Saturday, December 11, 2021

విదేశీయాత్రిక చరిత్ర ; కుటుంబసమేతంగా వచ్చిన నికోలో కోంటీ

విదేశీయాత్రిక చరిత్ర ; 

కుటుంబసమేతంగా వచ్చిన నికోలో కోంటీ


15వ శతాబ్దంలో ఇండియాలో పర్యటించిన పాశ్చాత్యులందరిలో నికోలోకోంటి ప్రముఖుడు. ఆనాటి ఇండియా గురించి ముఖ్యమైన సమాచారం విస్తారంగా  గ్రంథస్తం చేసిన విదేశీయాత్రికుడు నికోలో  కోంటీ. 


కొంటీ ఇటలీకి చెందిన వెనీస్ నగరపు ధనిక వ్యాపారి. వెనీస్ నగరం ఆనాటికే  గొప్ప వర్తక కేంద్రం. సముద్ర వ్యాపారాల కేంద్ర స్థానం కూడా. సముద్రాంతర యాత్రలకు ప్రొత్సాహం కలిపించింది ఈ కేంద్రమే.  


నికోలోకోంటి సాహసయాత్ర సకుటుంబంగా సాగింది. తన భార్యా పిల్లలతో కలిసి 1419న  యాత్ర ప్రారంభించాడు. డెమోస్కస్ నుండి తూర్పు దిక్కుకు ప్రయాణం. 600 మంది వర్తకులతో  కలసి అరేబియన్  యడారుల గుండా  ప్రయాణించిన సాహసికుడు నికోలో కోంటీ. 


బాగ్దాద్ చేరిన తరువాత తూర్పు దిక్కుకు ప్రయాణించి  అరబ్బుల ఓడరేవు ఓర్ముజ్ను చేరి  కొంత కాలం పర్షియన్ భాష నేర్చుకునే నిమిత్తం అక్కడే ఉండిపోయాడు.  


అక్కడి నుంచి అరేబియా సముద్రంలో నౌకాయానం ద్యారా ఇండియా పశ్చిమ తీరంలో ఉన్న  కాంబేనగరంలో అడుగుపెట్టాడు.


అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేసి 300 మైళ్ల దూరంలో ఉన్న  విజయనగరం సందర్శించాడు.  విజయనగర రాజ్యం గురించి పాశ్చాత్యులకు సమాచారం అందించిన మొదటి విదేశీయాత్రికుడు నికోలో కోంటీ.


తరువాత ఇంకా దక్షిణానికి - మలియాపూర్ వెళ్ళి సెయింట్ థామస్ సమాధిని చూశాడు. తరువాత శ్రీలంకను, సుమత్రాను, బెంగాల్ను చూసి మరలా తూర్పుగా బయలుదేరి ఆరకాన్, ఇర్రావదీ, ఆద, పెగూ, జావా, సుంచావాలు వరకు వెళ్లి తిరుగు పయనం చేసి మరల సిలోన్ మీదుగా ఇండియా పశ్చిమ తీరానికి వచ్చి క్విలన్, కొచ్చిన్, కాలికట్లను దర్శించాడు.


కాంబే ప్రాంతంలో సతీసహగమనం ప్రబలంగా వుందనీ, కాలికట్ ప్రాంతంలో బహుభర్రుత్వం వుందనీ గమనించాడు.


కాంబే నుండి తిరుగు పయనం చేసి ఈజిప్టు గుండా వెళ్లాడు. కానీ వారి స్వదేశానికి దగ్గరలో వుండగానే అతని భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. కోంటి 1444లో తన వూరు వెనిస్ చేరాడు.


అప్పటి వరకూ తన పర్యటనను గురించి ఏమీ వ్రాసుకోలేదు. సముద్రయాత్రలో వుండగా ఒకసారి తన భార్యాబిడ్డల్ని రక్షించుకోవడానికి క్రిస్టియన్ మతాన్ని విడనాడాల్సి


చ్చిందట. ఆ తప్పదం అతన్ని వెంటాడుతూనే వుంది. ఆ పాపం నుండి బయటపడాలని ఈనాటి పోప్ యుజిని వద్దకు వెళ్లి వివరం అంతా చెప్పి పశ్చాత్తాపబడి తనకు పాపవిముక్తి చేయమని విన్నవించుకున్నా.


ఆ సందర్భంగా ఈయన యాత్ర విశేషాలు విన్న పోప్ గారు తన సెక్రటరీ సాయో బ్రాచ్చిమోలిని"ని వ్రాతకుడుగా నియమించి కోంటి చెప్పే విశేషాలన్నింటినీ _వ్రాయమన్నాడట. వారిద్దరి కృషి ఫలితంగా ఆ యాత్రా విశేషాలన్నీ గ్రంథస్తం అయ్యాయి. చరిత్రకొక మేలు జరిగింది. కోంటి నిశిత పరిశీలనా, పొగ్గియో మేలయిన రచనా శైలీ కలిపి లాటిన్ భాషలో “డి వెరైటేటి ఫార్చ్యునే” అనే గ్రంథం రూపొందింది.


కొండల మధ్యలో వున్న విజయనగరం చుట్టుకొలత 60 మైళ్లుంటుందని అందులో నివశిస్తున్న సైనికులే 90 వేల మంది వుంటారనీ వ్రాశాడు. ఇది ఎప్పుడు సంగతి? శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన నాటి కంటే వంద సంవత్సరాల పూర్వం సంగతి. అప్పటికే ఆ నగరం వందేళ్లయింది. క్రీ.శ 1336లో విజయనగరం ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. వందేళ్లలోనే ఆ నగరం అంత అభివృద్ధి చెందిందన్నమాట!


ఆయన ఆనాటి (1420) బెంగాల్ గురించి యేమీ రాయలేదు గానీ గంగానదీ గట్టమీద అందమైన తోటలతో నగరాలున్నాయని వ్రాశాడు. గంగానదిపై ప్రయాణం చేసి సంపదలతో తులతూగుతున్న 'మారజియా' అనబడే నగరాన్ని చేరాడట.


పేపర్ మనీ వాడుకలో వుందనీ కుతూహలమైన విషయాన్ని కోంటి వ్రాశాడు. వెనీస్ నగరపు బంగారు నాణాలైన డుకౌంటులు కూడా చలామణి అవుతున్నాయట. అవిగాక ఇనుప నాణాలు కూడా వాడుకలో వున్నాయట.


ఇక్కడ హిందువులు పరిపాలిస్తున్న రాజ్యాలలో నేరవిచారణ తతంగాలలో ప్రమాణాలు వాడుకలో వుండటం చూసి విస్తుబోయాడు.


"ఇండియాలో చనిపోయినవారిని దహనం చేస్తారు. బ్రతికి వున్న అతని భార్యల్ని కూడా ఆ మంటలోనే దహనం చేస్తారు. అది చాలా గౌరవంగా భావిస్తారు...” అంటూ ఆ సతీసహగమన తతంగం ఎలా జరుగుతుందో అంతా వర్ణించాడు.


హిందూవులలో ఆత్మార్పణం చేసుకునే భక్తులు కూడా వుంటారనీ విజయ నగరంలో అలాంటి ఆచారం వాడుకలో వుందనీ వివరించాడు కోంటి. ఆ భక్తులు


తమకు తామే తమ శిరసుల్ని నరుక్కుంటారని వర్ణించాడు. దేవుడి రధ చక్రాల క్రిందపడి కూడా చనిపోతుంటారనీ వ్రాశాడు.


మలబారు తీరంలో కాలికట్లో కొంతమంది ప్రజల్లో బహు భర్రుత్వం అమలులో


వుందని వ్రాశాడు.


విజయనగర సామ్రాజ్యం గురించి మరికొంత వివరిస్తూ ఇక్కడి మగవారు ఎంతమంది భార్యలనైనా చేసుకుంటారనీ, వీరి రాజుకు 12 వేల మంది భార్యలున్నారనీ, రాజుగారు ఎక్కడికి వెళ్లినా అతనితో పాటు 4000 మంది భార్యలు కదిలి వెళ్తారనీ, వాళ్లుగాక వంటపనులకూ, సాయుధులైన అశ్వికులు గానూ అనేకమంది మహిళలున్నారని వ్రాశాడు.


విజయనగర సామ్రాజ్యంలోని పండుగల్ని కూడా వర్ణించాడు. అన్ని వయస్సుల జలూ నదులలో స్నానం చేసి, మంచి మంచి దుస్తులు ధరించి మూడురోజులపాటు త్యాలతోనూ, ఆట పాటలతోను గడుపుతారనీ, దేవాలయాల్ని దర్శిస్తారనీ, మరో డుగలో ఇళ్ళన్నీ దీపాల వరుసలతో అలంకరిస్తారనీ, ఇంకో పండుగ రోజున ందంగా రంగులు జల్లుకుంటారనీ వ్రాశాడు.


విజయనగరానికి ఉత్తరంగా 15 రోజుల నడక దూరంలో వజ్రాలు లభించే డ వుందనీ వ్రాశాడు. ఈ గోల్కొండ వజ్రాల గనుల గురించీ, కృష్ణానదీ వుత్తర లో వజ్రాలు లభిస్తాయనీ చాలామంది యాత్రీకులు వ్రాసినదే ఆయన కూడా శాడు.


గుజరాతుకు చెందిన కాంబే నగరం వారు మాత్రమే కాగితాన్ని వుపయోగిస్తున్నారనీ, మిగిలిన వారంతా వ్రాతకు చెట్ల ఆకుల్ని (తాటి ఆకులు) వుపయోగిస్తున్నారని వ్రాశాడు.


ఈదేశాలలో ప్రజలు ఎక్కువనీ, సైన్యాలు కూడా లక్షల సంఖ్యలో వుంటాయనీ వ్రాశాడు. నికోలో కోంటి దక్షిణ ఇండియాలో 1420-21లలో పర్యటించాడని చరిత్రకారులంటారు.


15వ శతాబ్దంలో అనేకమంది విదేశీయులు పర్యటనలు చేశారు. వారంతా మగవాళ్లే ఇండియాకు వచ్చిపోయారు. కుటుంబంతో సహా వచ్చిన సాహసి ఈయనే. కానీ ఆయన కుటుంబానికి ఇండియాలో హిందువుల వలనగానీ, ముస్లింలవలన గానీ ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదని ఆయన రచన వలన తెలుస్తున్నది. అలాంటి శాంతి భద్రతలు, నీతి నియమాలూ ఇండియాలో ఆ రోజులలోనే అమలులో వున్నాయనేది నికోలో కోంటీ యాత్ర వలన మనకు అవగతమవుతోంది.

సేకరణ : కర్లపాలిం హనుమంతరావు 

( విదేశీయాత్రికులు అందించిన మనదేశ చరిత్ర - డి.వెంకట్రావ్ ) 

సుగ్రీవుడి మొదటి పట్టాభిషేకం రచన: కర్లపాలెం హనుమంతరావు 21 - 09- 2021

 సుగ్రీవుడి మొదటి పట్టాభిషేకం 


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



ఈ మాట అనడానికి కారణం ఉంది. వాల్మీకమే ఇందుకు ప్రమాణం. గందరగోళం లేకుండా సూక్ష్మంగా , సరళంగా,  సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 


సుగ్రీవుడు ఓ నలుగురు రాక్షసులను ( అనల, శరభ, సంపాతి, ప్రఘసన- వాళ్ల పేర్లు ) వెంటబెట్టుకుని శ్రీరాముడి శరణు కోసం ఆకాశంలో ఉత్తర దిక్కునుంచి వచ్చి  ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అది సుగ్రీవుడి కంటబడింది. వచ్చినవాళ్లు శత్రువులు అనుకొన్నాడు. యుద్ధ కాలం. అనుమానం రావడం సహజమే.  సమీపాన ఉన్న హమమంతుడితో విషయం చెప్పాడు. ( హనుమత్ సముఖా: - అనే పదం వాడాడు  వాల్మీకి మహర్షి . బుద్ధిమంతుల ముందు వ్యవహారాలను విచారించుకునే సందర్భంలో ఈ పదం వాడటం ఓ భాషా సంప్రదాయం ). అది మిగతా కోతుల చెవిలో పడి ఆవేశం వచ్చేస్తుంది. సాలవృక్షాల మీద  చేతులేసి ' ఆజ్ఞాపిస్తే క్షణంలో వాడిని, వాడితో వచ్చిన వాళ్లనూ చంపేసివస్తాం ' అంటారు. 


ఆ మాట విభీషణుడు  విని ' తన సోదరుడు చెడ్డవాడని, జటాయువు చావుకు , సీతాపహరణకు వాడే కారణమని, ఆమె లంకలో దీనంగా రాక్షసస్త్రీల మధ్య భర్తకోసం ఎదురు చూస్తూ దుష్టుడయిన తన అన్నయ్యను నిరోధించడానికి చాలా ఇబ్బంది పడుతుందని, విడిచిపెట్టమని మళ్లీ మళ్లీ చెబుతున్నా వినకపోగా తనను అవమానించాడ' ని చెప్పుకొచ్చాడు. ' ఇప్పటిదాకా గౌరవం( సోహం) గా బతికిన వాడిని  దాసోహం  అనలేక శరణు కోసం రాముడి దగ్గరకు వచ్చాన' ని వివరంగా చెపుతాడు. భార్యా బిడ్డలను, స్నేహితులను, ఆస్తిపాస్తులను అన్నీ లంకలోనే వదిలేసుకుని ' రాఘవం శరణం గత: ' అంటూ వచ్చిన విభీషణుడి  మాటలకు కంగారుపడి ( లఘువిక్రమత్వం ) వాయువేగంతో లక్షణసమేతుడై ఉన్న రాముడి దగ్గరకు వెళ్లి ఈ వివరాలన్నీ క్లుప్తంగా  చెప్పాడు సుగ్రీవుడు . 


సుగ్రీవుడిది రాజనీతి. అపరిచితులను ముందుగా  అనుమానించి .. విచారించిన మీదట గుణాలు నిర్ధారించుకునే తత్వం.  కాబట్టే 'గుడ్లగూబ కాకులని చంపినట్లు  చంపేందుకే మన బలం తెలిసీ వచ్చి వుంటాడు. నికృతిజ్ఞులు  ( కపటులు)  అయిన రాక్షసజాతికి చెందిన వీడు గూఢచారిగానో, మనలో కలతలు సృష్టించడానికో వచ్చాడేమో?  వాలిని చంపినట్లు వీడినీ చంపేసేయ్ రామా ! మారీచుణ్ణి  మాదిరి సగం చంపి వదిలావా .. అనర్థకారి అయే ప్రమాదం కద్దు ' అని ఓ రాజులాగా, సేనాపతిలాగా రాముడికి సలహా ఇవ్వబోయాడు. అదీ రాముడు అడగక ముందే! హనుత్సముఖుడైన ( బుద్ధికి సంబంధించిన ) రాముడు అక్కడ ఉన్న మిగతా వానరుల వంక  చూసి ఒక ముఖ్యమైన మాట అంటాడు. అది అన్ని కాలాలకు అందరికీ పనికిపచ్చే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠం లాంటిది . 'స్నేహితుడు  ఒక సలహా ఇస్తున్నప్పుడు తతిమ్మా  వాళ్లు భయం చేతనో , స్నేహం చెడుతుందన్న భీతి చేతనో నిశ్శబ్దంగా ఉండటమూ ప్రమాదమే! ఇబ్బందుల్లో ఉన్నపుుడు సమర్థులు  సలహా ఇవ్వటమే  మేలు ' అన్న రాముని ఉవాచ సర్వదా శిరోధార్యం. ఈ సందర్భంలో వాల్మీకి ఉటంకించిన ఈ శ్లోకం మనందరం  మననం చేసుకోదగింది. 

