Sunday, December 12, 2021

సామాజిక మాధ్యమాల దుర్వినియోగం- కర్లపాలెం హనుమంతరావు

 

ప్రపంచం మొత్తంలో  సామాజిక మాధ్యమాల  దుర్వినియోగంలో మనమే నెంబర్ ఒన్.  రోజువారీ సామాజిక మాధ్యమ టపాలలో సింహభాగం.. అబద్ధం.. అసంబద్ధం, పనికిరానివి, ప్రతికూలమైనవి.  అవమానకరమైతే వాటి లెక్కకు ఇహ అంతే లేదు. అసభ్యంగా ఉండి, అక్కరకు రాకుండా పక్కదారి పట్టించేవి కొన్నైతే, ఏకంగా  సామాజిక సామరస్యానికి ముప్పు తెచ్చేవి మరి కొన్ని, ఏ ఒక పక్షం తరుఫునో పద్దాకా బుర్రలు తోమే పనిలో నిరంతరం మునిగుండేవి ఇంకొన్ని.  రత్నాల వంటి టపాలను పట్టుకోవడం ఉప్పు నీటి సామాజిక మాధ్యమ సముద్రంలో నిలువీత ఈదే వస్తాదులకైనా దుస్సాధ్యం అన్నట్లుంది ఇప్పటి దుస్థితి.

 

అవసరముండీ ఓ పొల్లు మాట బైటకు అనేందుకే ఒకటికి రెండు సార్లు సంకోచించే సంస్కృతి మన గతానిది. ప్రస్తుతమో!  ఎంతటి పెద్దరికమున్నప్పటికీ  పది మంది నసాళాలకు అంటే ఏదో  కుంటి కూత డైలీ ఓటి ట్వీట్ గా పడందే పప్పు అనో.. తుప్పు అనో దెప్పిపొడుపులు వినక తప్పని దిక్కుమాలిన  సోషల్ వర్కింగ్ సీజన్లో చిక్కుకుపోయున్నాం అందరం.  

 

సామాజిక మాధ్యమాలు వ్యక్తిగత జీవితం  విలువైన సమయాన్నే కాకుండా, చెమటోడ్చి గడించిన సొమ్ములో అధికభాగాన్నీ దుర్వినియోగ పరుస్తున్నాయ్! స్పాములు.. ఫిల్టర్లు ఎన్ని ఉన్నా బురద నీరులా వచ్చిపడే ఈ-మెయిళ్ల ప్రక్షాళనకే అధిక సమయం కేటాయించే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటిది. దీనికి అడ్డుకట్ట వేయడం కుదరని పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల మూలకంగా ఎంత మందింకా ముందు ముందు క్షోభిస్తున్నారో .. ఆ లెక్కలు తీసే టెక్నాలజీ ఇంకా రాలేదు!

 

మాదక ద్రవ్యాల వినియోగం మాదిరిదే సామాజిక మాధ్యమాల దుర్వినియోగం కూడా. నిండా కూరుకున్న తరువాత గాని చుట్టుముట్టిన సుడిగుండం లోతు తెలిసే యోగం లేదు. చేజేతులా చేతులు కాల్చుకోడం.. ఆనక ఆకుల కోసం అల్లల్లాడడం అవసరమా? ఎంత మంది అమాయక జీవుల బతుకులు అల్లరిపాలవుతున్నాయో కళ్లారా చూస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టని పక్షంలో మన బుద్ధిహీనత భావి తరాల క్షమాభిక్షకైనా అర్హత కోల్పోతుందేమో!   

భావి దివ్య జీవన హార్మ్యానికి సోపానాలు నిర్మించుకునే శక్తివంతమైనది మనిషికి యవ్వనకాలం. నైపుణ్యాల సాధన దీక్షగా కొనసాగవలసిన యవ్వనకాలంలో అధికభాగం నిరర్థక సామాజిక మాధ్యమాల గ్రహణం నోటపడితే ముందొచ్చే కాలమంతా మసకబారడం ఖాయం.  

వ్యక్తిగత విజయాలకు ఊతమిచ్చే వరకు సమస్యలేదు. అందుకు విరుద్ధంగా అభివృద్ధికి ఆటంకంగా మారినప్పుడే సామాజిక మాధ్యమాలతో పేచీ! పరిశోధన తీరులో సాగవలసిన జ్ఞానతృష్ణ  క్రమంగా  సామాజిక మాధ్యమాలకు  కట్టుబానిసలుగా మార్చేస్తోంది. అదే ప్రస్తుతం ఆందోళన కలిగించే పరిణామం.  

వృద్ధులను మరంత ప్రతికూలంగా ప్రభావితం చేయడం  సోషల్ నెట్ వర్కింగ్ ప్రధాన మరిడీతనం. పఠనం, పర్యటన, పరిశీలన, దిశానిర్దేశం, అనుభవాల సారం పదిమందికి వ్యక్తిగతంగా పంచే తీరులో ఇంత వరకు సాగిన వృద్ధులలో నిర్మాణాత్మక పాత్ర స్థానే  అసాంఘిక నైజం చొరబడ్డం సమాజ హితైషులను ఆందోళన కలిగించదా!

యుఎస్ లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, సోషల్ మీడియా, టెలివిజన్, వీడియో గేమ్‌లు వంటి  సామాజిక మాధ్యమాలలో   సగటు అమెరికన్ ఏడాదికి 400 గంటలు వృథా చేస్తున్నట్లు తేలింది. ఇండియాలో ఈ వ్యర్థ సమయం మోతాదు అందుకు రెట్టింపు. సమాజ శ్రేయస్సుకు, కొత్త నైపుణ్యాల సాధనకు గతంలో వినియోగమైన సమయం ప్రస్తుతం నాలుగింట మూడు వంతులు సామాజికంగా వ్యర్థ వినియోగం దిశకు మళ్ళిపోవడం మొత్తంగా దేశానికీ ప్రతికూలమైన అంశంగా పరిగణించక తప్పదు! 

విశ్వవ్యాప్తంగా విద్యావంతులూ సోషల్ నెట్‌వర్క్‌ కు చిక్కి రోజుకు సుమారు  2.5 గంటలు వృథా చేస్తున్నట్లు మరో అధ్యయన నిర్ధారణ.  భారతదేశంలో, సగటున ప్రజలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో 2.4 గంటలు గడుపుతున్నట్లు, ఎక్కువ సమయం నాసిరకం, పాత జోకులను పంచుకునేందుకే దుర్వినియోగమవుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఆ పరిశోధన ప్రకారం ఎవరికీ ఉపయోగపడని వ్యక్తిగత విషయాలు, సొంత విషయాలను గురించి ప్రగల్భాలకై వినియోగించే సమయమూ తక్కువేమీ లేదు. ఒక  జపానీయుడు సగటున 45 నిమిషాలకు మించి గడిపేందుకు మొగ్గు చూపని కాలంలో జీవిస్తున్న మనం ఎందుకు ఆ నిగ్రహం పాటించలేకుండా ఉన్నాం?! 

దేశం కోసం కాకపోయినా వ్యక్తిగత మానసిక ఆరోగ్యం దృష్ట్యా అయినా సామాజిక మాధ్యమాల వినియోగించే సమయం, నాణ్యతల పైన సమాజం మొత్తం పునరాలోచించే తరుణం దాటిపోతోంది. తస్మాత్ జాగ్రత్తని హెచ్చరించేందుకే ఈ చిన్న వ్యాసం.

-కర్లపాలెం హనుమంతరావు

30 -04 -2021


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...