Wednesday, November 23, 2016

మూడు “ప్రార్థన” పద్యాలు
రచన: వేలూరి వేంకటేశ్వర రావు

ప్రార్థన పద్యాలు అనంగానే, సాధారణంగా మనకు గుర్తుకొచ్చేవి మనం చిన్నప్పుడు బట్టీ పట్టిన పద్యాలు. “ తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్‌ బూనితిన్‌,” అన్న పద్యమో, “సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ,” అన్న శ్లోకమో, లేకపోతే, “తుండము నేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్‌” లాంటి పద్యమో చటుక్కున స్ఫురిస్తుంది.

నేను ప్రస్తావించబోయే ప్రార్థన పద్యాలు, మనం చిన్నప్పుడు నేర్చిన పద్యాల వంటివి కావు. అంతేకాదు. మనం పెద్దైన తరువాత, ఏ కావ్యాలనుంచో, ప్రబంధాలనుంచో, నేర్చుకున్న పద్యాలూ కావు. అంటే, “శ్రీరామా కుచమండలీ మృగమద శ్రీగంధ సంవాసిత స్ఫారోదార భుజాంతరుండు,” లేదా, “అంకము జేరి శైలతనయాస్తనదుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి చన్‌ కబళించబోయి,” లాంటి శృంగారరస భూయిష్టమైన ప్రార్థన పద్యాలు అసలే కాదు.

చిన్నప్పటి ప్రార్థన పద్యాల్లో, నాకు మంచి జరగాలనో, లేకపోతే నేను ప్రారంభించిన పని సవ్యంగా నిర్విఘ్నంగా జరగాలనో, అనే స్వార్థఫలాపేక్షత ఉంటుంది. కావ్యప్రబంధ ప్రార్ధన పద్యాల్లోకూడా ప్రభువుకి, తనకీ శుభం జరగాలనే వాంఛ ఉంటుంది.

ప్రార్థన అంటే, అడగటం, యాచించడం అని అర్థం. తనకి నప్పిన దేవుడినో దేవతనో తన మంచి కోసం యాచించటం ప్రార్థన ముఖ్య లక్ష్యం. ఆలోచించి చూస్తే, ప్రభువుకి శుభం కోరుకుంటూ, దేవుణ్ణి యాచించడం కూడా స్వార్థమే. ప్రభువు బాగుంటే, కవికీ సుఖమే.

ప్రార్థన పద్యంలో, సాధారణంగా మనం కవి ఏమి కోరుతున్నాడో అన్నదానికి ప్రాధాన్యత నిస్తాము. కవిని వ్యక్తిగా చూడం. కవి ఏ విషయాలకు, ఎందుకని ప్రాథాన్యతనిస్తున్నాడో పట్టించుకోము. నేను వ్యాఖ్యానించబోయే ప్రార్థన పద్యాలలో కవి నమ్మిన విలువలు తన కోరికలకన్నా ముఖ్యం.

నేను ప్రస్తావించబోయే మొదటి “ప్రార్థన” పద్యం యాచన పద్యమే కాని, స్వార్థం కోసం అడుక్కునే పద్యం కాదు.

దేవరకొండ బాలగంగాధర తిలక్‌ 1963 లో రాసిన పద్యం “ ప్రార్ధన.”

దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రులనుండి పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి
నీతుల రెండునాల్కలు సాచి బుసలు కొట్టే
నిర్హేతుక కృపాసర్పాలనుండి
లక్షలాది దేవుళ్ళనుండి వారిపూజారులనుండి
వారి వారి ప్రతినిధులనుండి
సిద్ధాంత కేసరులనుండి సిద్ధులనుండి
శ్రీ మన్మద్గురుపరంపరనుండి
దేవుడా
నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం వున్న
మనుష్యులతో నిండిన దేశం నాది
ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ
విరివిగా వున్న విచిత్ర సౌధం మాది
కడుపునిండుగా ఆహారం గుండెనిండుగా ఆశ్లేషం
బ్రతుకుపొడుగునా స్వతంత్రం
కొంచెం పుణ్యం కించిత్‌ పాపం
కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ
చాలు మాకు తండ్రీ
సరదాగా నిజాయితీగా జాలి జాలిగా
హాయిహాయిగా బ్రతుకుతాం
మాకు నటనలు వద్దు మాచుట్టూ కటకటాలు వద్దు
గొప్పలూ గోసాయి చిట్కాలు వద్దు

దేవుడా
కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా
ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు
మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి
మాసిపోయిన అక్షరాల్ని వివరించు
రహస్యసృష్టి సానువులనుండి జారిపడే
కాంతి జలపాతాన్ని చూపించు
మమ్మల్ని కనికరించు
చావు పుట్టుకలమధ్య సందేహం లాంటి
జీవితంలో నలువైపులా అంధకారం
మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం
మాకున్న ఒకే ఒక అలంకారం
మజిలీ మజిలీ కి అలిసిపోతున్నాం
మలుపుమలుపికీ రాలిపోతున్నాం
ఆశల వెచ్చని పాంపుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని
ఆదమరిచి కాసేపు విశ్రమించడానికనుమతించు తండ్రీ.

ఈ పద్యాన్ని మూడు భాగాలు చేసి చూస్తే వ్యాఖ్యానం తేలిక. మొదటి భాగంలో, కవి ఫలానా ఫలానా వాళ్ళబారినుంచి నా దేశాన్ని రక్షించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. యాచిస్తున్నాడు అన్నా తప్పు లేదు. దేశప్రజలని ముఖ్యంగా రాజకీయ దురంధరులనుంచి రక్షించమంటున్నాడు. పెద్దపులులనీ, పెద్దమనుషులనీ (వీళ్ళు కవి ఉద్దేశంలో రాజకీయ నాయకులే) ఒకే ఊపులో కలిపాడు. అది చక్కని విశేషం. నిజమో కాదో నాకు తెలీదు కానీ, పెద్దపులి తను కన్నపిల్లలని, తనే తింటుందని నానుడి.. అంతే కాదు. ఈ పెద్దపులి జాతివాళ్ళు, “నీతుల రెండునాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపాసర్పాలు,” కూడాను. వాళ్ళబారినుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాడు, తిలక్‌. ఈ భాగంలో తిలక్‌ గొప్ప అభ్యుదయవాదిగా (progressive) కనిపిస్తాడు. అంతేకాదు, ఇంతకు పూర్వం ప్రజలలో “దేవుడి” గురించి స్థిరపడ్డ అభిప్రాయాలని ఖండించిన వాడిగా కనిపిస్తాడు.

రెండవ భాగంలో తన దేశప్రజల ఆశలు, ఆవేదనలు, వాళ్ళ చిరు కోరికలు ఆ దేవుడికి చెప్పుతున్నాడు. “కడుపునిండుగా ఆహారం గుండెనిండుగా ఆశ్లేషం, బ్రతుకుపొడుగునా స్వతంత్రం, కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ చాలు మాకు తండ్రీ,” అని చెపుతూ, “సరదాగా నిజాయితీగా జాలి జాలిగా హాయిహాయిగా బ్రతుకుతాం,” అని హామీ ఇస్తున్నాడు. మొదటి భాగంలో దేవుడు చెయ్యవలసిన పని పూర్తి చేసినతరువాతే ఈ హామీ అని మనం ఊహించుకోవాలి. రెండవ భాగానికొచ్చేటప్పటికి, తిలక్‌ మానవతావాదం, humanism ని మనం చూస్తాం.

మూడవ భాగం మొదటి నాలుగు చరణాలూ చదవంగానే తిలక్‌ మనకి ఆరోజులనాటి (60 ల్లో అని నా భావం) వీర అభ్యుదయవాది (ultra progressive) గా ముందుకొస్తాడు. తరువాతి పాదాలలో కవిగా తిలక్‌ నిజస్వరూపం కనిపిస్తుంది. తిలక్‌, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండుమెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి. కాకుంటే “రహస్యసృష్టి సానువులనుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు, మమ్మల్ని కనికరించు,” అని రాయలేడు. “మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం,” అని ఇంకేకవి రాయగలడు? ఆఖరి పాదాల్లో వెంటనే తన నిసృహ, disappointment కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.

