచన సాగుతుంది. బిడ్డకు వస్తువు పేరు తెలిసినా దాని లక్షణం సంపూర్ణంగా తెలియదు చాలాసార్లు. ఆ వస్తువును గురించి తనకు తట్టిన భావంతో గుర్తించడం బిడ్డకు అలవాటు. బెల్లం రుచి నచ్చి బెల్లం పేరు పలకటం వచ్చిన పిల్లలు.. రుచి నచ్చిన మరే తినుభండారం చేతికిచ్చినా 'బెల్లం' అనే అంటారు. బెల్లం రుచి పేరు 'తీపి' అని తెలిసిన తరువాత ఆ 'తీపి' ఇష్టం కనక ఇష్టమైన ఏ రుచినైనా వాళ్ళు తీపి అనే అంటారు. పండగనాడు పిండివంటలు చేస్తారు. కాబట్టి అప్పచ్చులు చేసిన ఏరోజైనా పిల్లల దృష్టిలో పండుగైనట్లన్నమాట.

ఒక వస్తువు ప్రత్యేక లక్షణాలను గుర్తించి ఆ లక్షణాలుగల వస్తువును ఆ పేరుతోనే పిలిచే శక్తి కొన్ని నెలలు గడిస్తేనేకాని బిడ్డకు పట్టుబడదు. పెద్దవాళ్లు పక్కనుండి సరిదిద్దే వరకూ చిన్నాన్నను నాన్ననీ, పక్కింటి పిన్నిని అమ్మనీ చేసేసి కంగారు పెట్టేస్తుంటారు. మీసాలు..గడ్డాలు కలగలిసిపోయిన ఆసామినెవరినన్నా చూపించి పెద్దాళ్ళు 'బూచాడు' అని భయపెడితే.. మీసాలు గడ్డాలున్న ప్రతి మగవాడూ ఆ బిడ్డ దృషిలో బూచాడే. ఆఖరికి టీవీలో రోజూ కనిపించే చంద్రబాబునాయుడునుంచి.. యోగా గురువు రాందేవ్ బాబాదాకా. వ్యక్తుల ప్రత్యేకలక్షణాలను గ్రహించి ప్రత్యేకమైన పేర్లతో గుర్తించడం శిశువుకి అలవాటు అయిందాకా ప్రతిరోజూ ఇంట్లో ఇలాంటి ఏదో తమాషా జరుగుతుండాల్సిందే. ఒక వస్తువు ప్రత్యేక లక్షణాన్ని గుర్తించే సామర్థ్యం అలవడ్డ తరువాత ఆ లక్షణాలున్న అన్ని వస్తువులను ఒక సముదాయంగా భావిస్తారు బిడ్డలు. గులాబి రంగు నచ్చింది కనక మల్లె, మందారం, గన్నేరు, చివరికి గడ్డిపూవైనా సరే- గులాబీలే బాలలకు. పెద్దవాళ్ళు ఒకొక్క పువ్వు లక్షణాన్ని వివరించి పేర్లు చెప్పించాల్సిన సమయమిదే. మొగైనా..పువ్వైనా, రెక్కైనా.. తొడిమైనా ఒక దశలొ పిల్లలకు అన్నీ పూల కిందే లెక్క. వివిధ దశలను ప్రత్యేకమైన పేర్లతొ గుర్తించి పిలిచే పదసంపద సొంతమయేదాకా పిల్లలతో ఇదో రకమైన తారుమారు సరదా.


పిల్లల దగ్గర సభ్యపద ప్రయోగాలు మాత్రమే చేయడం చాలా అవసరం. అర్థం తెలియకపోయినా పెద్దవాళ్ళ మాటలను గుడ్డిగా అనుకరించడం పసిబిడ్డల లక్షణం. భాషను చురుకుగా నేర్చుకోవడానికి బిడ్డకు ఉపకరించేదీ అనుకరణ గుణమే. అనుకరణ బిడ్డకు అంత సులభమేమీ కాదు. ఎన్నో పాట్లు. కొన్నిసార్లు నవ్వు పుట్టించే సందర్భాలూ కద్దు. పిల్లలకు తెలిసే వస్తువులు కొన్నే. ఆ వస్తువుల లక్షణాలు కనిపిస్తే తెలీని వాటినీ వాటి పేర్లతోనే పిలుస్తుంటారు. ఇంట్లో ఉండే తువ్వాయికి నాలుగు కాళ్ళు కనక నాలుగు కాళ్ళున్న గాడిదైనా సరే వాళ్ళకళ్ళకి తువ్వాయే. పండక్కి తను కొత్తగౌను కట్టుకుంది కనక ఇంట్లో వాళ్ళందరూ గౌన్లే కట్టుకుంటారని ఓ పాపాయి ఊహ. నిన్న, రేపు, కొనడం, అమ్మడం, రావడం, పోవడం.. లాంటి పదాల మధ్య తేడాలు అంతుబట్టక ఒకదానికి బదులు ఒకటి వాడి నవ్వు తెప్పిస్తుంటారు ప్రతి ఇంట్లోనూ పిల్లలు. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఆటలాడుకుంటూ కల్పించుకునే సొంతపదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వస్తువులకు వాళ్ళు పెట్టే పేర్లు ఒక్కోసారి చాలా సృజనాత్మకంగా కూడా ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. 'పడవ'ను ఒక పాపాయికి 'కాలవ ఇల్లు' అంది. వానబడితే కప్పలు బెకబెకలాడతాయి కనక వర్షాన్ని మరో చిన్నారి 'బెకబెక'గా సంబోధిస్తుంది. మానవసంబంధాలను అచేతన పదార్థాలకూ ఆపాదించే కావ్యలక్షణం పసివాళ్లకు ఎలా అబ్బుతుందో..అదో అబ్బురం. ఒక పాపకు వంకాయి పేరు మాత్రమే తెలుసు. సంత నుంచి


తండ్రి తెచ్చిన సొరకాయను, పొట్లకాయను .. వరసగాబెట్టి వంకాయ అమ్మమ్మ, వంకాయ తాతయ్య అంటూ వంకాయభాషలోనే పిలుస్తుంది. ఇంకో పాపకు పక్కింటి పడుచుపిల్లదగ్గర బాగా చనువు. అస్తమానం 'అక్క' అంటో ఆ పిల్ల వెంటే తిరుగుతుంటుంది. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ ఆ పాపకు అక్క అమ్మ, అక్కఅన్న, అక్కనాన్న.. అని లెక్కన్న మాట. మరో బాబు దృష్టిలో పోషణ చేసేవాళ్ళందరూ అమ్మల కిందే జమ. అందుచేత


నీళ్ళుచేదుకునే బావి - బావమ్మ, అప్పచ్చి ఇచ్చే పక్కింటి ఆమె 'అప్పచ్చమ్మ'. చుట్టరికాలతో సొంతంగా పాటలు కట్టుకుని పాడుకోవడం పిల్లలకు ఎంతో సంతోషం కలిగించే సరదా. 'కప్ప నీ అప్ప, బల్లి నీ బావ, బొమ్మ నీ అమ్మ, చీమ నీ చెల్లెలు'- ఇలా సాగే పిల్లల పాటలు ఆంగ్లంలో 'నాన్సెన్స్ రైమ్స్' పేరిట చాలా ప్రసిద్ధి. పిల్లల ఈ అభిరుచి వల్లే బాలలకథల్లో కాకిబావ, నక్కమామ లాంటి చిత్రమైన పాత్రలు పుట్టుకొచ్చింది. తల, గొంతు, తత్సంబంధమైన తదితర కండరాల కదలికలను బట్టి ధ్వని ఉచ్చారణ ఉంటుందని మనందరికి తెలుసు. కండరాల స్వాధీనత వెసులుబాటు శిశువు ఉచ్చారణను నిర్దేశిస్తుంది. ఆ స్వాధీనానికి బిడ్డకు కొంత వ్యవధానం అవసరం. అయినా ఈ లోపే శిశువుకి వస్తువుమీద ఒక అవగాహన ఏర్పడి వుంటుంది. కండరాలను సులభంగా కదిలించగలిగిన అక్షరాలనే బిడ్డ ముందుగా పలుకుతుంది. ర, డ లాంటి అక్షరాలు అంత సులభంగా లొంగవు. త, ప లాంటి అక్షరాలూ ఆరంభంలో పలకడం కొంచెం కష్టమే. కష్టమని ప్రయత్నం శిశువుల లక్షణం కాదు. ఒక అక్షరాన్ని పలకడంలోని ఇబ్బంది.. దాని పక్క అక్షరాన్నిబట్టి ఉంటుంది. త, ప.. లు లాంటివి ఒంటిగా పలికే ఇబ్బందిని 'అత్త.. అప్ప' అని 'అ' ముందు చేర్చడంద్వారా పరిష్కరించుకోవడం ఇలాంటి ఒక పద్దతి. అక్షరాలను మార్చడం, కొన్ని అక్షరాలను వదిలేయడం, కష్టమైన అక్షరాలకు బదులుగా తేలిక అక్షరాలు పలకడం ఇంకొన్ని పద్ధతులు. కొత్తపదం దొరికినప్పుడు పరిచయమున్న పాతపదానికి దాన్ని అనుసంధానించుకోవడంద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. శిశువు. రోకలి- లోకలి, తమలపాకు-తాంపాకు, పటికబెల్లం- కటికబెల్లం, పులుసు- పుస్సు, పెనసలు- పెస్సలు, పుస్తకం- పుత్తకం.. ఇలా ఎన్ని పదాలనైనా గుర్తించవచ్చు. రెండేళ్ళు నిండేవరకు శిశువుకు 20, 30 పదాలకు మించి రావు. మూడు నాలుగు ఏళ్ళకు అత్యద్భుతమైన వేగంతో నాలుగైదు వందల పదాలదాకా సాధిస్తారు పిల్లలు. ఒంటరిగా వుండే పిల్లలకు పదాలు ఎక్కువ రావు. ఈడుకు మించినవాళ్ళతో జోడుకట్టే బాలల భాషాజ్ఞానం అసాధరణంగా ఉంటుంది. పరిస్థితులు, ఆరోగ్యం, ఆసక్తి, పరిశీలనా శక్తి.. ఇలా భాషాభ్యాసానికి దోహదం చేసే ఉపకరణాల చిట్టా పెద్దదే.