' యదుక్తం కపిరాజేన రావణానరజం ప్రతి 

వాక్యం హేతుమదర్ధ్యం చా భవద్వి రపి తచ్ఛ్రుతం 


రాముని మాటకు  ధైర్యం తెచ్చుకున్న  అంగదుడు ' నీకు తెలీనిదేముంది ప్రభూ! మా బతుకంతా రాజనీతి వంకన అందర్నీ శంకించడమేనాయ! అంతకుమించినది ఇంకేదో ఉంది. అదేదో నీకే తెలియాలి' అన్నాడు తెలివిగా. గతంలో తన రాజు సుగ్రీవుడు మీద కోపం  ఉంది అతగాడికి. 


సుగ్రీవుడు అది గ్రహించాడు.   ' అదిగో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి. అంగదుడికి రాజ్యం ఆశ చూపించి వానర  సైన్యంలో చీలిక తెచ్చి మనల్ని  బలహీనుల్ని చేసే  రావణాసురుడి ఎత్తుగడ కావచ్చు ఈ రాక్షసుడి రాక. ఎటూ ఆఖరుకు తేల్చాల్సి౦ది నువ్వే కాబట్టి అందరి అభిప్రాయాలు విడివిడిగా పిలిచి కనుక్కో రామా  ' అన్నాడు. 


అప్పుడుగాని అంగదుడు తన మనసులోని మాట బైటపెట్టలేదు. 'శత్రువు అంటే అనుమానించదగ్గవాడే.  మనం గుడ్డిగా నమ్మితే సమయం చూసి దెబ్బకొట్టే నయవంచకుడు కూడా . మిత్రత్వాని కి అనుకూలమైనది ముందే గుణ దోషాలు విచారించుకోవడం ' . 


ఆ తరవాత శరభుడు. అతడు  మాట్లాడ్డం అయిన తరువాత జాంబవంతుడు తన వంతుగా శాస్త్ర దృష్టితో ' రాకూడని కాలంలో శత్రువర్గం  నుంచి చేతులు కలపడానికి వచ్చిన వాడిని తప్పక  అనుమానించాల్సిందే ' అని తేల్చాడు. కేవలం శాస్త్ర దృష్టి మాత్రమే కాకుండా తత్వమరసి ( మనసు తెలుసుకొని )  నిర్ణయం తీసుకోవడం మేలు' అని  మైందుడు అడ్డుపడటంతో  హనుమంతుడి  ఆలోచనకు ప్రాధాన్యత పెరిగింది 


' ఎదుటివాళ్లను  గురించి వచ్చే ప్రస్తావనలో జాతి, కులం, హోదాలు వంటివి కాకుండా మన సంస్కారానికి ప్రథమ స్థానం  ఉంటుంది. రాజనీతో, ఎదుటి వ్యక్తి మీద ముందే ఏర్పరుచుకున్న  చెడ్డ అభిప్రాయం వల్నో ల న్యాయ నిర్ణయం జరగదు. పై పెచ్చు  విచారణలో కూడా మాటమృదువుగా, సృష్టంగా, క్లుప్తంగా ఉండాలంటారు పెద్దలు.( ' న వాదా నాపి సంఘర్షా న్నాధిక్యా న్నచ కామత: 

వక్ష్యామి వచనమ్ రాజన్ యధార్ధం రామ గౌరవాత్ ' అని వాల్మీకి  శ్లోకం ఇక్కడ ) ' నేమ వాదన  కోసమో, ఘర్షణ కోసమో, బడాయిగానో, లాభం కోసమో, అవకాశం వచ్చందనో  వాగడం  లేదు. కేవలం రాముడి మీద ఉండే గౌరవమే తప్పించి రాజువైన నిన్ను ధిక్కరించాలనే   ఆలోచన బొత్తిగా లేదు' అంటూ సుగ్రీవుడి అహాన్ని కొంత చల్లార్చి ' అర్థం.. అనర్థం కోణంలో మంత్రులు  మాట్లాడింది తప్పుపట్టడానికి  లేదు. కానీ పనిలో పెట్టకుండా ఎవరి సామర్ధ్యం ఎంతో ఎట్లా తెలుస్తుంది? అట్లాగని తొందరపడి ముఖ్యమైన రాచకార్యం కొత్తవారికి అప్పగించడమూ క్షేమం కాదు. ' అంటూనే అంగదుడు, జాంబవంతుడు చెప్పిన మాటలను కూడా ఖండిస్తున్నట్లు రామునితో ' ఈ విభీషణుడు రావణాసురుడి దుర్మార్గాన్ని చూశాడు. వాలి వధ చేసిన నీ పరాక్రమం గురించీ విన్నాడు. సుగ్రీవుడి పట్టాభిషేకం నీ వల్లనే సాధ్యమయిందని తెలిసి లంక మీది పెత్తనం ఆశించి నీ దగ్గరకు వచ్చి ఉండవచ్చు. నా బుద్ధికి తోచింది ఇది . గుణదోషాల విచక్షణ ప్రస్తుతం పక్కన పెట్టి మిత్ర గ్రహణం చేయవచ్చనిపిస్తుంది. మనసులో ఉన్నదే చెప్పాను . ఆపైన నీ ఇష్టం ' అని ముగించాడు హనుమ. 


హనుమంతుడికి ' వాక్ చతురుడు' గా పేరుంది. లంకలో విభీషణుడే హనుమంతుడికి ఆపదవచ్చినప్పుడు  రక్షించింది. అందువల్లే ఈ విభీషణుడిని అంగీకరించమంటున్నాడు  - అని సాటి వానరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య మొదటి నుంచి స్వభావరీత్యా వైరుధ్యం ఉన్నట్లు లంకలో ఉన్నప్పుడు హనుమ పసిగట్టాడు. కానీ ఈ విషయం మీద అవగాహన లేనందున  అంగదుడు, జాంబవంతుడు లాంటి వాళ్లు తన సలహా అంతరార్ధం  సవ్యంగా అర్ధం చేసుకోకపోవచ్చు. ఈ రెండు కారణాల చేతా హనుమంతుడు తన సంభాషణలో వాటి  ప్రస్తావన తీసుకురాలేదు . అదీ ఆంజనేయుడి వాక్ చాతుర్యం . 


అంగధ, సుగ్రీనాదుల సలహాలు కలవరం కలిగించినా ఆంజనేయుడి మాటలతో రాముడికి సంతోషం కలిగింది. తనగురువు వశిష్టుడు బోధించిన నీతి శాస్త్రం మననం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు చుట్టూ ఉన్న పరిజనాన్ని చూసి ' ఈ విభీషణుడి విషయంలో మనం కాస్తా హేతు సాధ్యమైన కోణంలో ఆలోచిస్తే బాగుంటుందేమో! నా మంచి కోరే మీరంతా ఆలకించండి . ' స్నేహం అర్థిస్తూ వచ్చినవాడివి నేను నిరాశపరచను. వచ్చిన  వాళ్లలో  తప్పులున్నా సత్పురుషులు వాటిని లెక్కించరు. తనను చంపేందుకు వచ్చిన వాడి ఆవాచనను పక్కనపెట్టి ఆతిథ్యం ఇచ్చింది ఒక పావురం. దాని ఔాదార్యం మనకు శిరోధార్యం. విభీషణుడిని వదిలి పెట్టను ' 


' సరే! వచ్చిన రాక్షసుడి గుణంతో పనిలేదు . కానీ అతని అవకాశవాదమన్నా గుర్తించాలిగా! లంకాదహనం, పుత్రమరణం వంటి మహా దుఃఖాలలో ఉన్న సొంత అన్ననే విడిచిపెట్టి వచ్చినాడు అవకాశం వస్తే మన దుఃఖం మాత్రం పట్టించుకుంటాడా? వదిలేసి పోడూ ?' అని సుగ్రీవుడు మళ్లా రాజనీతి వలకపోయడం వివి లక్ష్మణుడికి నవ్వొచ్చింది. చిరునవ్వు తో  ' సుగ్రీవుడికి శాస్త్ర బద్ధంగా చెబితేనే బుర్రకెక్కేది'  అన్నట్లు గ్రహించి ఆప్రకారమే  ' సుగ్రీవుడు ఎప్పుడూ చదువుకున్న శాస్త్రాన్ని మాత్రమే వల్లెవేస్తాడు. కానీ ఆ ధర్మమే ఏం చెబుతోంది? ఉన్నత వంశంలో పుట్టిన వాడు ఎంతో కష్టం కలిగితే తప్ప తన స్థాయివారి దగ్గర చెయిచాపడు. సుగ్రీవుడిది   కాలాన్ని బట్టి అనుమానం. పద్దాకా శాస్త్రమో అంటూ అమమానాలు పెట్టుకొనేవాళ్లకి ఆ శాస్త్రం చెప్పే మరో మాట కూడా గుర్తు చేస్తా . మన ద్వాలా తన కన్నా బలవంతుడైన అన్నను చంపిస్తే, ఆ చంపినవాడి ముందు తన బలం చాలదన్న ఇంగితం ఉంటుంది గదా! వాడి రాక్షస కులానికి చెందని మనకు వాడి రాజ్యం మీద కోరిక ఉండదన్న లెక్కతోనే  సహాయం కోసం రామశరణు కోసం వచ్చాడు. కాబట్టి విభీషణుడు ఎట్టిపరిస్థితుల్లోనూ స్నేహాపాత్రుడే! 

' అవ్యగ్రాశ్చ ప్రహష్టాశ్చ న భవిష్యంతి సంగతాః

ప్రవాదశ్చ మహానేష తతో 2 స్య భయ మాగతం 

ఇతి భేదం గమిష్యంతి తస్యాత్గ్రాహ్యో  విభీషణ: 

నిశ్చింతగా, సంతోషంగా ఉండాలనుకునే పండితుల కూడా సఖ్యతగా ఉండలేరు. ఒకళ్లనొకళ్లు అణగదొక్కుకునే పరిస్థితి. రావణ విభీషణులు సమాన రాజనీతిజ్ఞులు. విభాషణుడి వాలకంలో సోదర భీతి సుస్పష్టం.  ఆ భయంతో వచ్చాడు కాబట్టి  అభయం ఇవ్వడం ఉచితం. అందరూ భరతుని వంటి సోదరులే ఉండరు.  తండ్రి మరణానికి కారణమైన కొడుకులు లేరా? అందరికీ నీవంటి స్నేహితుడే దొరకాలనే నియమం లేదుకదా! రావణ విభీషణులు వాలి సుగ్రీవులు, రామలక్ష్మణులో ఎప్పటికే కాలేరు. ఈ రాక్షసుల మధ్య వైరం నిజమే కావచ్చు. విభీషణుడు నిశ్చయంగా గ్రహణీయుడే ' అన్నాడు రాముడితో లక్ష్మణస్వామి. 


అయినా సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి నిలబడి  రాముడి ముందు  చేతులు జోడించి ' ఇట్లా అన్నందుకు క్షమించు . వచ్చింది. శత్రువు  సోదరుడు. వాడి తీయని మాటల వెనుక వంచన ఉండవచ్చు. వెంటనే వాడినీ, ఆ నలుగురు రాక్షసులను నువ్వన్నా చంపు! లక్ష్మన్న చేతనైనా చంపించు! '  అన్నాడు. 


వాద ప్రతివాదనల వాతావరణంలో  సానుకూలమైన ఆలోచనరాదు. గోలగా ఉన్న ఆ తరుణంలో మౌనంగా ఉండి చివరికి ప్రసన్నంగా లోకాలు అన్నిటికీ పనికివచ్చే మంచి మాట ఒకటి అన్నాడు. 

' నన్నూ నావాళ్లను ఎవరినీ ఏమీ చేయలేని బలహీనుడు ఈ వచ్చినవాడు. శరణు అంటే ఎట్లాంటి వాడినైనా రక్షించి తీరుతా . దానవులు , పిశాచాలు, యక్షులు, భూలోక సంబంధితులు   ఎట్లాంటివాళ్లనైనా నా కొనగోటితో చంపేస్తా. ఒక పావురమే శరణాగత ధర్మాన్ని పాటించినప్పుడు నా బోటివాడి మాట ఏమిటి? ' అంటూ కండు మహర్షి ద్వారా  గురువు  గ్రహించిన గీతికను పునశ్చరణ చేసుకుంటూ ' అంజలి ఘటించి ఆశ్రయం అర్థించిన విపన్నుడిని తిరస్కరించకూడదు . అంజలి పరమా ముద్రా క్షిప్రం దేవ ప్రసాదినీ .. అని శాస్త్రం. దేవతలే తొందరగా ప్రసన్నమయే అంజలి ముద్రను మనం  వేళాకోళంగా తీసుకోకూడదు. అంజలి ఘటించక పోయినా దైన్యంగా ఉన్నా అంతే. ఆ రెండూ లేకపోయినా రక్షక స్థలానికి వచ్చి యాచిస్తే సాక్షాత్ శత్రువే అయినా చంపకూడదు. ఈ విభీషణుడు శత్రు కాదుగదా! కేవలం శత్రువు బంధువు మాత్రమే. అనుకున్నది ఆలస్యమయే కొద్దీ  అతనికి ఆదుర్దా  ఎక్కువగా ఉంది. ' ఆలస్య మయినా సరే ఫలితం వస్తే బాగుణ్ణు' అనుకుంటున్నాడు. అటువంటివాడిని ప్రాణాలు ఫణంగా పెట్టయినా రక్షించాలి. ప్రత్యవాయు హేతువు అనే ఒక న్యాయం ఉంది. భయంతోనో, మోహంతోనో, శాస్త్రాన్ని పట్టుకుని గట్టిగా చేసుకోని సంకల్పంతోనో, కాముకత్యంతోనో, బాధ్యత తెలీకుండానో , ప్రతిఫలం ఆశించో ,  సంపాదించిన ఆఖరు నాణెం ఖర్చయే దాకా సిద్ధపడి, ప్రాణత్యాగానికైనా వెనక్కు తగ్గకుండానో  ఉండటాన్నే ప్రత్యవాయు హేతువు అనేది. ఆశ్రయం నిరాకరించేవాడికి ఆ దోషం అంటుకుని నరకబాధలు మొదలవుతాయి. ఈ లోకంలో కూడా నిందలే . మంచినీళ్లు ముట్టవు . మొహం చూస్తే చాలు అసహ్యం కలుగుతుంది. నిరాశతో వెళ్లేవాడు వట్టిగా పోడు. తిరస్కరించిన పాపానికి  అప్పటి దాకా చేసుకున్న పుణ్యాలన్నీ పట్టుకుపోతాడు. మనస్ఫూర్తిగా ఇష్టంతో ఆశ్రయం ఇవ్వక పోయినా ఆశ్రయం ఆశించి వచ్చినవాడి మనసులో ఉన్న సామర్ధ్యాలన్నీ సర్వనాశనం .  ధర్మబద్ధం, కీర్తిదాయకం, స్వర్గ ప్రాప్తి . . ఇత్యాదులకు కారణమయే కండు మహర్షి ఉత్తమ ఉపదేశమే నాకు అనుసరణీయం. అందువల్ల ఆ వచ్చినవాడు విభీషణుడే కాదు, రావణాసురుడయినా అభయమిస్తాను ' అంటాడు రాముడు . 