తను ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దేవుడు ఎవరైతేనేం, తన కోరికలు తీర్చలేడని తిలక్‌ కి తెలుసు. నాకు చందమామలో జింక కావాలంటే, ఏ దేవుడు ఇవ్వగలడు? తిలక్‌ ప్రగతి శీలుడైన మానవతావాది. అంటే, ఎప్పటికైనా తన కోరికలు ఏదోరకంగా నెరవేరుతాయని నమ్మిన కవి. మనిషిలో మంచిని నమ్మిన కవి. అందుకనే ఈ పద్యం ఈ శతాబ్దానికి మప్పే చక్కని ప్రార్థన పద్యం అంటాను.

నే చెప్పబోయే రెందవ ప్రార్థన పద్యం, చెరబండరాజు (బద్దం భాస్కర రెడ్డి) రాసిన “వందేమాతరం.” ఇది సెప్టెంబర్‌ 1968 లో వచ్చిన పద్యం. దిగంబరకవుల మూడవ సంపుటి, “నేటి కుష్ఠు వ్యవస్థపై దిగంబరకవులు,” లో మొదటి పద్యం.

ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నించున్న “భారతి” వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం
ఒంటొమీద గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి వేసిన మిద్దెల్లో
కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో
వీధిన బడ్డసింగారం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందేమాతరం వందేమాతరం.

చెరబండరాజుకి భారతదేశం, భారతమాత, దేవతా మాత. ఏమీ చేతకాని, ఏమీ చెయ్యలేని కన్న తల్లి. దేవత. భారతమాతకి “దైవత్వం” ఆపాదించి, ఆ దైవత్వం ఒక ప్రతీకగా వాడాడు చెరబండరాజు. ఆ దేవత అందం, యవ్వనం, ముఖ్యంగా శీలం గురించి జుగుప్స కలిగించే మాటలు వాడుతాడు. మాతృదేశం పై విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు. చరణం చరణం లోనూ తన బాధ, కోపం వ్యక్తం అవుతుంది. “నోటికందని సస్యశ్యామల సీమ,” తన భారత మాత.

తన మాతృదేశదేవత ధైర్యం, దీనత్వం, శోకం, తనని నిలువెత్తునా సిగ్గుతో ముంచేస్తాయి. ఆ దేవత గమ్యం అగమ్యం అయ్యిందని అని వాపోతాడు. అంతకు ముందు ఏ కవీ వాడని ఉపమానాలు, ప్రతీకలూ, అప్పటిలో నవ కవిత్వానికి shock treatment ఇచ్చాయని ఒప్పుకోక తప్పదు. “సమాజం అంతగా పతనమైందా?” అన్న మకుటంతో రాచమల్లు రామచంద్రా రెడ్డి సంవేదన లో ఈ సంకలనాన్నీ సమీక్షిస్తూ దుమ్మెత్తి పోశాడు. ఆ రోజుల్లో దిగంబరకవులు కవిత్వానికి ఇచ్చిన shock treatment గుర్తించలేకపోయాడు. ఇప్పుడు, మూడున్నర దశాబ్దాల తరువాత, భారతమాతలో, అంటే సామాన్య ప్రజల జీవితంలో వచ్చిన మార్పు పరంగా ఈ పద్యాన్ని పరిశీలిస్తే, చెరబండరాజుకి ఆరోజుల్లో వచ్చిన కోపం సబబేనని అనిపించక మానదు. అంతేకాదు. ప్రపంచీకరణకు వ్యతిరేకత ప్రతిధ్వనించే ఈ పద్యం, సమయోచితమైన పద్యం.

చెరబండరాజు నాస్తికుడు. ఇది ప్రార్థన పద్యం అన్నందుకు నేను సంజాయిషీ చెప్పు కోవాలి. తిలక్‌, చెరబండరాజు, ఇద్దరూ, భారతదేశ శ్రేయస్సు కోరుకుంటూ బాధ పడ్డవాళ్ళే. తిలక్‌, తనకు తెలియని దేవుణ్ణి మార్పు కోసం ప్రార్థించాడు, ఆ దేవుడు ఏమీ చెయ్యలేడని తెలిసికూడా. చెరబండరాజు తను చిత్రించిన దేవత, తన భారతదేశం, గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్న దేవత. మార్పు కోసం తపించే కవికి దేవత. మార్పు తప్పకుండా రావాలనే కోరిక, మార్పు తప్పకుండా వస్తుందనే గాఢ నమ్మకం ఉండబట్టే ఇంత విసురుగా రాయగలిగాడు. ఆ నమ్మకం అతనికి ఉందని నేను నమ్మబట్టే, ఇదికూడా ప్రార్థన పద్యం అన్నాను.

మూడవ ప్రార్థన పద్యం, జి. యస్‌. రామ్మోహన్‌, ఏప్రిల్‌ 2003 న ఆంధ్రజ్యోతి లో ప్రచురించిన, “యుద్ధప్రభు స్తోత్రము.” ముందుగా పద్యాన్ని చదవండి. ఒకటి కి రెండుసార్లు చదవండి. అప్పుడు దీనిని ప్రార్థన పద్యం అని ఎందుకు అన్నానో బోధ పడచ్చు.

పెద్ద శబ్దముతోనూ, మిరుమిట్లు గొలుపు కాంతులతోనూ నీ రాకడ ప్రకటించుచున్న ప్రభువా
పూమొగ్గలకు కరవాలము బదులొసగిన కరుణామయుడా
పసిబుగ్గలను లోహవిహంగాలతో గిల్లిన క్షిపణాగా
ముల్లోకములకు శక్తిమంతుడవైన అయ్యా
నిన్నేమని పిలిచెదము తండ్రీ.
లక్షలాది ఆదిమవాసుల బలిపీఠమును ఆసనముగా
మార్చుకున్న రారాజా
ఏడుజాములలో మెసపొటేమియా చంద్రుణ్ణి ఎర్రబార్చిన వాడా
ఆదియు అంతమూ మూలమూ లేక అంతటా నీవై
కంచరగాడిదలా సంచరించు సర్వేశ్వరా
అణువు పరమాణువు అన్నీ తానైన వాడా
నిన్నెన్నని అనమురా నాయనా
రంగునీళ్ళిచ్చి రక్తాన్ని కొలుచుకు పోగలిగిన బుద్ధిశాలీ
సమాచారమే జ్ఞానమని, బలమే సత్యమని మా చక్షువులు తెరిపించిన దివ్యమూర్తీ
నీ రక్తముతో పాప పరిహారము చేసుకొనుటకు లోకము వేచియున్నది నాయనా
నీఘనతను బలపరుచుటకు
ఒక శిలువను తయారుచేయుచున్నారము తండ్రీ.
ఆమెన్‌

గ్రీకు పురాణాలలో ఆరెజ్‌ (Ares) అనబడేవాడు యుద్ధ దేవుడు. మన దేవుళ్ళలో కేవలం యుద్ధం యుద్ధంకోసమే కోరే దేవుడెవడూ ఉన్నట్టూ కనిపించడు. ఈ ఆరెజ్‌ గురించి కొంత వివరణ అవసరం. ఆరెజ్‌, గ్రీకు పురాణాలలో జూస్‌ అనే వాడి కొడుకు. గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఆరెజ్‌ కి సరదా. వీడికి, యుద్ధంలో గెలుపు, ఓటమీ ముఖ్యం కాదు, కేవలం రక్తపాతమే ముఖ్యం. పరమ దుర్మార్గులు వీడి సహాధ్యాయులు. ఎల్లప్పుడూ వీళ్ళవెన్నంటి కరువుకాటకాలు, బాధ, సంక్షోభం ఉంటాయి. ఆరెజ్‌ అన్నా, వాడి పనులన్నా, వాడినాన్న జూస్‌ కి కూడ అసహ్యమే! యుద్ధప్రభు స్తోత్రాన్ని, ఈ నేపథ్యంలో చదవాలి.