అన్ని భాషాభాగాల్లోనూ నామవాచకాలను పిల్లలు ముందు గ్రహిస్తారని ఒక సాధారణ అభిప్రాయం. అభ్యాసం నామవాచకాలతోనే ప్రారంభమైనా శిశువుకి క్రియావాచకాలమీద

ధ్యాస జాస్తి. పని చేయడం మీదే శిశువుకు సహజంగా ఉండే ఆసక్తి దీనికి కారణం. ఇతర భాషాపదాలనూ క్రియాపదాలుగా మార్చి పలకడం.. అదో విచిత్ర పద విన్యాసం. ప్రతి పదానికి ఒక క్రియని జోడించే అలవాటువల్ల ఆ పదాన్ని ఆ క్రియకు పర్యాపదంగా ఉపయోగిస్తుంది శిశువు. మేడమీదకు తీసుకు వెళ్ళడానికి 'మీద.. మీద' అని సూచించడం దీనికి ఒక ఉదాహరణ. విరుద్ధపదాలను సైతం ఒకే వాక్యంలో సమర్ధవంతంగా కూరి వినోదం అందించడం పిల్లల మరో తమాషా విద్వత్ లక్షణం. ఆడవాళ్ళతో చాలాకాలం మెలిగిన బిడ్డ మొగవాళ్ళతోనూ 'ఇది ఇయ్యవే..ఇలా రావే' అని మాట్లాడుతుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది?


పొడుగు పొడుగు వాక్యాలతో గాని పెద్దలు స్పష్టపరచలేని భావాన్ని ఒక చిన్న పదంతో స్పంష్టంగా వెలిబుచ్చగల చిచ్చర పిడుగులు చిన్నారులు. అసలు సిసలు మినీకవులన్నా తప్పు లేదు. ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపమనడానికి 'జో..జో.." అని రెండక్షరాలతో సూచిస్తుందో బాలమేధావి. రెండు మూడు సంబధంలేని విడి పదాలను జోడించి విచిత్రమైన వాక్యం తయారు చేయగలరు బాలలు. 'నాన్న.. తియ్య.. లే' అంటో చేతులు తిప్పుకుంటో పిల్లాడు చెబుతున్నాడంటే 'నాన్న మిఠాయి తీసుకురాలేదు' అని ఫిర్యాదు చేస్తున్నాడన్న మాట.


అభినయం తగ్గి మాటలు పెరగడం శిశువు వికాసదశ పరిణామం. వస్తువు, దాని ప్రత్యేక లక్షణం గుర్తు పట్టే విచక్షణ పెరిగే కొద్దీ పదాలను పొందిక చేసి వాక్యాలుగా ఉచ్చరించడం బిడ్డకు అలవాటవుతుంది.


పసిపిల్లలకు 'నేను' అన్న భావం ఒక పట్టాన బుర్రకెక్కదు. అందరూ తనను ఎలా పిలుస్తారో తననూ తానూ అలాగే సంబోధించుకుంటుంది ఓ చిట్టి. 'చిట్టికి పప్పులు కావాలి' అంటే 'నాకు పప్పులు కావాలి' అని అర్థం అన్నమాట. 'చిట్టి ఏడుస్తుంది.. చూడూ' అని అరుస్తుందంటే 'నన్ను ఏడ్పించద్దు' అని అర్థించడమన్న మాట.


'వర్షం వెలిసింది' అనడానికి 'వర్షం పోయింది' అని, 'నూనె ఒలికింది' అనడానికి 'నూనె పారిపోయింది' అని .. ఇలా ఒక పదార్థ లక్షణాన్ని వేరొక పదార్థ లక్షణానికి అన్వయించేసి చిత్రమైన పదబంధాలను తయారుచేసే శక్తి పసిపిల్లలది. ఎంతకూ తన మాట వినిపించుకోని తల్లిమీద 'నీకు చెవులు కనిపించవా?' అని గయ్యిమంటో లేచిందో పిల్లరాక్షసి. ఎంత అదిమి పట్టుకున్నా ఆ తల్లిపెదాలు నవ్వుతూ విచ్చుకోకుండా ఉంటాయా? 'అయ్యో.. బంగారంలాంటి బలపం పారేసావే' అని తండ్రి గద్దించడం గుర్తుంచుకున్న బాబు .. బళ్లో ఉపాధ్యాయుడు 'బంగారం చూసావా?' అని అడిగినప్పుడు 'చూసాను.. బలపం లాగుంటుంది' అనేస్తాడు ఠకీమని. ఎంత కోపిష్టి గురువుకైనా

ఫక్కుమని నవ్వు రాకుండా ఉంటుందా? 'అల్లరి చేసే బిడ్డ ఒళ్ళో ఇన్ని పప్పులు పోసి 'ఈ పప్పులు తీసికెళ్ళి వీటితో ఆడుకో' అని తల్లి గద్దిస్తే.. బిడ్డా అంతే చురుగ్గా ' 'పప్పుల్తో ఆడుకోం! పప్పులు పెట్టి చిన్ని తోటీ చింటూతోటీ ఆడుకుంటాం' అని తల్లి భాషను పెద్దఆరిందలా సరిదిద్దబోతే పెద్దవాళ్ళం మనం ఎంతసేపని పెదాలు బిగపట్టుకోగలం?! ఇట్లాంటి మెట్లెన్నో ఎక్కిన తరువాతే ఏ బాలైనా రేపటి ఉద్దండపిండంగా తయారయేది. భాషాభ్యాసంలోపదకవిపితామహుడు నన్నయకైనా దాటక తప్పని పసిదనపు చిలిపి దశలివన్నీ.***


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక) 

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ప్రతిరోజూ ప్రశస్తమే ! రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- 06 - 09- 2009 న ప్రచురితం )

 




ఈనాడు - గల్పిక-  హాస్యం - వ్యంగ్యం 

ప్రతిరోజూ ప్రశస్తమే ! 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- 06 - 09- 2009 న ప్రచురితం ) 



ఆ అమెరికా యూనివర్సిటీ వాళ్ళకు పనీపాటా  లేదా ఏంటి... ఆదివారం ' ది బెస్ట్' అని తేల్చుకోవటానికి అన్ని బ్లాగులు మధించాలా?! మనదేశంలో చంటిపిల్లాడిని అడిగినా గంటకొట్టి  చెబుతాడే, సండేని మించిన గ్రాండ్ డే భూమండలం మొత్తంమీద వెదికినా మరోటుండదని! ఆది వారమంటే కంటినిండా నిద్దర, కడుపునిండా భోజనం, టీవీ నిండా సినిమాలే! ఆడవాళ్ళకు తప్ప ట్రాఫిక్ పోలీసులతో సహా అందరికీ ఆదివారమంటే ఆనందవారమే కదా భాయీ! అహాఁ... చెప్పలేములే ఆహాయి!'


'ఆహా... అందుకే అయిదేళ్ళ కిందట ఆ డిసెంబరు చివరి ఆదివారంనాడు అంతమందిని కొట్టుకెళ్ళిన సునామీ పుట్టింది! ' 


' సోమవారంనాడు షేర్ మార్కెట్లకు మహమంచి రోజంటారే! ' 


'బ్లాక్ -మండే' సంగతి మర్చిపోయారా? చంద్రమండలం మీద మనిషి మొదటిసారి కాలు పెట్టింది చంద్రదినం అంటే సోమవారంనాడు కాదుకదా నాయనా! ఏ లెక్క ప్రకారం సోమవారంనాడే గుండె నొప్పులు ఎక్కువుంటాయని చెప్పారు స్వామీ, ఆ గొప్పవారూ? ' 


' సర్వేలయ్యా... సర్వేలు!'


' సర్వేల లెక్కల్లో నూటికి తొంభైతొమ్మిది తప్పులే ఉంటాయని ఓ సర్వే చెబుతోంది. తమరికి తెలుసా సర్వేశ్వర్రావు గారూ! మంగళ వారంనాడు ప్రయాణాలకు తప్ప అంతా మంగళకరంగానే ఉంటుందంటున్నారు... మరి ఎనిమిదేళ్ళ క్రితం వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దారుణంగా దాడి జరిగింది. మంగళవారమేనయ్యా మహానుభావా!'


