Saturday, June 23, 2018

నన్నయగారి ననీన భాషావాదం



మహాభారతం కవిత్రయంలో నన్నయ మొదటివాడు. ఆయనకు 'వాగనుశాసనుడు' అని బిరుదు. 'వాక్' అంటే మాట. మాటను శాసించేవాడు వాగనుశాసనుడు. అంతలా నన్నయ భాషను ఏం శాసించాడు? ‘వాగనుశాసనుడు’ అన్న బిరుదుకు  ఆయన అసలు అర్హుడేనా? ఔను, కాదు.. అని ఏ నిర్ణయానికైనా వచ్చే ముందు ఈ చిన్ని వివరణ ఒకసారి చూస్తే మంచిది.
నన్నయకాలం క్రీ.శ 11వ శతాబ్దం. ఆ కాలం నాటికి తెలుగు మరీ అంత ముదరలేదు. పలుకుబడులన్నీ దేశీఛందస్సులోవే. అంటే జనం మాట్లాడుకునే భాషా యాసా కు సంబంధించినవన్న  మాట. ఆ యాసభాషల్లోనే  రాజులూ శాసనాలు వేయించేవాళ్లు.

నన్నయను పోషించిన చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుడికి ఈ దేశీయ పలుకుబడుల మీద  బాగా మోజు.  'మును మార్గకవిత లోకంబున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం/ గు నిలిపి రంధ్ర విషయమున జన చాళుక్యరాజు మొదలగు పల్వుర్' అని నన్నెచోడుడు తన కుమారసంభవం అవతారికలో ఆ  చాళుక్య ప్రభువుకు ధృవపత్రం కూడా ఇచ్చివున్నాడు.
రాజుగారికి జనంభాష పైన ఎంత ప్రేమున్నా అప్పటి వరకు తెలుగులో ఒక్క స్వతంత్రమైన, సవ్యమైన కావ్యం రాలేదన్న బెంగా ఉండేది. అప్పటి దాకా ఉన్నవన్నీ సంస్కృతానువాదాలే. కనీసం తన హయాములోనైనా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టించాలన్న ఉద్దేశంతో నన్నయని వ్యాస విరచిత సంసృత మహాభారతం తెలుగు చేయమని పురమాయించాడు. నన్నయనే ఎంచుకోవడానికి కారణం.. ఆ కవిగారికి సంస్కృతాంధ్రాల మీద ఉన్న అమోఘమైన పట్టు.
కానీ అప్పటికి ప్రచారంలో ఉన్న తెలుగు  పదజాలంతో కావ్యం రాయడం కుదరదు. అందునా రాసే కావ్యానికి పంచమవేదం మాతృక! అసలే సంస్కృత భాష అత్యంత గహ్యమైనది. ఆ భాషకు సరిపడా తెలుగు పదజాలం జనం నుంచి సేకరించడం నిజంగా పెద్ద సవాలే! అందునా ఇప్పటి మాదిరి సాంకేతిక సాధనాలేమన్నా అప్పట్లో అందుబాటులో ఉన్నాయా? అదనంగా అప్పటికి ఇంకా తెలుగులో వాక్యనిర్మాణమే పటిష్టంగా లేని స్థితి. తనకోసం గాను తాను ఒక వాక్యనిర్మాణ క్రమం.. అదీ తానే అంతకు ముందు నిబద్ధీకరించిన వ్యాకరణ  సూత్రాలకు లోబడి ఉండడం అవసరం.  ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటో సమర్థవంతంగా రచన ఆరంబించాడు నన్నయ!
వాక్యానికే కాదు అసలు అప్పటి తెలుగు పదానికి కూడా ఒక ప్రామాణిక  రూపం లేదు. ఒకే పదాన్ని ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు, ఎవరి ఇష్టం వచ్చిన రూపంలో వాళ్లు రాసేసుకునేవాళ్ళు. ఆ తరహా భాషే రాజులు వేయించిన శాసనాల మీద  కనిపించేది. ఇలాంటి పదాలు కొన్ని ఆచార్య గంటి సోమయాజిగారి 'ఆంధ్రభాషా చరిత్రము'లో, ఆచార్య ఖండవల్లి  నిరంజనంగారి  'ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము'లో కనిపిస్తాయి.
'దేవుడు' అనే పదానికి దేవడు అని ఒకళ్ళు, దేవండు అని ఒకళ్లు, దేవణ్డు అని ఒకళ్లు రాసేవాళ్లు. 'తూర్పు' అనే పదాన్ని 'తూఱ్పు' అని, 'తూఱ్గు' అని, 'తూఱ్వు' అనే రూపాలుగా రాయడం ఉంది. రెడ్ది కి ‘రట్టగుడి’, ఎనిమిది కి ‘ఎణం బొది’.. ఇట్లా ఒక స్థిరమైన రూపం అంటూ లేకుండా సాగే  పదాలకు  ఒక కుదురైన ఆకారం కల్పించడం నిజంగా పెద్ద సవాలే కదా! హ్రస్వాలుండే చోట దీర్ఘాలు, సాధురేఫాలు రాయాల్సినప్పుడు శకటరేఫాలు వాడేవాళ్లు. బిందువుకు బదులు వర్ణమాలలోని వర్గం చివరి అక్షరాలు ఙ్, ణ్ లాంటివి యధేఛ్చగా వాడేస్తూ గందరగోళం చేసిన తెలుగు మాటలకు ఒక స్థిరమైన రూపం కల్పించడం  మాటలా? ఆ సమస్యా అధిగమించాడు నన్నయ.
అప్పటికి తెలుగులో కొద్ది దేశీయ వృత్తాలు, అదనంగా చంపకమాల. ఉత్పలమాల మాత్రమే వాడుకలో ఉండేవి. అవసరానికి అనుగుణంగా వృత్తాల సంఖ్యను పెంచుకుంటూ అత్యంత గాఢమైన, గూఢమైన వ్యాసభారతం ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలో కొంత భాగం అపూర్వంగా పూర్తిచేసి మరీ రాజరాజనరేంద్రుడి చేత ‘శహ్ భాష్’ అనిపించుకొన్నాడు నన్నయ భట్టారకుడు. 'వాగనుశాసనుడు' అని ప్రశంసలు అందుకున్నాడు.
ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా అప్పటికి తెలుగులో ఇంకా చిక్కబడని కవితా ప్రక్రియకు అప్పటికే సంపూర్ణ వికాసం పొందిన కన్నడ కవితా స్వరూపాన్ని అద్దడం అద్భుతమైన విన్యాసం. అందుకే తోటి కవులు నోటితో సైతం ‘ఔను.. నన్నయ నిజంగా వాగనుశాసనుడే’ అని మెప్పించుకొన్నాడు ఆ మహాభరత ఆరంభ రచయిత.
ఆనాటికి ఉన్న పూర్వ భాషాప్రమాణాల ప్రకారం నన్నయ మహాభారతం మొదటి రెండున్నర పర్వాలలో  పోయిన భాషాపోకడలు అత్యంత నవీనం.. అపూర్వం. ఆ రకంగా చూసినా నన్నయ భట్టారకుడు వట్టి వాగనుశాసనుడే కాదు.. గట్టి నవీనభాషావాది కూడా!
-కర్లపాలెం హనుమంతరావు
24 -06 -2018



Thursday, June 21, 2018

సినిమా మాటలంటే 'మాటలు కాదు'!- సరదా వ్యాసం




'సావధానం బలదేవా.. సావధానం! ఇదిగో నా పాచికల మీద ఒట్టుపెట్టుకుని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. ఆలకించండి! మోసం చేసి కపట ద్యూతం చేసి పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్లు వనవాసానికి వెళ్లారు. అ దుర్వార్త విని నువ్వు మమ్ములను దండించడానికి వచ్చావు. నువ్వొక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానికి, అతిముఖస్తుతికి లోబడతావని నాకు తెలుసు. మా జాతివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసాననంతరం మళ్లీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముని సహాయం లేకుండా చేయడానికి. కానీ.. యతోధర్మ స్తతోజయః అన్నట్లు మాకు తగిన శాస్తే జరిగింది'
సినిమా ఇంకో పావుగంటలో అయిపోతుందనంగా శకుని వేషంలో సియస్ఆర్ పలికిన ఈ నిమిషం డైలాగు మాయాబజారు సినిమా మొత్తానికీ పెద్ద డైలాగ్. తెలుగులో సియస్ఆర్ సింగిల్ టేక్ లో ఓకే చేయిస్తే.. తమిళంలో నంబియార్ నాలుగైదు టేకులు తిని బావురుమన్నాడని.. గుమ్మడి వెంకటేశ్వర్రావుగారు తన 'తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు'లో రాసుకున్నారు. ఒక నిమిషం డైలాగులో సినిమా కథ సారాన్నంతా సరళమైన భాషలో పామరుడికి కూడా అర్థమయే పద్ధతిలో ఇలా రాయడానికి ఎంతో పాండిత్యంతో పాటు సినిమా ప్రక్రియ మీద అంతులేని అవగాహన ఉండితీరాలి. అవి పింగళివారికి పుష్కలంగా ఉన్నాయి. కనుకనే మాయాబజార్ సంభాషణా శైలికి అత్యుత్తమ  మైన తార్కాణంగా ఈనాటికి ఫిలిం స్కూళ్ళ నుండి సినిమా సభల వేదికల మీద వరకు అన్నింటా ఉధహరించుకుంటున్నాం మనం.
సినిమా సంభాషణ అంటే క్లుప్తంగా, సరళంగా, సహజంగా, పాత్రోచితంగా, స్పష్టంగా భావం పలికేలా, జీవం ఉట్టిపడేలా, జనంభాషలో అందంగా, కథాప్రయోజనానికి దోహదపదే విధంగా ఉండాలని సినీపండితుల నిశ్చితాభిప్రాయం.
పాత్రలకు బదులు రచయితలు మాట్లాడడం పాతపద్ధతి. అంటే అన్ని పాత్రలూ ఒకే మూసలో పలికే మొనోటోనీ విధానమన్న మాట.
ఫిలిం ప్రక్రియ ఖరీదైన వ్యవహారం. కనుక వృధా సంభాషణలకు ప్రోత్సాహముండదు. టీవీ ధారావాహికాలకి ఈ సాగతీత ఉంటుంది! అక్కడ 'డై'లాగ్ అంటే చచ్చిందాకా సాగదీయడమనే అర్థం సరిపోతుందేమో కానీ.. సినిమాలో ప్రతీ సెకనూ ఖరీదైన వ్యవహారమే. కాబట్టి అవసరమైనంత మేరకే పాత్ర పెదాలు కదిలించాలి. అదీ సినీ సంభాషణలకు సంబంధించినంత వరకు ప్రథమ ప్రధాన సూత్రం.
పాత సినిమాలలో పాత్రలు పూర్తిగా పుస్తకాల భాష మాట్లాడేవి. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక సందేశమో, పోలికో తెచ్చి చప్పట్లు కొట్టించుకొనేవి. రంగస్థలం వాసనలు పూర్తిగా తొలగిపోని తొలినాటి దశ అది. ఇప్పుడు సినిమాలకు సంభాషణలు రాసేవాళ్లకు నాటకాలతో ప్రత్యక్షంగా అనుబంధం లేదు. నేరుగా జీవితాలనుంచి సినిమాలలోకి దిగబడిన సరుకే ఎక్కువ.  సినీ సంభాషణలు పక్కింట్లో  నుంచి వినిపించే తరహాలో ఉండటానికి అదే కారణం. ఇది మంచి మార్పే! కానీ.. కత్తెర వేసేవాళ్ల చెవుల్లో డబ్బు చెట్లు మొలవడం వల్ల  పదిమంది ముందు వినడానికి ఇబ్బంది కలిగించే పదాలు కూడా విచ్చలవిడిగా వెండితెర మీద వినిస్తున్నాయి! కథానాయకులు సైతం ప్రతినాయకులను మించి బూతు పురాణాలు విప్పడం పసిపిల్లల మీదా, మాస్ మనస్తత్వం ఉన్నవాళ్ల మీదా విపరీతమైన చెడుప్రభావం చూపిస్తోంది.
పాత సినిమాలలో పాత్రలు సందర్భోచితంగా చక్కని తెలుగు  నుడికారంతో  మాట్లాడేవి. సంభాషణలు రాసేవాళ్లు సంస్కృతాంధ్రాలలో ఉద్దండులైనా, సినిమా ప్రక్రియ ప్రధానంగా పామరజనరంజకం అనే  భావన ఉంది కనుక సరళమైన, సజీవమైన భాషను ఎన్నుకొనేవాళ్లు. పౌరాణిక చిత్రమైనా మాయబజారులోని పాత్రలు నేలబారు ప్రేక్షకులకు అర్థమయే పదాలనే వాడాయి. ‘మోడర్నిజం’ మిషతో ఇప్పుడు వచ్చిపోయే మెజారిటీ చిత్రాలు కనీసం టైటిళ్లలో అయినా తెలుగుదనం ఉండకూడదని ఒట్టు పెట్టుకున్నట్లున్నాయి! వీలైనన్ని సన్నివేశాల్లో బట్లరింగ్లీష్ దంచేస్తున్నారు. రాసేవాడికీ, రాయించుకొనేవాడికీ కనీసం ఇంటర్మీడియేట్ స్థాయి ఇంగితమైనా లేని కారణంగా సినిమాల ద్వారా వీళ్లు వినిపిస్తున్న బూతుపదాలే జనసామాన్యంలో ఊతపదాలుగా స్థిరపడుతున్నాయి!
సినిమా ప్రధానంగా దృశ్యమాధ్యమంగా వినోదపరిచే కళ. దృశ్యపరంగా చెప్పలేని సందర్భాలప్పుడే మాటల ద్వారా భావప్రకటన జరగాలన్నది  మూలసూత్రం. 'మాతృదేవోభవ' చిత్రంలోని ఒక సన్నివేశం ఇప్పటికీ కళ్లముందు కనిపించి కంటతడి పెట్టిస్తుంటుంది. భర్త తాగుబోతు. భార్యకు కేన్సర్. పిల్లలు అనాధలైపోతారని ఆ తల్లి దిగులు. ఒక్కొక్కరినే దత్తత కిచ్చేస్తుంటుంది. కవల పిల్లల్లో ఒకడు దివ్యాంగుడు. ముందు వాడినే దత్తు తీసుకుందామని వచ్చిన డబ్బున్న దంపతుల ఆలోచన. కానీ వాడికి తోబుట్టువులను విడిచి వెళ్ళాలని ఉండదు. అయినా వెళ్లకుండా ఉండలేని పరిస్థితి.  చివరికి  దివ్యాంగుడికి బదులు మంచి బిడ్డను దత్తు తీసుకొని దంపతులు వెళ్ళిపోతున్నప్పుడు 'అవిటి కాలుతో పుట్టడమే నా అదృష్టం' అంటూ ఆ దివ్యాంగుడు సంబరపడుతుంటే ఆ సంభాషణ రాసిన రచయిత సత్యమూర్తికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించ బుధ్దేస్తుంది.
కామెడీ ఎన్టర్టైన్మెంట్ వంకతో ఇప్పుడొచ్చే సినిమాల్లో మూడొంతుల భాగాన్ని కథతో ఏమాత్రం సంబంధం లేని కుళ్ళు స్కిట్లతో నింపేస్తున్నారు. కాబట్టే జాతీయస్థాయిలో తెలుగు సినిమా రూపాయి విలువలా రోజు రోజుకూ దిగజారుతోంది.
మాయాబజారులో మాయాశశిరేఖ పెళ్లిసందడి సన్నివేశం  గుర్తుందా?  వధువు రూపంలో ఉన్న ఘటోత్కచుడు వరుడి పాదం మహారాక్షసంగా తొక్కేస్తాడు. లక్ష్మణకుమారుడు గగ్గోలు పెట్టేస్తుంటే శశిరేఖ నంగనాచిలా 'ఆర్యపుత్రులు నా కాలు తొక్కచ్చునేం?' అంటూ ఒక్క వాక్యంతో వగలాడితనమంతా ప్రదర్శిస్తుంది.   ఆ ఘట్టంలో రచయిత వాడిన ఆ చిన్న వాక్యంలోనే సావిత్రి ఎన్నో రకాల హావభావాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. చలనచిత్రం ప్రధానంగా పాత్రల హావభావాల ద్వారా నడిచే దృశ్యమాలికేగా!
సన్నివేశం పండేందుకు చాంతాడంత  సంభాషణలు దండగ. డైలాగ్ ఎంత చిన్నదైతే ప్రేక్షకుడి మెదడు అంత పదునుగా పనిచేస్తుంది. నాటి మిస్సమ్మ నుంచి నేటి 'అతడు' వరకు విజయవంతమైన చిత్రాలన్నింటిలో పదునైన స్వల్ప సంభాషణలే  ప్రధానపాత్ర పోషించాయి. సినిమా సంభాషణలు రాసే రచయితలు సూక్ష్మంగా గ్రహించాల్సింది  ఏ సన్నివేశానికి  ఏ మోతాదులో పాత్రల నోట సందర్భోచితమైన డైలాగులు సాధ్యమైనంత సంక్షిప్తంగా పలికించాలన్నది.
మాయాబజారు చిత్రం ఈనాటికీ మూవీ రచయితలకు మంచి గైడ్. సమర్థత  ఉంటే తల్పాలకు బదులు గిల్పాలు, కంబళ్లకు బదులు గింబళ్ళు కూడా సృష్టించేయచ్చు. ఆ చిత్రంలోనే పింగళివారు అన్నట్లు 'ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది?'
దుషట చతుషటయం, అసమదీయులు, తసమదీయులు వంటి సందర్భోచితమైన పదాలు ఎప్పుడు ప్రయోగించాలో వర్ధమాన రచయితలు ముందు అధ్యయనం చేయాలి.  'బోర్' అనే ఆంగ్లపదానికి 'సుత్తి' ని తిరుగులేని ప్రత్యామ్నాయంగా మార్చేసిన జంధ్యాల సామర్థ్యం ఒక్క రోజుల్లో అలవడే రసవిద్య కాదు. పట్టుదలగా పదాల మీద పట్టు సాధించాలి. ఒక తరంలో ముళ్లపూడి ప్రదర్శించిన విలక్షణ పూలశైలి, అనంతరం జంధ్యాల ప్రవేశపెట్టిన గిలిగింతల స్టైల్, సమాంతరంగా పరుచూరి సోదరులు  కదను తొక్కించిన జవనాశ్వపు వరవడి, నవరసాలను సైతం ఒకే లైనులో ప్రకటించే త్రివిక్రమ్ మాటల మంత్రం.. అబ్బో.. అలా.. చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి వాలం సైతం చిన్నదనిపించే జాబితా మన ఒకనాటి తెలుగు సినీ సంభాషణా రచయితలది. 'సినిమాకి మాటలు రాయడమంటే మాటలు కాదు'  అన్న మాట ముందు ప్రవర్థనమాన సినీరచయితలు మనసులో పెట్టుకుంటే చాలు.. శ్రధ్ద దానంతటే పుట్టుకొచ్చేస్తుంది.
పామర జనానికి ఈనాటికీ సినిమాలే పరమ ప్రామాణికం. శారదమ్మ తన మీద ప్రసరించిన అక్షర కటాక్షాన్ని ప్రజాహితానికి మాత్రమే వినియోగించడం ప్రతీ సినీరచయిత సామాజిక బాధ్యత. సినిమాకు వినోదం ప్రధానమే.. కానీ మనోవికాసాన్నీ అది తోడుతెచ్చుకోవాలి.   
-కర్లపాలెం హనుమంతరావు
20 -06 -2018
(ఆంధ్రభూమి దినపత్రిక -09, జూలై, 2009, వెన్నెల పుటలో ప్రచురితం)