అయితే, ఈ పద్యం రామ్మోహన్‌ ఎవరిని ఉద్దేశించి రాసాడో చెప్పడం అనవసరం అనుకుంటాను. ఈ పద్యంలో వ్యాజ స్తుతి లేదు, వ్యాజ నిందే ఉన్నది. ప్రతి ఒక్క పాదమూ, ఒక వ్యంగ్య సూక్తి. పాదపాదనికీ కొట్టొచ్చినట్టు కనుపించేది ప్రస్తుత ప్రపంచ రాజకీయాలపై వ్యంగ్యం. మతానికి సంబంధించిన పూర్వకథలన్నీ కవి వ్యంగ్యానికి చక్కని ప్రతీకలు. అనవసరమైన అరుపులు, అర్థంలేని నినాదాలు ఏమీ లేకుండా, ఈ క్రొత్త “యుద్ధదేవుని” పై సహజమైన అసహ్యతను, చక్కని చిన్న చిన్న మాటలలో పేర్చి, ఈ “దేవుడి” నిజ స్వరూపాన్ని బట్టబయలు పెట్టిన పద్యం ఇది. ఈ మధ్య కాలంలో ఇంత చక్కని వ్యంగ్య పద్యం రాలేదు.

ఆరెజ్‌ తో నే పోల్చిన ఈ యుద్ధదేవుడి లక్షణాలు చాల విచిత్రంగా కనుపిస్తాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న చరిత్ర. “లక్షలాది ఆదిమవాసులను బలిపీఠమును ఆసనంగా చేసుకొని, అణువు పరమాణువు తానేఅయి, రంగునీళ్ళిచ్చి రక్తం కొలుచుకోపోగలిగిన బుద్ధి శాలి, ఈ “దేవుడు.” వీడి రక్తముతో పాపపరిహారం చేసుకోటానికి లోకం వేచియున్నది అన్న పాదం చదవగానే, ఒక్క క్షణం క్రీస్తు ప్రభువు స్పృహకి రాక మానడు. కానీ ఆ పాదంలో క్రీస్తు ప్రసక్తి ఏమాత్రమూ లేదు. క్రీస్తు కి పూర్తిగా వ్యతిరిక్త ప్రతీక, ఇది. క్రీస్తు ప్రభువుకి శిలువ వేయడం మూలంగా ప్రపంచ ప్రజల బాధలు మరుగున పడలేదు కానీ, ఈ యుద్ధ ప్రభువుని శిలువపైకెక్కించితే, ప్రపంచ ప్రజలు కాస్తన్నా సుఖపడతారన్న నమ్మిక ఈ పద్యం వెనుక ఉంది.

ఇంతకు ముందు చెప్పిన రెండు పద్యాలనీ ప్రార్థన పద్యాలు అన్నందుకు నామీద కోపాం రాక పోవచ్చు. కానీ, ఇది ప్రార్థన పద్యం అన్నందుకు, చాలమందికి కోపం రావచ్చు. నా ఉద్దేశం లో ఈ పద్యం, పై రెండు పద్యాలకన్నా గొప్ప పద్యం. విలువ కట్టలేని, విలువ కట్టకూడని పద్యం. రక్తం కోరే “ప్రభువు” ల బలాధిక్యతని ఈసడించుకునే పద్యం. ఇది ఏ విధంగానూ యాచన పద్యం కాదు. ఇది మనమందరం అహర్నిశలూ గుర్తుంచుకోవలసిన మంచి పద్యం. అందుకనే ఇది ప్రార్థన పద్యం.

ఆఖరిగా ఒక మాట.

ఋగ్వేదంలో పదవ మండలంలో నూటముప్ఫై ఒకటవ సూక్తం, నాసదీయ సూక్తం అంటారు. ఏదు శ్లోకాలలో సృష్టి క్రమాన్ని సూచిస్తూ చెప్పిన సూక్తం, నాసదీయ సూక్తం. ఆఖరి శ్లోకం సృష్టికర్త (?) అస్తిత్వాన్ని, ఎరుకనీ, శంకింస్తుంది. ఈ సృష్టికర్త (?) పరమ అమాయకుడా??

ఋగ్వేదంలో దేవతలపై ప్రార్థనలన్నీ ఒక ఎత్తు. ఈ ఒక్క సూక్తం ఒక ఎత్తు. ఈ సూక్తాన్ని అనేకమంది అనువదించారు, వ్యాఖ్యానించరు. దీనిపై బోలెడు రాశారు. ఈ సూక్తంలో ఏదవ శ్లోకంఇది.

ఇయం విసృష్టిర్యత అ బభూవ
యది వా దధే యది వా న
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్‌ త్సో
అంగవేద యది వా న వేద
Whence all creation had its origin,
he, whether he fashioned it, or whether he did not,
he who surveys it all from highest heaven,
he knows – or may be even he does not know.
– A. L. Basham’s translation.
నేను చెప్పిన మూడు ప్రార్థన పద్యాలలో, ముఖ్యంగా చివరి రెండు పద్యాలనీ కాస్త లోతుగా తరిచి చూస్తే, పైన చెప్పిన ఋగ్వేద సూక్తం ఆఖరి శ్లోకం ఆఖరి పాదం స్పర్శ కనిపించక మానదు. ఆలోచించండి