'మరీ అలా కొట్టిపారేయ్యాకన్నా! బుధవారం పరమ చెత్తరోజన్నారు. ' 


'మన ముంబయి మీద దాడులు జరిగింది బుధవారంనాడే! ఇందిరమ్మ యమర్జన్సీ కూడా బుధవారంనాడే మొదలయింది. ఇంకో మూడేళ్ళకు ఒక మహాప్రళయమొచ్చి మనందరికీ మూడుతుందంటున్నారు. బాగా చూసుకో, ఆ రోజుకూడా బుధవారమే అవబోతుంది!' 


'అబ్బో.. బహుదొడ్డ థియరీ! గురువారం పొగతాగేవాళ్ళు మానేయటానికి మంచిరోజు.. మరి ఒప్పకుంటావా ఇదన్నా ? ' 


' అండే.. శుక్రవారంనాడు స్మోకింగు ఆపేయాలనుకునేవాడు గురువారం దాకా ఎదురుచూస్తూ కూర్చోవాలా?'


'మరీ అంత రెట్టమతంగా  మాట్లాడబాకన్నా! మనకు మాత్రం అట్లాంటి  నమ్మకాలు లేవా ఏంటీ ? శుక్రవారంనాడు డబ్బులు బైటికి తీస్తామా? ఆ రోజు క్షవరం చేయించుకుంటే వారమంతా తలనొప్పి తప్పదని నమ్మేవాళ్ళు లెక్కలేనంతమం ది ఉన్నారు బాబూ! ' 


' అమెరికాలాంటి దేశమే శుక్రవారమంటే ఉలిక్కిపడుతుంది. అదేరోజు పదమూడో తారీఖైతే ఇంక చెప్పే పనేలేదు . ఏసుని శిలువ వేసింది. శుక్రవారం...'


మరి ఏసు తిరిగొచ్చింది కూడా శుక్రవారమేగదా!' 


' నువ్వు ప్రతిదీ ఇలాగే బుకాయిస్తావుగానీ, ఆఖరికి మన దేవుళ్ళకి కూడా ఒక్కోరోజు ప్రత్యేకంగా ఇష్టముంటుంది. తెలుసా! శివుడికి సోమ బుధవారాలు, ఆంజనేయుడికి మంగళవారం, లక్ష్మీదేవికి గురు శుక్రవారాలు, శనివారం వేంక టేశ్వరస్వామివారికి....' 


' ఇంకా ఆగితే ఆదివారం సూర్యుడికి, సోమవారం చంద్రుడికి బుధవారం బృహస్పతికి; గురు, శుక్రవారాలు ఆ పేరుతోనే ఉన్న గ్రహాలకు ఇష్టం, పూజలు చేయకపోతే వాళ్ళకు ఆగ్రహం అంటావు. పాయింటది కాదు మిత్రమా! శని వారం పిల్లలు పుట్టటానికి మంచిరోజని, ఆ రోజు పుట్టినవాళ్ళలో చాలామంది ప్రధానమంత్రులు కూడా అయ్యారని చెబుతాయే, అలాంటి సర్వేలను  గురించే నేను మొత్తుకునేది. చాదస్తం ఎక్కువైతే గంటల పంచాంగం కూడా నిమిషాని కోసారి చూసుకోందే కాలు బయటకు పెట్టాలనిపించదు. నమ్మకాలు ఎక్కువైతే

మూఢనమ్మకాలుగా మనకు తెలీకుండానే మారిపోతాయి.. తాగుబోతుకి దీపస్తంభంలాగా. లైటుస్తంభం వెలుతురు కోసం కాదు, తూలిపడిపోకుండా పట్టుకోటానికని గట్టిగా నమ్మినట్లుంటుంది వ్యవహారం'


' ఇంతకీ నువ్వేమంటావో సూటిగా చెప్పరాదా సోదరా! '


' మంచిరోజు చూడకుండా చెడ్డపని కూడా చేయలేని ఆ బల 

హీనతను వదులుకోమంటా! మనకు పనికిరాని అమావాస్య పక్కనున్న తమిళనాడులో గొప్ప రోజనుకుంటారు. గ్లోబుమీది అన్ని దేశాల్లో ఆదివారాల్లాంటివన్నీ ఒకేసారి రావు. రోజు అనేది దేవుడు మనకి ఉదయాన్నే ఇచ్చే బ్లాంక్ చెక్కులాంటిది. వాడుకునే దాన్నిబట్టి దాని విలువ మారుతుంది. ప్రతివాడికి తొమ్మిది దినాల్లో ఒకటి అనుకూలంగానే ఉంటుందని 'లస్టర్ ఆఫ్ వెటర్నటీ' ఆరో ఛాప్టర్ లో ఉంది. ఘనా దేశస్తులు బిడ్డకు పుట్టిన రోజు పేరుగా పెట్టుకుంటారు. అంటార్కిటికాలో ఏడాదిలో సెప్టెంబరు 21వ తేదీనే సూర్యుడు ఉదయిస్తాడు. అది ఆదివారమైనా, శనివారమైనా వాళ్ళకి ఆనందమే కలిగిస్తుంది కదా! 'భగవన్నిమిత్తమైన అన్ని దినాలు సుదినాలే ' అంటారు చిలకమర్తివారు . పనిచేసేవాడికి ఏ రోజూ పనికిరానిదికాదు. వారంలోని ఏడు రోజులు సృష్టి మనకిచ్చిన ఏడువారాల ఆభరణాలు.


' అవునన్నా! ఇప్పుడు మనం మర్చిపోయాంగానీ, మన చిన్నప్పుడు తెలుగువాచకంలో ఒక చక్కని పాట ఉండేది. ఆదివారంనాడు అరటి మొలి చింది. సోమవారం నాడు సుడివేసి పెరిగింది. మంగళవారం నాడు మారాకు తొడిగింది. బుధవారం నాడు పొట్టిగెల వేసింది. గురువారంనాడు గుబురులో దాగింది. శుక్రవారంనాడు చూడిగా పండింది. శనివారం నాడు చకచకా కోసి, అందరికీ పంచితిమి అరటి పొత్తములు... అన్న పాట అర్ధమైందన్నా! అందరికీ పంచే అన్ని అరటి పొత్తాలు కావాలంటే వారంలోని ఆ అన్ని  రోజులూ ఆ అరటిచెట్టులాగా ఒకేలా పెరిగాలనేగా నువ్వనేది:  సరే నేను వస్తా.. ' 


' ఎక్కడికి? ' 


' శనివారం కదా అని పనికి బద్ధకించా! అత్యవసరంగా  ఫైలు ఒకటి పరిష్కరించాల్సి ఉంది.  పాపం, ఒక ముసలాయన పింఛను కోసం వారం, వర్జ్యం  కూడా చూసుకోకుండా ప్రతి రోజూ ఆఫీసు గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నాడు.' 


' అదీ, ఇప్పుడు నాకు నచ్చావ్ సోదరా, పోయిరా!'



రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- 06 - 09- 2009 న ప్రచురితం ) 

అనగనగా ఒక ఊరు .. - కర్లపాలెం హనుమంతరావు

 అనగనగా ఒక ఊరు .. 

- కర్లపాలెం హనుమంతరావు 


మనిషికి మల్లేనే ప్రతి ఊరుకూ ఒక పేరు ఉంటుంది. ఊరూ పేరూ వ్యక్తికి తప్పనిసరి. ఎందుకూ కొరగాని  వ్యక్తిని ఊరూ పేరూ లేనివాడని సంబోధించడం మనం చూస్తుంటాం. మనిషి పేరు కన్నా ముందు ఊరు పేరు ఉండటం విశేషం. 


మనిషికి పేరు కన్నవారు పెడితేనో, ఉన్నఊరు పెడితేనో, చేసిన ఘనకార్యానికి గుర్తింపు కిందనో.. లభించేది. కాని మనుషులు నివాసముండే ఊరుకు ఆ పేరు ఊరికే రాదు. చారిత్రక నేపథ్యమో  , అపభ్రంశమయిన పూర్వనామమో, విశిష్ట వ్యక్తుల   పేరున గుర్తింపు పొందిన ప్రాంతమో .. కారణాలుగా ఉంటాయి. 


కొత్తమనిషి పరిచయంలో ఉళ్ల పేర్ల ప్రస్తావన రాకుండా ఉండదు  . మీ పేరేమిటి? అని అడగక పోయినా ఆ  అపరిచితుడు ' మీ దే ఊరు? ' అని విచారించక మానడు. ఉద్యోగానికో, గుర్తింపు పత్రానికో ..రాతపూర్వక పత్రం దేనికైనా సరే ఊరు పేరనేది  లేకుండా అసంపూర్ణం కింది లెక్క  . 


రుణ అభ్యర్థన  మొదలు చావుపుట్టుకల ధ్రువీకరణ వరకు  ఊరు పేరు వినా  ఏ పత్రము చిల్లు కాణీ విలువ చెయ్యదు  . ఎన్నికలలో నిలబడే అభ్యర్థి అర్హత ఉన్న  ఊరు ప్రాంతం బట్టే. జీవితంలో అన్నింటా అవసరమయే 'స్థానికత' ఊరు పేరును అసరించే నిర్ధారింపబడేది. 