Tuesday, June 19, 2018

ఆకాశరామన్న ఆంధ్రభూమి వార పత్రిక ప్రచురితం

ఆంధ్రభూమి వారపత్రిక ఫిబ్రవరి, 19, 2009 లో ప్రచురితం అయిన నా కథ
ఆకాశరామన్నః
చదివి స్పందించమని మనవి
మీ
కర్లపాలెం హనుమంతరావు
20 -06 -2018
ఇదీ లంకెః
ఆకాశరామన్న కథ - ఆంధ్రభూమి వారపత్రిక 19 -02 - 2009


ఆలస్యం .. అమృతం.. విషం -కథ

ఆలస్యం.. అమృతం.. విషం.. కథ గురించి కొద్దిగాః
ల్యాప్ టాప్ లో పాత దస్త్రాలు తిరగేస్తుంటే బైట పడిన కథ ఇదిః
సుమారు 7 ఏళ్ల కిందట రాసినట్లుంది ఈ కథ కింది తారీఖును బట్టి చూస్తే! ఏ పత్రికకూ పంపించినట్లు లేదు. ఆ విధంగా పంపిస్తే కింద తారీఖుతో సహా వివరాలు రాస్తుంటాను,, అది నా అలవాటు.
ఎందుకు  పంపించలేదు? అని సందేహం వచ్చే వాళ్లకు చెప్పేందుకు ఇప్పుడు నా దగ్గర సమాధానం ఉంది. కానీ ఒకటి రెండు రోజులు తాళి చెబుతాను. ముందు బ్లాగులో పెట్టిన ఈ కథ మీద పాఠకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఉంది.
కథ చదివి మీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పమని మనవి!
మీ
కర్లపాలెం హనుమంతరావు
19 -06 -2018

Monday, June 18, 2018

పనికిమాలినవాడు- ఆంధ్రప్రభలోని ఒకనాటి నా కథ



అనుకోకుండా ఆన్ లైన్లో దొరికిందీ నా కథ. పేరు 'పనికిరావివాడు'- ఆంధ్రప్రభ వారపత్రిక 03-07-1985 సంచికలో ప్రచురితం. అప్పట్లో రోజుకో కథ రాస్తుడేవాడిని.. ఎడా.. పెడా! కనపడిన పత్రికకు పంపించేవాడిని. తిరుగు స్టాంపులు గట్రాలు పెట్టడాలు ఉండేవి కావు. అచ్చేసే వాళ్లు వేసే వాళ్లు. పత్రిక కాంప్లమెంటరీ ఇంటికి వస్తేనో.. దయ తలచి ఎవరైనా పారితోషికం పంపిస్తేనో తప్ప కథ అచ్చయిన విషయం తెలిసేది కాదు. ఆట్టే పట్టించుకొనేవాడిని కాను. అదో చాదస్తం అప్పట్లో! 32 ఏళ్ల కిందట కదా! ఎక్కువ కథలు ఆంధ్రప్రభలోనె వచ్చినట్లు గుర్తు. అయితే అప్పట్లో ప్రాంప్టుగా పారితోషికం పంపే  మంచి పత్రికల్లో ఆంధ్రప్రభ ముందుండేది. అది ఆంధ్రప్రభ ఒక వెలుగు వెలిగిన రోజులు.  ఆంధ్రప్రభకు ఆంధ్రపత్రికకు మధ్య మంచి పోటీ ఉండేది. అందులో కథలు రాసే వాళ్లకు ఇందులో,, ఇందులో కథలు రాసే వాళ్లకి అందులో సాధారణంగా అవకాశం ఇచ్చేవాళ్లు కాదు. నా కథలు అధిక భాగం ఆంధ్రప్రభలోనో.. ఆంధ్రజ్యోతిలోనో వస్తుండేవి. ఆంధ్రజ్యోతికి వనితాజ్యోతి అని మరో మహిళా పత్రిక కూడా ఉంటుండేది. దానిలోనూ మా శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి పేరుతో చాలా కథలే ప్రచురితం అయేవి. ఏవీ కాపీలు తీసి పెట్టుకొనే అలవాటు లేనందు వల్ల ఏవేవి ఎక్కడ ఎందులో పడేవో.. ఏవి చెత్త బుట్టలో పడేవో.. అప్పుడే తెలీనప్పుడు ఇహ ఇప్పుడు ఏం తెలుస్తుంది? 'కొండయ్యగారి గుండు జాడీ' పేరుతో విజయవాడ ప్రయివేటు బస్సుల ఆగం మీద అప్పట్లో రాసిన హాస్యకథకు మంచి స్పందన వచ్చినట్లు గుర్తు. అలాగే హాలివుడ్ యాసలో  మాట్లాడే  ఇంగ్లీ షు సినిమాలకు  క్రమం తప్పకుండా వెళుతుండే వాళ్లం. బొమ్మల్ని బట్టి కథ ఫాలో అవడమే కాని.. సంభాషణలు అర్థమయేవి కావు... ఇంగ్లీషు చదవడం రాయడం వచ్చేదే కాని.. అమెరికన్ ఎక్సెంట్ ఫాలో అయేటంత పట్టు అప్పటికి ఇంకా ఏర్పడలేదు.  సినిమా ఎప్పుడు ఐ పోయిందో అర్థమవక ఒక్కో సారి ఇంటర్వెల్ బెల్లుకే బైటికి రావడమ్.. మరో సారి సినిమా ఐ పోయినా ఇంకా ఉందని కుర్చీలోనుంచి లేవకుండా కూర్చోడం. మేమే కాదు.. మాలాగాఎందరో ప్రేక్షకులు అప్పట్లో అలా! ఆ తరహా సన్నివేశాల మీద సిట్యుయేషనల్ కామెడీ దట్టించి రాసిన 'సినిమా.. సినిమా' అనే మరో కథకూ మంచి స్పందనే వచ్చింది. ఇలాగా ప్రత్యేక సంచికలకు కథలు పంపమని అడిగి రాయించుకున్న రోజులూ ఉన్నాయి. విజయ బాపినీడు విజయ అనే మాస పత్రిక కొత్త పంథాలో