' నా మనసు కూడా ఈ విభీషణుడు పరిశుద్ధుడనే ఘోషిస్తోంది. కాకపోతే రాజధర్మంగానే నా పరీక్ష . ఇప్పటి నుంచి అతను మాతో సమానుడు . మీ ఇద్దరి మధ్యా మైత్రి మాకూ సంతోషదాయకమే ' అంటూ విభీషణుడిని తీసుకురావడానికి వెళ్లాడు సుగ్రీవుడు. . గరుత్మంతుడు దేవేంద్రుడిని తీసుకురావడానికి వెళ్లినట్లు. 


సుగ్రీవుడి నోట శుభవార్త విని అనుచరులతో సహా దిగితే తాత్సారమవుతుందన్నట్లు గభిక్కున నేలమీద పడ్డాడు విభీషణుడు. ( వాల్మీకి దీన్ని 'ఖాత్ పాతావనీం' అన్నాడు. ) రాముడి పాదాల మీద పడిపోయి సంపూర్ణ సాష్టాంగ నమస్కార రూప శరణు పొందేడు. 

' అవమానింపబడ్డ రావణ సోదరుణ్ణి. లంకను, స్నేహితులతో సహా దారాపుత్రులు,ధనాది ఐశ్వర్యాలు, రాజ్యం మొత్తం నీకు స్వాధీనపరుస్తున్నాను. ఇకపై నీవే నా పోషకుడివి.  నా సుఖాలు, ఆముష్మిక సుఖాలలో భాగం నీకే అర్పితం. ' అంటున్న విభీషణుణ్ణి సముదాయించినట్లు సముదాయిస్తూనే కళ్లతో పరీక్షగా చూస్తున్నాడు రాముడు. 


ఇంకా శరణు ఇచ్చాను అనలేదు. మనసులో మాత్రం అభయం ఇచ్చాడు. వానర ప్రముఖుల కోసం ఈ పరీక్ష .  నీ గురించి చెప్పమన్నాడు. విభీషణుడి గురించి ఇప్పటికే హనుమంతుడి ద్వారా కొంత సమాచారం తెలుసు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చెబుతాడా.. లేదా.. అన్నదే పరీక్ష . 


విభీషణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ' రావణుడికి బ్రహ్మవరం ఉంది. దశగ్రీవుడు . సర్వభూతాలపై పెత్తనం సాధించాడు.  తరువాతి సోదరుడు కుంభకర్ణుడు.  ఇంద్రుడిలా యుద్ధం చేయగలడు. సేనాపతి ప్రహస్తుడు . కైలాసంలో జరిగిన యుద్ధంలో కు చేరసేనాపతి మాణిభద్రుడి అంతుచూశాడు.  గోధా, అంగుళిత్రాణ  అనే కవచాలు ధరించినప్పుడు ఇంద్రజిత్తును చిత్తు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ధనుస్సు  ధరించి అదృశ్యంగా యుద్ధం చేసే నేర్పరి . సమరసమయంలో అగ్నిని ఉపాసించడం వల్ల ఆ అంతర్ధాన యుద్ధ నైపుణ్యం.  ఇక్ మహాపార్శ్వ , మహాదర, అకంపనలు - అనే సేనాపతులయితే ఆయుధాలు పట్టుకుని స్వయంగా యుద్ధంలోకి దిగితే లోకపాలకులు.  లంకలో ఉండే కోట్లాది రాక్షసులు తీవ్రస్వభావులు. శరీరాన్ని కుదించుకుని రక్త మాంసాలు అని హరాయించుకోగలరు. 

' రావణుని కర్మ వృత్తులతో సహా వివరంగా చెప్పావు. ప్రహస్తుడు, కుంభకర్ణులతో  రావణుని చంపి నిన్ను లంకాధిపతిని చేస్తాను. ఇది సత్యం. ప్రతిజ్ఞ .  రసాతలంలో దాక్కున్నా, పాతాళానికి పరుగెత్తినా, వరాలిచ్చే బ్రహ్మ దగ్గరకు వెళ్లినా నాచేతిలో రావణుడు చావడం నిశ్చయం .  నా ముగ్గురు తమ్ముళ్ల  మీద ఆన. కొడుకులు, బంధువులు, సైన్యంతో  సహా రావణుణ్ణి చంపకుండా అయోధ్యా నగర ప్రవేశం చెయ్యను .  రాముడి అయకార తీవ్ర పౌరుష వచూలు విని విభీషణుడు వినయంతో శిరసు వంచి నమస్కరిస్తూ ' రామా! రాక్షస సంహారం, లంకానగర దిగ్బంధనం, రాక్షససేనా ప్రవేశం విషయాలలో ప్రాణాలున్నంత వరకు సాయం చేస్తాను. ' 


విభీషణుడు ఇచ్చిన మాటకు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. రాముడు.  లక్ష్మణుణ్ణి పిలిచి ' సముదాజ్జలమానయ ' ( సముద్రం నుంచి నీళ్లు తెమ్మన్నాడు. 


' ఈ మహానుభావుణ్ణి  ఇక్కడే అభిషేకిద్దాం ' అని రాముడు అనగానే సుగ్రీవుడు, అంగదుడు, హనుమదాదులు సంతోషించారు. 


ఆ విధంగా లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షంలో రామశాసనం ప్రకారం విభీషణుణ్ణి లంకాధిపతిగా అభిషేకించాడు. వానరులంతా సాధువాక్యాలు పలకడంతో విభీషణుడి ' మొదటి పట్టాభిషేకం'  దిగ్విజయంగా ముగిసింది


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



కవిత: బాలగోపాల్, ఓ బాలగోపాల్ - పి.రామకృష్ణ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 





మాకులాగే  నీకూ ఒక్క బ్రతుకే ఉన్నా 

ఆ ఒక్క బ్రతుకులో 

వంద బ్రతుకులు జీవించావు కదా బాలగోపాల్ 


మాకులాగే నీకూ రెండు కాళ్లూ,  రెండు కళ్లే ఉన్నా 

దేశంలో నీ కాళ్లు నడవని ప్రదేశం లేదు  

నీ కళ్లకు కనిపించని  హక్కుల అణచివేతలేదు 


చీమంత  పని చేసామేమో  

కొండంత అలసటతో కూచున్నాం మేము  

ఇదిగో.. ఈ మరణం దాకా 

నువ్వెప్పుడైనా అలసిపోయావా బాలగోపాల్ 

సీమవాడినని అనుకోవడానికి సిగ్గేసింది 

సీమనీటి వివరాల గురించి  నువు  చెప్పాక

పల్లం నుంచి మిట్టకు కూడా ప్రవహించావు  గదా బాలగోపాల్ 

నమ్మకాన్నీ, అపనమ్మకాన్నీ అంతే ధైర్యంగా 

అంతే నమ్మకంగా ప్రకటించావు గదా బాలగోపాల్ 

మేమైతే  నమ్మకం  మీద అపనమ్మకం కలిగినా 

నమ్ముతున్నట్లే కనిపిస్తూ వుంటాం 

ఇప్పుడు నీ కోసం ఏడ్వాలా 

మాకోసం ఏడ్వాలా 

నీ కోసం ఏడిస్తే, నువ్వింకా ఏదో చెయ్యాలనుకోవడం 

లేదా , ఏదో చెయ్యలేదు అనుకోవడం, వద్దు . 

నువ్వు చెయ్యవలసినవన్నీ చేశావ్ 

ఏసుక్రీస్తు చెప్పినట్టూ  ఇక మా కోసమే ఏడుస్తాం... 

- పి. రామకృష్ణ 


( పి.రామకృష్ణ రచనలు నుంచి ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 22-09-2021 

                  బోథెల్, యూ. ఎస్.ఎ


( బాలగోపాల్ భౌతికకాయం దగ్గర కూర్చున్నప్పుడు కలిగిన ఆలోచనలతో తను కూర్చిన కవిత ( పి. రామకృష్ణ దృ ష్టిలో ఇది కవితకాదు . బాలగోపాల్ ను ఒక కవితలో ఇమడ్చటం కష్టం అంటారాయన )  

 


ఈనాడు - గల్పిక అమ్మా .. నాన్నా రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురణ - 26-01-2009)

 





మనిషి భూమ్మీద  పడక ముందే దేవుడు రెండు అవతారాలెత్తి సిద్ధంగా ఉంటాడట..  ఒకటి అమ్మ.. రెండు నాన్న. 


అమ్మ తోలపాట అయితే, నాన్న నీతి కథ . వెరసి, ఇద్దరూ ఒక పెద్దబాలశిక్ష . 


తల్లిదండ్రుల ప్రేమ ఊటబావి లోని నీటిపాయలాంటిది.  ఎప్పుడూ మన జీవితాలని  చెమ్మగానే ఉంచుతుందది .


బిడ్డ కడుపునిండితే తల్లికి త్రేనుపొస్తుంది. కొడుకు ఘన కార్యానికి ముందుగా పొంగేది తండ్రి ఛాతీనే:


తల్లిదండ్రుల ప్రేమలోని మాధుర్యానికి ద్రాక్ష నల్లబడి పోయింది. చక్కెర రాయిలాగా మారిపోయింది. అమృతం చిన్నబోయి స్వర్గానికి పారిపోయిందని ఓ కవి చమత్కారం. 


భూమ్మీద పడగానే బిడ్డ ముందుగా చూసేది అమ్మనే . ముందుగా పలికేది అమ్మ అనే శబ్దాన్నే.  ఆ అమ్మ చూపించే నాన్నే క్రమంగా ఆ బిడ్డకు అన్నీ అయిపోతాడు. 


 'నాన్న' అన్న పిలుపులోనే 'నా' అన్న భావం దాగుంది కదా ! అమ్మ ఒడి గుడి అయితే, నాన్న ఒడి బడి. మనం ఎదగటానికి ముందుగా కొలమానంగా భావించేది. ముందున్న అమ్మా నాన్న వ్యక్తిత్వాలనే గదా! 


సంతానంకోసం సంతోషన్నంతా వదులుకొని కారాగారంలో యౌవనం వృథాచేసుకున్న దేవకీ వసుదేవుల కథ మనకు తెలుసు. కాకైనా , కోకిల అయినా  బిడ్డలను గాంధారీ దృతరాష్ట్రుడిలా గుడ్డిగా ప్రేమించటమే తల్లిదండ్రులకు తెలిసిన విద్య.  


వినాయకుని రూపాన్ని గేలి చేసినందుకు చందమామకు పార్వతమ్మ శాపనార్థాలు పెట్టింది! పుత్రవియోగం తట్టుకునే శక్తి చాలక  దశరథ మహారాజు ప్రాణాలు చాలించాడు . 


బిడ్డకోసం బిడ్డనే  మూపున కట్టుకుని కదనరంగంలో కత్తి    ఝళిపించింది  ఝాన్సీరాణి !  లోకం, కాలం, ఏదైనాసరే- తల్లిదండ్రుల లోకం మాత్రం పిల్లలచుట్టూనే ప్రదక్షిణచేస్తుంది. . 

ఈ ప్రేమాకర్షణ శక్తి ప్రభావం ఏ విజ్ఞానశాస్త్ర సూత్రానికి అందనంత విచిత్రమైనది. 


సంతానం తమకన్నా మిన్నవారు కావాలని పగలు కూడా కలలు కనేవారు కన్నవారు . తమ ప్రాణాలను సైతం తృణప్రా యంగా సంతానం కోసం ఇవ్వటానికి సదా సల సిద్ధంగా  ఉండేవాళ్ళలో అందరికన్నా ముందువరసలో ఉండేది అమ్మానాన్నలే. 


పిల్లకాయలంటే తల్లిదండ్రులకు కళ్ళముందు తిరిగే తమ గుండెకాయలు. మనకోసం గాలిమేడలు కట్టేయటమే కాదు .. క్రమం తప్పకుండా వాటి దుమ్మూ ధూళీ కూడా దులిపే పనిలో నిమగ్న మై ఉంటారు. మనమూ నాన్నలమైనదాకా మన వారంటే ఏమిటో అర్థం కాదు. అందుకే అనేది.. ఎన్ని తరాలు గడిచినా అ అంటే 'అమ్మా' అని అంటేనే ఏ జాతైనా నిలబడేదని.  నాన్న చెప్పులో కాళ్ళు పెట్టుకుని చిన్నతనంలో నడిచినవాడు నాన్న అడుగుజాడల్లో పెద్దయిన తరువాత కూడా నడవ టానికి చిన్నతనం అనుకోరాదని. 


అమ్మ పేగు ఇస్తే . . నాన్న పేరు ఇస్తాడు. పేగు తెంచు కుని పుట్టిన బిడ్డ తమ పేరు నిలబెట్టాలని ఏ తల్లితండ్రులు  కోరుకోరు ? తమ సర్వస్వాన్నీ ఇచ్చి బదులుగా మరేమీ  కోరని  పిచ్చి అమ్మానాన్నలు తప్ప రీ  వ్యాపార ప్రపంచంలో పాపం, ఇంకెవ కుంటారు?


మబ్బులు కమ్మిన ప్పుడు సూర్యుడు, డబ్బులేనప్పుడు బంధువులు, అధికారం పోయినప్పుడు లోకులు, శక్తి తగ్గినప్పుడు సంతానం చులకన చేయవచ్చు.. కానీ, ఉన్నప్పుడూ లేనప్పుడూ  కూడా ఒకేలాగా  ఉండేగలిగే వాళ్లు  మాత్రం జన్మనిచ్చిన అమ్మానాన్నలే! 


