Monday, November 21, 2016

అత్తలూ కోడళ్లు- ఈనాడు ఆదివారం సంపాదకీయం


అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లంత అందమైన ద్వంద్వ సమాసం. అత్త అంటే మెట్టినింటి అమ్మ. కోడలంటే అత్తింట కాపురానికొచ్చిన కూతురు.అత్తాకోడళ్ళు కత్తులూ డాళ్లూ కాదుగదా ఇల్లు యుద్ధరంగం  చేసుకోడానికి! జానపదులనుంచి అన్నమయ్యవరకు అంతా ఆతాకోడళ్ళను గూర్చి చింతించినవారే! ఆచార్యులవారి ఓ శృంగార సంవాదంలో లక్ష్మీసరస్వతులు ఆరడి బూకటి  అత్తాకోడళ్ళు.  'రావే కోడలా! .. రట్టు కోడలా!' అంటూ అత్తలక్ష్మి రట్టు చేస్తుంటే .. కోడలు అంబశారద గమ్మునుంటుందా!  'పోవే పోవే అత్తయ్యా!.. పొందులు నీతో చాలును' అంటూ చిందులు వేస్తుంది.అత్తలందరూ ఆదిలక్ష్ములు కారు. కోడళ్లందర్లో శారదాంబలూ లేరు. అత్తాకోడళ్ల సఖ్యతను ఎంతో చక్కంగా విప్పిచెప్పే  'సీత గడియ'  అందుకు సోదాహరణం. సీతమ్మ రాక తాత్సారానికి అలిగి రామయ్య పడకగది గడియ లోపలికి బిడాయిస్తాడు. అత్తను వత్తాసు తెచ్చుకొంటుంది అవనిపుత్రి. 'దశరథుని పుత్రుడవు జనకులల్లుడవు/ భూదేవి అల్లుడవు బుద్ధిటర నీకు!/సీత చేసిన తప్పు శీఘ్రాన చెప్పు నాకు!' అంటూ ముద్దుల కొడుక్కే సుద్దులు చెబుతుంది. కొడుకుకిక తలుపు తీయక తప్పుతుందా! కథంతటితో సుఖాంతమయితే ఆ తీపిలో విశేషమేముంది! అత్త సౌజన్యానికి బదులు తీర్చద్దా కోడలుసీత! 'మా మామ దశరథులు ఒక్కరున్నారు అత్త/మీరు పోండి మా మామ కడకు!' అంటూ సగౌరవంగా అత్తగారిని శయ్యాగారానికి సాగనంపడంలోనే  కోడళ్ళు నేర్వదగిన పాఠాలు బోలెడున్నాయి. కొట్టుకొచ్చినవాడు ఒక్కడైతే.. అత్త కట్టుకొమ్మన్నది ఐదుగురు సోదరులను! కిమ్మనలేదు కోడలు ద్రుపదరాజపుత్రి! అన్నవెంటబడి అడవుల పాలయాడు  చెట్టంత కొడుకు!  దుఃఖబారంతో దీర్ఘనిద్రకు పడింది లేతకోడలు. అయినా పన్నెత్తి ఒక్కఫిర్యాదు చేయలేదు పథ్నాలుగేళ్ళు అత్త సుమిత్ర! పురాణేతిహాసాల నిండుగా  పండంటి అత్తాకోడళ్ల జతలిన్ని ఉండగా.. ఒక సక్కుబాయి కథనే అత్తాకోడళ్లకు ఆపాదించడమే లోక విచిత్రం!

అందాలు చిందేటి కొత్తకోడలంటే ఏ అత్తకైనా  మహా మురిపమే గదా!'చిలుకల్లు చిలుకల్లు అందురేగాని/చిలుకలకు రూపమేమి?పలుకులేగాని/ చిలుకల్లు మా ఇంటి చిన్నికోడళ్లు' అంటూ పదిమందికీ చెప్పి మురుసుకుంటుంది అత్త. కాలుపెట్టిన కొత్త తీరిపోగానే మరి కోడలు ఆ అత్తగారికే  బద్దశత్రువు ఎందుకవుతుందో.. బ్రహ్మయ్యకే తెలియాలి! పడకలో మగడు చేరిన సందు చూసుకొని 'చందమామకన్న చక్కని మగడా!/వేరె పోదామా!/ అత్తమామల పోరు నేను పడలేను/ వేరె పోదామా!' అంటూ జోరీగ రొదలు మొదలుపెడుతుంది. కోడళ్లందరూ అత్తలని కోఱుపెడతారని కాదూ! పుట్టినింటిని మించి మెట్టినింటిని ప్రేమించే ఆడబిడ్డలకూ లోకం గొడ్డుపోలేదు. 'పుట్టింటి దీర్ఘాయువు కావలనంచు/ పున్నమి చంద్రుడికి పూజ నే సేతు/ అత్తింటి దీర్ఘాయువు కావలెనంచు/ ఆదినారాయుడికి ఆజ్యమ్ములిత్తు' లాంటి  పాటలు ఎందుకు పుడతాయి కోడళ్ల మనసుల్లో ప్రేమాభిమానాలు లేకపోతే! ఆదరించే కోడళ్లకూ కొడుకులు కోదండాలు వేసి ఓ మూల కుదేయాలని కొందరు అత్తలు ఎందుకు కోరుకొంటారో! విధాతకే ఎరుక పడాలి! కాలం మారుతున్నది. అనుగుణంగా మగవాడి గుణగణాలూ మారుతున్నాయి. పాతకాలపు చాదస్తం అత్తగారిది. 'పాలల్లో మురిపాలు కలిపి/ కారంలో మమకారం నింపి/ అరచేతులని పాదాలకింద నిలిపి/ అపురూపంగా' పెంచుకొచ్చిన కొడుకు మరో కోమలికొంగు తాళంచెవికింద మారడం మందు మింగినట్లే ఉంటుంది. కోరి కొడుక్కని ఏరి తెచ్చుకొన్న బెల్లం  అంగిట్లో అల్లమయితే ఏ ఆత్తగారికయినా 'పచ్చిపాలమీద మీగడలు.. వేడిపాలమీద వెన్నతరకలే' గుర్తుకొస్తాయికదా కోడళ్లను రాచి రంపాన పెట్టే వంకలకు! కోడళ్లు చదువుకొంటున్నారు. సామ్ర్యాజ్యాలు ఏలుతున్నారు ఇప్పుడు. మాట పడతారా! 'వచ్చితి మే మత్తింటికి పుట్టింటిని వీడి పెక్కు యాశలతోడన్/ తెచ్చితి మేమింటి వెలుగు, మెచ్చుచు మా భర్తలు కడు డెందము మీరన్/ ముచ్చటపడి ఇంటిపనులు మురిపముగ చేయబూన ముందుకు రాగా/ రచ్చన ప్రకటించి నీవు పరిహాసము చేయబూన తగునే యత్తా!' అంటూ తగవుకు దిగడంతో అత్తాకోడళ్ల యుద్ధం ఆరంభం!