 ఆకర్షణీయంగా నడుపుతుండేవారు మద్రాసు నుంచి. వాళ్ళు అడిగి మరీ ప్రచురించేవారు నా కథలు.. హాస్య వ్యాసాలు. చాలా వచ్చాయి వాటిలో. స్వాతి అప్పటికి మాస పత్రిక మాత్రమే. మా పక్క బజారులో చిన్న ఇంట్లో ఉండేది. రాసిన కథలు స్వయంగా వెళ్ళి చేత్తో ఇచ్చి వస్తుండే వాళ్లం. కొమ్మూరి వేణుగోపాలరావు గారి వీధిలో ఉండేవాళ్లం మేం. ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ రెండతస్తుల మేడను ఆనుకొన్న వాటాల్లోనే మా చిన్న కాపురం. వాళ్ల ఇంట్లోని టీవీని కిటికీ గుండా వింతగా చూస్తుండేవాళ్లం. అప్పటికి ఇంకా టి వి పెద్దవాళ్ల లక్జరీగానే ఉండేది. మా సంబంధాలన్నీ ఎక్కువగా ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రంతోనే. మూడు నెలలకు ఓ సారి కచ్చితంగా ఓ అరగంట హాస్య నాటిక నాది ప్రసారం అవుతుండేది. ప్రమోషన్ వచ్చి నాగపూర్ వెళ్లినదాకా ఇలా రచనా కార్యక్రమాలతో చాలా బిజీ బిజీగ్గా సరదాగా సాగింది మధ్య తరగతి జీవితం అప్పట్లో రాసినట్లున్నాను ఈ కథ! ఇవాళ ఉదయం ఏదో ఉబుసుపోకకు సర్ఫ్ చేస్తుంటే అప్పటి ఈ నా పాత కథ ఎవరి బ్లాగులోనో పి.డి.ఎఫ్ రూపంలో కనిపించింది. ఆ కాపీ డౌన్ లోడ్ చేసుకొని ఇలా షేర్ చేస్తున్నానన్న మాట. ఇదేమీ అంత గొప్ప కథ కాదు. ఒక చదువుకున్న చాదస్తుడు చేతి కొచ్చిన పాత నోటును ఎలా మార్చుకోవాలో తెలీక తలకిందులు అవుతుంటే..  చదువు సంధ్యలు లేని బడుద్ధాయ్ ఒకడు తనకు అబ్బిన లోకజ్ఞానంతో ఆ నోటును ఎంత చులాగ్గా చలామణి చేస్తాడో.. దాన్నుంచి లాభం ఎలా పొందుతాడో చెప్పే చిన్న కథ. అప్పట్లో ఇలాంటి కథలే ఎక్కువగా కమర్షియల్ పత్రికలు ప్రచురిస్తుండేవి. వాటికే పాఠకుల ఆదరణ కూడా! ఇప్పుడు చదువుతుంటే.. నాకే నవ్వొచ్చింది నేనేనా.. ఈ 'చిల్లర' కథ రాసిందీ అని! ఓపిక ఉంటే మిత్రులు కూడా ఒక సారి చదవవచ్చు. ఈ కథ మిషతో ఏదో పాత సంగతులు కొన్ని మళ్లీ నెమరు వేసుకోవడానికి కుదిరింది.
-కర్లపాలెం హనుమంతరావు
19 -06 -2018

