సింహళ పాలకుల ఆంధ్రాభిమానం - దురభిమానం
-కర్లపాలెం హనుమంతరావు
12 , 13 వ శతాబ్దాలనాటి మాట. ఇప్పటి శ్రీలంక అప్పట్లో సింహళం. పోలన్నరువా దాని రాజధాని. అప్పటి శిలాశాసనాలు, 'మహావంశ' వంటి రాజవంశజుల చారిత్రక గ్రంథాలే కాకుండా, బుద్ధుడి దంత చిహ్నాలు సింహళానికి కళింగ నుంచే తరలిన దాఖలాలు కూడా వత్తాసుకు రావడం వల్ల .. సింహళ పాలకులు కళింగ వంశానికి చెందిన వాళ్లు కావచ్చనే భావన బలపడింది .
నాటి పాలకుల మొదటి తరపు పాలకుడు ' శ్రీవిజయ' వంగీయుడు అని కొన్ని వాదనలు ముందుకు వచ్చినా . . కాదు, కళింగుడేనని తరువాతి కాలంలో తేలడంతో కళింగ సిద్ధాంతానికి మరింత ఊతమిచ్చినట్లయింది.
ఏడో శతాబ్దంలో ఓ కళింగ ప్రభువు యుద్ధంలో ఓడి అశ్రయం కోసం సింహళంలోని ఒకానొక బౌద్ధవిహారం దాకా వచ్చినట్లు 'మహావంశ' గ్రంథం చెప్పనే చెబుతున్నప్పుడు పాలకుల కళింగ వంశాన్ని గురించిన వాదనలు కొనసాగడం కాలం వృథాచేసుకోవడమే!
పదహారేళ్ళ పాటు ఘనంగా పాలించిన నాలుగో తరం నాయకుడు మహీంద్రుడు పెళ్లాడింది కూడా కళింగ కన్యనే. ఆ జంట ఫలం ( ఐదవ) మహీంద్రుడు అనూరాధపురం రాజధానిగా పాలన చేసినట్లు శా సనాల సాక్ష్యం అందుకు తోడుగా ఉంది .
ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నప్పటికీ తొమ్మిదో శతాబ్ద౦ దాకా సింహళ వ్యవహారాలలో ఆంధ్రుల జోక్యం ఉన్నట్లు కనిపించదు. పదో శతాబ్దంలో దక్షిణ సింహళంలోని కొంత భాగం చోళుల అధీనంలోకి వచ్చినప్పటి నుంచే ఆ దేశ వ్యవహారాలలో చోళుల చొరవ ఎక్కువయినట్లు చరిత్ర చెప్పే మాట నమ్మదగ్గదే .
కళింగులు, సింహళీయులు ఇద్దరికీ ఒకటవ కుళోత్తమ తుంగుడు శత్రువు. ఆ ఉమ్మడి శత్రువును తరిమికొట్టే నిమిత్తం కళింగ రాకుమార్తె త్రిలోకసుందరిని ఒకటవ విజయశ్రీ పెళ్లాడినట్లు చెబుతారు. ఇటు కళింగదేశంలోని 'గంగ' వంశంలో కూడా ఈ తరహా పేర్లే వినబడతాయి. కాబట్టి విజయసింహుడికి ఆ వంశజుల బాలికతో వివాహమైందని ఊహించుకోవడంలో తప్పేమీ లేదు . యుద్ధాల నిమిత్తం జరిగే పెళ్లిళ్లు రాచరిక వ్యవహారాలలో మామూలే.
వధువు త్రిలోకసుందరి తన బంధుబలగంతోనే అత్తారింట్లో అడుగు పెట్టింది. మనావంశ కథనం ప్రకారం మధుకన్నవ, బాలక్కర, భీమరాజు, చిన్నచెల్లెలు సుందరి సింహళ దేశంలోకి అట్లా అడుగుపెట్టిన చుట్టాలూ పక్కాలే. విజయసింహుడి బిడ్డకు తాతగారి పేరు 'మధుక మార్నవ' దాఖలవడం కూడా అందుకో ఉదాహరణ . మధుక మార్నవ భార్య సుందర మహాదేవి. మార్నవ మహారాజు పరిపాలన క్రీ.శ 1116 నుంచి 17 సంవత్స రాలపాటు సాగినట్లు చరిత్ర చెబుతున్నది .
ఇప్పుడు ' దిబుంలగాల' గా చెప్పుకునే అప్పటి 'యుదంబగిరి' లో విజయ బాహుడు అనే సింహళాధీశుడు ఒక గుహ కట్టించి దానికి 'కళింగ గుహ' అని పేరు పెట్టినట్లు శిలాశాసనాల సాక్ష్యం ఉంది. ఆ వంశంలోని రెండవ గజబాహుడికి ఆంధ్రులపై ప్రీతి జాస్తి అని ప్రతీతి . అతని 16 ఏళ్ల పాలనాకాలంలోనే (1137 -53) ఆంధ్ర, సింహళాల మధ్య బంధం మరంత. బలపడినట్లు చరిత్ర కథనం . అతగాని ఆంధ్రాభిమానం గిట్టని పరాక్రమబాహుడు అనే మరో రాజు రాజ్యాన్ని కబళించాడు. తమాషా ఏమిటంటే, నిస్సంతు అయినందువల్ల అంత్యకాలంలో ఆయనే ఆంధ్రదేశపు విజయబాహువు అనే బంధువుకు రాజ్యాన్ని అప్పగించవలసి రావడం ! ఆ అప్పగింతకు వ్యతిరేకంగా చెలరేగిన వ్యతిరేకత విజయుడు అనే సేనాని కృషి కారణంగా సద్దుమణిగింది . ఆయన ఓ గొల్లవారిపిల్ల ప్రేమలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ పిమ్మట పీఠమెక్కినవాడు నిస్సమ్మకమల్లుడు. ఆయన తండ్రి జయగోపరాజు. తల్లి పార్వతీమహాదేవి .
నిస్సమ్మకమల్లుడు పదహారణాల ఆంధ్రుడు. ఆ ఆంధ్రాభిమాని తొమ్మిది ఏళ్ళ పాలనను స్వర్ణయుగంగా సింహళ సమాజం ఇప్పటికీ చెప్పుకుంటుంది. అస్తవ్యస్త వ్యవస్థకు ఒక కట్టుబాటు ఏర్పాటుచేసి అంకితభావంతో దానిని అమలుచేసిన గొప్ప పాలకునిగా అతనికి చరిత్రలో గుర్తింపు ఉంది.
నిస్సమ్మకమల్లుడు సింహళ దేశీయులకు సుఖశాంతులు, సుభద్రత అంటే ఎట్లా ఉంటాయో రుచి చూపించిన మొదటి పాలకుడాయన. అయినా అతని పట్ల 'మహావంశ' చిన్నచూపు చూసింది . కేవలం తొమ్మిదంటే తొమ్మిది వాక్యాలతోనే ఆ రాజు ప్రాశస్త్యం తగు సమాచార లేమి కారణమని సమర్ధించుకున్నా ఈ వివక్ష ఆంధ్రుల పాలిటి దురదృష్టమే! ద్రవిడ దేశం మీదకు దాడికి వచ్చినప్పుడు రామేశ్వరంలో ఆంధ్ర ధ్వజం నాటిన ఆ తెలుగు వీరుడి ప్రతి పలుకు, ప్రతి చర్యా ఆంధ్ర విలక్షణతతో తేజరిల్లడం గొప్ప విశేషం . పదహారణాల ఆంధ్రుడయినప్పటికీ ఆ నిస్సమ్మకమల్లుని ఆంధ్ర రికార్డులు సైతం పట్టించుకొనకపోవడాన్ని మనం ఎట్లా సమర్ధించుకోవడం? !
పరాయిగడ్డ పై ప్రముఖ రాజధాని పోలన్నరువును నాడే నిర్మించిన ఘనత నిస్సమ్మకమల్లునిది! దేశం ముమ్మూలలా విస్తృతంగా సంచారం చేస్తూ దేవాలయాలు, పూజామందిరాలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మించిన ప్రజారంజక పాలకుడా మహారాజు. రస్తాలూ, తటాకాలు వంటి ప్రజోపయోగకరమైన వనరుల అభివృద్ధి పై సైతం ఆ ప్రభువుకు నిర్లక్ష్యం లేకపోవడం ఈనాటి పాలకులకు ఆదర్శనీయం కావాలి.