హిమాలయాలు దేశానికి ఉత్తరానే ఉన్నాయి. ఎత్తులో వాటిని మించిన ప్రేమాలయాలు ప్రతి ఇంట్లోనూ అమ్మా నాన్నల రూపాల్లో ఉన్నాయి. వాళ్ళ అనురాగం అరేబియా సముద్రంకన్నా విశాలమైనది . బంగాళాఖాతమైనా   లోతులో చాలా చిన్నది  . హిందూ మహాసముద్రం కన్నవారి ప్రేమాభి మానాలముందు పిల్లకాలువే సుమా! 


ఈ గజిబిజీ జీవితంనుంచీ ఎప్పుడైనా విరామం దొరికినప్పుడు నువ్వు పుట్టిన ఊరుకు వెళ్ళు. నువ్వు కోతీకొమ్మచ్చి ,  దాగుడుమూతలాడుకున్న ఆ ఇంటి ఆరుబయట మంచం వేసుకుని ఒంటరిగా పడుకో. 


 ఆకాశంలో అమ్మ నీకు గోరుముద్దలు తినిపిస్తూ రారమ్మని పిలిచిన ఆ చందమామను పలకరించు. మీ అమ్మ నీకోసం ఎన్ని కమ్మని కబుర్లు , కథలు చెప్పేదో గుర్తుచేస్తాడు. వెన్నెల్లో మీ నాన్న నిన్ను మోకాళ్ళమీద కు ఎత్తుకొని ఎంత సరదాగా గుర్రమాట ఆడేవాడో చెబుతాడు. అయినదానికి కానిదానికి మీ అమ్మ నీకు తీసే దిష్టి. . కానిదానికి అయినదానికి మీ నాన్న నీకోసం పడే హడావుడి .. మళ్ళా గుర్తుకొస్తే కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు.


అనగనగా ఓ అమ్మ.  ఆ అమ్మకు బుడి బుడి అడుగులు బుడతడు. గడపదాటి పోకుండా ఆ గడుగ్గాయి నడుముకి  తన చీరె కొంగు ముడి వేసుకుని పనిపాటలు చూసుకునేది అమ్మ . 


పాపాయిదిప్పపుడు పాకే వయసు.  బైట కనబడే చెట్టూ చేమా, పుట్టా గుట్టా రారమ్మని బుడతడినిప్పుడు తెగ ఊరిస్తున్నాయి. బుడ్డితండ్రి కి తల్లి కొంగు బంధనమయింది ! 


ఆ రోజు బ్రహ్మాండంగా వాన కురిసి వెలిసింది.  తూర్పుదిక్కున  కొండ కొమ్మున  ఏడు రంగుల ఇంద్రధనుసు  విరిసింది. పాపాయిని రారమ్మ ని పిలిచింది.  తల్లి గాఢనిద్రలో ఉన్న . సందు చూసుకుని బుడతడు చీరకొంగు అడ్డు తొలగించుకుని   కొండ కొమ్ము కేసి   పాకసాగాడు . వెనక నుంచీ తోకలా  అమ్మ చీరె కొంగు ముడి   . ఇంద్రచాపమెక్కి జారాలని బిడ్డడి హడావుడి  . ఆ తొందరలో  పసిబాలుడు కాలు జారి పాచిబండ సందునుండి  కింది నీటి సుడిగుండంలో  పడబోతున్నాడు. . జారిపడే భడవాయిని   చివరి గడియన   కాపాడింది అమ్మ నడుముకు చీరె చుట్టి  గట్టిగా వేసిన ... ముడి ! రెండు బండల సందున పడి  అమ్మచీరె కొంగుముడి బాలుడిని అలా కాపాడింది ! 


 అదే బుడతడు మరికాస్త ఎదిగాడు ఇప్పుడు . నాన్నతో ఆరుబయట పడుకుని ఉన్నప్పుడు ' నాన్నా! మనం పేద వాళ్లమా? 'అనడిగాడు. తండ్రి అగి ఆలోచించి ' కన్నా! మనం అందరికన్నా ధనవంతులం . అదిగో ఆకాశంలో కనిపిస్తుందే ఆ చందమామ..అచ్చంగా మనదే. అందులోని నిధులు నిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు. 'అయితే మరి నాకు సైకిలు కొనొచ్చుగా?' అనడిగాడు బుడతడు . 'పెద్దయిన తరువాత నీకు  రైలు కొనిద్దామని ఆగా .  ఇప్పుడే తెచ్చుకుంటే అప్పటికి  చాలవుగదా!' అన్నాడు నాన్న . ' అయితే నేను కూడా నీకు లాగే ఆఫీసు కెళ్లి డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు కొడుకు . 'మరి . . ఆఫీసు  పనికి  మంచి చదువు కావాలి. అందుకు బడికి ఎగనామం పెట్టకుండా పోవాలి' అన్నాడు తండ్రి. 


 పిల్లవాడు క్రమం తప్పకుండా బడికెళ్లి చదువుకుని ఓ ఉద్యోగంలో కుదురుకున్నాడు. పెళ్లయి ఓ బాబు పుట్టి పెరిగిన తరువాత ఓ రోజు అలాగే డాబామీద ఆరుబయట పడుకున్నాడు. పక్కనే  పక్కలో ని కొడుకు 'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా' అని ఆడిగేసరికి- ఆకాశంలోని చందమామ నవ్వుతున్నట్లనిపించింది.  నాటి తండ్రి ముఖం తలపుకొచ్చి  నేటి తండ్రి కళ్లలో  తడి కనిపించింది. 

 నిండుమనసుతో రెండు చేతులూ జోడించి మనస్సులోనే నమస్కారం చేసుకున్నాడు. ఒక చేయి అమ్మ చీరె కొంగు ముడికి. మరో చేయి తండ్రి ఇచ్చిన  రైలు బండికి .  


కన్నవారి తీయని తలుపులకు ఈ అంతర్జాతీయ అమ్మానాన్నల దినోత్సవాలే కావాలా? 


పేరెంట్స్ నీడ్ అవర్ ప్రెజన్స్... నాట్ అవర్ ప్రెజెంట్స్! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురణ - 26-01-2009) 

సాహిత్య వ్యాసం ఉత్తమ కథానిక రచనః కర్లపాలెం హనుమంతరావు



ఆధునిక సాహిత్యంలో ఆబాలగోపాలాన్ని అమితంగా ఆకర్షిస్తున్న ప్రక్రియ 'కథానిక'. 


ప్రచురించే పత్రికల సంఖ్య గణనీయంగా పెరగడం, సర్క్యులేషనుకి ప్రధాన ఆకర్షణగా మారడం, పాఠకుల  రసానందానికి స్వల్ప వ్యవధి  సరిపోవడం.. కథానికల ప్రాచుర్యత పెరగడానికి గల అనేక కారణాలలో కొన్ని ముఖ్యమైనవి. 


లోతైన సాహిత్యాభినివేశంతో నిమిత్తం లేదు.  కేవలం తీవ్ర ఆవేశం, గాఢపరిశీలనాసక్తి ఉంటే చాలు..  సాహిత్యరంగ ప్రవేశం చేయడానికి  కథానిక సులభ మార్గం. 


అక్షరాస్యులంతా కావ్యాలు, ప్రబంధాలే కోరుకోరు. సులభంగా అర్థమవుతూ, సత్వర మానసిక ఆనందానుభూతులకు దోహదం చేసే సాహిత్యానికే అత్యధికుల ఓటు.  


వారానికి కనీసం రెండు, మూడు ప్రచురణ అవుతున్నా వెలుగు చూడని కథానికలు పత్రికల  కార్యాలయాల్లో పేరుకుపోతూనే ఉన్నాయి! కథానికలకు ఆ స్థాయిలో పాఠకుల అభిమానం, రచయితల ఆదరణ ఉందీ కాలంలో. ఒక్క రాశిలోనే కాకుండా వాశిలోనూ తెలుగు కథానిక ఎన్నోరకాలుగా వన్నెచిన్నలు పోవడం  ఆనందించదగ్గ పరిణామమే!


రోజువారీ జీవితంలోని తొడతొక్కిళ్ళ నుంచి తాత్కాలికంగా అయినా ఉపశమనం కలిగించే వినోదప్రక్రియలు పుంఖానుపుంఖంగా పుట్టుకొస్తున్న ప్రస్తుత వ్యాపార వాతావరణంలోనూ కథానికకు అపూర్వ ఆదరణ లభిస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశం. వాస్తవజీవితంలోని అనుభవాలను, అనుభూతులను విపులంగా విస్తారంగా చర్చించే వీలున్న 'నవల' ఓ వంక అంతే దూకుడుతో ముందుకుపోతోన్నా.. ఉన్నంతలో సంక్షిప్తంగా  సమగ్రతకు లోటు రాకుండా విషయ విశ్లేషణ చేసే 'కథానిక' వైపుకూ పాఠకుడు మొగ్గు చూపడానికి మరేమైనా ప్రత్యేక కారణాలున్నాయా?


కథానిక ప్రధానంగా ప్రజాసాహిత్యం. రచయితదీ పాఠకుడిదీ ఒకే మేథోస్థాయి కావడం కథానికకు కలిసొచ్చే అంశం. కవిత్వంలోలాగా నియమ నిబంధనలేవీ  కథానిక నడకకు ప్రతిబంధకాలు కావు. చదివే కథ తనదో.. తన చుట్టూ గల సమాజానిదో అనే భావన కథానిక కలిగించినంత బలంగా సాహిత్యంలోని మరే ఇతర ప్రక్రియా  కలిగించలేదు. ఎంత కల్పన అయినా కథ సామాజిక  సరిహద్దులు అతిక్రమించలేదు. సాగతీతలకు, ముక్కు చుట్టూ తిప్పి చూపించడాలకు, విశ్లేషణల మిషతో సుదీర్ఘ చర్చలు సాగించడానికి   అవకాశంలేని స్థల, కాల పరిమితులు 'కథానిక'కు కలసివచ్చే బలమైన అంశాలు. 


అశ్వహృదయం ఔపోసన  పట్టిన యోధుడికి పంచకళ్యాణి వంటి గుర్రం పై స్వారీ అంత  స్వారస్యంగా   ఉంటుంది మంచికథతో  ప్రయాణమంటే.

స్వల్పవ్యవధానంలోనే కల్పాంతజీవితాన్ని  ఆవిష్కరించే గొప్ప శిల్పమున్న కథలకు మన తెలుగుభాష  గొడ్డుపోలేదు.  అందుబాటులో ఉన్న పరికరాలతోనే మనసులను అందలాల్లో ఊరేగించే అందమైన కథలకూ మనదగ్గర కరువు లేదు. కొండను అద్దంలో చూపించడమే కథానిక ఉత్కృష్ట లక్షణం  అనుకుంటే .. అ కళలో విశ్వస్థాయికి దీటుగా కలం నడిపిన తెలుగు కథకుల జాబితా అప్పటిలా  ఇప్పుడూ సశేషమే!


కథానికకు ఇంత ప్రత్యేకమైన స్థానం సాహిత్యంలో ఎందుకు ఉన్నట్లు? కుదింపు, మదింపు లక్షణాలవల్ల ఎన్నుకున్న అంశం మీదే ఏకాగ్రత నిలబడుతుంది. వేళకు ప్రయాణీకుణ్ణి రైలుకు అందించే జట్కాబండి గత్తర కథానికలోని ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షమవుతుంది . వట్టి వేగమేకాదు.. ఒడుదుడుకులేవీ లేకుంటేనే ఆ  ప్రయాణం ప్రాణానికి సుఖం. గోలీ పేలీ పేలకముందే పరుగందుకునే పందెపు ఆటగాడి చురుకుతనం కథానిక ప్రతి పదం పుణికిపుచ్చుకోవాలి. ఎత్తుగడ, నడక, ముగింపులో చదరంగంతో పోలిక కథానికది. ఆసాంతం చదివిన పాఠకుడి మానసిక ప్రపంచపు కొలతల్లో సగుణాత్మకమైన మార్పు సాధించగలిగినప్పుడే కథానికకు సార్థకత చేకూరినట్లు.   


మంచికథానిక మెదడుకు కళ్ళు మొలిపించాలి. మనసుకు కన్నీళ్ళు తెప్పించాలి.  సాధారణ జంతుజాలంతోనే వింత వింత విన్యాసాలు చేయించే సర్కస్ ప్రదర్శనలాంటిది కథానికా రచన. మామూలు పదాలే విచిత్ర భావాలుగా  కూడబలుక్కుని పాఠకుడి మానసం మీద చేసే రసదాడి కథానిక. 


ఎడ్గార్ ఎలెన్ పో దృష్టిలో కథంటే- స్వీయభావనలను పాఠకుడి మదిలో ముద్రించేందుకు రచయిత ఎన్నుకునే సహజసంఘటనల సంక్షిప్త కల్పిత సన్నివేశ మాలిక. ఫ్రెంచి కథారచయిత గైడీ మొపాసాకు కథంటే- నీరవ మానవ జీవన అగాథల్లోకి దూకి అక్కడ జరిగే యుద్ధాలను ఉత్కంఠభరితంగా చిత్రించడం. మొపాసా దృష్టిలో  కథానిక అంటే సమాజమనే అంశంమీద రాసుకున్న షార్ట్  హ్యాండ్ నోట్సు. సత్యాన్ని సూటిగా చెప్పడం మించిన మంచి కథావిధానం మరొకటి లేదంటాడు రష్యన్ రచయిత చెకోవ్. అనుభవానికి రాని సంఘటనలకు దూరం పాటించడం చెకోవ్ నిజాయితీకి నిదర్శనం.  ముగింపు, బిగింపుల మీదకు మించి  జీవితంలోని కొత్తకోణాలని అనూహ్యరీతిలో ఆవిష్కరించడంలోనే చెకోవ్ కి ఆసక్తి జాస్తి. 'అప్రస్తుతమైనది ఏదీ కథలో ప్రస్తావించరాదు' అనే  ప్రసిధ్ధ సూక్తి చెకోవ్ దే! సహజ సుందర సరళ ప్రాకృతిక వర్ణనలు కథానిక ‘కళ’నెలా పెంచుతాయో నిరూపించిన కథకుడు చెకోవ్. మొదలూ చివరా ముందే రాసి మధ్యభాగమంతా వంతెనలా నిర్మించడమే మంచికథ శిల్పరహస్యంగ  చెకోవ్ భావిస్తాడు. మామూలు మనుషుల మామూలు జీవితాలనుంచి యథాతథంగ  ఎత్తిరాసినట్లుండే సంఘటనలు సైతం చెకోవ్ మేధోకొలిమిలో పడి నిప్పులు విరజిమ్ముతాయి . చెకోవ్ ఒక్కో కథానిక ఎంతమంది కొత్తరచయితలను సృష్టించిందో లెక్కతేల్చడం కష్టం. 


