అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు
బుడిబుడి అడుగులు వేసే ఓ పాపాయి. ఆ పాపాయి
బుడిబుడి నడకలతో బైటికి పోకుండా తన కొంగు చివరకి ముడి వేసుకొని పనిపాటలు
చూసుకొనేది అమ్మ.
పాపాయి ఎదుగుతున్నది.
కిటికీగుండా బైట కనిపించే కొండా కోనా, చెటూ పుట్టా..
పాపాయిని ‘రారమ్మ’ని బులిపిస్తున్నాయి!
పాపాయికేమో.. పాపం.. తల్లికొంగు బంధమాయ!
ఆ రోజు బ్రహ్మాండంగా వాన
కురిసి వెలిసింది. ఆకాశంలో ఏడురంగుల ఇంద్రధనుస్సు విరిసింది. పాపాయిని అదే పనిగా ‘అందుకొమ్మని.. ఆడుకొందాం రమ్మ’ని.. ఆగకుండా ఆహ్వానిస్తున్నది.
తల్లి గాఢనిద్రలో
ఉంది. అదను చూసి చాకుతో చీరకొంగు కోసి..
గడప దాటి.. గబగబా కొండకొమ్ముకేసి ఎగబాకుడు
మొదలుపెట్టింది పాపాయి. ఇంద్రచాపం ఎక్కి
జారుడుబండ ఆటాడాలని పాపాయి పంతం. ఆత్రం. ఆ తొందరలో పాచిబండమీద కాలు జారింది. భయంతో 'అమ్మా! అమ్మా!'
అని అరవసాగింది పాపాయి.
లోయలోకి జారిపడే చివరి
క్షణంలో ఠకాలుమని ఆడ్డుపడి ఆపేసింది.. రెండుబండలమధ్య ఇరుక్కున్న అమ్మకట్టిన లావుపాటి
కొంగుముడి!
దూరంనుంచి
పరుగెత్తుకొస్తున్న అమ్మను చూసి 'హమ్మయ్య' అనుకొన్నది
పాపాయి. ***
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment