'నిన్నేమో మేమంతా చాలా కాలుక్యులేటేడ్ ఫెలోవని తెగ పొగుడుతుంటాం.
నువ్వేమో ఈ చచ్చు పుచ్చు భూమిని ఇంత తగలేసి కొన్నావ్! అదీ ఆదరాబాదరాగా! అవతల అక్కడ హైదరాబాదులో బాబాయిని ఆసుపత్రికి
వదిలేసి ఇప్పుడీ గత్తర పనులన్నీ ఎందుకో అర్థం కావడం లేదురా!' అని తగులుకొన్నాడు కుమారస్వామి అమ్మనబ్రోలు ల్యాండు రిజిస్ట్రేషనాఫీసునుంచి
బైటికొచ్చీ రాగానే!
సమాధానంగా నవ్వి ఊరుకొన్నాడేగానీ.. పెదవి విప్పి
ఒక్కముక్కన్నా బైటికి అనలేదు కమలాకరం. కొన్నభూమి దస్తావేజులను
సేకరించుకొనే విషయం గురించి మాట్లాడుతున్నాడు అమ్మిన సుబ్బారాయుడితో ఒక పక్కకు తీసుకెళ్లి.
అమ్మనబ్రోలు భూములంటే ఎర్రమన్ను నేల. పొగాకు పండించీ పండించీ గుల్లబారిన భూమి. మరే పంటా పండేందుకు
ప్రస్తుతానికైతే బొత్తిగా ఆస్కారం లేదు. గవర్నమెంటు పొగాకును
అంతగా ప్రోత్సహించడం లేదుకూడా. వరస కరువు కాటకాలతో గిడసబారిని
నేలను నమ్ముకోలేక అయినకాడికి అమ్మేసుకొని రైతులు తరలిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కమలాకరం
వాస్తయినా సరిగ్గాలేని ఎత్తుమీది ఈ భూములను.. అందులోనూ నీటివసతి
బొత్తిగా లేని సుబ్బారాయుడి మూడెకరాల కొండ్ర ఎకరా మూడులక్షలు రేటుకి కొనడమెందుకో ఎవరికీ
అర్థం కాలేదు. రైతులు సుబ్బారాయుడికి పట్టిన అదృష్టానికి తెగ
కుళ్ళుకొన్నారుకూడాను!
కమలాకరానికి అమ్మనబ్రోలుకి ఆట్టే సంబంధంలుకూడా ఏమీ లేవు. అతగాడు అక్కడ పుట్టిందీ లేదు. చదివిందీ
లేదు. ఎప్పుడో ఒకసారి వేసవిసెలవులకని ఆ ఊరొచ్చి ఒక మూడు వారాలు
ఉండిపోయాడు. అదీ ముళ్లమీదున్నట్లు.
కమలాకరం తండ్రి కాంతారావు బ్యాంకులో
పనిచేసిన రోజుల్లో ఆ ఊర్లో ఒక మూడేళ్లపాటు
కావురం ఉన్నాడు. అప్పుడైనా కుటుంబం హైదరాబాదులోనే!
ఆ మాత్ర్రం సంబంధానికే ఇంత రేటు పెట్టి ఇక్కడి భూములు కొనడానికి రావాలా
కమలాకరం! అందునా మిత్రుడు కుమారస్వామి మొత్తుకొన్నట్లు
ఆయన తండ్రి హైదరాబాదు అపోలోలో దాదాపు ఆఖరి గడియల్లో ఉన్నాడు! న్యూజిలాండునుంచి చెల్లెలు సుభద్ర రావడానికి కనీసం రెండు రోజులు తక్కువ పట్టదు.
తండ్రిని వెంటిలేటరుమీద ఉంచి.. మిగతా పనులు భార్యకు
పురమాయించి మరీ ఈ వ్యవహారంకోసం ఇంతదూరం ఇప్పుడు పరుగెత్తుకు రావడానికి పెద్ద కారణమేమైనా
ఉందా?
కుమారస్వామిని కుమ్మరి పురుగులా తొలిచేస్తున్న ఈ సందేహానికి సమాధానం మర్నాటికిగానీ
బైటపడలేదు,
అదీ అతగాడి భార్య సుగుణ కాల్ చేసి కంగారు పెట్టబట్టి! 'సుభద్రకూడా వచ్చేసిందండీ! అందరూ
మిమ్మల్ని గురించే అడుగుతున్నారు రెండు రోజులబట్టీ! మీ నాన్నగారైతే
ఒహటే కలవరింతలు.. అత్తయ్యగారికి సర్ది చెప్పలేక పోతున్నాను'
'వచ్చేస్తున్నా! వచ్చిన పని పూర్తయింది.
రేప్పొద్దునకల్లా అక్కడుంటా.. సరా! అందాకా ఎలాగో మేనేజ్ చేయ్.. ప్లీజ్!' అని ఫోన్ పెట్టేసి కుమారస్వామితో సహా కొన్నపొలానికి బైలుదేరాడు కమలాకరం.
పొలంచుట్టూ దిట్టంగా కంచె ఉంది. పెద్దగేటుకి
వేసిన తాళం తీసి.. నేరుగా ఓ మూల ఉన్న పెంకుటింటిలోకి స్వామిని
తీసుకెళ్లాడు కమలాకరం. లోపలి గోడలనిండా ‘సీతా..సీతా..’అని రామకోటిలా ఇంగ్లీషులో
రాతలు.. అడుగడుగునా! జీడిపిక్కలతో రాసిన
ఆ రాతల్లో సీత పేరుతో కలిసి ‘కాంతారావు’ అనిగాని లేక పోయుంటే కమలాకరానికి ఇప్పుడింత దూరం వచ్చి ఈ చచ్చుపుచ్చుభూముల్ని
ఇంత ధరపెట్టి అర్జంటుగా కొనాల్సిన అవసరం తప్పుండేది!
'నువ్వేం చేస్తావో తెలీదురా! రేపు
సాయంత్రానికల్లా ఈ గుడిసె
మొత్తాన్నీ కూలదోసెయ్యాలి.
మా నాన్నకు ఇక్కడే అంత్య క్రియలు! అదే మూడు రోజుల్నుంచి
ఆయన కలవరింతలు! అమ్మకు చెల్లాయికి తెలిస్తే అల్లాడిపోతారు!
పరువుకోసం పాకులాట్టం మాకు నేర్పిందీ ఈ మహానుభావుడే కదా!' అన్నాడు
కమలాకరం.
‘సీత ఎవర్రా?’ అని అడుగుదామనుకొని
కమలాకరం కంట్లో నీళ్ళుచూసి ఆగిపోయాడు కుమారస్వామి 'డోంట్ వర్రీరా!
నీ లాంటి కొడుకు ఉండటం మీ నాన్న చేసుకొన్న అదృష్టం' అని మిత్రుడి భుజం తట్టాడు అనునయంగా!
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంఅర్జాల పత్రిక జూన్ 2016 సంచికలో మరీ చి.క గా ప్రచురితం)
No comments:
Post a Comment