ఊర్ల  కోసమే కాకుండా, ఊళ్ల పేర్ల కోసం కూడా యుద్ధాలు జరిగిన సందర్భాలు  చరిత్రలో కోకొల్లలు. కానీ, ఈ ఊళ్ల పేర్లు నిర్ధారణ కోసం పరిశోధకులు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. దీని కోసం ప్రత్యేకంగా ఒక శాస్త్రమే కద్దు . 


అంతర్జాతీయ స్థాయిలో ఊళ్ల పేర్లకు సంబంధించిన శాస్త్రం పేరు ' International Committee for Onomastic Sciences) . బెల్జియం కేంద్రస్థానం.  మూడేళ్లకోసారి సమావేశాలు, ఓనామ పేరుతో  ఓ ప్రతిక కూడాను. 


Onama ( ఓనామ ) అంటే లాటిన్ భాషలో ' నామము '  అని అర్థం.  ఈ ఓనామస్టిక్స్ కమిటీకి  దేశదేశాలలో   శాఖలు ఉన్నాయి. జనావాలను గురించి విషయ సేకరణ వీటి ముఖ్య విధులలో ఒకటి. అమెరికాలో  ' నేమ్స్ సొసైటీ ' పేరుతో నడిచేది  ఈ తరహా సంస్థే . ఇది   త్రైమాసిక పత్రిక నొకదానిని నడుపుతోంది కూడా . 


ఇక భారతదేశానికి వస్తే ' భారతీయ స్థలనామ సంస్థ' ఒకటి మైసూరు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తోంది.  మన నాగార్జున విన్యవిద్యాలయంలోనూ నామ  విజ్ఞాన శాస్త్రాథ్యయనం నిమిత్తం  ఒక ఐచ్ఛిక పాఠ్యాంశం తెలుగు ఎమ్.  ఎ . కోర్సులో నడుస్తున్నది. 


సాధారణ అర్థంలో నామము  అంటే పేరు. గ్రామ నామము అంటే ఊరు పేరు. నామ శాస్త్రపరిశోధకులకు మాత్రం ( నామవాచకమా, సర్వనామమా, విశేషణమా ,  క్రియా అనే విచక్షణ ఏమీ  లేకుండా ) భాషలోని ప్రతి పదమూ ఒక ' పేరు ' కిందే లెక్క . ఈ సూతం ఆధారంగానే గ్రామ నామాల స్థిరీకరణపై అధ్యయనం సాగుతున్నది. 


ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ నామవిజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా గ్రామ నామాల మీదనే ప్రధాన దృష్టి . మామూలుగా ఊళ్ల పేర్లలో  కొన్నిటికి  ఒక పదం మాత్రమే ఉంటుంది. దర్శి, కంభం, చీరాల, పామర్రు, బొల్లారం.. వగైరా వగైరా ఉదాహరణలు. 


ఊరి పేరులో రెండు పదాలుంటే మాత్రం  రెండో పదం జానావాసానికి  (Generics) సంబంధించి ఉంటుంది. కొండపల్లి లోని పల్లి, మొగల్తూరు లోని ఊరు, వేటపాలెం లోని పాలెం, పమిడిపాడు లోని పాడు .. ఇట్లా .  కొత్తగా లేచిన ఊళ్లయితే ' నగర్ ' ( గాంధీనగర్, భావనగర్) ఉండటం చూస్తుంటాం. 


అయితే పాత ఊర్ల పేర్లలో చివర కనిపించే పదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. తుర్రు అంటే .. నైసర్గిక లక్షణాలకు ప్రాధాన్యత ఇచ్చే పదం. పేట అంటే అది తప్పకుండా  ప్రధానంగా వ్యాపారస్థలమై ఉంటుంది. పూడి అంటే దాని పక్కన కచ్చితంగా నీటి ప్రవాహం ఉంటుంది. మిర్రు అంటే మెరక మీద ఉండే స్థలం. ఊర్ల  పేర్లు ఊరికే అట్లా వచ్చేసినవి  కాదు. పెద్దల అవగాహన వల్ల స్థిరపడ్డ పేర్లవి . అథ్యయనం చేసే కొద్దీ చిత్రమైన చరిత్ర బయటపడే అంశం గ్రామనామ విజ్ఞాన శాస్త్రం.  


ఇంగ్లీషులో ఈ నామ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి స్పెసిఫిక్స్ (Specifics)' అనే ఒక సాంకేతిక పదం ఉంది. కొండపల్లినే ఉదాహరణగా తీసుకుందాం. పల్లి అనేది నైసర్గిక  ప్రాథాన్యతను సూచించే పదం  అనుకున్నాం కదా! చివరన  పల్లి అనే పదం పేరుతో ఒకే ఊరు ఉండక పోవచ్చు. ఎవరైనా ఫలానా  పల్లి  కి ఎట్లా పోవాలి అని అడిగితే .. ఆ ఫలానా ఏదో   సమాధానం చెప్పేమనిషికి  ఏదో ఒక కొండగుర్తు అవసరం. దాని కోసం ఆ పల్లికి సంబంధించి, నలుగురూ ఠక్కున గుర్తుపట్టే  పేరు ఉండటం తాప్పనిసరి . కొండపల్లి అంటే కొండకు దగ్గరగానో, కొండ మీదనో ఉన్న పల్లి అన్నమాట. అట్లాగే బ్రాహ్మణపల్లి . ఆ ఊళ్లో బ్రాహ్మణకులస్తులు  ఎక్కువగా ఉండటం వల్ల బ్రాహ్మణపల్లి అయింది. ప్రత్యేకంగా ( స్పెసిఫిక్ ) గా ఒక పేరును బట్టి జనావాసాన్ని గుర్తించే ఈ పద్ధతి స్పెసిఫిక్ పద్ధతి గా ప్రసిద్ధం అయింది. మనమేమో ప్రాచీనుల తెలివిని అతితెలివితో మహా చులకన చేస్తుంటాం. అదీ చిత్రం. 


 విడివిడిగా వివరించుకు పోతే విస్తరణ భీతి తప్పని అంశం ఇది . అవగాహన కోసం కొన్ని ఊళ్ల పేర్లు మాత్రం  ఉదాహరణలుగా చూపించి వ్యాసానికి స్వస్తి పలికేద్దాం . 


సంఘసంస్కృతిని తెలిపే ఉళ్ల పేర్లు కొన్ని ( జనావాసాలు, మొక్కలు వంటివి  నైసర్గిక ప్రాధాన్యత కలవి )  .... పూడి ( తుమ్మపూడి )  , బండమీదిపల్లె.. 


 కులాలు గట్రా  సూచించేవి .... బ్రాహ్మణపల్లి , గొల్లపాలెం, తురకపేట వగైరాలు  ... 


స్థలం ఉన్న స్థితిని బట్టి ఎత్తుపల్లాలను , దిశలను.. సూచించేవి .... దిగువ తడకర, తూర్పు పల్లి, ఏటికవతల తాండ్రపాడు.. 


తమాషా ఏంటంటే, కొన్ని ఊళ్ల పేర్లు మనల్ని కంగారు పెట్టేస్తాయి. ఉదాహరణకు : గొడుగుచింత .  ఇక్కడ గొడుగును చింత పదం  నుంచి విడగొట్టడం  వల్లనే ఇంత గొడవ.  గొడుగుచింత అనేది  ఒక మొక్క పేరు. ఆ విషయం తెలిస్తే మరి అయోమయానికి ఆస్కారం ఉండదు. 

అట్లాగే దీపాల పిచ్చయ్యశాస్త్రి లోని ఇంటిపేరు.. దీపాల మనం అనుకుంటున్నట్లు వెలుగు నిచ్చే దీపానికి సంబంధించింది కాదు.  ఒక గడ్డి మొక్క పేరు. 

అట్లాగే కోమలి దీపావళి అనే ఊరు పేరు మనం సాధారణ అర్థంలో తీసుకుంటాం, కాబట్టే తికమక . 


చివరగా: లంజ అన్న పేరున్న ఊరు ఒకటి కద్దు . ఒక బూతు పదం  మీదుగా ఊరికి పేరు పెట్టడం ఆశ్చర్యమే కాదు  . . వినడానికి  .. ఆ ఊళ్లో ఉండేవాళ్లకూ  ఇబ్బంది కలిగించే  పరిస్థితి. ఈ అపార్థానికి  కారణం లంజ అనే పదం మనం కేవలం నీతి తప్పి .. వంకర మార్గంలో నడిచే  స్త్రీకి మాత్రమే వర్తించుకుంటున్నందు వల్ల . ఆ వంకర దారి ( వక్రమార్గం) లో నడిచేది ఒక్క మనిషే కావాలని  రూలేముంది? నీటి ప్రవాహం కూడా కావచ్చు కదా! తిన్నగా పారక వంకరటింకరగా పారే నీటి ప్రవాహం దగ్గర ఉండే జనావాసం కాబట్టి  అందరం చెడుగా భావించే ఆ ఊరు పేరు ఆ పదంతో ప్రసిద్ధమయింది. 


తరాలబట్టి జనం నోళ్లలో నానే పదాలను ఏ మనిషికీ  , ప్రభుత్వానికైనా  బలవంతంగా   మార్చే  శక్తి సున్నా . 