మొపాసా అభిమాని సోమర్ సెట్ మామ్. అనుకోని సంఘటనలు అతని కథావస్తువులు. నాటకీయత పాలు జాస్తి. వినోదమే ప్రధాన ఎజెండా. ఒకే  తత్వానికే కట్టుబడని మనస్తత్వం. మానవ నైజం చుట్టూతానే మామ్ కథలు ప్రదక్షిణం చేస్తుంటాయి. సంప్రదాయం మీద తిరుగుబాటంటే  మొపాసాకు మహాఇష్టం. 'మనిషంటే మంచి చెడుగుల సమ్మిశ్రితం. సమస్యకు పరిష్కారం చూపించడం  రచయిత బాధ్యత కాదు. ఉపదేశాలు ప్రవక్తల పని. సాహిత్యేతర ప్రయోజనలకోసం రాయడమంటే రచనను దుర్వినియోగం చేయడమే!' ఇవే స్థూలంగా కథానికమీద మామ్ అభిప్రాయాలు కూడా . 


మన బుచ్చిబాబు 'ఉత్తమ పురుష' కథావిధానంమీద మామ్ ప్రభావమే ఉందని  విమర్శకులు అభిప్రాయపడుతుంటారు.


పడమటిదేశాల్లో కథానిక ప్రక్రియ మీద అమోఘమైన ప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. సన్నివేశ చమత్కారం ప్రధానంగా 'పో' కథలు రాస్తే.. హెన్రీ జేమ్స్, హాథరన్ ఆంతరంగిక జగత్తుమీద ధ్యాస ఎక్కువ పెట్టి కథలు రాశారు. దేశీయ వాతావరణంమీద దృష్టి చెదరకుండా బ్రెట్ హార్టే కథలు రాస్తే.. భాషలో బిగువు చూపిస్తూనే నిరలంకార శైలిలో మంచికథలు సృష్టించిన మహానుభావుడు క్రేన్.  ఓ. హెన్రీ కథలు కొసమెరుపుకి పెట్టింది పేరు.


దేశాల మధ్య సాంస్కృతిక హద్దులు చెదిరిపోయిన నేటి నేపథ్యంలో.. కళాకారులు విశ్వవ్యాప్తంగా పరస్పరం ప్రభావితమయే వేగమూ అమితంగా పెరుగుతున్నది. తెలుగు కథానికకూ ఈ సూత్రం మినహాయింపు కాదు. పాలగుమ్మి, చలం, విశ్వనాథ,  బుచ్చిబాబు, కొకు, రావిశాస్త్రి, మధురాంతకం, చాగంటి, కాళీపట్నంవంటి కథావశిష్టులు ఒక తరాన్ని ఊపేస్తే.. ఖదీర్ బాబు, పతంజలి,  వేంపల్లి, తుమ్మేటి, సలీం, పెద్దింటి అశోక్ కుమార్ వంటివారు ఇప్పటి తరాన్ని    మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. 


(ఏ తరంలోనైనా జాతిని ప్రభావితం చేసే సాహిత్యవేత్తల జాబితా సహజంగానే చాలా పెద్దదిగా ఉంటుంది. అందరి పేర్లు సోదహరణంగా ఉటంకించే  సమయం, సంధర్భం, స్థలం, కాలం, సావకాశం లేనికారణానే స్థాలీపులాకన్యాయంగా ఏ కొద్దిమందినో  స్మరించుకోవడం జరిగింది తప్ప.. మిగతా గొప్ప కథారచయితలను తక్కువచేసి చూపడంగా దయచేసి సహృదయ రచయితలు అపార్థం చేసుకోరాదని  మనవి)


కథలు ఎలా రాయాలి? అన్న విషయంలో  భిన్నాభిప్రాయాలెన్నైనా ఉండవచ్చు. కానీ , 'ఎందుకు రాయాలీ?' అనే విషయంలో మాత్రం ప్రజాపక్షం వహించే సాహిత్యవేత్తలందరిది ఒకే అభిప్రాయం. 


చలం, కొడవటిగంటిలకు వాస్తవికతే కథకు ప్రధానం. గ్రీకుల కళాదృష్టికి దగ్గరి అభిప్రాయం ఇది. భారతీయుల కళాదృష్టికి కాస్తంత విభిన్నమైనది ఈ ధోరణి. అగోచరాన్ని ఆవిష్కరించడమే నిజమైన కళాప్రయోజనంగా భావించడం భారతీయుల కళాతత్వం. భూసారాన్ని గ్రహించి భూమినే అంటిపెట్టుకుని ఉన్నా చిటారుకొమ్మను చేరి పరిసరాలను పరిమళభరితం చేస్తేనే కదా  ఏ కుసుమాలకైన బతుకు సార్థకం! కళ కూడా  కసుమ సమానమే మరి  భారతీయులకు భావనలో!


వినోదమే ప్రధానమనుకునే కథలు ఆట్టేకాలం నిలబడడం కష్టమే! రసానందానికి సంస్కారమూ జతకూడినప్పుడే 'కథ' కాలానికి ఎదురొడ్డి నిలబడేది. తొలినుంచీ ‘తూర్పు’ వివిధ సంస్కృతులకు సంగమస్థానంగా వెలుగొందుతూ వస్తున్నది.  పాశ్చాత్యులకు లేని సమన్వయ దృష్టి అందుకే  ప్రాచ్యసాహిత్యానికి  అవసరమయింది. భారతీయసాహిత్యం ప్రారంభంనుంచి వైవిధ్యానికి ప్రతిబింబప్రాయంగానే ప్రకాశిస్తూ వస్తున్నది.  తెలుగు సాహిత్యంలో కథానిక హాలుని కాలంనుంచి  ఈ బహుముఖత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది. 


మంచికి, అందానికీ మధ్య విరోధమేమీ లేదు కదా! తుక్కును బంగారంగా మార్చే విద్య వాస్తవికంగా ఉందో లేదో గానీ.. సాహిత్యప్రపంచంలో మాత్రం ఆ రసవిద్య నిస్సందేహంగా   చెల్లుబడిలో ఉంది. కథలకు ఉండవలసిన ప్రధాన లక్షణం. . ఈ రసవిద్యలో బహుముఖ  నైపుణ్యం ప్రదర్శించడమే!

 

రసానందమా? సమాజ శ్రేయస్సా? కథకుండవలసిన అంతిమ లక్ష్యం ఏది? అన్న వాదనే సహేతుకమైనది కాదు. కథానిక (ఆ మాటకొస్తే ఏ ఇతర సాహిత్య ప్రక్రియ అయినా సరే) నాలుగు రాస్తాల కూడలి మధ్యలో నిలబడిన 'సైన్ బోర్డు' లాంటిది. ఫలకంమీది అక్షరాలు కొట్టొచ్చినట్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటేనే బాటసారుల దృష్టిని ఆకట్టుకునేది. ఫలకం ప్రయోజనం సిద్దించేది. ఫలకం అందంగా ఉందికదా అని.. పెకిలించుకొని తెచ్చి ఇంటి పెరట్లో నాటుకుంటానంటే! 


రసానందానికి సామాజిక హితానికి మధ్య వేసిన అందమైన బంధమే కథానిక. (ఇతర సాహిత్య రూపాలకూ ఈ సూత్రం వర్తిస్తుంది). సానలు తీరిన వజ్రం ఒక్కో కోణం నుంచి ఒక్కో రంగును వెదజల్లినట్లు చిత్రిక పట్టిన కథ ఒక్కో చదువరికి ఒక్కో విధమైన అనుభవాన్ని అందిస్తుంది. 


ఏతావాతా తేలేదేమంటే.. తాత్విక దర్శనం, నైతికావేశం, సొందర్యదృష్టి నుంచి  మళ్ళకుండా, దైనందిక జీవితమో, పరిసరాల పరిశీలనమో, ఔన్నత్యం కోసం చేసే పోరాటమో.. ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలనుంచి  నిజాయితీగా గ్రహించిన కథావస్తువును.. సంక్షిప్తీకరించో, యథాతథంగ  కానీ, చిలవలు పలవులుగా పెంచో.. సరళంగ, సరసంగ, సహజంగ, సుందరంగ.. సమగ్రతకు లోటు లేకుండా.. సూటిగ, తేటగా, చమత్కారంగ ఎత్తుగడ, మధ్యనడక, ముగింపులు చెడకుండ ఎక్కడా ఉత్కంఠ సడలకుండ పాఠకులచేత చదివించి.. చివరికి కలకాలం నిలిచే రసానందం అందించగలిగితే.. అదే ఉత్తమ కథానిక!


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం ధనమంత్రం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18-07-2009 )


 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

ధనమంత్రం

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18-07-2009 ) 


 ' ధన మూలం ఇదం జగత్' . కనుకనే కనకాన్ని తాను స్వీకరించాడు జగన్నాటక సూత్రధారి. ఒక్కో కొమ్ముకి ఇరవై బంగారు కణికలు చొప్పున కట్టి ఉన్న ఇరవైవేల గోవులను 'బ్రహ్మర్షి' అని నిరూపించుకున్నవారికి బహుమానంగా ఇస్తానని త్రేతాయుగంలోనే జనక మహా రాజు ప్రకటించాడు. మనిషికి మనీతో ఉన్న లంకె అంత బలమైనది .


'ఇమ్మనుజేశ్వరాధములకు తన కావ్య కన్యకను అమ్మను .. పొమ్మన్న బమ్మెర పోతన్న  లాంటివారు  నూటికో కోటికో ఒక్కరుంటారేమోగానీ... ' సహసా విదధీతిన క్రియాం' లాంటి చక్కని పద్యాన్ని కూడా అవసరానికి అమ్ముకోక తప్పని భారవిలాంటి భాగ్యహీనులే భూమ్మీద అధికం! 

హరిశ్చంద్రడంతటి చక్రవర్తి భార్యను అంగట్లో పెట్టాడు! దైవత్వం కన్నా ధనతత్వమే ప్రధానంగా మారిందన్నది సుస్పష్టం.


'డబ్బుంటే ఏనుగుకన్నా ఎలుకే బలమైనద'ని చైనా సామెత. 'చింతామణి పత్రిక' పోటీ పెట్టకుంటే 'హేమలత'  వంటి చారిత్రక నవలలు రాసుండేవారేనా !' అంటాడు చిలకమర్తి. 


నిజాం నవాబుకి డబ్బు పెట్టెలు తలగడ దగ్గర పెట్టుకొని పడుకునే అలవాటు. ఎలుకలు కొట్టేసిన ఆ నోట్ల విలువే ఈ రోజు లెక్కల ప్రకారం సుమారు ఐదువేల కోట్లన్నది నమ్మలేని నిజం.


'మనిషికి జంతువుకీ తేడా డబ్బు ఇబ్బందులే' అంటాడు మార్క్ ట్వయిన్ . 'పూర్' స్పెల్లింగులోనే రెండు గుండు సున్నాలున్నాయి. ద్వాపరంలోనైనాసరే, సొమ్ముల్లేకుండా సంసారం నడపడం కష్టం. కాబట్టే  కుచేలుడు కృష్ణుణ్ణి ఆశ్రయించడం ! .


కాణీ కిందపడ్డా వంగి తీసుకోనివాడు మనిషే కాడు. ధారంలేకుండా దండను అల్లవచ్చేమోగానీ, పైసలు లేకుండా బతుకు బండిని నడపటం కష్టం. మహాత్మా గాంధీ మేకపాలు, వేరుశనగపప్పులకే జమునాలాల్ బజాజ్ జేబులో నుంచి రోజుకు ఓ వెయ్యి ఖర్చయ్యేదని సరోజినీదేవి నాయుడు సరదాగానే అన్నా అందులో కొంత నిజం లేకపోలేదు. 


కాసులకింత కథుంది కనకనే అప్పిచ్చేవాడు  లేని ఊరుకెప్పుడూ వెళ్ళొద్దని హెచ్చరించాడు సుమతి శతకంలో. డబ్బుంటే ఇంకేమీ చేయనక్కర్లేదనే ధోరణి పెచ్చుపెరిగిపోతోంది.


డబ్బులకోసం ఇక్కడ పార్టీలు టిక్కెట్లమ్ముకుంటున్నాయి. పాఠశాలలు సీట్లమ్ముకుంటున్నాయి. పార్లమెంటులో ప్రశ్నలు  అమ్ముకుంటున్నారు. పంతుళ్ళు పోస్టల్ బ్యాలెట్లమ్ముకుంటున్నారు . పేరెంట్స్ మగపిల్లకాయల్ని కట్నానికమ్ము కుంటున్నారు. అడవి బిడ్డలు ఆడబిడ్డలను, అభాగ్యులు కిడ్నీలనూ, రక్తాన్ని అమ్ముకుంటూనే ఉన్నారు. దేవుడి విగ్ర హాలను, భూములను, దర్శనాలను, ప్రసాదాలను చివరికి హుండీలో పడిన డాలర్లను కూడా వదలకుండా పెద్దలు అమ్ముకుంటున్నారు. నకిలీ నోట్లు, వీసాలు, డిగ్రీ సర్టిఫికెట్లు తక్కెడలో పెట్టి మరీ అమ్మటానికి  తయారుగా ఉన్నారు.  


ప్రభుత్వం భూములనమ్మేసింది. కేంద్రు ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాలను అమ్ముకోవాలనుకుంటుంది. 


అమ్మకాలే అన్నిరకాల సంస్కరణలకూ మూలమని అందరూ బలంగా నమ్మే రోజులు ముంచుకొచ్చేస్తున్నాయి. 


ఐపియల్ వచ్చి క్రికెట్టాటని అంగడి సరుకుగా మార్చేసింది . పెళ్ళిని కూడా ఈ మధ్య ఓ బాలీవుడ్ తార ప్రాయోజిత కార్యక్రమం కింద అమ్మేసుకుం ది. పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ చావుకూడా కొన్ని వర్గాలకు కనకవర్షం కురిపించే స్కీములుగా మారిపో వటం ఈ శతాబ్దపు విచిత్ర  విషాదం.


కిలో సన్నబియ్యం యాభై, కందిపప్పు దాదాపు వంద రూపాయల దాకా అమ్ముతున్నారు. కొందరు టీచర్లు ఎక్కడినుంచో వచ్చిన యవ్వన గుళికలను బళ్ళు మానేసి ఊళ్ళెంట తిరుగుతూ కమీషన్లకు అమ్ము కుంటున్న వైనం ఈ మధ్య నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో బైటపడింది.


ధనసంస్కృతి పెచ్చుమీరితే మధ్యతర గతి బతుకులు ఎలా నలిగిపోతాయో ఇంగ్లీషు నవలా రచయిత ఆర్ధర్ మిల్లర్ అరవైఏళ్ళ కిందటే ' డెత్ ఆఫ్ ఏ సేల్స్  మాన్ ' నాటికలో చక్కగా చెప్పి హెచ్చరించారు.  నెహ్రూ జమానాలో విదే శాంగమంత్రిగా పనిచేసిన ఎమ్.సి చాగ్లా తన ' రోజెస్ ఇన్ డిసెంబర్'లో కూడా దాదాపు ఇదే ప్రమాదాన్ని కళ్లకు కట్టాడు. సరఫరాకు గిరాకీకి సంబంధంలేని వస్తువు లను ఉత్పత్తి చేసి  వాటి వినియోగ వ్యవస్థల  విస్తరణకు పెట్టుబడిదారీ వర్గాలు అల్లే ప్రచార వ్యూహంలో పడే సటు జీ వి- జీవితావసరాలు కాని వాటిని కూడా  సొంతం చేసుకునేందుకు తపించిపోతాడో స్త.. అవి పొందని పక్షంలో జీవితేచ్ఛకు  ఎలా  నీళ్లు వదులుకుంటూగా ఆ పుస్తకం సవిస్తరంగా చెప్పుకొస్తుంది. ఇప్పుడదే నిజమవుతూ ఉంది. 


