Saturday, June 23, 2018

నన్నయగారి ననీన భాషావాదం



మహాభారతం కవిత్రయంలో నన్నయ మొదటివాడు. ఆయనకు 'వాగనుశాసనుడు' అని బిరుదు. 'వాక్' అంటే మాట. మాటను శాసించేవాడు వాగనుశాసనుడు. అంతలా నన్నయ భాషను ఏం శాసించాడు? ‘వాగనుశాసనుడు’ అన్న బిరుదుకు  ఆయన అసలు అర్హుడేనా? ఔను, కాదు.. అని ఏ నిర్ణయానికైనా వచ్చే ముందు ఈ చిన్ని వివరణ ఒకసారి చూస్తే మంచిది.
నన్నయకాలం క్రీ.శ 11వ శతాబ్దం. ఆ కాలం నాటికి తెలుగు మరీ అంత ముదరలేదు. పలుకుబడులన్నీ దేశీఛందస్సులోవే. అంటే జనం మాట్లాడుకునే భాషా యాసా కు సంబంధించినవన్న  మాట. ఆ యాసభాషల్లోనే  రాజులూ శాసనాలు వేయించేవాళ్లు.

నన్నయను పోషించిన చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుడికి ఈ దేశీయ పలుకుబడుల మీద  బాగా మోజు.  'మును మార్గకవిత లోకంబున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం/ గు నిలిపి రంధ్ర విషయమున జన చాళుక్యరాజు మొదలగు పల్వుర్' అని నన్నెచోడుడు తన కుమారసంభవం అవతారికలో ఆ  చాళుక్య ప్రభువుకు ధృవపత్రం కూడా ఇచ్చివున్నాడు.
రాజుగారికి జనంభాష పైన ఎంత ప్రేమున్నా అప్పటి వరకు తెలుగులో ఒక్క స్వతంత్రమైన, సవ్యమైన కావ్యం రాలేదన్న బెంగా ఉండేది. అప్పటి దాకా ఉన్నవన్నీ సంస్కృతానువాదాలే. కనీసం తన హయాములోనైనా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టించాలన్న ఉద్దేశంతో నన్నయని వ్యాస విరచిత సంసృత మహాభారతం తెలుగు చేయమని పురమాయించాడు. నన్నయనే ఎంచుకోవడానికి కారణం.. ఆ కవిగారికి సంస్కృతాంధ్రాల మీద ఉన్న అమోఘమైన పట్టు.
కానీ అప్పటికి ప్రచారంలో ఉన్న తెలుగు  పదజాలంతో కావ్యం రాయడం కుదరదు. అందునా రాసే కావ్యానికి పంచమవేదం మాతృక! అసలే సంస్కృత భాష అత్యంత గహ్యమైనది. ఆ భాషకు సరిపడా తెలుగు పదజాలం జనం నుంచి సేకరించడం నిజంగా పెద్ద సవాలే! అందునా ఇప్పటి మాదిరి సాంకేతిక సాధనాలేమన్నా అప్పట్లో అందుబాటులో ఉన్నాయా? అదనంగా అప్పటికి ఇంకా తెలుగులో వాక్యనిర్మాణమే పటిష్టంగా లేని స్థితి. తనకోసం గాను తాను ఒక వాక్యనిర్మాణ క్రమం.. అదీ తానే అంతకు ముందు నిబద్ధీకరించిన వ్యాకరణ  సూత్రాలకు లోబడి ఉండడం అవసరం.  ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటో సమర్థవంతంగా రచన ఆరంబించాడు నన్నయ!
వాక్యానికే కాదు అసలు అప్పటి తెలుగు పదానికి కూడా ఒక ప్రామాణిక  రూపం లేదు. ఒకే పదాన్ని ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు, ఎవరి ఇష్టం వచ్చిన రూపంలో వాళ్లు రాసేసుకునేవాళ్ళు. ఆ తరహా భాషే రాజులు వేయించిన శాసనాల మీద  కనిపించేది. ఇలాంటి పదాలు కొన్ని ఆచార్య గంటి సోమయాజిగారి 'ఆంధ్రభాషా చరిత్రము'లో, ఆచార్య ఖండవల్లి  నిరంజనంగారి  'ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము'లో కనిపిస్తాయి.
'దేవుడు' అనే పదానికి దేవడు అని ఒకళ్ళు, దేవండు అని ఒకళ్లు, దేవణ్డు అని ఒకళ్లు రాసేవాళ్లు. 'తూర్పు' అనే పదాన్ని 'తూఱ్పు' అని, 'తూఱ్గు' అని, 'తూఱ్వు' అనే రూపాలుగా రాయడం ఉంది. రెడ్ది కి ‘రట్టగుడి’, ఎనిమిది కి ‘ఎణం బొది’.. ఇట్లా ఒక స్థిరమైన రూపం అంటూ లేకుండా సాగే  పదాలకు  ఒక కుదురైన ఆకారం కల్పించడం నిజంగా పెద్ద సవాలే కదా! హ్రస్వాలుండే చోట దీర్ఘాలు, సాధురేఫాలు రాయాల్సినప్పుడు శకటరేఫాలు వాడేవాళ్లు. బిందువుకు బదులు వర్ణమాలలోని వర్గం చివరి అక్షరాలు ఙ్, ణ్ లాంటివి యధేఛ్చగా వాడేస్తూ గందరగోళం చేసిన తెలుగు మాటలకు ఒక స్థిరమైన రూపం కల్పించడం  మాటలా? ఆ సమస్యా అధిగమించాడు నన్నయ.
అప్పటికి తెలుగులో కొద్ది దేశీయ వృత్తాలు, అదనంగా చంపకమాల. ఉత్పలమాల మాత్రమే వాడుకలో ఉండేవి. అవసరానికి అనుగుణంగా వృత్తాల సంఖ్యను పెంచుకుంటూ అత్యంత గాఢమైన, గూఢమైన వ్యాసభారతం ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలో కొంత భాగం అపూర్వంగా పూర్తిచేసి మరీ రాజరాజనరేంద్రుడి చేత ‘శహ్ భాష్’ అనిపించుకొన్నాడు నన్నయ భట్టారకుడు. 'వాగనుశాసనుడు' అని ప్రశంసలు అందుకున్నాడు.
ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా అప్పటికి తెలుగులో ఇంకా చిక్కబడని కవితా ప్రక్రియకు అప్పటికే సంపూర్ణ వికాసం పొందిన కన్నడ కవితా స్వరూపాన్ని అద్దడం అద్భుతమైన విన్యాసం. అందుకే తోటి కవులు నోటితో సైతం ‘ఔను.. నన్నయ నిజంగా వాగనుశాసనుడే’ అని మెప్పించుకొన్నాడు ఆ మహాభరత ఆరంభ రచయిత.
ఆనాటికి ఉన్న పూర్వ భాషాప్రమాణాల ప్రకారం నన్నయ మహాభారతం మొదటి రెండున్నర పర్వాలలో  పోయిన భాషాపోకడలు అత్యంత నవీనం.. అపూర్వం. ఆ రకంగా చూసినా నన్నయ భట్టారకుడు వట్టి వాగనుశాసనుడే కాదు.. గట్టి నవీనభాషావాది కూడా!
-కర్లపాలెం హనుమంతరావు
24 -06 -2018



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...