ఊళ్ల పేర్లంటే కదలి వెళ్లి పోయినా కాలపు కాలి ముద్రలు. వాటిని చెరిపివేసే శక్తి ఎంత లావు బాహుబలికైనా నాస్తి !


- కర్లపాలెం హనుమంతరావు 

28 -10-2021 

బోధెల్ ; యూ. ఎస్.ఎ


( ఒక ఊరి కథ - యార్లగడ్డ బాలగంగాధరరావుగారి  గ్రంథం ఆధారంగా ) 

ఆతిథ్యం - కథానిక- కర్లపాలెం హమమంతరావు - అచ్చంగా తెలుగు - ప్రచురితం

ఆతిథ్యం - కథానిక- కర్లపాలెం హమమంతరావు - అచ్చంగా తెలుగు - ప్రచురితం 




నాగపూర్ స్టేషన్లో రైలు దిగేసరికి సాయంత్రం నాలుగయింది. చలికాలం కావడంవల్ల అప్పుడే నీడలు పొడుగ్గా సాగుతున్నాయి.
రాష్ట్రం సరిహద్దులు దాటడం నాకిదే మొదటిసారి. 'బొడ్డూడని పిల్లలు కూడా పొలోమని ఉద్యోగాల కోసంచదువుల కోసం విమానాలెక్కి దేశాలుపట్టి పోతుంటే పక్కనున్న రాష్ట్రం పోవడానికి పస్తాయిస్తావా?' అని మామయ్య ఎద్దేవా చేస్తుంటే పౌరుషం ముంచుకొచ్చి ఈ సాహస యాత్రకు సిద్ధపడ్డా.
నిజానికి మా ఊళ్ళో నాకు ఇల్లూఆఫీసూ .. దారిలో నా అవసరాలకు సంబంధించిన షాపులతో తప్ప వేరే  పరిచయాలే లేవు. 'మీ అమ్మ బిడియం నీకు వచ్చి పడిందే! ఆ కాలం కాబట్టి ఆడవాళ్లకి సరిపోయింది.. 'ఉద్యోగాలు చేస్తాం.. ఊళ్లేలుతాం.. మగాళ్ళకన్నా మేం మాత్రం ఎందులో తక్కువ?' అని మహా గొప్పలు పోతున్నారుగా ఈ మధ్య మీ ఆడంగులు! ఏదీ మరి చూపించు నీ తెగువ.. భారతనారీ!అని మా మామయ్యే..  నేనెక్కడ భయంకొద్దీ వచ్చిన ప్రొమోషన్ని వదులుకుంటానోనని మరీ మరీ రెచ్చగొట్టి పంపించాడీ నాగపూరుకి.
సిండికేట్ బ్యాంకులో క్లర్కుద్యోగం ఇప్పటిదాకా. ఆడపిల్లననిఇంకా పెళ్లి కాలేదన్న మిషతో  ఎట్లాగో మా బెజవాడలోనే బండిని నెట్టుకొచ్చానిన్నాళ్ళూ. ఇప్పుడొచ్చిన ఆఫీసరు పోస్టును ఏక్సెప్ట్ చేయాలంటే ఔటాఫ్ స్టేట్ పోస్టింగునీ రూలు ప్రకారం ఒప్పుకు తీరాల్సిందే.
'ఫస్టు పోస్టింగే పక్క రాష్ట్రంలో రావడం.. మీరు చాలా లక్కీ! వదులుకోవద్దు!అని ఎక్కబెట్టారంతా ఆఫీసులో కొలీగ్సు. పక్క సీటు ప్రసాదుగారైతే నా అవస్థ చూసి 'నాగపూరులో మా అక్కా వాళ్ళుంటారు. మా బావగారు అక్కడ డిఫెన్సులో సీనియర్ ఎక్కౌంటెంటు. ఎకామిడేషన్ ప్రాబ్లం వాళ్ళు సాల్వు చేస్తార్లేండి! మనం మాట్లాడదాం' అంటూ నా ముందే అన్ని వివరాలూ చెప్పి ఫలానా తారీఖున ఫలానా బండికి వస్తున్నది.  స్టేషనుకొచ్చి రిసీవ్ చేసుకోవడం మర్చి పోవద్దు' అని ఒకటికి రెండు సార్లు గట్టిగా చెప్పాడు కూడా. అన్నింటికి 'ఓకే.. ఓకేఅంటూ భరోసా ఇచ్చిన పెద్దమనిషి.. ఇప్పుడు అయిపూ ఆజా లేకుండా పోయాడు!
బండి దిగి అరగంటయింది. ముందుగా అనుకున్న ప్రకారం నా ఫోటో కూడా మెసేజికి ఎటాచ్ చేసి పంపించాడు ప్రసాదుగారు. గుర్తుపట్టలేక తిరిగి పోవడానికి ఆస్కారమే లేదు.
అక్కడికీ ప్రసాదుగారు ఇచ్చిన ఆ బావగారి సెల్ నెంబరుకి అరడజను సార్లు కాల్ చేసాను.  ఒక్క సారీ లిఫ్టు చేయలేదు.. వూరికే రింగవడం తప్ప.
ఇహ తప్పక చివరికి ప్రసాదుగారికే ఫోను చేయాల్సి వచ్చింది. మూడో పిలుపుకి గానీ లైన్లోకి రాలేదా మహానుభావుడూనూ. 'సారీ! శ్యామల గారూ! మా బ్రదరిన్లాగారి మదర్ అనుకోకుండా పోయారుట రాత్రి. ఉన్నఫళంగా ఫ్యామిలీ అంతా తెనాలి వెళ్ళిపోయారు. జర్నీలో ఉండటం వల్లనుకుంటా సిగ్నల్స్ సరిగ్గా అందక మీకు రెస్పాండవక పోవడం. ఐ యామ్ ఎక్స్ ట్రీమ్లీ సారీ!' అనేసాడు.
'సారీ' సంగతి ఆనక. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిఈ బ్రదరిన్లాగారి భరోసామీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేసుకోకుండా బైలుదేరాను. సరే! ఇహ తప్పేదేముందిదగ్గర్లో ఉన్న ఏదైనా ఓ హోటల్లో దిగి రేపు భ్యాంకులో జాయినయినాక అప్పటి పరిస్థితుల్నిబట్టి షిఫ్టింగు సంగతి అలోచించుకోవచ్చు.
చలిగాలికి తోడు బైట వర్షమూ మొదలయింది. రెండు సూటుకేసులు.. ఒక షోల్డరు బ్యాగు. ఒక్కత్తినే ఎలాగో తంటాలు పడుతూ స్టేషను బైటికి రాగానే ఆటోవాళ్ళు గండుఈగల్లా మూగి రొద చేయడం మొదలు పెట్టారు. మరాఠీలో కొందరైతే.. హిందీ.. ఇంగ్లీషు తుంపుడు ముక్కల్తో కొందరు. 'ముందు వీళ్ళ వేధింపుల్నుంచి తప్పించుకుని  బైటపడటమెలాగురా భగవంతుడా!అనేటట్లుంది అక్కడి వాతావరణం.
అప్పుడు వచ్చాడు దేవుడిలాగా ఆ పెద్దమనిషి. మూడొంతుల బట్టతలనల్లగా నిగనిగలాడే నుదురు. కొబ్బరి చవురు రాసుకున్నట్లుంది మొహమంతా! తెల్లటి దుస్తుల్లో ఉన్నాడు. నడికారు వయసు దాటుతుందేమో! పిలవకుండానే దగ్గరికొచ్చాడు. 'తెలుంగువాళ్ళేనాఫ్రమ్ విజయవాడా?' అని పలకరించాడు. నా జవాబుకోసం ఎదురుచూడకుండానే ముందు ఆ ఆటో గండుఈగల్ని తరిమేశాడు.
క్వశ్చన్ మార్కు మొహంతో నిలబడ్డ నన్ను చూసి 'అట్లా ఆశ్చర్యపోకండి మ్యాడమ్ గారూ! మీ యాసనుబట్టి కనిపెట్టేసా.ఇందాకట్నుంచీ మీరదేపనిగా ఫోన్లో మాట్లాడుతున్నారు కదా! గుర్తు పట్టేసా. ఇదేమంత గొప్ప విషయం?చిత్తూరు సైడు 'తట్ట' అంటే ఒంగోలు సైడు 'కంచం' అంటారుగదా తినే పళ్లేన్ని. అట్లాంటి విద్యే అనుకోండి నాదీనూ. దేశం నాలుగు చెరగులా నాలుగు రోజులు చెడతిరిగొస్తే సరి 'రాం.. రాం'కీ 'వణక్కా'నికీ ఒకే అర్థం అని తెలిసొస్తుంది.  బై ది బై.. మై నేమీజ్ రామసుబ్బు. ఆరిజన్ కేరళ. ఖైతాన్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా దేశం మొత్తం ఒక సారి కాదు.. ఏడాదికొకసారి చెడతిరిగాను. తిరిగి చెడ్డానేమో కూడా! మీ బెజవాడలో బస్టాండు దగ్గరున్న మమత హోటల్నుంచి..  గాంధీనగర్ సందులో ఉండే మడత మంచాలు అద్దెకిచ్చే ప్రశాంత్ లాడ్జింగుదాకా అన్నీ నాకు కొట్టిన పిండే!అంటూ తనమానాన తాను టివీ యాంకర్లను మించిన జోరుతో చెప్పుకుపోతున్నాడు. 'స్మాల్ కమర్షియల్ బ్రేక్కోసం ఎదురుచూస్తూ నిలబడ్డమే నా వంతయింది.