ఇష్టమైన చెప్పులు కొనలేదని ఓ పాష, మంచి విశ్వవిద్యాలయంలో చేర్పించలేదని మరో అమ్మాయి తమ నిండుప్రాణాలను బుడగలో గాలి తీసినంత తేలికగా తీసుకున్నారు . వేసే భిక్షానికి కనీసం రూపాయి  తగ్లకుండా  ఉండాలని తమిళనాట ఓ అడుక్కునేవాల్లా సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుండటం దీనికి కొసమెరుపు


- రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18-07-2009 ) 

నాన్నగారూ! నన్ను క్షమించండి!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు (నవ్య వారపత్రికలో ప్రచురితం)


గోపాలకృష్ణయ్యగారు వణికే చేతుల్తో ఆ కాగితం మడతలు విప్పారు. అక్షరాలు అలుక్కుపోయినట్లున్నాయి. కూడబలుక్కుని చదువుకోడం మొదలుపెట్టారు గొణుక్కుంటున్నట్లు.

ప్రియమైన నాన్నగారికి,

నమస్కారం. నేనిలాంటి ఉత్తరం రాయాల్సొస్తొందని కలలో కూడా అనుకోలేదు. కానీ.. రాస్తున్నాను. లోకంలో ఏ కొడుకూ తండ్రికి రాయకూడని విధంగా రాస్తున్నాను. నన్ను క్షమించండి!

నన్ను కని అమ్మ కన్ను మూసినప్పటి నుంచి నాకన్నీ మీరే అయి పెంచారు. తాతయ్య మీకు మరో పెళ్లి చేస్తానని పంతంపట్టినా, సవతి తల్లొస్తే నన్నెక్కడ సరిగ్గా చూసుకోదోనని మరో పెళ్ళికి మొరాయించిన మంచి నాన్న మీరు. అమ్మ బతికున్నా  మీ అంత బాగా చూసుకునేదో లేదో తెలీదు. పదేళ్ళు వచ్చినా మీరే నాకు వళ్లు రుద్ది స్నానం చేయించేవారు. నా కిష్టమైనవన్నీ చేసి దగ్గరుండి కడుపు నిండా తినిపించేవారు. మంచి బట్టలు వేసి, శుభ్రంగా తయారుచేసి బడిదాకా వచ్చి దిగబెట్టేవారు. గేటు  దగ్గర నిలబడి లోపలికి పోనని నేను మారాం చేస్తే 'బాగా చదువుకోవాలి. పెద్ద ఇంజనీరవాలి. అప్పుడే మంచి పెళ్లామొచ్చేది. మనింట్లో అమ్మ లేదు కదా! అప్పుడు నీ పెళ్లామే నాకూ, తాతయ్యకూ అమ్మ అవుతుందంటూ.. 'ఏవేవ్ తమాషా కబుర్లు చెప్పి లోపలికి పంపించేవారు.

క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చి స్కూల్ ఫంక్షన్ లో నేను ప్రైజ్ తీసుకోడానికి స్టేజ్ మీదకు వెళుతుంటే చిన్నపిల్లవాడిలా సంబరపడిపోయేవారు. 'మీకు కష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని ఒట్టేసుకున్నాను' అప్పట్లో. ఆ ఒట్టు తీసి ఇప్పుడు గట్టు మీద పెట్టేస్తున్నాను. నాన్నగారూ! నన్ను క్షమించండి!

సెవెన్త్ గ్రేడులో జిల్లా ఫస్టొచ్చినప్పుడు మీరు కొనిచ్చిన 'ప్రసాద్' మార్క్ పెన్నుఇంకా నా దగ్గరే భద్రంగా ఉంది. దానితోనే రాస్తున్నాను ఈ ఉత్తరాన్ని. మధ్యలో కొన్ని రోజులు శ్రావణి అడిగిందని ఇచ్చా. కానీ, తను మళ్లా తిరిగిచ్చెసిందిలే! శ్రావణి ఎవరనుకుంటున్నారు కదూ! అక్కడికే వస్తున్నా! ఆ సంగతి చెప్పడానికే ఈ ఉత్తరం నాన్నగారూ!

తను టెన్త్ లో నా క్లాస్ మేట్. ఇంటర్ లో పోటీ. గ్రూప్ లో ఫస్ట్ ర్యాంక్ కోసం ఇద్దరం కొట్టుకు చచ్చేవాళ్లం. నేను ఎం.పి.సి తీసుకుని ఐ. ఐ. టి చెయ్యాలని మీ కోరిక. మొదటి సారి మీ మాట కాదన్నాను. బైపిసి కెళతానని మారాం చేశాను. శ్రావణి బైపిసి కెళ్ళింది. అందుకే ఆ గోల. అప్పుడు మీకు చెప్పలేదు. ఎమ్.సెట్ చేసే రోజుల్లో గవర్నమెంట్ సీటంటే ఏదో తంటాలు పడతా. కానీ, ప్రయివేట్ కాలేజీ అంటే నేను పడలేనుర!' అని రోజుకో సారి హెచ్చరించేవారు మీరు. 'మంచి రేంకు తెచ్చుకుంటా'నని ప్రామిస్ చేశాను. మంచి రేంకే వచ్చినా కాకినాడ కాలేజీలో డొనేషన్ కట్టయినా చెరాల్సిందేనని మొండికేశాను. ఎందుకో తెలుసా నాన్నగారూ? శ్రావణి కొచ్చిన రేంకుకు అందులో మాత్రమే సీటొచ్చింది మరి. ఎక్కడ క్లాసు పీకుతారొనని ఆ విషయమూ మీకు చెప్పలేదు.'

పక్కగదిలో అలికిడయితే ఓపికచేసుకుని  లేచి వెళ్లి చూసొచ్చారు గోపాలకృష్ణయ్యగారు. మళ్లా ఉత్తరం చదువుకోడం మొదలుపెట్టారు.

 

'.. సాదర ఖర్చులకని డబ్బవసరమయితే హాస్టల్ ఛార్జీలు పెంచారనీ, బుక్సనీ, పరీక్ష ఫీజులని ఏదో ఓ వంకతోడబ్బులు పంపమని డిమాండ్ చేస్తుంటే.. ఒక్కసారైనా మీరు 'ఎందుకురా ఇంత డబ్బు?' అని ఆరా తీయలేదు. ఎంత తంటాలు పడేవారో! టంచన్ గా టి.ఎం.ఓ వచ్చేది! అంత పిచ్చిప్రేమ మీకు నా మీద. శ్రావణి మైకంలో పడి కొట్టుకుపోయే నాకు అవేమీ పట్టేవికాదు అప్పట్లో.

 

ఆమె ఫాదర్ ఇన్-కంటాక్సులో ఓ పెద్ద ఆఫీసర్. అందుకు తగ్గట్లే ఉండేవి ఆమె సరదాలు. తన ముందు తేలిపోకూడదని నేనూ తలకు మించిన భారం మోసేవాడిని. శ్రావణి ప్రేమ కోసం నేను పడని పాట్లు లేవు నాన్నగారూ! అందులో సగమైనా స్టడీస్ మీద చూపించుంటే ఫస్ట్ ఇయర్ అలా పోయేది కాదు. శ్రావణి ఒకేడు ముందుకు పోయిందని నేనేడుస్తుంటే.. అదంతా పరీక్ష పోయినందుకని ఓదార్చారు మీరు. అప్పుడైనా చెప్పలేదు అసలు సంగతి. శ్రావణి ఒక్ ఇయర్ సీనియర్ అయిపోయినా మా మధ్య స్నెహం చెదరలేదు సరికదా.. ప్రేమగా మారింది. మా ఎఫైర్ గురించి లోకమంతా కోడై కూస్తున్నా మీ చెవి దాకా రాలేదు. వచ్చినా 'ఛఁ! మా శీను అలాంటి వాడు కాదని కొట్టిపారేసేవాళ్లే మీరు. మీ పిచ్చి ప్రేమ సంగతి నాకు తెలుసు కదా! దానికి ఆకాశమే హద్దు'

గ్రాడ్యుయేషన్ అయి పి.జిలో చేరంగానే శ్రావణి తెచ్చి మీకూ తాతయ్యకూ చూపించి 'ఇదిగో 'నాన్నగారూ! మీ అమ్మ!' అని సర్ప్రైజ్ చెయ్యాలని నా పిచ్చి ఆలోచన.

అన్నీ మనమనుకున్నట్లే అయిపోతే మధ్యలో దేవుడెందుకూ? శ్రావణి హౌస్ సర్జన్ లో ఉండగానే వాళ్లింట్లో పెళ్లి యావ ప్రారంభమయింది. తను వాళ్ల డాడీకి నా గురించి చెప్పింది. నన్ను తీసుకుని వెళ్లి పరిచయం చేసింది. శ్రావణివాళ్ల డాడీ మా డాడీలాగా కాదు నాన్నగారూ! చాలా ప్రాక్టికల్. "ప్రేమ అనేది ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య వ్యవహారం. అది పెళ్లి దాకా రావాలంటే రెండు కుటుంబాల మద్దతు అవసరం శ్రీనివాస్! నా దురదృష్టం కొద్దీ శ్రావణి మా బాస్ కొడుకు కంట్లో పడింది. నో అంటే నా కెరీర్ క్కూడా 'రిస్క్'. ఈమెకు కాక ఇంకో ఇద్దరు ఆడపిల్లలకు కూడా పెళ్లిళ్లు చేయాలి నేను. నా పొజిషన్ లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు.. నేనూ అదే చేస్తాను' అన్నాడు ఆయన. నేనేమీ చెప్పక ముందే తను చేయాల్సింది చేసేశాడు. బాస్ కొడుకుతో నిశ్చితార్థం సంగతి తెలిసి అడుగుదామని వెళితే ఆ ఇంట్లో అందరూ 'ఔటాఫ్ రీచ్'. పెళ్లయిన మర్నాడు రాత్రి శ్రావణి ఫోన్ చేసి 'సారీ! శీనూ! పెద్దాళ్ల మాట కాదనలేకపోయాను' అని ఒక ముక్క చెప్పి లైన్ కట్ చేసేసింది.

శ్రావణి కోసం నేను కొన్ని తొమ్మిదేళ్ల బట్టీ వందల కొద్దీ అబద్ధాలు చెబుతూ వచ్చాను. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇంకొక్కసారి.. చివరిసారి..  ఇబ్బంది పెట్టక తప్పడం లేదు నాన్నగారూ! నన్ను క్షమించండి!

 

నా చిన్నతనంలో మన పెరట్లోని జామకాయల కోసం చెట్టెక్కినప్పటి సంగరి గుర్తుకొస్తోంది. చెట్టైతే ఎక్కాను గానీ.. దిగడం రాక ఏడుస్తున్నాను. మీ రొచ్చి 'దూకు! నేను పట్టుకుంటాను!' అని భరోసా ఇచ్చారు. మీ మీది నమ్మకంతో దూకేశాను. మీరు పట్టుకోలేకపోయారు. మోకాలు చిప్పలు పగిలి ఏడుస్తుంటే కట్టు కట్టించి 'నీకు నువ్వే దిగడం వచ్చు అన్న ధీమా వచ్చిందాకా ఎక్కకూడదురా శీనూ!' అన్నారు. ఇరవై ఏళ్ల తరువాత సరిగ్గా మళ్లా అదే పొరపాటు చేశాను నాన్నగారూ! వంటికి తగిలిన దెబ్బయితే మందు వేసుకుని మానిందాకా ఓ మూల ముసుగేసుకు పడుకోవచ్చు. ఇది మనసుకు తగిలిన దెబ్బే! తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నాన్నగారూ! చిన్నప్పుడు మీరు నన్ను పట్టుకోకుండా వదిలేశారు కదా! నేనిప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను. చెల్లుకు చెల్లనుకోండి.. క్షమించండి నాన్నగారూ!

ఇన్నేళ్లు దాచిపెట్టి ఇదంతా ఇప్పుడే ఎందుకు చెబుతున్నావని మీరడగవచ్చు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పే ఛాన్స్ నాకు లేదు నాన్నగారూ! నేనేమీ చెప్పకుండా సైలెంటుగా వెళ్లిపోతే నా ఓటమికి కూడా మిమ్ములను మీరు బాధ్యులను చేసుకుని కుమిలిపోతారు. మీ పెంపకంలోని లోపం అనుకుంటారు. అది తప్పు. 'లోకంలోని ఏ తండ్రీ.. ఆ మాటకొస్తే.. తల్లీ.. తన బిడ్డను ప్రేమించలేనంత గొప్పగా మీరు నన్ను ప్రేమించారు.' ఇది చెప్పడానికే ఈ చివరి ఉత్తరం రాస్తున్నాను. ఈ సారు జన్మలో మళ్లీ మీకే కొడుకుగా పుట్టి నా తప్పుల్ని సరిదిద్దుకొంటా! ..గాడ్ ప్రామిస్! ఉంటా .. టాటా! తాతయ్యకూ నా నమస్కారాలు , క్షమాపణలు తెలియచేయండి!'

ఇట్లు

ప్రేమతో

శ్రీనివాస్

పోలీసువారికి సూచనః నేను కృష్టలో స్నానానికని పోతున్నాను. తీరానికి తిరిగొచ్చేది నా నిర్జీవమైన నా శరీరమే! అనవసరంగా ఎవరినీ విసిగించవద్దని ఆఖరి మనవి!

శ్రీనివాస్

---

నలిగి మాసిపోయి మడతలు దగ్గర పట్టుకుంటే చిరిగిపోయేటంతలా చీకిపోయినా ఆ పాత ఉత్తరాన్ని మళ్లా భద్రంగా మడతలు పెట్టి టేబుల్ సొరుగులో దాచి లేచారు గోపాలకృష్ణయ్యగారు నిట్టూరుస్తూ.

ఏడవడానికి ఆయన కళ్లలో నీళ్ళు లేవు ఇప్పుడు. తొంభై ఏళ్లు దాటిన పండు ముదుసలి ఆయన ఇప్పుడు.

గోడ మీద ఉన్న దందేసిన ఫొటోలో నుండీ శ్రీనివాస్ చిరునవ్వుతో చూస్తున్నాడు.