దిగంబర కవిత్వం- ఒక పరిశీలన



నిజాన్ని నిజంగా చెప్పడం నిజంగా చాలా కష్టం.. నష్టం! ఆ రెండింటికీ సిధ్దపడే దిగామన్న  'దిగంబర కవులు' చివరిదాకా తమ ఉద్యమ స్వరూపాన్ని నిలబెట్టుకోలేదు.  ఆ కథా.. కమామిషూ.. కొద్దిగా!
20వ శతాబ్దం ఆరంభం నుంచి తెలుగు గడ్డల మీద ఎన్నో ఉద్యమాలు చెలరేగాయి. స్వాతంత్ర్యోద్యమం, ఆధ్రోద్యమం, తెలంగాణా సాయుధ పోరాటం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం ఆరాటం.. వగైరా! ప్రధానమైన ఉద్యమాలన్నింటిలో  ప్రజాకవిత్వం మమేకమైంది. స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటయింది.  తెలంగాణా సాయుధ పోరాటం విజయవంతమయింది. విశాలాంధ్ర సాధ్యమయింది. ఏ ఉద్యమ చైతన్యమూ ప్రేరణగా లేనందున తెలుగు సాహిత్యం సామాజిక స్పృహ కోల్పోయిందని  యువతలో అసంతృప్తి మొదలయింది. ఊసుబోని ప్రణయ ప్రేలాపన, ఉత్కంఠే ప్రాణంగా నేరపరిశోధన, పాలకులకు అనుకూలమైన చక్కభజనే..  సాహిత్యంగా పెట్రేగడం సమాజం పట్ల జరిగే కుట్రగా భావించిన యువకులు కొందరు 1960 ప్రాంతాల్లో ‘దిగంబర కవితోద్యమం’ పేరుతో కరెంటు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వదలిచారు. కుందుర్తి 'తెలంగాణా', కాళోజీ 'నా గొడవ', సీతాదేవి నవలా ప్రక్రియ, కొకు విమర్శ వంటి ప్రగతికాముక సాహిత్యం పట్ల ఆదరణ తగ్గనప్పటికీ.. అంతకు మించిన ఆసక్తి ఊకదంపుడు సాహిత్యం మీదే పాఠక జనం ప్రదర్శించడం అభ్యుదయ సాహిత్యకాముకులకు ఆవేదన కలిగించింది. చాసో, రావి శాస్త్రి వంటి వారి నుంచి ప్రగతిశీల  వచన సాహిత్యం ప్రబలంగా వస్తున్నప్పటికీ.. కవిత్వపరంగా స్తబ్దత ఆవరించడం ఆ యువత కలతకు కారణమయింది. ప్రయోజశూన్యతను ప్రశ్నిస్తూ  రక్తం ఉడికే ఓ ఐదుగురు యువకవులు 1965లో ఓ వినూత్న కవిత్వోద్యమానికి భాగ్యనగరం నుంచి శ్రీకారం చుట్టారు. 'నన్నయను నరేంద్రుడి బొందలోనే/ నిద్రపోనియ్యి/ లేపకు/ పీక నులిమి గోతిలోకి లాగుతాడు’ అంటూ గతించిన కవిత్వ ధోరణులన్నింటిపైనా ధిక్కారస్వరం ప్రకటిస్తూ ఒక్క పెట్టున ఉప్పెనలా  తెలుగు కవిత్వం మీద విరుచుకు పడిన ఆ కొత్త ప్రక్రియే 'దిగంబర కవిత్వం'. అచ్చు, ఆవిష్కరణ, కలంపేర్లు.. అన్నింటా అప్పట్లో అదో గొప్ప కలకలం. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు, మహాస్వప్న, భైరవయ్య.. పేర్లతో మూడేళ్ల పాటు వీరవెల్లి రాఘవాచార్యులు, యాదవరెడ్డి, మానేపల్లి హృషీకేశవరావు, బద్ధం భాస్కరరెడ్ది, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, మన్ మోహన్ సహాయ్.. సాహిత్య సాగరంలో  సృష్టించిన సునామీలకి పెద్ద పెద్ద పేర్లే చెట్లూ చేమలూ ఎక్కి  పెద్దరికాన్ని కాపాడుకొన్నాయి!
'మానసిక దిగంబరత్వం కోసం నిత్య సచేతన ఆత్మ స్ఫూర్తితో జీవించడమే’ తమ  ఆశయంగా ప్రకటించుకొన్నారా దిగంబర కవులు. ‘శ్వాసించే ప్రతీవ్యక్తితో సారూప్యం చెంది, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ కోసం, అంతరంగంలో అణిగి మణిగి పడి ఉన్న ఆరాటాన్ని, అసంతోషాన్ని, విసుగును అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన విశ్వాసాన్ని, ఆశను కలిగించాల’న్న వాళ్ల సామాజిక తత్పరత- తరువాతి మరో మూడేళ్ళు వరకు నిత్యపరిణామ దిశగా ఆడుగులు వేస్తో  స్తబ్దసాహిత్య సాగరంలో నిజంగానే కల్లోలాన్ని సృష్టించింది.
పాత రుతువులు, సంవత్సరాల మీద సైతం వాళ్లకు నిలువెల్లా పరమరోత! పురాతత్వాన్ని సంపూర్ణంగా వదిలించుకొని..   కవిత్వాన్ని పై నుంచి కింది వరకు  దిశమొలగా నిలబెట్టాలన్న దిగంబర  కవుల ఆరాటం కొందరికి తెంపరితనమనిపిస్తే  ఇంకొందరికి నిస్పృహ పైన నిజాయితీగా చేసే  నిబద్ధ పోరాటంగా స్ఫూర్తినిచ్చింది. ప్రతీ నాణేనికీ బొరుసు ఒక్కటే కాదు.. బొమ్మా ఉంటుంది. తిరగేసి చూడాలి.. అంతే!
'ఇది దిగంబరశకం. మేం దిగంబరకవులం. మాది దిగంబరకవిత. ఇది సాహిత్యోద్యమంలో దిగంబర కవితోద్యమం. కవితా స్వరూపాన్ని బట్టి మేం రాస్తున్నది వచన కవిత అని మేం అనదలుచుకోలేదు. అననివ్వదలుచుకోలేదు.  వచన కవిత అనే పదం మాకు నచ్చదు.' అని తమ కవిత్వ ప్రక్రియ లక్షణాలను తామే ప్రకటించుకున్నారు దిగంబర కవులు. అందరిలా కాకుండా తమ కవితలను 'ధిక్' లు  గా పిల్చుకున్నారు.  