నా అవస్థ గమనించినట్లున్నాడు. 'సారీ! కాస్త ఓవరయిందనిపిస్తుందనుకుంటా మీకు.కానీ అవసరమే మ్యాడమ్ జీ ఒక్కోసారి. మీ తీరు ఎప్పట్నుంచో గమనిస్తున్నా. ఫ్లాట్ ఫామ్మీద ఈ బరువులు మోసుకుంటూ ఎవరికోసమో గంటల తరబడి విఫల వైయిటింగు చేస్తున్నారే గానీ.. అప్పాయింటుమెంటిచ్చిన ఆ హోస్టుగారెవరో హ్యాండిచ్చాడని నిర్థారణకు రాలేకపోయారు. చొరవ లేకపోవడమంటే ఇదే మరి! సారీ! ఫర్ ది కామెంట్! మా అమ్మాయిదీ డిటో క్యారెక్టరే! అందుకనే మిమ్మల్నీ తేలిగ్గా గుర్తు పట్టగలిగా! పదిమాటలకొక మాటైనా జవాబు రాని మీలాంటి వారినుంచి మినిమమ్ నాలుగు మాటలు రాబట్టాలంటే ఎన్నొందల రకాలుగా మాట్లాడాలి!చురుక్కుమని కాలింది నాకు. ముక్కూ మొగం తెలీని మనిషితో మాట్లాడే తీరిదేనా! నేనేంటో నాకే సరిగ్గా తెలీదు. చూసి అరగంటైనా కాలేదు. అప్పుడే నా మెంటాలిటీని గురించి లెక్చర్లిస్తున్నాడు మహా! ఎవరిచ్చారీ పెద్దమనిషికీ అధికారం?
నా ఆలోచనల్నప్పుడే చదివేసినట్లు న్నాడు. 'సారీ!ఐ డోంట్ మీనిట్! మీరేదో ఇబ్బందుల్లో ఉన్నట్లున్నారు.  హెల్ప్ చెయ్యాలన్నదే నా ఉద్దేశం. మే ఐ హెల్ప్ యూ!'
ఎంత విచిత్రమైన మనిషి! హెల్ప్ చేస్తానన్న మనిషి మాటమాత్రమైనా చెప్పకుండా చెయ్యిచ్చి పోయాడు ఒక వైపు! ముక్కూ మొగం కూడా ఎరగని వాళ్ళని పట్టుకుని హెల్ప్  చేస్తానని వెంటబడుతునాడింకో మనిషి మరో వైపు!  ఏమై ఉంటుంది ఇందులో ఇతగాడి వ్యూహం?  ఏ లాభం లేకుండా ఎవరైనా సాయం చేయడానికి ముందుకొస్తారా ఈ రోజుల్లో?  ఒంటరి ఆడపిల్లనని పసిగట్టేసాడా?
ఊళ్ళు చెడతిరిగానంటున్నాడుగా! సొంత ఊళ్ళో మంచి లాడ్జింగేదో తెలిసే ఉండాలి. ఆ వివరాలు చెప్పించుకుని వదిలించుకోవడం మంచి దనపించింది. అదే అడిగాను. 'లాడ్జింగులకేం మ్యాడమ్! నన్ను కట్టుకుని పోయేటన్ని! సెంట్రల్ ఇండియా కదా! టూరిస్టుల తాకిడి జాస్తీనే! రిజర్వేషను లేకుండా మంచి హోటల్సు దొరకడం కష్టం. ఓవర్ బ్రిడ్జి దాటి గాంధీబాగ్ లోకి వెళితే కాస్ట్లీ హోటల్సున్నాయి. ఓ మాదిరివి కావాలంటే చుట్టూ తిరిగి మార్కెట్ ఏరియాలో వెదకాలి. మంచివే దొరుకుతాయని గ్యారంటీ లేదు. మీ వాలకం చూస్తుంటే సత్యహరిశ్చంద్రుడిక్కూడా దుర్భుద్ధి పుట్టేటట్లుంది. సారీ! మీరేమనుకోక పోతే నాదో ఆఫర్! ఇక్కడికి దగ్గర్లోనే మా ఇల్లుంది. హోటలంత సౌకర్యాలుండక పోవచ్చుగానీ.. ఒకటి రెండు పూటల వరకు ఓకే! వచ్చేయండి మ్యాడమ్! వానలో.. కొత్త చోట్లో.. చీకట్లో.. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇట్లా అసహాయంగా ఆట్టేసేపు నిలబడటం .. జనాల కంటబడ్డం .. మంచిది కాదు. మా ఊరి సంగతి తెలిసి చెబుతున్నా. మా అమ్మాయి   మరేదన్నా ఊళ్లో ఇట్లాంటి పొజిషన్లో చిక్కుకున్నప్పుడు ఏం సహాయం కావాలని కోరుకుంటానో.. అదే నేనూ మీకు ఆఫర్ చేస్తున్నది! వచ్చీ రాని భాషతో కంతిరి ఆటోవాళ్ళను నమ్ముకుని ఎక్కడ బడితే అక్కడ దిగేకన్నా.. ఇదే మంచిది! కాస్త రిలాక్సయిన తరువాత ఏం చేయాలో రేప్పొద్దున తీరిగ్గా ఆలోచించుకుందురుగానీ! ముందు పదండి!'అనేసాడు.
ఆశ్చర్యం! నిజంగా అత్యాశ్చర్యమే! మధ్యలో వాళ్లమ్మాయిని గూర్చి  ఆ రెండు ముక్కలుగాని అనక పోయుంటే ఈ పెద్దమనిషితో ఈ రోజు నిజంగానే నాకు పెద్ద దెబ్బలాటయి ఉండేదే! ఓ వంక కామెంట్ సు  చేస్తున్నాడు. మరో వంకనుంచి హెల్ప్ ఆఫర్ చేస్తున్నాడు! ఎట్లా అర్థం చేసుకోవాలీ సిట్యుయేషన్నిఈ మనిషి మంచి స్థితిలో ఉన్నట్లేనా?
నా అనుమానాలు నన్ను పీకుతూనే ఉన్నాయి. నా అనుమతి లేకుండా ఎప్పుడు పెట్టించాడో.. సగం లగేజి అప్పుడే అక్కడే ఉన్న ట్యాక్సీలో సర్దించేసాడు! ఆలస్యం చేస్తే నా సామానుతో సహా ఉడాయించినా ఉడాయించేయచ్చు.
ఎటూ పాలుపోక మిగతా సామానుతో సహా ట్యాక్సీలో ఎక్కి కూర్చున్నాను.'చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం!అన్న తెగింపూ వచ్చేసింది విచిత్రంగా!
'మీ డౌటూ అర్థం చేసుకోదగ్గదే! ఇవిగోండి నా వివరాలు. సెల్ ఫోన్ నెంబరుతో సహా అన్నీ ఉన్నాయి. ఈ విజిటింగు కార్డు దగ్గరుంచుకోండి! అంతగా అవసరమనిపిస్తే పోలీసు కంప్లెయింటుకి పనిక్ వస్తుంది.. ట్యాక్సీ నెంబరు కూడా నోట్ చేసానందులో! ఉంచుకోండిఅంటూ బలవంతంగా ఓ విజిటింగు కార్డు నా చేతిలో ఉంచాడు. ఇంకేమాలోచించగలం ఇంత నిజాయితీ ప్రదర్శిస్తుంటే!
ట్యాక్సీలో మాటల మధ్యలో నేనిట్లా బ్యాంకులో ఆఫీసరుగా జాయినవడానికని వచ్చినట్లు పసిగట్టాడు. 'ఈ కాలంలో అందరూ ఇంజనీర్లూ.. సాఫ్టువేర్లూ అంటూ కలవరిస్తున్నారు.సొంతగడ్డను వదులుకొని పరాయి పంచన చేరైనా సరే నాలుగు రాళ్ళు ఎక్కువ గడించడానికే పేరెంట్ సూ ప్రోత్సహిస్తున్నారు.అనింటికీ భిన్నంగా మీరిట్లా మతృదేశాన్నీ,మాతృభాషని నమ్ముకుని ఉండటం చాలా ముచ్చటేస్తోంది. మీ తల్లిదండ్రులకు నిండుమనస్సుతో నమస్కారం చేయాలనిపిస్తోందిఇట్లా సాగుతోంది ఆయన మాటల ధోరణి. ఇన్ని మంచి విషయాలు మాట్లాడే అతనిలో దురాలోచనలు ఉంటాయంటే నమ్మలేం!
'నాగపూర్ చాలా కామ్ సిటీ. ముంబై వెస్టుసైడులాగా కాదు. రేపు  బ్యాంకులో జాయినయి ఎకామిడేషన్ ఎరేంజయినదాకా ..మీరు మా ఇంట్లోనే ఉండవచ్చు. మా శ్రీమతి కూడా ఊళ్లో లేదు. వాళ్ల పిన్నిగారు పోయారని బెనారస్ వెళ్ళింది. పదిరోజులదాకా రాదు'