బౌద్ధ మతానుయాయిగా బౌద్ధ సంఘాలలోని దురాచార నిర్మూలన కోసమై యథాశక్తి ఆ రాజు చేసిన కృషి సర్వమతాల సమ్మతం విశేషంగా సాధించింది .
నిస్సమ్మకమల్లుని ప్రతి పలుకూ , ప్రతి చర్యా అతనిలోని పదహారణాల ఆంధ్రత్వానికి అద్దం పడుతుంది. ఆయనకూ నేటి మన పాలకుల తరహాలోనే తన పరిధిలోని వస్తుసంపదకు 'కళింగ' నామధేయం అద్దడంలో అపరిమిత , శ్రద్ధ. అర్థాంగి సుభద్రను 'కళింగ సుభద్ర'గా ప్రసిద్ధం చేసిన ఆంధ్రాభిమాని నిస్సమ్మకమల్లుడు. ఇప్పటి పోలన్నరువా అతని కాలంలో 'కళింగపురం'. నాణేల మీదంటే 'కళింగ లామతేజస' అని ముద్రింపచేశాడు ; సరే, తోటలను సైతం కళింగ ఉద్యానవనాలుగా స్థిరపరచడమేమిటి! ఆ ప్రభువుకు ఆంధ్ర మూలాల పట్ల గల గాఢాభిమానానికి చెప్పకోదగ్గ గొప్ప తార్కాణాలు ఇట్లాంటివి ఇంకెన్నో !
కళింగాధీశుడు ఉమవర్మ వేయించిన తామ్రశాసనంలో నిస్సమ్మకమల్లుని ' సింహపురి నివాసం ' ప్రస్తావన కనిపిస్తుంది . అమరావతి, నాగార్జున పర్వత ప్రాంతమంతా ఒకనాడు బౌద్ధమత ప్రాభవంతో వెలుగులీనడం అందరికీ తెలిసిన చరిత్రే. సింహళం మొదటి తరం పాలకులలోని ఒకటవ శ్రీ విజయుడు బహుశా కృష్ణాతీరం నుంచే సింహళ దేశానికి తరలిపోయి ఉండవచ్చని ఒక ఊహ. ఆ సింహపురి ఇప్పటి నెల్లూరు కాదు. సింహవాహనం పైన దర్శనమిచ్చే బెజవాడ. అదే శ్రీ దుర్గాంబాదేవి కనుసన్నులలో మెలిగే విజయవాడ అయినా అయే అవకాశం కద్దు. అనంతర కాలంలో కళింగ రాజుల ప్రాభవం చెప్పుకోదగినంతగా లేని కారణంగ ఆ ఆంధ్రరాజు నిస్సమ్మకమల్లుని చరిత్ర మరుగున పడే అవకాశం కాదనలేనిది!
ఏది ఏమైనా ఊహపోహలు చరిత్ర కాలేదు కదా ! పరిశోధకులు మాత్రమే ఇతమిత్థంగా నిగ్గు తేల్చదగ్గ అంశాలు నిస్సమ్మకమల్లుని చుట్టూతా చాలానే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్న మాట.
నిరంతరం స్వయంగా పర్యవేక్షణ పనులలో పాలుపంచుకుంటూ ప్రజలతో మమేకమైన ఆ ప్రభువు సుపరిపాలనా దక్షత సింహళ చరిత్ర ఖజానాలో .. తరాలు గడిచినా తరగనంతగా జమపడివున్న ధన సంపద. విదేశీ గడ్డ అయినా స్వజాతి ఔన్నత్యాన్ని కీర్తించిన ఆ పాలకుని వ్యక్తిత్వం సర్వదా అభినందనీయం. ఈనాటి మన తెలుగువారందరికీ ఆదర్శనీయం. , ఆచరణీయం కూడా.
-కర్లపాలెం హనుమంతరావు
బోధెల్ ; యూ.ఎస్.ఎ
21 -06 -2019
No comments:
Post a Comment