Monday, November 21, 2016

గురువుకు 'నామాలు'!- ఓ సరదా వ్యాఖ్య

గురువును పరబ్రహ్మగా గౌరవించే స్వర్ణయుగం ఎన్నడో వెళ్లిపోయింది.  బ్రహ్మానందంలాంటి హాస్యనటులిప్పుడు గురువు పాత్రల్లో నవ్విస్తున్నారు. 
గురువుని విష్ణువంటారు. ఆ దేవుడివి పది అవతారాలే.  అంతకు  పదింతల అవతారాలు ఈనాటి గురువులు ప్రదర్శించేవి. చీటీ పాటలనుంచి.. ప్రేమపాఠాల వరకు. టెక్స్టు బుక్కులెవరూ ముట్టుకోడంలేదు.  టెక్స్టులు పెట్టుకోడంలోనే ఒజ్జలంతా బిజీ.. బిజీ!
సర్కార్ల పాలనా వాహనాలక్కూడా..పాపం.. పంతుళ్లే చక్రాలు. జనాభా లెక్కల్నుంచి.. ప్రభుత్వ పథకాల  ప్రచారాల్దాకా ఏ గలభాకైనా  దభాల్మని గురొచ్చేది గురువులే ప్రభుత్వాలకి. ఎవరికీ ఏ పనీ తోచనప్పుడు మాత్రమే అయ్యవార్లు బళ్లకెళ్ళి పాఠాలు చెప్పుకొనే వీలు!
హిందీలో చదువును 'శిక్ష' అంటారుట! తెలుగు చదువు' మాత్రం?!  ఇంతుండడు..  బుడతడు! ఇంగిలిపింగిలీసులో తప్ప ఏడవడం తప్పు. దొరల హుకూం! 'టెట్టు'  టిక్కుల పరీక్షలో  గట్టెక్కొచ్చిన గురువులేమైనా 'గుడ్ సామర్టిన్'  తరహా బళ్లల్లో తర్ఫీదయొచ్చిన ‘రెన్ అండ్ మార్టిన్లా’? నామినేటివ్ కేసు.. ఆబ్జెక్టివ్ కేసంటే. ‘అహో! అదోరకమైన సూట్ కేస’నుకునే   చిలకమర్తివారి గణపతి  తంతు అంతా. 'రామా కిల్డ్ రావణ' లో ‘రామా’ది  ఏ కేసని అడిగితే  బల్లగుద్ది మరీ 'మర్డర్ కేస’ని వాదించే జ్ఞానులెంతమంది లేరూ?! తమకే అర్థం కానా పలుకురాయి భాషను.. బలవంతంగా కుక్కేందుకు  బుడతల బుర్రలేమన్నా దూదిబేళ్లు తొక్కే నార బస్తాలా? నేరుగా బెత్తం ఆడిస్తే నేరస్థుల ‘శిక్షా స్మృతి'!  జానా బెత్తెడైనాలేని బొట్టికాయ నెత్తికొక్క మొట్టికాయ తగలకుండా  జ్ఞానసింధువై పోడానికి ఇదేమైనా ‘మహాకవి కాళిదాసు’ సినిమా కథా?!
ఫురువంటే ‘గైడు’ట! సర్కార్లకీ.. పిల్లలకీ మధ్య నలిగే ‘సర్'లకన్నా  కృష్ణార్జునలమధ్య నలిగినా  ఆ గయుడే నయం. .  పంతుళ్లంటే.. తుళ్లుతూ.. తూలుతూ .. పని బాధ్యతలు పట్టకుండా తిరిగే సౌభాగ్యవంతులని 'పన్'చులు మళ్లా! బతకలేక చేసే గొడ్డుచాకిరీనా గతంలో లాగా ఇవాళ్టి బడిపంతులుద్యోగం? బతకడం నేర్చిన గడుసుపిండాలు ఒడిసిపట్టుకొనే ఉపాధి ఉపాయం! 'అ' అంటే అలసత్వం. 'ఆ’ అంటే ఆలస్యం. 'ఇ' అంటే ఇస్పేటాసూ.. 'ఈ' అంటే ఈడు ఆడపిల్లల్ని ఈలేసి ఏడిపించుడు! ఇవేగా  ఇవాళ్టి అలగా పంతుళ్లు పిల్లకాయల కెలాగ మెలగాలో నేర్పే  ఆగామాగం చదువులు! నైటవుట్లు..  కాఫీ కొట్లో కూర్చున్నా కాపీ కొట్టించి మరీ  పరీక్షలు  గట్టెక్కించే నెట్లు  కోట్లున్నప్పుడు.. టీలు.. బట్టీలంటూ పాతకాలంనాటి మోటు పధ్ధతలుఅతో పంతుళ్ల కెందుకు పాట్లు ? ఈ కాలం గురువులీ తరహాలో యువతను తయారు చేస్తున్నారు.
కాబట్టే.. ఇంజనీర్లకు సున్నబట్టీల్లో కూడా  ఉపాధి దొరక్క .. 'జిన్.. బీర్లు' అందించే బార్లల్లో పనిక్కుదురుకుంటున్నారు. గురువులు లఘువులయితే శిశువులు పశువులక మోక్షగుండం విశ్వేశ్వరయ్యలవుతారా? అని వెటకారాలు!

విసుర్లు చాలా ఆయ్యాయిగానీ.. అయ్యవార్ల  వైపు వాదానలుకూడా కాస్త కనికరించి వినండయ్యా స్వాములూ!
గుమ్మడి కడివెడంతుంటేనేమి.. తుంటెంత కత్తికి లోకువంట. చేత బెత్తంలేని గురువుముందు..  శిశువు సుదర్శన చక్రంలేని కృష్ణుడిముందు శిశుపాలుడయ్యలారా! అయ్యవారంటే.. ఇప్పుడు మధ్యాహ్నం పూట భోజనం వండి వార్చి పెట్టే గాడిపొయ్యిముందట చేరిన వంటవాడయిపొయ్యాడయ్యా!
గురువంటే దేవుడే కదా? ఆ దైవానికి మల్లే తనదైన శైలిలో ఒక్క హాజరుపట్టీలో మాత్రమే దర్శనమిస్తే  చాలదా? తరగతి గదిలో సైతం ప్రతీ క్షణం  ఆ గొంతు ఖంగుమంటూ మారుమోగాలా?
ఆన్ లైనులో గురువులు.. ఆఫ్ లైనులో కౌరవలని అంతలేసి రవరవలు అవసరమా?  జాతిపరువు బరువు ఒక్క గురువులే మోయాలని ఏ పాఠ్యప్రణాళికల్లో రాసుందో.. రాళ్లేసేవాళ్లెవరైనా చూపిస్తారా?
గురజాడవారి గిరీశం తిరిగొచ్చినా సరే .. ఏ అంటే యాప్.. బి అంటే బైక్.. సి అంటే సెల్.. అనే వెంకటేశానికి నూరిపోయాల్సిందేనండీ! అప్పుడే సజావుగా  నడిచేది   బడిపంతుల బతుకు బండి! ఈ-కాలంలో కూడా మీ కాలంలా  చెట్టుకింద చదువులా? ఉన్న కులాల క చాలకా.. ఈ గురుకులాల గోల? 'టీ' డబ్బులన్నా  గిట్టుబాటవుతాయని  కాకపోతే ఇంతలా కాకెక్కి పోయే టీచరుద్యోగానికి ఎవరండీ ‘ఠీక్ హైఁ’ అని మొగ్గు చూపేదీ? ఏ ప్రైవేట్లు.. ఫీజులు.. పుస్తకాలు..  వంకతోనో నాలుగంకెల గీతమైనా అదనంగా రాబట్టలేనప్పుడు.. ఈ తెల్లటి బట్టలేసుకునే తంటాలు పడ్డమెందుకంట? వీధికో  ఏటిఎమ్ రాత్రింబవళ్లు వెలిగి పోతుంటుంది. వాచ్ మెన్ చేతికో వాచి తొడిగినా చాలు.. మాస్టర్ పాస్ వర్డుతో వేలు.. లక్షలు!  
భీమ్ రావ్ అంబేద్కర్ (B.R.A) ఓపెన్ విశ్వవిద్యాలయాన్ని  తెలివెక్కువైన తుంటరి గురువెవరో 'బ్రా' ఓపెన్ పెద్దబడి' అన్నాడని   పడీ పడీ నవ్వులా? హరి.. హరీ!  మనమంతా  ఎగబడి మరీ ఓట్లేసి గద్దెలెక్కించేసిన  పెద్దమనుషుల 'ముద్దు' ముచ్చట్ల మాటేమిటో మరి?

ఏకలవ్యుడే మళ్లీ పుట్టొచ్చి ఎల్కేజీ చదువుకోవాలన్నా ఏ అయ్యోరి చెయ్యో తడపకుండా   ముందుకు సాగని ముదుర్రోజులయ్యా ఇవి!
బోర విరుచుకొని  మరీ  'మాది అధ్యాప'కుల'మని టాంటాం కొట్టుకుంటాం. బొక్కబోర్లా పడి మొక్కుకోడానికి మేం ఎవరికన్నా  తక్కువగా తిన్నాం? ముష్టి మూడు లక్షల  ఫీజు.  వేదవేదాంగాలు మీ బిడ్డకి  వంటబట్టించేసెయ్యాలని జులుములు! చచ్చుపుచ్చు సందేహాలడిగినప్పుడు 'షటప్' అని అరవక పోవడమే షడంగాలని మించిన చదువులు మీ బిడ్డలకు  చెప్పినట్లు.
'లీకు వీరుల'మని లేకి మాటలేల? ఆ సందు ఉందనే గదా లక్షలైనా లక్ష్యపెట్టకుండా సందు గొందుల్లో తెరిచిన బడులకైనా  మీ కన్నవాళ్లలా  ఎగబడేస్తున్నది? నిజంగా మేం చండామార్కు మార్కు మాష్టర్లవతారాలే ఎత్తితే  మీ అడ్డాలనాటి బిడ్డడు గడ్డాలు పెంచే వయసుకొచ్చినా  ఫస్టు గ్రేడు గడపైనా  దాటలేడు.
చదువుకునే బళ్లకన్నా..చదువమ్ము'కొనే' బళ్ళకే తమరంతా రాబళ్లెందుకు పెంచుతున్నారో.. ముందా రహస్యం తేల్చాలి. తరువాతే మా మీదే ఔట్లన్నా పేల్చాలి.
ఉపాధ్యాయుడికి ప్రధానోపాధ్యాయుడంటే భయం. ప్రధానోపాధ్యాయుడికి బడి నిర్వాహకుడంటే  భయం. బడి నిర్వాహకుడికి బడి యాజమాన్యమంటే  భయం. బడియాజమాన్యానికి  తల్లిదండ్రులంటే భయం. తల్లిదండ్రులకి పిల్లలంటే భయం. ఆ పిల్ల రాక్షసులకే  ఏ దయ్యాల్ని చూసినా  భయం శూన్యం.  అదే ఇవాళ్టి దైన్య విద్యావవస్థ నిజమైన అవస్థ. 