‘అంటే ఈయనగారు తీసుకెళ్లే ఆ ఇంట్లో ఆడవాళ్లెవరూ లేరనేగా అర్థం! ఎంత చల్లగా చెబుతున్నాడూ ఇప్పుడీ వార్త!
'మీ భయం అర్థమైందిలేండి మ్యాడమ్అని చిన్నగా నవ్వాడు రామసుబ్బు. మా శ్రీమతి లేదన్నానుగాని మా పనివాళ్ళు లేరన్నానా! ఇల్లు చూసుకునేందుకు రెడ్డివాడి పెళ్ళాం ఎప్పుడూ అక్కడే హాజరు. మనం వీధులు పట్టుకునిలా బలాదూర్లు తిరుగుతుంటామని మా ఆవిడగారు చేసిన ఏర్పాట్లు లేండవిఅన్నాడు. మనసు కుదుట బడింది. అనవసరమైన అనుమానమేగానీ రామసుబ్బుగారి ఆహ్వానంలో కల్మషమేమీ లేదు.
ట్యాక్సీ ఆగిన ఇల్లు మరీ చిన్నదేమీ కాదు.'ఈయన తన్నుగూర్చి తాను చెప్పుకున్నది చాలా తక్కువ.' అనిపించింది.. ఇంటిముందు లాన్.. కారు గ్యారేజ్.. వగైరా ఆర్భాటం చూసిన తరువాత.
ట్యాక్సీకి బాడుగ తనే ఇచ్చేసాడు నేను పర్శు తీసే లోపలే. ‘చివర్లో చూసుకుందాంలేండి ఆ లెక్కలన్నీ. కొత్త చోట్లో సరిపడ్డంత క్యాష్ దగ్గరుండటం అవసరం. అచ్చంగా ఈ ప్లాస్తిక్ కార్డుల్ని నమ్ముకుంటే ఒక్కోసారి ఇబ్బందెదురవచ్చుఅని సలహా. నా కన్నా ముందు నా లగేజీని లోపలకి చేరవేయడంలో ట్యాక్సీ మనిషికి సాయం చేసాడు.
జేబులోనుండి తాళం గుత్తి తీసి అలవాటుగా ఓ కీ తో డోర్ అన్ లాక్ చేసి.. ఆదరాబాదరాగా లోపలికి పరుగెత్తికెళ్ళి వచ్చాడు.'అలారం సిస్టం ఉంది. తాళం తీసిన రెండు నిమిషాల్లో దాన్ని డిజార్మ్ చేయకపోతే సైరన్ ఎలర్టు మొదలవుతుంది. ఏంటో అంతా చాదస్తం! ఇన్నేసి జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగే అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి’ అన్నాడు రామసుబ్బు నవ్వుతూ. నవ్వు ఆయన ట్రేడ్ మార్కనుకుంటా.
ఇంట్లో మనిషి అలికిడి లేకపోయినా ఇల్లు మాత్రం  చాలా పరిశుభ్రంగా ఉంది! 'రెడ్డీ!.. రెడ్డీ!'అంటూ రెండు మూడుసార్లు గావుకేకలేసాడు. సమాధానం లేదు.  సా'యమ్మా!.. సాయమ్మా!మళ్లీ కేకలు. నో రెస్పాన్సు. 'వాడెక్కడో తాగి తొంగునుంటాడు. అదను చూసుకుని ఇది ఏ సినిమాకో చెక్కేసి ఉంటుంది. వీళ్లమీద మా  ఆవిడగారికి మా చెడ్డ భరోసా!'అని ఎద్దేవా చేస్తూ 'మీ సామానంతా ఇక్కడే కింద గదిలో వేసుకుని లాక్ చేసుకోండి మ్యాడమ్ గారూ! కీ మీదగ్గరే ఉంచుకోండి!అంటూ తనే లగేజీని ఓ మూలగదిలో సర్దేసి తాళం వేసేసాడు. కీ నా చేతిలో పెట్టేసాడు.
స్నానాల గది పైన ఉంది. నా షోల్డరు బ్యాగు ఓపెన్ చేస్తుంటే 'అవన్నీ ఇప్పుడెందుకు బైటికి తీయడంఉండనీయండి.. ఒక పూటకే గదా!'అంటూ ఇస్త్రీ చేసిన పొడి టవల్సును అందించాడు.
'ఏ మాత్రం భేషజంలేని మనిషి. ఈ కాలంలోకూడా ఇలాంటి వాళ్ళుంటారా!అనిపించింది.
స్నానాలవీ ముగించుకుని వచ్చే లోగానే.. ఎప్పుడు ఆర్డరు చేసి తెప్పించాడో.. డైనింగు టేబుల్ మీద ఇద్దరికీ భోజనాలు రడీ. అనుపాకాలు హోటలువే ఐనా కూరలో కారం ఎక్కువైనందుకు, పప్పులో ఉప్పు లేనందుకు తను నొచ్చుకున్నాడు.'ఇంట్లో వాళ్ళుండు ఉంటే మీ కీ ఇబ్బంది ఉండేది కాదుఅని ఆయన బాధపడుతుంటే సముదాయించడం నా వంతయింది.
అప్పటికే రామసుబ్బును గురించి ఆశ్చర్యపోవడం మానేసాను. ఎన్నింటికని నోరు వెళ్లబెట్టను! జరిగేదంతా ఆస్వాదించడానికే ప్రిపేరయి ఉన్నాను.
ప్రసాదుగారి బావగారివల్ల ఏర్పడ్డ ఇబ్బంది ఇలా ఎక్కడినుంచో ఊడిపడ్డ రామసుబ్బుగారి అదరణతో పరిష్కారమవుతుండటం వింతల్లోకెల్లా వింత! 'వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్అన్న గురుజాడవారి పాట గుర్తుకొస్తున్నదెందుకో ఈయన్ని చూస్తుంటే!
మర్నాడు  ఉదయం తయారై.. బ్యాంకుకి పోయి జాయినింగు రిపోర్టు ఇచ్చిందాకా దగ్గరే ఉన్నాడు రామసుబ్బు.'సాయంకాలం మళ్లీ వస్తాను. మీ అకామిడేషన్ ఫిక్సయితే ఫోన్ చేసి చెప్పండి. లగేజీ డ్రాప్ చేస్తాను. కుదరకపోయినా ఇబ్బంది లేదు . మన ఇల్లు ఉండనే ఉందిగా.. పది రోజులదాకా నో ప్రాబ్లంఅని భరోసా ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు.
జరిగిందంతా విన్న మా మేనేజరుగారు చాలా నెగెటివ్ గా స్పందించారు. 'ఎలాంటి ఎలాంటి మనుషులున్నారో లోకంలో! తెలివిగలవాళ్ల మనుకంటున్నాంగానీ మన ఊహక్కూడా అందనంత విడ్డూరంగా జరుగుతున్నాయి నేరాలు. ఈ మధ్యిలాగే ఇక్కడ ఓ కొత్త చోట్లో కెమేరా కన్నుకి బేర్ గా దొరికిపోయి చాలా ఇబ్బందులు పడిందొక అమ్మాయి.చేతులు కాలింతరువాత ఆకులు పట్టుకునేం లాభం లేదు. ముందు మీ లగేజీ షిఫ్టు చేయించండి! ముక్కూ మొగం తెలీని మనిషి కష్టడీలో దాన్నలా వదిలేసి రావడమేంటిసాయంకాలంలోపు మన బ్యాంకు క్వార్టర్సులో ఎక్కడన్నా ఎకామిడేట్ చేస్తాను. మన స్టాఫు లొఖండేని వెంట తీసుకుపోండి! ఏదైనా ప్రాబ్లముంటే తను టేకిల్ చేస్తాడు. లోకల్ మనిషి. పొలిటికల్ ఇన్ ఫ్లుయన్సూ జాస్తి!అని ఆయన అన్ని రకాలుగా బెదరగొట్టిన తరువాత నా మనసూ తిరిగిపోయింది.
నిన్న స్టేషన్లో దిగినప్పటినుంచి జరుగుతున్నదంతా నాకే ఒక సినిమా కథలాగా ఉంది. మానేజరుగారనేముంది! రామసుబ్బు కథ చెబితే ఎవరికీ నమ్మబుద్ధి కాదు.
సాయంకాలం ఐదు కాకుండానే రామసుబ్బు నెంబరుకి కాల్ చేసాను. 'మేనేజరుగారరు ఏర్పాటు చేయించిన ఎకామిడేషన్లోకి నా లగేజి షిఫ్టు చేయించుకుంటాను. థేంక్స్ ఫర్ ది టైమ్లీ హెల్ప్!' అని ధన్యవాదాలు చెప్పే నెపంతో ఝంఝాటం వదిలించుకోవాలని నా ఆలోచన.
ఫోన్ రింగవుతుందికానీ మహానుభావుడు..ఎంత సేపటికీ ఎత్తడే! ఒకసారి కాదు పాతిక సార్లు ట్రై చేసాను. మొదట్లో వూరికే రింగయిన ఫోను తరువాత 'స్విచ్డాఫ్అని వస్తోంది! ఇంటికి పోయి చూడటం తప్ప మరో మార్గాంతరం లేదు. ఎందుకైనా మంచిదని మరో గంట ఆగి లొఖండేని వెంటబెటుకుని బైలుదేరాను.