పెత్తనాలకోసం ప్రపంచయుద్ధాలే జరుగుతున్నాయి.. పంచయుద్ధాలు అబ్బురమా.. అనుకోవద్ధు! చెప్పులోని రాయి.. చెవిలోని జోరీగలా ఇంటిలోని పోరు ఇంతటితో పోయేదా! ఆత్త ఆడమని.. కోడలు కుంటమంటే మధ్యనున్న మగవాడు ఏ గోదారి ఈదాలి? 'ఏరేరు సంసార మెన్నాడు మొగుడో!.. మడికాడి సెల్కా మనపాలి కొచ్చింద/ మంచిగా దున్నించి మొక్కజొన్నేయించి/ నడీత కూసోని నా పెగ్గె సూయిత్త' అని కోడలందుకొందంటే ఇంటిపగ్గాలు అత్తనుంచి ఊడలాగాలనుకొన్నట్లే! 'అత్తమ్మ అమ్మకు మరోరూపం' అని కోడలనుకోవాలి. అందుకు  కూతురంత అపురూపంగా కోడల్ని అత్తగారూ చూసుకోవాలి. శాంతిభద్రతలు ఏ గడ్డమీదైనా ముందు ఇంటినుంచే కదా మొదలయేది! అమ్మకు చెప్పలేక, ఆలికి నచ్చచెప్పలేక.. ఇంటాయన పాటించే అలీనవిధానాలవల్లే వందకు ముప్పైమూడు ఇళ్లు వల్లకాడుల్లా కాలుతున్నాయని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు తేల్చిచెబుతున్నాయి. పదిమందికి ఇద్దరు కోడళ్ళు అత్తారింట్లో కత్తులబోను కాపురంతో చిక్కులు పడుతుంటే.. అంతకు రెట్టింపుమంది అత్తలు అవసానదశలో కొడుకింట  పున్నామనరకంతో ముమిలిపోతున్నారని  సర్వే సారాంశం. సంసారమంటే సమస్యల తోరణం.. సరే! సమస్యలతోనే నిత్యం రణం అయితే ఎలా? శిక్షా స్మృతి  ఏవో 498 (ఏ) సెక్షనుకింద కోడళ్లకో వజ్రాయుధం అందించవచ్చు. అత్తలకోసం ఆత్మరక్షణార్థం మరేదో బ్రహ్మాస్తం తయారు చేయనూవచ్చు. అస్త్రశస్త్రాలతో సాధ్యమయేదనేనా అత్తాకొడళ్ల మధ్య సామరస్యం?  కుమారీ శతకాల వల్లెవేతలు లేకబోతే మానె.. పెళ్లిచేసి అత్తారింటికి  అప్పగించే సుకుమారీలకు కాళిదాసు కణ్వమహర్షిలా కనీస సుద్దులన్నా కన్నవారు మప్పుకోవద్దా! 'పోయేది అత్తలకాలం.. వచ్చేది కోడళ్ల కాలం' అని సామెత. అత్తలామాత్రం పెద్దరికంతో సర్దుకుపోవద్దా! అత్తాకోడళ్లంటే కలిసి 'సెల్ఫీ'లు తీసుకోవడమే కాదుగా! 'సెల్ఫ్'(స్వార్థం) పుడకలను తీసిపారేసి  సుఖశాంతులనే పానకాలని  ఇంటిల్లిపాదితో తాగించడం కూడా! 

(ఈనాడు సంపాదకీయం- ఈనాడు యాజమాన్యానికి, సంపాదక వర్గానికి ధన్యవాదాలతో)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...