భావోద్వేగాలా? భాషాభివృద్ధా?
-కర్లపాలెం హనుమంతరావు
ముందు ముందు రాబోయే సాంకేతిక అవసరాలకు అనుగుణంగా భాషను ఎప్పటికప్పుడు సరళతరం చేసుకుని సిద్ధంగా ఉండటం తక్షణమే ప్రారంభమవాల్సిన భాషా సంస్కరణ వాస్తవానికి! అవును! మన తెలుగుకు ప్రపంచభాషలలో లేని ప్రత్యేకతలు చాలా ఉన్న మాటా నిజమే! సంగీత స్వరాలలోని అన్ని సంగతులను అక్షరబద్ధం చేయగల సుస్పష్ట అజంత (అచ్చు వర్ణంతో ముగించే) సౌలభ్యం ఇటాలియన్ భాషకులా మళ్లీ మన తెలుగుకు సొంతం అంటారు. తెలుగులో ఉన్న త్యాగరాజ సంకీర్తనలను తమిళ భాషలోకి తర్జుమా చేసుకొని ప్రచారం చేసుకొనే తమిళుల ప్రయత్నం విఫలమవడానికి కారణమూ తెలుగు వర్ణానికి ఉన్న సంగీజ్ఞత తమిళ భాషకు లేకపోవడమే! అయినా సరే.. ఈ వేగయుగంలో సాటి భాషలతో పోటీకి దిగి ముందంజగా సాగాలంటే ఆలంకారికంగా ఉన్నా, అందం మరంత పెంచే అపురూప ఆభరణాల వంటి వర్ణమాలలోని కొన్ని ప్రత్యామ్నాయం ఉన్న అక్షరాలను పరిత్యజించక తప్పదు. మనసు బరువెక్కినా బరువైన అక్షరాలు కొన్నిటిని వదిలించుకొనక తప్పదు! చిన్నతనంలో మనం ఎంతో శ్రద్ధతో శ్రమించి మరీ నేర్చుకొన్న 56/53 వర్ణమాల సెట్ మీద గల మమకారం అంత తొందరగా చావదు. అయినా భాషాభివృద్ధికి పరిత్యాగం వినా మరో మార్గం లేదు. మనం ఇప్పటికే అవసరమైన చోట కొన్నిటిని వదులుకున్నాం! బండి ర ('ఱ') కు బదులు తేలిక ర, 'ఋషి' పదంలోని 'ఋ' అక్షరానికి ప్రత్యమ్నాయంగా 'రు' తరహావి. అనునాసికాలయితే దాదపుగా అన్నీ ఇప్పటి తరం వాళ్లు గుర్తుపట్టే స్థితిలో లేరు.
వర్ణమాల సౌందర్యాన్ని చెరబట్టడానికి నేనూ విముఖుణ్ణే! కానీ మనోవేగంతో పోటీకి దిగి ముందుకు ఉరకలెత్తే సాంకేతిక రంగ అభివృద్ధిని దేశీయపరంగ అందుకోనేందుకు జానపదుల నోటికి కూడా పట్టేందుకు వీలుగా పదజాలం సరళీకృతం కావాల్సివుంది. భాషాసంస్కరణలకు ప్రధాన అవరోధంగా ఉంటున్నదీ పామరజనానికి ఆమడ దూరంలో మసులుతున్న పాండిత్య పలుకుబడులే! పట్టణాలకే కాదు.. పల్లెపట్టులకూ రసపట్టుల్లా మారే పలుకుబడులు పెరిగే కొద్ది భాష వాడకం విస్తృతమవుతుంది.
గతంలో ఓల్డ్ ఇంగ్లీష్ స్థానే న్యూ ఇంగ్లీష్ వచ్చి ప్రపంచ భాషల్లోని అవసరమైన పదజాలాన్ని ఏ భేషజమేమీ లేకుండా సొంతం చేసుకునే సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఆనాటి నుంచే ఆంగ్లం విశ్వభాషగా రూపాంతరం చెందుతూ అన్ని సంస్కృతులను ప్రభావితం చేసేయడం! ఆ దిశలోమన తెలుగునూ సంస్కరించుకోకుండా భాష చచ్చిపోతున్నదో అని ఎంత భావోద్వేగాలు ప్రదర్శించీ ప్రయోజనం ఏముంది!
భావోద్వేగాలా.. భాషాభివృద్ధా? ఏది ప్రధానం అని ఆలోచించుకోవాల్సిన సంధి దశలో మనం ఇప్పుడు ఉన్నది.
-కర్లపాలెం హనుమంతరావు
24 -06 -2021