ఆటో సగం దూరంలో ఉండగా రామసుబ్బే కాల్ చేసాడు. 'బ్యాంకుకి రావాలనే అనుకున్నాను మ్యాడమ్ గారూ! మథ్యాహ్నంనుంచి చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. రాంకోటి రోడ్డులో ఎవరో చిన్నపిల్లాడు బస్సు ముందుచక్రాల కిందపడి గందరగోళం చేసాడు. పెద్ద యాక్సిడెంటు! ఎవరూ పట్టించుకోరే! పోలీసులొచ్చిందాకా పసిప్రాణాలు నిలబడతాయాఅర కిలోమీటరు దూరంలో ఉంది గవర్నమెంటాసుపత్రి. ఐనా ఏ ఒక్క గాడిదకొడుకూ రానంటాడే! పోలీసులతో పెంటవుతుందని భయం పిరికి వెధవలకు! నేనే భుజంమీద వేసుకుని తీసుకు వెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాను. పిల్లాడి పేరెంట్ సు ఎవరో కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.  ఈ గొడవల్లో ఫోనెత్తలేక పోయాను. సారీ! మీ కొత్త అకామిడేషన్ అడ్రసు ఇవ్వండి! ఎంత రాత్రయినా లగేజీ చేర్చే పూచీ నాదీ!అని ఆగకుండా సంజాయిషీ ఇస్తుంటే ఇంకేమనాలో తోచకుండా ఉంది.  అదీగాక ఆయన ధోరణి నిన్నట్నుంచీ చూస్తుండీ అనుమానించడం మహా పాతకంఅనిపించింది. నా తటపటాయింపు చూసి లొఖండేనే కలగజేసుకున్నాడు తనే ఫోనులో 'మీకెందుకు శ్రమ? ఎవరిద్వారానైనా వెంటనే లగేజీ పంపించెయ్యండి సార్!అన్నాడు గడుసుగా.
'విలువైన సామాను. మ్యాడమ్ గారు నన్ను నమ్మి నా మీద భరోసాతో వదిలేసి పోయారు. మధ్యలో ఏదైనా ఐతే నా మాట పోదా!  మంచితనంమీద జనాలకున్న ఈ కాస్త నమ్మకం వట్టిపోదా! అదంతా నా వల్ల అయేది కాదుగానీ.. నా మీద నమ్మకముంచండి సార్! తెల్లారేలోగా మ్యాడంగారి లగేజీ మీ కొత్త అకామిడేషన్ గుమ్మం ముందుంటుంది. సరేనా!అంటూ నా కొత్త చిరునామా తీసుకున్నాడు. చేసేదేంలేక ఆటో వెనక్కి తిప్పుకుని వచ్చేసామిద్దరం.
పాతికమైళ్లన్నా దూరం ఉంటుందనుకుంటా  నా కొత్త అకామిడేషనుకి, రామసుబ్బు వాళ్ళింటికీ మధ్య దూరంరాత్రి ఏ ఝాములో వచ్చి దించిపోయాడో.. తెల్లారేసరికల్లా గుమ్మం ముందు నా లగేజీ మొత్తం ప్రత్యక్షం! చెక్ చేసుకుంటే.. నాలిక గీసుకునే బద్దతోసహా ఎక్కడి సామాను అక్కడే భద్రంగా ఉంది!
రామసుబ్బు నెంబరుకి కాల్ చేస్తె ఎంతసేపటికీ ఎత్తడమే లేదు. ఎక్కడ ప్రజాసేవలో తలమునకలై ఉన్నాడో! ఎప్పుడు కాల్ చేసినా నో రెస్పాన్స్. రామసుబ్బులాంటి మనిషి చిన్నపిల్లల నీతికథల్లో తప్ప ఎక్కడా కనిపించడేమో! విచిత్రం!
తరువాత ప్రసాదుగారి బావగారిని కలిసినప్పుడు అంతకన్నా విచిత్రమైన విషయం బైటపడింది. రామసుబ్బు కథవిని.. విజిటింగ్ కార్డు చూసిన ఆయన విస్తుపోయాడు. 'ఈయనా రామసుబ్బంటే!
కేరళానుంచొచ్చి టీ పౌడరు వ్యాపారం చేసే నాయరు కొనుక్కున్నాడే ఆ ఇంటిని ఈ మధ్య! మా డిఫెన్సు క్యాంటిన్సుకి లిప్టన్ పౌడరు సప్లై చేస్తుంటాడు. కూతురు పెళ్ళికని  ఓ నెల రోజులపాటు ఊరికెళ్ళాడా మధ్యలో! మా కందరికీ రిసెప్షన్  ఇచ్చింది మీరున్న ఆ ఇంట్లోనే! యస్! నాకు బాగా గుర్తుకొస్తుందిప్పుడు. మీరు బ్యాంకులో జాయినవడానికి వచ్చిన రోజుల్లోనే జరిగిందా పెళ్ళి. నా దగ్గర ఇంకా ఆ ఇన్విటేషను కూడా ఉందిఅని ఓ పెళ్ళి పత్రికను వెదికి మరీ తెచ్చి చూపించాడాయన. దానిమీద రిసెప్షనుకని అచ్చొత్తిన చిరునామాలోనే  నేనారోజు రాత్రంతా రామసుబ్బుగారి ఆతిథ్యాన్ని చవి చూసింది!
'నాయరు ఇంటితాళాలు మీ రామసుబ్బు ఎలా దొరకబుచ్చుకున్నాడో!అని ఆయన అంటుంటే నోరు వెళ్ళబెట్టడం నా వంతయింది.
లొఖండే విప్పాడా మిస్టరీ తన సోర్సులద్వారా సమాచారం రాబట్టి. ' మీ రామసుబ్బుగారికి మతి స్థిమితం తక్కువ. దయాగుణం ఎక్కువ. ఖైతాన్ కంపెనీ మనీ ఇలాగే దానధర్మాలు చేసి ఉద్యోగం పోగొట్టుకున్నప్పట్నుంచీ మొదలయిందట జబ్బు. మిమ్మల్ని ఎకామిడేట్ చేసిన భవంతి ఆయన ఫ్యామిలీ  ప్రాపర్టీనే. ఇల్లు గడవడంకోసం నాయరుకు అమ్మిన మాట నిజమే. ఆ నాయరు ఊళ్ళో నప్పుడు మీకక్కడ ఆతిథ్యం లభించిందన్న మాట. అమ్మకముందు అదాయన సొంత భవనమే కదా! పాత డూప్లికేట్ తాళాలతో పని నడిపించాడన్న మాట ప్రజా సేవకుడు!'
'పరాయి కొంపలో ముక్కూ మొగం తెలీని మనిషికి పడీ పడీ రాత్రిళ్ళు  సేవలు చేయడం ఏంటి?! ఇందులో ఆయనకొచ్చే లాభం ఏంటి?! ఒక్క క్షణంకూడా నాకు ట్రబులివ్వలేదా పెద్దాయన. పైపెచ్చు తన సొమ్మే బోలెడంత  ఖర్చు చేసాడు! ఎంత మతి స్థిమితం లేకపోతే మాత్రం ఇంత పకడ్బందీగానా ఆతిథ్యం?!'
'అదే శ్యామలగారూ ఇందులో ట్విస్టు. అసలు విషయం వింటే మీరు షాకవుతారు. ఇల్లు గడవని రోజుల్లో ఆయనగారి కూతురు ముంబైలో ఓ చిన్న ఉద్యోగం చేసేదిట. ఎవరో త్రాష్టుడు అమె వంటరిగా ప్రయాణం చేయడం గమనించి ఎడ్వాంటేజి తీసుకున్నాడంటున్నారు. చెట్టంత ఎదిగిన బిడ్డ అలా అన్యాయంగా బలై పోయినప్పట్నుంచి  మీ రామసుబ్బుగారి పిచ్చి ఇటు మళ్ళిందన్నమాట. స్టేషనులో కాపు కాయడం.. మీలాంటి ఆడకూతుళ్లెవరన్నా అసహాయంగా కనిపిస్తే సేఫుజోనులో చేరిందాకా వెంటబడి మరీ సేవల మిషతో కాచుకోవడం! మామూలు  చికిత్సకు లొంగక కొంతలొంగే చికిత్సకు డబ్బు లేక కొంత ఇంట్లో వాళ్ళంతా ఈయన్ను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైందట!’ 
సినిమా కథలనుకుంటాం గానీ.. కొన్ని జీవితాలు  సినిమా కథలకన్నా విచిత్రంగా ఉంటాయి.. ఇలా!'
రామసుబ్బుగారి మంచితనంమాటకారితనం ఓ పిచ్చి వల్ల వచ్చిందా?! నమ్మబుద్ధికాకపోయినా ఇదో పచ్చినిజం! బాధతో నిట్టూర్చకుండా ఉండలేకపాయాను.
***

రచన 
కర్లపాలెం  హమమంతరావు
( అచ్చంగా తెలుగు - ప్రచురితం ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...