2016, నవంబరు
8 రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో 500, 1000 నోట్లు రద్దయినప్పటి రెండు రోజుల
వరకు ప్రతికూలమైన స్పందనలు అంతగా ఏ దిశవైపునుంచి రాకపోవడం గమనించాలి. ముఖ్యంగా.. ప్రతిపక్షాలనుంచి.
ఈ పథకం వల్ల పెనునష్టానికి గురయ్యే వర్గాలనుంచైతే అస్సలు మాటా పలుకు లేదు. ప్రధాని
తన ప్రకటనలోనే సామాన్యులకు ఈ సంస్కరణ వల్ల కొన్ని రోజులు ఇబ్బందులు ఎదురవుతాయి.. దేస
సంక్షేమం కోసం, తనకోసం కనీసం ఓ 50 రోజులు సహించమని
చేసిన విన్నపంలోని నిజాయితీ కూడా సామాన్యుణ్ణి కదిలించింది. మాటలు వేరు.. అనుభవం వేరు.
ఒక లెక్క ప్రకారం దాదాపు 8.25 లక్షల కోట్ల 500 నోట్లు, 6.70 లక్షల కోట్లకు విలువైన
1000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ ఈ ప్రకటన నాటికి చలామణిలో ఉంది. అదంతా ఒక్క రద్ధుతో
కొద్ది కాలంలోనే చిత్తు కాగితాల పోగుగా మారడానికి
సిద్ధమై పోయింది. పెద్ద నోట్లు అధిక శాతం సహజంగానే నల్ల కుబేరుల దగ్గర పోగై ఉంటాయి,
వాస్తవానికి వాళ్లు ఆందోళన చెందాల్సిన అతి పెద్ద దుర్ఘటన. నిరసన అటు వైపునుంచి కాకుండా..
సామాన్యుల వైపునుంచి రావడం మొదలు పెట్టింది. చిన్న జనం ఆక్రోశమంతా తమ దగ్గర ఉన్న కాస్తో
కూస్తో పెద్ద నోట్లు ఎక్కడ చెల్లకుండా పోతాయోనని. వాటి మీద ఆధారపడే నిత్యజీవితావసరాలను
గడుపుకోడానికి బాగా అలవాటు పడిన జనానికి ఆ మాత్రం ఆందోళన ఉండటం తప్పదు. రద్ధైన నోట్లను
చిన్న నోట్లతోగాని.. కొత్తగా తాయారు చేసిన 500, 2000 నోట్లతోగాని బదిలీ చేసుకోవచ్చు
కొన్ని చిన్న చిన్న నిబంధనలను సక్రమంగా పాటిస్తే. కానీ ఎందుచేతనో నోట్ల జారీని పాటించవలసిన ఆర్థిక సంస్థలు.. బ్యాంకులు.. తపాలా
ఆఫీసులముందు.. చాంతాండంత క్యూలు ఎన్ని రోజులకూ ముందుకు కదలకుండా ఉండిపోవడంతో నిరసన గళాలకు మెల్లిగా స్వరం
పెరిగింది. కొత్త నోట్లను ఇవ్వవలసిన ఏటియంలు బొత్తిగా చేతులెత్తేయడం కూడా ఈ అయోమయానికి
మరింత గందరగోళం జత చేసింది. పండగ రోజుల్లో.. పెళ్లిళ్ల సీజనులో ప్రధాని ఇంత పెద్ద రద్ధు
సంస్కరణను ఎందుకు చేసారో అర్థం కాలేదు. దానికి తోడు ప్రభుత్వ యంత్రాంగం ఆశించినంత చురుగ్గా
నోట్ల బదిలీ.. నగదు జమ వ్యవహారం నిర్వహణ సాగడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితుల్లో
అనుకూలమైన మార్పులు కనీసం కనుచూపు మేరలోనైనా కనిపించక పోవడంతో.. సామన్యుల నిరసన సాకుని
పెద్ద వర్గాలు.. ప్రతిపక్షాలు.. నల్లకుబేరులు.. ఈ సంస్కరణ మూలకంగా తాత్కాలికంగా నష్టపోతున్న
వ్యాపార వర్గాలు.. ఓపిక పట్టే అలవాటు లేకుండా అలవోకగా కువిమర్శలకు దిగిపోయే మధ్య తరగతి
జీవులు.. నిరసన జ్వాలలను ఎగదోస్తున్న సమాచార మాధ్యమాలు.. ఇవన్నీ కలిపి సృష్టిస్తున్న
ఆందోళనకరమైన వాతావరణం పుణ్యమా అని వాస్తవంగా
ఈ పెద్ద నోట్ల రద్దు దేశానికి ముందు ముందైనా ఏదైనా మేలు చేస్తుందా? అని కుశంక పెంచుతోంది.