'టిక్కు' పెట్టే 'టెట్'లు గట్టెక్కి వచ్చిన వాళ్లంతా అచ్చమైన  గురువుల పదవులకు 'ఫిట్' అవుతారనే!

చదువంటే ఆట. పాటగా సాగే జ్ఞానపు బాట.  ఆ దారిలో చురుకుగా నడిపించే అచ్చమైన ఖేల్ రత్నలిప్పుడెక్కడో తప్ప  మెరవడం లేదే!  'స్పాట్ వాల్యూయేషన్'లాంటి సందర్భాలొచ్చినప్పుడు తప్ప   గురుస్థానం విలువ ప్రభువులకైనా గుర్తుకు రావడం లేదే!
చెరువుల్ని పట్టించుకుంటునారు దొరలు. సంతోషం. 'గురువుల్ని కూడా పట్టించుకుంటే మరింత సంతోషం. నదుల అనుసంధానంమీద దృష్టి పెడుతున్నారు  ప్రభువులు. ఆనందం. గురుశిష్యుల అనుబంధాల పునస్సంధానంమీదా శ్రద్ద పెడితే బ్రహ్మానందం.
 మాష్టర్లంటే శిష్యుల మనసు రాతబల్లలమీది పిచ్చిగీతలను చెరిపేసే డస్ఠర్లు. తరగత గదంటే  వట్టి నల్లనల్ల.. తెల్ల సుద్ద.. చెక్క బెంచి.. పుస్తకాల సంచీనే కాదుగా! బిడ్డ కడుపుకి అమ్మ.. ఉడుపుకి  నాన్న.. పూచీ  పడ్డట్లే.. గురువూ బిడ్డ ఆ రెండూ స్వయంగా జీవితంలో సాధించుకొనే వడుపుకు పూచీ పడతాడు. పడాలి కూడా. గురువంటే తరగతి గదిలో విధ్యార్థి సమక్షంలో నిలబడ్డ తల్లి..తండ్రి.. విధాత.. కలగలపు రూపం.
రేపటి జాతి స్వర్ణయుగ భవన నిర్మాణానికి  అవసరమైన బంగారు కణికలెను అందించే విశ్వకర్మ పనితనం విధాత కేవలం ఒక గురుకులానికి మాత్రమే అప్పగించిన విధి. పిల్లలతో కలకలసి గురువు  చేసే  అల్లరిలోనూ ఒక పరమార్థం ఉండటం తప్పనిసరి. తప్పుదారిన నడిస్తే..  విద్యార్థికేనా.. ఉపాద్యాయుడికి శిక్షలుండటం తప్పని సరి. కుర్చీ ఇచ్చి గౌరవించిన సమాజమే గోడకుర్చీ వేసి మరీ శిక్షిస్తుంది.

శిలను శిల్పంగా మలిచే కళాకారుడు కదా ఉపాద్యాయుడు.! చిత్తశుద్ధితో విధి నిర్వహించే ఆ అపర బ్రహ్మకి ప్రతీ విద్యార్థీ ఒక ప్రశ్నాపత్రమే. శిష్యులతో గడిపే ప్రతీ క్షణమూ ఒక పరీక్షా సమయమే! ఆ పరీక్షలో ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం పెరగాలంటే.. ముందుగా జరగాల్సింది ఈ-కాలం వంకన గురు-శిష్య అనుబంధాల్లో క్రమంగా పెరుగుతున్న వంకర సంబంధాలు. ఆ దిశగా మార్పు చేయవలసిన పాఠ్యప్రణాళిక రూపకల్పనలో అటు ప్రభువులే కాదు.. ఇటు సమాజమూ  అంతకు మించిన  ఉత్ప్రేరక పాత్ర నిర్వహించాల్సుంది. వూరికే గురువుల నిర్వాకంమీద ఊకదంపుడు విసుర్లతో శిష్యుల  భవిష్యత్తులు బాగు పడతాయా?!
-కర్లపాలెం హనుమంతరావు
 

అత్తలూ కోడళ్లు- ఈనాడు ఆదివారం సంపాదకీయం


అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లంత అందమైన ద్వంద్వ సమాసం. అత్త అంటే మెట్టినింటి అమ్మ. కోడలంటే అత్తింట కాపురానికొచ్చిన కూతురు.అత్తాకోడళ్ళు కత్తులూ డాళ్లూ కాదుగదా ఇల్లు యుద్ధరంగం  చేసుకోడానికి! జానపదులనుంచి అన్నమయ్యవరకు అంతా ఆతాకోడళ్ళను గూర్చి చింతించినవారే! ఆచార్యులవారి ఓ శృంగార సంవాదంలో లక్ష్మీసరస్వతులు ఆరడి బూకటి  అత్తాకోడళ్ళు.  'రావే కోడలా! .. రట్టు కోడలా!' అంటూ అత్తలక్ష్మి రట్టు చేస్తుంటే .. కోడలు అంబశారద గమ్మునుంటుందా!  'పోవే పోవే అత్తయ్యా!.. పొందులు నీతో చాలును' అంటూ చిందులు వేస్తుంది.అత్తలందరూ ఆదిలక్ష్ములు కారు. కోడళ్లందర్లో శారదాంబలూ లేరు. అత్తాకోడళ్ల సఖ్యతను ఎంతో చక్కంగా విప్పిచెప్పే  'సీత గడియ'  అందుకు సోదాహరణం. సీతమ్మ రాక తాత్సారానికి అలిగి రామయ్య పడకగది గడియ లోపలికి బిడాయిస్తాడు. అత్తను వత్తాసు తెచ్చుకొంటుంది అవనిపుత్రి. 'దశరథుని పుత్రుడవు జనకులల్లుడవు/ భూదేవి అల్లుడవు బుద్ధిటర నీకు!/సీత చేసిన తప్పు శీఘ్రాన చెప్పు నాకు!' అంటూ ముద్దుల కొడుక్కే సుద్దులు చెబుతుంది. కొడుకుకిక తలుపు తీయక తప్పుతుందా! కథంతటితో సుఖాంతమయితే ఆ తీపిలో విశేషమేముంది! అత్త సౌజన్యానికి బదులు తీర్చద్దా కోడలుసీత! 'మా మామ దశరథులు ఒక్కరున్నారు అత్త/మీరు పోండి మా మామ కడకు!' అంటూ సగౌరవంగా అత్తగారిని శయ్యాగారానికి సాగనంపడంలోనే  కోడళ్ళు నేర్వదగిన పాఠాలు బోలెడున్నాయి. కొట్టుకొచ్చినవాడు ఒక్కడైతే.. అత్త కట్టుకొమ్మన్నది ఐదుగురు సోదరులను! కిమ్మనలేదు కోడలు ద్రుపదరాజపుత్రి! అన్నవెంటబడి అడవుల పాలయాడు  చెట్టంత కొడుకు!  దుఃఖబారంతో దీర్ఘనిద్రకు పడింది లేతకోడలు. అయినా పన్నెత్తి ఒక్కఫిర్యాదు చేయలేదు పథ్నాలుగేళ్ళు అత్త సుమిత్ర! పురాణేతిహాసాల నిండుగా  పండంటి అత్తాకోడళ్ల జతలిన్ని ఉండగా.. ఒక సక్కుబాయి కథనే అత్తాకోడళ్లకు ఆపాదించడమే లోక విచిత్రం!