'నీకేంరా నాయనా! నవ్వుతాలుగానే ఉంటుందిప్పుడు. ఏడాది కిందట నువ్వు క్రిష్ణాలో పడ్డావు. మీ నాయన కోమాలో పడ్డాడు. నీ ఉత్తరం చదువుకొనేందుకు వాడెప్పుడు స్పృహలో కొస్తాడో తెలీదు. నువ్వంటే జన్మనిచ్చిన తండ్రిన పున్నామ నరకానికి వదిలేసి పోయావు కానీ, జన్మనిచ్చిన పుణ్యానికి నేను నా కొడుకుని ఇట్లా అర్థాంతరంగా వదిలిపోలేను కదా! కొడుకుతో సేవలు చేయించుకొనే వయసులో కొడుకుకు సేవలు చేయమని భగవంతుడే నా నొసటన రాసి పెట్టాడు. భగవంతుడు కాదు.. నువ్వే రాసి పెట్టి పోయావురా మనవడా!' అని గొణుక్కుంటూ కోమాలో పడివున్న కొడుకును చూసేందుకు పక్కగదిలోకి వెళ్లారు గోపాలకృష్ణయ్యగారు.

-కర్లపాలెం హనుమంతరావు

(నవ్య వారపత్రికలో ప్రచురితం)

భాషా చరిత్ర: సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ ప్రయాస ఎందుకు విఫలమైందంటే! - కర్లపాలెం హనుమంతరావు

 భాషా చరిత్ర: 

సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ ప్రయాస ఎందుకు విఫలమైందంటే! 

- కర్లపాలెం హనుమంతరావు 


తెలుగులో ఉన్న అనేక నిఘంటువులలో సూర్యరాయాంధ్ర నిఘంటువూ  ఒకటి.  ఇది  సాకారమయే దిశగా  

ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు  పడిన శైశవ ప్రయాస  వరకు ఈ వ్యాసం పరిమితం. 


తెలుగు భాషలోని శబ్దజాలం యావత్తూ    రూప, అర్థ భేదాలతో  సహా  సర్వ సమగ్రంగా, సప్రమాణికంగా  ప్రదర్శించే   ఒక బృహన్నిఘంటువు  అవసరమయిన కాలం అది.    ఆ బాధ్యతను  ఆంధ్ర సాహిత్య  పరిషత్తు స్వచ్ఛందంగా స్వీకరించడం పరిశోధకులకు, భాషాభిమానులకు ఆనందం కలిగించింది.  1939 లో అజాది పదాల సంగ్రహంగా  మొదటి భాగం వెలువడినప్పుడు  లోపభూయిష్టమైన ఆ అరకొర ప్రయత్నం   ఆశాభంగమూ  కలిగించింది. 

 ప్రథమ ప్రయత్నమే  అభాసుపాలవడంతో  తదనంతర ప్రణాళిక యావత్తూ పరిషత్తువారి అటకెక్కడానికి కారణమైన లోపాలు కొన్ని పరిశీలిద్దాం. 

  

తత్సమ, దేశ్య, వికృతి పదాలతో కలగలసిపోయిన భాష  మన తెలుగు భాష.  దాని ఆద్యంతాల అంతు తేల్చడం అనుకున్నంత  సులువుగాదన్న సత్యం పరిషత్తుకు అనుభవం మీదగాని తలకెక్కింది కాదు.     

భాష  సమగ్రరూపం పైన అవగాహన - అంటే  ఏ పదం ఎక్కడ ఏ విధంగా పుట్టి ఎట్లా కాలానుగుణంగా  మార్పుచెందుతూ .. సాటి భాషాపదాలను  ఏ విధంగా ప్రభావితం చేసిందో  అర్థం చేసుకోవడం. 


ఎంతో మంది పండితులు ఎన్నో ఏళ్లుగా శ్రమించి  అపారమైన   ధనం వెచ్చించీ .. తగిన సాధన సామాగ్రి లభ్యత కొరత  వల్ల నిఘంటు నిర్మాణ ప్రక్రియను మధ్యంతరంగా విరమించుకొన్నట్లు  పరిషత్తువారే  స్వయంగా ప్రకటించుకున్న వైనం గమనించ దగ్గది.  నిఘంటువు  ప్రథమ ప్రయత్నం తరువాతా  భాషలోని మునపటి అసమగ్రతకు  వీసమెతైనా చేటు కలగలేదు.   ఈ మొదటి ప్రయత్నం ఏ స్థాయిలో  విఫలమయినట్లో  ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. 


లోపాయి  స్థాలీపులాక న్యాయంగా: 

 

నాటి కాలపు మహా పండితులుగా గుర్తింపు పొందిన కీ.శే  జయంతి రామయ్య పంతులుగారు అన్నట్లుగా  భారతంలో గల  వేలపదాలలో కనీసం వంద శాతం అయినా  ఈ నిఘంటువులో  చోటు చేసుకోలేదు.  మహాభారతంలో కనిపించే అంజలికము , అంపపెట్టు వంటి   సుమారు 500 పదాలు  అబ్బరాజా సోదరులు నిర్మించిన భారత నిఘంటువులోనివే  పరిషత్తువారి నిఘంటువులో  కనిపించకపోవడం ఇందుకు ఉదాహరణ. వీలును బట్టి కొత్త శబ్దాలను కూడా పరిణనలోకి తీసుకోవలసిన అగత్యాన్ని నిఘంటువు వాటిని విస్మరించింది.  పంతులుగారి  తరహాలోనే ఇతరులు  ఎత్తి చూపిన  లోపాలలోని  ఒకటి రెండు మాత్రమే ఇక్కడ ఉదాహృతాలు.  ఇంత రసాభాసా అజాది ప్రారంభ విభాగ ప్రయాసలోనే!  


పంతులుగారే   మరో చోట అన్నట్లుగా  ఉపసర్గ  శత్రంతాది పదాలు  సైతం  తృణీకరణకు గురి అయిన సందర్భంలో దీనిని నిఘంటువుగా గుర్తించడం కుదరని పని. 


భారతమనే కాదు; చాలినన్ని కావ్యాలకు ఈ అపరిగ్రహీత దోషం అంటగట్టిన ఘనం ఈ  నిఘంటువు ది. శాస్త్రార్థం ఒకటి రెండు: 


పాండురంగ మాహాత్మ్యం ప్రస్తావించే అథ: ప్రపంచము, భీమేశ్వర పురాణంలోని అట్టహాసము, కాశీ ఖండవలు  తాలూకు  అనాక ,  హరవిలాస పాస్తావిత  అనాదల , క్రీడాభిరామం ప్రవచించిన  ఇరుచంబడు.. ఇట్లా ఎన్ని పదాలనైనా  చెప్పుకుపోవచ్చు.  


దేశ్య పదాలకూ ఇదే దుర్గతి. ఆంధ్ర పండితులకు తెలుగు భాష పట్ల చులకన.  కండగల చిక్కని తెలుగు పదాలు కాలగర్భంలో కలసిపోవడానికి ఈ తరహా పండితుల మితిమీరిన సంస్కృత భాషా మమకారమే కారణం.  'తెలుగు వాళ్లకు 'దీపము ' తెలీదు; పాపపుణ్య వివేచన లేదు.  దేవుడును ఎరుగరు- అన్న నానుడి వూరికే రాలేదు. దీపం, పాపపుణ్యాలు , దేవుడు దేశ్య పదాలు ( తెలుగు పదాలు) కావడమే  కారణం. 


అచ్చు తెలుగు పదాలను జల్లెడ  పట్టాలంటే దేశ సంచారం అవసరం. సాధారణ జనంతో సంపర్కం వినా చక్కలి తెలుగు నిఘంటువు కూర్పు అసాధ్యం. నిఘంటువు నిర్మాతలు  తాము తయారుచేసుకున్న పట్టికలను జనసామాన్యం ముందుపెట్టి అందులో లేని పదాలను నిరపేక్షంగా స్వీకరించినప్పుడే  ఆశించిన సమగ్రతకు అర్థం చేకూరేది. 


తెలుగు భాషలో లేవని తాము  భ్రమించిన పదాలకు తత్సమాల పేరిట  సంస్కృతాది పరభాషల  నుంచి బలవంతంగా ఈడ్చుకువచ్చినందు  వల్లనే  నిఘంటువు తన సహజతను కొల్పోయింది.     


అబ్బరలు  అనే తెలుగు పదానికి ఇతరములు అనే పదం దాదాపు స్థిరపడిపోయిందిప్పుడు! అతకం అనే అచ్చుతెలుగు పదానికి ప్రాత: అనే సంస్కృత విశేషణంతో  చెప్పులు అనే ఉత్తరాది భాషాపదాన్ని సంధించి ప్రయోగించడం .. ఇందుకు ఉదాహరణలు.  ఎయిర్ హోస్టెస్ కు గగన సుందరి, యూనిఫాం అనే పదానికి ఏక వస్త్రం వంటి ( వి ) కృత పదాలు పుట్టుకు రావడానికి కారణం - తెలుగును ఉద్ధరిస్తున్నట్లు  భావించే    కొన్ని ప్రముఖ మాధ్యమ సంస్థలు     సైతం ఇదే ధోరణి ప్రదర్శించడం. 


 ఏక పదాలు, కొన్ని పదాల సంయోగంతో ఏర్పడే  కొత్త పదబంధంలోని ప్రతి పదానికి  వివరణ ఇవ్వడం నిఘంటువు బాధ్యత . 


ఏనాది, ఏడాది, దక్షిణాది తరహా ఆది' తో మొదలయే  పదాలకు; ఆరుగొండ, ఆరుగొలను, ఆరుంబాక వంటి ఆరు తో ఆరంభమయే పదాలకు; కోనేరు, కొల్లేరు, పాలేరు వంటి 'ఏరు' సహిత పదాలకు నిఘంటువు నుంచి   వివరణ  ఆనించడం సామాన్యం . 


బాలచంద్రుని తల్లి అయితాంబ.  ఈ పదంలోని ' అయిత'  కు ఉన్న అర్థం వివరించి .. ఆ విధమైన పదాలతో కూడినవి  మరేవైనా పదరూపాలు ఉన్నవేమో వివరించవలసింది  నిఘంటువే.  అయితానగరం, అయితవోలు, అయితా పట్నం వంటి పదాలకు మూలమైన అయిత ను గురించి మరీ బల్లగుద్దినట్లు  కాదుగానీ .. రేఖామాత్రంగా అయినా   ప్రస్తావించని పదాల కూర్పును  నిఘంటువుగా అంగీకరించడం ఎట్లా!


మాయాబజార్ చలన చిత్రంలో ఘటోత్కచుడు అన్నట్లుగా  ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? ప్రతి పదం   పుట్టుకకు ఏదో ఓ మూలం  తప్పనిసరి ప్రాతిపదికగా ఉంటుంది కదా! దాని  గుట్టుమట్లు ఆరాతీసి గ్రంథానికి ఎక్కించినప్పుడే  భాషాచరిత్ర కండపట్టేది. 


పదం అంచు వరకు చూడలేని పక్షంలో కనీసం పస్తావించి  వదిలినా  కొంత మెరుగే! తదుపరి నిఘంటు కర్తలకు  అది మరింత  లోతులకు   వెళ్లే  పరిశ్రమకు ఊతం.  ఆ తరహా  నాందీ ప్రస్తావనలకు అయినా   నడుం బిగించక పోగా  ఎంచుకున్న  పదాల లోతుపాతులు తవ్వి తీసే ప్రయాసపైనయినా   నిఘంటు కర్తలు దృష్టిపెట్టలేదు.    


'కొందఱయ్యలు కొనియాడ నేరరు' అనే ప్రయోగం శ్రీనాధుడి శృంగార నైషధం లో కనిపిస్తుంది. 'పిల్లను ఒక అయ్య చేతిలో పెడితే గుండెబరువు తీరుతుంది' అనే నానుడి జనాబాహుళ్యం వాడుకలో ఉంది.  'అయ్య'కు  శ్రీనాథ ప్రకటితమైన 'అయ్య' కు మధ్య ఉండే అర్థభేద వివరణ బాధ్యత నిఘంటుదే. ఆ అక్కర ఈ నిఘంటువుకు పట్టింది కాదు. 


అనుప్రాసము, ఆమ్రేడితము, అద్యాహారము వంటి పదాల వాడుక  శ్రీనాధుడి  తన కావ్యాలలో విస్తృతార్థంలో కనిపిస్తుంది. 'పుండరీకారణ్యమున ధ్యాహారంబు' అని భీమేశ్వర పురాణం లో కనిపించినదానికి' అధ్యాహారమో  కాని అమృతపతికి' అని 'కాశీ ఖండము' లో కనిపించే పదానికి  . . శాస్త్ర పరిభాషలో కాకుండా లక్ష్యార్థంలో వివరణ అవసరం.  ఈ మాదిరి అనేక పదాలను ఈ గ్రంథం దాటవేసింది.  


పురుషవాచకాలకూ  చివరన 'అమ్మ' శబ్దం  వ్యవహారంలో కనిపిస్తుంది. ఆలంకారిక దృష్టితో కవి వాడిన పక్షంలో  కేవలం అర్థంతో  సరిపెట్టి.. కవిసమయాన్ని వదిలేసిన పక్షంలో  కవిహృదయానికి అన్యాయం జరిగినట్లే .   కవుల పరిశ్రమ మూగ చెవిటి ముచ్చటలుగా వృథా అయిన సందర్భాలు ఈ నిఘంటువులో అనేకం! 

 

ఈ నిఘంటువుకు పూర్వమే  శబ్దరత్నాకరం పేరుతో ఒక నిఘంటువు పండితలోకంలో  తిరుగుతోంది . కేవలం అజాది పదాల విభాగపు  భారీతనం కొన్నిరెట్లు పెంచటమే ఈ ' బృహన్ ' నిర్మాణ అంతిమ లక్ష్యం అనుకొమ్మంటే పండితామోదం సంభవమేనా ? 


సంస్కృత వ్యాకరణ గ్రంథాలను ముందేసుకుని తెలుగు భాష సహజతాకు  ఒదగని తీరులో  ఎన్ని పుటలు వండి వార్చినా  వాపు అవుతుందే  గాని గ్రంథానికి పుష్టి అవబోదు . 


మన భాషలోకి వచ్చి చేరిన పరాయి  భాషా పదాల స్వభావం, మనదే పూర్వ సారస్వతంలోనివీ,  వర్తమాన వ్యవహారంలో వాడుకలో ఉన్నవి..  ఒక్క పదమైనా తప్పి పోకుండా పట్టుకుంటేనే అదీ ప్రామాణిక నిఘంటువు.  


తెలుగులో కలగలుపుకు మూలమైన దేశ్య,  వికృతి పదాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి .. ఏ విధంగా  మారుతూ అంతిమంగా తెలుగు పదాలుగా  పరిణమించాయో,  వేటి ప్రభావానికి అవి లోనయ్యయో ..  ఏ భాషా పదాలను ఏ మేరకు ప్రభావితం చేయగలిగాయో .. ఈ ప్రయత్నమంతా  దిగ్విజయంగా సాగని పక్షంలో  కేవలం పుటల పెంపు  వల్ల కలిగే ప్రయోజనం సున్నా. 