సరైన ముందస్తు
చర్యలు చేపట్టకుండా ఇంత పెద్ద సంస్కరణను ప్రధాని
ముందుకు తీసుకు రాకుండా ఊండవలసిందని సర్వోన్నత న్యాయస్థానమూ వ్యాఖ్య్లలు చేయడం గమనార్హం.
సందు దొరికతే ఆందోళనకు దిగి చట్టసభలను స్థంభింప చేసే రాజకీయ వాతావరణం మన దేశ ప్రజలు
ఇవాళే కొత్తగా చూస్తున్న విషయం కాదు కాబట్టి
దాన్ని గురించి ఏ వ్యాఖ్యానమూ అవసరం కాదు.
స్వతంత్రం వచ్చిన ఈ ఏదు దశాబ్దాలలో నోట్ల
రద్దు ఇవాళే కొత్తగా మొదటి సారి జరిగింది కాదు అంటున్నారు, నిజమే.. కానీ.. నోట్లు రద్ధయిన
సంధర్భం.. రద్దుచేసిన ప్రభత్వాన్నికూడా పరిగణనలోకి తీసుకుంటే.. కచ్చితంగా.. జాతికి
మునపటి సంస్కరణల మాదిరిగా కాకండా మేలు చేసే చర్యే!
2014 ఎన్నికల
ప్రచార సందర్భంలో ప్రధాని అభర్థిగా మోదీ ప్రజలముందు పదే పదే విదేశాల్లో దాగిన నల్లధనం
తిరిగి స్వదేశానికి రప్పించడం గురించి ప్రస్తావించేవారు. ఈ దేశానికి చెందిన
ఆ చట్టబద్ధమైన సొమ్మునంతా తెప్పించగలిగితే ఒక్కో పౌరుడికి 15లక్షల రూపాలయదాకా లాభం
వస్తుందన్నది ఓ లెక్కగా సామాన్యుడికి వివరించేందుకు
చెప్పిన వివరం. అలా ఆయాచితంగా డబ్బు వచ్చి పడుతుందని ఏ అమాయకుడూ ఆశ పడలేదుగానీ.. హామీ
ఇచ్చిన మేరక్ కొన్నైనా చర్యలుంటాయనై ఆశపడ్డ మాట నిజం. మోదీకి వచ్చిన భారి మెజారిటీల
కారణాలలో ఇదీ ఒకటి. గద్దె ఎక్కైనప్పట్నుంచీ మోదీని ప్రతి పక్షాలు ఎద్దేవా చేస్తూనే
ఉన్నాయి.. నల్లధనమెక్కడా? 15 లక్షల జమ ఎప్పుడు? అంటూ. నరేంద్ర మోదీ నైజం తెలిసిన వాళ్ళెవరూ
ఇలా ఎగతాళికి పూనుకోరు. ఈ దేశపు రాజకీయ నెతల మాదిరి మాటకు మాట చెప్పడం ఆయనకు అలవాటు
లేదు. మొనంగా ఉంటూనే.. తన మానాన తాను నిశ్శబ్దంగా పని చేసుకుంటూ .. చివరి ఫలితం ద్వారా
జవాబు చెప్పడం ఆయన రాజకీయ విధానం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనివిధానాన్ని
గమనించిన వారందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు. నల్లధనం విషయంలోనూ ఆయన నిమ్మకు నీరెత్తినట్లేం కూర్చో లేదు. గద్దెనెక్కిన కొత్తల్లోనే విదేశాల్లోని
నల్లధనం వెలితీతకు
సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక
పరిశోధక బృంధాన్ని ఏర్పాటు చేసారు. బ్యాంకింగు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఒకరికొకరు
మార్పిడి చెసుకోనే విదేశీ ఒప్పందాలకు చొరవ చూపించారు. బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకు
కొత్త చట్టాలు తీసుకొచ్చారు. జనధన్ యోజన- నగదు చెల్లింపులమీద వత్తిడి తగ్గించి లావాదేవీలన్నీ
బ్యాంకు కాతాల ద్వారా సాగించేందుకు చేసిన తొలి చొరవ. మన దేశంలో అధిక శాతం ఆర్థిక లావాదేవీలు
నగదు రూపంలో సాగడం వల్ల.. అక్రమార్జన పరులకు పెద్ద నోట్లు ఓ గొప్ప వరంగా మారింది. ఈ
పరిస్థితి ఇప్పుడే కొత్తగా వచ్చింది కూడా కాదు. గతకాలపు యూడిఏ పాలనలో కూడా నల్లదనంగో ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థ నిర్భయంగా సాగుతుండేది.
కట్టడి చేసేందుకు ప్రభుత్వం తరుఫునుంచి నామామాత్రపు చర్యలే కొనసాగుతుండడం.. పన్నులు
చెల్లించకుండా సొమ్మును దాచుకొనే నైజాన్ని మరింత ఈ దేశవాసులకు మరింత నేర్పించినట్లయింది.
ఏవేవో స్వచ్చంద ఆదాయ ప్రకటనల పథకాలు వస్తూ పోతుండేవే కాని.. వాటిని చిత్తశుద్ధితో అమలు
చేసే యంత్రాంగం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థను 70% నల్లధనమేమో నడిపించే దురవస్థ కొనసాగుతూ
వచ్చింది. దీనికి తోడు సరిహద్దుల కవతల నుంచి ఉగ్ర వాదులు చైనా సాంకేతిక సహాయంతో నకిలీ
నోట్లు గుద్ది చలామణీలో పెట్టేవారు. అలా పెడుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించే స్థాయికి
వచ్చిన తరువాతే మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టింది. అన్ని విషయాలమీద చక్కని అవగాహన
ఏర్పరుచుకున్నందువల్లే నల్లధనం కట్టడికి తీసుకునే
ముందస్తు చర్యలను గుట్టు చప్పుడు కాకుండా ఉంచడం జరిగింది. ఆఖరి అవకాశంగా మొన్నటి 'స్వచ్చంద
ఆదాయ ప్రకటన' పథకం ప్రకటించినా.. కొత్త ప్రభుత్వం పనితీరుని సరిగ్గా అర్థం చేసుకోలేని
నల్లకుబేరులు ఎప్పటిలాగానే నల్లమందు మింగిన రోగుల్ల చల్లంగా ఉండి పోయారు. అక్కడికీ
వెంకయ్యనాయుడు గతి కొద్ది కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నాడు.. మోదీ మిగతా ప్రధానుల్లా కాదని..
కశ్మీర్ ఉగ్రవాదులమీద చేసిన సర్జికల్ దాడుల్ని చూసైనా అర్థం చేసుకోవాలని. ఏమయింది?
దేశ నల్లకుబేరులమీద సర్జికల్ దాడి మొదలైంది. మందు ముందు మరిన్ని ఆపరేషన్లుంటాయని మళ్ళీ
మళ్ళీ హెచ్చరికలూ వస్తున్నాయి.
ప్రధాని టైమింగుని
గురించి జనసామాన్యం ఓ రకంగా విమర్శిస్తుంటే.. రాజకీయ పక్షాల
విమర్శ మరో విధంగా ఉంది.