ప్రాచీన సంస్కృతిని దుర్గంధభూయిష్టంగా గర్హించే దిగంబర కవిత్వానికి అంతర్జాతీయ నేపథ్యం  ఉంది. 20వ శతాబ్దంనాటి పారిశ్రామికీకరణ.. నాగరీకరణల ఫలితంగా  సమిష్టి కుటుంబ వ్యవస్థ వ్యక్తి కేంద్రీకృత  వ్యవస్థగా విఛ్చిన్నమయింది. ఆ విధ్వంసం మానవ విలువలు దిగజారుడంగా భావించి వేదన చెందింది పాశ్చాత్య సాహిత్యంలోని ఒక యువ వర్గం. స్వార్థ చింతన పెచ్చుమీరడం, మనిషి ఆర్థిక సంబంధాలే ప్రధానంగా భ్రమించడం, విలాసజీవనం పట్ల నియతి, నియంత్రణలేని లౌల్యం పెరిగిపోవడం..  వ్యవస్థలో విశృంఖలతకు, అమానుషతలకు దారి తీస్తున్నట్లు ఈ యువ వర్గం భావించింది. మానవ ప్రేరిత ప్రపంచ యుద్ధాల విధ్వంసం తరువాతా సామ్రాజ్యవాదం తన దాష్ఠీకం కొనసాగింపుకే మొగ్గు చూపడం ఈ యువతను  కలచివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమయిన ఉపద్రవాలకి ప్రతిస్పందనగా   మేధావివర్గాలు స్తబ్దతనో, నిరాశావాదాన్నో, పలాయనవాదాన్నో ఆశ్రయించడం ఆగ్రహం తెప్పించింది. సహజంగా ఆవేశం పాళ్లు ఒకింత అధికంగా ఉండే యువకులు కొంతమంది అత్యంత తీవ్రంగా స్పందించారు. ఆ స్పందన ఉద్యమ రూపాలు వివిధ దేశాలలో వివిధ స్వభావాలలో సాగినా అన్నింటి సామాన్యలక్షణం నిరాశ నుంచి పుట్టిన నిరసనే. తెలుగు గడ్డ మీదా రేగిన ఈ తరహా సామాజిక  అసంతృప్తి జ్వాలలకు    సాహిత్యపరమైన ఉద్యమ రూపం దిగంబర కవిత్వం.
మానసిక సంఘర్షణ, సంప్రదాయం పట్ల నిరసన, గతంమంటే గల అనాసక్తత, ఆధునికత మీద వైముఖ్యతల కారణంగా అమెరికాలో 1960ల్లో  'బీట్నీక్కులు’ 'బీట్నిక్ జనరేషన్' తరహా నిరశనోద్యమం లేవదీశారు.   పొరుగుదేశాల దాడి కారణంగా జాతీయ  జీవనం విఛ్చినమైన హంగరీ (అప్పటి ఆస్ట్రియా)లో కూడా అశాంతికి గురయిన యువకులు  కొందరు 'గాయపడ్డ యువతరం' పేరుతో  ఈ మాదిరి సాహిత్య పరమైన నిరశనోద్యమానికి నడుం కట్టారు.  అంతర్జాతీయ ఆందోళనా బృందం 'యాంగ్రీ యంగ్ మెన్'   నిరశనోద్యమానికి సమాంతరంగా మన దేశంలో కూడా పశ్చిమ బెంగాల్లో 1960లో  'హంగ్రీ యంగ్ మెన్' సాహిత్య ధోరణి తలెత్తింది. పెరుగుతోన్న అన్యాయాలూ, అరాచకాలూ, ఆర్థిక అసమానత, నిరుద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా దేశంలో ఏదో ఓ మూల'భూఖీ పీడీ', ఓ ‘హంగ్రీ జనరేషన్’ వంటి ఆకలి తరం ఆవిర్భవించే దుర్భిక్ష  కాలంలో తెలుగునాటా ‘దిగంబర కవులు’ కొత్త సాహిత్యోద్యమానికి తెర లేపారు.
'ఊపిరి పీల్చే ప్రతీ మనిషీ ఉనికి కోసం తపన పడి భావిని చూపి భయపడి వెక్కి వెక్కి ఏడ్చి పిచ్చెత్తి ప్రవచించిన కవిత తమద'ని  లక్షణం ప్రకటించుకున్నారు. ‘మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటంలేని చిరునవ్వులు చిందే సమాజం కోసం, అహోరాత్రాలు ఆరని అగ్నిలో నడిచిన ఆత్మలోంచి పలుకుతున్న గొంతు'లని తమ నిరశన స్వరాలను నిర్వచించుకున్నారు. 'ఏ ఆఛ్చాదనకీ తలవగ్గని, ఏ భయాలకీ లొంగని నిరంతర  సజీవ మానవుడి కోసం ఎలుగెత్తి పిలుస్తున్నామ'ని లక్ష్యం  చెప్పుకొన్నారు. ఆ చెప్పడంలోని ఘాటుదనమే సమాజ పెద్దరికానికి   వెంపర్లు పుట్టించింది.
'నిండుగా నిజంగా ఊపిరి పీల్చేవాడు/
ఆత్మయోని నుంచి పుట్టుకొస్తున్నాడు' అన్నాడు నిఖిలేశ్వర్.
నిజానికి ఆత్మనుంచి పుట్టుకొస్తున్నాడన్నా.. అదే భావం! సమాజం బుద్ధిమాంద్యానికి షాక్ ట్రీట్ మెంటు ఇవ్వడమే తమ తపనగా చెప్పుకున్న దిగంబర కవులు ఈ తరహా పదప్రయోగాలకు పూనుకోవడం దిగ్భ్రమ కలిగించదు! 'చచ్చిన రాజుల పుచ్చిన గాథల/ మెచ్చే చచ్చు చరిత్రకారులను/ ముక్కు చెవులు కోసి అడగాలనుంది/ మానవ పరిణామ శాస్త్రం నేర్పిందేమని?' అన్నప్పుడూ ' 'ముక్కు  చెవుల కోతలు' కవుల కసిలోనుంచి పుట్టుకొచ్చినవే!
'దిగంబర కవిత్వంలోని అక్షరాలు/ కామంతో పుచ్చిపోయిన/ లతాంగి పయోధరాలపై నూతన నఖక్షతాలు కావ'ని భైరవయ్య ఎంత   సమర్థించుకున్నప్పటికీ  'కీర్తికాముకుల. నియంతల/ అహంతల దౌర్జన్య బాహువుల దురాక్రమణలో/ దేశదేశాల సుఖవ్యాధి పుండ్లతో/ భూమి వెలయాలై, పతితయై, భ్రష్టయై/ పుచ్చి గబ్బు గొడుతున్నప్పుడు/ నేను పుడుతున్నాను దిగంబరకవిని'(మహాస్వప్న) అనడం అప్పటి మర్యాదస్తుల సాహిత్య లోకాన్ని మెప్పించలేక పోయింది. 'ఐదేళ్ల పెంటపోగులో దొరికిన అద్దం పెంకులో పగలని తన అవయవాన్ని చూసుకుంటూ ఆంధ్రమాత గర్వంగా మురిసిపోతున్నద'న్న(నగ్నముని) తరహా వర్ణనలు  జాతిని, నాతిని ప్రేమించేవారెవరూ   జీర్ణించుకోవడం కష్టం.