అందాలు చిందేటి కొత్తకోడలంటే ఏ అత్తకైనా  మహా మురిపమే గదా!'చిలుకల్లు చిలుకల్లు అందురేగాని/చిలుకలకు రూపమేమి?పలుకులేగాని/ చిలుకల్లు మా ఇంటి చిన్నికోడళ్లు' అంటూ పదిమందికీ చెప్పి మురుసుకుంటుంది అత్త. కాలుపెట్టిన కొత్త తీరిపోగానే మరి కోడలు ఆ అత్తగారికే  బద్దశత్రువు ఎందుకవుతుందో.. బ్రహ్మయ్యకే తెలియాలి! పడకలో మగడు చేరిన సందు చూసుకొని 'చందమామకన్న చక్కని మగడా!/వేరె పోదామా!/ అత్తమామల పోరు నేను పడలేను/ వేరె పోదామా!' అంటూ జోరీగ రొదలు మొదలుపెడుతుంది. కోడళ్లందరూ అత్తలని కోఱుపెడతారని కాదూ! పుట్టినింటిని మించి మెట్టినింటిని ప్రేమించే ఆడబిడ్డలకూ లోకం గొడ్డుపోలేదు. 'పుట్టింటి దీర్ఘాయువు కావలనంచు/ పున్నమి చంద్రుడికి పూజ నే సేతు/ అత్తింటి దీర్ఘాయువు కావలెనంచు/ ఆదినారాయుడికి ఆజ్యమ్ములిత్తు' లాంటి  పాటలు ఎందుకు పుడతాయి కోడళ్ల మనసుల్లో ప్రేమాభిమానాలు లేకపోతే! ఆదరించే కోడళ్లకూ కొడుకులు కోదండాలు వేసి ఓ మూల కుదేయాలని కొందరు అత్తలు ఎందుకు కోరుకొంటారో! విధాతకే ఎరుక పడాలి! కాలం మారుతున్నది. అనుగుణంగా మగవాడి గుణగణాలూ మారుతున్నాయి. పాతకాలపు చాదస్తం అత్తగారిది. 'పాలల్లో మురిపాలు కలిపి/ కారంలో మమకారం నింపి/ అరచేతులని పాదాలకింద నిలిపి/ అపురూపంగా' పెంచుకొచ్చిన కొడుకు మరో కోమలికొంగు తాళంచెవికింద మారడం మందు మింగినట్లే ఉంటుంది. కోరి కొడుక్కని ఏరి తెచ్చుకొన్న బెల్లం  అంగిట్లో అల్లమయితే ఏ ఆత్తగారికయినా 'పచ్చిపాలమీద మీగడలు.. వేడిపాలమీద వెన్నతరకలే' గుర్తుకొస్తాయికదా కోడళ్లను రాచి రంపాన పెట్టే వంకలకు! కోడళ్లు చదువుకొంటున్నారు. సామ్ర్యాజ్యాలు ఏలుతున్నారు ఇప్పుడు. మాట పడతారా! 'వచ్చితి మే మత్తింటికి పుట్టింటిని వీడి పెక్కు యాశలతోడన్/ తెచ్చితి మేమింటి వెలుగు, మెచ్చుచు మా భర్తలు కడు డెందము మీరన్/ ముచ్చటపడి ఇంటిపనులు మురిపముగ చేయబూన ముందుకు రాగా/ రచ్చన ప్రకటించి నీవు పరిహాసము చేయబూన తగునే యత్తా!' అంటూ తగవుకు దిగడంతో అత్తాకోడళ్ల యుద్ధం ఆరంభం!



పెత్తనాలకోసం ప్రపంచయుద్ధాలే జరుగుతున్నాయి.. పంచయుద్ధాలు అబ్బురమా.. అనుకోవద్ధు! చెప్పులోని రాయి.. చెవిలోని జోరీగలా ఇంటిలోని పోరు ఇంతటితో పోయేదా! ఆత్త ఆడమని.. కోడలు కుంటమంటే మధ్యనున్న మగవాడు ఏ గోదారి ఈదాలి? 'ఏరేరు సంసార మెన్నాడు మొగుడో!.. మడికాడి సెల్కా మనపాలి కొచ్చింద/ మంచిగా దున్నించి మొక్కజొన్నేయించి/ నడీత కూసోని నా పెగ్గె సూయిత్త' అని కోడలందుకొందంటే ఇంటిపగ్గాలు అత్తనుంచి ఊడలాగాలనుకొన్నట్లే! 'అత్తమ్మ అమ్మకు మరోరూపం' అని కోడలనుకోవాలి. అందుకు  కూతురంత అపురూపంగా కోడల్ని అత్తగారూ చూసుకోవాలి. శాంతిభద్రతలు ఏ గడ్డమీదైనా ముందు ఇంటినుంచే కదా మొదలయేది! అమ్మకు చెప్పలేక, ఆలికి నచ్చచెప్పలేక.. ఇంటాయన పాటించే అలీనవిధానాలవల్లే వందకు ముప్పైమూడు ఇళ్లు వల్లకాడుల్లా కాలుతున్నాయని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు తేల్చిచెబుతున్నాయి. పదిమందికి ఇద్దరు కోడళ్ళు అత్తారింట్లో కత్తులబోను కాపురంతో చిక్కులు పడుతుంటే.. అంతకు రెట్టింపుమంది అత్తలు అవసానదశలో కొడుకింట  పున్నామనరకంతో ముమిలిపోతున్నారని  సర్వే సారాంశం. సంసారమంటే సమస్యల తోరణం.. సరే! సమస్యలతోనే నిత్యం రణం అయితే ఎలా? శిక్షా స్మృతి  ఏవో 498 (ఏ) సెక్షనుకింద కోడళ్లకో వజ్రాయుధం అందించవచ్చు. అత్తలకోసం ఆత్మరక్షణార్థం మరేదో బ్రహ్మాస్తం తయారు చేయనూవచ్చు. అస్త్రశస్త్రాలతో సాధ్యమయేదనేనా అత్తాకొడళ్ల మధ్య సామరస్యం?  కుమారీ శతకాల వల్లెవేతలు లేకబోతే మానె.. పెళ్లిచేసి అత్తారింటికి  అప్పగించే సుకుమారీలకు కాళిదాసు కణ్వమహర్షిలా కనీస సుద్దులన్నా కన్నవారు మప్పుకోవద్దా! 'పోయేది అత్తలకాలం.. వచ్చేది కోడళ్ల కాలం' అని సామెత. అత్తలామాత్రం పెద్దరికంతో సర్దుకుపోవద్దా! అత్తాకోడళ్లంటే కలిసి 'సెల్ఫీ'లు తీసుకోవడమే కాదుగా! 'సెల్ఫ్'(స్వార్థం) పుడకలను తీసిపారేసి  సుఖశాంతులనే పానకాలని  ఇంటిల్లిపాదితో తాగించడం కూడా! 