త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసిన దొంగదెబ్బగా మమతా
బెనర్జీనుంచి.. ములాయం సింగుదాకా అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఈ దేశంలో చివరికి పంచాయితీ
ఎన్నికనైనా సరే.. డబ్బు ప్రమేయం లేకుండా ఊహించుకోడం సాధ్యం కాని స్థితికి చేరుకున్నాం
మనం. రాష్ట్రాల ఎన్నికలంటే ఎన్ని వేల కోట్లు కుమ్మరించాలో వేరే వివరించనక్కర్లేదు.
దానికీ సిద్ధపడి దాచుకొన్న దొంగ డబ్బు సంచీ
మూటలను అభ్యర్థులు విప్పుతున్న చివరి దశలో ఉరుములేని పిడుగులాగా నరేంద్ర మోడీ ఒక్క
మధ్యరాత్రి ప్రకటనతో మొత్తం తలకిందులు చేసేసాడు! ముందు ముందు ఇంకేమోమో చేసేస్తానంటున్నాడని
దుగ్ధ. మమతా బెనర్జీ..సిపియం వంటి బద్ధ శత్రువులు సైతం ఏకం అవాల్సి వచ్చిందంటే.. మోదీజీ
తీసుకున్న ఈ పెద్ద నోట్ల రద్దు ఎంత పెద్ద సంస్కరణో అర్థమవుతోంది కదా!
నిజమే! సరైన
హోం వర్కు కొరవడ్డం వల్ల తగినంత చిల్లర నోట్లు
లేక చిన్న చిన్న వ్యాపారులు .. వయోధికులు..
రోగులు..రోజు కూలీలు.. రైతులు.. పసిపిల్లలు..
చిరు జీతగాళ్లు.. వండి వార్చి పెట్టవలసిన మహిళలు.. ఆగచాట్లు పడుతున్న మాట అక్షరాలా
నిజం. ఇంత పెద్ద చర్య తీసుకునేముందు ఎంత గోప్య్తత అవసరమైనా .. సామాన్య జనం నిత్యావసర
జీవనాధారాలమీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉండవలసింది. ఎంత ఉపద్రవంలో అయినా దొంగదారులు
వెతికే నల్లకుబేరుల నక్కజిత్తు వ్యూహాలను నిరోధించేందుకు మరికొంత అధ్యయనం చేసి ఉండవలసింది.
ఆ మాట ఇప్పుడు మోదీజీ కూడా ఒప్పుకుంటున్నారు. కనక ఊహించని లోపాలు బైటపడిన ప్రతి సందర్భంలోనూ..
వెంటనే తగు చర్యలు తీసుకొనే ప్రణాళికలు సిద్ధం చేయాల్సుంది. దేశాధ్యక్షుడు ఒక్కడి చేతే
'సరే' అనిపిస్తే చాలదు. దేశం మొత్తం 'శభాష్' అనే రీతిలో ఈ సంస్కరణల పర్వం నిరాటంకంగా
కొనసాగిస్తే.. దశాబ్దాలుగా దేశానికి పట్టిన పీడ నివారణ అవడం ఎంత సేపు! రాజకీయాలతో సామాన్యుడికి
సంబంధం లేదు. సామాన్యుడు పేరుమీద సాగే రాజకీయాలతో అసలే సంబంధం లేదు. పెద్ద నోట్ల రద్దు
వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన అవుతుందంటున్నారు. ఉగ్రవాదుల ఆట కడుతుందంటున్నారు. దరలు
తగ్గి సామాన్యుడి నిత్యజీవనంలో అనన్యంగా గణనీయమైన మేలు సంభవమంటున్నారు. ప్రపంచంలో పదేళ్లలో
బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతామంటున్నారు. ఆన్నీ కాకపోయినా .. కొన్నైనా నిజమైతే.. ఇన్ని
రోజులుగా సామాన్యులు పడుతున్న కష్టాలకు ఒక సార్థకత ఏర్పడినట్లవుతుంది.
రాజకీయాలదేముంది?
ఈ దేశంలో ఎప్పుడూ అవసరార్థం అటూ ఇటూ మరుతుండేవే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం.. ప్రజల
వలన.. ప్రజల కొరకు కదా సాగాల్సింది!
-కర్లపాలెం హనుమంతరావు
***
No comments:
Post a Comment