'కార్జ్యంలేని యజమాని/ గుండెలేని గృహిణి/ చెత్తకుండీ విస్తరాకుల యువకులతో/ ఈ చాప వ్యవస్థ మారేదెప్పుడు?' అని చెరబండరాజు ప్రశ్న. భయంకరంగా విజృంభించిన కుల మత దురహంకారాలకి, ధనమదంతో ప్రజాస్వామ్యాన్ని యధేఛ్చగా వాడుకుంటున్న గూండాయిజానికి, సినిమారొంపిలో ఈదులాడుతున్న యువత బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికాలోకం పడుపు జీవనానికి, అతీత జీవనంతో గడుపుతున్న మేధావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి కుష్టువ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచర్ల కోటేశు స్మృతికి అంకితం చేసిన మూడో సంకలనమే దిగంబర కవిత్వ పరంపరలోని ఆఖరి అంచె. మొదటి సంపుటి ఆవిష్కరణ 1965, మే 6వ తేదీ అర్థరాత్రి. హైదరాబాద్ నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడు ఆవిష్కర్త. రెండో సంపుటి విజయవాడ జంగాల చిట్టి 1966, డిసెంబర్ 8 న ఆవిష్కరించింది. దిగంబర కవిత్వానికి పరిణత దశగా భావించే మూడో సంపుటి 1968లో విశాఖపట్టణం బిచ్చగత్తె 'ఎడమసూరి యశోద' ఆవిష్కరించింది.
మూడు సంపుటాల్లో తొంభై మూడు కవితలు. అనువాదాలకు, అనుకరణలకు అలవాటు పడిన తెలుగు కవిత్వాభిమానులకు దిగంబర కవిత్వ మౌలిక రూపం నిర్ఘాంతపరచిన మాట వాస్తవం. తిరుగుబాటు కవిత్వం తెలుగువారికి కొత్తేమీ కాదు. అంతర్జాతీయం, అణుయుద్ధం, నగరజీవనం, వర్గపోరు, వ్యక్తిస్వేఛ్చ, ప్రపంచశాంతి ఇన్నేసి అంశాల మీద గంపగుత్తగా ఇంత తీవ్రంగా దుయ్యబట్టిన సందర్బాలకు దిగంబర కవిత్వమే నాందీ పలికింది.
రాచమల్లు రామచంద్రారెడ్డి అంతే తీవ్రంగా విమర్శనాస్త్రాలు  దిగంబర కవిత్వం పైన సంధించారు. పాతికేళ్ల అనంతరం దిగంబర కవుల్లో ఒకరైన జ్వాలాముఖి స్వయంగా తెలుగు దినపత్రికల్లో ఆత్మవిమర్శ చేసుకున్నారు.  బూతు పరిష్కారం కాబోదు. తిట్లు ఎవరిని మేల్కొలపవు. కాకపోతే స్తబ్దత నుంచి తిరుగుబాటు దారిలో విప్లవలక్ష్యం వైపుకు తెలుగు సాహిత్యం దృష్టిని మళ్లించినవారిగా దిగంబర కవులను జ్వాలాముఖి సూత్రీకరించడం సబబే అనిపిస్తుంది.
'హిందీ ధర్మయుగ్' లో దిగంబర కవిత్వానికి అనువాదాలొచ్చాయి. భారతీయ జ్ఞాన్ పీఠ్, లహర్, పొయెట్, కొన్ని బెంగాలీ, కన్నడ పత్రికలూ దిగంబర కవితలకు అనువాదాలు ప్రచురించాయి. మూడు సంపుటాలనూ ప్రొఫెసర్ రామానాయుడు అనువదించారు. కేంద్రీయ సంస్థాన్ పురస్కారం దిగంబర కవిత్వం అందుకుంది. ఉర్దూ, పంజాబీ,  అస్సామీ భాషల్లో కూడా దిగంబర కవిత్వం అనువదింపబడింది. కన్నడంలో బండాయ సాహిత్యానికి, హిందీలో సరికొత్త ధోరణులకు దిగంబర కవిత్వం స్ఫూర్తినిచ్చింది.
విచిత్రం ఏమిటంటే దిగంబర కవుల్లోని ఇద్దరు తదనంతర పరిణామ క్రమంలో మార్క్సిజం వైపుకు మళ్లితే, మరో ఇద్దరు అస్తిత్వవాదం వైపుకు వెళ్ళిపోయారు. నిర్దిష్టమైన భావజాలం, స్పష్టమైన సంస్థాగత నిర్మాణం లేని ఏ ఉద్యమానికయినా తదనంతర కాలంలో పట్టే దుర్గతే దిగంబర కవిత్వానికీ దాపురించింది. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు 1970లో విప్లవ రచయితల సంఘంలో చేరి.. 1975 నాటికి మళ్లీ బైటికి వచ్చేసారు. పోతే.. మిగతా ఇద్దరూ భైరవయ్య, మహాస్వప్నలు  వ్యక్తులుగా మిగిలిపోయారు. విప్లవ కార్యకలాపాలలో మొదటినుంచి క్రియాశీలకంగా పనిచేసిన చెరబండరాజు .. బ్రయిన్ ట్యూమర్ తో కాలం చేసాడు. కఠిన కారాగారవాసాలు, పోలీసుల చిత్రహింసలు కారణమని కొందరి విశ్వాసం.
సాహిత్యంలో సంకోచాలను  వదిలించుకొనేందుకు, అనుభూతులు యధేచ్చగా వ్యక్తీకరించుకొనేందుకు ప్రజాస్వామిక భూమికను సిద్ధం చేయడం వరకు దిగంబర కవితోద్యమం సార్థమయిందన్న వాదనతో అందరం అంగీకరించక తప్పదు.
మొదటి సంపుటిలో సామాజిక రుగ్మతలు, రెండో సంపుటిలో మనిషి ఉనికి, సామాజిక అస్తిత్వం, మార్క్సిజం పట్ల సానుకూలత, మూడో సంపుటి సమస్యల పరిష్కారానికి సాయుధ పోరాటం.. అనే అంశాల చూట్టూ పరిభ్రమించినట్లు సాహిత్య విమర్సకులు విశ్లేషించుకుంటున్నారిప్పుడు.
ఏదేమైనా తదనంతర కాలంలో సాహిత్యంలో కొత్త కొత్త ఆలోచనా ధోరణులకు వికాసానికి దిగంబర కవిత్వం దోహదం చేసిందన్న మాట మాత్రం వాస్తవం.
-కర్లపాలెం హనుమంతరావు
17 -06 -2018

(సాహిత్య దృక్పథాలు- దిగంబర కవిత్వం - డా।। యస్వీ సత్యనారాయణ  వ్యాసం ప్రేరణగా)


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...