(ఈనాడు సంపాదకీయం- ఈనాడు యాజమాన్యానికి, సంపాదక వర్గానికి ధన్యవాదాలతో)

Saturday, November 19, 2016

పెద్దనోట్ల రద్దు చిన్న వ్యూహమేం కాదు! -వార్తా వ్యాఖ్య


2016, నవంబరు 8 రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో 500, 1000 నోట్లు రద్దయినప్పటి రెండు రోజుల వరకు ప్రతికూలమైన స్పందనలు అంతగా ఏ దిశవైపునుంచి రాకపోవడం గమనించాలి. ముఖ్యంగా.. ప్రతిపక్షాలనుంచి. ఈ పథకం వల్ల పెనునష్టానికి గురయ్యే వర్గాలనుంచైతే అస్సలు మాటా పలుకు లేదు. ప్రధాని తన ప్రకటనలోనే సామాన్యులకు ఈ సంస్కరణ వల్ల కొన్ని రోజులు ఇబ్బందులు ఎదురవుతాయి.. దేస సంక్షేమం కోసం, తనకోసం కనీసం ఓ 50  రోజులు సహించమని చేసిన విన్నపంలోని నిజాయితీ కూడా సామాన్యుణ్ణి కదిలించింది. మాటలు వేరు.. అనుభవం వేరు. ఒక లెక్క ప్రకారం దాదాపు 8.25 లక్షల కోట్ల 500 నోట్లు, 6.70 లక్షల కోట్లకు విలువైన 1000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ ఈ ప్రకటన నాటికి చలామణిలో ఉంది. అదంతా ఒక్క రద్ధుతో కొద్ది కాలంలోనే  చిత్తు కాగితాల పోగుగా మారడానికి సిద్ధమై పోయింది. పెద్ద నోట్లు అధిక శాతం సహజంగానే నల్ల కుబేరుల దగ్గర పోగై ఉంటాయి, వాస్తవానికి వాళ్లు ఆందోళన చెందాల్సిన అతి పెద్ద దుర్ఘటన. నిరసన అటు వైపునుంచి కాకుండా.. సామాన్యుల వైపునుంచి రావడం మొదలు పెట్టింది. చిన్న జనం ఆక్రోశమంతా తమ దగ్గర ఉన్న కాస్తో కూస్తో పెద్ద నోట్లు ఎక్కడ చెల్లకుండా పోతాయోనని. వాటి మీద ఆధారపడే నిత్యజీవితావసరాలను గడుపుకోడానికి బాగా అలవాటు పడిన జనానికి ఆ మాత్రం ఆందోళన ఉండటం తప్పదు. రద్ధైన నోట్లను చిన్న నోట్లతోగాని.. కొత్తగా తాయారు చేసిన 500, 2000 నోట్లతోగాని బదిలీ చేసుకోవచ్చు కొన్ని చిన్న చిన్న నిబంధనలను సక్రమంగా పాటిస్తే. కానీ ఎందుచేతనో నోట్ల జారీని  పాటించవలసిన ఆర్థిక సంస్థలు.. బ్యాంకులు.. తపాలా ఆఫీసులముందు.. చాంతాండంత క్యూలు ఎన్ని రోజులకూ ముందుకు  కదలకుండా ఉండిపోవడంతో నిరసన గళాలకు మెల్లిగా స్వరం పెరిగింది. కొత్త నోట్లను ఇవ్వవలసిన ఏటియంలు బొత్తిగా చేతులెత్తేయడం కూడా ఈ అయోమయానికి మరింత గందరగోళం జత చేసింది. పండగ రోజుల్లో.. పెళ్లిళ్ల సీజనులో ప్రధాని ఇంత పెద్ద రద్ధు సంస్కరణను ఎందుకు చేసారో అర్థం కాలేదు. దానికి తోడు ప్రభుత్వ యంత్రాంగం ఆశించినంత చురుగ్గా నోట్ల బదిలీ.. నగదు జమ వ్యవహారం నిర్వహణ సాగడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు కనీసం కనుచూపు మేరలోనైనా కనిపించక పోవడంతో.. సామన్యుల నిరసన సాకుని పెద్ద వర్గాలు.. ప్రతిపక్షాలు.. నల్లకుబేరులు.. ఈ సంస్కరణ మూలకంగా తాత్కాలికంగా నష్టపోతున్న వ్యాపార వర్గాలు.. ఓపిక పట్టే అలవాటు లేకుండా అలవోకగా కువిమర్శలకు దిగిపోయే మధ్య తరగతి జీవులు.. నిరసన జ్వాలలను ఎగదోస్తున్న సమాచార మాధ్యమాలు.. ఇవన్నీ కలిపి సృష్టిస్తున్న ఆందోళనకరమైన వాతావరణం పుణ్యమా అని  వాస్తవంగా ఈ పెద్ద నోట్ల రద్దు దేశానికి ముందు ముందైనా ఏదైనా  మేలు చేస్తుందా? అని కుశంక పెంచుతోంది.
సరైన ముందస్తు చర్యలు చేపట్టకుండా  ఇంత పెద్ద సంస్కరణను ప్రధాని ముందుకు తీసుకు రాకుండా ఊండవలసిందని సర్వోన్నత న్యాయస్థానమూ వ్యాఖ్య్లలు చేయడం గమనార్హం. సందు దొరికతే ఆందోళనకు దిగి చట్టసభలను స్థంభింప చేసే రాజకీయ వాతావరణం మన దేశ ప్రజలు ఇవాళే కొత్తగా  చూస్తున్న విషయం కాదు కాబట్టి దాన్ని గురించి ఏ వ్యాఖ్యానమూ అవసరం కాదు.
స్వతంత్రం వచ్చిన ఈ ఏదు దశాబ్దాలలో నోట్ల రద్దు ఇవాళే కొత్తగా మొదటి సారి జరిగింది కాదు అంటున్నారు, నిజమే.. కానీ.. నోట్లు రద్ధయిన సంధర్భం.. రద్దుచేసిన ప్రభత్వాన్నికూడా పరిగణనలోకి తీసుకుంటే.. కచ్చితంగా.. జాతికి మునపటి సంస్కరణల మాదిరిగా కాకండా మేలు చేసే చర్యే!
2014 ఎన్నికల ప్రచార సందర్భంలో ప్రధాని అభర్థిగా మోదీ ప్రజలముందు  పదే పదే విదేశాల్లో దాగిన  నల్లధనం  తిరిగి స్వదేశానికి రప్పించడం గురించి ప్రస్తావించేవారు. ఈ దేశానికి చెందిన ఆ చట్టబద్ధమైన సొమ్మునంతా తెప్పించగలిగితే ఒక్కో పౌరుడికి 15లక్షల రూపాలయదాకా లాభం వస్తుందన్నది  ఓ లెక్కగా సామాన్యుడికి వివరించేందుకు చెప్పిన వివరం. అలా ఆయాచితంగా డబ్బు వచ్చి పడుతుందని ఏ అమాయకుడూ ఆశ పడలేదుగానీ.. హామీ ఇచ్చిన మేరక్ కొన్నైనా చర్యలుంటాయనై ఆశపడ్డ మాట నిజం. మోదీకి వచ్చిన భారి మెజారిటీల కారణాలలో ఇదీ ఒకటి. గద్దె ఎక్కైనప్పట్నుంచీ మోదీని ప్రతి పక్షాలు ఎద్దేవా చేస్తూనే ఉన్నాయి.. నల్లధనమెక్కడా? 15 లక్షల జమ ఎప్పుడు? అంటూ. నరేంద్ర మోదీ నైజం తెలిసిన వాళ్ళెవరూ ఇలా ఎగతాళికి పూనుకోరు. ఈ దేశపు రాజకీయ నెతల మాదిరి మాటకు మాట చెప్పడం ఆయనకు అలవాటు లేదు. మొనంగా ఉంటూనే.. తన మానాన తాను నిశ్శబ్దంగా పని చేసుకుంటూ .. చివరి ఫలితం ద్వారా జవాబు చెప్పడం ఆయన రాజకీయ విధానం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనివిధానాన్ని గమనించిన వారందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు. నల్లధనం విషయంలోనూ ఆయన నిమ్మకు నీరెత్తినట్లేం  కూర్చో లేదు. గద్దెనెక్కిన కొత్తల్లోనే విదేశాల్లోని నల్లధనం వెలితీతకు
సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పరిశోధక బృంధాన్ని ఏర్పాటు చేసారు. బ్యాంకింగు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఒకరికొకరు మార్పిడి చెసుకోనే విదేశీ ఒప్పందాలకు చొరవ చూపించారు. బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. జనధన్ యోజన- నగదు చెల్లింపులమీద వత్తిడి తగ్గించి లావాదేవీలన్నీ బ్యాంకు కాతాల ద్వారా సాగించేందుకు చేసిన తొలి చొరవ. మన దేశంలో అధిక శాతం ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలో సాగడం వల్ల.. అక్రమార్జన పరులకు పెద్ద నోట్లు ఓ గొప్ప వరంగా మారింది. ఈ పరిస్థితి ఇప్పుడే కొత్తగా వచ్చింది కూడా కాదు. గతకాలపు యూడిఏ పాలనలో కూడా నల్లదనంగో  ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థ నిర్భయంగా సాగుతుండేది. కట్టడి చేసేందుకు ప్రభుత్వం తరుఫునుంచి నామామాత్రపు చర్యలే కొనసాగుతుండడం.. పన్నులు చెల్లించకుండా సొమ్మును దాచుకొనే నైజాన్ని మరింత ఈ దేశవాసులకు మరింత నేర్పించినట్లయింది. ఏవేవో స్వచ్చంద ఆదాయ ప్రకటనల పథకాలు వస్తూ పోతుండేవే కాని.. వాటిని చిత్తశుద్ధితో అమలు చేసే యంత్రాంగం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థను 70% నల్లధనమేమో నడిపించే దురవస్థ కొనసాగుతూ వచ్చింది. దీనికి తోడు సరిహద్దుల కవతల నుంచి ఉగ్ర వాదులు చైనా సాంకేతిక సహాయంతో నకిలీ నోట్లు గుద్ది చలామణీలో పెట్టేవారు. అలా పెడుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించే స్థాయికి వచ్చిన తరువాతే మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టింది. అన్ని విషయాలమీద చక్కని అవగాహన ఏర్పరుచుకున్నందువల్లే  నల్లధనం కట్టడికి తీసుకునే ముందస్తు చర్యలను గుట్టు చప్పుడు కాకుండా ఉంచడం జరిగింది. ఆఖరి అవకాశంగా మొన్నటి 'స్వచ్చంద ఆదాయ ప్రకటన' పథకం ప్రకటించినా.. కొత్త ప్రభుత్వం పనితీరుని సరిగ్గా అర్థం చేసుకోలేని నల్లకుబేరులు ఎప్పటిలాగానే నల్లమందు మింగిన రోగుల్ల చల్లంగా ఉండి పోయారు. అక్కడికీ వెంకయ్యనాయుడు గతి కొద్ది కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నాడు.. మోదీ మిగతా ప్రధానుల్లా కాదని.. కశ్మీర్ ఉగ్రవాదులమీద చేసిన సర్జికల్ దాడుల్ని చూసైనా అర్థం చేసుకోవాలని. ఏమయింది? దేశ నల్లకుబేరులమీద సర్జికల్ దాడి మొదలైంది. మందు ముందు మరిన్ని ఆపరేషన్లుంటాయని మళ్ళీ మళ్ళీ హెచ్చరికలూ వస్తున్నాయి.
ప్రధాని టైమింగుని గురించి జనసామాన్యం ఓ రకంగా విమర్శిస్తుంటే.. రాజకీయ పక్షాల
విమర్శ మరో విధంగా ఉంది. త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసిన దొంగదెబ్బగా మమతా బెనర్జీనుంచి.. ములాయం సింగుదాకా అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఈ దేశంలో చివరికి పంచాయితీ ఎన్నికనైనా సరే.. డబ్బు ప్రమేయం లేకుండా ఊహించుకోడం సాధ్యం కాని స్థితికి చేరుకున్నాం మనం. రాష్ట్రాల ఎన్నికలంటే ఎన్ని వేల కోట్లు కుమ్మరించాలో వేరే వివరించనక్కర్లేదు. దానికీ సిద్ధపడి దాచుకొన్న దొంగ డబ్బు  సంచీ మూటలను అభ్యర్థులు విప్పుతున్న చివరి దశలో ఉరుములేని పిడుగులాగా నరేంద్ర మోడీ ఒక్క మధ్యరాత్రి ప్రకటనతో మొత్తం తలకిందులు చేసేసాడు! ముందు ముందు ఇంకేమోమో చేసేస్తానంటున్నాడని దుగ్ధ. మమతా బెనర్జీ..సిపియం వంటి బద్ధ శత్రువులు సైతం ఏకం అవాల్సి వచ్చిందంటే.. మోదీజీ తీసుకున్న ఈ పెద్ద నోట్ల రద్దు ఎంత పెద్ద సంస్కరణో అర్థమవుతోంది కదా!
నిజమే! సరైన హోం వర్కు కొరవడ్డం వల్ల తగినంత చిల్లర నోట్లు  లేక  చిన్న చిన్న వ్యాపారులు .. వయోధికులు.. రోగులు..రోజు కూలీలు.. రైతులు..  పసిపిల్లలు.. చిరు జీతగాళ్లు.. వండి వార్చి పెట్టవలసిన మహిళలు.. ఆగచాట్లు పడుతున్న మాట అక్షరాలా నిజం. ఇంత పెద్ద చర్య తీసుకునేముందు ఎంత గోప్య్తత అవసరమైనా .. సామాన్య జనం నిత్యావసర జీవనాధారాలమీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉండవలసింది. ఎంత ఉపద్రవంలో అయినా దొంగదారులు వెతికే నల్లకుబేరుల నక్కజిత్తు వ్యూహాలను నిరోధించేందుకు మరికొంత అధ్యయనం చేసి ఉండవలసింది. ఆ మాట ఇప్పుడు మోదీజీ కూడా ఒప్పుకుంటున్నారు. కనక ఊహించని లోపాలు బైటపడిన ప్రతి సందర్భంలోనూ.. వెంటనే తగు చర్యలు తీసుకొనే ప్రణాళికలు సిద్ధం చేయాల్సుంది. దేశాధ్యక్షుడు ఒక్కడి చేతే 'సరే' అనిపిస్తే చాలదు. దేశం మొత్తం 'శభాష్' అనే రీతిలో ఈ సంస్కరణల పర్వం నిరాటంకంగా కొనసాగిస్తే.. దశాబ్దాలుగా దేశానికి పట్టిన పీడ నివారణ అవడం ఎంత సేపు! రాజకీయాలతో సామాన్యుడికి సంబంధం లేదు. సామాన్యుడు పేరుమీద సాగే రాజకీయాలతో అసలే సంబంధం లేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన అవుతుందంటున్నారు. ఉగ్రవాదుల ఆట కడుతుందంటున్నారు. దరలు తగ్గి సామాన్యుడి నిత్యజీవనంలో అనన్యంగా గణనీయమైన మేలు సంభవమంటున్నారు. ప్రపంచంలో పదేళ్లలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతామంటున్నారు. ఆన్నీ కాకపోయినా .. కొన్నైనా నిజమైతే.. ఇన్ని రోజులుగా సామాన్యులు పడుతున్న కష్టాలకు ఒక సార్థకత ఏర్పడినట్లవుతుంది.
రాజకీయాలదేముంది? ఈ దేశంలో ఎప్పుడూ అవసరార్థం అటూ ఇటూ మరుతుండేవే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం.. ప్రజల వలన.. ప్రజల కొరకు కదా సాగాల్సింది!
-కర్లపాలెం హనుమంతరావు

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...