తెలుగునామవాచకాల వివరణ కోసమై    మూలధాతువుల పరిణామ క్రమం వివరించడం  అవసరం. అదనంగా ఊళ్ల పేర్ల వివరణ  సందర్భంలో వాటి   శబ్దస్వరూపాలలో జరిగినా  మార్పులతో పాటు చరిత్ర వివరాలు సైతం నిఘంటు కర్తాలకు  తెలిసుండాలి. 


ఒక్క ముక్కలో  చెప్పాలంటే  ప్రతి మాటకూ  సంబంధించిన సమగ్ర సమాచారం ఇచ్చినప్పుడే  అది నిఘంటువు అవుతుంది. ఈ మాదిరి బృహన్నిఘంటువు సాకారం సాధారణ విషయం కాదు. 


పరిషత్తు నిఘంటువు  కర్తల సామర్థ్యాన్ని ఎత్తి చూపే ఉద్దేశంతో రాసింది కాదీ వ్యాసం . తెలుగు భాషకు సంబంధించినంత వరకు ఈ ప్రయాసకు ముందు రాని ' సమగ్ర పద సామాగ్రి సేకరణ ' ఆలోచన  దాని కదే  విశిష్టమైనది. పండితమాన్యులు   ఎందరినో ఒక చోట సమకూర్చుకుని ఏళ్ల తరబడి ధన వ్యయ ప్రయాసలకోర్చి ఒక యజ్ఞంలా బృహన్నిఘంటువును నిర్మించ తలపెట్టిన ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆంధ్ర భాషా చరిత్ర ఉన్నంత కాలం స్మృతి ప్రాయంగా చిరంజీవులే !  ప్రశంసలకు అర్హులే! 


- కర్లపాలెం హనుమంతరావు 

24-10- 2021

బోధెల్ ; యూ. ఎస్ .ఎ 

( ఆధారం : సూర్యరాయాంధ్ర నిఘంటువు - శ్రీ వడ్లమూడి వెంకటరత్నము - భారతి - జ; 1940 ) 

సింహళ పాలకుల ఆంధ్రాభిమానం - దురభిమానం -కర్లపాలెం హనుమంతరావు

 సింహళ పాలకుల ఆంధ్రాభిమానం - దురభిమానం 

-కర్లపాలెం హనుమంతరావు


12 , 13 వ శతాబ్దాలనాటి మాట. ఇప్పటి శ్రీలంక అప్పట్లో సింహళం.   పోలన్నరువా దాని రాజధాని.  అప్పటి శిలాశాసనాలు, 'మహావంశ' వంటి  రాజవంశజుల చారిత్రక గ్రంథాలే కాకుండా, బుద్ధుడి దంత చిహ్నాలు సింహళానికి కళింగ నుంచే తరలిన దాఖలాలు  కూడా  వత్తాసుకు రావడం  వల్ల .. సింహళ  పాలకులు కళింగ వంశానికి చెందిన వాళ్లు కావచ్చనే భావన బలపడింది . 

నాటి పాలకుల మొదటి తరపు పాలకుడు ' శ్రీవిజయ'  వంగీయుడు అని  కొన్ని వాదనలు ముందుకు వచ్చినా . . కాదు, కళింగుడేనని  తరువాతి కాలంలో తేలడంతో కళింగ సిద్ధాంతానికి మరింత  ఊతమిచ్చినట్లయింది.

 ఏడో శతాబ్దంలో ఓ కళింగ ప్రభువు యుద్ధంలో ఓడి అశ్రయం కోసం సింహళంలోని  ఒకానొక బౌద్ధవిహారం దాకా వచ్చినట్లు  'మహావంశ' గ్రంథం చెప్పనే చెబుతున్నప్పుడు  పాలకుల కళింగ వంశాన్ని గురించిన వాదనలు కొనసాగడం కాలం వృథాచేసుకోవడమే!     

 పదహారేళ్ళ పాటు ఘనంగా పాలించిన  నాలుగో తరం  నాయకుడు మహీంద్రుడు పెళ్లాడింది కూడా కళింగ కన్యనే. ఆ జంట ఫలం ( ఐదవ)  మహీంద్రుడు అనూరాధపురం రాజధానిగా పాలన చేసినట్లు                          శా సనాల సాక్ష్యం అందుకు తోడుగా ఉంది . 

ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నప్పటికీ  తొమ్మిదో శతాబ్ద౦ దాకా సింహళ వ్యవహారాలలో ఆంధ్రుల   జోక్యం ఉన్నట్లు కనిపించదు.  పదో శతాబ్దంలో దక్షిణ సింహళంలోని  కొంత భాగం చోళుల అధీనంలోకి  వచ్చినప్పటి నుంచే  ఆ దేశ వ్యవహారాలలో చోళుల చొరవ ఎక్కువయినట్లు చరిత్ర చెప్పే  మాట నమ్మదగ్గదే . 

కళింగులు, సింహళీయులు ఇద్దరికీ ఒకటవ కుళోత్తమ తుంగుడు శత్రువు. ఆ ఉమ్మడి శత్రువును తరిమికొట్టే  నిమిత్తం  కళింగ రాకుమార్తె త్రిలోకసుందరిని  ఒకటవ విజయశ్రీ  పెళ్లాడినట్లు  చెబుతారు.    ఇటు కళింగదేశంలోని 'గంగ' వంశంలో కూడా ఈ తరహా పేర్లే  వినబడతాయి.  కాబట్టి విజయసింహుడికి ఆ వంశజుల   బాలికతో వివాహమైందని ఊహించుకోవడంలో తప్పేమీ  లేదు . యుద్ధాల నిమిత్తం జరిగే పెళ్లిళ్లు  రాచరిక వ్యవహారాలలో మామూలే.  

వధువు త్రిలోకసుందరి తన బంధుబలగంతోనే అత్తారింట్లో అడుగు పెట్టింది.   మనావంశ కథనం ప్రకారం మధుకన్నవ, బాలక్కర, భీమరాజు,  చిన్నచెల్లెలు సుందరి సింహళ దేశంలోకి అట్లా అడుగుపెట్టిన చుట్టాలూ పక్కాలే.    విజయసింహుడి  బిడ్డకు  తాతగారి పేరు  'మధుక మార్నవ' దాఖలవడం కూడా అందుకో ఉదాహరణ .  మధుక మార్నవ   భార్య సుందర మహాదేవి.  మార్నవ మహారాజు   పరిపాలన  క్రీ.శ 1116 నుంచి  17 సంవత్స రాలపాటు  సాగినట్లు చరిత్ర చెబుతున్నది  . 

ఇప్పుడు ' దిబుంలగాల' గా చెప్పుకునే అప్పటి 'యుదంబగిరి' లో   విజయ  బాహుడు అనే సింహళాధీశుడు  ఒక గుహ కట్టించి దానికి  'కళింగ గుహ' అని పేరు పెట్టినట్లు  శిలాశాసనాల సాక్ష్యం ఉంది. ఆ వంశంలోని రెండవ గజబాహుడికి ఆంధ్రులపై ప్రీతి   జాస్తి అని ప్రతీతి .  అతని   16 ఏళ్ల పాలనాకాలంలోనే  (1137 -53)  ఆంధ్ర, సింహళాల మధ్య  బంధం మరంత.  బలపడినట్లు  చరిత్ర కథనం . అతగాని    ఆంధ్రాభిమానం గిట్టని పరాక్రమబాహుడు అనే మరో రాజు రాజ్యాన్ని కబళించాడు.  తమాషా ఏమిటంటే, నిస్సంతు అయినందువల్ల అంత్యకాలంలో ఆయనే  ఆంధ్రదేశపు విజయబాహువు అనే బంధువుకు రాజ్యాన్ని అప్పగించవలసి రావడం ! ఆ అప్పగింతకు వ్యతిరేకంగా చెలరేగిన వ్యతిరేకత    విజయుడు అనే సేనాని కృషి కారణంగా  సద్దుమణిగింది .   ఆయన  ఓ గొల్లవారిపిల్ల  ప్రేమలో చిక్కి ప్రాణాలు  పోగొట్టుకున్నాడు. ఆ  పిమ్మట   పీఠమెక్కినవాడు    నిస్సమ్మకమల్లుడు. ఆయన తండ్రి జయగోపరాజు. తల్లి పార్వతీమహాదేవి . 

నిస్సమ్మకమల్లుడు పదహారణాల ఆంధ్రుడు. ఆ ఆంధ్రాభిమాని     తొమ్మిది ఏళ్ళ పాలనను  స్వర్ణయుగంగా సింహళ సమాజం ఇప్పటికీ చెప్పుకుంటుంది.  అస్తవ్యస్త  వ్యవస్థకు ఒక కట్టుబాటు ఏర్పాటుచేసి అంకితభావంతో దానిని అమలుచేసిన గొప్ప పాలకునిగా  అతనికి చరిత్రలో  గుర్తింపు ఉంది. 

నిస్సమ్మకమల్లుడు సింహళ దేశీయులకు  సుఖశాంతులు, సుభద్రత అంటే ఎట్లా ఉంటాయో రుచి చూపించిన మొదటి  పాలకుడాయన. అయినా అతని పట్ల 'మహావంశ'   చిన్నచూపు చూసింది .   కేవలం తొమ్మిదంటే తొమ్మిది వాక్యాలతోనే    ఆ రాజు ప్రాశస్త్యం తగు సమాచార లేమి  కారణమని  సమర్ధించుకున్నా ఈ వివక్ష ఆంధ్రుల పాలిటి దురదృష్టమే! ద్రవిడ దేశం మీదకు దాడికి వచ్చినప్పుడు   రామేశ్వరంలో ఆంధ్ర ధ్వజం నాటిన ఆ తెలుగు వీరుడి   ప్రతి పలుకు, ప్రతి  చర్యా  ఆంధ్ర విలక్షణతతో  తేజరిల్లడం గొప్ప విశేషం .  పదహారణాల ఆంధ్రుడయినప్పటికీ   ఆ నిస్సమ్మకమల్లుని  ఆంధ్ర  రికార్డులు సైతం పట్టించుకొనకపోవడాన్ని మనం  ఎట్లా సమర్ధించుకోవడం? ! 


పరాయిగడ్డ పై ప్రముఖ రాజధాని పోలన్నరువును  నాడే  నిర్మించిన ఘనత   నిస్సమ్మకమల్లునిది! దేశం ముమ్మూలలా  విస్తృతంగా సంచారం చేస్తూ  దేవాలయాలు, పూజామందిరాలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మించిన ప్రజారంజక పాలకుడా మహారాజు.  రస్తాలూ, తటాకాలు వంటి ప్రజోపయోగకరమైన వనరుల అభివృద్ధి పై  సైతం ఆ ప్రభువుకు నిర్లక్ష్యం లేకపోవడం ఈనాటి పాలకులకు  ఆదర్శనీయం కావాలి. 


బౌద్ధ మతానుయాయిగా బౌద్ధ సంఘాలలోని దురాచార నిర్మూలన కోసమై   యథాశక్తి ఆ రాజు చేసిన కృషి సర్వమతాల సమ్మతం  విశేషంగా సాధించింది .   

 నిస్సమ్మకమల్లుని ప్రతి పలుకూ , ప్రతి చర్యా అతనిలోని  పదహారణాల ఆంధ్రత్వానికి అద్దం పడుతుంది. ఆయనకూ నేటి  మన పాలకుల తరహాలోనే  తన పరిధిలోని  వస్తుసంపదకు  'కళింగ' నామధేయం అద్దడంలో అపరిమిత , శ్రద్ధ. అర్థాంగి సుభద్రను  'కళింగ సుభద్ర'గా ప్రసిద్ధం చేసిన ఆంధ్రాభిమాని  నిస్సమ్మకమల్లుడు.  ఇప్పటి పోలన్నరువా అతని కాలంలో 'కళింగపురం'. నాణేల మీదంటే  'కళింగ లామతేజస' అని ముద్రింపచేశాడు ;  సరే, తోటలను సైతం  కళింగ ఉద్యానవనాలుగా స్థిరపరచడమేమిటి! ఆ ప్రభువుకు   ఆంధ్ర మూలాల పట్ల గల  గాఢాభిమానానికి చెప్పకోదగ్గ  గొప్ప తార్కాణాలు ఇట్లాంటివి ఇంకెన్నో ! 

కళింగాధీశుడు ఉమవర్మ వేయించిన తామ్రశాసనంలో  నిస్సమ్మకమల్లుని ' సింహపురి నివాసం  '  ప్రస్తావన కనిపిస్తుంది .   అమరావతి, నాగార్జున పర్వత ప్రాంతమంతా ఒకనాడు బౌద్ధమత ప్రాభవంతో వెలుగులీనడం అందరికీ తెలిసిన చరిత్రే. సింహళం మొదటి తరం పాలకులలోని ఒకటవ శ్రీ విజయుడు బహుశా కృష్ణాతీరం నుంచే  సింహళ దేశానికి తరలిపోయి ఉండవచ్చని ఒక ఊహ. ఆ సింహపురి ఇప్పటి నెల్లూరు కాదు.  సింహవాహనం పైన దర్శనమిచ్చే బెజవాడ. అదే శ్రీ దుర్గాంబాదేవి కనుసన్నులలో మెలిగే  విజయవాడ అయినా అయే అవకాశం కద్దు. అనంతర కాలంలో కళింగ రాజుల ప్రాభవం చెప్పుకోదగినంతగా లేని కారణంగ  ఆ ఆంధ్రరాజు నిస్సమ్మకమల్లుని చరిత్ర మరుగున పడే అవకాశం కాదనలేనిది! 


ఏది ఏమైనా ఊహపోహలు చరిత్ర కాలేదు కదా !    పరిశోధకులు మాత్రమే ఇతమిత్థంగా  నిగ్గు తేల్చదగ్గ అంశాలు నిస్సమ్మకమల్లుని చుట్టూతా  చాలానే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్న మాట. 

నిరంతరం స్వయంగా పర్యవేక్షణ పనులలో పాలుపంచుకుంటూ ప్రజలతో మమేకమైన ఆ ప్రభువు   సుపరిపాలనా దక్షత   సింహళ చరిత్ర ఖజానాలో .. తరాలు గడిచినా తరగనంతగా జమపడివున్న ధన సంపద.  విదేశీ గడ్డ అయినా స్వజాతి ఔన్నత్యాన్ని కీర్తించిన ఆ పాలకుని వ్యక్తిత్వం సర్వదా  అభినందనీయం. ఈనాటి మన తెలుగువారందరికీ ఆదర్శనీయం. , ఆచరణీయం కూడా. 


-కర్లపాలెం హనుమంతరావు

బోధెల్ ; యూ.ఎస్.ఎ

21 -06 -2019


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...